23, ఫిబ్రవరి 2023, గురువారం
సంచిక లో శ్రీ కేఎల్వీప్రసాద్ చేసిన ముఖాముఖి
* సుభద్రా దేవి గారూ ..సంచిక అంతర్జాల పత్రిక
పక్షాన మీకు స్వాగతం..నమస్కారం .
జ:-నమస్కారం ప్రసాద్ గారూ
*రచనా వ్యాసంగం పట్ల మీకు దృష్టి ఎప్పుడు,ఎలా మళ్లింది ?దాని నేపద్యం వివరించండి.
జ:-మా పెద్దక్క పి.సరళాదేవి తెలుగు స్వతంత్రలో విరివిగా రచనలు చేసేది.మాలతీచందూర్, పి.శ్రీదేవి, రామలక్ష్మిల సమకాలీనురాలు. డా.శ్రీదేవి అక్కకు మంచి మిత్రురాలు.నేను కుటుంబ పరిస్థితులవలన ఎనిమిదవతరగతితో చదువు మానేసి ఏడాది పాటు గోపన్నపాలెం అక్క ఇంట్లో ఉన్నప్పుడు బడికి వెళ్ళకపోవటం వలన అక్క ఇంట్లోని గ్రంథాలయం లో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్థం అయినా కాకపోయినా విరివిగా చదివాను.నేను రచయిత్రీగా మారటానికి దోహదం చేసింది అక్క వాళ్ళింట్లో ఉన్న సమయమే అనుకుంటాను.ఒకరోజు ఏలురులో ఆంవత్స సోమసుందర్ గారికి జరిగిన సత్కారసమావేశంకి అక్కతో పాటూ వెళ్ళాను.సభానంతరం ఒక సాహితీ మిత్రుడి ఇంటి డాబా పైన వెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ప్రముఖకవులకంఠంలో కవిత్వం వినటం నాకు అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ,నవలలూ చదివాను.ఇంటికివెళ్ళాక కవిత్వం పుస్తకాలు అక్కని అడుగుతే శ్రీశ్రీ మహాప్రస్థానం, కృష్ణశాస్త్రి ఊర్వశి,ముద్దుకృష్ణ వైతాళికులు ఇచ్చింది.అందులో నాకు నచ్చినవి ఒక పుస్తకంలో కాపీ చేసుకున్నాను.
* మీరు చదువుకునే రోజుల్లొ ,భవిష్యత్తులో మంచి
రచయిత్రి కావాలని కోరుకున్నారా ?లేక యాదృశ్చికంగా ఈ నాటిస్థాయికి చేరుకున్నారా ?
జ:-అక్క ఇంటినుండి తిరిగి విజయనగరం చేరిన తొమ్మిదవ తరగతి లో చేరాను.మా తెలుగు మాష్టారు ఛందస్సు చెప్తే ఆటవెలది లో మాష్టారు మీద పద్యం రాసి చూపిస్తే ఆయన పొంగిపోయి నువ్వు మంచి కవయిత్రి అవుతావని దీవించారు.మాష్టారు ఒక లిఖిత పత్రికను మొదలు పెడితే అందులో పద్యాలు,కవితలూ రాసేదాన్ని.అందులో ఒకటి "నాబొమ్మే నా చెల్లి" అని పదకొండు ద్విపద పద్యాల్లో రాసాను.బహుశా నా దీర్ఘ కవితా ప్రస్థానానికి అది తొలిమెట్టు కావచ్చు. మా అక్కనీ,అన్నయ్యలనీ రచయితలుగా చూస్తూ ఉండటం వలన మనసులో ఏమూలో రచయిత్రి కావాలనే కోరిక రెక్కవిప్పుకొనే వుంటుంది.
* మీ పుట్టినిల్లు ,మెట్టినిల్లు ,సాహిత్య వాతావరణం
పుష్కలంగా కలిగి ఉన్న విశయం అందరికి తెలిసి
న ,విషయమె !మీరు గొప్ప రచయిత్రిగా ఎదగ
డానికి ఎక్కడ వీలయింది ?ఎందు చేత ?
జ:-చిన్నప్పుడు అక్క పంపిన బొమ్మలపుస్తకాలూ,అన్నయ్య కొన్న చందమామ,వారపత్రికలూ నేను చాలా చిన్నప్పుడే పఠనాసక్తిని పెంచాయి.అక్కయ్య,అన్నయ్యలకథలు పత్రికల్లో పడినప్పుడు కాలేజీరోజుల్లో నాకూ రాయాలనే కోరిక పెరిగింది.అప్పట్లోనే కొన్ని కథలు రాసాను. వీర్రాజు గారు పరిచయం అయ్యాక పత్రికలకు పంపాను.పెళ్ళికి ముందే 1970 లో మొదటికథ ప్రచురితం అయ్యింది. పంపిన నాలుగైదు కథలు ప్రచురితం అయ్యాయి ఉమ్మడి కుటుంబంలో కథ రాసేంత సమయం సమకూర్చుకోలేక రాయలేక పోయాను.ఆరేడేళ్ళు గడిచాక మళ్ళా రాయటం మొదలుపెట్టాను.తర్వాత మరి వెనక్కి చూడలేదు.రాస్తూనే ఉన్నాను.
* మీరు కథలు రాశారు ,కవిత్వం రాశారు ,వ్యాసాలు
రాస్తున్నారు .కానీ మీ కలం కవిత్వం వైపు మొగ్గు
చూపుతుందని మీ రచనలను గమనిస్తున్న నాబోటి
పాఠకులకు అనిపిస్తుంది.ఇది నిజమేనా ?ఎందు
చేత ?
జ:-పెళ్ళయ్యాక ముఖచిత్రాల కోసం కవులు రావటం, కవితా సంపుటాలు ఎక్కువగా ఉండటంతో కవితలు రాయటానికి మొగ్గుచూపాను.చిన్న స్పందన చాలు కవిత రాయటానికి .కానీ కథరాయాలంటే మంచి అంశం,పాత్రలూ,సంఘటనలూ, సంభాషణలు, ఆకట్టుకునే ముగింపు.ఇవన్నీ ఆలోచించే సావకాశం లేక అరుదుగా కథలు రాసాను.
* మీరు " ఇస్కూలు కథలు "అనే కధాసంపుటి
వెలువరించారు .ఈ కథలు రాయడానికి మిమ్ము
లను ప్రేరేపించిన అంశాలు ఏమిటి ?
జ:-మాది ఎయిడెడ్ పాఠశాల కావటం వలన విద్యార్థులందరూ ఆ పరిసరాల్లోని బస్తీలో పిల్లలే.వాళ్ళతో కలిసి మెలిసి ఉండటంలో వాళ్ళకుటుంబనేపధ్యాలు,ఆడపిల్లలచదువులకు కలిగే అవరోధాలూ,వారిపై ప్రభావాలూ, ఉపాధ్యాయులు,ఇతర సిబ్బందుల తీరుతెన్నులు ఇవన్నీ పాఠశాల అభివృద్ధిపై,విద్యపై చూపే ప్రభావాలని కథలుగా రాయాలనుకున్నాను.తెలుగువిద్యార్థి మాసపత్రిక రెండున్నర సంవత్సరాలు నా ఇస్కూలుకతలను ధారావాహికగా ప్రచురించింది.అందులో మొదటి కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ద్వితీయ భాష తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా తీసుకుంది.
* దీర్ఘ కవితల ద్వారా మీరు మంచి పేరు సంపాది 0
చారు. అయితే ఈ ప్రక్రియకు భవిశ్యత్తు
ఉంటుందంటారా ? ఎందుచేత ?
జ:-లఘుకవితలైన హైకూలు, మినీ కవితలు అప్పటి కప్పుడు చమక్మనిపిస్తాయి.కానీ అవి కవితా రంగంలో ఎక్కువకాలం నిలవవని నా అభిప్రాయం.ఒకటిరెండు పేజీల కవితా ఖండికలు ఒక విషయాన్ని,ఒక సందర్భాన్ని గూర్చి పాఠకుల్ని ఆలోచింప చేయగలవు.ఇక మొదటినుంచీ చివరివరకూ ఒక సుదీర్ఘ అంశాన్ని డీవియేట్ కాకుండా దీర్ఘ కవితగా కవిత్వీకరించటంలోనే కవి ప్రతిభ తెలుస్తుంది.
*మీరు వీర్రాజు గారి జీవితంలో ప్రవేశించెనాటీకె
ఆయన సాహిత్య రంగంలోనే కాక ,చిత్రకారునిగా
మంచి పేరు పొందారు .చిత్ర కళలో మీకు అప్పటికె
ప్రవేశం ఉన్నప్పటికీ ,ఎందుకో మీరు నిర్లక్ష్యం చేసి
నట్టు కనిపిస్తుంది .అలా ఎందుకు జరిగింది ? ఏమైనా ,ప్రత్యేక కారణాలున్నాయా ?
జ:- చిన్నప్పటినుంచి బొమ్మలపుస్తకాలలోని చిత్రాలు చూసి వేసేదాన్ని.చిన్నప్పుడు ఢిల్లీ శంకర్స్ వీక్లీ వారి చిత్రలేఖనపోటిలో కూడా పాల్గొన్నాను. తర్వాత వారపత్రికలోని బాపూ బొమ్మల్ని అత్యంత ప్రేమతో వేసేదాన్ని.పెళ్ళయ్యాక వీర్రాజు గారు ప్రోత్సహించారు కానీ ఏకాగ్రతతో దీక్షగా వేయాల్సిన కళ చిత్రలేఖనం.పిల్లలతో ఉమ్మడి సంసారం లో ఎక్కడ కుదురుతుంది? వీర్రాజు గారు తైలవర్ణ చిత్రాలు వేస్తున్నప్పుడు నాకు వేయాలనిపించేది రిటైర్ అయ్యాక వేయాలనుకున్నాను.స్కెచ్ బుక్ కూడా కొనుక్కొని ఒకటి రెండు పెన్సిల్ స్కెచ్ వేసాను.అక్షరాలు రాయటం అలవాటైన వేళ్ళు చిత్రాలవైపు సాగటం లేదు.
*ఈ మధ్య అంతర్జాల పత్రికల దే ' హవా' అన్నట్టుగా
వుంది.తెలుగు సాహిత్య పురోగతికి ఇవి ఎంత
వరకు ఉపయోగ పడుతున్నాయి ?మీ అబిప్రాయం
చెప్పండి.
జ:- పుస్తకం ప్రచురణ,అమ్మకం కూడా సాహితీవేత్తలకు మోయలేని భారమయ్యింది.వేసిన పుస్తకాల్ని అమ్ముకోవటం కూడా ఒక కళగా మారింది.ప్రింట్ పత్రికలు తగ్గిపోయాయి కనుక సాహిత్య కారులందరూ తమ రచనలకు ఒక వేదిక కావాలి. కనుక అటువైపు చూడటం మొదలు పెట్టారు.టెక్నాలజీ తెలిసినవారు అంతర్జాల పత్రికలు అనుసరిస్తారు. అయితే ఎప్పటిలాగే రకరకాల రచనలు అంతర్జాల పత్రికలలో వస్తున్నాయి.కాలగతిలో ఏవి నిలుస్తాయో కాలమే నిర్ణయించాలి.ప్రతీ వాటికీ వాటి పాఠకులు వారికి ఉంటారు కదా.
* వృత్తికి ,ప్రవృత్తికి ,మీరు ఎలా న్యాయం చేయగలిగారు ?ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా
వాటిని ఎలా పరిష్కరించుకోగలిగారు ?
జ:-వృత్తీ, ప్రవృత్తి రెండూ వేర్వేరు ఛానల్స్.స్కూల్లో,విద్యార్ధుల్లో, వారి నేపధ్యాల్లో బోధనేతర పనుల్లో( సర్వే),జీవితపోరాటాల్లో నేను ఎప్పటికప్పుడు నాకు రచనలకు కావలసిన అంశాల్ని ఏరుకునే దాన్ని.నాకు సమయం కుదిరినప్పుడు ఎక్కువగా కవితలుగా రాసేను.కొన్నింటిని కథలుగా రాసాను.నాకు ఆ రోజుల్లో ప్రధాన సమస్య సమయమే.అందులోను నేను ఎక్కువగా రాసేది రాత్రి పూటే.
* కథకు గాని ,కవిత్వానికి గాని ,ఎలాంటి వస్తువుని
తీసుకోవడానికి మక్కువ చూపుతారు ?ఎందు
చేత ?
జ:-చిన్న స్పందన గాని,ముల్లులా గుచ్చుకునే సన్నని బాధగానీ,మనసుని కల్లోలపరచే సమాజంలోని సంక్షోభసందర్భాలు కానీ నన్ను కవిత రాయకుండా ఉండలేని పరిస్థితిని కల్పిస్తాయి.కథరాయాలంటే వస్తువు సంఘటనలనీ,దృశ్యాల్నీ, పాత్రల్ని సమకూర్చుకునేలా ఉండి ఆకట్టుకునే ముగింపు చేయగలిగినప్పుడే రాస్తాను.అందుకే నేను కథలు తక్కువ రాసాను.
* శ్రీ శీలావీ -మీరు ,సాహిత్య రంగంలో మంచి పేరు
సంపాదించుకున్నారు.సాహిత్య పరంగా మీకు
వారసులున్నారా ?వారి గురించి చెప్పండి.
జ:- మా అమ్మాయి పల్లవి తెలుగుకన్నా ఆంగ్ల సాహిత్యం ఎక్కువగా చదువుతుంది.సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో రాయటానికి ప్రయత్నించలేదు.ఆరేళ్ళక్రితం ఉద్యోగం మానేసి ఎమ్మే ఇంగ్లీష్,జర్మన్ భాష సర్టిఫికేషన్ చేసింది.గత ఏడాదిగా తెలుగు సాహిత్యం చదువుతూ కవితలూ, ఆర్టికల్స్ రాస్తోంది.అనువాదాలు చేయాలనుకుంటుంది.మా మనవరాలు తెలుగు పుస్తకాలకన్నా ఆంగ్ల సాహిత్యం విపరీతంగా చదువుతుంది. తర్వాత ఎప్పుడో సాహిత్యం లోకి వస్తుందేమోనని చిగురాశ.
* అనువాద ప్రక్రియ పై మీ అబిప్రాయం ఏమిటి ?
అనువాదంకు నోచుకున్న మీ రచనల గురించి
వివరించండి.
జ:- వీర్రాజు గారి నవల మైనా,నాదీర్ఘకవిత యుధ్ధం ఒక గుండె కోత ఆంగ్ల,హిందీ,తమిళ భాషల్లోకి అనువాదమై గ్రంధరూపంలోకి వచ్చాయి.వీర్రాజు గారి కథా సంపుటి,నా కవితా సంపుటి ఆంగ్లానువాదపుస్తకాలు వెలువడ్డాయి.మా ఇద్దరి రచనలూ కన్నడ,మైధిలీ వంటి ఇతరభాషలలోకీ అనువాదమయ్యాయి.ఇతరభాషలనుండి తెలుగు లోకి వచ్చినంతగా తెలుగు పుస్తకాలు ఇతరభాషల్లోకి వెళ్ళలేదు.అనువాదం కావటం ఒక ఎత్తైతే వాటిని సమర్థవంతంగా ఇతరరాష్ట్ర సాహితీ వేత్తల దృష్టిలో పడేలా ప్రచారం చేసుకోవటం మరో ఎత్తు. అది మాకైతే చాతకాలేదు.
* మీరు ప్రకటించిన పుస్తకాల వివరాలు చెప్పండి
జ:-ఆకలినృత్యం (1980)
మోళి(1982)
తెగినపేగు(1986)
ఆవిష్కారం(1986)
ఒప్పులకుప్ప1992)
యుద్ధం ఒక గుండెకోత(2001)
ఏకాంత సమూహాలు(2004)
బతుకుపాటలో అస్తిత్వరాగం (2009)
నా ఆకాశం నాదే (2016)తొమ్మిది కవితా సంపుటాలు
శీలా సుభద్రాదేవి సమగ్రకవిత్వం (1975-2009)
యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కావ్వానికి
1.యుధ్ధం ఏక్ దిల్ కి వ్యధ (హిందీ2018)
2.War,A Heart's ravege(ఆంగ్లానువాదం2001)
3.Ullak kumural(తమిళానువాదం2020)
4. Dance of a Hunger(anthology of poems2021)
1.దేవుడుబండ(1990)
2.రెక్కలచూపు(2007)
3.ఇస్కూలుకతలు(2018)మూడు కథా సంపుటాలు,
4.నీడలచెట్టు నవలిక,
ఇతరములు:
1.నాముందుతరం రచయిత్రుల కథల గురించి రాసిన 25 వ్యాసాల సంపుటి " కథారామం లో పూలతావులు"
2.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ ( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ2015)
3.నిడదవోలు మాలతి రచనా సౌరభాలు (2022)
4.గీటురాయిపై అక్షర దర్శనం(నారచనలపై వచ్చిన సమీక్షల సంకలనం)
సంపాదకత్వం:
1.ముద్ర (వనితల కవితల సంకలనం భార్గవీరావుతో సంపాదకత్వం2001)
2.వాళ్ళు పాడిన భూపాలరాగం (డా.పి.శ్రీదేవికథలు2022)
3.యాభై ఏళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు(2022)
4.మధుకలశమ్(డా.పి.శ్రీదేవి కవిత్వం)
*మీరు పొందిన అవార్డులు వగైరా....
జ:-1.లేఖిని సాహిత్యసంస్థ నుండి వచ్చే కవిత్వానికి కుసుమారామారావు పురస్కారం
2.తెలుగువిశ్వవిద్యాలయంనుండి97 లో సృజనాత్మక సాహిత్యానికి పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్
3. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి1999 లో ఉత్తమరచయిత్రి అవార్డ్
4.కడప కవితా సాహిత్య సాంస్కృతిక సంస్థ నుండి రెక్కల చూపు కథలసంపుటికి 2011 లోగురజాడ అవార్డ్
5.ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం.
6.2018లోఉమ్మడిశెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం.
7.2018లోకవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం
8.2018లో"నా ఆకాశం నాదే" కవితా సంపుటి కి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి మాతృపురస్కారం
9.2022లో సుశీలానారాయణరెడ్డి పురస్కారం
10.2022 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి మాతృపురస్కారం.ఇవి చెప్పుకోదగినవి.
ఇంత శ్రధ్ధగా నన్ను పరిచయం చేసినందుకు మీకు, సంచిక అంతర్జాల పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు.
***
* శీలా వీర్రాజు గారి రచనలపైగానీ,మీ రచనలపై గానీ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలేమైనా జరిగాయా తెలియజేయగలరు
జ:- శీలా వీర్రాజు గారి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో మూడు MPhil పరిశోధనలూ,ఒక PhDపరిశోధన జరిగాయి.
నా మొదటి కవితా సంపుటి ఆకలినృత్యంపై,యుధ్ధం ఒక గుండె కోత పై మధురకామరాజు విశ్వవిద్యాలయం లోనూ,రెండు కవితాసంపుటాలపై ఆంధ్రావిశ్వవిద్యాలయంలోనూ మూడు MPhil పరిశోధనలూ,నా సమగ్రకవిత్వంపై నాగార్జున విశ్వవిద్యాలయం నుండి,ఉస్మానియా విశ్వవిద్యాలయంనండీ ఇద్దరు PhD పరిశోధనలూ చేసారు.
10, ఫిబ్రవరి 2023, శుక్రవారం
తోపుడుబండి- సాదిక్ ఆలీ
తోపుడుబండి.సాధిక్ ఆలీ
కల్లూరు.ఖమ్మం జిల్లాలోని చిన్న టౌన్ సాదిక్ ఆలీ పుట్టాడు.నాన్న వలన రామాయణం,మహాభారతం, ఖురాన్.చదివాడు.తర్వాత ఇష్టంగా బైబిల్ చదివి అన్ని మతాల సారాంశం ఒక్కటే అనుకున్నాడు.
మామూలుగా పళ్ళనో, పాతబట్టలని, ప్లాస్టీక్ సామాన్లనో అమ్ముతూ కనిపించే నాలుగు చక్రాల బండి నే తోపుడు బండి అంటాం. దానిమీద కవిత్వాన్ని అమ్ముతానంటూ పుస్తకాలని వేసుకొని వీధుల్లో తిరుగుతా అన్న సాదిక్ ఆలీని వెర్రవాడిని చూసినట్లు కొందరు చాటుగా నవ్వుకుంటే ఇంకొందరు మొహమ్మీదే నవ్వారు.
తోపుడు బండిలో కవిత్వం పుస్తకాలు వేసుకుని 1000 కిలోమీటర్లూ వంద రోజుల్లో ప్రతీ గ్రామాన్నీ సందర్శిస్తూ వెళ్ళి కాలినడకన ప్రయాణం 40 డిగ్రీల పైనే ఉన్న ఎండ సాధ్యమా...? సాధిక్ అలీ కి తనకి తాను ప్రశ్నించుకోవటం ఇష్టం, ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ వెళ్ళటం అంతకన్నా ఇష్టం. అందుకే 1000 కిలోమీటర్ల యాత్ర సాధ్యమా అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ బయలేరాడు.
మొదట హైదరాబాద్ పుస్తకప్రదర్శన లో తోపుడు బండి నీ, లక్ష్యాలను పరిచయం చేసాడు.తర్వాత పబ్లికేషన్ చేసాడు.ఊరు,ఊరూ తిరిగి పుస్తకాలు అమ్మాడు.ఆ తిరగటం లో మారుమూల గూడెంలో పిల్లలకు అక్షరం తెలియకపోవటం అతన్ని కలచివేసింది.
ఒక తపస్సులా తన పనిని మొదలు పెట్టేసాడు. ఎంచుకున్న ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా., ఇల్లందులో డిసెంబర్ 7 ఉదయం 10.30 గంటలకు తోపుడుబండి 'అడవితల్లికి అక్షరతోరణం' యాత్ర ప్రారంభం అయ్యింది. ఒకేరోజు ఒకేచోట నాలుగు వేలకు పైగా స్కూల్ పిల్లలను సమావేశపరిచాడు.ఒక్కొక్కరికి ఒక్కో పుస్తకం ఇచ్చాడు. పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమను పెంచాడు.మాతృభాషపై మమకారాన్ని నూరిపోసాడు.పిల్లల పుస్తకాలు కొన్ని కొన్నాడు.కొంతమంది ఇచ్చారు.వేలపుస్తకాలు సేకరించి పిల్లలు చేత చదివించాడు.
55 గూడెం లను,పాఠశాలలనూ దత్తత తీసుకున్నాడు.
గూడెం లో మొగవాళ్ళూ స్త్రీ లూ పగలంతా పనులకు,బళ్ళో చదివే పిల్లలు బడికీ పోతే మిగిలిన వృధ్ధులూ,గర్భిణీలు, చిన్నపిల్లల కోసం "గుప్పెడుమెతుకులు"పేరున ఎవరైనా విరాళాలు ఇస్తే సరే,లేకుంటే తనే భోజనాలు వండించి పెడతాడు.
ఏ మతం లో ఏ పద్దతులని ఆచరించినా మనం ఒకే దేవున్ని ఆరాధిస్తున్నాం అనేది సాదిక్ ఆలీ విశ్వాపం.
''నేను జన్మతహ ముస్లిం నే కానీ భారతీయున్ని కూడా. నాకు దేవుడే ఒక మతం మరే ఇతర మతాలతోనూ నాకు సంబందం లేదు. నేను హిమాలయాలకు వెళ్ళినా, ఆ దారిలో నాలో ఉన్న అహాన్ని చంపుకోవటానికి బిక్షాటన చేసినా, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన తిరిగినా అన్నిటికీ ఒకటే కారణం... నాలో ఉన్న భగవంతున్ని నేను కనుక్కోవాలి."అంటాడు సాదిక్ ఆలీ.
భగవంతుడు ఎక్కడో ఉన్నాడో లేదో తెలియదు కానీ ఇటువంటి వారిలోనే ఉండే ఉంటాడేమో కదా?
8, ఫిబ్రవరి 2023, బుధవారం
పంజరాలు
పంజరాలు
విచ్చీవిచ్చని చిరువెలుతురు లోంచి
చిక్కని మంచుతెరల్లోంచి
ఆలోచనలగుర్రాన్ని తోలుకుంటూ
రాత్రంతా నిద్రపోకుండా
మర్నాడు విచ్చుకోబోయే వెలుగు రేఖల్ని
వెతుకుతూ వెతుకుతూ తిరిగాను
ఇంతకాలపు నిరీక్షణల వెతుకులాటలో
మధుర ఫలపుష్పశోభితంగా చూపాల్సిన
హృదయం స్ఫటికంలా గతకాలపు చిత్రాల్నీ
విరిగిన కలల చీలికలనూ ప్రతిబింబించింది
రెపరెపలాడుతూ కదులుతున్న
రెప్పల చప్పుడు ఎక్కడో వినిపించింది
మనసు కిటికీ లోనుంచి తలదూర్చి
చూపుల్తో వెతుక్కుంటున్నాను
అంతటా వేనవేల పక్షులు
రంగురంగులవీ
దిగులు ముఖాలవీ
కూతలు మర్చిపోయినవీ
రెక్కలు కత్తిరించబడినవీ
తోకలు ఉత్తరించబడినవీ
ఎగరలేని అసహాయతతో
దిగులు జారుతున్న కళ్ళతో
ఇంట్లో వేనవేల పక్షులు
సంప్రదాయ పంజరంలో ---
అందానికి కొలబద్దలతో
శరీరాన్ని రకరకాలుగా చెక్కుకొని
కన్నీటి బిందువుల్ని సైతం
ముత్యాల్లా అలంకరించుకుని
అందాలలోకంలోనే ఆనందాన్ని ప్రదర్శిస్తూ
ముక్కుకి ప్లాస్టిక్ చిరునవ్వు వేలాడేసుకుని
బయట వేనవేల పక్షులు
సౌందర్యపంజరంలో ---
ఇంకా ఇంకా చెక్కుకుంటూ
అతికించుకుంటూ కత్తిరించుకుంటూ
వ్యాపార మోహపంజరాలలో
ఇంకా ఇంకా కూరుకుపోతూ వాళ్ళూ
మూఢవిశ్వాసాల ఊచల్ని
వంచేయాలనే ప్రయత్నంలో మేము
7, ఫిబ్రవరి 2023, మంగళవారం
నడక దారిలో -23
నడక దారిలో --23
అమ్మ వెళ్ళిన తర్వాత పాప పనితో , ఇంట్లో పనితో తీరిక లేకుండా అయ్యింది.దాంతో పూర్తిగా పుస్తకాలకు దూరం అయ్యాను. నా నా లోకం అంతా పాపే ఆక్రమించింది.
కానీ బలహీనంగా ఉండటం వలన తరుచూ అనారోగ్యం తో బాధపడేది.ఏ రోజైనా అనారోగ్యం తో ఏడుస్తుంటే విలవిలలాడిపోయేదాన్ని.నవ్వుతుంటే పులకించిపోయేదాన్ని.
రాత్రి పూట పాప పక్కనే పడుకుని నాకు వచ్చిన జోలపాటల్ని సన్నగా పాడుకుంటూ నిద్రపుచ్చుతూ ఉండేదాన్ని.నా కంఠం మళ్ళా మంద్రంలో శృతి చేసుకోవటం మొదలెట్టింది.
వీర్రాజు గారు చిత్రరచనల్లో మమేకం అయినా,సభలకు వెళ్ళినా,సినీమాలకు వెళ్ళినా పట్టించుకునేదాన్ని కాదు.పాప ధ్యాసలో పడి తనను పట్టించుకోవటం లేదని అప్పుడప్పుడు మూతి ముడుచుకున్నా పాప కేరింతలు వినేసరికి మురిసి పోయేవారు. అందులోనూ పెళ్ళి సమయానికి నాకోసం రాస్తానన్న దీర్ఘ కావ్యం పాప పుట్టేలోపున కూడా పూర్తికాలేదని రాసే పనిలో తలమునకలుగా ఉన్నారు.
వీర్రాజుగారు నాకే అంకితం చేయాలనుకుంటూ రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “పుస్తకాన్ని యువభారతి ప్రచురించింది. ఏప్రిల్ నాలుగో తేదీ ఉగాది రోజున జరిగిన ఆ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.
వేదిక మీద ఆయన దీర్ఘ కావ్యం గురించి అందరూ ప్రశంసిస్తుంటే ఆనందంతో పొంగిపోయాను.కానీ ఎందువలనో మరి వీర్రాజు గారు చాలా మందికన్నా ముందే వర్ణనాత్మకమైన అభ్యుదయ దృక్పథంతో రాసిన మళ్ళీ వెలుగు దీర్ఘ కావ్యంకి రావలసినంత గుర్తింపు రాలేదనే అనుకుంటున్నాను.
ఆషాఢమాసంలో వదిన పుట్టింటికి వెళ్ళిందని,కడుపుతో ఉన్నప్పుడు గానీ,పాప పుట్టాక గానీ నా చేత్తో తృప్తిగా వండిపెట్టలేకపోయాననీ, ఇప్పుడు వీలుంటే ఒక పదిరోజులు రమ్మనీ అమ్మ ఉత్తరం చిన్నక్క తో రాయించింది.
నాకు కూడా వెళ్ళాలని మనసైంది.సరేనని చంటిపాపతో ఒక్కదాన్నీ వెళ్ళలేనని కుమారీ వాళ్ళ ఆడబడుచూ,మామగారూ వైజాగ్ వెళ్తుంటే వారితో కలసి విజయనగరం వెళ్ళాను.
ఒకరోజు కోరుకొండకి వెళ్ళివచ్చాను.మరోరోజు రాజీఇంటికి వెళ్ళాను అయితే రాజీ ఇంటికివెళ్ళటం అదే ఆఖరు సారి.ఎందుకంటే రాజీ లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు స్పాట్ వేల్యూయేషన్ కి హైదరాబాద్ వస్తుండేది.ఆసమయంలో ఒకటి రెండుసార్లు మాయింటికి వచ్చేది.
ఆమె నాకు 9వ తరగతినుండి డిగ్రీవరకూ క్లాస్మేటే కాక హైద్రాబాద్ వచ్చాక కూడా 1975 వరకూ మంచి స్నేహితురాలు .ప్రేమలో పడితే ఇంట్లో వాళ్ళే ఆమెకు అంక్షలు పెట్టేరు. ఆమె నేటీకి అవివాహితురాలుగా వుండిపోయింది.ఉత్తరాలద్వారా ఆమెను ప్రేమకీ,పెళ్ళి కీ ప్రోత్సహించాననీ, నేనే తనని చెడు ఆలోచనలు నేర్పించాననీ స్త్రీ స్వేచ్ఛని నేర్పుతున్నానని వాళ్ళనాన్న భావించి నానుండి ఆమెకు వుత్తరాలుగానీ,కనీసం గ్రీటింగ్ కార్డ్స్ గానీ వస్తే తీవ్రపరిణామాలు వుంటాయని మా వీర్రాజు గారికి హెచ్చరికగా వుత్తరం రాసాడు.. ఆమె నేటికీ అవివాహితురాలుగానే వుండిపోయింది.ఆంక్షలు పెట్టిన ఆమె తండ్రి చనిపోయినా కూడా నాతో స్నేహాన్ని పునరుద్ధరించలేదు.ఎందుకిలా మధురమైన బాల్యస్నేహాన్ని కత్తిరించేసి దూరం అయ్యావని ,మనం కలిసిమెలిసి కలబోసుకున్న కబుర్లు గుర్తులేదా అని అడగాలని నామనసు నన్ను నిత్యమూ తొలిచేస్తూనే ఉంటుంది.
ఆమెపై ఒక కథ,ఒక కవితా కూడా రాశాను.
కుమారీకి కూడా బాబు పుట్టాడు.తనని కూడా కలిసాను. అయితే ఉష మాత్రం వివాహం కావటంతో విజయనగరంలో లేదు.ఇలా నాలుగు రోజులు అందర్నీ కలిసినా , కబుర్లు చెప్పుకుంటున్నా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎందుకో పూర్వంలా నా ఇల్లు లా అనిపించలేదు.చుట్టపు చూపుగా వచ్చినట్లే అనిపించింది. పెళ్ళి కాగానే ఆడపిల్ల పుట్టింటికి అతిథి అనేమాట నిజమే అనిపించింది.
హైదరాబాద్ వచ్చాక మళ్ళా బిజీ అయిపోయాను.వెచ్చాలు తీసుకునే షాపులో అరువు అమాంతం పెరిగిపోయింది.ఆ షాపులో మొత్తం తీర్చేసి ఇంకెప్పుడు మా పేరిట సరుకులు అరువు ఇస్తే నాకు పూచీ లేదని ఫస్ట్ తేదికి డబ్బు ఇచ్చే తీసుకుంటామని చెప్పాను.
చవకలో బట్ట కొని పాపకి రకరకాలుగా ఫ్రాకులు కుట్టి వాటికి ఎంబ్రాయిడరీ చేయటం, ఇంటిపనులు,వచ్చే పోయే అతిథులూ వీటితో నేను సాహిత్యం, డ్రాయింగ్ అన్నీ వదిలేసి అచ్చమైన గృహిణిగా మారిపోయాను.
ఇంట్లో ముగ్గురు మొగవాళ్ళు ఉన్నా ఇంటికి సంబంధించిన కూరలో,వెచ్చాలో మరే ఇతరపనో చేయటానికి ఎవరూ కదలరు.'మల్లేష్ వస్తే తీసుకురమ్మని చెప్పు' అనేవారు అందరూ.
వీర్రాజుగారు 1962 లో అనారోగ్యంతో ఆరునెలలు హాస్పిటల్ లో ఉన్నప్పుడు తోటి పేషెంట్ మల్లేష్ . ఎక్కడి రుణానుబంధమో అప్పటి నుండీ ఈయనకి మరో తమ్ముడయ్యాడు.ఏ పని చెప్పినా కాదనడు.
మనపని మనం చేసుకోకుండా మరొకరిపై ఆధారపడటం నాకు నచ్చేది కాదు.అందుకని అనేక సార్లు నేనే చేసుకునేదాన్ని.పాప పుట్టాక ఒక్కొక్క సారి కష్టం అయ్యేది.
ఒకసారి నేను ఏదో పనిలో ఉన్నప్పుడు మా పెద్దమరిది "వదినా మీ అల్లుడు వచ్చాడు "అని కేక వేసాడు.
ఇప్పటిలా ఆంటీ, అంకుల్ కాకుండా అప్పట్లో కాంపౌండు లోని పిల్లలు అత్తయ్య, మామయ్య అనే పిలిచేవారు.ఏదో అవసరం కోసం వచ్చారేమోనని వంటింట్లోంచి కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చాను.గుమ్మంలో ముష్టివాడున్నాడు.నాకు పట్టరాని కోపం వచ్చింది.ముష్టివాడిని పొమ్మని,మరిది మీద విరుచుకు పడ్డాను."అవేం మాటలు.ఇస్తే ఏదో ఇచ్చి పంపు.ఆ మాటలు ఏమిటి?" అంటూ.
అదే విధంగా మరోరోజు పాపకి స్నానం చేయించి
ముస్తాబు చేయిస్తున్న సమయంలో డైరీపాలబాటిల్స్ తీసుకువచ్చిన అబ్బాయి వస్తే బాటిల్స్ తీసుకుంటూ మా ఆడబడుచు ఆ అబ్బాయితో " మా పాపని పెళ్ళి చేసుకుంటావా?" అంది.ఆ అబ్బాయి ముసిముసిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు.దాంతో నాకు పిచ్చి కోపం వచ్చింది."కావాలంటే నీ పిల్లల్ని ఇచ్చి చెయ్.నా పాప గురించి ఇలాంటి మోటు సరసాలు ఆడేటట్లైతే ఊరుకునేది లేదు"అన్నాను.
ఆమె ముఖం మాడ్చుకొని "సరదాగా అంటే ఏమైంది"అంది.
"ఆరు నెలల పిల్లని పట్టుకుని ఆ మాటలేంటి?నాకు అలాంటి మోటు సరదాలు,సరసాలూ నాకు నచ్చవు.ఇంకెప్పుడూ నా ఎదురుగా అలా మాట్లాడకు" అని వార్నింగ్ ఇచ్చాను.
ఇవన్నీ వీర్రాజు కు చెప్పాలనిపించినా ఇష్టం లేక డైరీలోనే నాబాధని ఒలకబోసుకుని దాచుకున్నాను.
నవంబర్లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తరపున రచయిత్రుల మహాసభలు జరిగాయి.సభ ప్రారంభం భానుమతి చేసింది.ఆమె మాటతీరు చాలా అహంకారం గా అనిపించింది.ఐతే రచయిత్రి గానే కాకుండా అటు సినిమా
రంగంలో కూడా ఒక వెలుగు వెలుగుతోంది.సినీపరిశ్రమలో నెగ్గుకు రావాలంటే అలాంటి డామినేటింగ్ స్వభావం ఉండాల్సిందే.బహుశా అందుకే అలా తనని మలచుకొని ఉండొచ్చేమొ అనిపించింది.తర్వా బాలానందసంఘంచేత తురగా జానకీరాణి గారి నేతృత్వంలో నాటిక వేయించారు.అంతేకాకుండా జానకీరాణి గారు స్వయంగా "భువనేశ్వరా" అనే రవీంద్రగేయంకి గ్రూప్ డాన్స్ చేసారు.ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మగారి అధ్వర్యంలో కవిసమ్మేళనం జరిగింది.కంచుకంఠంతో ఆమె పద్యాలు చదువుతుంటే అంతా నిశ్శబ్దంగా విన్నారు.రెండోరోజు కార్యక్రమం కి నేను వెళ్ళలేకపోయాను.మర్నాడు ముగింపు సమావేశంలో లత పొగరు గా మాట్లాడుతుంటే చిరాకు అనిపించింది.ఆ సభలో ఒక పాఠకురాలు లేచి ప్రశ్నలు సంధించింది.ఆ సభలో కొంత గందరగోళం ఏర్పడింది.
సంక్రాంతికి కాంపౌండులో వాళ్ళని పిలిచి పాపకి భోగీపళ్ళు పోసాను.నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలకొలువు పెట్టాలని కోరిక.అందుకని సరదాగా చిన్నగా బొమ్మలకొలువు కూడా పెట్టాను.
అనేకానేక కలలూ,కలతలూ,కన్నీళ్ళూ,ఆనందాల కలగలుపు తోనే పాపకి ఏడాది నిండింది.మొదటి పుట్టినరోజు చేయాలని అందరూ నిర్ణయించుకుని చిన్నగా పార్టీ ఇచ్చాము .
అప్పుడే పెద్దక్క నుండి ఒక ఉత్తరం వచ్చింది."మరో బిడ్డ కోసం మూడు నాలుగేళ్ళు విరామం తీసుకోకుండా ఎందరు కావాలనుకున్నారో నిర్ణయించుకోండి.ఆ తర్వాత నువ్వు నీ అభిరుచుల పట్లా శ్రద్ధ పెట్టొచ్చు"అని రాసింది.
కానీ ఈ పిల్లనే నేను కోరుకున్న విధంగా పెంచగలనా అనే పరిస్థితిలో మరొకరిని ...ఊహూ నాకు ఊహించే ధైర్యం చాలలేదు.
ఎన్నో ఆశలతోఎన్నో కలల్తో తొందరపడి ఈబంధంలోకి నాకైనేనే ఇరుక్కున్నాను. అభిరుచులు అన్నింటినీ మర్చిపోయాను. చెమ్మగిల్లిన కళ్ళల్లోంచి మసకబారిన నాఆశలన్నీ కన్నీరుగా తొలగించడంలో ఇంకిపోతూనే ఉన్నాయ్.
16, జనవరి 2023, సోమవారం
నడక దారిలో -22
నడక దారిలో --22.
డిసెంబర్ 20 వతేదీన మా పెద్ద ఆడబడుచు కుటుంబం ఎల్.టీ.సీ మీద నెలరోజుల సెలవులతో భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వస్తుంటే అమ్మ నా డెలివరీ కోసం వారితో బాటూ హైదరాబాద్ వచ్చింది.
అప్పట్లోనే మా పెదనాన్న కొడుకు లక్ష్మణ రావు విద్యాశాఖ లో అధికారిగా పదోన్నతి పొంది హైదరాబాద్ కి కుటుంబం తో వచ్చాడు.మల్లేపల్లిలో ఇల్లు తీసుకున్నారు.బుచ్చిబాబుగారు వివాహానంతరం అనంతపురం లో ఉన్నప్పుడు బుచ్చిబాబు గారూ,వీళ్ళు ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఉండేవారట.ఒకసారి లక్ష్మణరావుగారి కుటుంబంతో కలిసి శివరాజు సుబ్బలక్ష్మిగారి ఇంటికి మేము వెళ్ళాము.సుబ్బలక్ష్మిగారు నా చెయ్యి పట్టుకొని వదలలేదు.ఎందుకో గానీ సుబ్బలక్ష్మి గారి స్పర్శ,ఆమె ఆత్మీయత నా అలసిన హృదయానికి ఎంతో ఉపశమనం కలిగించింది. అప్పటినుండి వారితో గత నలభై ఏళ్ళకు పైగా ఆమె చివరి రోజులు వరకూ మా దంపతులకు ఆత్మీయ స్నేహబంధం ఏర్పడింది.మల్లాపురం లో అబ్బాయి తో బాటు ఉన్నప్పుడు కూడా వెళ్ళి కలిసే వాళ్ళం.బెంగుళూరు వెళ్ళిపోయాక కూడా సుబ్బలక్ష్మి గారు తరుచూ ఫోన్ చేసి మాట్లాడేవారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ముందుగా ఫోన్ చేయటం వలన తప్పక ఆమె ఉండే హొటల్ కి వెళ్ళి కొంతసేపు గడిపి వచ్చేవాళ్ళం.తొంభైఏళ్ళ వయసులో కూడా పెయింటింగ్ లు వేస్తూ సుబ్బలక్ష్మిగారు నిరాశకు తావివ్వకుండా జీవితాన్ని,కాలాన్ని రంగులమయం చేసుకొంటూ గడపటం ఇప్పటి తరం నేర్చుకోవాలి.
తరుచూ లక్ష్మణరావు గారి కుటుంబం మా ఇంటికి వస్తుండే వారు.అప్పడప్పుడు మా వాళ్ళు వెళ్ళేవారు.వాళ్ళేకాకుండా మామరుదుల మిత్రులూ మా వారి మిత్రులు,మా ఆడబడుచు కుటుంబం ఇంతమందితో మా యింట్లో సత్రంలా వంటలూ వార్పులూ జరిగేవి.మాపెద్దమరిదికి ఆ ప్రాంతంలోనే ఒక సంబంధం కుదరటంతో వాళ్ళు కూడా తరచూ రావటం మా మరిది వెళ్ళటం జరుగుతుండేవి.ఆ అమ్మాయి ,మామరిది పెళ్ళయిన వాళ్ళలాగా సినీమాలూ ,షికార్లకు వెళ్ళేవారు.మాకు వెనుకబడి తప్పనిసరిగా వచ్చే మా యింట్లో వాళ్ళు ఆ జంటని హాయిగా వెళ్ళనివ్వటం ఆశ్చర్యంగానే కాక ఒకింత అసూయ కూడా కలిగేది.
మా అమ్మ ఇది చూసి గాభరా పడేది.'ఎప్పుడూ పొయ్యదగ్గరికి రాని చిన్నపాపాయి(నేనే ) ఇంత సంసారాన్ని ఎలా మోస్తుందా' అని దిగులు పడేది.
"పురిటికి విజయనగరం తీసుకు వెళ్ళాల్సింది.ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నారు అని వీర్రాజు ఒప్పుకోలేదు.ఇన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు మధ్య నువ్వెలా బతుకుతున్నావో" అమ్మ ఒకింత బాధతో ఆశ్చర్యపోయింది.@
మాటిమాటికీ మా ఆడబడుచులు నడుమునొప్పి,తలనొప్పని పడకేస్తే నాచేత పనంతా చేయించలేక అమ్మే చేసేది.అది నాకు చాలా బాధ కలిగించేది.
సంక్రాంతి రోజు కూడా అదే పరిస్థితి.ఆ రోజు చనిపోయిన పెద్దలకు పూజచేసి అక్కడ వండిన అన్ని వంటకాలు పెడతారు.ఆడబడుచులకు ఆటంకం రావటంతో అమ్మా,నేనూ చేయాల్సి వచ్చింది.పొంగడాలు,గారెలూ సరిగాకుదరలేదు.'ఇటువంటి వాటిపై నమ్మకం లేకుండా చేయటం వలన కుదరలేదా? లేకపోతే నాచేతివంట వాళ్ళపెద్దలకి తినటం ఇష్టంలేక కుదరలేదా? 'నాలో నేను నవ్వుకున్నాను.
హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమం కాస్త చల్లారింది.కానీ ముల్కీ నిబంధనలకు ఆందోళన పడటం వలన ఆంధ్రా ప్రాంతంలో ఉద్యమం తీవ్రంగానే సాగుతోంది. జనవరి17న జైఆంధ్రా ఉద్యమకారులను, ఆనందగజపతిగారినీ, మరో ముగ్గురు కాలేజీ లెక్చరర్ లనూ అరెస్టు చేశారని వార్తాపత్రిక లో వచ్చింది..జనవరి 16న గుంటూరులో కాల్పులలో 12 మంది చనిపోయారుట.ఇక సెపరేటు కాక తప్పదు అని అందరూ భావించారు.
ఒకరోజు పొద్దున్నే వీర్రాజు గారు "బాబు కాకుండా పాపాయి పుట్టినట్లు ఈ రోజు కల వచ్చింది.నువ్వు అన్నట్లుగా పల్లవే మన ప్రేమలతకు చిగురిస్తుందేమో" అన్నారు.నేను ముసిముసిగా నవ్వాను
మాయింటికి వచ్చిన రత్నం " మీకు పుట్టే పాపాయి ఆంధ్రా పాపా, తెలంగాణా పాపా" అని అడిగింది.పుట్టేలోపున విభజన జరుగుతే ఎక్కడ పాపగా పెరుగుతుందో తెలుస్తుంది అని మనసులో అనుకుంటూనే నవ్వి " తెలుగు పాపాయి" అన్నాను.
జనవరి 20 న గుంటూరులో పోలీసుల కాల్పుల్లో 12మంది చనిపోయారని పేపర్లో చదివి వీర్రాజు" రాష్ట్రం విడిపోక తప్పదేమో.బహుశా విజయవాడకి బదిలీ అవుతుందేమో" అంటూ "అలా ఐతే మనతో బాటు కృష్ణుని మనతో తీసుకువెళ్దాం "అనేసరికి స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పకపోవటమంటే ఇదేనేమో అనుకున్నాను.
ప్రధాని ఇందిరా గాంధీతో తెలంగాణ, ఆంధ్రా కాంగ్రెస్ నాయకులు సంపద్రింపులు మొదలయ్యాయి. ఉద్యమం ఆగిపోయింది. 18 న ముఖ్యమంత్రి పీ.వీ.నరసింహారావు రాజీనామా చేయటంతో విధించిన రాష్ట్రపతి పాలన మరొక ఆరు నెలలు కొనసాగించారు.
ఎన్జీవో స్ట్రైక్ వలన వీర్రాజు గారికి జీతంలేదు.కానీ అనుకోకుండా యువభారతి వారి ముఖచిత్రాలకు డబ్బు ఇచ్చారు.అంతకు ముందు తెలుగు అకాడమీ వారికి వేసిన వాటికీ,ప్రభుత్వం సావనీర్లకు వేసిన వాటికీ డబ్బు అందటంతో కొంత ఊపిరి పీల్చుకున్నాము.
తొమ్మిదో నెల వచ్చేసింది.అమ్మని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే" నువ్వు అసలు బరువు పెరగలేదు. పొట్టలో బిడ్డ పెరగటం లేదు. తినటం లేదా "అని కోప్పడింది.ఇంటి నిండా జనం.అలవికాని ఆర్ధిక భారం.దీనికి సమాధానం ఎక్కడ వెతుక్కోవాలి.మౌనం వహించాను.'కనటానికైనా నీకు బలం వుంటుందా' అని అమ్మ కళ్ళల్లో నీళ్ళు.
"నువ్వు ఫేషనబుల్ గా ఫ్రాక్స్ కుడతావటకదా "పెద్దాడబడుచు అనే సరికి పొంగి పోయి అమ్మ మందలిస్తున్నా వినకుండా సంక్రాంతికి తొమ్మిది నెలల గర్భంతో పిల్లలిద్దరికీ ఫ్రాకులు కుట్టాను.
సంక్రాంతి వెళ్ళిన నాలుగు రోజులకి ఆడబడుచు కుటుంబం తిరుగు ప్రయాణం కట్టారు.కానీ వీర్రాజు "సుభద్రకు మరో రెండురోజుల్లో డెలివరీ డేట్ అని డాక్టరు అంది కదా మరో వారంరోజుల సెలవు పొడిగించండి" అనటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెలవు పొడిగించారు.
తెల్లవారుజామున నాలుగు గంటలకు మెలకువ వచ్చింది ఎందుకో అనుమానం వచ్చింది.చూసుకుంటే రక్తస్రావం అవుతుంది.అమ్మని లేపాను.అప్పటికప్పుడు అమ్మ వేడినీళ్ళతో స్నానం చేయించింది పెద్దవాంతి అయ్యి నొప్పులు ప్రారంభం అయ్యాయి.కానీ ఇంట్లో ఎవ్వరూ హడావిడీ చూసైనా లేవలేదు.అమ్మ,నేను వీర్రాజు హాస్పిటల్ కి వెళ్ళాం.వెంటనే జాయిన్
చేసుకున్నారు.ఒకవైపు వాంతులు, మరోవైపు నొప్పులు భరించలేక ఏడ్చేసాను.మూడునిమిషాల సుఖం కోసం ఇంత యాతన అనుభవిస్తున్నానే అనిపించింది.
డాక్టర్ దేవయానీ డంగోరియా దేవదూతలా నిర్మలమైన చిరునవ్వుతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఓదార్చింది.నిజానికి ఆమెని చూస్తుంటేనే సగం రోగాలు తగ్గిపోతాయనేలా ఆమె ఉంటుంది.
పగలంతా బాధ పడుతూనే ఉన్నాను. సాయంత్రం మందుకొనాలని వీర్రాజు బయటకు వెళ్ళారు.అకస్మాత్తుగా కరెంటు పోయింది.అంతలో నొప్పులు తీవ్రం కావటంతో నన్ను లేబర్ రూం లోకి తీసుకు వెళ్ళారు.అయ్యో ఆయన్ని చూడలేదు.నేను తిరిగి బయటకు వస్తానా అని భయంవేసింది.
నేను రూం లోకి వెళ్ళగానే కరెంట్ వచ్చింది.
అంతలో నాతో నేను చేస్తున్న పోరాటం పూర్తిఅయ్యింది.ఎండిన పెదాలమీద చిరునవ్వు చిగిరించింది.
"అంతగా మురిసి పోతున్నావు.పాప కావాలనుకుంటున్నావా?బాబు అనుకున్నావా?"అంది డాక్టర్.
"ఎవరైనా పర్వాలేదు డాక్టర్.కానీ పాపాయి పుట్టాలని కోరుకున్నాను" అన్నాను.
డాక్టర్ నవ్వి "నీ కోరికే తీరిందిలే" అన్నారు.
ఓ గంట తర్వాత రూంకి చేర్చారు.వీర్రాజు ముఖం నిండా ఆదుర్దా కదులుతోంది.నన్ను చూడగానే ముఖం వెలిగింది."నువ్వు కోరుకున్నట్లు పల్లవే పుట్టింది" అన్నారునవ్వుతూ.
నాముఖం మీద గర్వవీచిక మెరిసింది.
' నేను అమ్మనైపోయాను.ఇంక మరిన్ని అనుభూతులు,మరిన్ని బాధ్యతలు అవన్నింటికీ నాకు మనోబలం కావాలి' కళ్ళుమూసుకుని మనసును కూడగట్టుకున్నాను.
ఏమి తిన్నా ఇమడకపోవటంతో నీరసంగా పడుకున్నాను.
మర్నాడు ఆడబడుచులు పాపని చూడటానికి హాస్పిటల్ కి వచ్చి "పాప నల్లగానే ఉంది" అని నొక్కి వక్కాణించారు. నేనేమీ మాట్లాడలేదు.
అంతలో డాక్టర్ రౌండ్స్ కి వచ్చి " ఏమంటుంది నీ లిటిల్ బేబీ"అని నవ్వుతూ పలకరించారు.బరువుబాగా తక్కువగా ఉంది, తర్వాత పెరుగుతుంది.భయపడకు"అన్నారు.
. 'హమ్మయ్య ' అని నిట్టూర్చాను.
హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు హాస్పిటల్లో వాళ్ళిచ్చిన బట్టలే పాపాయికి వేయాలి.ఇంటికి వచ్చాక వేయాలంటే రెడీ మేడ్ బట్టలు కొనాలంటే అంత ఖరీదు పెట్టలేము.అందుకని తెల్లని గ్లాస్కోబట్ట కొని పెద్దాడబడుచుని చిన్నజుబ్బాలు కుట్టమంటే నాకు చాతకాదుఅంది.బట్టకొని తెమ్మని వీర్రాజు తో చెప్పి అమ్మా, నేను హాస్పిటల్ మంచం మీదే పాప కోసం చేత్తోనే జుబ్బాలు కుట్టాము.
నేను ఇంటికి రాగానే ఆడబడుచు వాళ్ళు వెళ్ళిపోయారు.పురిటి స్నానం కాగానే యథావిధిగా ఇంటిపనులు మొదలెట్టాను.పాపకి స్నానం చేయించటానికి ఒక అవ్వని కుదుర్చుకున్నాను
పాపని ఉయ్యాలలో వేసి వేడుకచేయాలని ముచ్చట పడ్డారు వీర్రాజు గారు.ఇరవై ఒకటోరోజున ఎక్కడినుండో ఉయ్యాల తెచ్చి మిత్రులను పిలిచి పార్టీ ఇచ్చాము.'ఎస్.పి.బాలసుబ్రమణ్యం కూతురు పేరు పల్లవి. మళ్ళీ మీపాపే పల్లవి' అని అందరూ అనేసరికి సంతోషంతో పల్లవిని ముద్దులాడేను.
పాపకి నెలనిండక ముందే విజయనగరంలో పెద్దన్నయ్య భార్య వదిన అమ్మని పంపించేయమని ఉత్తరం రాసింది.
అమ్మ నన్ను పాపని తీసుకు వెళ్తానంది.కానీ ఇప్పుడిప్పుడే ఈ ఇంట్లో నాస్థానాన్ని పదిలపరచుకుంటున్నాను.అందులోనూ పెళ్ళికాకముందే కాబోయే తోటి కోడలు మాటిమాటికీ వచ్చి పెత్తనం చేస్తోంది.ఈ పరిస్థితి లో రానని అమ్మతో చెప్పాను.
అమ్మ మరేమీ అనలేక పలు జాగ్రత్తలు చెప్పింది.వీర్రాజు అమ్మని విజయనగరంలో దించి వచ్చారు.
నడక దారిలో -21
నడక దారిలో --21
అంతకుముందు చుట్టపు చూపులా వచ్చి రెండు మూడు నెలలు మాత్రమే వచ్చిపోవటం వలన పూర్తిగా నా యిల్లు అనిపించేది కాదు.ఇప్పుడు పూర్తి హక్కులతో నాయిల్లు,నాకుటుంబం అనుకుంటూ కళ్ళనిండా కోటి కలలతో హైదరాబాద్ లోని ఇంట్లోకి అడుగు పెట్టాను.
జూన్ నెలనుండీ కుటుంబ బాధ్యతలు పూర్తిగా తీసుకున్నాను.ముగ్గురు అన్నదమ్ములు ఇచ్చిన డబ్బుతోని నెలంతా గడపటానికి బడ్జెట్ ప్లానింగ్ తో అన్నీ డైరిలో రాయటం మొదలుపెట్టాను.
జూన్ ఫస్ట్ కి నాకథకి వచ్చిన రెమ్యునరేషన్ లో సగం 10 రూ.నా తొలి సంపాదన గా సంబరంగా అమ్మకి mo చేసాను.
ఒక రోజు ఆఫీస్ నుండి రాగానే "ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హౌసింగ్ స్కీమ్.HRaని అయిదుసంవత్సరాలు వదులుకుంటే తర్వాత పదహారువేలఖరీదుచేసే ఇల్లు వస్తుందంట తర్వాత కొంత వాయిదా పద్ధతిని నెలనెలా కట్టాలిట.అయితేముందుగా నాలుగు వేలు కట్టాలిట. కాని సత్యవతి పెళ్ళి ఉంది,నీ డెలివరీ ఖర్చు ఉంది.కానీ మధుని రెండువేలు సర్దమంటాను.తర్వాత తీర్చేయవచ్చు" ఎంతో సంబరంగా అన్నారు.కానీ మా పెద్దాడబడుచు భర్త "అంతా ఫిక్సెడ్ లోనే ఉంది, డబ్బు లేద "నేసరికి వీర్రాజు చిన్నబుచ్చుకున్నారు.డబ్బుకొరత వలన అప్లికేషన్ కూడా పెట్టలేదు.అలా సొంత ఇంటి కల మొదటిసారి చెదిరి పోయింది.
వంటగదిలోకి ఆనుకొని ఉన్న రెండు రేకుల గదులు అద్దెకి తీసుకున్నాము.అందులో ఒకటి బెడ్ రూం గా,రెండోది వీర్రాజు ఆఫీస్ రూం గా చేసుకున్నాం.
అయితే స్వంత పడకగది సరదా తీరకుండానే వీర్రాజు మిత్రులు కథక్ మిత్ర పేరుకథలు రాసే వేమూరు నరసింహారావు భార్యతో కలిసివచ్చి మా ఇంట్లో వారంరోజులు ఉన్నారు.తిరిగి మళ్ళీ మాకు వంటిల్లే గతి అయ్యిందీ.
కథక్ మిత్ర వాళ్ళకి నగరంలో చూడదగిన ప్రదేశాలు రోజూ తీసుకు వెళ్ళి చూపించాం.అయితే నాకు వాంతులు అవుతుండటంతో నీరసపడి ఉండటాన తిరిగి తిరిగి వచ్చాక వంటపనులుచేయటం బాధకలిగేది.ఒక్కొక్కసారి చిరాకుగా ఉండేది.అయినా ముఖంమీద చిరునవ్వు చెదరకుండా పనులు చేసేదాన్ని.వాళ్ళు వెళ్ళాక ఊపిరి పీల్చు కున్నాము.
ఉండుండి వాంతులు అవుతుండటంతో, నీరసంతో లేవలేకపోవటంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.
రక్తపరీక్ష, మరికొన్ని పరీక్షలు చేసి రక్తంచాలా తక్కువగా ఉందనీ, ప్రోటీన్లు ఉన్న ఆహారం బాగా తీసుకోవాలని చెప్పి,నేను తల్లిని కాబోతున్నట్లు తెలిపారు.
ఆరాత్రి ఆయన నేను ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము.మొదట బాబు ఐతే బాగుంటుందని ఆయన అన్నారు.కానీ నేను పాప అయితే రకరకాల దుస్తులు వేసి ముచ్చట తీర్చుకోవచ్చుఅని నేనూ వాదించుకున్నాం . ఆఖరుకు నాతో ఏకీభవించారు.అంతే కాదు పాప పేరు పల్లవి అని నేను డిక్లేర్ చేసాను.పల్లవి పేరు చాలా బాగుంది అని అన్నారు.ఉదయమే అమ్మకు ఉత్తరం రాసాను.
అమ్మ జాగ్రత్తలు చెపుతూ సమాధానం రాసింది.
నాకు మరింత సంతోషకరమైన విషయం నా చిన్ననాటి స్నేహితులు,జానకీ, కుమారీ నాకు దగ్గరలోనే ఉండటం.మరీ చిన్నప్పటి స్నేహితురాలు లత కూడా ఇక్కడే ఉండటం వలన తరచు ఎవరో ఒకరితో రాకపోకలు ఉండటంవలన మనసు తీరా ముచ్చట్లు చెప్పుకోవటానికి అవకాశం దొరికింది.
మేము ఉన్న కాంపౌండులో రత్నం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం మరొక వెసులుబాటు.ఆ ఇంట్లోకి స్వాతి బలరాంగారి మిత్రుడు అద్దెకి దిగారు. అతనూ,భార్యలలిత మాత్రమే ఉండేవారు.లలిత కూడా నా వయసుదే కావటాన మేము మంచి మిత్రులం అయ్యాము.
ఇంట్లో చూస్తే యథాప్రకారమే.ఆయన తనబొమ్మలూ, మిత్రులు,సభలూ, సాహిత్యం తో బిజీ.పగలంతా కనిపించేవారుకాదు.రాత్రి కాసేపు కబుర్లు, తర్వాత అలసిపోయి నిద్రపోయే వారు.
ఒక్కోసారి ఆదివారం మాయింట్లో సాహిత్య సమావేశాలు జరిగేవి.కుందుర్తిగారు ఇతరకవులూ,కథకులూ వచ్చే వారు.వాళ్ళుకొత్తగా రాసిన కథో,కవితో చదివి,చర్చించుకునే వారు.నేను వారితో కలిసి కూర్చోలేకపోయినా,టీలో, టిఫిన్ లో అందిస్తూ వినేదాన్ని.అది నాకు ఎంతో సంభ్రమం గా ఉండేది.నా అభిప్రాయం కూడా పంచుకోవాలనిపించేది.
సమాజం తీరుతెన్నులు,సంఘర్షణలు పట్ల ఒకింత ఆవేశం, ఆక్రోశం కలగలిపి లయాత్మకంగా కవిత్వం చదివే విధానం నన్ను ఆకర్షించింది.పగలు ఖాళీలేకపోయినా ఏరాత్రి పూటో కవితా సంపుటి తీసి చదివేదాన్ని.విజయనగరంలో చదువుకునేటప్పుడు రాసినవే తప్ప మళ్ళా ఒక్క అక్షరం పేపరు మీద పెట్టలేక పోతున్నానని దుఃఖం వచ్చేది.
పెళ్ళి అయ్యాక ఇద్దరం చదివిన వాటిగురించి సాహిత్య చర్చలు చేసుకోవచ్చు అనుకుంటే ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడటానికే సమయం లేకుండా పోయిందని ఉసూరుమనిపించింది.
ఆ ఏడాది భారత స్వాతంత్ర్యరజతోత్సవం కావటంతో హైదరాబాద్ లోని ముఖ్యమైన భవనాలని దీపాలతో భలేగా అలంకరించారు.చీకటిపడిన తర్వాత చూడటానికి వెళ్ళాం.ఆ దీపకాంతులు మా జీవితం నిండా కూడా వెలగాలని ఆశించాను.
మళ్ళా అశనిపాతంలా నా పరీక్షా ఫలితాలు తెలిసాయి.నేను భయపడుతున్నట్లుగానే ఫిజిక్స్ లో ఫెయిల్ అయ్యాను.నిజానికి కెమిస్ట్రీ గురించి భయపడ్డాను కానీ అందులో బాగా వచ్చాయి,లెక్కలు సరేసరి మంచి మార్కులు వచ్చాయి.మా ఫిజిక్స్ ప్రాక్టికల్స్ సమయంలో " పెళ్ళైయ్యాక నీ చదువుమీద శ్రధ్ధ తగ్గిపోయింది.అందుకే వివాహం విద్యనాశాయః అన్నారు పెద్దలు" అంటూ ఫిజిక్స్ చెప్పే సీతాకుమారి గారు మందలించటం గుర్తు వచ్చింది.అప్పట్లో థియరీ లో ఫెయిల్ ఐనా, ప్రాక్టికల్స్ ఫెయిల్ ఐనా మొత్తం రాయాల్సిందే.చదువుకోవాలనీ, ఉద్యోగం చేయాలనీ నేను కన్ని కలలు నిలువునా కూలిపోయాయి.ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే నా ఆశలకు నీళ్ళు వదులుకోవల్సిందే.నాకు చదువు మీద ఉత్సాహం తగ్గిపోయింది.
"పరీక్షకు తిరిగి వెళ్ళేటట్లైతే మా తమ్ముడుకి పైసలు ఇచ్చి చలాన్ కట్టమను" అన్నారు.అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానేమో కోపం వచ్చి "పెళ్ళాం పనులు కూడా మీరు చెయ్యలేనప్పుడు పెళ్ళి చేసుకోవటం ఎందుకు?"అనబోయి మౌనం వహించాను.ఏమనుకున్నారో మళ్ళా తానే కట్టారు.కానీ ఏంలాభం పుస్తకం మాత్రం ముట్టుకోలేదు.నా చదువు అటక ఎక్కింది.
ప్రత్యేకించి మేమిద్దరమే చేసిన ఒక ప్రయాణం చెప్పుకోవాలి.వీర్రాజుగారి ఆత్మీయ మిత్రుడు కథక్ మిత్ర శంకరగుప్తంలో ఉంటారు.బాలమురళీకృష్ణ పుట్టిన ఊరు.ఆ ప్రయాణం తీరుచెప్పక తప్పదు.సెప్టెంబరు పదమూడున రైలెక్కి పద్నాలుగున ఉదయం పదిగంటలకి నిడదవోలు చేరాము.కథక్ మిత్ర పదకొండు కి స్టేషనుకువస్తే ఒంటిగంటకు మరో రైలెక్కి నరసాపురం చేరాం.అక్కడ రిక్షాలు లేవు. అక్కడ పడవెక్కి సఖినేటి పల్లెలో అనుకుంటా దిగాము.అక్కడనుండి బట్టీలంక వరకూ బస్సు.అయితే మొదటి బస్సు వీర్రాజు ఎక్కగానే కదిలిపోయింది.తర్వాతబస్సులో కథక్ మిత్రా,నేను ఎక్కాము.బస్సులో ఒక ఆమె ఎక్కడ దిగుతారు అని అడిగింది.నాకు తెలియదు అనేసరికి తెల్లబోయింది.ఈలోగా కథక్ మిత్రా,నేను మీరు,మీరు అని ఒకరినొకరం సంభోదించుకుంటూ మాట్లాడుకుంటుంటే మరింత ఆశ్చర్య పోయింది.పల్లెల్లో వారు మాకెందుకని ఊరుకోక అన్ని ఆరాలు తీస్తారని నవ్వుకున్నాను.బట్టేలంక లో బస్సు దిగి అప్పటికే ముందు బస్సెక్కి వచ్చిన వీర్రాజు గారిని కలిసాము.తర్వాత జట్కా లో ప్రయాణంచేసి,తిరిగి పడవలో రక్తకుల్య కాలువ దాటి శంకరగుప్తంలో వాళ్ళ ఇల్లు చేరాము.బాగా అలసిపోయి ఒళ్ళు ఎరగకుండా ఆ రాత్రి నిద్రపోయాను.
మళ్ళా ఇరవై ఏళ్ళకు ప్రజా జీవితంలోని మార్పులతో ఇన్ని వాహనాలు ఎక్కకుండానే తిరిగి ఆ వూరు వెళ్ళాము.ఆ అనుభవంతోనే 1997 లో " మార్పువెనక మనిషి" కథ రాసాను ఆ కథ ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి ఏడాది తెలుగు పాఠ్యాంశంగా పెట్టారు.
శంకరగుప్తంలో రెండు మూడురోజులు ఉన్నాక నన్ను విజయనగరం బస్సు ఎక్కించి వీర్రాజు హైదరాబాద్ వెళ్ళిపోయారు.
సెప్టెంబర్ నెలాఖరుకే విజయనగరం వెళ్ళాను.ఆ వారంరోజులైనా పరీక్షకి చదువుకుందామని.ఐతే హఠాత్తుగా మాపెద్దమామయ్య హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయారు.మా అమ్మకు పెద్ద ఆసరా ఆయనే.ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. బేంకులో పనిచేస్తున్న మామామయ్య ప్రతీ సంక్రాంతికి వంద కొత్తనయాపైసలను పాపిన్స్ పేకెట్ లా చుట్టి పిల్లలందరకూ ఇచ్చేవారు.వాటిని ఎంతో అపురూపంగా మేమంతా వాడుకునే వాళ్ళం.అవన్నీ గుర్తు వచ్చి మనసంతా భారమైంది.
చిన్నక్కకు డెలివరీ సమయం కావటంతో అమ్మ కోరుకొండ వెళ్ళింది.కానీ ఈ విషయం తెలిసి హుటాహుటిన విజయనగరం వచ్చేసింది. ఆ రోజు నాకు పరీక్ష. ఇంట్లో అందరూ మామయ్య ఇంటికి వెళ్ళారు.నేను పరీక్ష కు వెళ్తుంటే ఆ ఇంట్లోంచి బాజాలు వినిపిస్తున్నాయి.నాకు ఇష్టమైన మామయ్యని ఊర్లో ఉండి కూడా చూడలేకపోయాను. దుఃఖోద్వేగంతో పరీక్ష రాయలేక పోయాను.
సెప్టెంబర్ నెలాఖరులో చిన్నక్క కు పాపాయి పుట్టింది.నేను పరీక్ష రాసిన తర్వాత పెద్దక్క తో పాటూ కోరుకొండ వెళ్ళి చూసి వచ్చాను.
అక్టోబర్ 12న అన్నయ్య పెళ్ళి కుదిరింది.అమ్మ కోరుకొండ లో ఉండటంతో పెళ్ళి కోసమని ఇల్లంతా, ముఖ్యంగా అన్నయ్య గదిని శుభ్రంచేసాను.పెళ్ళి టైమ్ కి వీర్రాజు,చిన్నాడబడుచు వచ్చారు విశాఖ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్ళి జరిగింది అనంతరం విజయనగరంలో తోటలో విందు.అదిఅయ్యాక ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. అన్నయ్య వాళ్ళు పెద్దాపురం వెళ్ళి తిరిగి వచ్చే వరకూ సత్యవతిని నన్ను ఉండమని అమ్మ అనటంతో ఉండిపోయాము.
అన్నయ్యా,వదినా వచ్చిన తర్వాత నేనూ,మా ఆడపడుచు తిరిగి హైదరాబాద్ కి వచ్చేసాము.
డిసెంబర్ 7 నుంచి సమ్మెనుమొదలుపెట్టారు ఆంధ్ర ఎన్జీవోలు.ఈ సారి చాలా తీవ్రతరంగా జీతం కట్ చేస్తానన్నా చలించలేదు.వీర్రాజుకి ముఖచిత్రాల వలనా,కథలకు వచ్చే రెమ్యునరేషన్ వలనా అంత ఇబ్బంది లేకపోయినా చాలా జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది.దానికి తోడూ నిరంతరం వచ్చిపోయే బంధుమిత్రులు ఆర్ధికం గానే కాక శారీరకంగా కూడా అతలాకుతలం అయిపోయాం.
మధ్యతరగతి జీవితాల్లోని ఆర్థిక ఆటుపోట్ల వలన కలిగే ఒత్తిడులు కుటుంబ పెద్దగా ఇప్పుడు మరింత అవగాహన కలిగింది.
10, జనవరి 2023, మంగళవారం
భాషా వారధి కోడూరు ప్రభాకరరెడ్డి
,~~ భాషా వారధి కోడూరు ప్రభాకర రెడ్డి గారు ~~
ఆధునిక యుగంలో ఒక భాషలో చెప్పిన విషయాన్ని మరొక భాషలో చెప్పడం అనే ప్రక్రియ "అనువాదం" గా స్థిరపడింది.అనగా పునఃకథనం గా వ్యవహరించవచ్చు. భారతీయ భాషలనుండి, విదేశీ భాషల విశ్వసాహిత్యం నుండి తెలుగులోనికి ఆదాన ప్రదానాలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే తెలుగు భాషలోకి అనువాదాలు అయినట్లుగా, తెలుగు నుండి ఇతర భాషలలోని అనువదింపబడిన రచనలు తక్కువ అనే చెప్పక తప్పదు.
అనువాదం అంతసులువైన ప్రక్రియ కాదు.అనువాదాలు రాణించాలంటే అనువాదకునికి ఉభయ భాషా పరిజ్ఞానం తో పాటు జనజీవనవిధానాలూ, సాంస్కృతిక నేపధ్యం,వాతావరణం,ఆచారవ్యవహారాలు కూడా తెలిసిఉండాలి.
మూలరచనను యథాతథంగా తెలుగులోనికి తర్జుమా చేయడం ఒక పద్ధతి కాగా ఆ మూల రచన సారం చెడకుండా అనుసృజన చేయడం ఇంకొక పద్ధతి.
తెలుగు అనువాద సాహిత్యాన్ని స్థూలంగా రెండు భాగాలుగా విభజించవచ్చు. భారతీయ సాహిత్యం నుండి తెలుగుభాషలోనికి అనువాదాలు ఒక భాగం, విదేశీభాషా సాహిత్యం నుండి తెలుగులోనికి అనువాదాలు మరొక భాగం.
ఒకప్పుడు తెలుగునాట పత్రికలు యధేఛ్ఛగా రాజ్యమేలుతున్న కాలంలో అనువాద రచనలతో తెలుగు సాహిత్యం పరిపుష్టమైంది. మనకి పొరుగు భాషలైన తమిళ కన్నడాల నుంచే కాక, బెంగాలీ తదితర భారతీయ భాషలనించీ, ఆంగ్లం, ఫ్రెంచి, రష్యను ఇత్యాది ప్రపంచ భాషలనించీ కూడా తెలుగులోకి సాహిత్యం ప్రవహించి సాహిత్య పాఠకులకు వివిధప్రాంతాల సాహిత్యాన్నీ,సాహితీవేత్తల్నీ పరిచయం చేసింది.
జాక్ లండన్ కథలూ, అలెక్జాండర్ డ్యూమా, మార్క్ ట్వైన్, మాక్సిం గోర్కీల నవలలూ కథలూ ఇవి అసలు తెలుగులోనే రాశారేమో అనిపించేంత సహజంగా మనకి దగ్గిరయ్యాయి. శరచ్చంద్ర ఛటర్జీ,ప్రేమ్ చంద్, బంకించటర్జీ లైతే తెలుగువారేనేమో అన్నంత సాన్నిహిత్యం తెలుగు పాఠకులకు ఏర్పడిపోయింది.
తెలుగువాళ్లు అనువాదాలను ఎప్పుడూ ఆదరించారు,ఆనందిస్తూనే ఉన్నారు. 1950లలోనే ఆంధ్రపత్రిక వీక్లీ ప్రసిద్ధ ఆంగ్ల, ఫ్రెంచ్ నవలలను తెలుగులోకి అనువదింప చేసింది.సోవియట్ లాండ్ ప్రచురణలుగా రష్యన్ రచనలు తెలుగు పాఠకులకు దగ్గరయ్యాయి.
అనువాదాల వలనే సాహిత్యం ఆలంబనగా భిన్న మానవ సమాజానికి దగ్గరవుతుంది.
తమిళంలో శరత్ నవలలు, రవీంద్రుడి నవలలు తప్ప యితర భారతీయ భాషల్లోని రచనలను తమిళులు ఎక్కువగా ఆదరించినట్లులేదు.కానీ తెలుగు వాళ్ల లాగానే కన్నడం వాళ్లు అనువాదాలను ఆమోదిస్తారు. అనువాద కథలే ప్రధానంగా నడిచే ''విపుల'' వంటి తెలుగు పత్రిక కూడా మనకి పలు భాషా రచనల్ని అందుబాటులోకి తెచ్చింది .
ఇంగ్లీషు మన మాతృభాష కాదు కనుక, ఇంగ్లీషు వాళ్లు మన భాష నేర్చుకుని అనువాదాలు చేయాలంటే అది ఎప్పటికోగాని సాధ్యంకాదు ఇంగ్లీషులో ఫిక్షన్ రాసే తెలుగువారు ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువాదాలు చేస్తే అవి బాగుంటాయి. ఇంగ్లీషు వచ్చినంత మాత్రాన అనువాదానికి ఉపక్రమిస్తే పఠనీయత వుండదు.
ఇతర భాషల్లో నుంచి అనువాదం చేసేటప్పుడు నుడికారం గురించి, నేటివిటీ గురించి చాలా జాగ్రత్తగా వుండాల్సి ఉంటుంది.అందులోని భావాన్ని గ్రహించి తెలుగువాడైతే ఎలా రాస్తాడు అనుకుని ఆ ధోరణిలో రాయాల్సి ఉంటుంది. అది ఒక కష్టమైన ప్రక్రియ. ఆంగ్లంలో చదవగలిగే విద్యావంతులు పెరగటం వలన తెలుగులో రానురాను అనువాదాలకు ఆదరణ తగ్గింది.
మూలకథాంశం,దాని మూలతత్వం,,పాత్రలస్వభావం వీటినన్నింటినీ,మూలరచనకు భంగం కలగకుండా,మూలరచయిత ఆత్మను పట్టిచూపేలా రాయటం కత్తిమీదసామే. అనేక మంది అనువాదం , అనుసృజన చేసారు.కానీ మూలరచనతో వాటిని పోల్చటానికి వీలు లేకుండా అనువాదకులు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రభాకర రెడ్డి గారు వృత్తిరీత్యా శిశువైద్యులు.ప్రవృత్తి రీత్యా సాహిత్యోపాసన చేస్తూ అనేక గ్రంథాలు వెలువరించారు. ఆంధ్ర, ఆంగ్ల,హిందీ,సంస్కృతభాష ల్లో నిష్ణాతులు కావటాన అనువాద ప్రక్రియలో, శైలిలో డా.ప్రభాకరరెడ్డిగారు మెచ్చుకోదగిన ప్రతిభ కనబరుస్తున్నారు.
తెలుగు కథల పేర్లు మూల కథల పేర్లకి డైరెక్టు అనువాదాలుగా కాక, కథా వస్తువుని సూచించే విధంగా, సహజంగా, ఆర్ద్రతతో, కొండొకచో చమత్కారంతో పేర్లు పెట్టటంలో రచయిత అభివ్యక్తి తేటతెల్లమౌతోంది. చాలా వరకూ కథనం, సంభాషణలూ సహజమైన భాషలోనే ఉన్నా, అక్కడక్కడా అనువాదకుడు ఆంగ్ల వాక్య నిర్మాణపు మోహంలోకి చిక్కిపోతారు. కాకపోతే, కథా వస్తువులన్నీ సార్వజనీనమైన అనుభవాలే కావటంతో, ప్రత్యేక ప్రాంతీయ విశేషాల్నీ ఆచార వ్యవహారాల్నీ వివరించాల్సిన అదనపు బాధ్యత లేదు అనువాదకుడికి.
తనకి అపరిచితమైన సంస్కృతులనించి వచ్చిన కథలనైతే తర్జుమా చెయ్యటంలో అనువాదకుడు కొంత అధిక పరిశ్రమ చెయ్యాల్సి ఉంది.
అందులోనూ సాహిత్యరంగంలో అనేకమంది కథకులను ప్రభావితం చేసినటువంటి ప్రపంచ సాహిత్యం లో సుస్థిర స్థానం గల ఓ హెన్రీ కథల్ని అనువదించడం ఒక సాహసమే.ఓహెన్రీ కథలోని సామాన్యమైనవిగానే కనిపించే పాత్రలు పాఠకులను ఆకట్టు కుంటాయి.పాత్రలచిత్రణ,చిరుహాస్యం,పఠనీయత, శైలీ విన్యాసం,సరళమైనపదాల రచనా విధానం, ఊహకందని ఆశ్చర్యం గొలిపే మలుపులు, అన్నింటినీ మించి కొసమెరుపుతో కథలన్నీ కథానికా రంగంలో ఉన్నతస్థానాన్ని అలంకరించాయి.అటువంటి ఓహెన్రీ కథల్ని అంతే స్థాయిలో అంతేశ్రథ్థతో తేలికైన సరళ వచనంలో అనువదించారు రెడ్డి గారు.
The last leaf (శేషపత్రం),The Green Door (ఆకుపచ్చ తెలుపు)The Gift of the Magi(క్రిస్మస్ కానుక)వంటి కథలు తెలియని వారు వుండరు.
అదేవిధంగా కీట్స్ కవితల్ని పద్యరూపంలో అనువదించారు.పద్యరచన చేయాలంటే పదాలకూర్పు, అలంకారాలు,రమణీయత,శైలి విషయాల్లో ప్రభాకర రెడ్డి గారు మరింత జాగ్రత్త తీసుకొని రాయటం గమనించవలసిన విషయం.
కీట్స్ తన ఆలోచనలకు అక్షరరూపం కల్పిస్తాడు. ఆ ఆలోచనలనూ అందులోని అనుభూతులూ అందిపుచ్చుకొని ఛందోబద్ధమైన అనుసృజన చేసారు రెడ్డి గారు.
To solitude (ఏకాంతవాసం)కవితలో తన వ్యాకులతని, గ్రామీణ ప్రాంతాలకు పారిపోవాలనే కోరికను,తనతో పాటూ తనని అర్థం చేసుకొనే ఒకతోడుకోసం పడే ఆరాటాన్ని వ్యక్తీకరించారు కీట్స్.
" ఒంటిగా నున్న మాతోడ నున్న యెడల
ఎంతబాగుండునోయి ఏకాంతవాస-"
అంటూ మూలకవి హృదయాన్ని పంచుకున్నారు రెడ్డి గారు.కవిగా కీట్స్ విషయాసక్తిని హృదయంగమమైనదిగా భావించి సరియైన భావచిత్రాలను ఉపయోగించి తనదైన ప్రకృతిసహజశైలిలో అనువదించారు.
ప్రపంచ సాహిత్యంలో దారిదీపం వంటి షేక్స్పియర్ కొరుకుడు పడని బ్రహ్మపదార్థం వంటి "ది సానెట్స్" ను రాసాడు.ఆనాటి ఉత్తమ గ్రంథాలులో ఒకటిగా ప్రముఖులచేత ప్రశంసించ బడిన 154 సానెట్స్ ను చిక్కని భావచిత్రాలతో తెలుగు దేశీఛందస్సు అయినా సీసపద్యాలలో అనుసృజన చేయడమే కాకుండా ప్రతీసానెట్ కీ లఘుటీక జోడించడం సాహసమే కాక అత్యంత ప్రయాసతో కూడిన కార్యం. షేక్స్పియర్ సానెట్స్ ( భావచిత్రాలు) గ్రంథరూపం దాల్చడానికి రెడ్డిగారి సోదరుడు కోడూరు పుల్లారెడ్డి గారి ప్రోత్సాహం మే కారణం అంటారు.
" మరణమందిన వారలు మరుగు పడిన
ఇంపులొల్కు కవితల కీర్తించబడుచు
మరల పుట్టిన యంతటి వరకు నాదు
ఉత్తమకవితల బ్రతికి యుందురోయి" అంటూ కవిత గొప్పదనాన్ని ఒక సానెట్ లో ప్రస్తుతించారు.
ప్రభాకర రెడ్డి గారు అనువాదాలలో అవసరాన్ని బట్టి దేశీయ ఛందస్సు ను ఉపయోగించినా యథాతథంగా మూలరచనలోని పదాల్ని దృష్టిలో వుంచుకుని పదలాలిత్యాన్ని మరుగు పడనీకుండా,అర్థం చెడకుండా ఛందస్సులో బంధించటం అంత సులభమేమీ కాదు.పలుభాషా స్వాధీనత గల ప్రతిభావంతులైన ప్రభాకర రెడ్డి గారి అనువాద గ్రంథాలు చదివిన వారికెవరికైనా వారి భాషా పటిమ అర్థమౌతుంది.
ప్రభాకర్ రెడ్డి గారికి ప్రాచీన ఆంగ్ల సాహిత్యం పైమక్కువ, గౌరవం ఉంది,వాటిని తెలుగు ప్రజలకు అందించాలనే ఆతురతా ఉంది,రెండు భాషలపై అభివ్యక్తి ఉంది ఇన్ని భావాలు మధ్య వారి మనసు పెట్టే ఘోష వారిని ఇన్ని అనువాదాలు చేసేలా చేసింది.
ఆంగ్ల సాహిత్యం లో ఎన్నదగిన రచయితల సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చిన కోడూరి ప్రభాకర రెడ్డి గారికి తెలుగు సాహితీరంగం పక్షాన నమోవాకాలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)