7, ఫిబ్రవరి 2023, మంగళవారం
నడక దారిలో -23
నడక దారిలో --23
అమ్మ వెళ్ళిన తర్వాత పాప పనితో , ఇంట్లో పనితో తీరిక లేకుండా అయ్యింది.దాంతో పూర్తిగా పుస్తకాలకు దూరం అయ్యాను. నా నా లోకం అంతా పాపే ఆక్రమించింది.
కానీ బలహీనంగా ఉండటం వలన తరుచూ అనారోగ్యం తో బాధపడేది.ఏ రోజైనా అనారోగ్యం తో ఏడుస్తుంటే విలవిలలాడిపోయేదాన్ని.నవ్వుతుంటే పులకించిపోయేదాన్ని.
రాత్రి పూట పాప పక్కనే పడుకుని నాకు వచ్చిన జోలపాటల్ని సన్నగా పాడుకుంటూ నిద్రపుచ్చుతూ ఉండేదాన్ని.నా కంఠం మళ్ళా మంద్రంలో శృతి చేసుకోవటం మొదలెట్టింది.
వీర్రాజు గారు చిత్రరచనల్లో మమేకం అయినా,సభలకు వెళ్ళినా,సినీమాలకు వెళ్ళినా పట్టించుకునేదాన్ని కాదు.పాప ధ్యాసలో పడి తనను పట్టించుకోవటం లేదని అప్పుడప్పుడు మూతి ముడుచుకున్నా పాప కేరింతలు వినేసరికి మురిసి పోయేవారు. అందులోనూ పెళ్ళి సమయానికి నాకోసం రాస్తానన్న దీర్ఘ కావ్యం పాప పుట్టేలోపున కూడా పూర్తికాలేదని రాసే పనిలో తలమునకలుగా ఉన్నారు.
వీర్రాజుగారు నాకే అంకితం చేయాలనుకుంటూ రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “పుస్తకాన్ని యువభారతి ప్రచురించింది. ఏప్రిల్ నాలుగో తేదీ ఉగాది రోజున జరిగిన ఆ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.
వేదిక మీద ఆయన దీర్ఘ కావ్యం గురించి అందరూ ప్రశంసిస్తుంటే ఆనందంతో పొంగిపోయాను.కానీ ఎందువలనో మరి వీర్రాజు గారు చాలా మందికన్నా ముందే వర్ణనాత్మకమైన అభ్యుదయ దృక్పథంతో రాసిన మళ్ళీ వెలుగు దీర్ఘ కావ్యంకి రావలసినంత గుర్తింపు రాలేదనే అనుకుంటున్నాను.
ఆషాఢమాసంలో వదిన పుట్టింటికి వెళ్ళిందని,కడుపుతో ఉన్నప్పుడు గానీ,పాప పుట్టాక గానీ నా చేత్తో తృప్తిగా వండిపెట్టలేకపోయాననీ, ఇప్పుడు వీలుంటే ఒక పదిరోజులు రమ్మనీ అమ్మ ఉత్తరం చిన్నక్క తో రాయించింది.
నాకు కూడా వెళ్ళాలని మనసైంది.సరేనని చంటిపాపతో ఒక్కదాన్నీ వెళ్ళలేనని కుమారీ వాళ్ళ ఆడబడుచూ,మామగారూ వైజాగ్ వెళ్తుంటే వారితో కలసి విజయనగరం వెళ్ళాను.
ఒకరోజు కోరుకొండకి వెళ్ళివచ్చాను.మరోరోజు రాజీఇంటికి వెళ్ళాను అయితే రాజీ ఇంటికివెళ్ళటం అదే ఆఖరు సారి.ఎందుకంటే రాజీ లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు స్పాట్ వేల్యూయేషన్ కి హైదరాబాద్ వస్తుండేది.ఆసమయంలో ఒకటి రెండుసార్లు మాయింటికి వచ్చేది.
ఆమె నాకు 9వ తరగతినుండి డిగ్రీవరకూ క్లాస్మేటే కాక హైద్రాబాద్ వచ్చాక కూడా 1975 వరకూ మంచి స్నేహితురాలు .ప్రేమలో పడితే ఇంట్లో వాళ్ళే ఆమెకు అంక్షలు పెట్టేరు. ఆమె నేటీకి అవివాహితురాలుగా వుండిపోయింది.ఉత్తరాలద్వారా ఆమెను ప్రేమకీ,పెళ్ళి కీ ప్రోత్సహించాననీ, నేనే తనని చెడు ఆలోచనలు నేర్పించాననీ స్త్రీ స్వేచ్ఛని నేర్పుతున్నానని వాళ్ళనాన్న భావించి నానుండి ఆమెకు వుత్తరాలుగానీ,కనీసం గ్రీటింగ్ కార్డ్స్ గానీ వస్తే తీవ్రపరిణామాలు వుంటాయని మా వీర్రాజు గారికి హెచ్చరికగా వుత్తరం రాసాడు.. ఆమె నేటికీ అవివాహితురాలుగానే వుండిపోయింది.ఆంక్షలు పెట్టిన ఆమె తండ్రి చనిపోయినా కూడా నాతో స్నేహాన్ని పునరుద్ధరించలేదు.ఎందుకిలా మధురమైన బాల్యస్నేహాన్ని కత్తిరించేసి దూరం అయ్యావని ,మనం కలిసిమెలిసి కలబోసుకున్న కబుర్లు గుర్తులేదా అని అడగాలని నామనసు నన్ను నిత్యమూ తొలిచేస్తూనే ఉంటుంది.
ఆమెపై ఒక కథ,ఒక కవితా కూడా రాశాను.
కుమారీకి కూడా బాబు పుట్టాడు.తనని కూడా కలిసాను. అయితే ఉష మాత్రం వివాహం కావటంతో విజయనగరంలో లేదు.ఇలా నాలుగు రోజులు అందర్నీ కలిసినా , కబుర్లు చెప్పుకుంటున్నా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎందుకో పూర్వంలా నా ఇల్లు లా అనిపించలేదు.చుట్టపు చూపుగా వచ్చినట్లే అనిపించింది. పెళ్ళి కాగానే ఆడపిల్ల పుట్టింటికి అతిథి అనేమాట నిజమే అనిపించింది.
హైదరాబాద్ వచ్చాక మళ్ళా బిజీ అయిపోయాను.వెచ్చాలు తీసుకునే షాపులో అరువు అమాంతం పెరిగిపోయింది.ఆ షాపులో మొత్తం తీర్చేసి ఇంకెప్పుడు మా పేరిట సరుకులు అరువు ఇస్తే నాకు పూచీ లేదని ఫస్ట్ తేదికి డబ్బు ఇచ్చే తీసుకుంటామని చెప్పాను.
చవకలో బట్ట కొని పాపకి రకరకాలుగా ఫ్రాకులు కుట్టి వాటికి ఎంబ్రాయిడరీ చేయటం, ఇంటిపనులు,వచ్చే పోయే అతిథులూ వీటితో నేను సాహిత్యం, డ్రాయింగ్ అన్నీ వదిలేసి అచ్చమైన గృహిణిగా మారిపోయాను.
ఇంట్లో ముగ్గురు మొగవాళ్ళు ఉన్నా ఇంటికి సంబంధించిన కూరలో,వెచ్చాలో మరే ఇతరపనో చేయటానికి ఎవరూ కదలరు.'మల్లేష్ వస్తే తీసుకురమ్మని చెప్పు' అనేవారు అందరూ.
వీర్రాజుగారు 1962 లో అనారోగ్యంతో ఆరునెలలు హాస్పిటల్ లో ఉన్నప్పుడు తోటి పేషెంట్ మల్లేష్ . ఎక్కడి రుణానుబంధమో అప్పటి నుండీ ఈయనకి మరో తమ్ముడయ్యాడు.ఏ పని చెప్పినా కాదనడు.
మనపని మనం చేసుకోకుండా మరొకరిపై ఆధారపడటం నాకు నచ్చేది కాదు.అందుకని అనేక సార్లు నేనే చేసుకునేదాన్ని.పాప పుట్టాక ఒక్కొక్క సారి కష్టం అయ్యేది.
ఒకసారి నేను ఏదో పనిలో ఉన్నప్పుడు మా పెద్దమరిది "వదినా మీ అల్లుడు వచ్చాడు "అని కేక వేసాడు.
ఇప్పటిలా ఆంటీ, అంకుల్ కాకుండా అప్పట్లో కాంపౌండు లోని పిల్లలు అత్తయ్య, మామయ్య అనే పిలిచేవారు.ఏదో అవసరం కోసం వచ్చారేమోనని వంటింట్లోంచి కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చాను.గుమ్మంలో ముష్టివాడున్నాడు.నాకు పట్టరాని కోపం వచ్చింది.ముష్టివాడిని పొమ్మని,మరిది మీద విరుచుకు పడ్డాను."అవేం మాటలు.ఇస్తే ఏదో ఇచ్చి పంపు.ఆ మాటలు ఏమిటి?" అంటూ.
అదే విధంగా మరోరోజు పాపకి స్నానం చేయించి
ముస్తాబు చేయిస్తున్న సమయంలో డైరీపాలబాటిల్స్ తీసుకువచ్చిన అబ్బాయి వస్తే బాటిల్స్ తీసుకుంటూ మా ఆడబడుచు ఆ అబ్బాయితో " మా పాపని పెళ్ళి చేసుకుంటావా?" అంది.ఆ అబ్బాయి ముసిముసిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు.దాంతో నాకు పిచ్చి కోపం వచ్చింది."కావాలంటే నీ పిల్లల్ని ఇచ్చి చెయ్.నా పాప గురించి ఇలాంటి మోటు సరసాలు ఆడేటట్లైతే ఊరుకునేది లేదు"అన్నాను.
ఆమె ముఖం మాడ్చుకొని "సరదాగా అంటే ఏమైంది"అంది.
"ఆరు నెలల పిల్లని పట్టుకుని ఆ మాటలేంటి?నాకు అలాంటి మోటు సరదాలు,సరసాలూ నాకు నచ్చవు.ఇంకెప్పుడూ నా ఎదురుగా అలా మాట్లాడకు" అని వార్నింగ్ ఇచ్చాను.
ఇవన్నీ వీర్రాజు కు చెప్పాలనిపించినా ఇష్టం లేక డైరీలోనే నాబాధని ఒలకబోసుకుని దాచుకున్నాను.
నవంబర్లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తరపున రచయిత్రుల మహాసభలు జరిగాయి.సభ ప్రారంభం భానుమతి చేసింది.ఆమె మాటతీరు చాలా అహంకారం గా అనిపించింది.ఐతే రచయిత్రి గానే కాకుండా అటు సినిమా
రంగంలో కూడా ఒక వెలుగు వెలుగుతోంది.సినీపరిశ్రమలో నెగ్గుకు రావాలంటే అలాంటి డామినేటింగ్ స్వభావం ఉండాల్సిందే.బహుశా అందుకే అలా తనని మలచుకొని ఉండొచ్చేమొ అనిపించింది.తర్వా బాలానందసంఘంచేత తురగా జానకీరాణి గారి నేతృత్వంలో నాటిక వేయించారు.అంతేకాకుండా జానకీరాణి గారు స్వయంగా "భువనేశ్వరా" అనే రవీంద్రగేయంకి గ్రూప్ డాన్స్ చేసారు.ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మగారి అధ్వర్యంలో కవిసమ్మేళనం జరిగింది.కంచుకంఠంతో ఆమె పద్యాలు చదువుతుంటే అంతా నిశ్శబ్దంగా విన్నారు.రెండోరోజు కార్యక్రమం కి నేను వెళ్ళలేకపోయాను.మర్నాడు ముగింపు సమావేశంలో లత పొగరు గా మాట్లాడుతుంటే చిరాకు అనిపించింది.ఆ సభలో ఒక పాఠకురాలు లేచి ప్రశ్నలు సంధించింది.ఆ సభలో కొంత గందరగోళం ఏర్పడింది.
సంక్రాంతికి కాంపౌండులో వాళ్ళని పిలిచి పాపకి భోగీపళ్ళు పోసాను.నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలకొలువు పెట్టాలని కోరిక.అందుకని సరదాగా చిన్నగా బొమ్మలకొలువు కూడా పెట్టాను.
అనేకానేక కలలూ,కలతలూ,కన్నీళ్ళూ,ఆనందాల కలగలుపు తోనే పాపకి ఏడాది నిండింది.మొదటి పుట్టినరోజు చేయాలని అందరూ నిర్ణయించుకుని చిన్నగా పార్టీ ఇచ్చాము .
అప్పుడే పెద్దక్క నుండి ఒక ఉత్తరం వచ్చింది."మరో బిడ్డ కోసం మూడు నాలుగేళ్ళు విరామం తీసుకోకుండా ఎందరు కావాలనుకున్నారో నిర్ణయించుకోండి.ఆ తర్వాత నువ్వు నీ అభిరుచుల పట్లా శ్రద్ధ పెట్టొచ్చు"అని రాసింది.
కానీ ఈ పిల్లనే నేను కోరుకున్న విధంగా పెంచగలనా అనే పరిస్థితిలో మరొకరిని ...ఊహూ నాకు ఊహించే ధైర్యం చాలలేదు.
ఎన్నో ఆశలతోఎన్నో కలల్తో తొందరపడి ఈబంధంలోకి నాకైనేనే ఇరుక్కున్నాను. అభిరుచులు అన్నింటినీ మర్చిపోయాను. చెమ్మగిల్లిన కళ్ళల్లోంచి మసకబారిన నాఆశలన్నీ కన్నీరుగా తొలగించడంలో ఇంకిపోతూనే ఉన్నాయ్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి