8, ఫిబ్రవరి 2023, బుధవారం

పంజరాలు

పంజరాలు విచ్చీవిచ్చని చిరువెలుతురు లోంచి చిక్కని మంచుతెరల్లోంచి ఆలోచనలగుర్రాన్ని తోలుకుంటూ రాత్రంతా నిద్రపోకుండా మర్నాడు విచ్చుకోబోయే వెలుగు రేఖల్ని వెతుకుతూ వెతుకుతూ తిరిగాను ఇంతకాలపు నిరీక్షణల వెతుకులాటలో మధుర ఫలపుష్పశోభితంగా చూపాల్సిన హృదయం స్ఫటికంలా గతకాలపు చిత్రాల్నీ విరిగిన కలల చీలికలనూ ప్రతిబింబించింది రెపరెపలాడుతూ కదులుతున్న రెప్పల చప్పుడు ఎక్కడో వినిపించింది మనసు కిటికీ లోనుంచి తలదూర్చి చూపుల్తో వెతుక్కుంటున్నాను అంతటా వేనవేల పక్షులు రంగురంగులవీ దిగులు ముఖాలవీ కూతలు మర్చిపోయినవీ రెక్కలు కత్తిరించబడినవీ తోకలు ఉత్తరించబడినవీ ఎగరలేని అసహాయతతో దిగులు జారుతున్న కళ్ళతో ఇంట్లో వేనవేల పక్షులు సంప్రదాయ పంజరంలో --- అందానికి కొలబద్దలతో శరీరాన్ని రకరకాలుగా చెక్కుకొని కన్నీటి బిందువుల్ని సైతం ముత్యాల్లా అలంకరించుకుని అందాలలోకంలోనే ఆనందాన్ని ప్రదర్శిస్తూ ముక్కుకి ప్లాస్టిక్ చిరునవ్వు వేలాడేసుకుని బయట వేనవేల పక్షులు సౌందర్యపంజరంలో --- ఇంకా ఇంకా చెక్కుకుంటూ అతికించుకుంటూ కత్తిరించుకుంటూ వ్యాపార మోహపంజరాలలో ఇంకా ఇంకా కూరుకుపోతూ వాళ్ళూ మూఢవిశ్వాసాల ఊచల్ని వంచేయాలనే ప్రయత్నంలో మేము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి