28, డిసెంబర్ 2024, శనివారం
నడక దారిలో -47
నడక దారిలో --47
స్కూల్ తెరిచిన రోజు యథావిధిగా స్కూలుకు వెళ్ళాను. అప్పట్లో లేండ్ లైన్లు ఫోన్లే కనుక కబుర్లన్నీ స్కూల్స్ తెరిచినప్పుడే.బాగా ఆత్మీయ మిత్రులు మాత్రమే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం.
వచ్చిన రోజే మా హెచ్చెమ్ " సుభద్రా నీకు ఇన్కమ్ టాక్స్ అయిదువేల పైన పడింది.నేను కట్టేసాను.నువ్వు నాకు ఇవ్వాలి" అంది.
నాకు వచ్చే జీతం కనీసం పదిహేను వేలు కూడా లేదు.ఎప్పుడు టాక్స్ బ్రాకెట్ లోకి రానిది ఈ సారి రావటమేంటి . ఆశ్చర్యం వేసింది అదే అడిగాను.అంతే కాక ఎల్ ఐసీ కట్టిన రసీదులు కూడా ఇచ్చాను కదా.అని అన్నాను.
" అమెరికా వెళ్ళొచ్చావు కదా.విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి పడుతుంది" వెటకారం పెదాలు చివర మెరుస్తుంది .కంఠంలో అసూయ కూడా కదిలింది.ఆమె తప్ప మరెవ్వరూ వెళ్ళటం భరించలేనితనానికి ఆశ్చర్యం కాదు అసహ్యం కలిగింది.నేనేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను.
మాటిమాటికీ తాను కట్టిన ఇన్కమ్ టాక్స్ గుర్తు చేస్తుండటంతో అయిదు వేలు తీసుకెళ్ళి ఆమెకు ఇచ్చేసి బ్రాహ్మణికి దానం చేసాను అనుకున్నాను.
నాకు బదులుగా నేను స్కూల్లో చేర్చిన కల్పనని నేనే జీతం ఇస్తూ మరికొన్నాళ్ళు కంటిన్యూ చేసాను.
మూడేళ్ళ క్రితం చనిపోయిన పెద్ద మరిది రెండవ కూతురు మళయాళీనాయర్ల అబ్బాయిని ప్రేమించానని చెప్పటంతో పెళ్ళిఏర్పాట్లు మొదలయ్యాయి.అమ్మాయికి పెళ్ళి బట్టలు, కొద్దిపాటి బంగారం,పెళ్ళి భోజనాల ఖర్చు మేము భరించేలా నిర్ణయించుకున్నాము.మళయాళీ పద్ధతిలోనే పెళ్ళి జరిగింది.నా తరపున పెద్దక్క వాళ్ళూ వచ్చారు.ఒక బాధ్యత తీరినట్లే.సర్వే ఆఫ్ ఇండియాలో పెద్దమ్మాయికి ఇంకా వాళ్ళ నాన్న వుద్యోగం సేంక్షన్ కాలేదు.మూడో అమ్మాయిని మల్కాజిగిరి లోని కస్తూర్బా కాలేజీలో బీకాంలో నేనే దగ్గరుండి చేర్పించాను.
వీర్రాజు గారు వచన కవిత్వం లో రాస్తున్న ఆత్మకథను పూర్తిచేసి "పడుగు పేకలమధ్య జీవితం " పేరుతో పుస్తకం వేసారు.డా.భార్గవీరావు,ఆమె సహోద్యోగి డా.పోపూరి జయలక్ష్మి గారూ ఇద్దరూ కలిసి నా " యుద్ధం ఒక గుండె కోత" ను ఇంగ్లీష్ లోకి అనువదించడానికి పూనుకున్నారు.ఏవైనా సందేహాలు వేస్తే ఫోన్ లో నివృత్తి చేసుకొని మరీ చేయటం మొదలెట్టారు.
పల్లవి మామగారికి ఆంజియో ప్లాష్టీ ఆపరేషన్ చేయించుకొవాలని హైదరాబాద్ వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ మా ఇంట్లోనే దిగారు.ఆయన చెల్లెలు ఏ.ఎస్ రావు నగర్లో వుంటుంది.కానీ నిమ్స్ కి వెళ్ళటానికి మా ఇల్లైతే వీలుగా వుంటుందని వచ్చారు.
ముందు చెకప్ కోసం వాళ్ళిద్దరితో వీర్రాజు గారు వెళ్ళారు.మర్నాడు నిమ్స్ లో జాయిన్ అవుతే అన్ని టెస్టులకు చేయాలన్నారు.వాళ్ళిద్దర్నీ వీర్రాజు గారు చేర్పించి వచ్చారు. ఆపరేషన్ రోజు నేను కూడా స్కూల్ కి సెలవు పెట్టి వెళ్ళాను.
తర్వాత వారంరోజులు. హాస్పిటల్ లోనే వున్నారు.రోజూ సాయంత్రం వీర్రాజుగారితో పాటూ నేనూ వెళ్ళే దాన్ని.అప్పట్లో హాస్పిటల్ లో రోగికి గానీ,సహాయకులకు గానీ భోజనం సదుపాయాలు వుండేవి కాదు.అందువలన ఉదయం కూడా వీర్రాజు గారు టిఫిన్ తీసుకుని వెళ్ళేవారు.తర్వాత వారానికి రివ్యూ చెకప్ కి రమ్మనటంతో మళ్ళీ మా ఇంటికే వచ్చి చెకప్ అయ్యాక చెల్లెలింటికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని విజయనగరం వెళ్ళిపోయారు.దాంతో వాళ్ళు ఉన్నన్ని రోజులూ తీరిక లేనట్లు అయ్యింది.
అప్పట్లోనే పల్లవి వాళ్ళు ఇక్కడ ఫ్లాట్ కొనబోతున్నట్లు తెలిసి ఇక్కడెందుకు కొనటం అని విసుక్కున్నారు.అది గమనించి వీర్రాజుగారు కూడా మనమే ఇక్కడ కొనిపించుతున్నామని పల్లవి మామగారు భావిస్తున్నారు ఏమో అని బాధ పడ్డారు.
నా ప్రమోషన్ పేపర్లు పంపారు కానీ ఫైల్ సమగ్రంగా లేదనో ఏవో ఆటంకాలు కలిగిస్తున్నట్లు తెలిసింది.స్కూల్లో కూడా నాకు పోటీగా కొత్తగా జాయిన్ అయిన సోషల్ సార్ నీ,నా స్నేహితురాలు ఉమారాణీని ఆ పోష్టు తమకు రావాలని నాపైకి ఎగసిన తోయడానికి మా హెచ్చెమ్ ప్రయత్నం చేస్తూనే వుంది.కాని నేను అందులో తలదూర్చ కుండా నాపనేదో నేను మౌనంగా చేసుకుంటూ పోయేదాన్ని.
వీర్రాజు గారూ,బాలాజీ ప్రెస్ బాల ప్రసాద్ పల్లవి వాళ్ళ కోసం సరూర్ నగర్ లో కొన్న అపార్ట్మెంట్ లో పాలరాతి ఫ్లోరింగ్ వుడ్ వర్క్ దగ్గరుండి పర్యవేక్షించే వారు.మెయిన్ ద్వారం తలుపును తీసేసి మా ఇంటికి చేసిన సిద్ధిరాములుతో కార్వింగ్ చేయించడానికి ఇచ్చారు.అక్కడ తీసేసినా తలుపును కూడా ఆ తర్వాత కార్వింగ్ చేయించి పల్లవి మామగారికి పంపించారు.
ఒక రోజు పేపర్ చదువుతుంటే ఒక వార్త ఆకర్షించింది.ఒక ఎన్నారై తన తండ్రి స్థిరఆస్తి డిస్ప్యూట్ లోకి వెళ్ళటంతో న్యాయ బద్ధంగా ప్రయత్నాలు చేసినా పని జరగలేదు.దాంతో ఒత్తిడికి గురై డైరెక్ట్ గా సి.ఎమ్ పేషీకి మెయిల్ చేసాడట.తన సమస్య పరిష్కరించ బడిందని చెప్తూ టెక్నో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడుని అభివర్ణిస్తూ ధన్యవాదాలు చెప్పాడు.అంతే కాదు ఆ వార్తలో సి.ఎమ్ పేషీ మెయిల్ ఐడి కూడా వుంది.
వెంటనే అది నోట్ చేసుకున్నాను.
ఆ రాత్రి కంప్యూటర్ తెరిచి నేను గత ఏడాది గా ప్రతీ మూడునెలలకూ మా స్కూల్ కరెస్పాండెంట్ దగ్గరనుండి విద్యాశాఖాధికారులందరికీ రిజిస్టర్ పోష్టులో పంపించే ఉత్తరాన్ని జాగ్రత్తగా టైప్ చేసి,అంతకు ముందు ఎవరెవరికి పంపించే దాన్నో వారి వివరాలు కూడా త్రూప్రోపర్ ఛానల్ గా (ఆ ఆఫీస్ మెయిల్ ఐడీ లు తెలియదు కనుక)ఆ ఉత్తరం కింద రాసి సి.ఎం పేషీ మెయిల్ ఐడీకి పంపించాను.ఈ విషయం వీర్రాజుగారికి మాత్రమే చెప్పాను.
ఆ మర్నాడు స్కూల్ నుంచి వచ్చాక పల్లవికి ఎప్పటిలా ఒక మెయిల్ రాయాలని నా మెయిల్ బాక్స్ తెరిచాను. ఆశ్చర్యం!! సి.ఎం.పేషీ నుండి నా మెయిల్ ను త్రూ ప్రోపర్ ఛానల్ అని నేను క్రింద ఇచ్చిన వాళ్ళు అందరికీ నా మెయిల్ ఫార్వర్డ్ చేసామని సమాధానం నాకు వచ్చింది.వీర్రాజుగారికి చెప్తే ఆయన కూడా ఆశ్చర్యపోయారు.పదిపన్నెండేళ్ళక్రితమే వీర్రాజు గారు రిటైర్ అయిపోయారు.ప్రభుత్వాలు రెండుసార్లు మారాయి.పేషీలో ఎవరితోటి పరిచయాలు పెంచుకునే తత్వంలేని వీర్రాజుగారికి తెలిసిన వాళ్ళూ లేరు.అటువంటిది ఇంత తక్షణ స్పందన ఆశ్చర్యం కలిగించింది.
తర్వాత వారం లోపునే నాకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ చేసినట్లు ఆర్డర్లు వచ్చాయి.అవి చూసి మా హెచ్చెమ్ ముఖం మాడిపోయింది.మొత్తంమీద నా మౌనపోరాటంతో ఇరవై ఏళ్ళ తర్వాత స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ అయ్యాను.నా సర్వీస్ బుక్ లో నమోదుచేసి మళ్ళా అప్రూవల్ కి పంపాల్సి వుంది.
నాకు ప్రమోషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులకీ అనుకుంటాను.నేను స్కూల్ కి వచ్చేసరికి మా హెచ్చెమ్,మా క్లర్క్ ఇద్దరూ రూమ్ లో చర్చలో వున్నారు.సాధారణంగా ఆఫీస్ స్టాప్ కొంచెం ఆలస్యంగా వస్తారు.ఈరోజు తొందరగా వచ్చాడేమిటి అనుకున్నాను.ఎటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి ప్రార్థనకి అసెంబ్లీలో పిల్లలు వెనుక నిలబడ్డాను.
హెచ్చెమ్ నా పక్కనే నిలబడి నాతో గుసగుసగా " ఇప్పుడు విద్యాశాఖ,సి.ఎం.పేషీ నుండి ఎవరో వస్తున్నారట.బహుశా సోషల్ అసిస్టెంట్ పోష్టులో మేథ్స్ అసిస్టెంట్ గా ఎందుకు ప్రమోట్ చేసారని ఇంటరాగేషన్ కి చేస్తున్నారేమో ? " నాతో అని సర్కాస్టిక్ గా నవ్వింది.అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మాట్లాడటం ఎందుకని నేను మౌనంగా వూరుకుని ప్రేయర్ కాగానే రిజిస్టర్ తీసుకుని పదోతరగతి క్లాసులోకి ఎప్పటిలాగే వెళ్ళిపోయాను.
పాఠం చెప్తుంటే నన్ను అర్జంట్ గా రమ్మని ఆయా వచ్చింది.చెప్తున్న పాఠం తొందరగా ముగించి అభ్యాసంలో లెక్క చేయమని చెప్పి హెచ్చెమ్ రూమ్ వైపు వెళ్ళాను.ఒక ఆయన అప్పుడే అందులోంచి బయటకు వచ్చి గేటు వైపు వెళ్ళిపోయాడు.
నేను లోపల అడుగు పెట్టేసరికి మాహెచ్చెమ్ ముఖం ఏడ్చినట్లు జేవురించి వుంది.క్లర్క్ " సుభద్రా టీచర్ వచ్చారు మేడం అడగండి" అన్నాడు.
కందగడ్డలాంటి ముఖంతో నావైపు చూడకుండానే జీరబోయిన గొంతుకతో "మీరే అడగండి " అంది.
నేను ప్రశ్నార్థకంగా చూసాను.
మా క్లర్క్ " మీకు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేయలేదని మీరు సి.ఎం. పేషీకి కంప్లైంట్ ఇచ్చారా?"అని అడిగాడు.
అవునన్నాను.
"మీకు ప్రమోషన్ వచ్చిందికదా ఎందుకు కంప్లైంట్ చేసారు" అని తిరిగి అడిగాడు..
"ఎప్పటి నుండో నాకు రావలసిన పోష్టు కావాలని పెండింగ్ పెట్టారు.ప్రమోషన్ రాకముందే నాకు బాధ కలిగి పేషీకి మెయిల్ రాసాను"అన్నాను.నేను ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే.
" పోష్టుకి మిమ్మల్ని ప్రమోట్ చేసారా లేదో తెలుసుకోవడానికి సి.ఎం పేషీ నుండి ఇందాక వచ్చారు." అన్నాడాయన.
" మీకు ప్రమోషన్ ఆర్డరు వచ్చినట్లు లెటర్ రాసి ఇవ్వండి " అని నా చేత రాయించుకుని తీసుకున్నాడు..అంతే సేపూ మా హెచ్చెమ్ కందగడ్డలా జేవురించిన ముఖంతో నావైపు కొర కొరా చూస్తూనేవుంది.
రూమ్ లోంచి బయటకు వచ్చిన నాకు హాయిగా పాడుకుంటూ గాలిలో తేలిపోయినట్లుంది.
ఇదంతా కలానిజమా అనుకున్నాను.నిజంగా సి.ఎం.పేషీలో పనులు ఇంత ఆఘమేఘాల మీద జరుగుతాయా?
ఎక్కడో మారుమూల ఒక టీచర్ మెయిల్ చేయడంతోనే సమస్య తీర్చారా? అది జరిగిందోలేదో అని చెకింగ్ కి కూడా రావటం ఏమిటీ?నా విషయంలో జరిగిన విధానం చూస్తె నిజంగా ఈయన టెక్ ముఖ్యమంత్రి అని నమ్మకం కలిగింది.ఈ విషయం ఇంటికి వెళ్ళాక వీర్రాజు గారితో చెప్తే ఆయనకి కూడా ఆశ్చర్యపోయారు.
అయితే అంతటితో నాకు స్కూల్ లో సమస్య తీరిందనుకోటానికి లేదు.నేను ఎవరితోనైనా మాట్లాడుతోంటే ఆ వైపుగా మా హెచ్చెమ్ వస్తే " జాగ్రత్తగా మాట్లాడండి.లేకపోతే సుభద్ర సి.ఎం.పేషీకి కంప్లైంట్ ఇచ్చేస్తుంది" అని ఎత్తు పొడవటం కూడా ఎక్కువైంది.
దానికి తోడూ రెడ్డీ ఫౌండేషన్ వారి పెత్తనం స్కూలు లో ఎక్కువైపోయింది.వాళ్ళ ఎదురుగా తనను గొప్పగా ప్రదర్శించు కోవటం,నాలాంటి కొందరు టీచర్లను చులకన చేసి మాట్లాడటం చేస్తుండేది హెచ్చెమ్.మా అందరికీ కోపం వచ్చేది.ఈమె హెచ్చెమ్ అయ్యాక డీయీవో ఆఫీసులలోనూ, రెడ్డీ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంధ సంస్థలవారి దగ్గరా స్కూలునీ, స్కూల్ టీచర్లునీ గౌరవించకపోతే వాళ్ళందరి దగ్గరా చులకన అయిపోవటమే కాక మరింత కాళ్ళకింద తొక్కేసే ప్రమాదం ఉంటుందనే ఇంగిత జ్ఞానం లేక పోతే ఎట్లా?
దాంతో నేను ఎక్కువగా ఎవరితోనూ కల్పించుకొని మాట్లాడకుండా నా పనేదో చేసుకోవటం చేసేదాన్ని.ఇంటికి వచ్చాక కూడా ఇవేవీ వీర్రాజుగారితో కూడా చెప్పడం మానేయటం వలన ఇంట్లో పనులు పూర్తి అయ్యాక చదువుకోవటంలో,రాసుకోవటమో చేసుకునే దాన్ని.అప్పట్లో రాసిన నా కవితలలో కూడా ఆ ప్రభావం వుందేమో అనిపిస్తుంది.ముఖ్యంగా ఏకాంత సమూహాలూ,అంతర్ముఖీన నది మొదలైన కవితలు అటువంటివే.
కవితలన్నీ ఫెయిర్ చేసి పుస్తకం చేసుకోవటానికి వీలుగా పొందుపరిచాను.చదువుకోవటం రాసుకోవటంలోనే నాకు మానసికంగా విశ్రాంతి దొరుకుతుంది.
పాపని తీసుకుని వచ్చి ఓ మూడు నెలలు ఉంటాననీ,పాప రెండవ పుట్టిన రోజు ఇక్కడే చేయాలనుకుంటున్నామని అప్పటికి అజయ్ వస్తాడనీ తర్వాత కలిసి తిరిగి వెళ్తామనీ పల్లవి ఫోన్ చేసింది.ఎట్లాగూ వీళ్ళు వచ్చినప్పుడు పల్లవి వాళ్ళు కొనుక్కున్న ఇల్లు గృహప్రవేశం కూడా చేసుకుంటే బాగుంటుంది అని మేము అనుకున్నాము.ఇల్లు కూడా దాదాపు తయారైపోయింది.
పల్లవి వాళ్ళు వచ్చినప్పుడు,గృహప్రవేశానికి అవసరమౌతాయని సెలవులు పెట్టకుండా జాగ్రత్తగా వాడుకోసాగాను.
పల్లవీ,పాపాయి ఆషీ వచ్చేసరికి మళ్ళా ఇల్లు సందడిగా మారింది.చంటిపాప కేరింతలు ఇంట్లో సీతాకోకల్లా ఎగిరాయి.బుడిబుడి అడుగులతో కాలి మువ్వలు కిలకిల్లాడాయి.ఇల్లంతా వెలుగులు నిండాయి.
బంధువులు , స్నేహితులు పిల్లల్ని చూడటానికి రావటంతో తీరిక లేకుండా అయింది.
పల్లవి వున్నప్పుడే నా "ఏకాంత సమూహాలు" కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం కూడా అనుకున్నందున పుస్తకప్రచురణ పనిలో వీర్రాజుగారు మునిగిపోయారు.మృణాలినిచే నా పుస్తకాన్ని పరిచయం చేసేటట్లుగా నిర్ణయించి పుస్తకావిష్కరణ నిర్వహించాము.ఆ పుస్తకాన్ని పల్లవికి,అనుపల్లవైన ఆశ్లేషకూ అంకితం చేసాను.
నవంబర్లో కార్తీక పౌర్ణమి రోజు గృహప్రవేశం అనుకోవటం వలన ఆరోజు బంధువులూ,దగ్గరి మిత్రులతో కానిచ్చేసి, మర్నాడు ఆషి రెండవ పుట్టినరోజున అందరికీ పార్టీ ఏర్పాటు చేసాము.పల్లవి అత్తగారూ,మామగారూ,వారి బంధువులు కూడా వచ్చారు.వచ్చిన దగ్గర నుండి వాళ్ళు కొడుకు సంపాదన అంతా మేము ఖర్చుపెట్టించేస్తున్నామనేమో చాలా సీరియస్ గా వున్నారు.అది మమ్మల్ని బాధ పెట్టింది.ఈ కార్యక్రమం అయిన మర్నాడు వాళ్ళు ఏ.ఎస్.రావు నగర్ లోని చెల్లెలింటికి వెళ్ళిపోయారు.
మరో రెండు రోజులు తర్వాత పల్లవీ అజయ్ కూడా వాళ్ళింటికి వెళ్ళి అక్కడి నుండే తిరుపతికి వెళ్ళి,విజయనగరం వెళ్తామని చెప్పారు.తిరిగి నాలుగైదు రోజులకు వచ్చి హైదరాబాద్ నుండే ఫ్లైట్ కి వెళ్తామన్నారు.
విజయనగరం వెళ్ళేరోజు వాళ్ళందరికీ టిఫిన్ చేసి స్టేషనుకు తీసుకు వస్తానని చెప్పాను.
తీరా ఆ రోజు నవంబర్ 14.బాలలదినోత్సవం.నేను సెలవు పెట్టాలనుకుంటే మా హెచ్చెమ్ తనకి ఒంట్లో బాగాలేదని అసిస్టెంట్ హెచ్చెమ్ విజయలక్ష్మీ మీరూ సెలబ్రేషన్స్ చేయమని ఫోన్ చేసింది. నేనూ సెలవు పెట్టాలనుకుంటున్నానని చెప్తే విజయలక్ష్మికి అప్పగించి మీరు తొందరగా వెళ్ళిపోండి.అంది.ఇక తప్పదని స్కూల్ కి వెళ్ళాను.తీరా విజయలక్ష్మి కూడా సెలవులో వుందని ముందురోజు ప్లాన్ వేసుకొని నన్ను ఇరికించారని తెలిసింది.
హెచ్చెమ్ రూమ్ తాళాలు లేవు.అటెండర్ ని హెచ్చెమ్ ఇంటికి పంపించి ప్రోగ్రాం మొదలుపెట్టే సరికి ఆలస్యం అయింది.డాన్సులు నేర్చుకొని వచ్చిన పిల్లల్ని నిరుత్సాహ పరచలేను.నేను ఇక్కడ మధ్యలో వదిలి వెళ్ళలేను.ప్రోగ్రాం పూర్తి చేసాం ఇంటికి వెళ్ళి టిఫిన్స్ తయారుచేసి స్టేషన్ కి వెళ్ళాలి.ఒక వైపు హెచ్చెమ్ చేసిన కుట్ర వీటితో నాకు టెన్షన్ పెరిగిపోయింది.పిల్లల్నీ, టీచర్లను పంపి గదులకు తాళాలు వేసుకొని ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి రెండు దాటింది.గబగబా భోజనం చేసి చపాతీలు,కూరా చేసి పేక్ చేసుకుని ఇద్దరం స్టేషన్కు బయలుదేరి పల్లవి వాళ్ళకు అందించాము.
ఆ రోజంతా శారీరకంగా, మానసికంగా అలసి పోయానేమో రాత్రి తొందరగా పడుకున్నాను.
నడక దారిలో -46
నడక దారిలో -46
ఇంట్లోకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కొని పల్లవికి పుట్టిన అనుపల్లవి పాపాయిని ఎత్తుకున్నాను.తొందరపడి ముందే లోకం లోకి వచ్చిందేమో చాలా సన్నగా వుంది.ఇంట్లో చంటిపిల్లల్ని ఎత్తుకుని చాలా కాలమైంది కదా అపురూపంగా అనిపించింది.ఎంతయినా అసలు కంటే కొసరు ముద్దు అంటారు కదా.
అక్కడ పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ లో పేరు చెప్పాలట.ఇంకా మేము పేరు ఆలోచించటం పూర్తికాకుండానే పుట్టేసిందికదా.అందుకని జన్మనక్షత్రాన్ని బట్టి ఆశ్లేష అని రాయించేసారు.మేమంతా ఆషీ అని పిలుచుకోసాగాము
రాత్రి భోజనానికి ఆ స్టౌలూ, వంటిల్లూ అంతా కొత్తగా వున్నా,పల్లవికి కొంచెం సాయం చేసాను.మేము రాగానే పల్లవి అత్తగారు ఇంక తమ బాధ్యత అయిపోయిందనుకున్నారేమో వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయారు.
రాత్రి అత్తగారు వాళ్ళకోసం చేసినప్పుడే పల్లవి రెండు చపాతీలనూ,కొంచెం కూర టప్పరువేర్ టిఫిన్ బాక్స్ లో సర్ది ఫ్రిజ్ లో పెడుతుంటే 'ఎందుకు' అని అడిగాను."ఉదయం ఆరుకే నేను బస్ పట్టుకొని ఆఫీస్ కి వెళ్ళాలి కదా" అంది.
నాకు గుండె ఝల్లుమంది.మోకాలు మునిగేలా మంచు కురుస్తున్న వేళ పచ్చి పురటాలు వెళ్తుందా అని కళ్ళు చెమ్మగిల్లాయి."ఆపీసులో జాయిన్ అయిపోయావా " అన్నాను."ఆషీని చూసేందుకు వాళ్ళు ఉన్నారు కదా జాయిన్ అయిపోమన్నారు "
అంది.
మర్నాడు ఉదయమే లేచి రెండు మూడు లేయర్లుగా చలికోట్లు వేసుకొని ఆ చలిలో పల్లవి వెళ్తుంటే కింద వరకూ తనతో పాటూ వెళ్ళేదాన్ని.ఇండియాలో మూడునెలల వరకూ మంచం దిగకుండా బాలింతలను తల్లులు అపురూపంగా చూసుకుంటారు.నాకు జరగలేదు సరే ఈ పిల్లకూడా ఇలా కష్టపడుతోందే అని దుఃఖం వచ్చింది.
అంతకన్నా నన్ను బాధించిన విషయం పల్లవి తనతో పాటూ ఒక కిట్ తీసుకు వెళ్ళేది.ఆఫీసులో స్పెషల్ గా రూమ్స్ ఉంటాయట.అక్కడ తన పాలు పంపుచేసి బాటిల్స్ నింపి ఐస్ బాక్స్ లో ఉంచి తీసుకు వస్తుంది.నింపిన బాటిల్స్ ఫ్రిజ్ లో వుంచి ఖాళీ బాటిల్స్ మర్నాడు తీసుకు వెళ్తుంది.బాటిల్స్ ని వేడి నీటి కొళాయి కింద పెడితే గడ్డకట్టిన పాలు కరుగుతాయి.అవి ఆషీకి పట్టాలి.ఇది అక్కడి వాళ్ళకు సహజమే కావచ్చు.కానీ నాకు గుండె చెరువైంది.
తర్వాత్తర్వాత రాత్రి వండినవి కాకుండా నేను ఉదయమే లేచి పల్లవికి టిఫిన్ తయారు చేసి ఇచ్చేదాన్ని.
అజయ్ బెంచ్ మీద ఉన్నాడు.మరో వుద్యోగం వేటలో వున్నాడు.అందువల్ల పల్లవికి వుద్యోగం తప్పని సరైంది.పల్లవి అత్తగారు " మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడే వుండిపోయి మనవరాల్నీ ,వీళ్ళనీ చూసుకోవచ్చుకదా " అంది.
నాకు కోపం,బాధా కలిగినా సమాధానం చెప్పలేదు.
రెండుమూడు కుటుంబాలను పిలిచి భోగీ పండుగకి పాపాయికి భోగీపళ్ళు పోసాము.
పండుగ వెళ్ళాక అజయ్ అమ్మా నాన్నా కూతురు దగ్గరకు వెళ్ళిపోయారు.
నాకు కంప్యూటర్ మీద తెలుగు న్యూస్ పేపర్లు ఓపెన్ చేసి చదువుకోవటం నేర్పింది పల్లవి.వంటపనీ,పాపాయి స్నానం,పానం పూర్తయ్యాక పడుకోబెట్టేదాన్ని.ఆషీ లేచేలోపున పేపర్లు చదివి వీర్రాజుగారికి విశేషాలు వినిపించే దాన్ని.పల్లవి దగ్గర కూడా కుట్టు మిషను వుంది.అందుకని అప్పుడప్పుడు చిన్నచిన్న ఫ్రాకులు కుట్టే దాన్ని.
ఆషీ అల్లరేమీ చేసేది కాదు.కబుర్లు చెబుతుంటే హాయిగా నవ్వులు ఒలకబోస్తూ చక్కగా ఆడుకునేది.రాత్రిపూట కూడా అల్లరి లేకుండా నిద్రపోయేది.కానీ ఏపాటి శబ్దం వచ్చినా ఉలికి పడటం ఎక్కువగా వుండేది.ఆఖరుకు ఎక్కడో వంటింట్లో కుక్కర్ విజిల్ వేసినా ఉలిక్కిపడి ఏడ్చేది.అందుకని ఆ సమయంలో దగ్గరగా వుండి చూసుకోవాల్సి వచ్చేది.
పల్లవి వచ్చేసరికి నాలుగు అయ్యేది.పాపాయి పనులతో సమయం గడిచిపోతుండేది.అవసరం అయినప్పుడు పాపకి స్నానం చేయించేటప్పుడో,పాలుపట్టటానికో ,ఇతరపనుల్లో సాయం చేసినా వీర్రాజుగారికి బోలెడు ఖాళీ సమయం దొరకడంతో వచన కవిత్వం లో ఆత్మకథ రాయటం మొదలెట్టారు.
వీకెండులో కూరలూ ,వెచ్చాలు తీసుకు రావటానికి అందరం బయలుదేరే వాళ్ళం.అప్పట్లో ఇండియాలో దొరికే కూరలూ,పళ్ళూ అక్కడ అంతగా దొరికేవి కాదు.
ఇండియా నుండి శంకరం,పొనుగోటి కృష్ణారెడ్డి,ఉమా నుండీ ఉత్తరాలు వస్తూ వుండేవి.ఒకరోజు శంకరం ఉత్తరం ద్వారా మాడభూషి రంగాచార్యులుగారు మాసివ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు తెలిసి చాలా బాధపడ్డాము.
నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అయిదు సీల్డ్ కవర్లు శంకరంకి ఇచ్చి ఒక నెల పోయాక విద్యాశాఖ వారందరికీ రిజిస్టర్ పోస్టు చేయమని చెప్పాను.
శంకరం నిర్వహించే చలం జయంతికి జరిపే 'చలం జీవజలం'సభ సమయంలో ప్రెస్ క్లబ్ బాత్ రూంలో కరపత్రాలకట్టలు ఉన్నాయట.నీలిమేఘాల కవయిత్రులందరిమీదా అశ్లీల పదజాలంతో ఏమేమిటో రాసిన ఆ కరపత్రాలు సాహిత్య రంగంలో పెను సంచలనం సృష్టించాయని పేపర్ వలన తెలిసింది.ఎవరు రాసారో ప్రింట్ చేసినదెవరో నిజానిజాలు తెలియలేదు.మేము ఇంత దూరంలో వుండి పోవటం వలన ఈ విషయాలన్నీ చూచాయగా మాత్రమే తెలిసాయి.ఏదేమైనా ధైర్యంగా ముందు నడుస్తున్న స్త్రీలను పడగొట్టాలంటే తీసుకునే అస్త్రం వ్యక్తిత్వహననమే కదా.ఇక్కడా అదే జరిగి వుండాలి అనుకున్నాము.
నేను వీలున్నప్పుడు చదువుదామని కథల పుస్తకం తెచ్చుకున్నాను కానీ ఆషీ ఉంగా ఉంగా
కబుర్లతోనే సమయం గడిచిపోయింది.
ఒకరోజు పల్లవి ఆఫీస్ నుండి వచ్చే సమయంలో మంచు తుఫాను పట్టుకుంది.రోడ్డంతా మంచుతో నిండి పోవటంతో బస్ ఇంటి వరకూ రావటానికి వీలులేక దూరంగా ఆగిపోయింది.నాకు ఫోన్ చేసి వేడివేడిగా టీ చేసి రెడీగా ఉంచమని చెప్పింది.మంచులో కాళ్ళుకూరుకుపోతుంటే పైన మంచు కురుస్తుంటే అలాగే సాధ్యమైనంత వేగంగా నడవటానికి ప్రయత్నించి ఇల్లు చేరింది.పల్లవి ఇల్లు చేరే వరకూ గుండె పిడికిట్లో పెట్టుకున్నాను.రాగానే వేడి టీ కప్పు తీసుకుని స్టౌ దగ్గర వళ్ళు వెచ్చ చేసుకుంది.ఇల్లంతా కేబుల్ హీటర్లతో వెచ్చగా వున్నా తట్టుకోలేకపోయింది. టీ తాగేక వణుకు తగ్గింది.మంచులోంచి రాగానే ముట్టుకుంటే స్టాటిక్ వల్ల షాక్ కొడుతుంది.అందుకని బట్టలవీ మార్చుకొన్నాకే పల్లవికి ఆషీని ఎత్తుకోవాల్సి వచ్చేది.
అదీగాక అక్కడ టోర్నెడోలు ఎక్కువట.ఆఫీసుల్లో, స్కూల్లో టోర్నెడోలు వేస్తే తీసుకోవాల్సిన తక్షణచర్యల ట్రైనింగ్ కూడా ఉంటుంది.అందుకని సైరన్ తరుచూ వినిపించేది.
వెళ్ళిన కొత్తలో మంచు కురవటం చూస్తుంటే సరదాగా వుండేది.రానురానూ బయటకు వెళ్ళేందుకు కుదరక ఇంట్లో అలా నాలుగు గోడల మధ్య వుండటం విసుగుగా వుండేది.వారాంతంలో అవసరమైన వెచ్చాలకోసం మాల్స్ కి వెళ్ళటం వుండేది.రోజూ ఉద్యోగం,మీటింగులు వెళ్ళటం అలవాటు వలన కాళ్ళు కట్టేసినట్లే వుండేది.
తెలుగు విశ్వవిద్యాలయంలో రచయిత్రుల మహాసభలు జరిగాయట.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశ్వవిద్యాలయంలో విలీనం కాక ముందు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ద్వారా బహుశా నాలుగేళ్ళకోసారనుకుంటాను అఖిలభారత తెలుగు రచయిత్రుల మహాసభలు నిర్వహించేది. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అయిన
డా.ఎన్.గోపీగారు మళ్ళా ఆ వరవడిని ప్రారంభిస్తే మంచిదే.కానీ నేనే ఆ సభల్ని మిస్ అయ్యానని బాధ కలిగింది.
అప్పట్లో అక్కడ టీవిలో తెలుగు ఛానెల్స్ వచ్చేవి కావు.అందుకని పల్లవి వాళ్ళు దగ్గర వున్న సినీమాల వీడియో కేసెట్స్ గానీ,లేదా టీవిలో ఇంగ్లీష్ సినిమాలు గానీ ఖాళీ సమయాల్లో చూసేవాళ్ళం.లేదా పల్లవి దగ్గర వున్న లలిత సంగీతం ఆడియోలు పెట్టుకునే వాళ్ళం.అవైతే అక్కడ కూచునే వినక్కరలేదు కదా.ఆషీ పనులు చేస్తూనే రావు బాలసరస్వతి, సాలూరి రాజేశ్వరరావు పాటలు వింటూ పాడుకునే దాన్ని.పల్లవికి జోలపాడినట్లుగానే ఆషీని నిద్రపుచ్చుతూ ఎన్నో పాటలు పాడేదాన్ని.
అజయ్ కి అట్లాంటాలో ఉద్యోగం వచ్చింది.
అజయ్ అక్కడకు వెళ్ళి జాయిన్ అయ్యాడు.ఇల్లు దొరికిన తర్వాత మేమంతా వెళ్ళటానికి నిర్ణయం అయ్యింది . అంతవరకూ వుద్యోగంలో చేయాలని పల్లవి నిర్ణయించుకుంది.అంతే కాకుండా పాపం నాకు బాగా అలవాటైపోయింది.మేము వచ్చి నాలుగు నెలలు కావస్తోంది.అందుకని ఆషీకి స్నానం చేయించటం,ఇతర పనుల్నీ అలవాటు చేసుకోవటానికి ముందుగానే మానేస్తానని చెప్పింది.
ఇక్కడ అద్దె యింట్లో వున్నప్పుడు ఇల్లు, సామాన్లు ఎలా వున్నాయో అలాగే ఓనర్లకు అప్పగించాలంట.ఏవైనా పాడౌతే వాటికి బదులుగా కొత్తవి అమర్చాలి.ఆఖరుకు బాత్ రూంలతో సహా.
అందుకని వారాంతాల్లో అజయ్ వచ్చినప్పుడు ఇల్లు క్లీనింగ్ లు,ఏవి కొత్తవి అమర్చాలోనని చెకింగ్ లు మొదలెట్టారు.
అజయ్ ఏ వారం అయినా రాకపోతే ఆషీని చూసుకోమని వీర్రాజుగారికి అప్పగించి ,పల్లవీ,నేనూ మాల్స్ కి వెళ్ళేవాళ్ళం.
అజయ్ కి ఇల్లు దొరికిందట.అట్లాంటాకి వెళ్ళాలి కనుక పల్లవి వుద్యోగం మానేసింది.నా సహాయంతో ఆషీ పనులన్నీ పల్లవే చూసుకోవటంతో నాకు కొంచెం తీరిక దొరికింది.
మూవర్స్ & పేకింగ్ వారిని పిలిచారు.బలిష్టంగా వుండి అతి సులభంగా ఎంతో బరువున్న పెద్ద సోఫాల్ని ఫేక్ చేసి మోసుకుని తీసుకు వెళ్తున్న నల్లజాతి వారిని చూస్తుంటే ఆశ్చర్య పోయాను.సామానంతా వెళ్ళిపోయింది.మర్నాడు ఫ్లైట్ కి మేము వెళ్ళాల్సి వుంది.
అనుకోకుండా మా స్కూల్ లో నా సహోద్యోగిగా పనిచేసి పదవి విరమణ చేసిన లెక్కలటీచర్ ఇందిర కుమారిగారి నుండి ఫోన్.మినియాపొలీస్ లోనే వున్న ఆమె చిన్న కుమారుడి ఇంటికి వచ్చారట.నన్ను,పల్లవినీ చూడాలని వుందనీ,ఒక గంటలో మా ఇంటికి వస్తామని ఫోన్ చేసారు.తప్పక రమ్మని ఇంటి లోకేషన్ చెప్పి ఆహ్వానించాము.
అన్నట్టుగానే గంటలో వారబ్బాయి కుటుంబంతో కలిసి వచ్చారు.అందరూ మాతో కలిసిపోయి కబుర్లు చెప్పారు.నేను స్కూల్లో చేరినప్పటి నుండీ ఇందిరాటీచర్ నాతో స్నేహంగా ఒక పెద్దక్కలా వుండేవారు.ఆవిడ రిటైర్ అయ్యాక ఆ పోస్టులో నాకు ప్రమోషన్ ఇవ్వలేదని తెలిసి బాధ పడ్డారు.మినియాపొలిస్ లోని మంచువర్షాలకీ,చలికీ,ఇంటిలోనే వుండాల్సిన పరిస్థితి గురించి చాలా సేపు మాట్లాడారు.వాళ్ళు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులే అయిందని ,చలికి తట్టుకోవటం కష్టంగా వుంది అన్నారు.ఓగంట వుండి వెళ్ళారు.అట్లాంటా వెళ్ళాక సర్దుకున్నాక ఫోన్ చేస్తానని వాళ్ళ అబ్బాయి నెంబర్ తీసుకున్నాను.
మర్నాడు ఫ్లైట్ కి అట్లాంటా బయలుదేరాము.అయితే ఫ్లైట్ బయలుదేరినప్పుడు, లాండింగ్ సమయంలో ఆ. శబ్దానికి ఆషీ ఒకటే ఏడుపు మొదలెట్టింది.ఈపిల్లకి శబ్దాలు వింటే ఇంత బెదురేమిటో అనుకున్నాము.పెరిగిన తర్వాత తగ్గుతుందేమో అనుకున్నాము.అట్లాంటాలో వీళ్ళ ఇంటికి దగ్గరలోనే పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఉండటంతో మాటిమాటికీ విమానాల లాండింగ్, ఫ్లైయింగ్ శబ్దాలు వినిపించుతూ వుండేవి.
కొన్నాళ్ళు అయితే ఆ శబ్దాలు వినీ వినీ ఆషీ అలవాటు పడితే ఏడుపు తగ్గుతుందేమో అనుకున్నాము.
అట్లాంటాలో వాతావరణం ఇండియాలో లాగే వుండటంతో సాయంత్రం పూట పల్లవీ,నేనూ ఆషీని తీసుకోని అక్కడే బయట తిరిగే వాళ్ళం.
ఓ వారం రోజులయ్యాక ఇందిరా టీచర్ తో మాట్లాడాలని ఫోన్ చేసాను.ఒక షాకింగ్ న్యూస్.ఆ రోజే చర్చ్ కి వెళ్ళొచ్చిన తర్వాత లంచ్ కాగానే పడుకుని నిద్రలోనే మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందట.చలికి తట్టుకోవటం కష్టంగా ఉంది అన్నారు.ఆరునెలలు పిల్లలతో ఉండాలని వచ్చిన ఆమె ఇలా లోకం నుండే వెళ్లిపోయారని తెలిసి చాలా దుఃఖం కలిగింది.
అట్లాంటాలో నీటి లోపల వుండే జార్జియా అక్వేరియం ఒక వారాంతం వెళ్ళి చూసాము.చాలా రకాల పెద్ద పెద్ద చేపలు మనపై నుండి ఈదుకుంటూ పోతుంటే చూడటం అద్భుతంగా అనిపించింది .మరో వారాంతంలో జార్జియా స్టోన్ మౌంటెన్ పార్క్ కి వెళ్ళాము.మౌంటెన్ గోడ మీద నలుగురు నాయకుల ముఖాలు చెక్కివున్నాయి.నాకు మాత్రం ఇండియాలోని గుడుల లోని శిల్ప సౌందర్యం దగ్గర ఇది ఏముంది అనిపించింది.చాలామంది అమెరికన్లు ఫోల్డింగ్ కుర్చీలు,తినటానికి రకరకాల పదార్థాలతో వచ్చారు.మేము కాసేపు వుండి వచ్చేసాము.
ఆషీకి అయిదోనెలరాగానే ఒక రోజు అన్నప్రాసన కూడా చేసాము.కొద్దికొద్దిగా ఘన పదార్థాలు తినటం అలవాటు చేయటం ప్రారంభించాము.
మేము వచ్చి అయిదు నెలలు దాటింది.స్కూల్ తెరిచే సమయానికి ఇండియా వెళ్ళేలా నిర్ణయించుకున్నారు.అందుకని అక్కడి వాళ్ళకు చిన్న చిన్న కానుకలు కానుకలు కొనాల్సి వుంది.
మేము బయలుదేరేటప్పుడు బయట వరండా తాళాలు పక్కవాళ్ళకి ఇచ్చాము. పనిఆమెకి అప్పుడప్పుడు వచ్చి మొక్కలకి నీళ్ళు వేయమని చెప్పాము.అందుకని అయిదునెలలకీ ఆమెకి జీతం డబ్బు కూడా ఇచ్చేసాము.
ఆదివారం అయితే శంకరంగారు తాను వెళ్ళి ఇల్లు శుభ్రం చేయిస్తానని అన్నారు.కానీ.ఆమె రాలేదట.శంకరంగారే వెళ్ళినప్పుడు మొక్కలకు నీళ్ళు పోసారట.మెము వచ్చే ముందు కూడా పాపం ఆయనే కొంత శుభ్రం చేసారని తెలిసి మేము బాధపడ్డాము.
మేము బయలుదేరే రోజు వచ్చింది.అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లు ఆషీతో అనుబంధం పెరిగి వదిలిపెట్టి వెళ్ళటం కష్టంగా అనిపించింది.పల్లవికి జాగ్రత్తలు చెప్పి ఫ్లైట్ ఎక్కటానికి ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయాము.
మొత్తంమీద ఎలాగైతేనేం మా అమెరికా ప్రయాణం పూర్తిచేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాం.ఎయిర్ పోర్ట్ కి కృష్ణారెడ్డిగారూ, శంకరంగారూ వచ్చారు.క్షేమంగా ఇంటికి చేరాము.వరండాలోని మా మొక్కల్ని చూసుకున్నాము.మూడునెలలుగా ఎండాకాలమే కావటంతో నీళ్ళు వేసినా దిగులు ముఖంతో వున్నాయనిపించింది.రెండురోజులు వరసగా నా చేతులతో నీళ్ళు పడేసరికి నన్ను చూసి నవ్వుతూ పలకరించి కళకళలాడాయి.ఆ దృశ్యం నాచే 'నిరీక్షణల కొసం చివర' అనే కవిత రాయించింది.
స్కూల్ తెరిచేలోగా ఇల్లంతా సర్దుకుని ఒక కొలిక్కి తీసుకువచ్చాక వీర్రాజు గారూ ,నేనూ అక్కడి కబుర్లు చెప్పుకుంటూ ".వాళ్ళిద్దరూ బాగానే వున్నారు.ఆషీ కొంచెం పెరిగాక పల్లవికూడా వుద్యోగం చేస్తే ఆర్థికంగా పుంజుకుంటారు.ఇక్కడకు వస్తారో అక్కడే స్థిరపడతారో.కాని ఇక్కడ ఇల్లు ఏదైనా కొంటామన్నారు.ఇంక మనం ఏమీ పల్లవి కోసం డబ్బు దాచాల్సిన పనిలేదు.ఇంకా పల్లవి గురించి ఆలోచించక్కరలేదు.మనం మనపుస్తకాలు వేసుకుంటూ మనకోసమే మనం బతకొచ్చు."
అని తృప్తిగా వూపిరి పీల్చుకున్నాము.
నడక దారిలో -45
నడక దారిలో -45
డా.భార్గవీరావు ఒకసారి మాయింటికి వచ్చినప్పుడు 'వందమంది రచయిత్రుల వందకథలను సంకలనం చేయాలనుకుంటున్నాను ' అన్నారు.సరే ముగ్గురం కూర్చొని జాబితా తయారు చేసాం.అయితే కనీసం ఒక సంపుటి అయినా వచ్చిన రచయిత్రులను తీసుకుంటే బాగుంటుందని వీర్రాజుగారు అన్నారు.ఆ రకంగా కొందరి పేర్లు తొలగించాం.వందకన్నా ఎక్కువ పేర్లువున్నాయి.భార్గవిరావు " వారందరికీ వుత్తరాలు రాస్తాను.స్పందించిన వారి కథలు మాత్రమే తీసుకుంటాను.చనిపోయిన వారి కథల్ని మనమే ఎంపిక చేద్దాం" అన్నారు.ఆ పని మొదలైంది.ఆమె మమ్మల్ని ఒక్కరినే కాక చాలా మందిని సంప్రదించింది.దాంతో మొగమాటాలకి లోబడి ఒక్క కథ రాసిన వారివి కూడా ఆమె తీసుకున్నారు.అది మాకు నచ్చకపోయినా మౌనంగా వూరుకున్నాము.భార్గవీరావు సంపాదకత్వంగానే వందమంది రచయిత్రుల వందకథలతో "నూరేళ్ళ పంట" సంకలనం మిళిందీప్రకాశన్ వాళ్ళ ద్వారా వెలువడింది.
నూరేళ్ళపంటకి మంచి గుర్తింపు రావటంతో అదేవిధంగా వందమంది కవయిత్రుల సంకలనం మన ఇద్దరం కలిసి వేద్దాం అంది భార్గవీరావు.మొల్లదగ్గరనుండి మొదలు పెడదాం అంటే సరే అన్నాను.కవయిత్రుల జాబితా తయారుచేసి వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి వాళ్ళ కవితా సంపుటాలను పంపించమని కోరాము.అయితే కొందరు కవయిత్రులు వారే తప్ప ఇతరులు కవయిత్రులూ,కథకులు కానేకారని భావించి కవిత ఇవ్వటానికి నిరాకరించారు.ఒకరిద్దరు ఇవ్వనన్నంతలో ఆగదు కదా.
కవితా సంపుటాలు చదివి అంతకుముందు సంకలనాలలో రాని మంచి కవితలను ఎంపిక కోసం చదవటం నాకు ఆనందం కలిగించింది.అనుకున్నట్లుగా వందమంది కవయిత్రులు కవితా సంకలనం " ముద్ర" ను కూడా మిళిందీ ప్రకాశన్ వారే ప్రచురించారు.మేము ముందుమాటలో కొందరు వాళ్ళ కవితలను చేర్చటానికి ఇష్టపడలేదనే మాటల్ని స్పష్టంగా రాసినా సమీక్షలు రాసిన వారు ఒకరిద్దరు ఎత్తి చూపటం భార్గవీరావుకు ఆగ్రహం తెప్పించింది.
" చిన్నన్నయ్యకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడ్డాయనీ,ఆపరేషన్ చేయించుకుంటున్నాడనీ,నీకు హిస్ట్రెక్టమి జరిగినప్పుడు సత్యవతి సాయానికి వచ్చింది కనుక నువ్వు వాళ్ళకి సాయం వస్తే బాగుంటుందని " మా పెద్దక్క ఉత్తరం రాసింది.నాకు సంక్రాంతి సెలవులే కనుక రిజర్వేషన్ చేయించుకుని విజయనగరం వెళ్ళాను.నాతో వాళ్ళు సంబంధం తెంచుకున్నా గానీ నేను రావటం ఆశ్చర్యం కలిగింది.నాతో ఎక్కువ మాట్లాడకపోయినా ఆపరేషను అయ్యేవరకూ సాయంగా వుండి తిరిగి వచ్చేసాను.
అప్పట్లో జాతీయ ఛానెల్లో చాలా మంచి ధారావాహికలు రావటంతో ఎంతో అలసిపోయినా సరే చూడటం అలవాటైంది.అమరావతికథలుకూడా హిందీలో నాటకాలుగా వచ్చేవి.అలాగే ఒక సంచలనాత్మక సుదీర్ఘ ధారావాహికగా మొట్టమొదటగా సులోచనారాణి రాసిన "రుతురాగాలు" సప్తగిరి ఛానెల్లో టెలీకాష్ట్ అయ్యేది నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో యద్దనపూడి సీరియల్ యువతరానికీ,మహిళాపాఠకులకూ ఎంత క్రేజ్ కలిగించిందో అంత క్రేజ్ రుతురాగాలు కూడా కలిగించిందనే చెప్పాలి.బిందునాయుడు,మంజునాయుడు దీనిని గొప్పగా తీసారు.సాయంత్రం నాలుగున్నర కల్లా అందర్నీ టీవీ ముందుకు తీసుకువచ్చిన మొట్టమొదటి తెలుగు టీవీ సీరియల్ గా చెప్పుకోవచ్చు.కానీ దానిని తర్వాత్తర్వాత మరీ సాగదీసి విసుగెత్తించారు.
నాకు తొందరగా బస్సు దొరికితే సీరియల్ టైముకు అందుకునే దాన్ని. దాని తర్వాత ఇక పుంఖానుపుంఖాలుగా వాళ్ళవి వస్తూనే వున్నాయి.
ఇంక మా స్కూల్ లో
ఎయిడెడ్ స్కూల్లో సీనియారిటీని బట్టి అందులో ప్రమోషన్ ఇవ్వాలి.అంతకుముందు లెక్కలు పోస్టులో సోషల్ టీచర్కి ఇచ్చారు ఆమె హెచ్చెమ్ గా ప్రమోట్ కావటంతో ఖాళీ అయ్యింది.నన్ను అందులో నింపాలి.కానీ ఆమె నాకు ప్రమోషన్ ఇవ్వటం ఇష్టంలేక దానిని అలా ఖాళీగానే వుంచి నా జూనియర్స్ నింపాలన్నట్లుచూసింది.ఇంక నాకు విపరీతమైన కోపం వచ్చి ఎమ్మె, ఎమ్మెస్సీ పీజీ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు చించి ఆమెపై విసిరేసి అరిచాను.
నా ఆవేశాన్నీ,కోపాన్నీ,ఆవేదననీ పట్టలేక వీర్రాజుగారితో చెప్పాలంటే ఉద్యోగం మానేయమంటారు.అందుకని చెప్పలేదు.క్లాసులు తీసుకోవటం మానేస్తే పిల్లలు నష్టపోతారు.అందుకని పాఠాలు మాత్రం మానేయకుండా ఏంచేయాలో అనే ఆలోచనలో పడ్డాను.
నేను స్కూలు లో జాయిన్ అయిన దగ్గర నుండి జరిగిన పరిణామాల్ని,వివక్షతలతో నాకు ప్రమోషన్ ఇవ్వని విషయాల్ని కూలంకుషంగా ఉత్తరం రాసి అయిదు కాపీలను సంబంధిత అధికారులకు రిజిస్టర్ పోష్టులో మూడు నెలలకు ఒకసారి పోష్టు చేయసాగాను.మన ప్రభుత్వఆఫీసుల సంగతి తెలిసినా పంపిపుతూనే ఉన్నాను. అవి బుట్టదాఖలు అవుతూ వచ్చాయి.అయినా నేను మౌనపోరాటం మలా సాధించాలని చూసాను.
పల్లవి న్యూజెర్సీ నుండి వచ్చేసి మినియాపోలిస్ లోనే ఉద్యోగంలో చేరింది.కాని అక్కడ నిత్యమూ మంచు కురుస్తుంది.అదీగాక టార్నిడోలు కూడా తరుచూ వస్తుంటాయట.
అందుకని నేను పల్లవికి మెయిల్ ద్వారా రోజూ కాంటాక్ట్ లో ఉండాలని నేర్చుకోవటానికి దగ్గర లోని కంప్యూటర్ సెంటర్ లో చేరాను.స్కూలు నుంచి వచ్చి ఆరింటికి వెళ్ళేదాన్ని .అయితే నేర్పించే ముస్లింకుర్రాడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా వచ్చినట్లు లేదు.నాకు ఉర్దూ రాదు.ఇంగ్లీషు పెద్దగా రాదు.ఆ అబ్బాయి ఉర్దూ తప్ప మాట్లాడటం లేదు.దాంతో నెలరోజులు ఎలాగో పూర్తిచేసి మానేసాను.ఆ నెలరోజుల్లో కంప్యూటర్ ఆపరేట్ చేయటం ,PPT లు తయారుచేయటం,కాస్తంత ఎక్సెల్ సీటు నింపడం తప్ప మరేమీ రాలేదు.
భారవి ద్వారా ఒక కంప్యూటర్ కొనుక్కున్నాను.అంతకుముందు పక్కింట్లో ఉండే రఘు నాకు rediff mail ఐడీ చేసి మెయిల్ ఎలా ఇవ్వాలో ,ఎలా ఓపెన్ చేసి చూడాలో నేర్పాడు.ఎప్పుడైనా మర్చిపోతానేమోనని ఒక పుస్తకంలో అన్నీ రాసి చెప్పాడు.
అంతలో ఒక శుభవార్త.నేను అమ్మమ్మను కాబోతున్నానని.నేను సంతోషంతో పొంగి పోయాను.అయితే అమెరికా ప్రయాణం తప్పదు అనుకున్నాము.పల్లవి అత్తగారూవాళ్ళూ ముందుగా వెళ్తామనీ పల్లవి డెలివరీ అయిన తర్వాత మమ్మల్ని రమ్మన్నారు.తర్వాత వాళ్ళ అమ్మాయి డెలివరీ టైమ్ కి అక్కడికి వెళ్ళిపోతామన్నారు.ఏ ఆడపిల్లకైనా తల్లి కాబోతున్న సమయంలో తల్లి పక్కనే వుండాలనుకుంటుంది.నాకు కూడా పల్లవిని గర్భంతో ఉండగా దగ్గర వుండటం, తనకి ఇష్టమైనవి,తినాలనుకున్నవీ చేసి పెట్టాలనే కోరిక తీరలేదు. నేను ఆసమయంలో అనుభవించిన వెలితి పల్లవికి రాకూడదనుకున్నాను.కానీ నాకు నచ్చక పోయినా అదే నిర్ణయం అయ్యింది.
మాకు పాస్పోర్టులు కూడా లేవు.ముందు ఆ ప్రోసెసింగ్ మొదలు పెట్టాము.అంతేకాక డిపార్ట్మెంట్ నుండి నాకు ఆరునెలలు సెలవులకి అంగీకారంకి ప్రయత్నించాలి.
డిసెంబర్ మొదటి వారంలో డెలివరీ కావచ్చని అంచనాతో అజయ్ వాళ్ళ అమ్మా నాన్న నవంబర్ మొదటివారంలో వెళ్ళి రెండు నెలలు ఉండి మేము జనవరిలోనో ఫిబ్రవరి లోనో వస్తే వాళ్ళ
అమ్మాయి దగ్గరకు వెళ్ళాలని నిర్ణయం అయ్యింది.
ప్రతీరోజూ కంప్యూటర్ మెయిల్ చెక్ చేసుకొని పల్లవికి రెండు ముక్కలు రాసే దాన్ని.పల్లవిని కూడా అలానే ఎలా ఉన్నది రాయమనేదాన్ని.
ఆరోజు ఎప్పటిలాగే స్కూలు నుండి వచ్చాక మెయిల్ చూస్తే ఆరోజు హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తున్నానని వచ్చాక ఏ విషయమూ మెయిల్ చేస్తానని పల్లవి మెయిల్ పెట్టింది.కంప్యూటర్ ఆఫ్ చేసేసాను.
త్యాగరాజగానసభలో ఏదో సాహిత్య సమావేశం వుందని,నేనూ పక్కింట్లోనే వున్న పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారూ వెళ్దామనుకున్నాము.
ఆరుగంటలకు తయారై ఆటో పిలవాలనుకున్నాము.అయితే కరెంట్ పోయింది.ఎప్పటికీ రావటంలేదు.చిక్కడపల్లి ప్రెస్ కి వెళ్ళిన వీర్రాజుగారు అప్పుడే వచ్చి చిక్కడపల్లి అంతా కరెంట్ పోయింది. గ్రిడ్ లోనే సమస్య వచ్చిందని ఎప్పటికి వస్తుందో తెలియదని అంటున్నారనీ చెప్పారు.ఇంక ఈ చీకట్లో వెళ్ళటం ఎందుకని మేము వెళ్ళే కార్యక్రమం మానుకున్నాము.
సరిగ్గా ఎనిమిదిన్నరకి కరెంటు వచ్చింది.టీవీ ఆన్ చేసాము అమెరికాలో ఉగ్రదాడి అని బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.ముందు మాకేమీ అర్థం కాలేదు.వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంటటవర్లు కూలిపోవడం,పెంటగన్ పై దాడీ టీవీలో చూపిస్తుంటే గుండెల్లోంచి వణుకు మొదలయ్యింది. కంప్యూటర్ తెరిచి పల్లవి మెయిల్ చూడాలనుకుంటే సర్వర్ డౌన్ అయ్యి రావటం లేదు.
అంతలో స్నేహితులనుండి ఫోన్లు రావటం మొదలయ్యాయి. "ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ పల్లవి వాళ్ళు బాగున్నారా " అని ,అలాగే అక్కడవున్న వాళ్ళ పిల్లలు గురించి క్షేమ సమాచారాలు తెలియజేసారు.క్రింద ఇంటి సరోజినీ గారూ,యజ్ణప్రభ గారూ ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు సంగతి చెప్పి పల్లవి గురించి అడిగారు.
అందరి కంఠాల్లో భయం.గుండెల్లో దుఃఖం .పల్లవి నుండి ఫోన్ వస్తుందేమోనని ఒళ్ళంతా చెవులు చేసుకుని ఫోన్ దగ్గరే కూర్చున్నాం.అంతలో ఫోన్ వచ్చింది.హాస్పటల్ కి వెళ్ళి వచ్చానని బాగానే వున్నామని,తమకేమీ ఇబ్బంది లేదని చెప్పాక గుండెలనిండా ఊపిరి తీసుకున్నాం.కానీ ..కానీ... ఆందోళన తగ్గలేదు.దేశదేశాలనుండి చదువులూ,ఉద్యోగాలకూ యువతరం అమెరికాకు తరలిపోతోంది.అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు ఆశతో పంపుతున్నారు.ఎంతమందికి గుండెకోత అయ్యిందో కదా అనిపించింది.
మరి కొన్ని రోజులకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా అమెరికా ఆఫ్ఘన్ యుధ్ధం మొదలైంది.
నాలోని ఆందోళననీ,ఆవేదననీ ఓ కవితగా రాసి వీర్రాజు గారికి చూపించాను.చాలా బాగా రాసావనీ,మరికొంత పెంచి దీర్ఘ కవితగా రాయగలవేమో చూడమని వీర్రాజు గారు అన్నారు.
అంతే యుద్ధమూలాలు అన్వేషించటమేకాక, మత విద్వేషాలు యుద్ధానికెలా దోహదమౌతాయో, ఎన్ని కుటుంబాలు, సంక్షోభాలలో ఇరుక్కుంటాయో, యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎందరు తల్లులు గర్భశోకంలో గుండెకోతను అనుభవిస్తారో,చరిత్ర లోతుల్లోకి వెళ్ళి వీటన్నిటికీ నా దృష్టి కోణంలో కార్యకారణాలను "యుద్ధం ఒక గుండె కోత"ని దీర్ఘ కవిత అక్షరీకరించాను.ఆ వెంటనే పుస్తక రూపంలోకి తీసుకు వచ్చి నాగభైరవ కోటేశ్వరరావు గారి అధ్యక్షతన,అద్దేపల్లి రామమోహనరావు గారు వక్తగా పుస్తకావిష్కరణ జరిపాము.
వడలి మందేశ్వరరావు,కోవెల సంపత్కుమారాచార్య,ఆంవత్స సోమసుందర్ గార్లు నా పుస్తకం అందుకోగానే సుదీర్ఘ వ్యాసాలను రాసారు.అనేకమంది ప్రముఖుల ప్రసంశలు ఆ పుస్తకానికి లభించాయి.
అమెరికాలోని దాడులు,యుద్ధం ఇవన్నీ పల్లవికి సబ్ కాన్సాస్ లో ఆందోళన కలిగించాయి ఓ రోజున అకస్మాత్తుగా ఏడవనెలలోనే నొప్పులు రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయింది.నెలరోజులకు పైనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది.డిస్ఛార్జి అయి ఇంటికి వచ్చి ఓ వారం రోజుల ఆఫీసుకు వెళ్ళేసరికి మళ్ళా అదే సమస్య రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యేది.
రెక్కలు కట్టుకుని నాకు వెళ్ళాలనిపించింది.కానీ ఎలా?
పాస్పోర్టులు వచ్చేసాయి వీసాకి ప్రోసెసింగ్ మొదలెట్టాము.జనవరిలో వెళ్తే వేసవి సెలవులు కలిసొస్తాయని ప్లాన్ చేసాను.డిసెంబర్ కి నేను పోర్షన్ పూర్తి చేసేస్తే పిల్లలకి రివిజన్ చేయిస్తే చాలు అనుకున్నాను.కానీ హెచ్చెమ్ గా వున్న ఉషా " నీవి ఇంపార్టెంట్ సబ్జెక్టులు నీకు బదులుగా ఎవరినైనా ఎంపాయెంట్ చేస్తేనే లీవ్ సెంక్షన్ చేస్తానని చైర్మన్ గారు అన్నారు"అని అంది.నిజానికి అవి ఆమె మాటలే.అంతకు ముందు ఆమె కూడా ఆరేసినెలలు సెలవు పెట్టి వెళ్ళింది.అప్పుడు లేని నిబంధన నాకు పెట్టింది.
ఏమి చేయాలో అనే ఆలోచనలో స్త్రీ సంఘటన లక్ష్మి కలిసినప్పుడు మాటలు సందర్భంలో అన్నాను.లక్ష్మి చెల్లెలు కల్పన ప్రస్తుతం ఖాళీగా వుందని ఆమెని పంపుతానంది.పెద్దసమస్య తీరింది.
మొత్తంమీద నాకు దారి సుగమం అయ్యింది.
పల్లవి అత్త,మామలు నవంబరు మొదటి వారంలో వెళ్ళారు. అనుకోకుండా ఒకరోజు వుదయమే పల్లవికి డెలివరీ అయ్యిందనీ,పాపాయి పుట్టిందని ఫోన్ వచ్చింది.మా ప్రయాణం తేదీ ఇంకా రెండునెలలు వుంది ఈ లోపునే తొందరపడి పాపాయి పుట్టేసింది అనుకున్నాము.
అప్పుడే నాకు ఎరియర్స్ అందటంతో పాపకీ,పల్లవికీ బంగారు గొలుసులు ,ఇంకా కావలసిన వస్తువులు కొన్నాను.
మా ప్రయాణానికి సామాను సర్దుకోవడం ఇవన్నింటికీ రఘు,శంకరం,పొనుగోటి కృష్ణారెడ్డి సహకరించారు.అప్పుడప్పుడు వచ్చి ఇల్లు చూసుకుంటామని, మొక్కలకు నీళ్ళు పోయటం ,పని అమ్మాయితో ఇల్లు శుభ్రం చేయించటం చేయిస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 11 సంఘటన జరిగి ఎన్నో రోజులు కాలేదు కనుక ఎయిర్ పోర్ట్ ల్లో తనీఖీలు ఎక్కువగా వుండటం వలన రఘు చెకిన్ అయ్యే వరకూ కూడా లోపలికి రావటానికి కుదరలేదు.లాంజ్ లో కూర్చున్నప్పుడు చంటి పిల్లాడిని ఎత్తుకున్న ఒక అమ్మాయి మమ్మల్ని చూసి తాను కూడా మినియాపొలిస్ కే వస్తున్నట్లు తెలియజేసి తనకి కూడా మా సహాయం కోరింది.మాకు కూడా సహకరించింది.
కలలో కూడా ఊహించని విధంగా తొలిసారి విమానం ఎక్కాము.తీరా ఎక్కినా వెంటనే ఏదో సమస్యవచ్చి ఆగి పోయి ఆలస్యంగా బయలుదేరింది.హైదరాబాద్ లో ఆలస్యం కావటంతో లండన్ లో కనెక్టెడ్ ఫ్లైట్ వెళ్ళిపోయింది.దాంతో లండన్ లో ఆ రాత్రికి హొటల్ రూమ్స్ కి పంపారు.పక్క రూమ్ లోనే ఆ అమ్మాయి కూడా వుండటంతో డిన్నర్ కి తీసుకు వెళ్ళింది.బఫే కావటంతో ఏవి తినదగినవో తెలియకపోతే ఆ అమ్మాయే తీసి ఇచ్చింది.పేరు తెలియని ఆ పధార్థాలేవీ తినలేక తిన్నామనిపించాము.
ఉదయమే లేచి తయారయ్యాము.ఆ అమ్మాయి తను స్నానం చేసేంతవరకూ బాబుని మాకు అప్పగించింది.
హొటలు నుండి బస్సులో ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించారు.ఎలా అయితేనేం మిన్నియాపోలిస్ ఎయిర్ పోర్ట్ లో దిగాం.మా సూట్ కేసులు కూడ తీసుకోటానికి కూడా ఆ అమ్మాయి సాయం చేసింది.ఆ అమ్మాయి సాయంగా వుండటం మాకు ఇబ్బంది కలగలేదు. కానీ అడుగడుగునా మాకు చెకింగులు అవుతూనే వున్నాయి.అదే పెద్ద ఇబ్బందిగా మారింది.
ముందురోజు రావాల్సిన వాళ్ళం రాకపోయేసరికి పల్లవీ,అజయ్ కంగారు పడ్డారు.తర్వాత వాళ్ళకి విషయం తెలిసింది.అజయ్ , వాళ్ళ నాన్నగారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.
ఎయిర్ పోర్ట్ నుండి కారులో ఎక్కే సరికే చిలికి వణుకు పుట్టింది.రోడ్లపక్కనంతా మంచు కుప్పలు.ఎట్టకేలకు పల్లవి ఇల్లు చేరాము.
-- శీలా సుభద్రాదేవి
18, నవంబర్ 2024, సోమవారం
నాదో చిన్నమాట - కథారామంలోపూలతావులు
~ నాదో చిన్నమాట ~
2010లో వందేళ్ళ కథాప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాక బయటున్న తెలుగు కథకులందరితో ఎన్నో సమావేశాలూ, ఎన్నో ఇంటర్వ్యూలూ, వ్యాసాలూ, అభిప్రాయాలు వెలువడ్డాయి. మొదటి కథారచయిత్రిగా భండారు అచ్చమాంబను పేర్కొని, ఆపైన 1980 తర్వాత రాసిన రచయిత్రులనే అనేకమంది పేర్కొన్నారు. ఒక ఛానల్ కోసం 'వందేళ్ళ కథకు వందనాలు' పేరిట 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం పన్నెండుమంది రచయిత్రుల కథలనే స్వీకరించటంకూడా గమనించాల్సిన విషయమే.
అవన్నీ గమనించిన తరువాత 1910కి - 1980కి మధ్య ఒకరిద్దరు తప్ప కథారచయిత్రులు లేరా అనే ఆశ్చర్యం కలిగింది. అరవయ్యో దశకంలో పత్రిక లన్నింటిలో ప్రభంజనం సృష్టించిన రచయిత్రులంతా ఏమయ్యారు? వారు నవలలే తప్ప చెప్పుకోదగిన కథలేమీ రాయలేదా? రాసినా విమర్శకులు, చాలామంది. పేర్కొన్నట్లు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, అపార్థాలూ, కలహాలతో నిండిన వంటింటి సాహిత్యమేనా? - ఇలా అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి.
1950కి ముందు రచయిత్రులనీ, వారి కథల్నీ సేకరించటం నాకు అలవికాని పనిగా తోచింది. అందుకని స్వాతంత్య్రానంతర కథారచయిత్రులను- అంటే 1950ల నుండి 1980ల వరకూ అనగా నా ముందుతరం రచయిత్రులను, అందులోనూ కథలు రాసినప్పటికీ కేవలం నవలారచయిత్రులుగా మాత్రమే పాఠకులూ, విమర్శకులూ గుర్తించే వారినికూడా ఎంపిక చేసుకున్నాను.
రచయిత్రుల కథాసంపుటాలను సేకరించి, వాటిలో లేని కథలను కథానిలయం వెబ్సైట్ నుండి దిగుమతి చేసుకుని చదివాను. ఆ రోజుల్లో పబ్లిషర్లు పుస్తకాలు వేసుకొని అమ్ముకునేవారు. అందువల్ల ప్రచురింపబడిన కథల సంపుటాలకు ఆవిష్కరణ సభలూ, ఉపన్యాసాలూ, వ్యాసాలు రాయించుకోవటం వంటి ప్రచార పటాటోపాలు లేక ఆ యా రచయిత్రుల కథల సంపుటాలు ఎన్ని వెలుగు చూశాయో కూడా తెలియని పరిస్థితి.
చాలామంది రచయిత్రుల కథలు యాభైకి పైగానే దొరికాయి. ఒక్కొక్కరివి చదువుతుంటే ఆనందం, ఆశ్చర్యం, ఉత్సాహం ముప్పేటలుగా నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ఏ రచయితవీ వాళ్ళు రాసిన రచనలన్నీ అత్యద్భుతంగా ఉండవు. అలాగే ప్రతీ రచయితా, రచయిత్రుల సాహిత్యంలోనూ పేర్కొనదగినట్టి రచనలు కొన్నైనా ఉంటాయి. ఆ పనే నేను చేపట్టాను.
ఆశ్చర్యకరంగా రచయిత్రులు రాసిన కథల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి కథలు దొరికాయి. ఆ యా రచయిత్రులకు సమకాలీనులైన రచయితలకు తీసిపోని విధంగా, రచయితలుకూడా స్వీకరించనటువంటి కథాంశాలను తీసుకొని సమర్థవంతంగా రాసిన కథలు ఉన్నాయి. అటువంటి విభిన్న కథాంశాలతో, విభిన్న కథనాలతో రాసిన కథల్నీ, తమకే స్వంతమైన ప్రత్యేక ముద్రని సాధించిన రచయిత్రుల కథల్నీ, కథల్లో మాండలికాల్ని ఉపయోగించి రచనలు చేయని కాలంలోనే చక్కటి తమదైన మాండలిక పద్ధతిలో రాసిన కథల్నీ, దిగువ తరగతుల జీవన విధానాల్నీ, బడుగు బలహీనవర్గాల జీవన విధ్వంసాలనూ శక్తివంతంగా రాసిన కథల్నీ ఆ యా రచయిత్రులు ఆ కథల్ని రాసిన నాటి సమాజ తీరుతెన్నుల్నీ ప్రస్ఫుటింపజేసే కథలన్నింటినీ పరిచయం చేశాను.
నా ముందుతరం రచయిత్రుల గురించే రాయాలనుకున్నాను కానీ, తప్పక రాసి తీరాల్సిందే అనిపించటం వలన, నా సమకాలీన రచయిత్రులు ముగ్గురి కథలను గురించికూడా వ్యాసాలు రాశాను.
ఇందులో కొంతమంది ఈనాటి తరం కథకులకు తెలియకుండా మరుగున పడిపోయిన విస్మృత కథారచయిత్రులు కొందరు ఉన్నారు.
రచయిత్రుల కథల గురించి వ్యాసాలు రాసేటప్పుడు; వారు రాసిన కథలలో ప్రత్యేకతతో కూడిన కథాంశాల్నీ, కథన శిల్పాన్నీ, భాషనీ, భావసాంద్రతనీ, కథలోని పాత్రల విశిష్టతనీ, పాత్రల్ని రూపుదిద్దిన విధానాన్నీ, కథల్లో స్త్రీ అస్తిత్వాన్ని ప్రకటించిన విధానాన్నీ పరిగణనలోకి తీసుకున్నాను. కొన్ని లోపాలున్న కథలూ ఉండి ఉంటాయి. కానీ నేను ఈ వ్యాసాల్ని రాయాలని సంకల్పించుకున్న కారణం ఈతరం కథకులకు ముందుతరం రచయిత్రులను పరిచయం చేయాలనుకోవటమే సన్నీపనికి పురికొల్పింది. వీళ్ళుకాకుండా ఇంకా రాయదగిన రచయిత్రులున్నారు. కానీ నా పరిమితికి లోబడి కొందరిని వదిలేయాల్సి వచ్చింది.
మరుగున పడిపోతున్న కథల్నీ, రచయిత్రుల్నీ వెలికితెచ్చి వందేళ్ళ కథాప్రస్థానంలోని శూన్యాన్ని కొంతవరకైనా పూరించటం లక్ష్యంగా వందలకొద్దీ కథల్నీ చదివే అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాననే అనుకుంటున్నాను.
ఈ వ్యాసాలు రాయటంలో పుస్తకాలు ఇచ్చి సహకరించిన కె.పి. అశోక్ కుమార్ గారికి, ఇంద్రగంటి జానకీబాల గారికి, కాత్యాయనీ విద్మహే గారికి ధన్యవాదాలు. వ్యాసాల్ని ప్రచురించిన భూమిక, చినుకు, పాలపిట్ట, ప్రజాసాహితి, విశాలాక్షి, వివిధ పత్రికలకు; సారంగ, విహంగ, గోదావరి వెబ్ పత్రికల సంపాదకులకు ధన్యవాదాలు.
ఏ కథలపై ఏ వివరాలు తెలుసుకోవాలన్నా, ఏ కథకుల కథలను సేకరించాలన్నా పరిశోధకులకు కథల కల్పవృక్షం 'కథానిలయం'కు మరిన్ని ధన్యవాదాలు.
కవిత్వ స్వాప్నికుడు ఆవంత్స
~ కవిత్వ స్వాప్నికుడు - ఆవంత్స సోమసుందర్ ~
"చదువును మించింది సంస్కారం.బిరుదుల్ని మించింది సొంత పేరు.పదవిని మించింది వ్యక్తిత్వం.ఈ మూడు సాధనాలు సోమసుందర్ పురోగమనం రహస్యాలే.తెలుగు ఫ్యూడల్ వికృతాలన్నింటితోనూ వ్యతిరేకంగా పోరాడడానికి ఎన్నో మార్చింగ్ సాంగ్స్ వ్రాసిన అభ్యుదయ వైతాళికులలో సోమసుందర్ ఒకరు" అంటారు మిరియాల రామకృష్ణ.
క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని గోదావరి జిల్లాయువజన సంఘానికి ఉపాధ్యక్షుడై, అరసంలో చేరి 1945లో రాయల్ ఇండియన్ నేవీ నిర్వహించిన ధర్నాను ప్రోత్సహిస్తూ మొట్టమొదటి అభ్యుదయకవిత ' ఇంక్విలాబ్ జిందాబాద్ ' అంటూ ముందుకు నడిచినవాడు ఆవంత్స సోమసుందర్.
సోమసుందర్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వ్రాసిన ఈయన మొదటి గీతంగా చెప్పుకోదగిన కవితలో --
"రండి రండి ఉక్కుముక్కు కాకుల్లారా
రండర్రా గద్దల్లారా రండి రండి
సమరంలో క్షతగాత్రుడనై పడిపోయిన
నా శరీరాన్ని తినివేయండి ..........." అంటూ గర్జించాడు.
దొడ్డి కొమరయ్య మరణ సమయంలో బాధతో కూడిన ఆవేశంతో రాసిన 'ఖబడ్ధార్' కవిత " ఖబడ్దార్ ఖబడ్దార్ / నైజాం పాదుషా
బానిసత్వ విముక్తికై /రాక్షసత్వ నాశముకై
హిందూ ముస్లిం పీడిత/శ్రమజీవులు ఏకమైరి
అమరుడు మాకొమురయ్య/అనంతయ్యఅనంతుడే
అజేయులై ప్రకీర్తులై) చిరస్థాయి నిలుస్తారు" అంటూ రాసిన కవిత అనేక భారతీయ భాషలలోకి అనువదించబడింది అంతేకాక రేడియో మాస్కోలో కూడా ప్రసారం చేయటం విశేషం.
నిజాం పాలనకు వ్యతిరేకంగా దాశరథి ప్రభావంలో తెలంగాణ పోరాటానికి మద్దత్తుగా 'వజ్రాయుధాన్ని ఝళిపించారు. నిజాం వ్యతిరేకంగా రాసిన కవితలన్నింటినీ వజ్రాయుధం పేరిట పుస్తకం గా విడుదలచేసారు.
" ఒక వీరుడు మరణిస్తే
వేలకొలది ప్రభవింతురు!
ఒక నెత్తుటి బొట్టులోనె
ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు!"
అంటూ చేసిన నినాదం కేవలం తెలంగాణా పోరాటానికే కాదు, ప్రతీ ప్రజా పోరాటానికి ఊపిరులూదుతుంది.ఇప్పుడు కూడ సోమసుందర్ విప్లవ నినాదం నగరాల గోడలమీద, ప్రజలనాలుకల మీద ప్రతీ వుద్యమంలోనూ నినదిస్తూనే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదేమో.
కొంతకాలం కమ్యూనిస్టు కార్యకర్తగా కూడా పని చేయటం వలన కావచ్చు కవిత్వంలో అంతర్లీనంగా ఆ భావజాలం ప్రవహిస్తూంది. ఈయన కవిత్వం చదువుతుంటే ఆసాంతం మానవుడే ప్రాతిపదికగానూ సమాజమే నేపథ్యం గానూ ఉంటుంది.
తర్వాత్తర్వాత రాజకీయాలు, సాహిత్య వ్యాసంగము రెండింటినీ నిర్వహించటంలో తనకెంతో ఇష్టమైన సాహిత్య సృజన చేయలేకపోతున్నానేమోననే ఆలోచనతో క్రమక్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరిగి పూర్తిస్థాయిలో సాహిత్యానికే అంకితం మయ్యారు సోమసుందర్.
వజ్రాయుధంనుండి విస్తరించిన వీరి నిర్వారామ కవితా యాత్రని గమనిస్తే సమాజంలోని సామాన్య మానవజీవితంలోని అనేకానేక సంఘర్షణలూ, పోరాటాలూ, సమకాలీన సమాజ నేపధ్యం విభిన్నకోణాలలో ఆవిష్కరింపబడుతూనే వుంటుంది.
" ఉద్యమానికీ నా హృదయానికీ
దూరభారాలూ స్థలాంతరాలూ తొలగి-
జనం ప్రదర్శించే ప్రతి పురోగమనంలోనూ శతఘ్నిగా విస్ఫోటిస్తాను;
నా గళం కాహళం గగనం నాకు తాళం---
నా కవిత్వం సమతా శతారం....."అంటూ ప్రయోగాత్మకంగా తన "జీవనలిపి"ని ఆవిష్కరించుకున్నారు.
"గత ఆగష్టులో భద్రతాసమితి ఒక ప్రకటన చేసింది. గత ఏభయి సంవత్సరాలలోనూ వలసవాదులు జరిపిన స్థానిక యుద్దాలలో ద్వితీయ ప్రపంచయుద్ధంలో చంపబడినవారికి సరిగ్గా రెట్టింపు మంది- దాదాపు 70 లక్షలమంది చంపబడ్డారని - ఆ ప్రకటన విశదం చేసింది. ఆ వార్త బి.బి.సి వార్తల్లో విన్న మరుక్షణం నుంచి నాకు నిద్ర కరువయింది. బొంబాయి అల్లర్లు నేపథ్యంలో
"రక్షరేఖ"కావ్యంగా ఆవేదన ఆవిష్కారం పొందితేతప్ప నాహృదయానికి ప్రశాంతి చిక్కలేదు.
పరిపూర్ణ ప్రశాంతికోసం కోరుతూ వర్తమాన ప్రపంచానికి రక్షరేఖ కట్టాలన్న సంకల్పమే ఈ కావ్యం"
అంటూ సోమసుందర్ ఆవేదనా భరిత కావ్యాన్ని అందించారు.
"ఆ నల్లని రాత్రిలో, ఆ కారునల్లని చీకటిలో
మనిషి హృదయం జలజ సౌకుమార్యం కోల్పోయి రాజవీధిలో ఠీవిగా నడిచే షార్కుల
వాల ఘాతాలకు ముక్కలయి,
నిర్జీవ శరీరాలు స్తంభాలకు వ్రేలాడినచోట
సలలిత దీపకాంతిగా సౌజన్యం విరుస్తుందని
నేనెలా స్వప్నించను?
మధురగాథలింకెలా విన్పించను"( రక్షరేఖ,1996)
నిత్యకవిత్వ సృజనశీలి అయిన సోమసుందర్ జీవితానికి కవిత్వానికి అభేధంగా నిలువెల్లా కవిత్వమై జీవించిన వారు కనుకే వందకి పైగా గ్రంథాల్ని వెలువరించగలిగారు.అందులో అనేకం దీర్ఘ కావ్యాలే కావటం కూడా విశేషమే. సోమసుందర్ కి ఒక పార్శ్యం రచనావ్యాసంగమైతే రెండవది నిబద్ధత తోడి జీవితం.
1956 వరదలకు చలించి గోదావరి జలప్రళయం కావ్యం కరుణారసప్లావితంగా రచించారు.
"ఏమమ్మా, ప్రళయమువలె పొంగి ఓ గౌతమి
ఇకనైనా దయను చూపి శాంతించవదేమి?
ప్రసవించిన పులివై నీ కన్న బిడ్డలను మమ్ముల
కోరలెత్తి మ్రింగుట ఇది ఏమి న్యాయమే తల్లీ... " అనే వీరి కవితా పంక్తులు
ఇటీవల వరదలు చూసినప్పుడు మనసులో మెదిలాయి.
సోమసుందర్ కవిత్వం సరళత, ఆర్ద్ర గాంభీర్యంగా, ఉదాత్తమైన లోతైన భావాలతో మానవత్వ సురభిళాలు వెదజల్లుతాయి.
శ్రీ వృత్తం,వనితా వృత్తం వంటి విస్మరించిన ప్రాచీన ఛంధస్సును తీసుకుని ఆధునికంగా ఫ్యూడల్ వ్యవస్థ చట్రంలో సమాజం ఎదుర్కొన్న నిరంకుశ అమానుష సంఘటనల నేపథ్యంలో 'రక్తాక్షి'నీ, నక్సలైట్లు రైలుపెట్టెల్ని కాల్చి వేసిన సంఘటన నేపధ్యంగా 'ధూపఛ్ఛాయ' కావ్యాలు రాసారు.
వ్లాడిమిర్ మైకోవిస్కీ రచించిన "A Cloud in Trousers" కావ్యాన్ని చదివినప్పుడు ఆత్మాశ్రయంగా రచించిన ఆ ప్రేమగాథ కలిగించిన ప్రభావంతో ఆరు అధ్యాయాలుగా తాత్విక చింతన ప్రాతిపదికగా "మేఘరంజని " దీర్ఘ వచన కథాకావ్యాన్ని 1959లో సోమసుందర్ రాసానంటారు.
బాబ్రీమసీదు కూల్చిన సంఘటన నేపధ్యంగా "చేతావని "(1994) దీర్ఘ కావ్యంలో--
"చారిత్రక భవనాలన్నీ కూల్చి
పరమత చిహ్నాలన్నీ భస్మరాశులుగా మార్చి
ఎంత అద్భుత రాజకీయం మనది?
మనిషి మనీషిగా సిద్ధి పొందడం
సమాజ జీవిగా తలలోని నాలుకగా మారడం
జీవ చైతన్యంతో భాసించడానికే
కడగొట్టు తమ్ముడికైనా
దుర్మార్గ నరాధముల వల్ల అన్యాయం జరిగినపుడు నువ్వు గొంతెత్తకపోతే
రేపు కడకు నువ్వూ నీ గొంతూ మిగలవు సుమీ!"
అంటూ సంఘీభావం ప్రకటించారు.
ఆరుద్ర, కొత్తపల్లితో కలిసి వెన్నెల రాత్రిలో గోదావరి పరవళ్ళు చూసి పరవశించిన తన హృదయం"నా కరాలు గోదావరి శీకరాలు"అనే కావ్యంగా రూపెత్తింది అంటారు సోమసుందర్.
"గోదావరీ తరంగం
నా ఆపాదమస్తం నిమిరే అమృత కవితా హస్తం!
నా సర్వ ప్రతిభలనూ, ఉన్మిషితంచేసే
గోస్తనీ మాధ్వీక రసం!
ఆమె అడుగులు పడిన నా గుండెలు
సంతస శాలీయ సుక్షేత్రాలు;"
సోమరసం- సుందరకాండ,మేఘరంజని,నాకరాలు గోదావరి శీకరాలు,మోనాలిసా కోసం,చేతావనీ,పాంథశాల, మిణుగురులు అనే కావ్యాల్ని కలిపి " సప్త గోదావరం" గా గ్రంథస్తం చేసారు
"ఎంత దీర్ఘ యాత్ర చేశాడో
ఆద్యంత రహిత ఆదిమానవుడు
బ్రహ్మాండ సదృశ భూవలయంలో
నరుని యాత్రా పదాలు వక్రరేఖలు కావు"--
వంటి వాక్యగమనంతో రాసిన అయిదు దీర్ఘకావ్యాల్ని " క్షితిజరేఖలు"గా వెలువరించారు.
మానవుడు విప్లవానికై చేసిన కృషి నేపధ్యంగానే నాటకం, వ్యాసాలు,పాటలు, ట్రావేలాగ్, విమర్శన గ్రంథాల్ని వెలువరించారు.దేశంలో ఎక్కడ ఏ కదలిక వచ్చినా, ఏ సంఘటన ఎదురైనా ఏదృశ్యం చూసినా సోమసుందర్ స్పందించి కవిత్వంగా ప్రవహించేవారు. అందుకే ఆయన కవిత్వంలో దేశచరిత్రలో సంచలనాలన్నీ దృశ్య మాలికలుగా. నమోదయ్యాయి.
సాహిత్యచరిత్రలో ఒక వ్యవస్థ నుండి మరో వ్యవస్థకు పరిణామక్రమాన్ని సూచించేది సృజనాత్మక రచనే.ఆ మార్పుని మూర్తిమత్వం సమకూర్చేవాడే కవి. ఆదర్శం, సంవిధానం సమపాళ్ళలో కలిపి సమన్వయం చేస్తూ , అభ్యదయసాహిత్యచరిత్రకు ఒక దిశ దశ కల్పించింది వజ్రాయుధం అంటారు ఆయన్ని చదివిన వారు.
తెలంగాణాకు సుదూరంలో వున్నా పీడితుల పక్షాన నిలిచి,బానిసత్వం అంతరించాలని పలవరిస్తూ,కవిత్వంలో ప్రజా చైతన్యాన్ని రగిలిస్తూ,వారిలో పోరాటపటిమని, ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందించేలా వజ్రాయుధాన్ని రాసిన నిబద్దత కలిగిన సాహితీ మూర్తి సోమసుందర్.
స్వతహాగా అభ్యుదయవాది,సిద్ధాంతపరంగా మార్క్సిష్టు కావటాన మార్క్సిస్టు సిద్ధాంతాల్ని విశ్లేషిస్తూ వాటి ఆచరణాత్మక మార్గాల్ని అన్వేషించిన వారు ఆవంత్స సోమసుందర్.
కవిత్వప్రేమికుడే అయినా ఇతర సాహిత్య ప్రక్రియలకు దూరంగా లేరు.సమకాలీనుల రచనల్ని మెచ్చుకుంటే తాము చిన్నబోతామనుకుంటారు కొందరు సాహితీవేత్తలు.అటువంటిది సోమసుందర్
నారాయణబాబు రచనల్ని 'రుధిరజ్యోతి దర్శనం'గా చూపిస్తే, కృష్ణశాస్త్రి సాహిత్యంలో 'కృష్ణశాస్త్రి కవితాత్మ"ని వెలికితీసినవారూ ఆయనే ,'జాతికి జ్ఞాన నేత్రం' అంటూ కొడవటిగంటి కుటుంబరావు రచనలగూర్చి ,తిలక్ కవిత్వాన్ని' అమృత వర్షిణి'గా, పురిపండా అప్పలస్వామి రచనల్ని `పురిపండా ఎత్తిన పులిపంజా'గా, సినారె రచనల్ని' నారాయణ చక్రం'గా,'గురజాడ గురుత్వాకర్షణ'అంటూ గురజాడ గురించి,'అగ్నివీణ ఆలపించిన అణు సంగీతం'గా అనిశెట్టి సుబ్బారావు గురించి ఇలా పలుసమకాలీన కవుల సాహిత్యం గురించి విశ్లేషణాత్మక గ్రంథాలు వెలువరించటంలోనే వారు సాహిత్యాన్ని హృదయానికి హత్తుకునే తీరు అర్థమౌతుంది.
అదేవిధంగా బుద్ధదేవ్ బోస్, లియోనార్డో డావెన్సీ గురించి కూడా పుస్తకాలు రాసారు సోమసుందర్.
మరింత విశేషం భారతీయ సంగీతకారుల జీవిత చిత్రణలతో "హంసద్వని" పేరిట గ్రంథం తీసుకురావటం.ఇలా నిరంతర పఠనం,అవిరామ సాహిత్య సృజన చేసినవారు ఆవంత్స.
2004 లో రచించిన "అక్షర నాదం" కవితా సంపుటిలోని
"గ్లోబలైజేషన్ తో ఈ భూమి రజస్వలై
నవవరాన్వేషణలో మిటకరిస్తుంది......
హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ తో
అవతరించిన క్లోనింగ్ కోడె దూడ
' అంబా" అని అరవడం
గ్రాంధికమని నినదిస్తుంది. " చదువుతుంటే సోమసుందర్ కవిత్వీకరణలో రెండు తరాలకు వారధిగా ఉన్నారనేది సుస్ఫష్టమౌతుంది.
1969-73 మధ్యకాలములో ' కళాకేళి' అనే సాహిత్య మాసపత్రిక నడపిన సందర్భంలో అనేక కొత్తగొంతులకి ప్రాధాన్యం ఇచ్చేరు.నాటినుండి జీవితాంతం వరకూ కూడా యువ కవులందరికీ ఒక వారధిగా నిలచి ఎక్కడ ఏమంచి రచన కనిపించినా అక్కున చేర్చుకుని వాటిని గురించి తన స్పందనని వ్యాసంగా ప్రచురించేవారు.ఆ కోవలో నా యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కవిత పై సమగ్రంగా సుదీర్ఘ వ్యాసం రాసి విశాలాంధ్ర పత్రికలో ప్రచురించటం నా అదృష్టం.
అంతే కాక ప్రతీ ఏడాది సోమసుందర్ ట్రస్ట్ ద్వారా వచన కవిత్వం, దీర్ఘ కావ్యం,కథ,విమర్శలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించారు.ఆ కోవలో వీర్రాజు గారూ,నేనూ కూడా దీర్ఘకావ్యాల కేటగిరీలో ఆయన చేతి మీదుగా దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి పేరిట పురస్కారాలు అందుకున్న వాళ్ళమే.
“ఆశయానికీ ఆచరణకీ మధ్య తపస్సుకీ ఫలశ్రుతికీ నడుమ సాధారణంగా ఒక అసంతృప్తి మిగిలిపోతూనే ఉంటుంది" అంటారు సోమసుందర్.
ఈ అసంతృప్తే లేనప్పుడే ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు కవులు రాయటం ఆపేస్తారు.ఈ అసంతృప్తే కవిత్వాన్ని జీవితం పొడుగునా ఆంవత్స సోమసుందర్ గారిని ఇతర సాహిత్య ప్రక్రియల్ని తోపాటు 'కవిత్వం' రాయించింది.
బహుశా కవిత్వమే సోమసుందర్ కి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చివరి వరకూ జీవించారు.
( 18-11-2024 న ఆవంత్స సోమసుందర్ గారి శతజయంతి)
-- శీలా సుభద్రాదేవి
8106883099
16, నవంబర్ 2024, శనివారం
సాహిత్య చిత్రకళా సవ్యసాచి - శివరాజు సుబ్బలక్ష్మి
~ సాహిత్య చిత్రకళా సవ్యసాచి -శివరాజు సుబ్బలక్ష్మి ~
'ఇంట్లోని స్త్రీల సంభాషణల ద్వారా భాషలోని సొబగులు అర్ధం చేసుకోవచ్చు' అవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి మాటలు.
ఈ మాటలు గుర్తు వచ్చినప్పుడు శివరావు సుబ్బలక్ష్మిగారు గుర్తుకు రాకుండా ఉండరు.
పన్నెండో ఏట శివరాజు వేంకట సుబ్బారావు (బుచ్చిబాబు) చిటికెనవేలు పట్టుకొని సంసార బంధంలోకి వచ్చిన సుబ్బలక్ష్మిగారు… కథకుడు, చిత్రకారుడు అయిన బుచ్చిబాబు భార్యగా మాత్రమే ఒదిగిపోలేదు. బుచ్చిబాబుగారి రెండు చేతుల్లోని కలాన్ని, కుంచెని కూడాతన చేతిలోకి తీసుకున్నారు. ‘కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనోవ్యాధికి మందుంది, మగతజీవి చివరి చూపు, శివరాజు సుబ్బలక్ష్మి కథలు అనే అయిదు కథా సంపుటాలు, అదృష్ట రేఖ, నీలంగేటు అయ్యగారు, తీర్పు (తరుణ మాసపత్రికలో సీరియల్) నవలలు రాసి తనకంటూ సాహిత్య రంగంలో ఒక ముద్రని సాధించుకున్నారు.
బుచ్చిబాబు గారు కొన్నాళ్ళు అనంతపురం కాలేజీలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేసే రోజుల్లో అదే కాలేజీలో భౌతిక శాస్త్రం బోధించే మా పెదనాన్న కొడుకు లక్ష్మణరావుగారి కుటుంబం ఇరుగు పొరుగు ఇంట్లో ఉండేవారు. వారి స్నేహాన్ని గురించి ఇటీవల ‘పాలపిట్ట’ సాహిత్య మాసపత్రికలో సుబ్బలక్ష్మిగారు రాసిన ‘జ్ఞాపకాలు’లో తెలిపారు. సుబ్బలక్ష్మిగారు బుచ్చిబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్‌లో తమ్ముడి ఇంట్లో ఉన్నప్పుడు 1970లలో లక్ష్మణరావు అన్నయ్య కుటుంబంతో తొలిసారి ఆమెని కలిసాను. ఆ తర్వాత ఆమెను మా దంపతులం పలుమార్లు కలవటం జరిగింది. బెంగుళూరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తరుచూ ఫోన్ల ద్వారా అనేక కబుర్లు చెప్పేవారు.పురస్కారాలు అందుకునే సందర్భంలో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆమె ఫోన్ చేసి పిలవటంతో ఆమె బస చేసిన హోటల్‌కి వెళ్ళి కలిసేవాళ్ళం.
" ఈ కథలు ఒక స్త్రీ మాత్రమే రాయగలదు అనిపించడం శివరాజు సుబ్బలక్ష్మి కథల్లో విశిష్టత "అంటారు పింగళి లక్ష్మీకాంతం గారు.
సుబ్బలక్ష్మిగారి తండ్రి ప్రముఖ గాంధేయవాది ద్రోణంరాజు సూర్య ప్రకాశ రావుగారు అందువలన ఆమెరచనలలో చాలా వరకూ గాంధేయవాద సిద్ధాంతాలు గమనించవచ్చు. ఆమె కథల్లో స్వాతంత్రానికి పూర్వపు సాంప్రదాయ సంస్కృతులే గాక, స్వాతంత్రానంతర పరిణామాలకు గురైన సమాజ పోకడలనూ ప్రతి బింబిస్తాయి.
సుబ్బలక్ష్మిగారి రచనల్లో ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వము, తర్వాత ఆంధ్రా ప్రాంతంలో కుటుంబ వాతావరణం, స్త్రీల మానసిక చిత్రణలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆనాటి సమాజంలో స్త్రీ జీవనచరిత్ర పరిణామక్రమం నిత్యనూతనంగా భాసిస్తూ అభ్యుదయ పథం వైపు పయనించే విధానం తెలుస్తుంది. ఆ రకంగా తెలుగు గ్రామీణ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలలో మహిళల జీవితం గోచరిస్తుంది.
సుబ్బలక్ష్మిగారి కథల్లో స్త్రీలు ఒకసారి నిర్లిప్తంగాను, మరికొన్నిచోట్ల స్థిరచిత్తం కలవారిగానూ కనిపిస్తారు - పాఠకులకు మాత్రం మధ్యతరగతి యువతులుగానే ఆమె పాత్రలు పరిచయం అవుతారు.
పెళ్ళంటే తెలియని వయసులో బాల్యవివాహాల వలన ఎదుర్కొన్న సమస్యల్ని, అమాయకులైన అమ్మాయిలు మూర్ఖపు అత్తగార్లతో అత్తింట పడిన ఆరళ్ళు, మొదటి భార్య చనిపోతే రెండవ భార్యగా వెళ్ళిన అమ్మాయిల మనోభావనలు, మొదటి భార్య పిల్లల అగచాట్లు, ఆర్థిక స్వాతంత్య్రం లేని భార్యలు, ఆడబిడ్డల పెత్తనాలు, అక్క పోతే ఇష్టం లేకపోయినా బావని పెళ్ళాడవలసిన పరిస్థితులు… ఇలా సుబ్బలక్ష్మి గారి సుదీర్ఘ జీవనయానంలో పరిశీలించిన సుమారు యాభై ఏళ్ళనాటి మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ జీవిత చిత్రణలే సుబ్బలక్ష్మి గారి కథలు.
'బుచ్చిబాబు కథలలోలా నా రచనల్లో వర్ణనలు ఎక్కువగా ఉండవ'ని సుబ్బలక్ష్మిగారు చెప్పుకున్నా కథల్లోని ప్రకృతి దృశ్యాల్ని వర్ణించే విధానం చదివినప్పుడు సుబ్బలక్ష్మిగారికి ప్రకృతి పట్ల ఆరాధన కన్పిస్తుంది. అదే వారి చిత్రకళలో దర్శనమిస్తుంది.
మంచు వీడిన కొండ, ఒడ్డుకు చేరిన ఒంటి కెరటం, మూతపడని కన్ను, మరుగుపడిన ఆత్మీయత… ఇలా సుబ్బలక్ష్మిగారి కథల శీర్షికలు ప్రత్యేకంగా కవితాత్మకంగా ఉంటాయి. శీర్షికలోనే కాక కథలో కూడా ”చినుకులు చిటపటలాడుతూ ఒక్కసారిగా సైన్యంలా నేలపైకి ఉరికాయి” వంటి కవిత్వ పంక్తులు కూడా మెరిపిస్తాయి. వీరి కథలలో చాలావరకూ యాభై-అరవై ఏళ్ళనాటి పల్లె జీవితాలు, గ్రామీణ వాతావరణం ఎక్కువగా ప్రతిబింబిస్తుంటాయి. పచ్చని నేలపై నుండి వీచే గాలుల సవ్వడులు, కొబ్బరాకుల మధ్యనుండి వినిపించే చిరుగాలి గలగలలూ, గూడుబండి ప్రయాణాలు మొదలైనవన్నీ గ్రామీణ దారుల పంక్తుల్లో పాఠకులు వీక్షించవచ్చు.
”కర్త-కర్మ-పూర్తి చేసిన కథ”లో రామచంద్రయ్య కూతుళ్ళకు గుడి దగ్గర స్వామీజీ తానిచ్చే తావీదు కట్టుకుంటే గొప్ప దశ వస్తుందనీ, రాజకుమారుడు వచ్చి ఎత్తుకుపోతాడనీ చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఎప్పుడు తమ కల సాకారమౌతుందా అని కలల్లో తేలిపోయే క్రమంలో తమ చేతి గాజులు పోయినది కూడా గమనించరు. రామచంద్రయ్య తనలాగే స్వామీజీ అవుతాడని చెప్పేసరికి బలహీన మనస్కుడైన రామచంద్రయ్య ఇల్లు వదిలిపోతాడు. తర్వాత అనేక మలుపులతో కథ సుఖాంతం చేస్తారు. కానీ కల్లబొల్లి కట్టుకథలు చెప్పి అమాయకులకు వెర్రిమోహాల్ని కల్పించే దొంగస్వాముల గుట్టురట్టు చేసి, వ్యామోహాల పర్యవసానాల్ని కథంతా హాస్యంగా చెప్పే పద్ధతి రచయిత్రి మన ఎదుట కూర్చొని చెప్పేలా ఉంటాయి.
"మొండి మనసుల నీడలేని ఎడారి సుడిగాలిలో కూలిపోయిన భవనం అక్క జీవితం. శూన్యంలో వెలిగించిన ప్రమిదలా ఎంతకాలం నిలవ గలనో!!" అనుకుంది పార్వతి. శిల్పపరంగా, కథనపరంగా, వర్ణనల పరంగా ప్రత్యేకంగా చెప్పదగిన కథ - మట్టిగోడల మధ్య గడ్డిపోచ .మట్టిగోడల మధ్య గడ్డిపోచ’ కథలో అక్క మరణానంతరం బావని పెళ్ళి చేసుకున్న పార్వతి జీవితం, కాలం వేసిన ఎగుడుదిగుడు బండలపైన జీవితంగా రచయిత్రి అభివర్ణిస్తారు.
"కథలు చెప్పేగౌరి " కథలో గౌరిని ఏమాత్రం స్పందన తెలియని బండరాయిలాంటి వాడికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. అతని తల్లి అటువంటిదే. చివరికి గౌరి జీవితంలో గిరి అనే బంధువు వెలుగులు నింపినట్లుగా ముగిస్తారు రచయిత్రి.
”ఆడవాళ్ళ పెట్టెలో” ప్రయాణం కూడా సుబ్బలక్ష్మిగారి సున్నితమైన హాస్యం కన్పిస్తుంది. ”నల్ల మబ్బులు” అనే కథలో డాక్టర్ భార్య సుశీల, తాను చనిపోతే భర్త అభిమానించే సుధని పెళ్ళి చేసుకుంటాడన్న అపోహతో కృశించి జబ్బు తెచ్చుకుని మరణానికి ముందు తన స్నేహితురాలికి రాసే ఉత్తరంలో భర్త, సుధ కోసం పడే తపన గురించి రాస్తుంది. ఆ ఉత్తరాన్ని తిరిగి సుశీలకు పంపుతూ ఆ స్నేహితురాలు భరోసా కల్పిస్తూ రాసిన ఉత్తరం సుశీల చనిపోయాక భర్తకి అందుతుంది. సుశీల స్నేహితురాలు ఉత్తరం లో రాసిన మాటలు రచయిత్రి ఆధునిక భావాలకు సూచనగా ఉంటాయి.
పోస్టు చేయని ఉత్తరం కథలో - ఇందిర భర్త పట్నంలో ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బు పంపుతుంటాడు. ఇందిర సంసార బాధ్యతలు చేపడుతుంది. భర్త పట్ణంలో ఎవరినో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాననీ ,అందుకు ఆమెతో కలిసి ఉండటానికి ఇందిర కూడా సమ్మతించాలని ఉత్తరం రాస్తాడు .ఉత్తరం చదివి ఇందిర భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. నిజానికి ఆత్మహత్య పరిష్కారం కాదు. కానీ ఆనాటి చదువులేని, ఆర్థిక స్వావలంబన లేని స్త్రీలకు అదే పరిష్కారం కావటం దౌర్భాగ్యం .
'కాపురం' అనేకథలో పెళ్ళంటే తెలియని వయస్సులో జానకిని గంగిరెద్దులా అలంకరించి, పెళ్లిచేసి పెద్ద కోడలిగా ఉమ్మడి కుటుంబంపాలు చేయడం,అక్కడ చాకిరిచేసి, అవమానాలు పడుతూ, పుస్తెలగొలుసుతో సహా సమస్తమూ ఆ కుటుంబానికే ధారపోసి దుఃఖంతో స్నేహితురాలి యింటికి వెళ్తుంది జానకి. చివరిలో ఆమె భర్తకి జ్ఞానోదయమై జానకి మీద ప్రేమకలిగి అక్కున చేర్చుకుంటాడని సుఖాంతం చేస్తారు.
'తెల్లవారింది' కథలో మల్లికాంబ, 'మగతజీవి చివరిచూపు' కథలో కాంతమ్మ రెండో పెళ్ళి తీసుకొని అగచాట్లు పడిన మహిళలు
ఒడ్డుకు చేరిన కెరటం కథలో ఆశమ్మ తన అన్నగారి పిల్లల్ని, ఇతర స్వలాభం ఆశించక పెంచుతే ఆ పిల్లలు కాస్తా పెరిగి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆమెని నిర్లక్ష్యం చేస్తారు .అయినాసరే తాను కర్తవ్యపాలన చేసానని తృప్తి పడుతుంది.నిజానికి కన్నపిల్లలే పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారు కూడా ఉంటారు.
సుబ్బలక్ష్మిగారు కథలు రాసేనాటికి సమాజంలో ఆడపిల్లలకి బాల్యవివాహాలు చేసి, రజస్వల కాగానే అత్తగారింటికి అమ్మాయిని పంపించేసి పుట్టింటివాళ్ళు బాధ్యత తీరిందని చేతులు దులిపేసుకునే వాళ్ళు. ఎందుకంటే
ఆనాడు మధ్యతరగతి జీవులలో అధిక సంతానం, ఉమ్మడికుటుంబాలు, ఆర్థికఇబ్బందులు కూడా కారణమే. ఒక్కొక్క సందర్భంలో పిచ్చాసుపత్రిపాలు కావటం, పుట్టినింటా ఆసరా లేక, దైర్యం లేని, చదువులేని, ఆర్థిక స్వావలంబనలేని చావైనా రేవైనా వితంతువులైనా అత్తింట్లోనే పడి ఉండాల్సిన పరిస్థితి.ఇలా ఆనాటి ఆడవాళ్ల జీవితాలు ఏ విధంగా నిరాశలో కూరుకు పోయేవో ఇవన్నీ సుబ్బలక్ష్మిగారి పలు కథలలో దృశ్యమానమౌతుంటాయి.
జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రిగారు ఒకసందర్భంలో 'సుబ్బలక్ష్మిగారి కథలన్ని మనసులోంచి వచ్చిన కథలు'గా అభివర్ణించారు అంతేకాదు " బుచ్చిబాబు నవల కన్నా నాకు సుబ్బలక్ష్మి కథలే నచ్చుతాయి' అని అన్నారని సుబ్బలక్ష్మిగారు నవ్వుతూ చెప్తారు.
మరో రచయిత్రి అద్దేపల్లి వివేకానందాదేవిగారు "సుబ్బలక్ష్మిగారి ముంజేతి కంకణం కథ తన వదినగారి జీవితాన్ని పోలి ఉందని" చెప్పారట. అంతేకాక ఆ కథలోని సహజత్వాన్ని అభినందించారుట.
మనుషుల మానసిక స్వభావాల పరిశీలనకు వీరి కథలు - కావ్యసుందరి కథ, మనో వ్యాధికి మందుంది, మగత జీవి చివరి చూపు,
ఒడ్డుకు చేరిన కెరటం - చక్కని ఉదాహరణలు .అందుకే కథ చదువుతున్నంతసేపు సహజసిద్ధంగా కళ్ళముందు ఆసంఘటనలు జరుగుతున్నట్లుగానే ఉంటాయి.
అరవై సంవత్సరాల కాలంలో సుబ్బలక్ష్మి రాసిన కథల నుండి ఎంపికచేసిన కథల్ని వేదగిరి కమ్యునికేషన్స్ వారు 1998 లో బుచ్చిబాబు స్మారక కథాకదంబం పేరిట ' మనోవ్యాధికి మందుంది " శీర్షికన పుస్తకంగా ప్రచురించారు .
అయిదు కథాసంకలనాలూ,మూడు నవలలు సుబ్బలక్ష్మి గారి సాహిత్య ఖాతాలో వున్నాయి. అయితే తరుణ మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన "తీర్పు" నవల మాత్రం అందుబాటులో లేదు.
సుబ్బలక్ష్మి గారికి పేరు తెచ్చిన నవల - " నీలంగేటు అయ్యగారు " ఎమెస్కో వారు ఈ నవల గురించి " మేము నాగరీకులం మాదే నాగరికత అనుకొనే వాళ్ళ బతుకుల్లో చీకటి, చీకట్లో బతుకుతున్నాననుకొనే పొన్ని కళ్ళద్వారా చూపించే కొత్త పద్ధతి ఈనవల" అని అన్నారు.
నవల ప్రారంభంలోనే " నీలంరంగు గేటులోంచి గుత్తులు గుత్తులుగా పూసిన తెల్ల గులాబీలు గుబురుగా చూడ ముచ్చటగా కనిపించి దారిన పోయేవారిని క్షణమైనా నిలబెడుతుంది "అంటూ రాయటంలో రచయిత్రి భావుకత్వమేకాక ఆమెలోని చిత్రకారిణి కూడా బయటపడుతుంది.
పనిమనిషి పొన్ని దృష్టికోణంలో రాసిన ఈనవల పొన్ని కూడా తెల్లగులాబీలాగే ప్రత్యేకత సంతరించుకొన్న వ్యక్తి.'ఆ వీథిలో సగం ఇళ్ళు తనవేనంటుంది' పొన్ని.తనదీ అని చెప్పుకోగల ఆత్మస్థైర్యంఉంది పొన్నికి అంటారు సుబ్బలక్ష్మి .
సమాజమంతటా పాశ్చాత్యధోరణులు వ్యాపించి విస్తరిస్తున్నకాలంలో మిడిమిడిజ్ఞానం, అవగాహనాలేమి వలన నాగరికత వ్యామోహంలో కృత్రిమ విలువలకు,పోకడలకు లోనైన పాత్రల్ని ఈ నవలలో రచయిత్రి అక్షరీకరించారు.
గృహిణులు తమఅనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు అన్నీ తమ అంతరంగలోతుల్లోనికి విసిరేసి జీవించవలసిన అనివార్యతని "అదృష్టరేఖ" నవలలో చిత్రీకరించారు.అంతేకాకుండా ఆ చిన్న జీవితంలోనే తాము సాధించిన విజయాల్ని, ఆనందాల్ని తలపోసుకొని సంతృప్తిని పొందే మధ్యతరగతి స్త్రీల జీవనవిషాదాలు ఒక అంతర్లీన స్రవంతిగా ఈనవల చూపిస్తుంది.
సుబ్బలక్ష్మి కథలైనా, నవలైనా మధ్యతరగతి మహిళల జీవితాల చుట్టూనే ఉంటాయి అనుకున్నాం కదా! జీవితచిత్రణలే కాక ఆ సమస్యలను వారు ఎదుర్కొన్న విధానం కూడా కొన్ని కథలతో చాలా చక్కగా వివరిస్తారు.సమస్యను సున్నితంగా పరిష్కరించుకొన్న విధానం తెలియజేస్తారు.
బుచ్చిబాబుగారూ, సుబ్బలక్ష్మిగారూ ప్రకృతి దృశ్యాల కోసం తరుచూ గ్రామాలకు వెళ్ళేవారట. ఆ దృశ్యాలన్నీ కళ్ళలో మనసులోనూ భద్రపరచుకొని ఇద్దరూ చిత్రాలు వేసేవారట. బుచ్చిబాబు గారు, సుబ్బలక్ష్మి గారు ఇద్దరూ ఎక్కువగా ప్రకృతిదృశాలే వేయటం విశేషం.అయితే బుచ్చిబాబుగారు వేసే చిత్రాలు యూరోపియన్ చిత్రకళా శైలి అయితే సుబ్బలక్ష్మిగారిది దేశీయమైన శైలి.
ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలే కాక దేవికారాణి. ఇందిరా గాంధీ వంటి కొందరు ప్రముఖుల పోర్ట్రైటులనూ సుబ్బలక్ష్మి గారు సజీవంగా చిత్రించారు.
2015లో ' Nature in Thoughts' పేరుతో బుచ్చిబాబు గారు వేసిన 177 వర్ణచిత్రాల్నీ, సుబ్బలక్ష్మి గారి 140 వర్ణచిత్రాలను కలిపి విలువైన పుస్తకాన్ని వెలువరించారు .
బుచ్చిబాబు గారు దూరమై అనేక సంవత్సరాలు గడచినా వారి దాంపత్య జీవితంలోని అనేక జ్ణాపకాలు ఆమె మనసుపొరలలో భద్రంగా ఉన్నాయి.
శివరాజు సుబ్బలక్ష్మి బుచ్చిబాబుతో గడిపిన ముప్ఫయేళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నాటి విశేషాల్ని చినుకు పత్రికలో పాతిక భాగాలుగా రాసారు. వాటిని ఖుచ్చిబాబు శత జయంతి సందర్భంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ " మా జ్ఞాపకాలు " గా ప్రచురించింది . ఇవి కేవలం వారి జ్ఞాపకాలే కావు. ఆంధ్రదేశంలో జరిగిన అనేక పరిణామాల పరామర్శగా చెప్పుకోవచ్చు.
సుబ్బలక్ష్మి గారిది అద్భుతమైన జ్ఞాపకశక్తి. సుబ్బలక్ష్మిగారితో మాట్లాడుతున్నపుడు ఆమె రాసిన కథ గురించి ప్రస్తావిస్తే ఆ కథ గురించే కాక దాని నేపధ్యాన్ని కూడా ఒక కథలాచెప్పటం ఒక ప్రత్యేకత.
80 ఏళ్ళ వయసుదాటినతర్వాత కూడా సుబ్బలక్ష్మి గారు చిత్రాలు వేయటం మానలేదంటే వారి కార్యదీక్షకు దర్పణం.
టీవీలో వార్తలు వింటూ దానికి దగ్గరగా గల తన జ్ఞాపకాలో, తాను చూసిన సంఘటనల్నో గుర్తు తెచ్చుకొని అక్కడే ఒక కాగితం మీద ఒక కథలా రాసేస్తుంటారని వీరి దత్త పుత్రుడు సుబ్బారావుగారు చెప్తారు.
సుబ్బలక్ష్మిగారిని కలిసి మాట్లాడు తుంటే ఎవరికైనా మంచి ఉత్సాహం కలుగు తుంది. ఆవిడ మాటలు వింటుంటే మనం కూడా గొప్ప ఎనర్జీని పొందిన అనుభూతిని పొందుతాము.
అరవైఏళ్ళు దాటేసరికి నీరసం పడిపోయి ఇంక జీవితం పూర్తై పోయిందని చతికిల పడిపోయే వారికి సుబ్బలక్ష్మిగారి లాంటి వారిగురించి తెలియ చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవితాన్ని ఎలా రంగులమయంగా చైతన్యవంతంగా చేసుకోవచ్చో తెలుస్తుంది .
శివరాజు సుబ్బలక్ష్మిగారు రచయిత్రి గానూ,చిత్రకారిణిగానూ తన జీవితకాలమంతటినీ సృజనాత్మకంగా పరిపూర్ణతను చేకూర్చుకున్న చైతన్యశీలి.
ఆవరణాన్నంతటినీ పరిమళభరితం చేసే పండుసంపంగిలాంటి సుబ్బలక్ష్మిగారు శతవసంతానికి నాలుగేళ్ళతక్కువలో భౌతికంగా దూరమైనా ఆమెను తెలిసినవారికి, కలిసినవారికి ఆమె చేతిలో చేయేసి నవ్వుతూకబుర్లు చెప్పటం
కళ్ళలో మెదులుతూనే ఉంటుంది.
-- శీలా సుభద్రాదేవి
5, నవంబర్ 2024, మంగళవారం
విశిష్ట రచయిత్రి - శీలా సుభద్రాదేవి - శైలజామిత్ర వ్యాసం
విశిష్ట సాహితీవేత్త శీలా సుభద్రాదేవి
-శైలజామిత్ర
కవిత్వంతో పాటు అనేక నూతన ప్రక్రియలు ఆవిర్భవించాయి. కవిత్వం రూపంలోనూ సారంలోనూ ప్రముఖ కవయత్రి, రచయిత్రి .
సాహిత్య రంగంలో ఇది అస్తిత్వ యుగం. ఆధునిక సాహిత్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ పోకడలు కనిపిస్తూ ఉన్నాయి. విశేషించి తెలుగు సాహిత్యంలోనూ ఈ ప్రభావం కనిపిస్తున్నది. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆధునిక సాహిత్య యుగం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యం నుంచే వచన విప్లవాత్మక మార్పులకు లోన్కెంది. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం విప్లవ కవిత్వం, అస్తిత్వవాద కవిత్వమనే పాయలుగా కవిత్వ ఉద్యమాలు నిర్మించబడ్డాయి. ఆస్తిత్వవాద యుగంలో భాగంగా స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీ వాదం, బహుజన వాదం, బీసీ వాదం ఇత్యాది సాహిత్య పాయలు తమ సొంత గొంతుకను వినిపించడం ప్రారంభమైంది. తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం ఇతమిద్దంగా పూర్తిస్థాయిలో రూపుదాల్చకముందే స్త్రీల సమస్యలపై తమకలాన్ని సంధించిన వారు వీరు అంటే 1980ల నాటికే ఈమె పురుషాహంకారాన్ని సవాల్ చేస్తూ కవిత్వం వ్రాసిన ఘనత శీలా సుభద్రాదేవి గారిది. సుమారుగా 1976 నుండి నేటి వరకు సామాజిక స్పృహతో ప్రత్యేకించి స్త్రీల సమస్యల పై తనద్కెన వాణిని వినిపిస్తూ వస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సాహిత్యంలో తనద్కెన ముద్ర వేస్తున్న విశిష్ట సాహితీవేత్త శీలా సుభద్రాదేవి. సునిశిత దృష్టితో సమాజాన్ని పరిశీలిస్తూ సామాజిక బాధ్యతతో కవిత్వం రాస్తున్నట్లుగా వీరి సాహిత్యాన్ని చదివితే అవగతమవుతుంది.
శీలా సుభద్రాదేవి గారు ప్రముఖ కవయిత్రి, కధారచయిత్రి ఈమె చిత్రకారిణి కూడా ఈమె 1949లో విజయనగరంలో జన్మించారు. ఈమె ప్రముఖ రచయిత, చిత్రకారుడు స్వర్గీయ శీలా వీర్రాజు గారి సతీమణి ఈమె తొలిరచన 1975లో వెలువడింది. వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలంటే 1997 లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఈమెకు ఉత్తమ కవయిత్రి పురస్కారం లబించింది. తెలుగు సాహిత్యంలో శీలా సుభద్రాదేవి గారు ఎన్నెన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వీరు రచించిన గ్రంథాలను ప్రస్తావించాలంటే ముఖ్యంగా ఆకలినృత్యం మోళి, తెగిన పేగు, ఆవిష్కారం, ఒప్పులకుప్ప యుద్ధం ఒక గుండెకోత, ఏకాంత సమూహాలు, బతుకుబాటలో ఆస్తిత్వరాగం, నా ఆకాశం నాదే. శీలా సుభద్రాదేవి కవిత్వం (1976-2009) ముద్ర (వనితల కవితల సంకలనం సంపాదకత్వం భార్గవీరావుతో కలిసి) వంటి కవితా సంపుటిలు, రచించారు. ముఖ్యంగా వీరు స్త్రీలపై రాసిన కవిత్వంలో ఎంతో సంయమనాన్ని పాటించారు. స్త్రీవాదం అంటే: పురుష ద్వేషమే అనుకునే స్థాయిలో తెలుగులో కవిత్వం వచ్చింది. దానిని సమూలంగా రూపుమాపుతూ స్త్రీవాద సాహిత్యానికి ఒక సంపూర్ణ అర్థాన్ని కలుగజేసిన ఘనత వీరిదే. అంతే కాకుండా సుభద్రా దేవి కవిత్వంలో స్త్రీ సాధికారత, ఆత్మగౌరవం, స్త్రీ హక్కులు, స్త్రీల వేదనలు, స్త్రీ స్వేచ్ఛ ఇత్యాది అంశాలు ప్రస్పుటంగా కనిపించినా ఎక్కడా పురుష ద్వేషంకనిపించదు. స్త్రీ సమానత్వకాంక్ష మాత్రమే బలంగా వినిపిస్తుంది. సుభద్రాదేవి: ప్రగతి కాముకత కలిగిన సాహితీవేత్త. సామాజిక అంతరాల పట్ల నిరసన, సమసమానత్వ భావన, సాంఘిక ఆర్థిక సమానత్వకాంక్ష వీరి కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తున్నది."నా పేరు జనం/ నా వాడ సోషలిజం" అని ఎలుగెత్తి చాటిన రచయిత్రి సుభద్రాదేవి శ్రమజీవుల దు। బాన్ని అద్భుతంగా అక్షరీకరించారు. రాజకీయాలు వ్యాపారంగా మారుతున్న రోజుల్లో అబద్దపు హామీలతో అందలానికి ఎక్కి పేదలను మరింత పేదలుగా మారుస్తున్న వైనాన్ని అనేక కవితలలో చూపారు. ప్రకృతి దృష్టిలో అందరూ సమానులే పంచభూతాలు ఏ ఒక్కరి పొత్తు కాదు అని నమ్మే ఈ కవయిత్రి ఈ ప్రకృతి శక్తులు కూడా గతి లేని వాడి మీదనే నిరసన ప్రకటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు వరదలా పొంగి పేదల గుడిసెలను ముంచెత్తుతున్నదని, పెనుగాలులు గుడిసెల తాటాకులను ఎగురవేసుకుపోతున్నాయని నిప్పు కూడా గుడిసెల పైనే తాండవమాడుతున్నదని, ఇక ఆకాశపు అందాలను చూసే తీరిక కూడా పేదలకు ఉండడని, నేల పూర్తిగా ఉన్నవాడి బానిస అని పంచభూతాలు పేదలకు అందడం లేదని ఆవేదన చక్కగా కవిత్వీకరించారు. దౌర్జన్యం పై అవసరమైనప్పుడు తిరుగుబాటు తప్పదని హెచ్చరిక సుభద్రాదేవి కవిత్వంలో కనిపిస్తుంది. అలాగని కేవలం కవిత్వమే కాకుండా దేవుడుబండ, రెక్కలచూపు, బస్కూలుకతలు! కథా సంపుటిలు రచించారు. నీడలచెట్టు అనే సంచలనాత్మకమైన నవల చతుర లో ప్రచురితమైంది. డా.పి. శ్రీదేవి, నిడదవోలుమాలతి రచనాసౌరభాలు వంటి మోనోగ్రాఫ్ లు, గీటురాయి పై అక్షరదర్శనం, కథారామంలో పూలతావులు వంటి వ్యాస సంపుటిలు వీరి రచనాశైలికి నిదర్శనాలు.
నిర్మలత, సౌమ్యత, నిరాడంబరత, స్పష్టత పూర్తిగా కలిగిన రచయిత్రి వీరు. ఎదిగిన కొద్దీ ఒదగాలనే తీరు వీరిని చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది. వీరు 'యుద్ధం ఒక గుండె కోతొ" 'బతుకుపాటలో అస్తిత్వరాగం" వంటి దీర్ఘ కవితలు రచించడమే కాకుండా తొలి దీర్ఘకావ్య కవయిత్రిగా పేరుగాంచారు. యుద్ధం ఒక గుండెకోత అనే దీర్ఘకావ్యంపై మధురకామరాజు విశ్వవిద్యాలయంలో ఎంపిల్ పరిశోధన జరిగింది. అలాగే ఈ ప్రక్రియ ఒకచోటే ఆగిపోకూడదని ప్రతి కవి దీర్ఘకవితలు రాయాలని నిరంతరం తపిస్తూ వుంటారు. ఎక్కడ దీర్ఘకవిత వున్నా ఎంతో శ్రద్దగా చదివి ప్రోత్సహిస్తారు. కొన్ని కుటుంబ పరిస్థితులవలన ఎనిమిదవతరగతితో చదువు మానేసి ఏడాది పాటు తమ అక్క ఇంట్లో వుండి అక్కడున్న గ్రంథాలయంలో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్ధం అయినా కాకపోయినా విరివిగా చదివారు అనే వీరి ఇంతటి రచనాశైలికి దోహదం చేసిందంటారు. వీరి అన్నగారు కొడవటిగంటి లీలామోహనరావు చిన్నన్నయ్య కొడవటిగంటి కాశీపతిరావులు కూడా అనేక వ్యాసాలు, కథలు రచించారు. వివాహనంతరం డిగ్రీ పూర్తిచేయడంతో పాటు 1972 లో హైదరాబాద్ లో అడుగు పెట్టారు ముఖ్యంగా వీర్రాజుగారు కూడా సాహితీ వేత్త కావటం నా సాహిత్య కృషికి దోహదపడిరదని అంటారు. సహజంగా చిత్రకారిణి అయిన వీరు వివాహానంతరం బాధ్యతల మూలంగా వున్న కాస్త సమయాన్ని రచనా వ్యాసంగానికే వెచ్చించారు. రచన ఏదయినా నేలవిడచి సాము చేసేవి కాకుండా సమాజోద్దరణకై రచనలు చేసారు. 2009 లో అప్పటి వరకూ వచ్చిన ఎనిమిది సంపుటాలను కలిపి "శీలా సుభద్రాదేవి కవిత్వం" పేరిట వీర్రాజు గారు వీరి అరవయ్యేళ్ళు జన్మదిన సందర్భంగా ప్రచురించారు. కాలం గడిచిన కొద్దీ ఏ సాహితీవేత్తకైనా రాయాలనే తపన, ఓపిక మరుగున పడిపోతాయి. కొందరు ఎందుకు రాయాలని ప్రశ్నిస్తూ నిలిచిపోతారు. కొందరు రచించినవి కొన్నే అయినా వాటినే తమ ఉనికిగా చాటుకుంటూ నిత్యం పోరాటం చేస్తుంటారు. కానీ శీలా సుభద్రాదేవిగారు ఇలాంటి ఆలోచనలకు దూరంగా వుంటూ ఎప్పుడూ చిరునవ్వుతో, సంపూర్ణమైన విశ్వాసంతో సాహిత్యమే తమ ఊపిరిగా భావిస్తూ ముందుకు కదిలిపోతుంటారు. ఒక మాటలో చెప్పాలంటే మహిళా రచయిత్రులకు వీరు ఎప్పటికీ మార్గదర్శకులు.
1, నవంబర్ 2024, శుక్రవారం
పరిమళభరిత మాండలికసొబగు మహాసముద్రం దేవకి
~ పరిమళ భరిత మాండలిక సొబగు మహాసముద్రం దేవకి రచనలు ~
"వాస్తవానికి ఇందలి ముచ్చట్లను ఎవరికి వారుగా చదువుకొని మురిసిపోవాల్సిందే తప్ప ఎవరూ వ్యాఖ్యానించకూడదు. సాహిత్యంలో ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియను చాలా సునాయాసంగా, అందంగా, మధురస నిష్యందంగా సాధించిన రచయిత్రి మహాసముద్రం దేవకిగారు "-- అంటారు సింగమనేని నారాయణ.
చిక్కని చిత్తూరు మాండలికంలోని నామిని ''సినబ్బ కథలు' కావచ్చు, తెలంగాణా పాలమూరు మాండలికంలోని యశోదారెడ్డి " మావూరి ముచ్చట్లు" 'కావచ్చు , ముక్కామల చక్రధర్ c/ కూచిమంచి అగ్రహారం'కథలు కావచ్చు ఒక స్వచ్ఛమైన ఆయాప్రాంతాల నోష్టాలజీనీ తెలియ జేస్తాయి.
అదే కోవలోని మహాసముద్రం దేవకిగారు
చిత్తూరుజిల్లాలోని 'వొరిగిపల్లి గెవనాలు' , 'ఇర్లచెంగి కథలు' చదువుతున్నంత సేపే కాక గుర్తుచేసుకున్నప్పుడు కూడా చిత్తూరు ప్రాంత చిక్కని మాండలికపు సాబగులు పాఠకులహృదయాలపై పరిమళ భరితంగా వీస్తాయి.
చదువుకోవాలని తపనపడి చదువుకేకాక నచ్చినవానికీ దూరమై సంసార బాధ్యతలకు బందీయై చివరకు ఇహలోకం నుంచే దూరమైన కస్తూరికథ, అటువంటి పరిస్థితులే అయినా అన్న భరోసాతో, తల్లికి ఇష్టం లేక పోయినా ఇంటినుండి వెళ్ళి తన బతుకును దిద్దుకున్న రాదాబాయి, చేతిలో అరటిపండు పడేసరికి వ్రతాలు, నోములు దండిగా చేసే సంపూర్ణక్క, రాధాబాయి పెండ్లి అనుభవంతో వొరిగిపల్లిలో రెండోది గా నమోదైన సుశీల వర్ణాంతర వివాహం, యామలత,సాలమ్మ,పుష్పా ఇలాంటి స్త్రీలు తన జీవనయానంలో తటస్థ పడిన, తనతోబాటు అడుగులు వేసిన ఎందరెందరో మహిళల్ని తన జ్ఞాపకాలతో సజీవం చేసారు రచయిత్రి దేవకి.
ఈనాడు పల్లెలన్నీ నగరీకరణలో ఎలా ధ్వంసమయ్యాయో, రాజకీయ కక్షలలో ఎలా ఛిద్ర మయ్యాయో తెలియదు. కాని దేవకి మనసుపేఠిక లోంచి ఆమె తెరచి చూపిన జ్ణాపకాలలోని అద్భుతమైన గ్రామీణ దృశ్యాలను పాఠకుల కళ్ళముందు పరిచారు.
పల్లెలోని గంటల మోత, పచ్చని పైరుల శోభలు, ఆడుతూ పాడుతూ తిరిగే అమాయకపు పిల్లల మందహాసాలు,జాతర్ల సంబరాలు, గ్రామీణ పండగల వేడుకలు, సంతలు మొదలైనవన్నీ ఈ కథల్లో కళ్ళ ముందు ప్రత్యక్షమౌతాయి.
ప్రతీకథ వెనకా
వున్న మానవీయ విలువలు, స్నేహపూర్వక మమకారపు అనుభవాలు వొరిగిపల్లి గెవనాలలో చదువుతున్నంత సేపూ పాఠకులకు ఒక కొత్త అనుభవం స్ఫురింపజేస్తాయి. మరో ప్రత్యేకత ఇందులోని కథలన్నీ మహిళల జీవితాల చుట్టూరా వుండే సంఘర్షణలు, ఆవేదనలూ,స్నేహాలూ,ప్రేమలూ,పెళ్ళిళ్ళు మొదలగు సంఘటనలతో నడుస్తాయి.పాఠకులూ వాటితో బాటే నడుస్తారు.
సుమారు అరవై ఏళ్ళ నాటి జ్ఞాపకాలు దేవకి గారి మనసులో సజీవంగా వుండటం వలన ఆమె తన అనుభవంలో వున్న ఎన్నెన్నో సంఘటనల్ని దృశ్యమానం చేస్తూ కథలు రాసి " మా వొరిగిపల్లి గెవనాలు" గా పాఠకులకు అందించారు.
ఇక నాకు ఎంతగానో నచ్చిన రెండో పుస్తకానికి వద్దాం.చిన్నప్పుడు ఆటలంటే ఆరోప్రాణంగా వుండే దేవకికి స్నానం,తలదువ్వుకోవటం,తినటం వలన కాలం వృధా అవుతుందని చింపిరి తలతో చెట్లంటా పుట్లంటాతిరుగుతుందని తల్లి కోపంతో " ఇర్లచెంగి" అనేదట.ఆ విధంగా తాను సృష్టించిన అల్లరి పిల్ల పాత్రని ఇర్లచెంగిగా తీర్చిదిద్దారు.
ఇర్లచెంగి కేంద్రంగా ఉత్తమ
పురుషలో దేవకీ మహాసముద్రం రాసిన చిన్ని కథలే ఈ "ఇర్లచెంగి కథలు". దేవకిగారి ఇర్లచెంగి అల్లరిపిల్ల, తెలివైనది, మొండిది, అనుకున్నది సాధించే రకం.
ఈ కథలన్నీకూడా సుమారు 50-60 ఏళ్ళ నాటి గ్రామీణ వాతావరణం, జీవన విధానం ప్రతిబింబించేలా రాసారు. దండోరావేయటం, పొంబలోల్లాట, గానుగ పట్టడం ఆ వీథుల్లో తిరిగి చూస్తున్నట్లే వుంటుంది .బడిలో ఇర్లచెంగి పారేసుకున్న రెండు రూపాయిల నోటు కోసం సెంద్రంగాడు మాయల మాంత్రికుడులా ఫోజు పెట్టి వేసే సీమ్మంత్రంకి పాఠకుడు కూడా చీమ ఎటు పోతుందో దొంగనెలా బడుతాదా అని ఊపిరి బిగబట్టి చూసేలా కాస్తంత హాస్యాన్ని పండిస్తూ రాసిన కథ ఎన్నదగినది.
ఇర్లచెంగి అక్కతో బాటు సెరుగ్గానిక్కాడ పనికి బోయి అక్క ఎద్దుల వెనుక తిరిగి తోలుతా వుంటే చెట్టెక్కి కూచుని అమ్మ రావటం చూసి చెంగున దూకి అమ్మ దగ్గర మెప్పుకోసం తానే ఎద్దుల్ని తోల్తున్నాననటంలోని తెలివి చూసీ పాఠకులు కూడా
కిసుక్కున నవ్వుతారు.
ఇర్లచెంగితో పాటూ గ్రామాలన్ని పాఠకులు కూడా చేయి పట్టుకు తిరిగి
నడిచి విశేషాలన్ని చూసినట్లుగా అనుభూతి చెందుతారు .
చదువుతున్నవాళ్ళు కూడా ఇర్లచెంగితో పాటూ కొత్త పలకా, బలపం పట్టుకొని ఇస్కూలికి పోతారు.
నీలావతి, అంస, పాండురంగడుతో పాటూ రాగి మాను గట్టుమీద కూర్చుండి బాదమాకులో రాగి సంగటి రుచి అనుభవిస్తారు . ఇర్లచెంగి అయవోరు పలకమీద రాసిచ్చిన అచ్చరాలు దిద్దకుండా కొంచెం కొంచెం బలపం కొరుకుతుంటే రుచి ఎలావుంటుందో అని అబ్బురంగా చూస్తారు.
ఇర్లచెంగి ఏకాసి ఒక్కపొద్దు చేసిన విధం ఎంతచక్కగా చెప్పారంటే ఇది ఈనాటి పిల్లల తీరులో కూడా గమనించొచ్చు.
ఇర్లచెంగి వడలు తింటూ, దొంగతనంగా అన్నం తింటూ చేసిన ఒక్కపొద్దు దేవకిగారు పసిపిల్లల ప్రవర్తనని ఎంతబాగా పరిశీలించారనేది తెలుస్తుంది.
అప్పట్లో వీథిబాగోతాలు, బుర్రకథలు గ్రామాల్లో జరిగేవి.ఆ సమయానికి వొరిగిపల్లె నుండి పొంబలొల్లాట చూడటానికి చాప, బొంత నెత్తినేసుకొని పోవటం.స్టేజికి దగ్గర గా వేసుకు కూర్చోవటం,బొంత పరుచుకుని కాస్తంత సేపు చూసి ఎప్పుడో దానిమీదే పడుకోవడం చాలా
సహజంగా కళ్ళ ముందు చలన చిత్రంలా బయలు దేరిన దగ్గర నుండి ఒక్కొక్క దృశ్యమే తెరలు తెరలుగా కనిపించేలా వర్ణన ఉంటుంది.ఆట పూర్తయ్యాక పెద్దలు వాళ్ళని లేపి ఎత్తుకుని తీసుకువెళ్ళేవారుట.
గ్రామీణ జీవితంతో ముడిపడినవే సామెతలు. అందుకనేనేమో దేవకిగారు తన కథలలో సమయానుకూలంగా పుల్లిరిసి పొయిలో పెట్నట్టు, ఆయనే సరి గుంటే మంగలోనితో ఏంపని, మంత్రాలకు సింతకాయలు రాలవు వంటి సామెతలను ఉపయోగించారు.
అ సంగీతమయ్యోరు సంగీతానికేమొచ్చెగానీ అంటూ జంగమోళ్ళాటలో బోడోడు పాడేపాటలు, బాలనాగమ్మ కథలో పొంబలోళ్ళ గోయిందుడి పాటలు, భారతమయ్యోరు కత చెప్తా మద్దిలో పాడేపాటలు నాట్లప్పుడు పాడే పాటలు, మాలోళ్ళు గొబ్బితడ్తా పాడే గొబ్బిపాటలు ఇలా ఎన్నెన్నో మధ్యమధ్యలో దేవకి జానపద పాటలపై పరిశోధన చేయటం వలనేమో జానపద పాటల సొబగు ఈ కథలలో కన్పిస్తుంది .
పిల్లలు ఆటలాడుతూ బుజబుజరేకుల పిల్లుందా అంటూ ఇర్లచెంగికీ, యామలతకు చేసిన పెళ్ళి గురించి సంబరంగా చదువుకోవచ్చు.
ఇర్లచెంగి అక్కని ఇస్కూలు చదువుకి పంపించేందుకు అవ్వా నాయనా తగాదా పడినప్పుడు " చదువుకోసం ఆడపిల్లలూ మగపిల్లలు అనే తేడా ఉండకూడదనే విషయాన్ని నాయన మాటల ద్వారా ఆధునిక దృక్పథాన్ని రచయిత్రి వ్యక్తపరుస్తుంది.
దేవకి బాల సాహిత్యంలో కూడా విశేషమైన పరిశోధన చేసినవారు కావటాన ఇర్లచెంగి కథల్లో పిల్లల మనస్తత్వాన్ని అద్భుతంగా చిత్రించారు.అంతేకాక జానపద కళారూపాల గురించి అవసరమైన చోట్ల తనకు తెలిసిన పాండిత్యాన్ని ప్రకటించుకోవడం కాకుండా కథాపరంగా వివరించారు.
ఇర్లచెంగి కథలు రాయటానికి ప్రేరణ చిక్కని చిత్తూరు మాండలికంలో కథలు రాసే నామిని సుబ్రహ్మణ్యం నాయుడుగారు అంటారు దేవకి.
ఎవరికైనా బాల్యం అపురూపమైనదే. దేవకి తన బాల్యజ్ణాపకాల్ని ఇర్లచెంగి అనే అల్లరి పిల్ల చేసే దూడుకు పనులతో సహా ఆనాటి గ్రామీణ జీవన విధానాలు,ఆహారపుటలవాట్లూ,విందులూ,వినోదాలూ, పండుగలూ,పబ్బాలూ,ఆధారాలూ మొదలైన అనేకానేక విశేషాల్ని చిక్కటి మాండలికపు సొబగుతో కథలుగా రాసారు.ఇతరప్రాంతాలవారికి కొన్ని చోట్ల మాండలిక పదాలు కొరుకుడు పడకపోయినా కథ చెప్పటంలోని శైలి మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
మహాసముద్రం దేవకిగారిది నిరంతరం ఆటపాటల్లో మునిగి తేలిన అమాయకపు బాల్యం.అందులోనూ బాలసాహిత్యంపై పరిశోధన చేసినవారు,బాల గేయాలు రాసిన అనుభవంతో తన బాల్యం జ్ణాపకాలను ఇర్లచెంగి కథలుగా మనకి అందించారు.
మొత్తంమీద ఈ కథల్ని చక్కని డయాస్పోరా కథలుగా చెప్పుకోవచ్చు.
ఇర్లచెంగి పాత్రని మలిచిన తీరు చాలా బాగుంది.దేవకిగారి ఇర్లచెంగి ఒక ఐకానిక్ పాత్రగా పాఠకులకు గుర్తుంటుంది.
మొదట ప్రచురితమైన "వొరిగపల్లి గెవనాల" నుండి, తర్వాత వెలువడిన "ఇర్లచెంగికథల" వరకూ దేవకి రచనాశైలి చిత్తూరు మాండలీకంలోనే వుంది.
రెండు పుస్తకాలలోను అనేక పాత్రలూ,సంఘటనలు ఒక పుస్తకానికి మరొకటి సీక్వెల్ లా వుంటాయి.
" మనజీవనవిధానంలోని విభిన్న కోణాలు మన ఆచార వ్యవహారాలలో వ్యక్తమౌతాయి. ఏతరం వారికైనా జానపద సాహిత్యం దిశానిర్దేశం చేస్తుందనేది నాభావన "అంటారు మహాసముద్రం దేవకి.
నిర్మలమైన ప్రవాహంగా తన జ్ఞాపకాల పేఠికలోని ఒక్కోక్కటే తీస్తూ తనకై తాను అద్భుత మాండలిక శైలిని పుణికి పుచ్చుకొని మా వొరిగిపల్లి గెవనాలు, ఇర్లచెంగి కథలు రాసారు.
దేవకిగారు అతి చిక్కని మండలీకాన్ని రసరమ్యంగా రాయటంవలన చదువుతున్నంతసేపూ
పాఠకులను మమేకం అయ్యేలా ,ఆసక్తి కలిగేలా వున్న కథనం చదవగా చదవగా ఆ యాసని హత్తుకోగలుగుతాం.ఆ మాండలికంలోని సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాము అనేది నా అనుభవంలో గ్రహించిన విషయం.
28, అక్టోబర్ 2024, సోమవారం
ఇల్లిందల అనుపమ నవలా పరిచయం
~ సంఘర్షణలపళ్ళచక్రం మధ్య నిలిచిన "అనుపమ"~
స్త్రీకి సాధికారత రావాలంటే ఆర్థిక స్వావలంబన ఉండాలి. పెళ్ళి కావాలంటే అందం, చదువు, ఆస్తిపాస్తులు, ఆరోగ్యం ఉండాలి.ఇది నేను చెప్తున్నది కాదు.చిన్నప్పటినుండి విన్న జనవాక్యం.
ఇవన్నీ లేని వాళ్ళు ఏంకావాలి? చస్తూ బతకటమా? బతుకుతూ చావటమా? కాకుంటే జీవచ్ఛవంలా బతకాల్సిందే అని సమాజం స్త్రీనుదుటను రాసింది.దానిని మోసుకుంటూ గతకాలం నుండి నేటికాలం వరకూ స్త్రీ జీవిస్తుంది. ఆ బరువునేను మోయలేను అని విసిరి పారేసి సమాజాన్ని ధిక్కరిస్తే గయ్యాళి అనో, పొగరుబోతు అనో ముద్ర వేసుకోవాలి.
అలా అన్నింటికీ తల వంచుకొని బతికే ఒక అభాగినిలో ఆత్మవిశ్వాసం గురించి రాసినదే ఇల్లిందల సరస్వతి దేవి గారి 'అనుపమ' నవల.
1978 లో ఎమ్.శేషాచలం & కో వారు బాపూ ముఖచిత్రం తో ప్రచురించారు. ఆనాడు కేవలం 3-50 రూ.వెల మాత్రమే.
పూర్తి కథలోకి వెళ్ళకుండా సూచనప్రాయంగా నవల కథాంశం గురించి తెలియజేస్తాను.
అనుపమకు స్కూల్ ఫైనల్ చదువుతుండగా కళ్ళు మండు తుంటే వేడి చేసిందేమో అనుకుంటే ఒకకన్ను పోయి, మరో కన్ను కూడా మసకేసి క్రమంగా పోయే పరిస్థితి వస్తుంది అని తెలుస్తుంది.
అన్ని అమరివున్న వాళ్ళకే పెళ్ళిళ్లు, జరగటం కష్టమైన రోజుల్లో ఒకలోపం ఉన్నప్పుడు పెళ్ళికావటం కష్టం అనే పరిస్థితులు ఆనాడు. సహజంగానే అనుపమని చూసుకునేందుకు పెళ్ళిచూపులకు వచ్చిన పెళ్ళికొడుకులు ఆమె చెల్లిని చేసుకుంటాననే రోజులు కూడా ఆనాడు.
అయితే అసలు దుర్మార్గం ఏమిటంటే 'పెద్దపిల్లకు పెళ్లి కాకుండా చెల్లికి చేస్తే కుటుంబానికి అరిష్టం అంటారు' ఆనాటి కాకుల్లాంటి లోకులు. ఆ దోషం పోగొట్టుకోటానికే ఆ పెళ్ళికొడుకుతోనే అక్క అనుపమ మెడలో గుళ్లోనే మూడు ముళ్ళు వేయించి , తర్వాత చెల్లెలు అనసూయతో పెళ్ళిచేయటం.
నిజానికి ఇవి కూడా ఆనాడు సహజాతీసహజమే. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఆడపిల్లని గుండెల మీద కుంపటిగా భావించే రోజులు కదా అందులోనూ మధ్యతరగతి చిరుద్యోగుల కుటుంబాలకి.
అందుకే మధ్యేమార్గంగా ఆ పెళ్ళికొడుక్కి మరో రెండువేలు అదనంగా కట్నం సమర్పించి అనుపమ మెళ్ళో మూడుముళ్లు వేయించి తర్వాత రోజు ఘనంగా అనుపమ చెల్లెలు అనసూయతో వివాహం జరిపించడానికి నిర్ణయిస్తారు ఆమె తల్లిదండ్రులు.
ఇందులో కూడా ఒక మతలబు చేయటం మరో దుర్మార్గం - తర్వాత ఎపుడైనా పెళ్ళికొడుకు మీదగానీ వాళ్ళ ఆస్తిపాస్తులు మీద గానీ అనుపమ హక్కులు కోరకుండా స్టాంపు పేపరు మీద షరతులు రాయించి సంతకాలతో రికార్డు చేయించడం.
ఇంకా అక్కడ నుండి పుట్టింట్లోనే దిగబడిపోయింది అనుపమ.
అసహాయస్త్రీ పట్ల చేసే దాష్టికాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. తండ్రి చనిపోవటంతో తల్లితో పాటూ అనుపమ అన్న పంచన చేరుతుంది. అప్పటినుండి అనుపమ కష్టాలు మొదలు .
అసహాయంగా ఒకరిమీద ఆధారపడినప్పుడు జరిగే అవమానాలూ, చేసిన చాకిరీకి గుర్తింపు లేకపోవటమూ కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటాయి కదా.
వితంతువైనా, భర్తచే విడిచిపెట్టబడినదైనా స్త్రీ పరిస్థితులు ఎప్పుడైనా ఒకేలా వుంటాయి.తండ్రి చనిపోవడంతో తల్లితో పాటు అనుపమ అన్న చెంతనే చేరుతుంది.అప్పటినుండీ అనుపమకి కష్టాలు మొదలు.
ఇటువంటి అసహాయ స్త్రీల పరిస్థితి యాభై ఏళ్ళక్రితం మరింత దారుణంగా వుండేది. అందుకే ఎవరికి ఏచాకిరీ అవసరమైతే అక్కడకి వారు ప్రేమనొలకబోస్తూ పిలిపించుకోవటం, అవసరం తీరాక బయటకు నెట్టయగల మనస్తత్యం గల స్వార్థ పరులైన మనుషుల చేతులలో కీలుబొమ్మగా మారుతుంది అనుపమ.
ఆవిధంగా పెళ్ళికి షరతుల పత్రం రిజిష్టరు చేయించిన భర్త యింటిలోనే మంచం పట్టిన భర్త మేనత్తకి సేవకు నియమించబడుతుంది. తర్వాత చిన్న అన్న యింటికి వదిన పురిటి సేవకొరకు, ఆ తర్వాత హాస్పిటల్లో విడాకుల భర్త తాలూకు చెల్లెలైన టీబీ రోగికి సేవ చేసేందుకు,ఇలా ఎక్కడ ఏ అవసరం వస్తే అక్కడ పక్షిలా వాల వలసి వస్తుంది అనుపమకు.
అక్కడ డాక్టరు త్రివేణి ఆమె సౌందర్యానికి, సేవాతత్పరతకు ఆకర్షితుడౌతాడు. ఆమె కంటి చూపుగురించి ఆరా తీసి తన స్నేహితుడైన కంటి డాక్టరు చేతపరీక్ష చేయిస్తాడు.
ఆ హాస్పిటల్ లోనే తన కొడుకు చికిత్సకోసం వచ్చిన భారతమ్మ అనుపమని చూసి ముచ్చటపడి ఆమెగురించిన వివరాలు తెలుసుకుంటుంది. అనుపమ తండ్రి వాళ్ళూ తమకి బాగా తెలిసిన వారేనని, ఇరుగు పొరుగులుగా ఉండేవారమని అనుపమ చిన్నతనంలో తమ యింట్లోనే ఎక్కువగా తిరిగేదని చెప్పుకొస్తుంది.
భారతమ్మ భర్త రామబ్రహ్మం కూడా అనుపమ తండ్రివలనే తన కొడుకులు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చారని చెప్పి అనుపమ కంటి చికిత్స కోసమే కాక త్రివేణి, అనుపమల వివాహం వరకూ స్వంత తండ్రిలా తోడ్పడతాడు. అందుకే ముగింపులో అనుపమ, త్రివేణీలను ఫ్లైట్ ఎక్కించిన తర్వాత కణ్వుడిలా దిగులు పడుతున్నాడని రచయిత్రి ముగింపులో ముక్తాయింపుని ఇస్తారు.
-ఇది క్లుప్తంగా చెప్పుకోవాల్సిన కథాంశం.
కధ మొదలు పెట్టటం అనుపమ తన ఆడబడుచు సేవకోసం హైదరాబాద్ లోని టీబి హాస్పటల్ లో ఉండటంతో ప్రారంభించి మొదటి సన్నివేశంలోనే అక్కడి డాక్టర్ త్రివేణిని మెట్ల మీద ఢీకొనటం అతను 'ఆమెను కళ్ళు కనబడటం లేదా' అని అరవటంతో మొదలౌతుంది. అప్పటికీ అయిదు నెలలుగా ఆడబడుచు అనబడే ఆమెతో చీత్కారాలు, అవమానాలుతో అనుపమ మనసు వ్యధతో కృంగి పోయివుంటుంది.. ఏడుస్తూ నిద్రలోకి అనుపమ జారుకోవడం --ప్లాష్ బాక్ గా అనుపమ బాల్యం నుండి కథ చెప్పటం ఆసక్తి కరంగా నడిపింది రచయిత్రి.
మెట్రిక్ పాసై, సంగీతం నేర్చిన అనుపమ అనుకోని పరిస్థితులలో కంటి జబ్బుతో పాక్షికంగా అంధురాలు కావటం, చెల్లెలి భర్త తో పెళ్ళి కావటం, విడిచివేయబడటంతో అసహాయ పరిస్థితుల్లోని స్త్రీ ఏవిధంగా బంతి ఎటు తంతే అటు కొట్టబడినట్లుగా స్వంతవారి చేతే ఎన్ని రకాలుగా అవమానాలు పొందిందో గుండెలు చెమ్మగిల్లేలా రాసి అనుపమ దురదృష్టానికి పాఠకులు కూడా సానుభూతి చెందేలా సంఘటనలను చిత్రీకరించారు రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి.
"సాహిత్యంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఇజం, ఒక్కొక్క దృక్పథం ప్రాధాన్యత వహిస్తూ ఉండటం చూస్తున్నాం: కానీ మానవ నైజంలో మార్పు ఉండదనీ, హృదయ స్పందనకు దేశకాలపాత్రలు అనే అవధులు లేవనీ, సార్వజనీనమైన భావాలను ఏ రాజకీయ సూత్రాలూ బంధించలేవనీ నమ్మేవాళ్ళలో నేనొకదాన్ని" అని నలభై ఏళ్ళ కిందటే తన సాహిత్య దృక్పథాన్ని నిర్భయంగా ప్రకటించిన రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి. సుదీర్ఘ సాహితీ యాత్రలో సమాజ స్వభావాన్ని, సాహిత్య పరిణామ క్రమాన్ని గమనిస్తూ, అనుసరిస్తూ పాత్రల మనోభావాల్ని, మానవ సంబంధాల్నీ తీర్చిదిద్దారు.మధ్యతరగతి జీవితాలలోంచి సమకాలీన సమస్యల్ని తీసుకుని సమాజ పరిణాక్రమంలోనే ఇతివృత్తానికి తగినట్లుగా పాత్రల్ని, సంఘటనల్నీ, సంభాషణల్నీ సమకూర్చారు.
అందుకే చదువుకున్న, ఆలోచించగల అను పమ తన పెళ్లి కోసం తల్లిదండ్రులు బాధపడుతుంటే తనకు పెళ్ళి చేసుకోవాలని లేదని, చెల్లెలికి చేయ మని కూడా చెప్తుంది. సమాజానికి వెరచి తండ్రి చెల్లెలి భర్తతోనే ముందు మూడుముళ్ళూ అనుపమ మెడలో వేయించాలని ఒప్పించ బోతాడు .
ఆ సందర్భంలో " కంటిచూపు లేక పోవటం నా జీవితానికి దెబ్బే. కానీ ఈ మూడుమూళ్ళ వల్ల వరుడు నన్ను అవమాన పరిచినట్లు కాదా? అనసూయకు నామీద ఏం గౌరవముంటుంది? నేను వివాహానికి పనికి రాని దాన్నన్న చీటీ నాముఖానికి కట్టించుకున్నట్లే కదా? ఇంత అవమానం చేస్తారా? " అని తండ్రిని ప్రశ్నిస్తుంది అనుపమ.ఇక్కడే అనుపమ వ్యక్తిత్వాన్ని రచయిత్రి చాలా స్పష్టంగా ప్రకటిస్తుంది. తర్వాత పరిస్థితులకు, తల్లిదండ్రుల మాటలకు తలవొగ్గి అనుపమ తనను కాదన్న తన వారికే పరిచారికలా చాకిరీ చేయవలసి వచ్చినా తనలో తాను మధనపడుతుందే కానీ పల్లెత్తు మాట మాట్లాడదు. అది ఆనాటి కుటుంబపరిస్థితులకు అసహాయులు రాజీ పడటాన్నే సూచిస్తుంది.
ఆనాటి మధ్యతరగతి జీవితాలలోంచి సమకాలీన సమస్యల్ని తీసుకొని సమాజాన్ని ప్రతిబింబించేలా ఇతివృత్తానికి తగినట్లుగా పాత్రల్నీ,పాత్రల మనోభావాల్నీ, మానవ సంబంధాల్నీ సంఘటనల్నీ, సంభాషణల్నీ సమకూర్చారు రచయిత్రి.
నవలని చివరి వరకూ కథనంలో ఎక్కడా తడబాటు లేకుండా ఆర్ద్రంగా నడిపించటంలో రచయిత్రి కథాకథన నిర్మాణానికి, కథానిర్మాణంలో రచయిత్రికి గల రచనాకౌశలాన్ని వ్యక్తం చేస్తుంది.
ఇల్లిందల సరస్వతిదేవి సమాజంలోని పరిణామక్రమంలో జీవించిన సామాన్యజన జీవన విధానం, వారి ఆలోచనావిధానం, మానసిక సంఘర్షణలూ, ఆర్థిక సంక్షోభాలూ, అంతులేని ఆవేదనలు, ఆశనిరాశలు, ఆశావాదంతో కూడగట్టుకున్న ధృఢచిత్తాలు, అందుకున్న విజయపరంపరలూ - ఇలా ఎన్నో జీవన చిత్రాల్ని ఏమాత్రం భేషజం లేకుండా, భాషాపటాటోపం లేకుండా పాత్రోచిత సంభాషణలతో చాలావరకు హైదరాబాదు పరిసర నేపథ్యంగానే నవలను అక్షరీకరిస్తారు.
రచన చదువుతుంటే దృశ్యం కళ్ళెదుట కనిపించేలా సన్నివేశ కల్పన, వాతావరణం ప్రతిభావంతంగా అక్షరీకరించారు .
అనుపమ మానసిక సంఘర్షణ, ఆలోచన, వివేచన, ఆనాటి చదువుకున్న యువతుల మనోభావనలకు ప్రతీకగా తీర్చిదిద్దారు. పరిస్థితులకు తలవంచాల్సివచ్చినా ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం,అస్తిత్వ ఆరాటం గల అభిమానవతి అయిన పాత్రగా అనుపమను తీర్చి దిద్దారు రచయిత్రి.
నలభై ఏళ్ళక్రిందట ఒక యువతి తన ధిక్కారాన్ని తెలియజేసే పరిస్థితులు సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో చాలా అరుదుగా ఉంటాయనేది ఈనవల తెలియ జేస్తుంది.
అందుకే "నేను సృష్టించిన స్త్రీ పాత్రలన్నీ క్షమ,ఓరిమి మంచితనం ముందు చూపు కలిగి ప్రవర్తిస్తాయి.స్త్రీలలో వుండే ఓరిమిని చేతకానితనం కింద ఎప్పుడూ అనుకోకూడదు. నా రచనలో స్త్రీ పురుష సమైక్యతను చాటి చెప్పే విశ్వజనీన భావాన్ని పొందుపరచడానికే ప్రయత్నించాను "అంటూ తన స్త్రీ పాత్రల గురించి రచయిత్రి ఒక సందర్భంలో వివరించారు.
సరస్వతీ దేవి సాహిత్యరంగంలోనేకాక సామాజిక సేవారంగంలో కూడా తనదైన ముద్రని సాధించినవారు. ఆంధ్రయువతీ పాలనా మండలిలో చాలా కాలం పని చేయడం వలన ఎందరో యువతుల వ్యధా భరిత గాథలను విని వారి సమస్యలను పరిష్కరించి మార్గదర్శనంచేసిన అనుభవం వుంది. బహుశా అందువలన ఆ ఛాయలు ఆమె రచనల్లోని పాత్రల్లో కూడా ప్రతిబింబిస్తూ ఉండవచ్చును . ఈనవల లోని నాయిక పాత్ర కూడా ఆ విధంగా సృష్టింప బడినదే కావచ్చును.
“దేశకాల పాత్రల కతీతమైనది మానవ మనస్తత్వం. ఈ మనస్తత్వ ధోరణులను,వివిధ వాతావరణాలలో అవి చెందే పరిణామ క్రమాన్ని, విశ్లేషించడం నా మొదటి ఆశయం.అలాగే విశ్వజనీనమైన భావాలను దృష్టిలో పెట్టుకుని రచన చెయ్యడానికే నా కలం మొగ్గు చూపుతుంది.”అనేది తన సాహిత్య దృక్పధంగా చెప్పుకున్న ఇల్లిందల సరస్వతీ దేవి
స్వాతంత్ర్యానికి పూర్వమే సాహిత్య రంగంలోకి అడుగు పెట్టి దాదాపు అన్ని ప్రక్రియలనూ స్పృశించి మూడు వందలకు పైగా కథలూ, నవలలూ,
వ్యాసాలూ, రేడియో నాటికలతో తెలుగు సాహిత్యరంగాన్ని పరిపుష్టం చేశారు.
జి.ఎస్ లక్ష్మి నవలకు ముందు మాట
~ యువతరానికో కరదీపిక - నాన్నలూ! నేర్చుకోండిలా ~
"జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్పవిజయాలు సాధించగలరు " అంటారు స్వామి వివేకానంద.
పిల్లల కోసం మంచి నీతికథలు చెప్పిన జి.ఎస్.లక్ష్మిగారు, పెద్దలకు కాజాలాంటి మంచి
మాటల సుద్దులు చెప్పిన లక్ష్మిగారు, యువతరానికో బాట చూపిస్తూ రాసిన నవల 'నాన్నలూ నేర్చుకోండిలా'
చిన్నప్పటి నుండీ తల్లిదండ్రులు పిల్లల్ని రేంకుల వెంటా, తదనంతరం రూపాయల వెంటా పరుగులు పెట్టిస్తూ డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో తయారుచేయాలనుకుంటారు. అయితే జీవితవిలువల గురించి, సామాజిక బాధ్యతల గురించి తల్లిదండ్రులే కాదు ఏ విద్యాలయాలూ నేర్పవు.
అందుకే బుద్ధిగా తల్లిదండ్రుల మాట విని చదువు కొని సాఫ్టువేరును పట్టుకొని కొంత దూరం ఎదిగిన తర్వాత తాము అణచి పెట్టుకున్న తమ తమ కలల సాకారం కోసం ఈనాడు బీటెక్కుల పిల్లలు తమరూటు మార్చుకొని గాయకులుగానో, నటులుగానో, దర్శకులుగానో, రచయితలుగానో సినీరంగం వైపు వెళ్తే, మరి కొందరు పొలాలు కొని సేంద్రీయ వ్యవసాయాలవైపు, ఇంకొందరు వండి వారుస్తామని చెఫ్ లు గానూ ఆత్మవిశ్వాసంతో కొత్తదారిలో వెళ్ళిపోతున్నారు.
అటువంటి ఔత్సాహికుడైన సాఫ్టువేరు యువకుడిని బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకొని నిర్వహించడానికి దోహదం చేసిన కార్య కారణాలన్నీ జి ఎస్ లక్ష్మిగారి మాటల్లాగే సున్నితంగా, సరళంగానే కాక ఆసక్తికరంగా పాఠకులను పరుగులు పెట్టించి చదివించే పఠనీయత కలిగిన చిన్న నవల " నాన్నలూ!-నేర్చుకోండిలా! "
నేను కథ చెప్పను. రచనలో చూపిన ఆసక్తికర అంశాలు మాత్రమే వివరిస్తాను.
నవలలో ముఖ్యమైన పాత్రలు రెండు సాఫ్ట్ వేరు జంటలు. మధు, శృతి ఒక జంట ఐతే, సుమ, రవీంద్ర మరో జంట. సాఫ్ట్ వేరు జీవులకుండే కష్టనష్టాలన్నీ వీళ్ళకీ ఉంటాయి.అన్నింటికన్నా ప్రధానమైన సమస్య తమ పిల్లల పెంపకం.ఇరువురి తల్లిదండ్రులూ కొంతకాలం వుండి చూస్తారు. ఆ తర్వాత ?...
. తూతు మంత్రంగా కేవలం వ్యాపారాత్మకంగా పనిచేసే కేర్ సెంటర్లలో తమ పిల్లలు అనారోగ్యం పాలు అవుతూంటే తల్లడిల్లుతారు.శృతి ఉద్యోగం కెరియర్ పై ఆసక్తిగల అమ్మాయిగా కనిపిస్తుంది. అందువలన కూతురి బాధ్యత గురించిన ఆ తల్లడింపులోంచి మధుకి పుట్టిన ఆలోచనే తానే ఒక కేర్ సెంటర్ ఎందుకు పెట్టకూడదనేది.
అసలు పాత్రలు కాకుండా ఉన్న మిగిలిన పాత్రలు కూడా వీళ్ళ సహఉద్యోగులే కనుక అవే ఆలోచనలు, అవే ఇబ్బందులు . అందులో ఒంటరి తల్లులు కూడా ఉండటం గమనార్హం. అయితే అందరూ కూడా మంచి ఆలోచనాపరులు, బాధ్యతగల వారే, ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కలవారు.
మధు తన కూతురి కోసం కేర్ సెంటరు నడపాలనే ఆలోచన గురించి, దానిని నడపటంలో చేయల్సిన కృషిని మాత్రమే కాకుండా పిల్లల శారీరక, మానసిక వికాసం గురించి కూడా ఆలోచించటం అనేది ప్రధాన అంశం. దానిని సమర్థించే విధంగా రచయిత్రి కథలోని పాత్రల్నే కాకుండా చదువుతున్న పాఠకులను కూడా కన్విన్స్ చేసే విధంగా నవలను ఆసాంతం రాయటంలో ఈ సమాజం పట్ల ఆమెకు గల అంకితభావం వ్యక్త మౌతుంది .
విదేశాలు వెళ్ళి డాలర్లు సంపాదించే నైపుణ్యం గల యువకుడు కనీసం స్వదేశంలో రూపాయల వెనకైనా పరుగెత్తకుండా చంటిపిల్లల ముక్కులూ, మూతులు తుడిచి, డైపర్లు మారుస్తూ ఉండాలనుకోవటం తల్లిదండ్రుల నుండే కాక, బంధువుల, స్నేహితుల నుండీ నిరసన ఎదుర్కోవటం సహజమే కదా.
దానిని ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా ఎదుర్కొని తన కార్యాచరణను వ్యక్త పరచి విశదంగా వివరించటం కోసం ముఖ్యంగా ఆఫీసు వేదికగా పి.పి.టి ప్రజంటేషన్ చేయటం చాలా వివరంగా రాస్తారు రచయిత్రి. నిజానికి ఈ నవల ఈవిధంగా తమ కెరియర్ని తీర్చి దిద్దుకొని తాము కూడా కార్పోరేటు తరహా కేర్ సెంటర్ ప్రారంభించాలనుకునే వారికి కరదీపికగా ఉపయోగపడ వచ్చుననిపించింది.
ఈ క్రమంలో కొన్నిచోట్ల ఉపన్యాస ధోరణిలో సుదీర్ఘ సంభాషణలు వున్నా అవి ఏమంతగా నవలానుక్రమణలో అడ్డంకిగా అనిపించవు.ఏ సంఘటన ఎంతవరకూ రాయాలో ,ఏ సంభాషణ ఎంతవరకూ చెప్పాలో అంతవరకే చెప్పారు.అనవసర పొడిగింపులేవీ లేవు. అందుకు కారణం జి. ఎస్. లక్ష్మిగారి సున్నితమైన, సాత్వికమైన, సుతిమెత్తని రచనా విశేషం .
బహుశా పిల్లల కథలు రాసే అనుభవం వల్లన కావచ్చు జి. ఎస్. లక్ష్మిగారు ఈ చిన్ని నవల నేటి యువతరానికి అవసరమైన అంశాన్ని తీసుకొని యువతరానికి అవగాహన కలిగించేలా, ఆలోచనాత్మకంగా రచించారు.
జి. ఎస్ .లక్ష్మిగారి నుండి మరిన్ని మంచి రచనలు వస్తాయని అభిలషిస్తూ మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను.
21, అక్టోబర్ 2024, సోమవారం
మందార మకరందమైన జీవితం
~ మందార మకరందమైన జీవితం ~
" ప్రేమ, నిజాయితీ,పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏశక్తీ ఓడించలేదు" అంటారు-- స్వామి వివేకానంద.
వివేకానందుడిని చదివారో లేదో కానీ ఎదుగుతున్న దశ నుండి తన జీవితంలో చూసిన మరణాలు కావచ్చు,మనుషులు కావచ్చు సూర్యప్రకాష్ మనసుమీద వేసిన ముద్ర మాత్రం అక్షరాలా ఇదే.
అందుకే పాతికేళ్ళ క్రితమే అరటిపండుతో ప్రేమను పంచాడు.నృత్యరూపకాలతో ఆహారం ప్రాధాన్యతను చాటి జ్ణానాన్ని పెంచాడు. ఆ కోవలోనే "అందరి ఇల్లు" ప్రారంభం అయ్యింది.అందరి ఇల్లు అనే అంశమే అద్భుతమైనది.
ప్రాణాలకు తెగించి నిజాయితీగా సూపర్ సైక్లోన్ లో అయితేనేం, గుజరాత్ రైట్స్ లోనైతేనేం అంకితభావంతో జాతి మతాలకు అతీతంగా వైద్యసేవలు అందించిన వారు ఈ వైద్య దంపతులు. సూర్యప్రకాష్ తో జీవితమే కాదు ఆశయాలతోనూ చేతుల్నీ కలిపి చేదోడు వాదోడుగా డా.కామేశ్వరి జత కలిసి జంటగా చేసిన కార్యక్రమాలలో ఆత్మహత్యలకు వ్యతిరేకంగానే కాక గర్భ సంచిని కాపాడుకుందాం అంటూ వూరూరా తిరిగి చాటిచెప్పారు.అంతేకాదు డా.కామేశ్వరి గర్భసంచిని కాపాడుకుందాం,మథుమాలతి అనే అవసరమైన రెండు పుస్తకాలను సరళమైన భాషలో తన అనుభవాలను క్రోడీకరించి రాయటం చాలా హర్షణీయం.
ఉత్తరాలతో మానవ సంబంధాలను ఎలా బలపరచుకోవచ్చో ' art of letter writing ' ద్వారా తెలియజేసారు.
అంతటితో ఆగిపోలేదు అన్ని విధాలా రోగగ్రస్తమైపోతున్న సమాజాన్ని ప్రేమా నిజాయితీ అనే వైద్యంతో పునరుజ్జీవింప చేయటానికి నడుం బిగించారు. అందరం మనమందరం అంటూ మందార పూవును చిహ్నంగా ఎంచుకొని వారితో సహకరించే వారినందరిని ఒకే కుటుంబం గా కలుపుకుంటూ సమాజంలో 'అందమైన జీవితాల్ని ' కలగనే స్వాప్నికులు డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ దంపతులు.అందుకే అందరికీ పూలనూ,పూలమొక్కల్నీ పంచుతారు.
అందరికీ ఆహారం, ఆరోగ్యం, మానసిక వికాసానికి పుస్తకం అందినపుడు సమాజమే మారుతుందన్న విశ్వాసంతో అడుగులు వేస్తారు ఈ వైద్య దంపతులు.
స్వాతంత్రోద్యమంలో భాగంగా ప్రజల్లో అక్షరాస్యత పెంచి పుస్తకాలతో జాగృతి పరచటానికి జరిగిన గ్రంథాలయోద్యమ స్పూర్తి ఆలోచనల్లోకి వచ్చిందేమో జంటనగరాల్లోనే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వంద చిట్టి గ్రంథాలయాలే కాకుండా ఆనందనిలయంలో సుమారు ఇరవై వేల గ్రంథాలను సేకరించి ఏర్పాటు చేసిన బృహత్ గ్రంథాలయం అపురూపమైనది.దీనిలో భాగంగా వందరోజులు వంద పుస్తకాల పరిచయ సమావేశాలుగానీ, కరోనా కాలంలో డెభ్భైఆరు రోజులు వివిధ రిసోర్స్ పెర్సన్లతో నిర్వహించిన కార్యక్రమాలు గానీ ఏక వ్యక్తి సైన్యంగా( one man army ) జరగటం నభూతో నభవిష్యతి అనే చెప్పాలి.సూర్యప్రకాష్ ధైర్యం డా.కామేశ్వరి అయితే ఆయన సంకల్పానికి విశ్వాసాన్ని ఇచ్చేది మనోబలం .
ఏ కార్యక్రమం అయినా అదే డా.సూర్యప్రకాష్ ని నడిపిస్తుందా? ఈయనే ఆయా కార్యక్రమాల్ని మనసుకి హత్తుకుని ఎత్తుకుని నడిపిస్తాడో తెలియదు కానీ డా.సూర్యప్రకాష్ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమౌతుంది.కారణం నిజాయితీగా అంకితభావంతో మనస్ఫూర్తిగా చేయడమే అనుకుంటాను.
డా.కామేశ్వరి , డా.సూర్యప్రకాష్ అనే వైద్యదంపతులు తలపెట్టే ప్రతి పనిలో ఒకరి నీడ మరొకరిదిగా ,ఇరువురి అడుగుజాడలు ఒకటిగానే ప్రతీ కార్యక్రమం నిర్వహించటం అపురూపమైనదిగా
ఉంటుంది.
ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టినప్పుడు చాలా భావోద్రేకం కలగటం సహజం.వాటిని ప్రేక్షకులుగా మనమంతా కూడా అనుభవించుతాం.
అటువంటి కార్యక్రమమే జతిన్ గారి మాటలకు ఉత్తేజితులైన కళ్ళముందు ఎదిగిన గాయత్రీ, ఆమెలాంటి మరికొందరు యంగ్ డాక్టర్లను చూస్తుంటే వారికే కాదు మనకు కూడా రేపటి భవిష్యత్తు మీద ఎంతో ఆశ కలుగుతుంది.
డా.కామేశ్వరీ,డా.సూర్యప్రకాష్ నమ్మిన ఆశయాలు, అభిరుచులు , అంకితభావం తప్పక వారందరిలో జాగృతి కలిగించే వుంటుంది .అందులో అనుమానం అక్కరలేదు.వారందరిలో ఆ నిజాయితీ,ఆ అంకితభావం,ఆ స్వచ్ఛత కలకాలం వుండాలని ఆశిస్తున్నాను.
సామాజిక కోణంలో అందరి పండుగగా జరపటం ఎప్పటిలాగే సమాజంపట్ల ఈ దంపతులకు గల పునరంకితం కావాలనే ఆశయసిద్ధికి తార్కాణం.
డా.కామేశ్వరీ& డా.సూర్యప్రకాష్ గార్లు
పదవ తేదీన నిర్వహించిన మాతృసంబరం కన్నులపండువగా తల్లుల చేతుల్లో విరిసిన బాలబాలికల సందడితో అందమైన పూలతోటలా ఆ ఆవరణ అంతా కలకలలాడింది.
రెండవరోజు జరిగిన అభినందన కార్యక్రమం అంతే కన్నులపండువగా జరిగింది.
తర్వాత పదిహేను రోజుల పాటూ యువతరానికి పంపిణీ చేసిన పుస్తకాలు కావచ్చు,యువతరాన్ని జాగృతి పరిచేందుకు వారిలో ప్రేమా,నిజాయితీలను అవగాహన చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కావచ్చు రేపటి భవిష్యత్తుపై సూర్యప్రకాష్,కామేశ్వరి దంపతులకు గల ఆశా,భరోసాలతోనే అని నమ్ముతున్నాను.
పాతికేళ్ళుగా జరిగిన కార్యక్రమాలను పునశ్చరణ చేసుకోవటం డా.కామేశ్వరి, డా. సూర్యప్రకాష్ లకు తిరిగి మరిన్ని కార్యక్రమాలకు పునరంకితం కావలసిన మనోధైర్యాన్ని కలిగించి ఉంటుందని అనుకుంటున్నాను.
డా.సూర్యప్రకాష్ & డా కామేశ్వరి దంపతులకు హృదయపూర్వక శుభాభినందనలు.
-- శీలా సుభద్రాదేవి
పుస్తక ప్రేమికుడు రామడుగు రాధాకృష్ణమూర్తి
~ పుస్తకప్రేమికుడు రామడుగు రాధాకృష్ణమూర్తి ~
అరవై దశకంలో ఎక్కడి ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా బక్క పలుచని అర్భకంగా కనిపించే వ్యక్తి భుజానికో సంచి తగిలించుకుని వచ్చి సభమందిరంలో వెనక సీట్లలో కూర్చునేవారు.అయినా కూడా సభకి వచ్చిన రచయితలందరూ అతనిని పలకరించేవారు.ఆయనే రామడుగు రాధాకృష్ణమూర్తి అని పిలువబడే సాహిత్య ప్రేమికుడు.ఆయన సంచిలో ఎవరి అవసరం కోసమో ఎప్పుడూ పుస్తకాలు ఉంటాయి.
రామడుగుగారికి పరిచయమో,స్నేహమో లేని తెలుగు రచయితలు బహుశా ఉండకపోవచ్చు.ఆయనకు తెలిసిన రచయితలనూ,స్నేహితులైన కథకులనూ,చదివిన పుస్తకాలనూ,నచ్చిన కథలనూ జాబితా చేయాలంటే చాలా కష్టం.ఎందుకంటే అరుణాచలం కూడా వెళ్ళి చలంగారిని కలిసి మాట్లాడి వచ్చిన వారు కదా రామడుగుగారు.
శీలా వీర్రాజుగారు 1961 లో హైదరాబాద్ వచ్చిన మరి కొంతకాలానికే రామడుగు రాధాకృష్ణమూర్తి గారితో పరిచయం మొదలై స్నేహంగా పరిణమించింది .1970 లో స్వాతి పత్రిక ప్రారంభ సంచిక వీర్రాజుగారి ఇంటి ఆవరణలోనే వెలువడింది.
అందులో గౌరవసంపాదకుడుగా వీర్రాజుగారి పేరు చూసి నేను ఆయనకు వీర్రాజుగారి రచనలపై వుత్తరం రాసాను. ఆ వుత్తరం వీర్రాజుగారు రాధాకృష్ణమూర్తిగారికి కూడా చూపించారట.అదిగో అప్పటి నుండీ రాధాకృష్ణమూర్తిగారు నాకు పరోక్ష పరిచయం.
మరికొన్నాళ్లు వీర్రాజుగారితో కలం స్నేహం , తర్వాత మా వివాహం వెనుక కూడా రాధాకృష్ణమూర్తిగారి ప్రోత్సాహం వుంది.నన్ను 'అమ్మాయీ ' అని ఆత్మీయంగా పిలిచేవారు.
నల్లకుంటలో పెద్ద ఆవరణలో అనేక పూలమొక్కల మధ్య కుటీరం లాంటి ఇంట్లో రాధాకృష్ణమూర్తిగారి నివాసం. పుస్తకాల కోసమో, రచయిత లో చిరునామాలకోసమో ఆ దారిలో ఎంతమంది వచ్చే వారో.
నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మా కుటుంబంలోని ప్రతీ అడుగు,ప్రతీ ఎదురుదెబ్బలు, ప్రతీ సంబురాలూ,ప్రతీ కన్నీటి చెలమలో అన్నింటిలోనూ మాకు భరోసా కల్పించిన వారు రామడుగుగారే.
వీర్రాజుగారు ఉద్యోగంలో వాలంటరీ తీసుకున్నాక అప్పటికే రాధాకృష్ణమూర్తిగారు రిటైర్ కావటంతో తరుచుగా ఇంటికి వచ్చేవారు నేను ఉద్యోగానికి వెళ్ళిపోయినా వీర్రాజుగారూ,ఆయనా రోజంతా గడిపేవారు.నేను కవిత్వం ఎక్కువగా రాస్తుంటే " కథలు రాయమ్మా" అని ప్రోత్సహించేవారు.చాలాకాలానికి ఒకసారి వారి గ్రామానికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసీ " అమ్మాయీ నేను మా వూరు వెళ్తే అక్కడ ఇమడలేక పోయాను.నువ్వురాసిన మార్పు వెనుక మనిషి కథే గుర్తువచ్చింది" అన్నారు.అంతకన్నా నాకు గొప్ప అవార్డు ఏముంది?
మా అక్కయ్య పి.సరళాదేవి,అన్నయ్య కొడవంటి కాశీపతిరావు కథలన్నా ఆయనకి చాలా యిష్టం.అందుకే గొరుసు జగదీశ్వరరెడ్డిగారిని విజయనగరం పంపించి అక్కయ్యని ఇంటర్వ్యూ చేయించటం లోనూ, ఎమెస్కో ప్రచురణగా కాశీవతిరావు కథలసంపుటి రావటంలోనూ రామడుగుగారి ప్రమేయం వుంది.
ఇక నేను డా.పి.శ్రీదేవి మీద మోనోగ్రాఫ్ రాయబోతున్నానని తెలిసి రామడుగుగారే రాస్తున్నంతగా సంతోషపడ్డారు.శ్రీకృష్ణాంధ్రభాషా నిలయంకి నన్ను తీసుకువెళ్ళి ఎమ్వీయల్ నరసింహారావుగారికి పరిచయం చేసారు.అంతేకాదు 1956-59 వరకూ గల తెలుగు స్వతంత్రల బౌండులను నాకు ఇంటికి ఇచ్చేలా ఒప్పించారు.ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ పాతబడి శిథిలావస్థలో వున్నాయి.అప్పుడు కెమేరా ఫోనుల్లేవు.జిరాక్స్ చేయడానికీ వీలుగా లేవు.
మూడు చొప్పున ఆ బౌండులను నేను ఇంటికి తెచ్చుకుని కొన్ని నేను కాపీ చేసుకుని శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ ను సమగ్రంగా రాయగలిగానంటే ఆ క్రెడిట్ అంతా రామడుగు రాధాకృష్ణమూర్తి గారిదే.ఆ మోనోగ్రాఫ్ పుస్తకరూపంలో వచ్చాక ఆయన నా కంటే ఎక్కువగా మురిసిపోయారు.
నా కోసమే కాదు ఎవరు ఏ వ్యాసం రాయాలన్నా,పరిశోధనలు చేయ్యాలన్నా ఎలా అయినా పుస్తకం సంపాదించి సమకూర్చే రాయని భాస్కరుడు రామడుగుగారు.మంచి కథల పుస్తకం వెలువడిందని తెలిస్తే కొని భుజానికి వున్న సంచిలో వేసుకునేవారు.అవసరమైనవారికి పంచేవారు.అందుకే ఎవరికైనా పుస్తకం గురించో కథ గురించో అవసరమైన వాళ్ళు మొదట్లో నల్లకుంట లోని ఇంటికి, తర్వాత చిక్కడపల్లి ఇంటికీ వెతుక్కుంటూ వెళ్తారంటే అతిశయోక్తి ఏమీలేదు.
నల్లకుంటలో భార్యవియోగానంతరం ఇల్లు బిల్డర్లకు ఇచ్చి పిల్లలు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు రామడుగు గారు తాను సేకరించిన అనేక పుస్తకాలు మిత్రులకు పంచేసారు.
తన కథల్లోంచి ఎంపిక చేసి ప్రచురించుకున్న శీలా వీర్రాజు కథలు సంపుటిని రాధాకృష్ణమూర్తిగారికి అంకితం చేస్తే కొన్ని పుస్తకాలు తానే కొని స్నేహితులకు పంచిన ఆత్మీయులు రామడుగుగారు. భుజాన వున్న అక్షయపాత్ర లాంటి సంచి నుండి తీసిన పుస్తకాలు అందుకోని ఈ తరం వారికి బహుశా రామడుగు తెలియక పోవచ్చు.
వీర్రాజుగారు తన డెభ్భై అయిదేళ్ళ పుట్టినరోజున తన "అసంబద్ధనిజం" కవితా సంపుటి ఆవిష్కరణ చేసుకుని అదే సందర్భంగా తమ యాభై ఏళ్ళకు పైగా గల స్నేహ బంధాన్ని పురస్కరించుకుని రామడుగు రాధాకృష్ణమూర్తిగారికి స్నేహపురస్కారం అందజేసారు.
రానురాను వయసురీత్యా రెండంతస్తుల మేడ మెట్లు దిగిరాలేక రామడుగుగారూ,ఎక్క లేక వీర్రాజుగారు కలుసుకోవటం తగ్గింది.వినికిడి శక్తి తగ్గి రామడుగుగారు ఫోనుకి దూరం అయ్యారు.దాంతో వారికీ,మా కుటుంబానికి అనివార్యంగా దూరం ఏర్పడింది.
ఇటీవల కొన్ని నెలల క్రితం మాడభూషి రంగాచార్య స్మారక సంస్థ లలితాదేవీ,నేనూ వెళ్ళి రామడుగుగారిని కలిసాము.కానీ మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చింది.మాట్లాడుకున్నామనుకున్నాము కాని మాట్లాడుకోలేదేమో అనిపించింది.కాసేపు కూర్చుని వచ్చేసాము.ఓ పదిహేను రోజుల క్రితం లలితాదేవిగారూ,నేనూ దసరా వెళ్ళాక ఒకసారి రాధాకృష్ణమూర్తి గారిని చూసి రావాలని అనుకున్నాము.తీరా ఆయన తొందరపడి అంతవరకూ ఆగకుండా కన్నుమూసారు. ఆ విషయం తెలిసి హడావుడిగా వెళ్ళినా కంటిచూపుకి అందలేదు.వృద్ధాప్యం నిజంగా శాపమా? మనసులో ఆ రోజంతా కలవరపడుతూనే వున్నాను.
అడిగినవారికి కోరిన పుస్తకం అందజేసే సాహితీ కల్పవృక్షం కూలిపోయింది.
అటువంటి పుస్తకప్రేమికులు అరుదుగా వుంటారు. కథల్ని హృదయానికి హత్తుకునే రామడుగు రాధాకృష్ణమూర్తిగారు దూరమై కథలపుస్తకాలన్నీ చిన్నబోతున్నాయండీ రాధాకృష్ణమూర్తిగారూ మీకు ఇదే అక్షరాశృనివాళులు.
- శీలా సుభద్రాదేవి
18, అక్టోబర్ 2024, శుక్రవారం
నడక దారిలో -45
నడక దారిలో -45
డా.భార్గవీరావు ఒకసారి మాయింటికి వచ్చినప్పుడు 'వందమంది రచయిత్రుల వందకథలను సంకలనం చేయాలనుకుంటున్నాను ' అన్నారు.సరే ముగ్గురం కూర్చొని జాబితా తయారు చేసాం.అయితే కనీసం ఒక సంపుటి అయినా వచ్చిన రచయిత్రులను తీసుకుంటే బాగుంటుందని వీర్రాజుగారు అన్నారు.ఆ రకంగా కొందరి పేర్లు తొలగించాం.వందకన్నా ఎక్కువ పేర్లువున్నాయి.భార్గవిరావు " వారందరికీ వుత్తరాలు రాస్తాను.స్పందించిన వారి కథలు మాత్రమే తీసుకుంటాను.చనిపోయిన వారి కథల్ని మనమే ఎంపిక చేద్దాం" అన్నారు.ఆ పని మొదలైంది.ఆమె మమ్మల్ని ఒక్కరినే కాక చాలా మందిని సంప్రదించింది.దాంతో మొగమాటాలకి లోబడి ఒక్క కథ రాసిన వారివి కూడా ఆమె తీసుకున్నారు.అది మాకు నచ్చకపోయినా మౌనంగా వూరుకున్నాము.భార్గవీరావు సంపాదకత్వంగానే వందమంది రచయిత్రుల వందకథలతో "నూరేళ్ళ పంట" సంకలనం మిళిందీప్రకాశన్ వాళ్ళ ద్వారా వెలువడింది.
నూరేళ్ళపంటకి మంచి గుర్తింపు రావటంతో అదేవిధంగా వందమంది కవయిత్రుల సంకలనం మన ఇద్దరం కలిసి వేద్దాం అంది భార్గవీరావు.మొల్లదగ్గరనుండి మొదలు పెడదాం అంటే సరే అన్నాను.కవయిత్రుల జాబితా తయారుచేసి వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి వాళ్ళ కవితా సంపుటాలను పంపించమని కోరాము.అయితే కొందరు కవయిత్రులు వారే తప్ప ఇతరులు కవయిత్రులూ,కథకులు కానేకారని భావించి కవిత ఇవ్వటానికి నిరాకరించారు.ఒకరిద్దరు ఇవ్వనన్నంతలో ఆగదు కదా.
కవితా సంపుటాలు చదివి అంతకుముందు సంకలనాలలో రాని మంచి కవితలను ఎంపిక కోసం చదవటం నాకు ఆనందం కలిగించింది.అనుకున్నట్లుగా వందమంది కవయిత్రులు కవితా సంకలనం " ముద్ర" ను కూడా మిళిందీ ప్రకాశన్ వారే ప్రచురించారు.మేము ముందుమాటలో కొందరు వాళ్ళ కవితలను చేర్చటానికి ఇష్టపడలేదనే మాటల్ని స్పష్టంగా రాసినా సమీక్షలు రాసిన వారు ఒకరిద్దరు ఎత్తి చూపటం భార్గవీరావుకు ఆగ్రహం తెప్పించింది.
" చిన్నన్నయ్యకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఏర్పడ్డాయనీ,ఆపరేషన్ చేయించుకుంటున్నాడనీ,నీకు హిస్ట్రెక్టమి జరిగినప్పుడు సత్యవతి సాయానికి వచ్చింది కనుక నువ్వు వాళ్ళకి సాయం వస్తే బాగుంటుందని " మా పెద్దక్క ఉత్తరం రాసింది.నాకు సంక్రాంతి సెలవులే కనుక రిజర్వేషన్ చేయించుకుని విజయనగరం వెళ్ళాను.నాతో వాళ్ళు సంబంధం తెంచుకున్నా గానీ నేను రావటం ఆశ్చర్యం కలిగింది.నాతో ఎక్కువ మాట్లాడకపోయినా ఆపరేషను అయ్యేవరకూ సాయంగా వుండి తిరిగి వచ్చేసాను.
అప్పట్లో జాతీయ ఛానెల్లో చాలా మంచి ధారావాహికలు రావటంతో ఎంతో అలసిపోయినా సరే చూడటం అలవాటైంది.అమరావతికథలుకూడా హిందీలో నాటకాలుగా వచ్చేవి.అలాగే ఒక సంచలనాత్మక సుదీర్ఘ ధారావాహికగా మొట్టమొదటగా సులోచనారాణి రాసిన "రుతురాగాలు" సప్తగిరి ఛానెల్లో టెలీకాష్ట్ అయ్యేది నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో యద్దనపూడి సీరియల్ యువతరానికీ,మహిళాపాఠకులకూ ఎంత క్రేజ్ కలిగించిందో అంత క్రేజ్ రుతురాగాలు కూడా కలిగించిందనే చెప్పాలి.బిందునాయుడు,మంజునాయుడు దీనిని గొప్పగా తీసారు.సాయంత్రం నాలుగున్నర కల్లా అందర్నీ టీవీ ముందుకు తీసుకువచ్చిన మొట్టమొదటి తెలుగు టీవీ సీరియల్ గా చెప్పుకోవచ్చు.కానీ దానిని తర్వాత్తర్వాత మరీ సాగదీసి విసుగెత్తించారు.
నాకు తొందరగా బస్సు దొరికితే సీరియల్ టైముకు అందుకునే దాన్ని. దాని తర్వాత ఇక పుంఖానుపుంఖాలుగా వాళ్ళవి వస్తూనే వున్నాయి.
ఇంక మా స్కూల్ లో
ఎయిడెడ్ స్కూల్లో సీనియారిటీని బట్టి అందులో ప్రమోషన్ ఇవ్వాలి.అంతకుముందు లెక్కలు పోస్టులో సోషల్ టీచర్కి ఇచ్చారు ఆమె హెచ్చెమ్ గా ప్రమోట్ కావటంతో ఖాళీ అయ్యింది.నన్ను అందులో నింపాలి.కానీ ఆమె నాకు ప్రమోషన్ ఇవ్వటం ఇష్టంలేక దానిని అలా ఖాళీగానే వుంచి నా జూనియర్స్ నింపాలన్నట్లుచూసింది.ఇంక నాకు విపరీతమైన కోపం వచ్చి ఎమ్మె, ఎమ్మెస్సీ పీజీ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు చించి ఆమెపై విసిరేసి అరిచాను.
నా ఆవేశాన్నీ,కోపాన్నీ,ఆవేదననీ పట్టలేక వీర్రాజుగారితో చెప్పాలంటే ఉద్యోగం మానేయమంటారు.అందుకని చెప్పలేదు.క్లాసులు తీసుకోవటం మానేస్తే పిల్లలు నష్టపోతారు.అందుకని పాఠాలు మాత్రం మానేయకుండా ఏంచేయాలో అనే ఆలోచనలో పడ్డాను.
నేను స్కూలు లో జాయిన్ అయిన దగ్గర నుండి జరిగిన పరిణామాల్ని,వివక్షతలతో నాకు ప్రమోషన్ ఇవ్వని విషయాల్ని కూలంకుషంగా ఉత్తరం రాసి అయిదు కాపీలను సంబంధిత అధికారులకు రిజిస్టర్ పోష్టులో మూడు నెలలకు ఒకసారి పోష్టు చేయసాగాను.మన ప్రభుత్వఆఫీసుల సంగతి తెలిసినా పంపిపుతూనే ఉన్నాను. అవి బుట్టదాఖలు అవుతూ వచ్చాయి.అయినా నేను మౌనపోరాటం మలా సాధించాలని చూసాను.
పల్లవి న్యూజెర్సీ నుండి వచ్చేసి మినియాపోలిస్ లోనే ఉద్యోగంలో చేరింది.కాని అక్కడ నిత్యమూ మంచు కురుస్తుంది.అదీగాక టార్నిడోలు కూడా తరుచూ వస్తుంటాయట.
అందుకని నేను పల్లవికి మెయిల్ ద్వారా రోజూ కాంటాక్ట్ లో ఉండాలని నేర్చుకోవటానికి దగ్గర లోని కంప్యూటర్ సెంటర్ లో చేరాను.స్కూలు నుంచి వచ్చి ఆరింటికి వెళ్ళేదాన్ని .అయితే నేర్పించే ముస్లింకుర్రాడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ కూడా వచ్చినట్లు లేదు.నాకు ఉర్దూ రాదు.ఇంగ్లీషు పెద్దగా రాదు.ఆ అబ్బాయి ఉర్దూ తప్ప మాట్లాడటం లేదు.దాంతో నెలరోజులు ఎలాగో పూర్తిచేసి మానేసాను.ఆ నెలరోజుల్లో కంప్యూటర్ ఆపరేట్ చేయటం ,PPT లు తయారుచేయటం,కాస్తంత ఎక్సెల్ సీటు నింపడం తప్ప మరేమీ రాలేదు.
భారవి ద్వారా ఒక కంప్యూటర్ కొనుక్కున్నాను.అంతకుముందు పక్కింట్లో ఉండే రఘు నాకు rediff mail ఐడీ చేసి మెయిల్ ఎలా ఇవ్వాలో ,ఎలా ఓపెన్ చేసి చూడాలో నేర్పాడు.ఎప్పుడైనా మర్చిపోతానేమోనని ఒక పుస్తకంలో అన్నీ రాసి చెప్పాడు.
అంతలో ఒక శుభవార్త.నేను అమ్మమ్మను కాబోతున్నానని.నేను సంతోషంతో పొంగి పోయాను.అయితే అమెరికా ప్రయాణం తప్పదు అనుకున్నాము.పల్లవి అత్తగారూవాళ్ళూ ముందుగా వెళ్తామనీ పల్లవి డెలివరీ అయిన తర్వాత మమ్మల్ని రమ్మన్నారు.తర్వాత వాళ్ళ అమ్మాయి డెలివరీ టైమ్ కి అక్కడికి వెళ్ళిపోతామన్నారు.ఏ ఆడపిల్లకైనా తల్లి కాబోతున్న సమయంలో తల్లి పక్కనే వుండాలనుకుంటుంది.నాకు కూడా పల్లవిని గర్భంతో ఉండగా దగ్గర వుండటం, తనకి ఇష్టమైనవి,తినాలనుకున్నవీ చేసి పెట్టాలనే కోరిక తీరలేదు. నేను ఆసమయంలో అనుభవించిన వెలితి పల్లవికి రాకూడదనుకున్నాను.కానీ నాకు నచ్చక పోయినా అదే నిర్ణయం అయ్యింది.
మాకు పాస్పోర్టులు కూడా లేవు.ముందు ఆ ప్రోసెసింగ్ మొదలు పెట్టాము.అంతేకాక డిపార్ట్మెంట్ నుండి నాకు ఆరునెలలు సెలవులకి అంగీకారంకి ప్రయత్నించాలి.
డిసెంబర్ మొదటి వారంలో డెలివరీ కావచ్చని అంచనాతో అజయ్ వాళ్ళ అమ్మా నాన్న నవంబర్ మొదటివారంలో వెళ్ళి రెండు నెలలు ఉండి మేము జనవరిలోనో ఫిబ్రవరి లోనో వస్తే వాళ్ళ
అమ్మాయి దగ్గరకు వెళ్ళాలని నిర్ణయం అయ్యింది.
ప్రతీరోజూ కంప్యూటర్ మెయిల్ చెక్ చేసుకొని పల్లవికి రెండు ముక్కలు రాసే దాన్ని.పల్లవిని కూడా అలానే ఎలా ఉన్నది రాయమనేదాన్ని.
ఆరోజు ఎప్పటిలాగే స్కూలు నుండి వచ్చాక మెయిల్ చూస్తే ఆరోజు హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తున్నానని వచ్చాక ఏ విషయమూ మెయిల్ చేస్తానని పల్లవి మెయిల్ పెట్టింది.కంప్యూటర్ ఆఫ్ చేసేసాను.
త్యాగరాజగానసభలో ఏదో సాహిత్య సమావేశం వుందని,నేనూ పక్కింట్లోనే వున్న పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారూ వెళ్దామనుకున్నాము.
ఆరుగంటలకు తయారై ఆటో పిలవాలనుకున్నాము.అయితే కరెంట్ పోయింది.ఎప్పటికీ రావటంలేదు.చిక్కడపల్లి ప్రెస్ కి వెళ్ళిన వీర్రాజుగారు అప్పుడే వచ్చి చిక్కడపల్లి అంతా కరెంట్ పోయింది. గ్రిడ్ లోనే సమస్య వచ్చిందని ఎప్పటికి వస్తుందో తెలియదని అంటున్నారనీ చెప్పారు.ఇంక ఈ చీకట్లో వెళ్ళటం ఎందుకని మేము వెళ్ళే కార్యక్రమం మానుకున్నాము.
సరిగ్గా ఎనిమిదిన్నరకి కరెంటు వచ్చింది.టీవీ ఆన్ చేసాము అమెరికాలో ఉగ్రదాడి అని బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.ముందు మాకేమీ అర్థం కాలేదు.వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంటటవర్లు కూలిపోవడం,పెంటగన్ పై దాడీ టీవీలో చూపిస్తుంటే గుండెల్లోంచి వణుకు మొదలయ్యింది. కంప్యూటర్ తెరిచి పల్లవి మెయిల్ చూడాలనుకుంటే సర్వర్ డౌన్ అయ్యి రావటం లేదు.
అంతలో స్నేహితులనుండి ఫోన్లు రావటం మొదలయ్యాయి. "ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ పల్లవి వాళ్ళు బాగున్నారా " అని ,అలాగే అక్కడవున్న వాళ్ళ పిల్లలు గురించి క్షేమ సమాచారాలు తెలియజేసారు.క్రింద ఇంటి సరోజినీ గారూ,యజ్ణప్రభ గారూ ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు సంగతి చెప్పి పల్లవి గురించి అడిగారు.
అందరి కంఠాల్లో భయం.గుండెల్లో దుఃఖం .పల్లవి నుండి ఫోన్ వస్తుందేమోనని ఒళ్ళంతా చెవులు చేసుకుని ఫోన్ దగ్గరే కూర్చున్నాం.అంతలో ఫోన్ వచ్చింది.హాస్పటల్ కి వెళ్ళి వచ్చానని బాగానే వున్నామని,తమకేమీ ఇబ్బంది లేదని చెప్పాక గుండెలనిండా ఊపిరి తీసుకున్నాం.కానీ ..కానీ... ఆందోళన తగ్గలేదు.దేశదేశాలనుండి చదువులూ,ఉద్యోగాలకూ యువతరం అమెరికాకు తరలిపోతోంది.అప్పులు చేసి మరీ తల్లిదండ్రులు ఆశతో పంపుతున్నారు.ఎంతమందికి గుండెకోత అయ్యిందో కదా అనిపించింది.
మరి కొన్ని రోజులకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా అమెరికా ఆఫ్ఘన్ యుధ్ధం మొదలైంది.
నాలోని ఆందోళననీ,ఆవేదననీ ఓ కవితగా రాసి వీర్రాజు గారికి చూపించాను.చాలా బాగా రాసావనీ,మరికొంత పెంచి దీర్ఘ కవితగా రాయగలవేమో చూడమని వీర్రాజు గారు అన్నారు.
అంతే యుద్ధమూలాలు అన్వేషించటమేకాక, మత విద్వేషాలు యుద్ధానికెలా దోహదమౌతాయో, ఎన్ని కుటుంబాలు, సంక్షోభాలలో ఇరుక్కుంటాయో, యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఎందరు తల్లులు గర్భశోకంలో గుండెకోతను అనుభవిస్తారో,చరిత్ర లోతుల్లోకి వెళ్ళి వీటన్నిటికీ నా దృష్టి కోణంలో కార్యకారణాలను "యుద్ధం ఒక గుండె కోత"ని దీర్ఘ కవిత అక్షరీకరించాను.ఆ వెంటనే పుస్తక రూపంలోకి తీసుకు వచ్చి నాగభైరవ కోటేశ్వరరావు గారి అధ్యక్షతన,అద్దేపల్లి రామమోహనరావు గారు వక్తగా పుస్తకావిష్కరణ జరిపాము.
వడలి మందేశ్వరరావు,కోవెల సంపత్కుమారాచార్య,ఆంవత్స సోమసుందర్ గార్లు నా పుస్తకం అందుకోగానే సుదీర్ఘ వ్యాసాలను రాసారు.అనేకమంది ప్రముఖుల ప్రసంశలు ఆ పుస్తకానికి లభించాయి.
అమెరికాలోని దాడులు,యుద్ధం ఇవన్నీ పల్లవికి సబ్ కాన్సాస్ లో ఆందోళన కలిగించాయి ఓ రోజున అకస్మాత్తుగా ఏడవనెలలోనే నొప్పులు రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయింది.నెలరోజులకు పైనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది.డిస్ఛార్జి అయి ఇంటికి వచ్చి ఓ వారం రోజుల ఆఫీసుకు వెళ్ళేసరికి మళ్ళా అదే సమస్య రావటంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యేది.
రెక్కలు కట్టుకుని నాకు వెళ్ళాలనిపించింది.కానీ ఎలా?
పాస్పోర్టులు వచ్చేసాయి వీసాకి ప్రోసెసింగ్ మొదలెట్టాము.జనవరిలో వెళ్తే వేసవి సెలవులు కలిసొస్తాయని ప్లాన్ చేసాను.డిసెంబర్ కి నేను పోర్షన్ పూర్తి చేసేస్తే పిల్లలకి రివిజన్ చేయిస్తే చాలు అనుకున్నాను.కానీ హెచ్చెమ్ గా వున్న ఉషా " నీవి ఇంపార్టెంట్ సబ్జెక్టులు నీకు బదులుగా ఎవరినైనా ఎంపాయెంట్ చేస్తేనే లీవ్ సెంక్షన్ చేస్తానని చైర్మన్ గారు అన్నారు"అని అంది.నిజానికి అవి ఆమె మాటలే.అంతకు ముందు ఆమె కూడా ఆరేసినెలలు సెలవు పెట్టి వెళ్ళింది.అప్పుడు లేని నిబంధన నాకు పెట్టింది.
ఏమి చేయాలో అనే ఆలోచనలో స్త్రీ సంఘటన లక్ష్మి కలిసినప్పుడు మాటలు సందర్భంలో అన్నాను.లక్ష్మి చెల్లెలు కల్పన ప్రస్తుతం ఖాళీగా వుందని ఆమెని పంపుతానంది.పెద్దసమస్య తీరింది.
మొత్తంమీద నాకు దారి సుగమం అయ్యింది.
పల్లవి అత్త,మామలు నవంబరు మొదటి వారంలో వెళ్ళారు. అనుకోకుండా ఒకరోజు వుదయమే పల్లవికి డెలివరీ అయ్యిందనీ,పాపాయి పుట్టిందని ఫోన్ వచ్చింది.మా ప్రయాణం తేదీ ఇంకా రెండునెలలు వుంది ఈ లోపునే తొందరపడి పాపాయి పుట్టేసింది అనుకున్నాము.
అప్పుడే నాకు ఎరియర్స్ అందటంతో పాపకీ,పల్లవికీ బంగారు గొలుసులు ,ఇంకా కావలసిన వస్తువులు కొన్నాను.
మా ప్రయాణానికి సామాను సర్దుకోవడం ఇవన్నింటికీ రఘు,శంకరం,పొనుగోటి కృష్ణారెడ్డి సహకరించారు.అప్పుడప్పుడు వచ్చి ఇల్లు చూసుకుంటామని, మొక్కలకు నీళ్ళు పోయటం ,పని అమ్మాయితో ఇల్లు శుభ్రం చేయించటం చేయిస్తామని చెప్పారు.
సెప్టెంబర్ 11 సంఘటన జరిగి ఎన్నో రోజులు కాలేదు కనుక ఎయిర్ పోర్ట్ ల్లో తనీఖీలు ఎక్కువగా వుండటం వలన రఘు చెకిన్ అయ్యే వరకూ కూడా లోపలికి రావటానికి కుదరలేదు.లాంజ్ లో కూర్చున్నప్పుడు చంటి పిల్లాడిని ఎత్తుకున్న ఒక అమ్మాయి మమ్మల్ని చూసి తాను కూడా మినియాపొలిస్ కే వస్తున్నట్లు తెలియజేసి తనకి కూడా మా సహాయం కోరింది.మాకు కూడా సహకరించింది.
కలలో కూడా ఊహించని విధంగా తొలిసారి విమానం ఎక్కాము.తీరా ఎక్కినా వెంటనే ఏదో సమస్యవచ్చి ఆగి పోయి ఆలస్యంగా బయలుదేరింది.హైదరాబాద్ లో ఆలస్యం కావటంతో లండన్ లో కనెక్టెడ్ ఫ్లైట్ వెళ్ళిపోయింది.దాంతో లండన్ లో ఆ రాత్రికి హొటల్ రూమ్స్ కి పంపారు.పక్క రూమ్ లోనే ఆ అమ్మాయి కూడా వుండటంతో డిన్నర్ కి తీసుకు వెళ్ళింది.బఫే కావటంతో ఏవి తినదగినవో తెలియకపోతే ఆ అమ్మాయే తీసి ఇచ్చింది.పేరు తెలియని ఆ పధార్థాలేవీ తినలేక తిన్నామనిపించాము.
ఉదయమే లేచి తయారయ్యాము.ఆ అమ్మాయి తను స్నానం చేసేంతవరకూ బాబుని మాకు అప్పగించింది.
హొటలు నుండి బస్సులో ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించారు.ఎలా అయితేనేం మిన్నియాపోలిస్ ఎయిర్ పోర్ట్ లో దిగాం.మా సూట్ కేసులు కూడ తీసుకోటానికి కూడా ఆ అమ్మాయి సాయం చేసింది.ఆ అమ్మాయి సాయంగా వుండటం మాకు ఇబ్బంది కలగలేదు. కానీ అడుగడుగునా మాకు చెకింగులు అవుతూనే వున్నాయి.అదే పెద్ద ఇబ్బందిగా మారింది.
ముందురోజు రావాల్సిన వాళ్ళం రాకపోయేసరికి పల్లవీ,అజయ్ కంగారు పడ్డారు.తర్వాత వాళ్ళకి విషయం తెలిసింది.అజయ్ , వాళ్ళ నాన్నగారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు.
ఎయిర్ పోర్ట్ నుండి కారులో ఎక్కే సరికే చిలికి వణుకు పుట్టింది.రోడ్లపక్కనంతా మంచు కుప్పలు.ఎట్టకేలకు పల్లవి ఇల్లు చేరాము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)