28, డిసెంబర్ 2024, శనివారం

నడక దారిలో -46

నడక దారిలో -46 ఇంట్లోకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కొని పల్లవికి పుట్టిన అనుపల్లవి పాపాయిని ఎత్తుకున్నాను.తొందరపడి ముందే లోకం లోకి వచ్చిందేమో చాలా సన్నగా వుంది.ఇంట్లో చంటిపిల్లల్ని ఎత్తుకుని చాలా కాలమైంది కదా అపురూపంగా అనిపించింది.ఎంతయినా అసలు కంటే కొసరు ముద్దు అంటారు కదా. అక్కడ పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ లో పేరు చెప్పాలట.ఇంకా మేము పేరు ఆలోచించటం పూర్తికాకుండానే పుట్టేసిందికదా.అందుకని జన్మనక్షత్రాన్ని బట్టి ఆశ్లేష అని రాయించేసారు.మేమంతా ఆషీ అని పిలుచుకోసాగాము రాత్రి భోజనానికి ఆ స్టౌలూ, వంటిల్లూ అంతా కొత్తగా వున్నా,పల్లవికి కొంచెం సాయం చేసాను.మేము రాగానే పల్లవి అత్తగారు ఇంక తమ బాధ్యత అయిపోయిందనుకున్నారేమో వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయారు. రాత్రి అత్తగారు వాళ్ళకోసం చేసినప్పుడే పల్లవి రెండు చపాతీలనూ,కొంచెం కూర టప్పరువేర్ టిఫిన్ బాక్స్ లో సర్ది ఫ్రిజ్ లో పెడుతుంటే 'ఎందుకు' అని అడిగాను."ఉదయం ఆరుకే నేను బస్ పట్టుకొని ఆఫీస్ కి వెళ్ళాలి కదా" అంది. నాకు గుండె ఝల్లుమంది.మోకాలు మునిగేలా మంచు కురుస్తున్న వేళ పచ్చి పురటాలు వెళ్తుందా అని కళ్ళు చెమ్మగిల్లాయి."ఆపీసులో జాయిన్ అయిపోయావా " అన్నాను."ఆషీని చూసేందుకు వాళ్ళు ఉన్నారు కదా జాయిన్ అయిపోమన్నారు " అంది. మర్నాడు ఉదయమే లేచి రెండు మూడు లేయర్లుగా చలికోట్లు వేసుకొని ఆ చలిలో పల్లవి వెళ్తుంటే కింద వరకూ తనతో పాటూ వెళ్ళేదాన్ని.ఇండియాలో మూడునెలల వరకూ మంచం దిగకుండా బాలింతలను తల్లులు అపురూపంగా చూసుకుంటారు.నాకు జరగలేదు సరే ఈ పిల్లకూడా ఇలా కష్టపడుతోందే అని దుఃఖం వచ్చింది. అంతకన్నా నన్ను బాధించిన విషయం పల్లవి తనతో పాటూ ఒక కిట్ తీసుకు వెళ్ళేది.ఆఫీసులో స్పెషల్ గా రూమ్స్ ఉంటాయట.అక్కడ తన పాలు పంపుచేసి బాటిల్స్ నింపి ఐస్ బాక్స్ లో ఉంచి తీసుకు వస్తుంది.నింపిన బాటిల్స్ ఫ్రిజ్ లో వుంచి ఖాళీ బాటిల్స్ మర్నాడు తీసుకు వెళ్తుంది.బాటిల్స్ ని వేడి నీటి కొళాయి కింద పెడితే గడ్డకట్టిన పాలు కరుగుతాయి.అవి ఆషీకి పట్టాలి.ఇది అక్కడి వాళ్ళకు సహజమే కావచ్చు.కానీ నాకు గుండె చెరువైంది. తర్వాత్తర్వాత రాత్రి వండినవి కాకుండా నేను ఉదయమే లేచి పల్లవికి టిఫిన్ తయారు చేసి ఇచ్చేదాన్ని. అజయ్ బెంచ్ మీద ఉన్నాడు.మరో వుద్యోగం వేటలో వున్నాడు.అందువల్ల పల్లవికి వుద్యోగం తప్పని సరైంది.పల్లవి అత్తగారు " మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడే వుండిపోయి మనవరాల్నీ ,వీళ్ళనీ చూసుకోవచ్చుకదా " అంది. నాకు కోపం,బాధా కలిగినా సమాధానం చెప్పలేదు. రెండుమూడు కుటుంబాలను పిలిచి భోగీ పండుగకి పాపాయికి భోగీపళ్ళు పోసాము. పండుగ వెళ్ళాక అజయ్ అమ్మా నాన్నా కూతురు దగ్గరకు వెళ్ళిపోయారు. నాకు కంప్యూటర్ మీద తెలుగు న్యూస్ పేపర్లు ఓపెన్ చేసి చదువుకోవటం నేర్పింది పల్లవి.వంటపనీ,పాపాయి స్నానం,పానం పూర్తయ్యాక పడుకోబెట్టేదాన్ని.ఆషీ లేచేలోపున పేపర్లు చదివి వీర్రాజుగారికి విశేషాలు వినిపించే దాన్ని.పల్లవి దగ్గర కూడా కుట్టు మిషను వుంది.అందుకని అప్పుడప్పుడు చిన్నచిన్న ఫ్రాకులు కుట్టే దాన్ని. ఆషీ అల్లరేమీ చేసేది కాదు.కబుర్లు చెబుతుంటే హాయిగా నవ్వులు ఒలకబోస్తూ చక్కగా ఆడుకునేది.రాత్రిపూట కూడా అల్లరి లేకుండా నిద్రపోయేది.కానీ ఏపాటి శబ్దం వచ్చినా ఉలికి పడటం ఎక్కువగా వుండేది.ఆఖరుకు ఎక్కడో వంటింట్లో కుక్కర్ విజిల్ వేసినా ఉలిక్కిపడి ఏడ్చేది.అందుకని ఆ సమయంలో దగ్గరగా వుండి చూసుకోవాల్సి వచ్చేది. పల్లవి వచ్చేసరికి నాలుగు అయ్యేది.పాపాయి పనులతో సమయం గడిచిపోతుండేది.అవసరం అయినప్పుడు పాపకి స్నానం చేయించేటప్పుడో,పాలుపట్టటానికో ,ఇతరపనుల్లో సాయం చేసినా వీర్రాజుగారికి బోలెడు ఖాళీ సమయం దొరకడంతో వచన కవిత్వం లో ఆత్మకథ రాయటం మొదలెట్టారు. వీకెండులో కూరలూ ,వెచ్చాలు తీసుకు రావటానికి అందరం బయలుదేరే వాళ్ళం.అప్పట్లో ఇండియాలో దొరికే కూరలూ,పళ్ళూ అక్కడ అంతగా దొరికేవి కాదు. ఇండియా నుండి శంకరం,పొనుగోటి కృష్ణారెడ్డి,ఉమా నుండీ ఉత్తరాలు వస్తూ వుండేవి.ఒకరోజు శంకరం ఉత్తరం ద్వారా మాడభూషి రంగాచార్యులుగారు మాసివ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్లు తెలిసి చాలా బాధపడ్డాము. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అయిదు సీల్డ్ కవర్లు శంకరంకి ఇచ్చి ఒక నెల పోయాక విద్యాశాఖ వారందరికీ రిజిస్టర్ పోస్టు చేయమని చెప్పాను. శంకరం నిర్వహించే చలం జయంతికి జరిపే 'చలం జీవజలం'సభ సమయంలో ప్రెస్ క్లబ్ బాత్ రూంలో కరపత్రాలకట్టలు ఉన్నాయట.నీలిమేఘాల కవయిత్రులందరిమీదా అశ్లీల పదజాలంతో ఏమేమిటో రాసిన ఆ కరపత్రాలు సాహిత్య రంగంలో పెను సంచలనం సృష్టించాయని పేపర్ వలన తెలిసింది.ఎవరు రాసారో ప్రింట్ చేసినదెవరో నిజానిజాలు తెలియలేదు.మేము ఇంత దూరంలో వుండి పోవటం వలన ఈ విషయాలన్నీ చూచాయగా మాత్రమే తెలిసాయి.ఏదేమైనా ధైర్యంగా ముందు నడుస్తున్న స్త్రీలను పడగొట్టాలంటే తీసుకునే అస్త్రం వ్యక్తిత్వహననమే కదా.ఇక్కడా అదే జరిగి వుండాలి అనుకున్నాము. నేను వీలున్నప్పుడు చదువుదామని కథల పుస్తకం తెచ్చుకున్నాను కానీ ఆషీ ఉంగా ఉంగా కబుర్లతోనే సమయం గడిచిపోయింది. ఒకరోజు పల్లవి ఆఫీస్ నుండి వచ్చే సమయంలో మంచు తుఫాను పట్టుకుంది.రోడ్డంతా మంచుతో నిండి పోవటంతో బస్ ఇంటి వరకూ రావటానికి వీలులేక దూరంగా ఆగిపోయింది.నాకు ఫోన్ చేసి వేడివేడిగా టీ చేసి రెడీగా ఉంచమని చెప్పింది.మంచులో కాళ్ళుకూరుకుపోతుంటే పైన మంచు కురుస్తుంటే అలాగే సాధ్యమైనంత వేగంగా నడవటానికి ప్రయత్నించి ఇల్లు చేరింది.పల్లవి ఇల్లు చేరే వరకూ గుండె పిడికిట్లో పెట్టుకున్నాను.రాగానే వేడి టీ కప్పు తీసుకుని స్టౌ దగ్గర వళ్ళు వెచ్చ చేసుకుంది.ఇల్లంతా కేబుల్ హీటర్లతో వెచ్చగా వున్నా తట్టుకోలేకపోయింది. టీ తాగేక వణుకు తగ్గింది.మంచులోంచి రాగానే ముట్టుకుంటే స్టాటిక్ వల్ల షాక్ కొడుతుంది.అందుకని బట్టలవీ మార్చుకొన్నాకే పల్లవికి ఆషీని ఎత్తుకోవాల్సి వచ్చేది. అదీగాక అక్కడ టోర్నెడోలు ఎక్కువట.ఆఫీసుల్లో, స్కూల్లో టోర్నెడోలు వేస్తే తీసుకోవాల్సిన తక్షణచర్యల ట్రైనింగ్ కూడా ఉంటుంది.అందుకని సైరన్ తరుచూ వినిపించేది. వెళ్ళిన కొత్తలో మంచు కురవటం చూస్తుంటే సరదాగా వుండేది.రానురానూ బయటకు వెళ్ళేందుకు కుదరక ఇంట్లో అలా నాలుగు గోడల మధ్య వుండటం విసుగుగా వుండేది.వారాంతంలో అవసరమైన వెచ్చాలకోసం మాల్స్ కి వెళ్ళటం వుండేది.రోజూ ఉద్యోగం,మీటింగులు వెళ్ళటం అలవాటు వలన కాళ్ళు కట్టేసినట్లే వుండేది. తెలుగు విశ్వవిద్యాలయంలో రచయిత్రుల మహాసభలు జరిగాయట.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశ్వవిద్యాలయంలో విలీనం కాక ముందు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ద్వారా బహుశా నాలుగేళ్ళకోసారనుకుంటాను అఖిలభారత తెలుగు రచయిత్రుల మహాసభలు నిర్వహించేది. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ అయిన డా.ఎన్.గోపీగారు మళ్ళా ఆ వరవడిని ప్రారంభిస్తే మంచిదే.కానీ నేనే ఆ సభల్ని మిస్ అయ్యానని బాధ కలిగింది. అప్పట్లో అక్కడ టీవిలో తెలుగు ఛానెల్స్ వచ్చేవి కావు.అందుకని పల్లవి వాళ్ళు దగ్గర వున్న సినీమాల వీడియో కేసెట్స్ గానీ,లేదా టీవిలో ఇంగ్లీష్ సినిమాలు గానీ ఖాళీ సమయాల్లో చూసేవాళ్ళం.లేదా పల్లవి దగ్గర వున్న లలిత సంగీతం ఆడియోలు పెట్టుకునే వాళ్ళం.అవైతే అక్కడ కూచునే వినక్కరలేదు కదా.ఆషీ పనులు చేస్తూనే రావు బాలసరస్వతి, సాలూరి రాజేశ్వరరావు పాటలు వింటూ పాడుకునే దాన్ని.పల్లవికి జోలపాడినట్లుగానే ఆషీని నిద్రపుచ్చుతూ ఎన్నో పాటలు పాడేదాన్ని. అజయ్ కి అట్లాంటాలో ఉద్యోగం వచ్చింది. అజయ్ అక్కడకు వెళ్ళి జాయిన్ అయ్యాడు.ఇల్లు దొరికిన తర్వాత మేమంతా వెళ్ళటానికి నిర్ణయం అయ్యింది . అంతవరకూ వుద్యోగంలో చేయాలని పల్లవి నిర్ణయించుకుంది.అంతే కాకుండా పాపం నాకు బాగా అలవాటైపోయింది.మేము వచ్చి నాలుగు నెలలు కావస్తోంది.అందుకని ఆషీకి స్నానం చేయించటం,ఇతర పనుల్నీ అలవాటు చేసుకోవటానికి ముందుగానే మానేస్తానని చెప్పింది. ఇక్కడ అద్దె యింట్లో వున్నప్పుడు ఇల్లు, సామాన్లు ఎలా వున్నాయో అలాగే ఓనర్లకు అప్పగించాలంట.ఏవైనా పాడౌతే వాటికి బదులుగా కొత్తవి అమర్చాలి.ఆఖరుకు బాత్ రూంలతో సహా. అందుకని వారాంతాల్లో అజయ్ వచ్చినప్పుడు ఇల్లు క్లీనింగ్ లు,ఏవి కొత్తవి అమర్చాలోనని చెకింగ్ లు మొదలెట్టారు. అజయ్ ఏ వారం అయినా రాకపోతే ఆషీని చూసుకోమని వీర్రాజుగారికి అప్పగించి ,పల్లవీ,నేనూ మాల్స్ కి వెళ్ళేవాళ్ళం. అజయ్ కి ఇల్లు దొరికిందట.అట్లాంటాకి వెళ్ళాలి కనుక పల్లవి వుద్యోగం మానేసింది.నా సహాయంతో ఆషీ పనులన్నీ పల్లవే చూసుకోవటంతో నాకు కొంచెం తీరిక దొరికింది. మూవర్స్ & పేకింగ్ వారిని పిలిచారు.బలిష్టంగా వుండి అతి సులభంగా ఎంతో బరువున్న పెద్ద సోఫాల్ని ఫేక్ చేసి మోసుకుని తీసుకు వెళ్తున్న నల్లజాతి వారిని చూస్తుంటే ఆశ్చర్య పోయాను.సామానంతా వెళ్ళిపోయింది.మర్నాడు ఫ్లైట్ కి మేము వెళ్ళాల్సి వుంది. అనుకోకుండా మా స్కూల్ లో నా సహోద్యోగిగా పనిచేసి పదవి విరమణ చేసిన లెక్కలటీచర్ ఇందిర కుమారిగారి నుండి ఫోన్.మినియాపొలీస్ లోనే వున్న ఆమె చిన్న కుమారుడి ఇంటికి వచ్చారట.నన్ను,పల్లవినీ చూడాలని వుందనీ,ఒక గంటలో మా ఇంటికి వస్తామని ఫోన్ చేసారు.తప్పక రమ్మని ఇంటి లోకేషన్ చెప్పి ఆహ్వానించాము. అన్నట్టుగానే గంటలో వారబ్బాయి కుటుంబంతో కలిసి వచ్చారు.అందరూ మాతో కలిసిపోయి కబుర్లు చెప్పారు.నేను స్కూల్లో చేరినప్పటి నుండీ ఇందిరాటీచర్ నాతో స్నేహంగా ఒక పెద్దక్కలా వుండేవారు.ఆవిడ రిటైర్ అయ్యాక ఆ పోస్టులో నాకు ప్రమోషన్ ఇవ్వలేదని తెలిసి బాధ పడ్డారు.మినియాపొలిస్ లోని మంచువర్షాలకీ,చలికీ,ఇంటిలోనే వుండాల్సిన పరిస్థితి గురించి చాలా సేపు మాట్లాడారు.వాళ్ళు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులే అయిందని ,చలికి తట్టుకోవటం కష్టంగా వుంది అన్నారు.ఓగంట వుండి వెళ్ళారు.అట్లాంటా వెళ్ళాక సర్దుకున్నాక ఫోన్ చేస్తానని వాళ్ళ అబ్బాయి నెంబర్ తీసుకున్నాను. మర్నాడు ఫ్లైట్ కి అట్లాంటా బయలుదేరాము.అయితే ఫ్లైట్ బయలుదేరినప్పుడు, లాండింగ్ సమయంలో ఆ. శబ్దానికి ఆషీ ఒకటే ఏడుపు మొదలెట్టింది.ఈపిల్లకి శబ్దాలు వింటే ఇంత బెదురేమిటో అనుకున్నాము.పెరిగిన తర్వాత తగ్గుతుందేమో అనుకున్నాము.అట్లాంటాలో వీళ్ళ ఇంటికి దగ్గరలోనే పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఉండటంతో మాటిమాటికీ విమానాల లాండింగ్, ఫ్లైయింగ్ శబ్దాలు వినిపించుతూ వుండేవి. కొన్నాళ్ళు అయితే ఆ శబ్దాలు వినీ వినీ ఆషీ అలవాటు పడితే ఏడుపు తగ్గుతుందేమో అనుకున్నాము. అట్లాంటాలో వాతావరణం ఇండియాలో లాగే వుండటంతో సాయంత్రం పూట పల్లవీ,నేనూ ఆషీని తీసుకోని అక్కడే బయట తిరిగే వాళ్ళం. ఓ వారం రోజులయ్యాక ఇందిరా టీచర్ తో మాట్లాడాలని ఫోన్ చేసాను.ఒక షాకింగ్ న్యూస్.ఆ రోజే చర్చ్ కి వెళ్ళొచ్చిన తర్వాత లంచ్ కాగానే పడుకుని నిద్రలోనే మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందట.చలికి తట్టుకోవటం కష్టంగా ఉంది అన్నారు.ఆరునెలలు పిల్లలతో ఉండాలని వచ్చిన ఆమె ఇలా లోకం నుండే వెళ్లిపోయారని తెలిసి చాలా దుఃఖం కలిగింది. అట్లాంటాలో నీటి లోపల వుండే జార్జియా అక్వేరియం ఒక వారాంతం వెళ్ళి చూసాము.చాలా రకాల పెద్ద పెద్ద చేపలు మనపై నుండి ఈదుకుంటూ పోతుంటే చూడటం అద్భుతంగా అనిపించింది .మరో వారాంతంలో జార్జియా స్టోన్ మౌంటెన్ పార్క్ కి వెళ్ళాము.మౌంటెన్ గోడ మీద నలుగురు నాయకుల ముఖాలు చెక్కివున్నాయి.నాకు మాత్రం ఇండియాలోని గుడుల లోని శిల్ప సౌందర్యం దగ్గర ఇది ఏముంది అనిపించింది.చాలామంది అమెరికన్లు ఫోల్డింగ్ కుర్చీలు,తినటానికి రకరకాల పదార్థాలతో వచ్చారు.మేము కాసేపు వుండి వచ్చేసాము. ఆషీకి అయిదోనెలరాగానే ఒక రోజు అన్నప్రాసన కూడా చేసాము.కొద్దికొద్దిగా ఘన పదార్థాలు తినటం అలవాటు చేయటం ప్రారంభించాము. మేము వచ్చి అయిదు నెలలు దాటింది.స్కూల్ తెరిచే సమయానికి ఇండియా వెళ్ళేలా నిర్ణయించుకున్నారు.అందుకని అక్కడి వాళ్ళకు చిన్న చిన్న కానుకలు కానుకలు కొనాల్సి వుంది. మేము బయలుదేరేటప్పుడు బయట వరండా తాళాలు పక్కవాళ్ళకి ఇచ్చాము. పనిఆమెకి అప్పుడప్పుడు వచ్చి మొక్కలకి నీళ్ళు వేయమని చెప్పాము.అందుకని అయిదునెలలకీ ఆమెకి జీతం డబ్బు కూడా ఇచ్చేసాము. ఆదివారం అయితే శంకరంగారు తాను వెళ్ళి ఇల్లు శుభ్రం చేయిస్తానని అన్నారు.కానీ.ఆమె రాలేదట.శంకరంగారే వెళ్ళినప్పుడు మొక్కలకు నీళ్ళు పోసారట.మెము వచ్చే ముందు కూడా పాపం ఆయనే కొంత శుభ్రం చేసారని తెలిసి మేము బాధపడ్డాము. మేము బయలుదేరే రోజు వచ్చింది.అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లు ఆషీతో అనుబంధం పెరిగి వదిలిపెట్టి వెళ్ళటం కష్టంగా అనిపించింది.పల్లవికి జాగ్రత్తలు చెప్పి ఫ్లైట్ ఎక్కటానికి ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళిపోయాము. మొత్తంమీద ఎలాగైతేనేం మా అమెరికా ప్రయాణం పూర్తిచేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాం.ఎయిర్ పోర్ట్ కి కృష్ణారెడ్డిగారూ, శంకరంగారూ వచ్చారు.క్షేమంగా ఇంటికి చేరాము.వరండాలోని మా మొక్కల్ని చూసుకున్నాము.మూడునెలలుగా ఎండాకాలమే కావటంతో నీళ్ళు వేసినా దిగులు ముఖంతో వున్నాయనిపించింది.రెండురోజులు వరసగా నా చేతులతో నీళ్ళు పడేసరికి నన్ను చూసి నవ్వుతూ పలకరించి కళకళలాడాయి.ఆ దృశ్యం నాచే 'నిరీక్షణల కొసం చివర' అనే కవిత రాయించింది. స్కూల్ తెరిచేలోగా ఇల్లంతా సర్దుకుని ఒక కొలిక్కి తీసుకువచ్చాక వీర్రాజు గారూ ,నేనూ అక్కడి కబుర్లు చెప్పుకుంటూ ".వాళ్ళిద్దరూ బాగానే వున్నారు.ఆషీ కొంచెం పెరిగాక పల్లవికూడా వుద్యోగం చేస్తే ఆర్థికంగా పుంజుకుంటారు.ఇక్కడకు వస్తారో అక్కడే స్థిరపడతారో‌.కాని ఇక్కడ ఇల్లు ఏదైనా కొంటామన్నారు.ఇంక మనం ఏమీ పల్లవి కోసం డబ్బు దాచాల్సిన పనిలేదు.ఇంకా పల్లవి గురించి ఆలోచించక్కరలేదు.మనం మనపుస్తకాలు వేసుకుంటూ మనకోసమే మనం బతకొచ్చు." అని తృప్తిగా వూపిరి పీల్చుకున్నాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి