16, నవంబర్ 2024, శనివారం
సాహిత్య చిత్రకళా సవ్యసాచి - శివరాజు సుబ్బలక్ష్మి
~ సాహిత్య చిత్రకళా సవ్యసాచి -శివరాజు సుబ్బలక్ష్మి ~
'ఇంట్లోని స్త్రీల సంభాషణల ద్వారా భాషలోని సొబగులు అర్ధం చేసుకోవచ్చు' అవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి మాటలు.
ఈ మాటలు గుర్తు వచ్చినప్పుడు శివరావు సుబ్బలక్ష్మిగారు గుర్తుకు రాకుండా ఉండరు.
పన్నెండో ఏట శివరాజు వేంకట సుబ్బారావు (బుచ్చిబాబు) చిటికెనవేలు పట్టుకొని సంసార బంధంలోకి వచ్చిన సుబ్బలక్ష్మిగారు… కథకుడు, చిత్రకారుడు అయిన బుచ్చిబాబు భార్యగా మాత్రమే ఒదిగిపోలేదు. బుచ్చిబాబుగారి రెండు చేతుల్లోని కలాన్ని, కుంచెని కూడాతన చేతిలోకి తీసుకున్నారు. ‘కావ్య సుందరి కథ, ఒడ్డుకు చేరిన కెరటం, మనోవ్యాధికి మందుంది, మగతజీవి చివరి చూపు, శివరాజు సుబ్బలక్ష్మి కథలు అనే అయిదు కథా సంపుటాలు, అదృష్ట రేఖ, నీలంగేటు అయ్యగారు, తీర్పు (తరుణ మాసపత్రికలో సీరియల్) నవలలు రాసి తనకంటూ సాహిత్య రంగంలో ఒక ముద్రని సాధించుకున్నారు.
బుచ్చిబాబు గారు కొన్నాళ్ళు అనంతపురం కాలేజీలో ఆంగ్లోపన్యాసకులుగా పనిచేసే రోజుల్లో అదే కాలేజీలో భౌతిక శాస్త్రం బోధించే మా పెదనాన్న కొడుకు లక్ష్మణరావుగారి కుటుంబం ఇరుగు పొరుగు ఇంట్లో ఉండేవారు. వారి స్నేహాన్ని గురించి ఇటీవల ‘పాలపిట్ట’ సాహిత్య మాసపత్రికలో సుబ్బలక్ష్మిగారు రాసిన ‘జ్ఞాపకాలు’లో తెలిపారు. సుబ్బలక్ష్మిగారు బుచ్చిబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్‌లో తమ్ముడి ఇంట్లో ఉన్నప్పుడు 1970లలో లక్ష్మణరావు అన్నయ్య కుటుంబంతో తొలిసారి ఆమెని కలిసాను. ఆ తర్వాత ఆమెను మా దంపతులం పలుమార్లు కలవటం జరిగింది. బెంగుళూరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తరుచూ ఫోన్ల ద్వారా అనేక కబుర్లు చెప్పేవారు.పురస్కారాలు అందుకునే సందర్భంలో హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆమె ఫోన్ చేసి పిలవటంతో ఆమె బస చేసిన హోటల్‌కి వెళ్ళి కలిసేవాళ్ళం.
" ఈ కథలు ఒక స్త్రీ మాత్రమే రాయగలదు అనిపించడం శివరాజు సుబ్బలక్ష్మి కథల్లో విశిష్టత "అంటారు పింగళి లక్ష్మీకాంతం గారు.
సుబ్బలక్ష్మిగారి తండ్రి ప్రముఖ గాంధేయవాది ద్రోణంరాజు సూర్య ప్రకాశ రావుగారు అందువలన ఆమెరచనలలో చాలా వరకూ గాంధేయవాద సిద్ధాంతాలు గమనించవచ్చు. ఆమె కథల్లో స్వాతంత్రానికి పూర్వపు సాంప్రదాయ సంస్కృతులే గాక, స్వాతంత్రానంతర పరిణామాలకు గురైన సమాజ పోకడలనూ ప్రతి బింబిస్తాయి.
సుబ్బలక్ష్మిగారి రచనల్లో ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వము, తర్వాత ఆంధ్రా ప్రాంతంలో కుటుంబ వాతావరణం, స్త్రీల మానసిక చిత్రణలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆనాటి సమాజంలో స్త్రీ జీవనచరిత్ర పరిణామక్రమం నిత్యనూతనంగా భాసిస్తూ అభ్యుదయ పథం వైపు పయనించే విధానం తెలుస్తుంది. ఆ రకంగా తెలుగు గ్రామీణ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలలో మహిళల జీవితం గోచరిస్తుంది.
సుబ్బలక్ష్మిగారి కథల్లో స్త్రీలు ఒకసారి నిర్లిప్తంగాను, మరికొన్నిచోట్ల స్థిరచిత్తం కలవారిగానూ కనిపిస్తారు - పాఠకులకు మాత్రం మధ్యతరగతి యువతులుగానే ఆమె పాత్రలు పరిచయం అవుతారు.
పెళ్ళంటే తెలియని వయసులో బాల్యవివాహాల వలన ఎదుర్కొన్న సమస్యల్ని, అమాయకులైన అమ్మాయిలు మూర్ఖపు అత్తగార్లతో అత్తింట పడిన ఆరళ్ళు, మొదటి భార్య చనిపోతే రెండవ భార్యగా వెళ్ళిన అమ్మాయిల మనోభావనలు, మొదటి భార్య పిల్లల అగచాట్లు, ఆర్థిక స్వాతంత్య్రం లేని భార్యలు, ఆడబిడ్డల పెత్తనాలు, అక్క పోతే ఇష్టం లేకపోయినా బావని పెళ్ళాడవలసిన పరిస్థితులు… ఇలా సుబ్బలక్ష్మి గారి సుదీర్ఘ జీవనయానంలో పరిశీలించిన సుమారు యాభై ఏళ్ళనాటి మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ జీవిత చిత్రణలే సుబ్బలక్ష్మి గారి కథలు.
'బుచ్చిబాబు కథలలోలా నా రచనల్లో వర్ణనలు ఎక్కువగా ఉండవ'ని సుబ్బలక్ష్మిగారు చెప్పుకున్నా కథల్లోని ప్రకృతి దృశ్యాల్ని వర్ణించే విధానం చదివినప్పుడు సుబ్బలక్ష్మిగారికి ప్రకృతి పట్ల ఆరాధన కన్పిస్తుంది. అదే వారి చిత్రకళలో దర్శనమిస్తుంది.
మంచు వీడిన కొండ, ఒడ్డుకు చేరిన ఒంటి కెరటం, మూతపడని కన్ను, మరుగుపడిన ఆత్మీయత… ఇలా సుబ్బలక్ష్మిగారి కథల శీర్షికలు ప్రత్యేకంగా కవితాత్మకంగా ఉంటాయి. శీర్షికలోనే కాక కథలో కూడా ”చినుకులు చిటపటలాడుతూ ఒక్కసారిగా సైన్యంలా నేలపైకి ఉరికాయి” వంటి కవిత్వ పంక్తులు కూడా మెరిపిస్తాయి. వీరి కథలలో చాలావరకూ యాభై-అరవై ఏళ్ళనాటి పల్లె జీవితాలు, గ్రామీణ వాతావరణం ఎక్కువగా ప్రతిబింబిస్తుంటాయి. పచ్చని నేలపై నుండి వీచే గాలుల సవ్వడులు, కొబ్బరాకుల మధ్యనుండి వినిపించే చిరుగాలి గలగలలూ, గూడుబండి ప్రయాణాలు మొదలైనవన్నీ గ్రామీణ దారుల పంక్తుల్లో పాఠకులు వీక్షించవచ్చు.
”కర్త-కర్మ-పూర్తి చేసిన కథ”లో రామచంద్రయ్య కూతుళ్ళకు గుడి దగ్గర స్వామీజీ తానిచ్చే తావీదు కట్టుకుంటే గొప్ప దశ వస్తుందనీ, రాజకుమారుడు వచ్చి ఎత్తుకుపోతాడనీ చెప్పేసరికి వాళ్ళిద్దరూ ఎప్పుడు తమ కల సాకారమౌతుందా అని కలల్లో తేలిపోయే క్రమంలో తమ చేతి గాజులు పోయినది కూడా గమనించరు. రామచంద్రయ్య తనలాగే స్వామీజీ అవుతాడని చెప్పేసరికి బలహీన మనస్కుడైన రామచంద్రయ్య ఇల్లు వదిలిపోతాడు. తర్వాత అనేక మలుపులతో కథ సుఖాంతం చేస్తారు. కానీ కల్లబొల్లి కట్టుకథలు చెప్పి అమాయకులకు వెర్రిమోహాల్ని కల్పించే దొంగస్వాముల గుట్టురట్టు చేసి, వ్యామోహాల పర్యవసానాల్ని కథంతా హాస్యంగా చెప్పే పద్ధతి రచయిత్రి మన ఎదుట కూర్చొని చెప్పేలా ఉంటాయి.
"మొండి మనసుల నీడలేని ఎడారి సుడిగాలిలో కూలిపోయిన భవనం అక్క జీవితం. శూన్యంలో వెలిగించిన ప్రమిదలా ఎంతకాలం నిలవ గలనో!!" అనుకుంది పార్వతి. శిల్పపరంగా, కథనపరంగా, వర్ణనల పరంగా ప్రత్యేకంగా చెప్పదగిన కథ - మట్టిగోడల మధ్య గడ్డిపోచ .మట్టిగోడల మధ్య గడ్డిపోచ’ కథలో అక్క మరణానంతరం బావని పెళ్ళి చేసుకున్న పార్వతి జీవితం, కాలం వేసిన ఎగుడుదిగుడు బండలపైన జీవితంగా రచయిత్రి అభివర్ణిస్తారు.
"కథలు చెప్పేగౌరి " కథలో గౌరిని ఏమాత్రం స్పందన తెలియని బండరాయిలాంటి వాడికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. అతని తల్లి అటువంటిదే. చివరికి గౌరి జీవితంలో గిరి అనే బంధువు వెలుగులు నింపినట్లుగా ముగిస్తారు రచయిత్రి.
”ఆడవాళ్ళ పెట్టెలో” ప్రయాణం కూడా సుబ్బలక్ష్మిగారి సున్నితమైన హాస్యం కన్పిస్తుంది. ”నల్ల మబ్బులు” అనే కథలో డాక్టర్ భార్య సుశీల, తాను చనిపోతే భర్త అభిమానించే సుధని పెళ్ళి చేసుకుంటాడన్న అపోహతో కృశించి జబ్బు తెచ్చుకుని మరణానికి ముందు తన స్నేహితురాలికి రాసే ఉత్తరంలో భర్త, సుధ కోసం పడే తపన గురించి రాస్తుంది. ఆ ఉత్తరాన్ని తిరిగి సుశీలకు పంపుతూ ఆ స్నేహితురాలు భరోసా కల్పిస్తూ రాసిన ఉత్తరం సుశీల చనిపోయాక భర్తకి అందుతుంది. సుశీల స్నేహితురాలు ఉత్తరం లో రాసిన మాటలు రచయిత్రి ఆధునిక భావాలకు సూచనగా ఉంటాయి.
పోస్టు చేయని ఉత్తరం కథలో - ఇందిర భర్త పట్నంలో ఉద్యోగం చేస్తూ ఇంటికి డబ్బు పంపుతుంటాడు. ఇందిర సంసార బాధ్యతలు చేపడుతుంది. భర్త పట్ణంలో ఎవరినో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాననీ ,అందుకు ఆమెతో కలిసి ఉండటానికి ఇందిర కూడా సమ్మతించాలని ఉత్తరం రాస్తాడు .ఉత్తరం చదివి ఇందిర భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. నిజానికి ఆత్మహత్య పరిష్కారం కాదు. కానీ ఆనాటి చదువులేని, ఆర్థిక స్వావలంబన లేని స్త్రీలకు అదే పరిష్కారం కావటం దౌర్భాగ్యం .
'కాపురం' అనేకథలో పెళ్ళంటే తెలియని వయస్సులో జానకిని గంగిరెద్దులా అలంకరించి, పెళ్లిచేసి పెద్ద కోడలిగా ఉమ్మడి కుటుంబంపాలు చేయడం,అక్కడ చాకిరిచేసి, అవమానాలు పడుతూ, పుస్తెలగొలుసుతో సహా సమస్తమూ ఆ కుటుంబానికే ధారపోసి దుఃఖంతో స్నేహితురాలి యింటికి వెళ్తుంది జానకి. చివరిలో ఆమె భర్తకి జ్ఞానోదయమై జానకి మీద ప్రేమకలిగి అక్కున చేర్చుకుంటాడని సుఖాంతం చేస్తారు.
'తెల్లవారింది' కథలో మల్లికాంబ, 'మగతజీవి చివరిచూపు' కథలో కాంతమ్మ రెండో పెళ్ళి తీసుకొని అగచాట్లు పడిన మహిళలు
ఒడ్డుకు చేరిన కెరటం కథలో ఆశమ్మ తన అన్నగారి పిల్లల్ని, ఇతర స్వలాభం ఆశించక పెంచుతే ఆ పిల్లలు కాస్తా పెరిగి అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆమెని నిర్లక్ష్యం చేస్తారు .అయినాసరే తాను కర్తవ్యపాలన చేసానని తృప్తి పడుతుంది.నిజానికి కన్నపిల్లలే పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారు కూడా ఉంటారు.
సుబ్బలక్ష్మిగారు కథలు రాసేనాటికి సమాజంలో ఆడపిల్లలకి బాల్యవివాహాలు చేసి, రజస్వల కాగానే అత్తగారింటికి అమ్మాయిని పంపించేసి పుట్టింటివాళ్ళు బాధ్యత తీరిందని చేతులు దులిపేసుకునే వాళ్ళు. ఎందుకంటే
ఆనాడు మధ్యతరగతి జీవులలో అధిక సంతానం, ఉమ్మడికుటుంబాలు, ఆర్థికఇబ్బందులు కూడా కారణమే. ఒక్కొక్క సందర్భంలో పిచ్చాసుపత్రిపాలు కావటం, పుట్టినింటా ఆసరా లేక, దైర్యం లేని, చదువులేని, ఆర్థిక స్వావలంబనలేని చావైనా రేవైనా వితంతువులైనా అత్తింట్లోనే పడి ఉండాల్సిన పరిస్థితి.ఇలా ఆనాటి ఆడవాళ్ల జీవితాలు ఏ విధంగా నిరాశలో కూరుకు పోయేవో ఇవన్నీ సుబ్బలక్ష్మిగారి పలు కథలలో దృశ్యమానమౌతుంటాయి.
జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రిగారు ఒకసందర్భంలో 'సుబ్బలక్ష్మిగారి కథలన్ని మనసులోంచి వచ్చిన కథలు'గా అభివర్ణించారు అంతేకాదు " బుచ్చిబాబు నవల కన్నా నాకు సుబ్బలక్ష్మి కథలే నచ్చుతాయి' అని అన్నారని సుబ్బలక్ష్మిగారు నవ్వుతూ చెప్తారు.
మరో రచయిత్రి అద్దేపల్లి వివేకానందాదేవిగారు "సుబ్బలక్ష్మిగారి ముంజేతి కంకణం కథ తన వదినగారి జీవితాన్ని పోలి ఉందని" చెప్పారట. అంతేకాక ఆ కథలోని సహజత్వాన్ని అభినందించారుట.
మనుషుల మానసిక స్వభావాల పరిశీలనకు వీరి కథలు - కావ్యసుందరి కథ, మనో వ్యాధికి మందుంది, మగత జీవి చివరి చూపు,
ఒడ్డుకు చేరిన కెరటం - చక్కని ఉదాహరణలు .అందుకే కథ చదువుతున్నంతసేపు సహజసిద్ధంగా కళ్ళముందు ఆసంఘటనలు జరుగుతున్నట్లుగానే ఉంటాయి.
అరవై సంవత్సరాల కాలంలో సుబ్బలక్ష్మి రాసిన కథల నుండి ఎంపికచేసిన కథల్ని వేదగిరి కమ్యునికేషన్స్ వారు 1998 లో బుచ్చిబాబు స్మారక కథాకదంబం పేరిట ' మనోవ్యాధికి మందుంది " శీర్షికన పుస్తకంగా ప్రచురించారు .
అయిదు కథాసంకలనాలూ,మూడు నవలలు సుబ్బలక్ష్మి గారి సాహిత్య ఖాతాలో వున్నాయి. అయితే తరుణ మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన "తీర్పు" నవల మాత్రం అందుబాటులో లేదు.
సుబ్బలక్ష్మి గారికి పేరు తెచ్చిన నవల - " నీలంగేటు అయ్యగారు " ఎమెస్కో వారు ఈ నవల గురించి " మేము నాగరీకులం మాదే నాగరికత అనుకొనే వాళ్ళ బతుకుల్లో చీకటి, చీకట్లో బతుకుతున్నాననుకొనే పొన్ని కళ్ళద్వారా చూపించే కొత్త పద్ధతి ఈనవల" అని అన్నారు.
నవల ప్రారంభంలోనే " నీలంరంగు గేటులోంచి గుత్తులు గుత్తులుగా పూసిన తెల్ల గులాబీలు గుబురుగా చూడ ముచ్చటగా కనిపించి దారిన పోయేవారిని క్షణమైనా నిలబెడుతుంది "అంటూ రాయటంలో రచయిత్రి భావుకత్వమేకాక ఆమెలోని చిత్రకారిణి కూడా బయటపడుతుంది.
పనిమనిషి పొన్ని దృష్టికోణంలో రాసిన ఈనవల పొన్ని కూడా తెల్లగులాబీలాగే ప్రత్యేకత సంతరించుకొన్న వ్యక్తి.'ఆ వీథిలో సగం ఇళ్ళు తనవేనంటుంది' పొన్ని.తనదీ అని చెప్పుకోగల ఆత్మస్థైర్యంఉంది పొన్నికి అంటారు సుబ్బలక్ష్మి .
సమాజమంతటా పాశ్చాత్యధోరణులు వ్యాపించి విస్తరిస్తున్నకాలంలో మిడిమిడిజ్ఞానం, అవగాహనాలేమి వలన నాగరికత వ్యామోహంలో కృత్రిమ విలువలకు,పోకడలకు లోనైన పాత్రల్ని ఈ నవలలో రచయిత్రి అక్షరీకరించారు.
గృహిణులు తమఅనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు అన్నీ తమ అంతరంగలోతుల్లోనికి విసిరేసి జీవించవలసిన అనివార్యతని "అదృష్టరేఖ" నవలలో చిత్రీకరించారు.అంతేకాకుండా ఆ చిన్న జీవితంలోనే తాము సాధించిన విజయాల్ని, ఆనందాల్ని తలపోసుకొని సంతృప్తిని పొందే మధ్యతరగతి స్త్రీల జీవనవిషాదాలు ఒక అంతర్లీన స్రవంతిగా ఈనవల చూపిస్తుంది.
సుబ్బలక్ష్మి కథలైనా, నవలైనా మధ్యతరగతి మహిళల జీవితాల చుట్టూనే ఉంటాయి అనుకున్నాం కదా! జీవితచిత్రణలే కాక ఆ సమస్యలను వారు ఎదుర్కొన్న విధానం కూడా కొన్ని కథలతో చాలా చక్కగా వివరిస్తారు.సమస్యను సున్నితంగా పరిష్కరించుకొన్న విధానం తెలియజేస్తారు.
బుచ్చిబాబుగారూ, సుబ్బలక్ష్మిగారూ ప్రకృతి దృశ్యాల కోసం తరుచూ గ్రామాలకు వెళ్ళేవారట. ఆ దృశ్యాలన్నీ కళ్ళలో మనసులోనూ భద్రపరచుకొని ఇద్దరూ చిత్రాలు వేసేవారట. బుచ్చిబాబు గారు, సుబ్బలక్ష్మి గారు ఇద్దరూ ఎక్కువగా ప్రకృతిదృశాలే వేయటం విశేషం.అయితే బుచ్చిబాబుగారు వేసే చిత్రాలు యూరోపియన్ చిత్రకళా శైలి అయితే సుబ్బలక్ష్మిగారిది దేశీయమైన శైలి.
ఈ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలే కాక దేవికారాణి. ఇందిరా గాంధీ వంటి కొందరు ప్రముఖుల పోర్ట్రైటులనూ సుబ్బలక్ష్మి గారు సజీవంగా చిత్రించారు.
2015లో ' Nature in Thoughts' పేరుతో బుచ్చిబాబు గారు వేసిన 177 వర్ణచిత్రాల్నీ, సుబ్బలక్ష్మి గారి 140 వర్ణచిత్రాలను కలిపి విలువైన పుస్తకాన్ని వెలువరించారు .
బుచ్చిబాబు గారు దూరమై అనేక సంవత్సరాలు గడచినా వారి దాంపత్య జీవితంలోని అనేక జ్ణాపకాలు ఆమె మనసుపొరలలో భద్రంగా ఉన్నాయి.
శివరాజు సుబ్బలక్ష్మి బుచ్చిబాబుతో గడిపిన ముప్ఫయేళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నాటి విశేషాల్ని చినుకు పత్రికలో పాతిక భాగాలుగా రాసారు. వాటిని ఖుచ్చిబాబు శత జయంతి సందర్భంగా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ " మా జ్ఞాపకాలు " గా ప్రచురించింది . ఇవి కేవలం వారి జ్ఞాపకాలే కావు. ఆంధ్రదేశంలో జరిగిన అనేక పరిణామాల పరామర్శగా చెప్పుకోవచ్చు.
సుబ్బలక్ష్మి గారిది అద్భుతమైన జ్ఞాపకశక్తి. సుబ్బలక్ష్మిగారితో మాట్లాడుతున్నపుడు ఆమె రాసిన కథ గురించి ప్రస్తావిస్తే ఆ కథ గురించే కాక దాని నేపధ్యాన్ని కూడా ఒక కథలాచెప్పటం ఒక ప్రత్యేకత.
80 ఏళ్ళ వయసుదాటినతర్వాత కూడా సుబ్బలక్ష్మి గారు చిత్రాలు వేయటం మానలేదంటే వారి కార్యదీక్షకు దర్పణం.
టీవీలో వార్తలు వింటూ దానికి దగ్గరగా గల తన జ్ఞాపకాలో, తాను చూసిన సంఘటనల్నో గుర్తు తెచ్చుకొని అక్కడే ఒక కాగితం మీద ఒక కథలా రాసేస్తుంటారని వీరి దత్త పుత్రుడు సుబ్బారావుగారు చెప్తారు.
సుబ్బలక్ష్మిగారిని కలిసి మాట్లాడు తుంటే ఎవరికైనా మంచి ఉత్సాహం కలుగు తుంది. ఆవిడ మాటలు వింటుంటే మనం కూడా గొప్ప ఎనర్జీని పొందిన అనుభూతిని పొందుతాము.
అరవైఏళ్ళు దాటేసరికి నీరసం పడిపోయి ఇంక జీవితం పూర్తై పోయిందని చతికిల పడిపోయే వారికి సుబ్బలక్ష్మిగారి లాంటి వారిగురించి తెలియ చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవితాన్ని ఎలా రంగులమయంగా చైతన్యవంతంగా చేసుకోవచ్చో తెలుస్తుంది .
శివరాజు సుబ్బలక్ష్మిగారు రచయిత్రి గానూ,చిత్రకారిణిగానూ తన జీవితకాలమంతటినీ సృజనాత్మకంగా పరిపూర్ణతను చేకూర్చుకున్న చైతన్యశీలి.
ఆవరణాన్నంతటినీ పరిమళభరితం చేసే పండుసంపంగిలాంటి సుబ్బలక్ష్మిగారు శతవసంతానికి నాలుగేళ్ళతక్కువలో భౌతికంగా దూరమైనా ఆమెను తెలిసినవారికి, కలిసినవారికి ఆమె చేతిలో చేయేసి నవ్వుతూకబుర్లు చెప్పటం
కళ్ళలో మెదులుతూనే ఉంటుంది.
-- శీలా సుభద్రాదేవి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి