18, నవంబర్ 2024, సోమవారం

కవిత్వ స్వాప్నికుడు ఆవంత్స

~ కవిత్వ స్వాప్నికుడు - ఆవంత్స సోమసుందర్ ~ "చదువును మించింది సంస్కారం.బిరుదుల్ని మించింది సొంత పేరు.పదవిని మించింది వ్యక్తిత్వం.ఈ మూడు సాధనాలు సోమసుందర్ పురోగమనం రహస్యాలే.తెలుగు ఫ్యూడల్ వికృతాలన్నింటితోనూ వ్యతిరేకంగా పోరాడడానికి ఎన్నో మార్చింగ్ సాంగ్స్ వ్రాసిన అభ్యుదయ వైతాళికులలో సోమసుందర్ ఒకరు" అంటారు మిరియాల రామకృష్ణ. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని గోదావరి జిల్లాయువజన సంఘానికి ఉపాధ్యక్షుడై, అరసంలో చేరి 1945లో రాయల్ ఇండియన్ నేవీ నిర్వహించిన ధర్నాను ప్రోత్సహిస్తూ మొట్టమొదటి అభ్యుదయకవిత ' ఇంక్విలాబ్ జిందాబాద్ ' అంటూ ముందుకు నడిచినవాడు ఆవంత్స సోమసుందర్. సోమసుందర్ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వ్రాసిన ఈయన మొదటి గీతంగా చెప్పుకోదగిన కవితలో -- "రండి రండి ఉక్కుముక్కు కాకుల్లారా రండర్రా గద్దల్లారా రండి రండి సమరంలో క్షతగాత్రుడనై పడిపోయిన నా శరీరాన్ని తినివేయండి ..........." అంటూ గర్జించాడు. దొడ్డి కొమరయ్య మరణ సమయంలో బాధతో కూడిన ఆవేశంతో రాసిన 'ఖబడ్ధార్' కవిత " ఖబడ్దార్ ఖబడ్దార్ / నైజాం పాదుషా బానిసత్వ విముక్తికై /రాక్షసత్వ నాశముకై హిందూ ముస్లిం పీడిత/శ్రమజీవులు ఏకమైరి అమరుడు మాకొమురయ్య/అనంతయ్యఅనంతుడే అజేయులై ప్రకీర్తులై) చిరస్థాయి నిలుస్తారు" అంటూ రాసిన కవిత అనేక భారతీయ భాషలలోకి అనువదించబడింది అంతేకాక రేడియో మాస్కోలో కూడా ప్రసారం చేయటం విశేషం. నిజాం పాలనకు వ్యతిరేకంగా దాశరథి ప్రభావంలో తెలంగాణ పోరాటానికి మద్దత్తుగా 'వజ్రాయుధాన్ని ఝళిపించారు. నిజాం వ్యతిరేకంగా రాసిన కవితలన్నింటినీ వజ్రాయుధం పేరిట పుస్తకం గా విడుదలచేసారు. " ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు! ఒక నెత్తుటి బొట్టులోనె ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు!" అంటూ చేసిన నినాదం కేవలం తెలంగాణా పోరాటానికే కాదు, ప్రతీ ప్రజా పోరాటానికి ఊపిరులూదుతుంది.ఇప్పుడు కూడ సోమసుందర్ విప్లవ నినాదం నగరాల గోడలమీద, ప్రజలనాలుకల మీద ప్రతీ వుద్యమంలోనూ నినదిస్తూనే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదేమో. కొంతకాలం కమ్యూనిస్టు కార్యకర్తగా కూడా పని చేయటం వలన కావచ్చు కవిత్వంలో అంతర్లీనంగా ఆ భావజాలం ప్రవహిస్తూంది. ఈయన కవిత్వం చదువుతుంటే ఆసాంతం మానవుడే ప్రాతిపదికగానూ సమాజమే నేపథ్యం గానూ ఉంటుంది. తర్వాత్తర్వాత రాజకీయాలు, సాహిత్య వ్యాసంగము రెండింటినీ నిర్వహించటంలో తనకెంతో ఇష్టమైన సాహిత్య సృజన చేయలేకపోతున్నానేమోననే ఆలోచనతో క్రమక్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరిగి పూర్తిస్థాయిలో సాహిత్యానికే అంకితం మయ్యారు సోమసుందర్. వజ్రాయుధంనుండి విస్తరించిన వీరి నిర్వారామ కవితా యాత్రని గమనిస్తే సమాజంలోని సామాన్య మానవజీవితంలోని అనేకానేక సంఘర్షణలూ, పోరాటాలూ, సమకాలీన సమాజ నేపధ్యం విభిన్నకోణాలలో ఆవిష్కరింపబడుతూనే వుంటుంది. " ఉద్యమానికీ నా హృదయానికీ దూరభారాలూ స్థలాంతరాలూ తొలగి- జనం ప్రదర్శించే ప్రతి పురోగమనంలోనూ శతఘ్నిగా విస్ఫోటిస్తాను; నా గళం కాహళం గగనం నాకు తాళం--- నా కవిత్వం సమతా శతారం....."అంటూ ప్రయోగాత్మకంగా తన "జీవనలిపి"ని ఆవిష్కరించుకున్నారు. "గత ఆగష్టులో భద్రతాసమితి ఒక ప్రకటన చేసింది. గత ఏభయి సంవత్సరాలలోనూ వలసవాదులు జరిపిన స్థానిక యుద్దాలలో ద్వితీయ ప్రపంచయుద్ధంలో చంపబడినవారికి సరిగ్గా రెట్టింపు మంది- దాదాపు 70 లక్షలమంది చంపబడ్డారని - ఆ ప్రకటన విశదం చేసింది. ఆ వార్త బి.బి.సి వార్తల్లో విన్న మరుక్షణం నుంచి నాకు నిద్ర కరువయింది. బొంబాయి అల్లర్లు నేపథ్యంలో "రక్షరేఖ"కావ్యంగా ఆవేదన ఆవిష్కారం పొందితేతప్ప నాహృదయానికి ప్రశాంతి చిక్కలేదు. పరిపూర్ణ ప్రశాంతికోసం కోరుతూ వర్తమాన ప్రపంచానికి రక్షరేఖ కట్టాలన్న సంకల్పమే ఈ కావ్యం" అంటూ సోమసుందర్ ఆవేదనా భరిత కావ్యాన్ని అందించారు. "ఆ నల్లని రాత్రిలో, ఆ కారునల్లని చీకటిలో మనిషి హృదయం జలజ సౌకుమార్యం కోల్పోయి రాజవీధిలో ఠీవిగా నడిచే షార్కుల వాల ఘాతాలకు ముక్కలయి, నిర్జీవ శరీరాలు స్తంభాలకు వ్రేలాడినచోట సలలిత దీపకాంతిగా సౌజన్యం విరుస్తుందని నేనెలా స్వప్నించను? మధురగాథలింకెలా విన్పించను"( రక్షరేఖ,1996) నిత్యకవిత్వ సృజనశీలి అయిన సోమసుందర్ జీవితానికి కవిత్వానికి అభేధంగా నిలువెల్లా కవిత్వమై జీవించిన వారు కనుకే వందకి పైగా గ్రంథాల్ని వెలువరించగలిగారు.అందులో అనేకం దీర్ఘ కావ్యాలే కావటం కూడా విశేషమే. సోమసుందర్ కి ఒక పార్శ్యం రచనావ్యాసంగమైతే రెండవది నిబద్ధత తోడి జీవితం. 1956 వరదలకు చలించి గోదావరి జలప్రళయం కావ్యం కరుణారసప్లావితంగా రచించారు. "ఏమమ్మా, ప్రళయమువలె పొంగి ఓ గౌతమి ఇకనైనా దయను చూపి శాంతించవదేమి? ప్రసవించిన పులివై నీ కన్న బిడ్డలను మమ్ముల కోరలెత్తి మ్రింగుట ఇది ఏమి న్యాయమే తల్లీ... " అనే వీరి కవితా పంక్తులు ఇటీవల వరదలు చూసినప్పుడు మనసులో మెదిలాయి. సోమసుందర్ కవిత్వం సరళత, ఆర్ద్ర గాంభీర్యంగా, ఉదాత్తమైన లోతైన భావాలతో మానవత్వ సురభిళాలు వెదజల్లుతాయి. శ్రీ వృత్తం,వనితా వృత్తం వంటి విస్మరించిన ప్రాచీన ఛంధస్సును తీసుకుని ఆధునికంగా ఫ్యూడల్ వ్యవస్థ చట్రంలో సమాజం ఎదుర్కొన్న నిరంకుశ అమానుష సంఘటనల నేపథ్యంలో 'రక్తాక్షి'నీ, నక్సలైట్లు రైలుపెట్టెల్ని కాల్చి వేసిన సంఘటన నేపధ్యంగా 'ధూపఛ్ఛాయ' కావ్యాలు రాసారు. వ్లాడిమిర్ మైకోవిస్కీ రచించిన "A Cloud in Trousers" కావ్యాన్ని చదివినప్పుడు ఆత్మాశ్రయంగా రచించిన ఆ ప్రేమగాథ కలిగించిన ప్రభావంతో ఆరు అధ్యాయాలుగా తాత్విక చింతన ప్రాతిపదికగా "మేఘరంజని " దీర్ఘ వచన కథాకావ్యాన్ని 1959లో సోమసుందర్ రాసానంటారు. బాబ్రీమసీదు కూల్చిన సంఘటన నేపధ్యంగా "చేతావని "(1994) దీర్ఘ కావ్యంలో-- "చారిత్రక భవనాలన్నీ కూల్చి పరమత చిహ్నాలన్నీ భస్మరాశులుగా మార్చి ఎంత అద్భుత రాజకీయం మనది? మనిషి మనీషిగా సిద్ధి పొందడం సమాజ జీవిగా తలలోని నాలుకగా మారడం జీవ చైతన్యంతో భాసించడానికే కడగొట్టు తమ్ముడికైనా దుర్మార్గ నరాధముల వల్ల అన్యాయం జరిగినపుడు నువ్వు గొంతెత్తకపోతే రేపు కడకు నువ్వూ నీ గొంతూ మిగలవు సుమీ!" అంటూ సంఘీభావం ప్రకటించారు. ఆరుద్ర, కొత్తపల్లితో కలిసి వెన్నెల రాత్రిలో గోదావరి పరవళ్ళు చూసి పరవశించిన తన హృదయం"నా కరాలు గోదావరి శీకరాలు"అనే కావ్యంగా రూపెత్తింది అంటారు సోమసుందర్. "గోదావరీ తరంగం నా ఆపాదమస్తం నిమిరే అమృత కవితా హస్తం! నా సర్వ ప్రతిభలనూ, ఉన్మిషితంచేసే గోస్తనీ మాధ్వీక రసం! ఆమె అడుగులు పడిన నా గుండెలు సంతస శాలీయ సుక్షేత్రాలు;" సోమరసం- సుందరకాండ,మేఘరంజని,నాకరాలు గోదావరి శీకరాలు,మోనాలిసా కోసం,చేతావనీ,పాంథశాల, మిణుగురులు అనే కావ్యాల్ని కలిపి " సప్త గోదావరం" గా గ్రంథస్తం చేసారు "ఎంత దీర్ఘ యాత్ర చేశాడో ఆద్యంత రహిత ఆదిమానవుడు బ్రహ్మాండ సదృశ భూవలయంలో నరుని యాత్రా పదాలు వక్రరేఖలు కావు"-- వంటి వాక్యగమనంతో రాసిన అయిదు దీర్ఘకావ్యాల్ని " క్షితిజరేఖలు"గా వెలువరించారు. మానవుడు విప్లవానికై చేసిన కృషి నేపధ్యంగానే నాటకం, వ్యాసాలు,పాటలు, ట్రావేలాగ్, విమర్శన గ్రంథాల్ని వెలువరించారు.దేశంలో ఎక్కడ ఏ కదలిక వచ్చినా, ఏ సంఘటన ఎదురైనా ఏదృశ్యం చూసినా సోమసుందర్ స్పందించి కవిత్వంగా ప్రవహించేవారు. అందుకే ఆయన కవిత్వంలో దేశచరిత్రలో సంచలనాలన్నీ దృశ్య మాలికలుగా. నమోదయ్యాయి. సాహిత్యచరిత్రలో ఒక వ్యవస్థ నుండి మరో వ్యవస్థకు పరిణామక్రమాన్ని సూచించేది సృజనాత్మక రచనే.ఆ మార్పుని మూర్తిమత్వం సమకూర్చేవాడే కవి. ఆదర్శం, సంవిధానం సమపాళ్ళలో కలిపి సమన్వయం చేస్తూ , అభ్యదయసాహిత్యచరిత్రకు ఒక దిశ దశ కల్పించింది వజ్రాయుధం అంటారు ఆయన్ని చదివిన వారు. తెలంగాణాకు సుదూరంలో వున్నా పీడితుల పక్షాన నిలిచి,బానిసత్వం అంతరించాలని పలవరిస్తూ,కవిత్వంలో ప్రజా చైతన్యాన్ని రగిలిస్తూ,వారిలో పోరాటపటిమని, ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందించేలా వజ్రాయుధాన్ని రాసిన నిబద్దత కలిగిన సాహితీ మూర్తి సోమసుందర్. స్వతహాగా అభ్యుదయవాది,సిద్ధాంతపరంగా మార్క్సిష్టు కావటాన మార్క్సిస్టు సిద్ధాంతాల్ని విశ్లేషిస్తూ వాటి ఆచరణాత్మక మార్గాల్ని అన్వేషించిన వారు ఆవంత్స సోమసుందర్. కవిత్వప్రేమికుడే అయినా ఇతర సాహిత్య ప్రక్రియలకు దూరంగా లేరు.సమకాలీనుల రచనల్ని మెచ్చుకుంటే తాము చిన్నబోతామనుకుంటారు కొందరు సాహితీవేత్తలు.అటువంటిది సోమసుందర్ నారాయణబాబు రచనల్ని 'రుధిరజ్యోతి దర్శనం'గా చూపిస్తే, కృష్ణశాస్త్రి సాహిత్యంలో 'కృష్ణశాస్త్రి కవితాత్మ"ని వెలికితీసినవారూ ఆయనే ,'జాతికి జ్ఞాన నేత్రం' అంటూ కొడవటిగంటి కుటుంబరావు రచనలగూర్చి ,తిలక్ కవిత్వాన్ని' అమృత వర్షిణి'గా, పురిపండా అప్పలస్వామి రచనల్ని `పురిపండా ఎత్తిన పులిపంజా'గా, సినారె రచనల్ని' నారాయణ చక్రం'గా,'గురజాడ గురుత్వాకర్షణ'అంటూ గురజాడ గురించి,'అగ్నివీణ ఆలపించిన అణు సంగీతం'గా అనిశెట్టి సుబ్బారావు గురించి ఇలా పలుసమకాలీన కవుల సాహిత్యం గురించి విశ్లేషణాత్మక గ్రంథాలు వెలువరించటంలోనే వారు సాహిత్యాన్ని హృదయానికి హత్తుకునే తీరు అర్థమౌతుంది. అదేవిధంగా బుద్ధదేవ్ బోస్, లియోనార్డో డావెన్సీ గురించి కూడా పుస్తకాలు రాసారు సోమసుందర్. మరింత విశేషం భారతీయ సంగీతకారుల జీవిత చిత్రణలతో "హంసద్వని" పేరిట గ్రంథం తీసుకురావటం.ఇలా నిరంతర పఠనం,అవిరామ సాహిత్య సృజన చేసినవారు ఆవంత్స. 2004 లో రచించిన "అక్షర నాదం" కవితా సంపుటిలోని "గ్లోబలైజేషన్ తో ఈ భూమి రజస్వలై నవవరాన్వేషణలో మిటకరిస్తుంది...... హ్యూమన్ జెనిటిక్ ఇంజనీరింగ్ తో అవతరించిన క్లోనింగ్ కోడె దూడ ' అంబా" అని అరవడం గ్రాంధికమని నినదిస్తుంది. " చదువుతుంటే సోమసుందర్ కవిత్వీకరణలో రెండు తరాలకు వారధిగా ఉన్నారనేది సుస్ఫష్టమౌతుంది. 1969-73 మధ్యకాలములో ' కళాకేళి' అనే సాహిత్య మాసపత్రిక నడపిన సందర్భంలో అనేక కొత్తగొంతులకి ప్రాధాన్యం ఇచ్చేరు.నాటినుండి జీవితాంతం వరకూ కూడా యువ కవులందరికీ ఒక వారధిగా నిలచి ఎక్కడ ఏమంచి రచన కనిపించినా అక్కున చేర్చుకుని వాటిని గురించి తన స్పందనని వ్యాసంగా ప్రచురించేవారు.ఆ కోవలో నా యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కవిత పై సమగ్రంగా సుదీర్ఘ వ్యాసం రాసి విశాలాంధ్ర పత్రికలో ప్రచురించటం నా అదృష్టం. అంతే కాక ప్రతీ ఏడాది సోమసుందర్ ట్రస్ట్ ద్వారా వచన కవిత్వం, దీర్ఘ కావ్యం,కథ,విమర్శలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించారు.ఆ కోవలో వీర్రాజు గారూ,నేనూ కూడా దీర్ఘకావ్యాల కేటగిరీలో ఆయన చేతి మీదుగా దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి పేరిట పురస్కారాలు అందుకున్న వాళ్ళమే. “ఆశయానికీ ఆచరణకీ మధ్య తపస్సుకీ ఫలశ్రుతికీ నడుమ సాధారణంగా ఒక అసంతృప్తి మిగిలిపోతూనే ఉంటుంది" అంటారు సోమసుందర్. ఈ అసంతృప్తే లేనప్పుడే ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు కవులు రాయటం ఆపేస్తారు.ఈ అసంతృప్తే కవిత్వాన్ని జీవితం పొడుగునా ఆంవత్స సోమసుందర్ గారిని ఇతర సాహిత్య ప్రక్రియల్ని తోపాటు 'కవిత్వం' రాయించింది. బహుశా కవిత్వమే సోమసుందర్ కి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా చివరి వరకూ జీవించారు. ( 18-11-2024 న ఆవంత్స సోమసుందర్ గారి శతజయంతి) -- శీలా సుభద్రాదేవి 8106883099

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి