5, నవంబర్ 2024, మంగళవారం

విశిష్ట రచయిత్రి - శీలా సుభద్రాదేవి - శైలజామిత్ర వ్యాసం

విశిష్ట సాహితీవేత్త శీలా సుభద్రాదేవి -శైలజామిత్ర కవిత్వంతో పాటు అనేక నూతన ప్రక్రియలు ఆవిర్భవించాయి. కవిత్వం రూపంలోనూ సారంలోనూ ప్రముఖ కవయత్రి, రచయిత్రి . సాహిత్య రంగంలో ఇది అస్తిత్వ యుగం. ఆధునిక సాహిత్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ పోకడలు కనిపిస్తూ ఉన్నాయి. విశేషించి తెలుగు సాహిత్యంలోనూ ఈ ప్రభావం కనిపిస్తున్నది. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆధునిక సాహిత్య యుగం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యం నుంచే వచన విప్లవాత్మక మార్పులకు లోన్కెంది. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం విప్లవ కవిత్వం, అస్తిత్వవాద కవిత్వమనే పాయలుగా కవిత్వ ఉద్యమాలు నిర్మించబడ్డాయి. ఆస్తిత్వవాద యుగంలో భాగంగా స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీ వాదం, బహుజన వాదం, బీసీ వాదం ఇత్యాది సాహిత్య పాయలు తమ సొంత గొంతుకను వినిపించడం ప్రారంభమైంది. తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం ఇతమిద్దంగా పూర్తిస్థాయిలో రూపుదాల్చకముందే స్త్రీల సమస్యలపై తమకలాన్ని సంధించిన వారు వీరు అంటే 1980ల నాటికే ఈమె పురుషాహంకారాన్ని సవాల్ చేస్తూ కవిత్వం వ్రాసిన ఘనత శీలా సుభద్రాదేవి గారిది. సుమారుగా 1976 నుండి నేటి వరకు సామాజిక స్పృహతో ప్రత్యేకించి స్త్రీల సమస్యల పై తనద్కెన వాణిని వినిపిస్తూ వస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సాహిత్యంలో తనద్కెన ముద్ర వేస్తున్న విశిష్ట సాహితీవేత్త శీలా సుభద్రాదేవి. సునిశిత దృష్టితో సమాజాన్ని పరిశీలిస్తూ సామాజిక బాధ్యతతో కవిత్వం రాస్తున్నట్లుగా వీరి సాహిత్యాన్ని చదివితే అవగతమవుతుంది. శీలా సుభద్రాదేవి గారు ప్రముఖ కవయిత్రి, కధారచయిత్రి ఈమె చిత్రకారిణి కూడా ఈమె 1949లో విజయనగరంలో జన్మించారు. ఈమె ప్రముఖ రచయిత, చిత్రకారుడు స్వర్గీయ శీలా వీర్రాజు గారి సతీమణి ఈమె తొలిరచన 1975లో వెలువడింది. వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలంటే 1997 లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఈమెకు ఉత్తమ కవయిత్రి పురస్కారం లబించింది. తెలుగు సాహిత్యంలో శీలా సుభద్రాదేవి గారు ఎన్నెన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. వీరు రచించిన గ్రంథాలను ప్రస్తావించాలంటే ముఖ్యంగా ఆకలినృత్యం మోళి, తెగిన పేగు, ఆవిష్కారం, ఒప్పులకుప్ప యుద్ధం ఒక గుండెకోత, ఏకాంత సమూహాలు, బతుకుబాటలో ఆస్తిత్వరాగం, నా ఆకాశం నాదే. శీలా సుభద్రాదేవి కవిత్వం (1976-2009) ముద్ర (వనితల కవితల సంకలనం సంపాదకత్వం భార్గవీరావుతో కలిసి) వంటి కవితా సంపుటిలు, రచించారు. ముఖ్యంగా వీరు స్త్రీలపై రాసిన కవిత్వంలో ఎంతో సంయమనాన్ని పాటించారు. స్త్రీవాదం అంటే: పురుష ద్వేషమే అనుకునే స్థాయిలో తెలుగులో కవిత్వం వచ్చింది. దానిని సమూలంగా రూపుమాపుతూ స్త్రీవాద సాహిత్యానికి ఒక సంపూర్ణ అర్థాన్ని కలుగజేసిన ఘనత వీరిదే. అంతే కాకుండా సుభద్రా దేవి కవిత్వంలో స్త్రీ సాధికారత, ఆత్మగౌరవం, స్త్రీ హక్కులు, స్త్రీల వేదనలు, స్త్రీ స్వేచ్ఛ ఇత్యాది అంశాలు ప్రస్పుటంగా కనిపించినా ఎక్కడా పురుష ద్వేషంకనిపించదు. స్త్రీ సమానత్వకాంక్ష మాత్రమే బలంగా వినిపిస్తుంది. సుభద్రాదేవి: ప్రగతి కాముకత కలిగిన సాహితీవేత్త. సామాజిక అంతరాల పట్ల నిరసన, సమసమానత్వ భావన, సాంఘిక ఆర్థిక సమానత్వకాంక్ష వీరి కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తున్నది."నా పేరు జనం/ నా వాడ సోషలిజం" అని ఎలుగెత్తి చాటిన రచయిత్రి సుభద్రాదేవి శ్రమజీవుల దు। బాన్ని అద్భుతంగా అక్షరీకరించారు. రాజకీయాలు వ్యాపారంగా మారుతున్న రోజుల్లో అబద్దపు హామీలతో అందలానికి ఎక్కి పేదలను మరింత పేదలుగా మారుస్తున్న వైనాన్ని అనేక కవితలలో చూపారు. ప్రకృతి దృష్టిలో అందరూ సమానులే పంచభూతాలు ఏ ఒక్కరి పొత్తు కాదు అని నమ్మే ఈ కవయిత్రి ఈ ప్రకృతి శక్తులు కూడా గతి లేని వాడి మీదనే నిరసన ప్రకటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు వరదలా పొంగి పేదల గుడిసెలను ముంచెత్తుతున్నదని, పెనుగాలులు గుడిసెల తాటాకులను ఎగురవేసుకుపోతున్నాయని నిప్పు కూడా గుడిసెల పైనే తాండవమాడుతున్నదని, ఇక ఆకాశపు అందాలను చూసే తీరిక కూడా పేదలకు ఉండడని, నేల పూర్తిగా ఉన్నవాడి బానిస అని పంచభూతాలు పేదలకు అందడం లేదని ఆవేదన చక్కగా కవిత్వీకరించారు. దౌర్జన్యం పై అవసరమైనప్పుడు తిరుగుబాటు తప్పదని హెచ్చరిక సుభద్రాదేవి కవిత్వంలో కనిపిస్తుంది. అలాగని కేవలం కవిత్వమే కాకుండా దేవుడుబండ, రెక్కలచూపు, బస్కూలుకతలు! కథా సంపుటిలు రచించారు. నీడలచెట్టు అనే సంచలనాత్మకమైన నవల చతుర లో ప్రచురితమైంది. డా.పి. శ్రీదేవి, నిడదవోలుమాలతి రచనాసౌరభాలు వంటి మోనోగ్రాఫ్ లు, గీటురాయి పై అక్షరదర్శనం, కథారామంలో పూలతావులు వంటి వ్యాస సంపుటిలు వీరి రచనాశైలికి నిదర్శనాలు. నిర్మలత, సౌమ్యత, నిరాడంబరత, స్పష్టత పూర్తిగా కలిగిన రచయిత్రి వీరు. ఎదిగిన కొద్దీ ఒదగాలనే తీరు వీరిని చూస్తే ఎవరికైనా కనిపిస్తుంది. వీరు 'యుద్ధం ఒక గుండె కోతొ" 'బతుకుపాటలో అస్తిత్వరాగం" వంటి దీర్ఘ కవితలు రచించడమే కాకుండా తొలి దీర్ఘకావ్య కవయిత్రిగా పేరుగాంచారు. యుద్ధం ఒక గుండెకోత అనే దీర్ఘకావ్యంపై మధురకామరాజు విశ్వవిద్యాలయంలో ఎంపిల్ పరిశోధన జరిగింది. అలాగే ఈ ప్రక్రియ ఒకచోటే ఆగిపోకూడదని ప్రతి కవి దీర్ఘకవితలు రాయాలని నిరంతరం తపిస్తూ వుంటారు. ఎక్కడ దీర్ఘకవిత వున్నా ఎంతో శ్రద్దగా చదివి ప్రోత్సహిస్తారు. కొన్ని కుటుంబ పరిస్థితులవలన ఎనిమిదవతరగతితో చదువు మానేసి ఏడాది పాటు తమ అక్క ఇంట్లో వుండి అక్కడున్న గ్రంథాలయంలో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్ధం అయినా కాకపోయినా విరివిగా చదివారు అనే వీరి ఇంతటి రచనాశైలికి దోహదం చేసిందంటారు. వీరి అన్నగారు కొడవటిగంటి లీలామోహనరావు చిన్నన్నయ్య కొడవటిగంటి కాశీపతిరావులు కూడా అనేక వ్యాసాలు, కథలు రచించారు. వివాహనంతరం డిగ్రీ పూర్తిచేయడంతో పాటు 1972 లో హైదరాబాద్ లో అడుగు పెట్టారు ముఖ్యంగా వీర్రాజుగారు కూడా సాహితీ వేత్త కావటం నా సాహిత్య కృషికి దోహదపడిరదని అంటారు. సహజంగా చిత్రకారిణి అయిన వీరు వివాహానంతరం బాధ్యతల మూలంగా వున్న కాస్త సమయాన్ని రచనా వ్యాసంగానికే వెచ్చించారు. రచన ఏదయినా నేలవిడచి సాము చేసేవి కాకుండా సమాజోద్దరణకై రచనలు చేసారు. 2009 లో అప్పటి వరకూ వచ్చిన ఎనిమిది సంపుటాలను కలిపి "శీలా సుభద్రాదేవి కవిత్వం" పేరిట వీర్రాజు గారు వీరి అరవయ్యేళ్ళు జన్మదిన సందర్భంగా ప్రచురించారు. కాలం గడిచిన కొద్దీ ఏ సాహితీవేత్తకైనా రాయాలనే తపన, ఓపిక మరుగున పడిపోతాయి. కొందరు ఎందుకు రాయాలని ప్రశ్నిస్తూ నిలిచిపోతారు. కొందరు రచించినవి కొన్నే అయినా వాటినే తమ ఉనికిగా చాటుకుంటూ నిత్యం పోరాటం చేస్తుంటారు. కానీ శీలా సుభద్రాదేవిగారు ఇలాంటి ఆలోచనలకు దూరంగా వుంటూ ఎప్పుడూ చిరునవ్వుతో, సంపూర్ణమైన విశ్వాసంతో సాహిత్యమే తమ ఊపిరిగా భావిస్తూ ముందుకు కదిలిపోతుంటారు. ఒక మాటలో చెప్పాలంటే మహిళా రచయిత్రులకు వీరు ఎప్పటికీ మార్గదర్శకులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి