18, నవంబర్ 2024, సోమవారం

నాదో చిన్నమాట - కథారామంలోపూలతావులు

~ నాదో చిన్నమాట ~ 2010లో వందేళ్ళ కథాప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోనే కాక బయటున్న తెలుగు కథకులందరితో ఎన్నో సమావేశాలూ, ఎన్నో ఇంటర్వ్యూలూ, వ్యాసాలూ, అభిప్రాయాలు వెలువడ్డాయి. మొదటి కథారచయిత్రిగా భండారు అచ్చమాంబను పేర్కొని, ఆపైన 1980 తర్వాత రాసిన రచయిత్రులనే అనేకమంది పేర్కొన్నారు. ఒక ఛానల్ కోసం 'వందేళ్ళ కథకు వందనాలు' పేరిట 118 మంది కథకుల కథలను పరిచయం చేసిన గొల్లపూడి మారుతీరావు కేవలం పన్నెండుమంది రచయిత్రుల కథలనే స్వీకరించటంకూడా గమనించాల్సిన విషయమే. అవన్నీ గమనించిన తరువాత 1910కి - 1980కి మధ్య ఒకరిద్దరు తప్ప కథారచయిత్రులు లేరా అనే ఆశ్చర్యం కలిగింది. అరవయ్యో దశకంలో పత్రిక లన్నింటిలో ప్రభంజనం సృష్టించిన రచయిత్రులంతా ఏమయ్యారు? వారు నవలలే తప్ప చెప్పుకోదగిన కథలేమీ రాయలేదా? రాసినా విమర్శకులు, చాలామంది. పేర్కొన్నట్లు, ప్రేమలూ-పెళ్ళిళ్ళూ, కుటుంబాలూ, అపార్థాలూ, కలహాలతో నిండిన వంటింటి సాహిత్యమేనా? - ఇలా అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టాయి. 1950కి ముందు రచయిత్రులనీ, వారి కథల్నీ సేకరించటం నాకు అలవికాని పనిగా తోచింది. అందుకని స్వాతంత్య్రానంతర కథారచయిత్రులను- అంటే 1950ల నుండి 1980ల వరకూ అనగా నా ముందుతరం రచయిత్రులను, అందులోనూ కథలు రాసినప్పటికీ కేవలం నవలారచయిత్రులుగా మాత్రమే పాఠకులూ, విమర్శకులూ గుర్తించే వారినికూడా ఎంపిక చేసుకున్నాను. రచయిత్రుల కథాసంపుటాలను సేకరించి, వాటిలో లేని కథలను కథానిలయం వెబ్సైట్ నుండి దిగుమతి చేసుకుని చదివాను. ఆ రోజుల్లో పబ్లిషర్లు పుస్తకాలు వేసుకొని అమ్ముకునేవారు. అందువల్ల ప్రచురింపబడిన కథల సంపుటాలకు ఆవిష్కరణ సభలూ, ఉపన్యాసాలూ, వ్యాసాలు రాయించుకోవటం వంటి ప్రచార పటాటోపాలు లేక ఆ యా రచయిత్రుల కథల సంపుటాలు ఎన్ని వెలుగు చూశాయో కూడా తెలియని పరిస్థితి. చాలామంది రచయిత్రుల కథలు యాభైకి పైగానే దొరికాయి. ఒక్కొక్కరివి చదువుతుంటే ఆనందం, ఆశ్చర్యం, ఉత్సాహం ముప్పేటలుగా నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఏ రచయితవీ వాళ్ళు రాసిన రచనలన్నీ అత్యద్భుతంగా ఉండవు. అలాగే ప్రతీ రచయితా, రచయిత్రుల సాహిత్యంలోనూ పేర్కొనదగినట్టి రచనలు కొన్నైనా ఉంటాయి. ఆ పనే నేను చేపట్టాను. ఆశ్చర్యకరంగా రచయిత్రులు రాసిన కథల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి కథలు దొరికాయి. ఆ యా రచయిత్రులకు సమకాలీనులైన రచయితలకు తీసిపోని విధంగా, రచయితలుకూడా స్వీకరించనటువంటి కథాంశాలను తీసుకొని సమర్థవంతంగా రాసిన కథలు ఉన్నాయి. అటువంటి విభిన్న కథాంశాలతో, విభిన్న కథనాలతో రాసిన కథల్నీ, తమకే స్వంతమైన ప్రత్యేక ముద్రని సాధించిన రచయిత్రుల కథల్నీ, కథల్లో మాండలికాల్ని ఉపయోగించి రచనలు చేయని కాలంలోనే చక్కటి తమదైన మాండలిక పద్ధతిలో రాసిన కథల్నీ, దిగువ తరగతుల జీవన విధానాల్నీ, బడుగు బలహీనవర్గాల జీవన విధ్వంసాలనూ శక్తివంతంగా రాసిన కథల్నీ ఆ యా రచయిత్రులు ఆ కథల్ని రాసిన నాటి సమాజ తీరుతెన్నుల్నీ ప్రస్ఫుటింపజేసే కథలన్నింటినీ పరిచయం చేశాను. నా ముందుతరం రచయిత్రుల గురించే రాయాలనుకున్నాను కానీ, తప్పక రాసి తీరాల్సిందే అనిపించటం వలన, నా సమకాలీన రచయిత్రులు ముగ్గురి కథలను గురించికూడా వ్యాసాలు రాశాను. ఇందులో కొంతమంది ఈనాటి తరం కథకులకు తెలియకుండా మరుగున పడిపోయిన విస్మృత కథారచయిత్రులు కొందరు ఉన్నారు. రచయిత్రుల కథల గురించి వ్యాసాలు రాసేటప్పుడు; వారు రాసిన కథలలో ప్రత్యేకతతో కూడిన కథాంశాల్నీ, కథన శిల్పాన్నీ, భాషనీ, భావసాంద్రతనీ, కథలోని పాత్రల విశిష్టతనీ, పాత్రల్ని రూపుదిద్దిన విధానాన్నీ, కథల్లో స్త్రీ అస్తిత్వాన్ని ప్రకటించిన విధానాన్నీ పరిగణనలోకి తీసుకున్నాను. కొన్ని లోపాలున్న కథలూ ఉండి ఉంటాయి. కానీ నేను ఈ వ్యాసాల్ని రాయాలని సంకల్పించుకున్న కారణం ఈతరం కథకులకు ముందుతరం రచయిత్రులను పరిచయం చేయాలనుకోవటమే సన్నీపనికి పురికొల్పింది. వీళ్ళుకాకుండా ఇంకా రాయదగిన రచయిత్రులున్నారు. కానీ నా పరిమితికి లోబడి కొందరిని వదిలేయాల్సి వచ్చింది. మరుగున పడిపోతున్న కథల్నీ, రచయిత్రుల్నీ వెలికితెచ్చి వందేళ్ళ కథాప్రస్థానంలోని శూన్యాన్ని కొంతవరకైనా పూరించటం లక్ష్యంగా వందలకొద్దీ కథల్నీ చదివే అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాననే అనుకుంటున్నాను. ఈ వ్యాసాలు రాయటంలో పుస్తకాలు ఇచ్చి సహకరించిన కె.పి. అశోక్ కుమార్ గారికి, ఇంద్రగంటి జానకీబాల గారికి, కాత్యాయనీ విద్మహే గారికి ధన్యవాదాలు. వ్యాసాల్ని ప్రచురించిన భూమిక, చినుకు, పాలపిట్ట, ప్రజాసాహితి, విశాలాక్షి, వివిధ పత్రికలకు; సారంగ, విహంగ, గోదావరి వెబ్ పత్రికల సంపాదకులకు ధన్యవాదాలు. ఏ కథలపై ఏ వివరాలు తెలుసుకోవాలన్నా, ఏ కథకుల కథలను సేకరించాలన్నా పరిశోధకులకు కథల కల్పవృక్షం 'కథానిలయం'కు మరిన్ని ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి