3, డిసెంబర్ 2021, శుక్రవారం
అలకలకొలికి
నడక దారిలో-- 9
నడక దారిలో-- 11
6, నవంబర్ 2021, శనివారం
నడక దారిలో--1
3, నవంబర్ 2021, బుధవారం
శ్రీదేవి మోనోగ్రాఫ్ పై తెలుగు తూలిక లో ని.మాలతి సమీక్ష
1, నవంబర్ 2021, సోమవారం
నడక దారిలో-- 10
29, అక్టోబర్ 2021, శుక్రవారం
శీలావీ వేసిన తైలవర్ణ చిత్రాల గురించి
25, అక్టోబర్ 2021, సోమవారం
నడక దారిలో--8
26, సెప్టెంబర్ 2021, ఆదివారం
బుల్లెట్టు బండి పాట గురించి
12, సెప్టెంబర్ 2021, ఆదివారం
వేదుల మీనాక్షీ దేవి కథలు
8, ఆగస్టు 2021, ఆదివారం
నా పని-నా ఆనందం
నాపని-నాఆనందం
పనిఅంటే ఇంటి పనా,పిల్లల పనా,ఉద్యోగమా,రచనారంగమా దేని గురించి చెప్పాలి.గొప్ప డైలమాలో పడ్డాను.
నిజానికి work is worship అనేది నాసిద్ధాంతం.ఏ పని ఐనా అంకితం భావం తోనే చేస్తాను.ఎందుకొచ్చిన బాధరా బాబూ అనుకునే మనిషిని కాదు.ఏదైనా పని నాకు అప్పగించినప్పుడు నేను చేయగలిగినది ఐతే వప్పుకొని ఆనందంగానే చేస్తాను.నచ్చకపోతే ముందే ఖచ్చితంగా చేయనని చెప్పేస్తాను.
ఇంటిపనీ,పిల్లలపనీ ఇవి ప్రతీ స్త్రీ కి తప్పని, తప్పించుకోలేని బాధ్యత.అయినా ప్రతీ మహిళా తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా బాధ్యతంతా భుజాన వేసుకుని ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఇది చేయటంలో సంతోషమూ ఉంటుంది.ఒకింత స్వార్థమూ ఉంటుంది.అలాగే నేనూ చేసాను.
అమ్మకి ఆర్ధిక స్వావలంబన లేక చిన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు చూడటం, అనుభవించటం వలన చదువుకొని ఉద్యోగం చేయాలనే గాఢమైన పట్టుదలని వివాహానంతరం పదేళ్ళకి గాని సాకారం చేసుకోలేకపోయాను.అందుకని టీచరు ఉద్యోగంలో పిల్లలతో మమేకం అవుతూ పాఠాలు చెప్పటం లోనూ, స్కూలు కి సంబంధించిన విజ్ఞాన ప్రదర్శనలూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం లో సంతోషం పొందాను. స్కూల్ లో ఉన్నంతసేపూ ఇంకేం విషయాలూ గుర్తు రానంతగా ఆనందం పొందాను.
కొందరు టీచర్లు ఎప్పుడు రిటైర్ అవుతామో అని సంవత్సరాలు,నెలలూ లెక్కబెట్టుకుంటుంటే అంత బాధ పడి బడికి రావటం మెందుకు? ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకోవచ్చు కదా మరొకరికి ఉద్యోగం అన్నా వస్తుంది అనుకునేదాన్ని.
నేను ఫ్రెండ్ అనుకున్న ఆమె అప్పట్లో హెడ్ మిస్ట్రెస్ గా ఉంది.ఆమె ప్రమోషన్ నాకు రాకుండా నన్ను టార్చర్ పెట్టటానికీ,నాకై నేను ఉద్యోగం మానేసేలా ప్రయత్నం చేసినా ఎదుర్కొని నిలదొక్కుకున్నానే కానీ ఉద్యోగం వదిలి పారిపోలేదు. నిబద్ధతతో పాఠాలు చెప్తూ విద్యార్ధులతో కలిసి మెలిసి ఉండటం లోని ఆనందాన్ని కోల్పోలేదు.
ఇక నా ప్రవృత్తి రచనా రంగం .1970 లో కథాప్రచురణతో మొదలై యాభై ఏళ్ళు దాటిన నా రచనా ప్రస్ధానం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే వుంది.ఉద్యోగవిరమణ అనంతరం నాకు సంతోషం కలిగించే లలిత సంగీతం, చిత్రలేఖనంలో కూడా సాధనచేయాలనుకున్నా అంతగా కుదరలేదు.అందుకే మరింతగా రచనా వ్యాసంగం లోనే నా ఆనందాన్ని నింపుకున్నాను.
చిన్నప్పటి నుంచి నన్ను నేను తీర్చిదిద్దుకున్నది పుస్తక పఠనం వలనే. ఎప్పుడైనా మనసు నొచ్చుకున్నా,చికాకుగా ఉన్నా కాసేపు ఏ పుస్తకమైనా చదువుకుంటే స్నేహితురాలి వలన ఓదార్పు పొందినట్లు మనసు తేలికైపోతుంది.అందుకే ఎంత పని ఒత్తిడిలో తీరికలేకుండా ఉన్నా,అనారోగ్యంగా ఉన్నా రాత్రి తప్పని సరిగా ఓ నాలుగైదు కవితలో ఓ రెండు కథలో చదివిన తర్వాతే నిద్రకు ఉపక్రమించటం చిన్నప్పటి నుంచీ అలవాటు.
నా ఆవేదన,నా ఆవేశం,నా దుఃఖం,నా ఆక్రోశం,నన్ను కలవరపరిచే అన్ని అనుభూతులను మరిపించి ఆనందాన్నీ, సంతృప్తినీ కలిగించి మనసుతేలికపరచేది నా సాహిత్య పఠనమూ,రచనలే.ఎన్ని ఒడుదుడుకుల్ని నా జీవితపర్యంతమూ ఎదుర్కొన్నా నా ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకుండా సంయమనంతో ఉండేలా చేసినవి నాకు తోడుగా ఉన్న నా అక్షరాలే.
3, ఆగస్టు 2021, మంగళవారం
భయం భయం
22, జులై 2021, గురువారం
కారా మాస్టారు కు నివాళులు
తెలుగు కథా ప్రస్థానం వయసుఎంతో కొంచెం తక్కువగా కారా మాస్టారు జీవితం అంతే.కథ గుర్తు వస్తే కారా మాస్టారు గుర్తు వస్తారు,ఆయన గుర్తు వస్తే కథానిలయం నిలువెత్తున కళ్ళ ముందుకు వస్తుంది.తెలుగు కథాసాహిత్యం లో విడదీయలేని బంధం అది.
కారా మాస్టారి నవతి సందర్భంగా సావనీర్ కోసం వ్యాసం రాయమని అట్టాడ గారు అడిగినప్పుడు ఎంతోమంది వారి సాహిత్యం గురించి రాసారు ఇంకా నేనేమి రాస్తాను అని వారి కథలు పుస్తకం తీసి చదవటం మొదలెట్టేసరికి పేజీ పేజీకీ నాలో ఉద్వేగం కలిగింది.ఎన్ని జాతీయాలో,ఎన్ని నానుడు లో, ఇంకెన్ని సామెతలో ఉత్తరాంధ్ర మాండలీకం నింపుకుని పరిమళాలు నా మనసు చుట్టేసాయి.ఇక అంతే అవి నోట్ చేసుకుంటూ "సామెతలు,నానుడుల పరిమళం" అనే వ్యాసం రాసాను.
అంతకు ముందు తెలుగు కథలు సరళ గ్రాంథికంలోనే ఎక్కువమంది రాసేవారు.కారా గారూ, రావిశాస్త్రి,బీనాదేవీ ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలజీవనశైలినీ, సంస్కృతి నీ,కడగండ్లనూ,వారి మనోభావాలను కళ్ళకు కట్టేలా మాండలికసొబగుతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు.
ఇక వారు స్థాపించిన కథానిలయం కథా పరిశోధకులకు కల్పవృక్షం, సాహిత్య గని.నేను శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసినప్పుడు గానీ,తదనంతరం రచయిత్రుల కథలు గురించి వ్యాసాలు రాసినప్పుడు గానీ కథానిలయం ద్వారా ఎందరో కథకులు కథలను చదవ గలిగాను.కథానిలయం వలనే సమగ్రమైన వ్యాసాలు రాయగలిగాను.అందువలన కథా సాహిత్యానికి కారా మాస్టారి కృషి విలువ కట్టలేనిది.
హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మాఇంటికి వచ్చేవారు.తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ మహాసభలలో ప్రత్యేక పురస్కారానికి వచ్చినప్పుడు సభా ప్రాంగణం లో కలిసినప్పుడు అప్పటికే వారికి కొంత మరుపు మొదలైనా నన్ను గుర్తు పట్టి మా అక్కయ్య నీ,అన్నయ్య నీ, వీర్రాజు గారి గురించి అడిగారు.నా వ్యాసాలు పుస్తకం పంపినప్పుడు వారు ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని ఆశీర్వదించారు.
మరొక రెండేళ్ళలో శతవసంతాలు పూర్తి చేసుకోవాల్సిన తరుణం లో వారు వెళ్ళిపోవటం శోచనీయం.ఐతే ఈ కరోనా కష్టకాలంలో ఏమీ బాధ పడకుండా ఈవిధంగా కుమార్తె చేతిలో అనాయాసమరణం ప్రాప్తించినందుకు కొంత ఊరట.
ఏది ఏమైనా ఒక తెలుగుకథా మహా వృక్షం నేలకి ఒరిగింది.ఇది సాహిత్య రంగానికి తీరని లోటు.ఈ రెండు మాటలు చెప్పే అవకాశం నాకు కలిగించిన మనలో మనం అడ్మిన్ లకు ధన్యవాదాలు.
కారా మాష్టారు కి నా బాష్పాంజలులు.
సంకలన సంపాదకులు
సంపాదకత్వం గురించి గంగిశెట్టిగారు అందించిన వ్యాసం సమగ్ర సమాచారాన్ని అవగాహననీ కల్పించేలా ఉంది.ఆ విషయం మీద సభ్యులు కూడా మంచి చర్చను ఆసక్తి కరంగా కొనసాగించుతున్నారు.
పనిలో పనిగా వివిధ సమకాలీన సంచలనాలు మీద పుంఖానుపుంఖాలుగా కథా,కవితా సంపుటాలు వెలువరుస్తున్నారు.ఉదాహరణకు యుద్ధం మీద ఒకరు సంకలనం వేయసంకల్పించి సంపాదకత్వం వహించినవారు యుద్ధం మీద కవితల్ని ఆహ్వానిస్తూ పేపరు ప్రకటన ఇచ్చారు.అంతే అప్పటివరకూ రానివారు కూడా రాసి పంపించేసారు.యుధ్ధంమీద కవితా సంకలనం వేసేసారు సదరు సంపాదకులు.అంతే తప్ప అంతకు ముందు ఎవరైనా పాతతరం నుండీ రాసారేమో ననే వెతుకులాట లేదు.ఎంత సులభం అయిపోయింది కదా సంకలనం సంపాదకత్వం?!.నిజానికి యుద్ధం మీద నేనొక దీర్ఘ కవితే రాసాను.దాని ప్రస్తావన కూడా లేదు.
అదేవిధంగా బియాస్ నదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకు పోయిన ఇరవై అయిదు మంది విద్యార్ధుల మీద ఒక సంకలనం వచ్చింది.అందులోనూ నా కవిత రాలేదు.అంటే ప్రకటన కు స్పందించి వచ్చిన కవితల్ని వేసేయటమే తప్ప చిత్తశుద్ధి తో నిజాయితీగా, నిబద్ధతతో సంకలనకర్తలు గా , సంపాదకులుగా పేరు సాధించటం ఎక్కువైపోయింది.
మరికొందరు కథో,కవితతో పాటూ డబ్బు కూడా ఇవ్వమంటున్నారు.అంటే మనమే,కథో,కవితో ఇవ్వటమే కాకుండా మనడబ్బు తోటే సంకలనం వేసి పనిలో పనిగా డబ్బు మిగిల్చి వాళ్ళదో పుస్తకం కూడా ప్రచురించేసుకుంటున్నారు.ఇదీ ఈ నాటి సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్న వ్యాపార కళ.
ఏదైనా అవాంఛనీయం,అక్రమం, అన్యాయం, దుర్మార్గం,ఇలా,ఇలా.....ప్రముఖులమీదా,దినాలమీదా కాదేదీ సంకలనకనర్హం అన్నట్లు ఇటువంటి సంపాదకుల పంట పండిస్తున్నాయి.ఇంతకూ వీరూ సంపాదకులే కదా
గం.లా.నా. గారి వ్యాసం చూడగానే ఉండలేక రాసాను.ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యురాలిని.
విద్యార్థులతో అరకు యాత్ర
నేను పనిచేసిన స్కూల్ ఆర్టీసీ హైస్కూల్.ప్రతీ ఏడాది దసరా సెలవుల్లో ఒక్కో సారి ఒక్కో రాష్ట్రంకు విజ్ఞాన యాత్ర కోసం మాకు రెండు బస్సులు, నలుగురు డ్రైవర్లను ఉచితంగా ఇచ్చేవారు.
ఒకసారి అరకు వెళ్ళాము ఆడపిల్లలకు ఒక బస్సు,మగపిల్లలకు ఒక బస్సు.అరకుపైకి వెళ్ళినప్పుడే ఒక బస్సు కొంచెం ప్రోబ్లం ఉన్నట్లు అనిపించింది.మళ్ళీ కిందకు దిగేముందు డ్రైవర్లు నాకు,మరో టీచర్ కు విషయం చెప్పి చిన్న మగపిల్లలను అందరు టీచర్లను ఒక బస్సులో ఎక్కించి,8,9,10 తరగతుల పిల్లలను కొంత దూరం ఘాట్ రోడ్డు దాటేవరకూ నడిచి రమ్మని చెప్పారు.అందరూ భయపడతారని అందరికీ చెప్పలేదు.అన్నారు.
మేము కూడా చెప్పలేదు.ఖాళీ బాస్ ముందూ,దానివెనుక మా బాస్ వెళ్ళటానికి ప్లాన్.బస్సులు బయలు దేరాక ఒక పది పదిహేను మంది పిల్లలు ఖాళీ బస్ టాప్ ఎక్కి ఛయ్య ఛయ్యా అంటూ డాన్స్ మొదలెట్టారు.బస్సు రొదలో ఆఫీస్ డ్రైవర్ గమనించలేదు .వెనక బస్ లోని ఆడపిల్లలు కూడా డాన్స్ మొదలెట్టారు.ఘాట్ రోడ్డు లో బస్ ఆపటానికి లేదు.మా బస్ లో డ్రైవర్లు భయపడసాగారు.నాకు మరో టీచర్ కూ భయంతో చెమట్లు పట్టేసాయి.
కొంత దూరం అలాగే జాగ్రత్తగా నడిపి సేఫ్ ప్లేస్ చూసి ఆపారు. ఇంకా అప్పుడు టాప్ మీదున్న పిల్లలను కిందకు దింపి బాస్ పాడైన విషయం చెప్పి" మీకు ఏమైనా జరిగితే మీ పేరెంట్స్ కి ఏంచెప్పుకుంటాం" అని మొట్ట మొదటి సారి నేను కోపంతో వాళ్ళని బెత్తం తో బాది బావురుమని నేను కూడా ఏడ్చేసాను.అప్పుడు అందరూ భయంతో దుఃఖంతో గండం తప్పిందని అనుకున్నారు.
మిమ్మల్ని విశాఖ బస్ స్టేషన్ వెయిటింగ్ రూం కి చేర్చి బాస్ రిపైర్ కి తీసుకు వెళ్ళారు.ఈ సంఘటననా నా ఇస్కూలు కథల్లో కూడా రాసాను.
వచన కవితా ప్రక్రియ లోకి అడుగు పెట్టి క్లిష్టమైన సంస్కృత పదబంధాలూ భాషాడంబరాలతో రాస్తేనే కావ్య రూపం పొందుతుందని భావించిన ఆధునిక కవులేకాక సీనియర్ కవులు సైతం నిజాయితీగా నిర్భీతిగా చెప్పిన కుందుర్తి సరళవచనా శైలికి లొంగిపోయారు.
ఇక తిలక్ కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అనే భావన పాఠకులకు కలుగుతుంది.తిలక్ నిజాయితీగా చెప్పిన
'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'
మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.
శ్రీ శ్రీ తొలి రోజుల్లో రాసిన కొన్ని కవితలలో సంస్కృత భాషాడంబరం,సమాసాలూ కనిపించినా "మెట్లు" కవిత సభలో చదవగా విన్న ఒక పిల్లవాడు "ఇంతేనా కవిత్వమంటే నేనూ రాయగలను " అన్నాడని , సామాన్యుడికీ అర్థమయ్యేలా కవిత ఉండాలని శ్రీశ్రీ ఓ సందర్భంలో చెప్పాడు.
నిజానికి ఏ సాహిత్య ప్రక్రియ ఐనా సరే దానికి తగిన భాష అదే సమకూర్చుకుంటుంది.
సామాజిక స్పృహ కవిత్వాన్ని మింగేసిందనటం,సామాజిక స్పృహ ఒక జాడ్యం గా భావించటం అనటం నేను ఒప్పుకోను.
ఇంకా వెన్నెలా,పూవులూ,ఆమనీ,ప్రేమా,ప్రేయసీ అంటూ కవిత్వం రాయటం ప్రపంచంలో జరుగుతోన్న అనేకానేక సందర్భాలూ, సంఘటనలూ,సంక్షోభాలనుండి పలాయనవాదంగా భావించాలి.
కవిత్వం ఎప్పుడూ ఆత్మాశ్రయంగా మొదలైనా నేను నుండి మనం లోకీ మనం నుండి జనంలోకీ మమేకం కావాలి.
పదచిత్రాల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించితే ఒక్కొక్కసారి వ్యతిరేకార్థం లో కి వచ్చే ప్రమాదం కూడా ఉంది.అందుకని రాసిన వెంటనే మాధ్యమాల్లోనో పత్రికలకో పంపకుండా ఎవరికి వారు తిరిగి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏ సాహితీవేత్త కైనా వారి సాహిత్యమే వారి వ్యక్తిత్వం కావాలి,వారి వ్యక్తిత్వమే వారి జీవితం కావాలని నేను నమ్ముతాను.
14, జులై 2021, బుధవారం
నడక దారిలో--6
నడక దారిలో-6
నడక దారిలో--7
నడక దారిలో--7
1965-66 సంవత్సరాలలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ,మా ఇంట్లోనూ కూడా అనేక మార్పులు,సంఘటనలూ మైలురాళ్ళలా పాతుకున్నాయి.
1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధకాలంలో దేశాన్ని ప్రధాని గా నడిపించారు లాల్ బహదూర్ శాస్త్రి . 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయింది. ఒప్పందం జరిగిన తరువాత రాత్రే తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో మరణించినట్లు వార్త. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యే ఆనే కథనాలు విన్నాము.
ఆ సందర్భంగా నెలకొన్న రాజకీయ సమీకరణాల్లో ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఆ రోజు స్కూల్ లో ప్రార్థన సమావేశం లో మొట్టమొదటి మహిళా ప్రధాని గా ఇందిరా గాంధీ గురించి చెప్పారు.తరగతి గదిలో కూడా క్లాసు కి వచ్చిన మాష్టార్లు ఆడపిల్లల కి ప్రత్యేకం గా అభినందించారు.అప్పడు ఆడపిల్లలమంతా మేమే ఆ పదవిని పొందినట్లు పొంగిపోయాము.ఆమె పాలనలో మహిళలకే మైనా ఒనగూడిందా అని ఇప్పుడు ఆలోచిస్తే నేతిబీరకాయలో నెయ్యి చెందమే.
ఇక రాష్ట్రంలో 1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో . 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో ప్రజలు ఉద్యమించారు.ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం ముందుండి నడిపించాడనీ,టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటిే నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారనీ విశాఖ జిల్లా అంతటా ఎన్నెన్నో వార్తలూ,ఎన్నో సంచలనాలు.
గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారనీ జిల్లా అంతటా ఓ విధంగా అట్టుడికి పోయిందని చెప్పొచ్చు.
ఈ సందర్భంలో జరిగిన బందుల్లో( అప్పటికీ విజయనగరం విశాఖ జిల్లా లోనే ఉంది) స్కూలు మూయించటానికి వచ్చిన ఉద్యమకారులతో పాటూ సంఘీభావం గా మేము కూడా మావంతుగా కాసేపు నినాదాలు చేసాము.ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించి సాధించిన విశాఖ ఉక్కు మాత్రం ఈ నాటి పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు తుప్పు పట్టేలా ఉంది.
నిజానికి నాకు రాజకీయాలు పట్ల ఆసక్తి ఉండేది కాదు.అయినప్పటికీ దేశంలో కానీ , రాష్ట్రంలో కానీ ఏ సంచలనాలు ఉన్నా డైరీ లో రాసుకునే అలవాటు ఉండటం ఆశ్చర్యమే .అసలు సోషల్ స్టడీస్ పుస్తకం చదివినప్పుడల్లా
" ఆ రాణీ ప్రేమ పురాణం/
ఈ ముట్టడి కైన ఖర్చులూ /
తారీఖు లు దస్తావేజులు /
ఇవి కాదోయ్ చరిత్ర సారం,"
అనుకునేదాన్ని.అయినా ఏమాటకామాటే సోషల్ లో చాలా మంచి మార్కులే వచ్చేవి.
ఇక మా ఇంట్లో మా చిన్నన్నయ్య కథలు అప్పటికే ప్రచురితం అవుతున్నా ఆ ఏడాది ఆంధ్రప్రభ దీపావళి కథలపోటీలో బహుమతి వచ్చేసరికి ఆ ఊరులో కథకుడు గా గుర్తింపు వచ్చింది.ఆబహుమతి డబ్బు తో రేడియో కొన్నాడు.ఇంక నాకెంత సంబరమో.ఆ రోజుల్లో సాయంత్రం 5-30 కి లలిత సంగీతం ప్రసారం అయ్యేది.అవి తప్పక వింటూ ఆ పాటలు రాసుకుంటూ నేర్చుకునేదాన్ని.అప్పట్లోనే సంగీతం నేర్చుకోవాలని కోరిక మనసుని తొలిచేసింది.
అన్నయ్య కథలు ప్రచురితం అవుతున్నప్పుడల్లా నాకూ కథలు రాయాలని అనిపించేది.రావిశాస్త్రికి ఏకలవ్య శిష్యుడిగా రాసే అన్నయ్యకథలే కాక,అతను సేకరించే రావిశాస్త్రి,కారా,చాసో,బీనాదేవి పుస్తకాలూ నేను కూడా చదవటం వలన నా ఆలోచనల్లో,నా దృక్పథం లో బాగా మార్పు రావటం నాకే తెలుస్తోంది. మళ్ళా ఇప్పుడిప్పుడే చదువులో కుదురు కున్నాను కదా మళ్ళా ఆగిపోతుందేమోనని భయపడ్డాను.కానీ నాకు తోచిన ఆలోచనల్ని కాగితాల మీద పెట్టి పుస్తకాలు అడుగున దాచేసేదాన్ని.
ఆరోజుల్లోనే జరిగిన చిన్నక్క వివాహం మరో సంచలనం.కోటబొమ్మాళిలో మా స్కూల్లో మాష్టారు వాసుదేవరావు గారు అప్పటి నుండి అక్కని ఇష్టపడ్డారు.విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ లో 1962 లో సైనిక్ స్కూలు స్థాపించినప్పుడు ఆయనకి అందులో ఉద్యోగం వచ్చింది.మొదటి నుండి ఆయన హార్దికంగా,ఆర్థికంగా అమ్మకి ఆసరాగా ఉన్నారు.పెద్దక్కయ్య తాను మా ఇంట్లో ఉన్నప్పుడే వారి వివాహం నిశ్చయం చేసింది. విశాఖ పట్నం లో రిజిష్టర్ కార్యాలయం లో వివాహం జరిగింది.వాసుదేవరావుగారి తరపున ఆయన సహోద్యోగులు,మా కుటుంబం మాత్రమే హాజరయ్యాము.ఆ వెంటనే చిన్నక్క కోరుకొండ వెళ్ళిపోయింది. వర్ణాంతర వివాహం కావటాన కుటుంబ పెద్ద ఒకరు మావంశవృక్షం రాస్తూ తులసివనం లో గంజాయి మొక్కగా అభివర్ణించారు కానీ తదనంతరం ఆయన కుటుంబంలోనే వర్ణాంతరమేకాదు మతాంతరం, రాష్ట్రాంతరం ,దేశాంతరం వివాహాలు కూడా జరిగాయి.ముఖ్యంగా మా నాన్నగారి తరపు బంధువులు మా చిన్నక్క కుటుంబాన్ని సంపూర్ణంగా,మాకుటుంబాన్ని పాక్షికంగా దూరం పెట్టారు. ఈ సంఘటన వలన కుటుంబ వ్యవస్థపై ముఖ్యంగా మహిళలపై సంప్రదాయాలు,సమాజం వేసే సంకెళ్ళ ప్రభావం గురించి నన్ను ఆలోచింపచేయటం మొదలు పెట్టింది.
నా వ్యక్తిత్వాన్ని సానపెట్టటం మొదలు పెట్టింది అప్పుడే.కోటబొమ్మాళి లో ఉన్నప్పుడూ నేను మాష్టారి చెల్లెలుగా గుర్తింపబడినా నన్ను బాధించలేదు.బహుశా అప్పటికి చిన్నపిల్లనేకావటంవలనకావచ్చు. . ఓ ఇద్దరు ముగ్గురు అన్నయ్య మిత్రులైన స్కూలు మాస్టర్లు మధ్యాహ్నం టిఫిన్ డబ్బాలు తీసుకొని మా ఇంటికి వచ్చి తినేవారు.స్కూలులో నాకు మంచి మార్కులు రావటానికి నేను మాష్టారి చెల్లెల్ని కావటం వల్లే అని కొందరు గుసగుసలు మొదలు పెట్టారు. అది నన్ను చాలా బాధ పెట్టింది.ఇప్పుడు హైస్కూలు చదువు కు వచ్చాను కనుక వయసుతో పాటూ మనసు,ఆలోచన పరిణితి చెందటం నాకే తెలుస్తోంది .SSLC లో ఫైనల్ పరీక్ష పేపర్లు బయట వేల్యుయేషన్ కి ఎక్కడికో పంపుతే ఎవరో దిద్దుతారుకదా అందులోఎలా అయినా నా తెలివితేటల్ని నిరూపించు కోవాలనే పంతం వచ్చింది.
అప్పట్లో SSLC లో మార్కులు హిందీలో కలిపి,హిందీ కలప కుండా అని రెండు విధాలుగా ఫైనల్ లోమార్కులు ఇచ్చేవారు. ఆ విధంగానే పరీక్షల్లో స్కూలు ఫైనల్లో హిందీ కలిపి ఐతే మూడవ స్థానంలో, హిందీ మార్కులు కలప కుండా ఐతే మొదటి స్థానం లో వచ్చాను.
అప్పటి నుండే నన్ను నేను నిరూపించుకోవడానికి,నన్ను నేను నిలబెట్టుకోవడానికి అస్తిత్వ పోరాటానికి బీజం పడింది.
3, జులై 2021, శనివారం
సిరికోనభారతి లో ప్రచురితం
వచన కవితా ప్రక్రియ లోకి అడుగు పెట్టి క్లిష్టమైన సంస్కృత పదబంధాలూ భాషాడంబరాలతో రాస్తేనే కావ్య రూపం పొందుతుందని భావించిన ఆధునిక కవులేకాక సీనియర్ కవులు సైతం నిజాయితీగా నిర్భీతిగా చెప్పిన కుందుర్తి సరళవచనా శైలికి లొంగిపోయారు.
ఇక తిలక్ కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అనే భావన పాఠకులకు కలుగుతుంది.తిలక్ నిజాయితీగా చెప్పిన
'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'
మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.
శ్రీ శ్రీ తొలి రోజుల్లో రాసిన కొన్ని కవితలలో సంస్కృత భాషాడంబరం,సమాసాలూ కనిపించినా "మెట్లు" కవిత సభలో చదవగా విన్న ఒక పిల్లవాడు "ఇంతేనా కవిత్వమంటే నేనూ రాయగలను " అన్నాడని , సామాన్యుడికీ అర్థమయ్యేలా కవిత ఉండాలని శ్రీశ్రీ ఓ సందర్భంలో చెప్పాడు.
నిజానికి ఏ సాహిత్య ప్రక్రియ ఐనా సరే దానికి తగిన భాష అదే సమకూర్చుకుంటుంది.
సామాజిక స్పృహ కవిత్వాన్ని మింగేసిందనటం,సామాజిక స్పృహ ఒక జాడ్యం గా భావించటం అనటం నేను ఒప్పుకోను.
ఇంకా వెన్నెలా,పూవులూ,ఆమనీ,ప్రేమా,ప్రేయసీ అంటూ కవిత్వం రాయటం ప్రపంచంలో జరుగుతోన్న అనేకానేక సందర్భాలూ, సంఘటనలూ,సంక్షోభాలనుండి పలాయనవాదంగా భావించాలి.
కవిత్వం ఎప్పుడూ ఆత్మాశ్రయంగా మొదలైనా నేను నుండి మనం లోకీ మనం నుండి జనంలోకీ మమేకం కావాలి.
పదచిత్రాల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించితే ఒక్కొక్కసారి వ్యతిరేకార్థం లో కి వచ్చే ప్రమాదం కూడా ఉంది.అందుకని రాసిన వెంటనే మాధ్యమాల్లోనో పత్రికలకో పంపకుండా ఎవరికి వారు తిరిగి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏ సాహితీవేత్త కైనా వారి సాహిత్యమే వారి వ్యక్తిత్వం కావాలి,వారి వ్యక్తిత్వమే వారి జీవితం కావాలని నేను నమ్ముతాను.
21, జూన్ 2021, సోమవారం
బొమ్మ జెముళ్ళు
బొమ్మజెముళ్ళు
వాకిట్లో అందం కోసం వేసిన బొమ్మజెముళ్ళు
ఎప్పుడు వ్యాపించేసాయో
ఎలా ఆక్రమించేసాయో
చడీ చప్పుడూ లేకుండా ఇల్లంతా అల్లుకుపోయాయి
అంతటా ఇరుకుతనం
మూలమూలల్లోనూ రక్కసిపొదలే
రాగాలు ప్రసరించనీయని రక్కసిపొదలే
ఏ ముళ్ళకో తగులుకొని ఊహ చీరుకు పోతోంది
ఏ పొదల్లోనో చిక్కుకుని మాట ఆగిపోతుంది
మనసు నిశ్శబ్దంగా ఆవిరైపోయి
గుండె అవయవంగా మాత్రమే మిగిలి పోతోంది
మౌనం యాంత్రికంగా రాజ్యమేలుతోంది
ఆత్మీయగాలి కూడా చొరబడలేని ఇరుకు తనం
గాలాడ్డానికి మైదానాల్లోకి
పారిపోవాలనిపించేంత ఇరుకుతనం
మైదానాల్లో మాత్రం ఏముంది
స్నేహాన్ని పరిమళించుతూ
తలలుపుతూ పిలిచే పూలచెట్లేవీ
ఆప్యాయంగా తీగలు చాస్తూ
ఒళ్ళో చేర్చుకొనే పొదరిళ్ళేవీ
సమస్త ప్రపంచాన్నీ గడ్డిపోచలా చూస్తూ
నెత్తిన కళ్ళు పెట్టుకొని ఆకాశంలోకి చేతులు చాచే
అశోకచెట్లో టేకు చెట్లో తప్ప
పచ్చికలో దొర్లి దొర్లి
మనసారా ఏడవాలనుకుంటే
కాళ్ళలోనే కాదు కళ్ళల్లోనూ పుళ్ళు చేసే పల్లేర్లే
మైదానాల్నిండా జనమే
నగరాల్ని సైతం నట్టడవుల్ని చేసేస్తూ
స్పర్శకి కూడా ఇష్టపడనితనంతో
ముళ్ళు మొలిపించుకున్న దేహాల్తో
నిలువెల్లా బొమ్మజెముళ్ళైన జనాలే
ఇంటా బయటా గాలాడని ఇరుకు తనం
ఊహాడని పరాయి తనం
జీవం లేని ఇసుకపర్రల జీవితాలు
కాలుచాచి పారిపోవాలని చూస్తాం
ఆశ్చర్యంగా కాళ్ళూవేళ్ళూ కదల్చలేం
మనల్ని మనం చూసుకొంటే
ఆసాంతం మనమే బొమ్మజెముళ్ళం!!
9, జూన్ 2021, బుధవారం
నడక దారిలో--3
ఇంటి పెద్దదిక్కు నాన్నగారు వెళ్ళిపోయాక కుటుంబం లో మార్పు వచ్చింది.వీథివరండా లో ఉన్న బల్ల ఖాళీ ఐపోయింది.బల్లే కాదు ఇల్లంతా కూడా ఖాళీయే.పెద్ద మామయ్య అమ్మచేతిలో పెట్టిన కొద్ది పాటి సొమ్ము కూడా ఖాళీయే.
ఆరో తరగతి చదువుతున్న నేను మళ్ళీ బడికి వెళ్ళలేదు. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం ఐనప్పుడో, కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడో ముందుగా మాన్పించేది ఆడపిల్లల చదువులే కదా.ఇంక నాకు అన్నీ సెలవులే.
అప్పట్లో పెళ్ళో, పేరంటమో ఏవి జరిగినా లౌడ్ స్పీకర్లు పెట్టి పాటలు వేసేవారు.ఉదయమే ' నమోవేంకటేశా' అంటూ స్పీకర్లో ఘంటశాల కంఠం నుండి రాగం వినిపించే సరికే నాకు ఎంత సంబరంగా ఉండేదో! వీధి వరండా లో తాడు తో ఉయ్యాల ఉండేది అందులో ఒక తలగడా వేసుకొని ఊగుతూ లౌడ్ స్పీకర్లు లోంచి గాలి తరంగాల మీదుగా నా దగ్గరికి చేరిన చెంచులక్ష్మి సినిమా లో 'పాలకడలిపై' మొదలుకొని, భలేరాముడు,భూకైలాస్, సువర్ణ సుందరి ఒకటేమిటి ఆనాటి పాటలతో గొంతు కలుపుతూ పాడుకుంటుండేదాన్ని .పాట ఆగుతే చేతిలోని బొమ్మల కథల పుస్తకాలను చేతిలోకి తీసుకుని చదవడం రోజంతా అదేపని.
మా ఇంటి ఎదురుగా గుప్తావారి ఎర్ర పళ్ళపొడి తయారు చేసి అమ్మే కుటుంబం ఉండేది.వాళ్ళింట్లో అమ్మాయి కూడా నన్ను చూసి ఉయ్యాల కట్టించుకుని రాగాలు తీసేది.
మా ఇంటికి దగ్గర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇల్లు ఉండేది.వాళ్ళకి నలుగురు ఆడపిల్లలు.ఇద్దరు అమ్మాయిలు నా తోటి వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి ఎవరింటికీ వచ్చేవారు కాదు.నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని జవాన్ ని పంపి పిలిచేవారు.బొమ్మలపెళ్ళిళ్ళు చేసేవారు.వాళ్ళురాకుండా నన్ను రమ్మని మాటిమాటికీ పిలుస్తూ ఉండటం తో అమ్మ నన్ను కూడా మాటిమాటికీ వెళ్ళొద్దని కోప్పడింది.అంతే ఇక వెళ్ళటం మానేసాను.
ఒకరోజు మధ్యాహ్నం మూడో నాలుగో అయ్యుంటుంది, యథావిధిగా కథల పుస్తకం చదువుతుంటుంటే అకస్మాత్తుగా చిమ్మచీకటి ఏర్పడి హోరున పెద్దగా చప్పుడు. వర్షం పడుతుందేమో అని బయటికి వస్తే ఏమిలేదు.చుట్టుపట్ల అందరూ ఆ శబ్దానికి ఇళ్ళల్లో నుండి బయటకు వచ్చారు.ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా నేను కెవ్వున కేక వేసాను నామీద ఏదో పడిందని అన్నాను.అంతలో చూస్తూ చూస్తుండగానే ఆ నల్లని మేఘం జారుకుంటూ వెళ్ళి పోతే
తెలతెల్లని వెలుగు తెరలు తొలగించుకున్నట్లు మెలమెల్లగా వచ్చింది.నామీదపడిన దాన్ని చిన్నన్నయ్య తీసుకు వచ్చాడు అరచేయి అంత ఉన్న మిడత.అంటే అంత హోరు తో నల్లమేఘం లా వచ్చినది మిడతలదండు అన్నమాట.ఇటీవల మిడతలదండు రాష్ట్రాలలోకి వచ్చిందని మీడియా లో ఊదరగొడుతుంటే ఆనాటి అనుభవం గుర్తు వచ్చి అందరికీ చెప్పాను.మరి తర్వాత ఈ అరవై ఏళ్ళలో మిడతలదండు ఎప్పుడైనా వచ్చిందో లేదో గుర్తు లేదు.
ఆ రోజుల్లోనే ఒకరోజు మా ఇంట్లో అప్పుడప్పుడు ఇంట్లో సాయానికి వచ్చే అన్నపూర్ణ ని నాకు తోడుగా బియ్యం పిండి పట్టించటానికి నన్ను అమ్మ కొత్తపేట లోని పిండిమరకు పంపింది.పలుమార్లు జాగ్రత్తలు చెప్పి పంపింది.అన్నపూర్ణ మేదకురాలు.బండ పనిచేయడమే తప్ప ఏమీ రాదు ఏమీ తెలియదు.సరే పిండి పట్టించి తిరిగి మా ఇంటి బాటకు వచ్చే టప్పటికి ఒక ఆమె పలకరించి ' ఇక్కడే పూల్ బాగ్ రోడ్లో బాలపేరంటాలు గుడికి వెళ్దాం.రా పాపా.అంతా మంచి జరుగుతుందని" అంది . అన్నపూర్ణ ఆవిడ వెనకే వెళ్ళిపోవటం మొదలు పెట్టింది.అన్నపూర్ణని పిలుస్తూ నేనూ వెంటబడ్డాను.
"భయపడకు పాపా మీ గురించి తెలుసు మీ నాన్న గారు పోయారు కదా.డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు కదా.మీ అన్నయ్య కి వచ్చే ఏడాది కల్లా ఉద్యోగం వస్తుంది. మీకష్టాలన్నీతీరి పోతాయి.నువ్వు కూడా బాగా చదువు కుంటావు.
శ్రీ వీర బాల పార్వతమ్మ పేరంటాలు నీలాంటి పాపే.రెండేళ్ళ కిందట కుక్క కాటుకుగురై చనిపోయింది.తర్వాత అమ్మానాన్నలకు కలలో కనబడి రోడ్డు పక్కన గుడి కట్టించమంది.అలాగే 1958 లో పూల్ బాగ్ రోడ్ లోగుడి కట్టి పూజలు చేస్తున్నారు.ఆ దారెంట రాజాం పోయే వాహనాల వారంతా తప్పకుండా ఆ గుడికి వెళ్ళి మొక్కుబడులు చెల్లిస్తుంటారు.ప్రతీ ఏడాది ఫిబ్రవరి లో అయిదు రోజుల పాటు ఉత్సవాలు కూడా జరుగుతాయి.గుడికి దగ్గర లోనే మన విజయనగరం రాజు లైన పూసపాటి రాజులభవనం ఉంది తెలుసా." ఈ విధంగా నా చెయ్యి పట్టుకుని స్థల పురాణం చెప్తూ నడుస్తుందామె.
మధ్యమధ్యలో భయపడకు "మీ అమ్మ ఏమీ అనదులే" అంటోంది ఆమె.పళ్ళికిలించుకుంటూ ఆవిడ వెనకే నడుస్తున్న అన్నపూర్ణని చూస్తుంటే ఒకవైపు కోపం, ముసురు కుంటున్న చీకటిని చూస్తుంటే భయం.ఇంటికి వెళ్ళాక అమ్మ ఏమంటుందో అని దుఃఖం ముప్పిరిగొన్నాయి.ఆమె చెప్తున్న దేదీ నాచెవికి ఎక్కడం లేదు.
చిన్న పందిరి మాత్రమే ఉన్న ఆ గుడిని చూస్తే నాకు గుడిలా అనిపించలేదు.కనీసం నమస్కారం ఐనా చేసానో లేదో తెలియదు.తిరుగు ముఖం పట్టి మా వీథి మొగలో ఎక్కడైతే ఆవిడ కలిసిందో అక్కడ వరకూ వచ్చి ఎటో వెళ్ళి పోయింది.
ఇంటి దగ్గర వాకిట్లో అమ్మా, చిన్నక్క , అన్నయ్యా ఆందోళన నిండిన ముఖాలతో నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.అన్నపూర్ణ నుండి పిండి పట్టించిన గిన్నే తీసుకుని పంపించేసింది అమ్మ.
లోపలికి వెళ్ళాక ఏడుస్తూనే నేను చెప్పిన విషయం అంతా విని ఎవరు పిలిస్తే వాళ్ళ వెంట వెళ్ళి పోవటమేనా అని అందరి చేతా చీవాట్లే కాక,చెంపలు బూరెలు అయ్యాయని వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా.
అంతే కాక ఆ సంఘటన నన్ను ఈ నాటికీ వెంటాడుతూనే ఉంది.
చిన్నప్పుడు చూసిన శ్రీ వీర బాల పార్వతమ్మ పేరంటాలు గుడి ఈ అరవై ఏళ్ళలో బహుశా బాగా బ్రహ్మాండం గా విస్తరించే ఉంటుంది.ప్రభుత్వ బడులు ఏన్నేళ్ళైనా అభివృద్ధి లోకి రావు కానీ గుడులు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి కదా.అందుకే ఆ జ్ణాపకాన్ని ఈ సారి విజయనగరం వెళ్ళినప్పుడు కొంతైనా వెతుక్కోవాలి. ఒకసారి వెళ్ళి తప్పక చూసి రావాలి.
-- శీలా సుభద్రా దేవి.
11, మే 2021, మంగళవారం
నడక దారిలో--5
నడక దారిలో--5
కోటబొమ్మాళిలో ఒకసారి స్నేహితులతోఅన్నయ్య ఊరి పొలిమేరలో సరదాగా వెళ్ళినప్పుడు ఒక ఎలుగుబంటిని దగ్గర లో చూసి అందరూ పుంతల్లోంచి పరిగెత్తటం లో ఒళ్ళంతా ముళ్ళు గీరుకున్నాయి .దాంతో కోటబొమ్మాళి లో నచ్చకపోవడంతో అన్నయ్య బదిలీకి ప్రయత్నాలు చేయటంతో విజయనగరం కి తిరిగి వచ్చేసాం.కానీ వేరే ఇల్లు తీసుకోకుండా ఒక మేనమామ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.వాళ్ళు పదే పదే అన్నయ్య తో బాధ్యతలన్నీ మోయాల్సివచ్చిందని అనటంతో అతను మా మీద ద్వేషం పెంచుకున్నాడు.ఫలితం అమ్మ,చిన్నక్క ఆ ఇంట్లో జీతం బత్తెం లేని పనిమనుషులు అయ్యారు.రోజురోజు కీ దాష్టికం భరించలేక అమ్మ చిన్నక్క నీ , నన్ను తీసుకుని రోడ్డున పడింది.
చిన్నన్నయ్య అందరి దయాదాక్షిణ్యాలతో మాటలు పడుతూ యూనివర్సిటీ చదువు చదవటం ఇష్టం లేక వదిలిపెట్టి ఎవరికీ చెప్పకుండా శ్రీకాకుళం లో టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ అయిపోయాడు.అతని దగ్గర కు మేము వెళ్తే మమ్మల్ని ఏలూరు దగ్గర గోపన్న పాలెం లో ఉన్న పెద్దక్కదగ్గరకు చేర్చాడు.ఆ విధంగా ఆ ఏడాది మళ్ళా చదువు ఆగిపోయి అక్క ఇంటికి చేరాను.
మా పెద్దక్కయ్య పి.సరళాదేవి .ఆమె
డా. పి.శ్రీదేవి స్నేహప్రభావంతో 1955 నుండీ తెలుగు స్వతంత్ర లో విస్తృతంగా కథలు రాసేది.వాళ్ళు పుంగనూరు లో ఉన్నప్పటి నుండి ఎమ్.రాజేంద్ర( జర్నలిస్టు),మధురాంతకం రాజారాం గార్లు కుటుంబ స్నేహితులు.అక్కయ్యవి మూడు కథల సంపుటాలు,రెండు నవలికలు, తెలుగు వారి సామెతలు పై విశ్లేషణాత్మక గ్రంథం ' సామెత' ప్రచురింపబడ్డాయి.1975 తర్వాత రచనలు చేయటం మానేసింది.
నాకు ఊహ తెలియక ముందే అక్కకి పెళ్ళి ఐపోయింది.ఆమె ఎప్పుడు విజయనగరం వచ్చినా నాకోసం బొమ్మలో మిఠాయి లో కాకుండా చిన్న చిన్న రష్యన్ బొమ్మల పుస్తకాలు తెచ్చేది.అందువలన కూడబలుక్కుని చదివే దాన్ని . సోవియట్ లేండ్ వాళ్ళ పిల్లల బొమ్మల పుస్తకాల తెలుగు అనువాదాలు ఇచ్చేది.ఆ విధంగా చాలా చిన్నతనం నుండి కథలపుస్తకాలు చదవటం అలవాటైంది.
అక్క భర్త మా చిన్నమామయ్యే. వాళ్ళు ఉద్యోగరీత్యా ఏ వూరు వెళ్ళినా అక్కడ పిల్లలందరినీ చేర్చి బాలానందం నడిపేది.వాళ్ళకి పాటలు, డేన్స్ లే కాకుండా కథలు చదివించే ది.సెలవుల్లో వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ జత చేరేదాన్ని.
1963_64లో ఈ విధంగా బడిచదువు ఆగిపోవటంతో అక్కయ్య ఇంట్లో ఉండక తప్పలేదు.
మామయ్య సహఉద్యోగుల పిల్లలు లత,సుభ నా వయసు వాళ్ళు.వాళ్ళతో నాకు స్నేహం కలిసింది.మా కన్నా చిన్నపిల్ల షహనాజ్ మాతో చేరేది.వాళ్ళు స్కూలు నుంచి వచ్చాక సాయంత్రం కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. లతతో నా స్నేహం నేను హైదరాబాద్ వచ్చేక కూడా చాలా కాలం కొనసాగింది.లత నాన్నగారు రిటైర్మెంట్ అయ్యాక హైదరాబాద్ వారాసిగుడాలో సెటిల్ అయ్యారు.కానీ ఇప్పుడు లత ఎక్కడుందో తెలియదు.
పగలంతా అక్కయ్య వాళ్ళింట్లో లైబ్రరీ లోనివే కాక దగ్గర లోని లైబ్రరీ కి వెళ్ళి కొంతసేపు చదువుకొని మరి రెండు పుస్తకాలు తెచ్చుకునేదాన్ని.అలా ఒక్క ఏడాది లో ఎంతోమంది ప్రముఖరచయితల రచనలే కాక శరత్ అనువాదగ్రంథాలు కూడా చదివాను.బడికి వెళ్ళి చదువుకునే అవకాశం కోల్పోయిన బాధని పుస్తకాలు చదవటం లో మర్చిపోయేదాన్ని. అప్పటినుండీ నాకు ప్రాణ మిత్రులు పుస్తకాలే.
ఒకసారి ఏలూరులో ఆవంత్స సోమసుందర్ గారికి పెద్ద ఎత్తున ఘనసన్మానం జరుగుతుంటే నన్ను అక్క ఆ సభకు తీసుకెళ్ళింది.సభానంతరం ఒక సాహిత్య మిత్రుని ఇంటిడాబా మీద రాత్రివెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ఎంతమందో కవులు కావ్యగానం చేస్తుంటే అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ నవల్లే చదివే దాన్ని.మర్నాడు అక్కని కవిత్వం పుస్తకాలు అడుగుతే వైతాళికులు, మహాప్రస్థానం, కృష్ణపక్షం, ముత్యాల సరాలు ఇచ్చింది.అందులోని నాకు నచ్చిన వన్నీ ఒక పాతడైరీలో రాసుకున్నాను.అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది.అప్పటి నుండి కృష్ణశాస్త్రి కవితలోని లాలిత్యం ఎంత ఇష్టమో, శ్రీ శ్రీ కవిత్వం లోని లయ, పదును అంతే ఇష్టం.
పుస్తకపఠనమే కాకుండా అక్క ఎంబ్రైయిడరీ,పూసల బొమ్మలు తయారు చేయటం, లలిత సంగీతం నేర్పించేది.నేను బొమ్మలు బాగా వేస్తున్నానని నా చేత మంచి చిత్రం వేయించీ ఢిల్లీ శంకర్స్ వీక్లీ వారు కండక్ట్ చేసే బాలల చిత్రలేఖనం పోటీ కి పంపింది.బహుమతి రాలేదు కానీ సర్టిఫికెట్ వచ్చింది.
గోపన్న పాలెంలో మామయ్య వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఒకసారి యువజనోత్సవాలు జరిగాయి.అందులో చిన్నక్క కూడా పాల్గొంది.ఒక గ్రూపువాళ్ళు గురజాడ కన్యక గేయ కథని నాటకం గా ప్రదర్శించారు.అందులో కన్యక పాత్ర షహనాజ్ వేసింది.ఆ మేకప్ లో షహనాజ్ ఎంత బాగుందో!కానీ కొన్ని ఏళ్ళకు ఆ అమ్మాయి కాల్చుకుని చనిపోయిందని లత ద్వారా విని చాలా బాధ పడ్డాను.నేను టీచర్ గా పని చేస్తున్న సమయంలో నా తరగతి పిల్లలతో కన్యక నాటకం వేయించాను.అందులో కన్యక గా వేసిన అమ్మాయి వివాహం అయ్యాక కాల్చుకుని చనిపోయింది.ఈ రెండు సంఘటనలూ కాకతాళీయం కావచ్చు కానీ గురజాడ కన్యక లో ఆత్మాహుతి చేసుకున్నట్లు రాయటం ఆ పాత్ర వేసిన వాళ్ళ మనసు పై ప్రభావం చూపిందేమో అని నా భావన.
1964 మే 24 న జవహర్ లాల్ నెహ్రూ దివంగతులు ఐతే సంతాపం సభ కూడా పెట్టారు. సోవియట్ యూనియన్‌తో స్నేహం, ఆపత్కాలంలో అమెరికా వైఖరితో కుంగిపోయిన నెహ్రూ ఆ దిగులుతోనే మంచానపడ్డారని చెప్పారు.యుద్ధం తర్వాతి కాలంలో శత్రువు శత్రువు మిత్రులంటూ పాక్, చైనా మధ్య మైత్రి నెహ్రూను కలవరపెట్టింది. ఫలితంగా యుద్ధం ముగిసిన రెండేళ్లకే అకాలం మరణం పాలయ్యారని వక్తలు మాట్లాడారు.మర్నాడు వార్తా పత్రికలో వచ్చిన బాల్యం నుండి నెహ్రూ ఫొటోలన్నిటినీ కత్తిరించి ఆల్బం లా తయారు చేసాను.
కొన్నిరోజుల కి అనుకోకుండా నాన్న ఆఫీసునుండి డబ్బు లేవో వస్తాయని ఉత్తరం వస్తే అమ్మ, అక్కయ్య వెళ్ళారు.ఆ డబ్బు తో చిన్నక్కకు రెండో మూడో చీరలు,నాకు ఒక మూడు వోణీలు కొని తెచ్చారు.అక్కయ్య తన దగ్గరి ఒక చీర కత్తిరించి పరికిణీలు కుట్టింది.విజయనగరం వెళ్ళినప్పుడు అన్నయ్య తో మాట్లాడి కుటుంబ పరిస్థితులు చక్కబరచి అక్కయ్య వాళ్ళు వచ్చారు.మామయ్యకి యూఎస్ లో ఒక ఏడాది పరిశోధన కు వెళ్ళవలసి రావటం వలన అందరం విజయనగరం బయలుదేరాం.అప్పుడు మొట్టమొదటిసారిగా లంగా వోణి వేసుకొని బయలుదేరాను.కొత్త లంగా వోణీలో నన్ను చూసుకొని నాలో నేను ఎంత మురిసి పోయానో.అక్కడితో అక్కయ్యతో కలిసి నా ఏడాది జీవనప్రయాణమైతే ముగిసింది.కాని నేను ఈనాడు రచయిత్రిగా, కవయిత్రి గా ఎదగటానికి గల కారణం అక్క దగ్గర ఉన్న ఏడాది కాలమే అని నా అభిప్రాయం.
అందుకే సాహిత్యం_బాల్యం-ప్రేరణ అంటూ ఇంటర్వ్యూ లలో ఎవరు ప్రశ్నించినా ఆ ఏడాది జీవితాన్ని తడుముకోకుండా ఉండలేను.నా రచనల్లో అక్కయ్యను చూసుకుంటూనే ఉంటాను. సాహిత్య పరంగా నేను రాసిన రచనలకి అక్కయ్య స్పందించి ఉత్తరం రాసేది.
ఎలక్షన్స్ బేనర్ల పై రాసిన ' వానా వానా కన్నీరు' కథ చదివి అక్కయ్య పెద్ద ఉత్తరం రాసింది."కుటుంబ పరిథి లోనే రాయకుండా సమాజం లోని ఇతర సమస్యలతో రాయటం బాగుంది.ఆలోచనా పరిధి విస్తృతంచేసుకుంటున్నావు.ఇలానే రాస్తుండు"అన్న తర్వాత నా రచనా పరిథి పెంచుకున్నాను.
1996 లో కేవలం స్త్రీ చైతన్యంతో రాసిన కవితా సంపుటి" ఆవిష్కారం" అక్కయ్యకి అంకితం ఇచ్చాను.
కేంద్ర సాహిత్య అకాడమీ వారు డా.శ్రీదేవి గురించి మోనోగ్రాఫ్ రాయమన్నప్పుడు పాత తెలుగు స్వతంత్రలు వెతుకు తుంటే అక్కరాసిన సంపుటీకరింపబడని కథలు కొన్ని దొరుకుతే వాటిని నేను అక్కయ్యకి ప్రేమ పూర్వక నివాళి గా పుస్తకరూపంలో తెచ్చాను.
అందుకే నేను అక్కయ్య కి సాహితీ వారసురాలినని ఎప్పుడూ చెప్తునే ఉంటాను. మొదటినుంచీ నన్ను సాహిత్యం వైపు మళ్ళించిన మా పెద్దక్కయ్య పి.సరళాదేవి నాకు సాహిత్యస్పూర్తిని ఇచ్చిన వ్యక్తిగా భావిస్తాను.