బొమ్మజెముళ్ళు
వాకిట్లో అందం కోసం వేసిన బొమ్మజెముళ్ళు
ఎప్పుడు వ్యాపించేసాయో
ఎలా ఆక్రమించేసాయో
చడీ చప్పుడూ లేకుండా ఇల్లంతా అల్లుకుపోయాయి
అంతటా ఇరుకుతనం
మూలమూలల్లోనూ రక్కసిపొదలే
రాగాలు ప్రసరించనీయని రక్కసిపొదలే
ఏ ముళ్ళకో తగులుకొని ఊహ చీరుకు పోతోంది
ఏ పొదల్లోనో చిక్కుకుని మాట ఆగిపోతుంది
మనసు నిశ్శబ్దంగా ఆవిరైపోయి
గుండె అవయవంగా మాత్రమే మిగిలి పోతోంది
మౌనం యాంత్రికంగా రాజ్యమేలుతోంది
ఆత్మీయగాలి కూడా చొరబడలేని ఇరుకు తనం
గాలాడ్డానికి మైదానాల్లోకి
పారిపోవాలనిపించేంత ఇరుకుతనం
మైదానాల్లో మాత్రం ఏముంది
స్నేహాన్ని పరిమళించుతూ
తలలుపుతూ పిలిచే పూలచెట్లేవీ
ఆప్యాయంగా తీగలు చాస్తూ
ఒళ్ళో చేర్చుకొనే పొదరిళ్ళేవీ
సమస్త ప్రపంచాన్నీ గడ్డిపోచలా చూస్తూ
నెత్తిన కళ్ళు పెట్టుకొని ఆకాశంలోకి చేతులు చాచే
అశోకచెట్లో టేకు చెట్లో తప్ప
పచ్చికలో దొర్లి దొర్లి
మనసారా ఏడవాలనుకుంటే
కాళ్ళలోనే కాదు కళ్ళల్లోనూ పుళ్ళు చేసే పల్లేర్లే
మైదానాల్నిండా జనమే
నగరాల్ని సైతం నట్టడవుల్ని చేసేస్తూ
స్పర్శకి కూడా ఇష్టపడనితనంతో
ముళ్ళు మొలిపించుకున్న దేహాల్తో
నిలువెల్లా బొమ్మజెముళ్ళైన జనాలే
ఇంటా బయటా గాలాడని ఇరుకు తనం
ఊహాడని పరాయి తనం
జీవం లేని ఇసుకపర్రల జీవితాలు
కాలుచాచి పారిపోవాలని చూస్తాం
ఆశ్చర్యంగా కాళ్ళూవేళ్ళూ కదల్చలేం
మనల్ని మనం చూసుకొంటే
ఆసాంతం మనమే బొమ్మజెముళ్ళం!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి