26, సెప్టెంబర్ 2021, ఆదివారం
బుల్లెట్టు బండి పాట గురించి
12, సెప్టెంబర్ 2021, ఆదివారం
వేదుల మీనాక్షీ దేవి కథలు
8, ఆగస్టు 2021, ఆదివారం
నా పని-నా ఆనందం
నాపని-నాఆనందం
పనిఅంటే ఇంటి పనా,పిల్లల పనా,ఉద్యోగమా,రచనారంగమా దేని గురించి చెప్పాలి.గొప్ప డైలమాలో పడ్డాను.
నిజానికి work is worship అనేది నాసిద్ధాంతం.ఏ పని ఐనా అంకితం భావం తోనే చేస్తాను.ఎందుకొచ్చిన బాధరా బాబూ అనుకునే మనిషిని కాదు.ఏదైనా పని నాకు అప్పగించినప్పుడు నేను చేయగలిగినది ఐతే వప్పుకొని ఆనందంగానే చేస్తాను.నచ్చకపోతే ముందే ఖచ్చితంగా చేయనని చెప్పేస్తాను.
ఇంటిపనీ,పిల్లలపనీ ఇవి ప్రతీ స్త్రీ కి తప్పని, తప్పించుకోలేని బాధ్యత.అయినా ప్రతీ మహిళా తన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా బాధ్యతంతా భుజాన వేసుకుని ఇష్టపూర్వకంగా చేస్తుంది. ఇది చేయటంలో సంతోషమూ ఉంటుంది.ఒకింత స్వార్థమూ ఉంటుంది.అలాగే నేనూ చేసాను.
అమ్మకి ఆర్ధిక స్వావలంబన లేక చిన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు చూడటం, అనుభవించటం వలన చదువుకొని ఉద్యోగం చేయాలనే గాఢమైన పట్టుదలని వివాహానంతరం పదేళ్ళకి గాని సాకారం చేసుకోలేకపోయాను.అందుకని టీచరు ఉద్యోగంలో పిల్లలతో మమేకం అవుతూ పాఠాలు చెప్పటం లోనూ, స్కూలు కి సంబంధించిన విజ్ఞాన ప్రదర్శనలూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం లో సంతోషం పొందాను. స్కూల్ లో ఉన్నంతసేపూ ఇంకేం విషయాలూ గుర్తు రానంతగా ఆనందం పొందాను.
కొందరు టీచర్లు ఎప్పుడు రిటైర్ అవుతామో అని సంవత్సరాలు,నెలలూ లెక్కబెట్టుకుంటుంటే అంత బాధ పడి బడికి రావటం మెందుకు? ఎందుకు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకోవచ్చు కదా మరొకరికి ఉద్యోగం అన్నా వస్తుంది అనుకునేదాన్ని.
నేను ఫ్రెండ్ అనుకున్న ఆమె అప్పట్లో హెడ్ మిస్ట్రెస్ గా ఉంది.ఆమె ప్రమోషన్ నాకు రాకుండా నన్ను టార్చర్ పెట్టటానికీ,నాకై నేను ఉద్యోగం మానేసేలా ప్రయత్నం చేసినా ఎదుర్కొని నిలదొక్కుకున్నానే కానీ ఉద్యోగం వదిలి పారిపోలేదు. నిబద్ధతతో పాఠాలు చెప్తూ విద్యార్ధులతో కలిసి మెలిసి ఉండటం లోని ఆనందాన్ని కోల్పోలేదు.
ఇక నా ప్రవృత్తి రచనా రంగం .1970 లో కథాప్రచురణతో మొదలై యాభై ఏళ్ళు దాటిన నా రచనా ప్రస్ధానం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూనే వుంది.ఉద్యోగవిరమణ అనంతరం నాకు సంతోషం కలిగించే లలిత సంగీతం, చిత్రలేఖనంలో కూడా సాధనచేయాలనుకున్నా అంతగా కుదరలేదు.అందుకే మరింతగా రచనా వ్యాసంగం లోనే నా ఆనందాన్ని నింపుకున్నాను.
చిన్నప్పటి నుంచి నన్ను నేను తీర్చిదిద్దుకున్నది పుస్తక పఠనం వలనే. ఎప్పుడైనా మనసు నొచ్చుకున్నా,చికాకుగా ఉన్నా కాసేపు ఏ పుస్తకమైనా చదువుకుంటే స్నేహితురాలి వలన ఓదార్పు పొందినట్లు మనసు తేలికైపోతుంది.అందుకే ఎంత పని ఒత్తిడిలో తీరికలేకుండా ఉన్నా,అనారోగ్యంగా ఉన్నా రాత్రి తప్పని సరిగా ఓ నాలుగైదు కవితలో ఓ రెండు కథలో చదివిన తర్వాతే నిద్రకు ఉపక్రమించటం చిన్నప్పటి నుంచీ అలవాటు.
నా ఆవేదన,నా ఆవేశం,నా దుఃఖం,నా ఆక్రోశం,నన్ను కలవరపరిచే అన్ని అనుభూతులను మరిపించి ఆనందాన్నీ, సంతృప్తినీ కలిగించి మనసుతేలికపరచేది నా సాహిత్య పఠనమూ,రచనలే.ఎన్ని ఒడుదుడుకుల్ని నా జీవితపర్యంతమూ ఎదుర్కొన్నా నా ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరకుండా సంయమనంతో ఉండేలా చేసినవి నాకు తోడుగా ఉన్న నా అక్షరాలే.
3, ఆగస్టు 2021, మంగళవారం
భయం భయం
22, జులై 2021, గురువారం
కారా మాస్టారు కు నివాళులు
తెలుగు కథా ప్రస్థానం వయసుఎంతో కొంచెం తక్కువగా కారా మాస్టారు జీవితం అంతే.కథ గుర్తు వస్తే కారా మాస్టారు గుర్తు వస్తారు,ఆయన గుర్తు వస్తే కథానిలయం నిలువెత్తున కళ్ళ ముందుకు వస్తుంది.తెలుగు కథాసాహిత్యం లో విడదీయలేని బంధం అది.
కారా మాస్టారి నవతి సందర్భంగా సావనీర్ కోసం వ్యాసం రాయమని అట్టాడ గారు అడిగినప్పుడు ఎంతోమంది వారి సాహిత్యం గురించి రాసారు ఇంకా నేనేమి రాస్తాను అని వారి కథలు పుస్తకం తీసి చదవటం మొదలెట్టేసరికి పేజీ పేజీకీ నాలో ఉద్వేగం కలిగింది.ఎన్ని జాతీయాలో,ఎన్ని నానుడు లో, ఇంకెన్ని సామెతలో ఉత్తరాంధ్ర మాండలీకం నింపుకుని పరిమళాలు నా మనసు చుట్టేసాయి.ఇక అంతే అవి నోట్ చేసుకుంటూ "సామెతలు,నానుడుల పరిమళం" అనే వ్యాసం రాసాను.
అంతకు ముందు తెలుగు కథలు సరళ గ్రాంథికంలోనే ఎక్కువమంది రాసేవారు.కారా గారూ, రావిశాస్త్రి,బీనాదేవీ ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలజీవనశైలినీ, సంస్కృతి నీ,కడగండ్లనూ,వారి మనోభావాలను కళ్ళకు కట్టేలా మాండలికసొబగుతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు.
ఇక వారు స్థాపించిన కథానిలయం కథా పరిశోధకులకు కల్పవృక్షం, సాహిత్య గని.నేను శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసినప్పుడు గానీ,తదనంతరం రచయిత్రుల కథలు గురించి వ్యాసాలు రాసినప్పుడు గానీ కథానిలయం ద్వారా ఎందరో కథకులు కథలను చదవ గలిగాను.కథానిలయం వలనే సమగ్రమైన వ్యాసాలు రాయగలిగాను.అందువలన కథా సాహిత్యానికి కారా మాస్టారి కృషి విలువ కట్టలేనిది.
హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మాఇంటికి వచ్చేవారు.తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ మహాసభలలో ప్రత్యేక పురస్కారానికి వచ్చినప్పుడు సభా ప్రాంగణం లో కలిసినప్పుడు అప్పటికే వారికి కొంత మరుపు మొదలైనా నన్ను గుర్తు పట్టి మా అక్కయ్య నీ,అన్నయ్య నీ, వీర్రాజు గారి గురించి అడిగారు.నా వ్యాసాలు పుస్తకం పంపినప్పుడు వారు ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని ఆశీర్వదించారు.
మరొక రెండేళ్ళలో శతవసంతాలు పూర్తి చేసుకోవాల్సిన తరుణం లో వారు వెళ్ళిపోవటం శోచనీయం.ఐతే ఈ కరోనా కష్టకాలంలో ఏమీ బాధ పడకుండా ఈవిధంగా కుమార్తె చేతిలో అనాయాసమరణం ప్రాప్తించినందుకు కొంత ఊరట.
ఏది ఏమైనా ఒక తెలుగుకథా మహా వృక్షం నేలకి ఒరిగింది.ఇది సాహిత్య రంగానికి తీరని లోటు.ఈ రెండు మాటలు చెప్పే అవకాశం నాకు కలిగించిన మనలో మనం అడ్మిన్ లకు ధన్యవాదాలు.
కారా మాష్టారు కి నా బాష్పాంజలులు.
సంకలన సంపాదకులు
సంపాదకత్వం గురించి గంగిశెట్టిగారు అందించిన వ్యాసం సమగ్ర సమాచారాన్ని అవగాహననీ కల్పించేలా ఉంది.ఆ విషయం మీద సభ్యులు కూడా మంచి చర్చను ఆసక్తి కరంగా కొనసాగించుతున్నారు.
పనిలో పనిగా వివిధ సమకాలీన సంచలనాలు మీద పుంఖానుపుంఖాలుగా కథా,కవితా సంపుటాలు వెలువరుస్తున్నారు.ఉదాహరణకు యుద్ధం మీద ఒకరు సంకలనం వేయసంకల్పించి సంపాదకత్వం వహించినవారు యుద్ధం మీద కవితల్ని ఆహ్వానిస్తూ పేపరు ప్రకటన ఇచ్చారు.అంతే అప్పటివరకూ రానివారు కూడా రాసి పంపించేసారు.యుధ్ధంమీద కవితా సంకలనం వేసేసారు సదరు సంపాదకులు.అంతే తప్ప అంతకు ముందు ఎవరైనా పాతతరం నుండీ రాసారేమో ననే వెతుకులాట లేదు.ఎంత సులభం అయిపోయింది కదా సంకలనం సంపాదకత్వం?!.నిజానికి యుద్ధం మీద నేనొక దీర్ఘ కవితే రాసాను.దాని ప్రస్తావన కూడా లేదు.
అదేవిధంగా బియాస్ నదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకు పోయిన ఇరవై అయిదు మంది విద్యార్ధుల మీద ఒక సంకలనం వచ్చింది.అందులోనూ నా కవిత రాలేదు.అంటే ప్రకటన కు స్పందించి వచ్చిన కవితల్ని వేసేయటమే తప్ప చిత్తశుద్ధి తో నిజాయితీగా, నిబద్ధతతో సంకలనకర్తలు గా , సంపాదకులుగా పేరు సాధించటం ఎక్కువైపోయింది.
మరికొందరు కథో,కవితతో పాటూ డబ్బు కూడా ఇవ్వమంటున్నారు.అంటే మనమే,కథో,కవితో ఇవ్వటమే కాకుండా మనడబ్బు తోటే సంకలనం వేసి పనిలో పనిగా డబ్బు మిగిల్చి వాళ్ళదో పుస్తకం కూడా ప్రచురించేసుకుంటున్నారు.ఇదీ ఈ నాటి సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్న వ్యాపార కళ.
ఏదైనా అవాంఛనీయం,అక్రమం, అన్యాయం, దుర్మార్గం,ఇలా,ఇలా.....ప్రముఖులమీదా,దినాలమీదా కాదేదీ సంకలనకనర్హం అన్నట్లు ఇటువంటి సంపాదకుల పంట పండిస్తున్నాయి.ఇంతకూ వీరూ సంపాదకులే కదా
గం.లా.నా. గారి వ్యాసం చూడగానే ఉండలేక రాసాను.ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యురాలిని.
విద్యార్థులతో అరకు యాత్ర
నేను పనిచేసిన స్కూల్ ఆర్టీసీ హైస్కూల్.ప్రతీ ఏడాది దసరా సెలవుల్లో ఒక్కో సారి ఒక్కో రాష్ట్రంకు విజ్ఞాన యాత్ర కోసం మాకు రెండు బస్సులు, నలుగురు డ్రైవర్లను ఉచితంగా ఇచ్చేవారు.
ఒకసారి అరకు వెళ్ళాము ఆడపిల్లలకు ఒక బస్సు,మగపిల్లలకు ఒక బస్సు.అరకుపైకి వెళ్ళినప్పుడే ఒక బస్సు కొంచెం ప్రోబ్లం ఉన్నట్లు అనిపించింది.మళ్ళీ కిందకు దిగేముందు డ్రైవర్లు నాకు,మరో టీచర్ కు విషయం చెప్పి చిన్న మగపిల్లలను అందరు టీచర్లను ఒక బస్సులో ఎక్కించి,8,9,10 తరగతుల పిల్లలను కొంత దూరం ఘాట్ రోడ్డు దాటేవరకూ నడిచి రమ్మని చెప్పారు.అందరూ భయపడతారని అందరికీ చెప్పలేదు.అన్నారు.
మేము కూడా చెప్పలేదు.ఖాళీ బాస్ ముందూ,దానివెనుక మా బాస్ వెళ్ళటానికి ప్లాన్.బస్సులు బయలు దేరాక ఒక పది పదిహేను మంది పిల్లలు ఖాళీ బస్ టాప్ ఎక్కి ఛయ్య ఛయ్యా అంటూ డాన్స్ మొదలెట్టారు.బస్సు రొదలో ఆఫీస్ డ్రైవర్ గమనించలేదు .వెనక బస్ లోని ఆడపిల్లలు కూడా డాన్స్ మొదలెట్టారు.ఘాట్ రోడ్డు లో బస్ ఆపటానికి లేదు.మా బస్ లో డ్రైవర్లు భయపడసాగారు.నాకు మరో టీచర్ కూ భయంతో చెమట్లు పట్టేసాయి.
కొంత దూరం అలాగే జాగ్రత్తగా నడిపి సేఫ్ ప్లేస్ చూసి ఆపారు. ఇంకా అప్పుడు టాప్ మీదున్న పిల్లలను కిందకు దింపి బాస్ పాడైన విషయం చెప్పి" మీకు ఏమైనా జరిగితే మీ పేరెంట్స్ కి ఏంచెప్పుకుంటాం" అని మొట్ట మొదటి సారి నేను కోపంతో వాళ్ళని బెత్తం తో బాది బావురుమని నేను కూడా ఏడ్చేసాను.అప్పుడు అందరూ భయంతో దుఃఖంతో గండం తప్పిందని అనుకున్నారు.
మిమ్మల్ని విశాఖ బస్ స్టేషన్ వెయిటింగ్ రూం కి చేర్చి బాస్ రిపైర్ కి తీసుకు వెళ్ళారు.ఈ సంఘటననా నా ఇస్కూలు కథల్లో కూడా రాసాను.