20, ఏప్రిల్ 2021, మంగళవారం

నడక దారిలో-4

  నడక దారిలో--4


   మా నాన్నగారు పోయిన తర్వాత ఏడాదికి 1961 లో మా పెద్ద అన్నయ్య కు శ్రీకాకుళం జిల్లా లోని కోటబొమ్మాళి అనే ఊరు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది.మా రెండో అన్నయ్య  వైజాగ్ లో  హాస్టల్ లో ఉండి చదువుకునే వాడు.

           అమ్మా,మా రెండో అక్కా నేను విజయనగరం నుండీ రైల్లో బయలుదేరి రామచంద్రాపురమో, హరిశ్చంద్రాపురమో గుర్తు లేదు,అక్కడ దిగి ఎడ్లబండి లో కోటబొమ్మాళికి బయలుదేరి వెళ్ళాం.అప్పటికి కోటబొమ్మాళి కి బస్సు కూడా లేదు.దారంతా గతుకుల రోడ్డు మీద ప్రయాణించి వెళ్ళాం.ఊర్లోకి అడుగు పెట్టగానే ఎడ్లబండి తిరగబడి నాకు పెదవి చిట్లి రక్తం ముఖం అంతా అలుక్కుపోయింది.నన్ను రెండు చేతులమీదుగా ఎత్తుకుని ఆ పక్కనే డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళారు.నొప్పి తగ్గటానికి డాక్టరుగారు ఇంజెక్షన్ ఇవ్వబోతే కళ్ళు తిరిగి పడిపోయాను.ఆ  డాక్టరుగారి అబ్బాయి నా క్లాస్ మేట్.అతని అక్క నాకు పాటలమేట్.అందువల్ల అప్పుడప్పుడు ఆ అమ్మాయి దగ్గర కు పాటలసాధనకు వెళ్ళేదాన్ని.నన్ను చూసి డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వాలా అంటూ వేళాకోళం చేసేవారు.

           ఆ ఊరులో అప్పట్లో రెండే సమాంతరంగా ఉండే వీధులు.ఒకటి బ్రాహ్మణ వీథి.రెండోది కోమట్లవీథి.ఇతర కులాల వారు మరి ఎక్కడ నివసించేవారో నాకు తెలియదు.బ్రాహ్మణ వీథిలో మాకు ఇల్లు అద్దెకి  ఇవ్వరు కనుక కోమట్లవీధీ లోనే మరి మాకు ఎలా ఇచ్చారో తెలియదు గానీ ఒకేగది ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఉండే వాళ్ళం.గది వెనుక ఒక వసారా ఉండేది అక్కడే వంట చేసుకునే వాళ్ళం.తర్వాత పెద్ద తోట అందులో పంపర పనాస,జామ వంటి పళ్ళ చెట్లు ఉండేవి కానీ వాటి మీద చెయ్యి వెయ్యటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు ఇంటి వాళ్ళు.ఆ యింటి వీధి తలుపు నిండా ఇత్తడి గుండ్లు అలంకారంగా పొదిగి ఉండి రాజులకోట గుమ్మంలా బహు దర్జాగా అందంగా ఉండేది.

              ఇంటి గది పైన సరంబీ ఉండేది.దానికి చిన్న తలుపు ఉండేది.ఇంటివాళ్ళసామాన్లు ఇత్తడి అండాలూ,పెద్ద పెద్ద గిన్నెలు వంటివి అందులో ఉంచేవారు.అవసరమైనప్పుడు నిచ్చెన సాయంతో సామాను దించేవారు.

        నాన్నగారు పోయిన తర్వాత నన్ను ఆరో తరగతి తో చదువు మానిపించారు కదా ఇక్కడ అన్నయ్య పని చేసే జిల్లా పరిషత్ స్కూలు లో ఏడో తరగతి లో జాయిన్ చేశారు.

        కోటబొమ్మాళి ఊరులో ఎవరింట్లోనూ  మరుగుదొడ్లు లేవు.దూరంగా ప్రహారీ కట్టిన బహిరంగ ప్రదేశం మహిళల కోసం ఉండేది.చిన్నబకెట్ తో నీళ్ళు పట్టుకుని వెళ్ళాల్సిందే.స్నానం మాత్రం పెరట్లోనే చేసేవాళ్ళం.ఇప్పటి కైనా ఆ వూర్లో అందరి ఇళ్ళకీ మరుగు దొడ్లు వచ్చాయో లేదో మరి.

       ఊరికి చుట్టూ కొండలు ఉండటంవల్ల ఎలుగు బంట్లు రాత్రిపూట ఊర్లోకి వచ్చేసేవి. అందుకని రాత్రంతా డప్పులు వాయిస్తూ కాగడాలతో కాపలా ఉండేవారు.పాములు సరేసరి రాత్రీ పగలూ తిరుగు తూనే ఉండేవి.ఒక్కొక్కప్పుడు సరంబీ లోకి కూడా ఎలుకలు కోసం పాములు కూడా  వచ్చేవి.

       ఊరులోని ఆడవాళ్ళు రోజంతా రకరకాల అప్పడాలు, వడియాలు, సకినాలు వంటివి తయారుచేయటం, (శ్రీకాకుళం జిల్లాలో రకరకాల అప్పడాలు ముఖ్యంగా పేలాలు అప్పడాలకు ప్రసిద్ధి) వంటి ఇంటిపనులు చేస్తూ ఉండే వారు.పెద్దగా బయటకు కనిపించే వారు కూడా కాదు.బడిలో ఏ క్లాసులోనూ అయిదారు మందికన్నా ఆడపిల్లలు ఉండేవారు కాదు.వారు కూడా అగ్ర వర్ణాల పిల్లలే.

           కొన్నాళ్ళ క్రితం  HJ దొర అనే ఐ.పీ.ఎస్ ఉండే వారు కదా.అతను నాకు జూనియర్  క్లాసులోనూ, అతని సోదరి నాకు సీనియర్ క్లాసులో ఉండేవారు.బడికి రోజూ టాంగా మీద వచ్చే వారు.దొరగారి అమ్మాయి అంటూ ఆమెని స్కూల్ లో అందరూ అపురూపంగా చూసేవారు.

        ఒకసారి బళ్ళో పాటలు పోటీ  పెట్టారు. పాటల పోటీలో నాకు ఫస్ట్,ఆమెకు సెకెండ్ అని అనౌన్స్ చేసి , తర్వాత స్కూలు డే రోజున ప్రైజులు తారుమారు చేసారు.

       ఒకే గది ఇల్లు కావటాన   మా అన్నయ్య రాత్రి భోజనం చేసి బడి లోనే పడుకోటానికి వెళ్ళిపోయే వాడు.అప్పుడప్పుడు స్కూలు లైబ్రరీ నుంచి మునిమాణిక్యం కాంతం కథలు, శ్రీపాద కథలు వంటివి కాక ప్రభ, పత్రిక తీసుకువచ్చే వాడు.అప్పటికే పుస్తకాలు చదవటం అలవాటు కనుక చదువుతూ ఉండేదాన్ని ప్రభలోని రంగనాయకమ్మ గారి కూలిన గోడలు సీరియల్ వచ్చేది అది అమ్మకి చదివి వినిపించే దాన్ని.అందులోని కొన్ని సంఘటనలు మా జీవితానికి దగ్గరగా అనిపించేవి.అది చదువు తున్నప్పుడు అమ్మ కూడా మా కుటుంబాలలో జరిగిన ఎన్నెన్నో సంఘటనలు చెప్పేది.

     1962 లో అమ్మ పెద్దక్కయ్య పురిటి కోసం సాయానికి అనకాపల్లి వెళ్ళింది.

     మా చిన్నక్కకూ, నాకూ సాయంగా షణ్ముఖ రావు అనే అబ్బాయిని రాత్రి పూట అన్నయ్య ఏర్పాటు చేసాడు షణ్ముఖ రావు తొమ్మిదో,పదో తరగతి చదివేవాడు.భోజనం అయ్యాక కిరోసిన్ దీపం చుట్టూ చిన్నక్క, షణ్ముఖ రావు, నేను చదువు కునేవాళ్ళం.చదువయ్యాక షణ్ముఖ రావు రాజు-పేదా సినీమా కథ సీరియల్ లా చెప్పే వాడు.రాత్రి అయ్యింది పడుకోమని చిన్నక్క కోప్పడితే పడుకునే వాళ్ళం.ఆ రోజుల్లో కనుక ఒక అబ్బాయి ని ఇద్దరు ఆడపిల్లలకు సాయంగా రాత్రి పూట పంపించ గలిగారు.ఈ రోజుల్లో అది సాధ్యమా.తలంచుకుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

     అప్పట్లోనే అష్టగ్రహకూటమి ఏర్పడి భూగోళం అంతమౌతుందని ఒక పెద్ద సంచలనం.తేదీ గుర్తు లేదు కానీ స్కూలు కూడా రెండురోజులు సెలవు ఇచ్చేసారు.షణ్ముఖరావు మా ఇంటికి ఆరెండు రోజులూ సాయానికి రాననీ పోతే మాయింట్లోనే పోతాననీ ఏమీ జరగకపోతే ఆ తర్వాత నుండీ వస్తానన్నాడు.ఆ రెండు రోజులుగడిచాక అంతా మామూలే.అష్టగ్రహ కూటమీ లేదు ఏమీ లేదు. ఇప్పుడు షణ్ముఖ రావు ఎక్కడ ఉన్నాడో. 

     1962 లో చైనా భారత్ పై యుద్ధానికి దిగింది.ఆ సందర్భం లో రేడియోలో ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని నెహ్రూ గారు గద్గద కంఠంతో మాట్లాడారని చెప్పుకునేవారు.  స్కూలు లో మాష్టార్లు రోజూ దినపత్రిక లో యుద్ధం విశేషాలు ప్రార్థన సమావేశంలో చెప్పేవారు.ఆ యుద్ధంలో చైనా ఆక్సాస్ చిన్ అనే ప్రాంతాన్ని ఆక్రమించిందట.చైనాకూ భారత్ సరిహద్దు ప్రాంతాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో చాలాకాలం పాటూ ఘర్షణలు చెలరేగేయని రోజూ చెప్పేవారు. దేశభక్తిని రగుల్కొల్పే ఎన్నో పాటలు నేర్చుకున్న జ్ణాపకం.

          శ్రీకాకుళం ప్రాంతాలలో మాత్రమే "నేస్తం కట్టడం" అనేది పధ్ధతో,సాంప్రదాయమో మరి చూసాను.మా తరగతిలోని నా స్నేహితురాలు ఒకరోజు మనం నేస్తం కడదామా అని అడిగింది.అంటే స్నేహం గా ఉందామని అడిగింది అనుకుని సరే అన్నాను.నన్ను ఆ పక్కనే ఉన్న చిన్న గుడి కి తీసుకెళ్ళి నాకు ఇప్పుడు గుర్తు లేదు కానీ  ప్రమాణం వంటిది చేయించింది.నేస్తం కట్టిన వాళ్ళు ఒకరినొకరు జీవితాంతం స్నేహబంధం కి కట్టుబడి ఉండాలి.ఒకరినొకరు మీరు అని మన్నించు కోవాలి.ఒకరిపేరు ఒకరు ఉఛ్ఛరించకూడదు.ఇలా ఏవో చాలా నిబంధనలు ఉన్నాయి.ఐతే  రెండేళ్ళు మాత్రమే అనుబంధం ఉన్న కోటబొమ్మాళి వదిలిన తర్వాత   కుటుంబంలో వచ్చిన ఆటుపోట్లతో ఆ విషయమే మర్చిపోయాను.

       ఇటీవల వ్యాసం రాయటానికి నిడదవోలు మాలతి గారి కథలూ చదువుతుంటే ఒక కథలో ఈ ప్రస్తావన ఉంది.దాంతో అవన్నీ గుర్తు వచ్చాయి .ఇంతకీ నా నేస్తం ఎలా ఉందో!!? మళ్ళీ ఒకసారి కోటబొమ్మాళి వెళ్ళి రావాలని ఉంది.


---- శీలా సుభద్రాదేవి


2, మార్చి 2021, మంగళవారం

భద్రం తల్లీ కవిత - నా విశ్లేషణ

నా కవిత " భద్రం తల్లీ" నేపధ్యం నా విశ్లేషణ

         గత కొంతకాలంగా పదో తరగతి,ఇంటర్ ఫలితాలు వెలువడుతున్నాయంటే ఆ మర్నాడు వార్తా పేపర్లలో  ఆత్మహత్యల వార్తలు కూడా ఎక్కువగాఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.

         అందుకు కారణం విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

 14 -20 ఏళ్ళ కౌమార దశలో  పిల్లలపై అనేక విషయాలపట్ల ఆకర్షణలు ఉంటాయి.ఆవేశం ఉంటుంది.పెద్దవాళ్ళం అయిపోయాము మాకు తెలుసు అనే మొండితనం ఉంటుంది.ఈ వయసులో ఆడపిల్లల పట్ల తల్లి కి చాలా జాగరూకత అవసరం.

         స్కూలు లో టీచర్లు, ఇంట్లో తల్లి తండ్రులు పిల్లల ఆలోచనలు, ఆసక్తులు గమనించకుండా పందెంకోళ్ళలా రేంకులు వెంట పరిగెత్తిస్తున్నారు.అది గమనించిన కొందరు  పిల్లలు వాళ్ళ కోరికలూ, జల్సాలూ ,అవసరాలూ కోసం తల్లి తండ్రులను ఏటీఎం కార్డులు గా ఉపయోగించుకుంటున్నారు.

       మరోపక్క ప్రభుత్వవిద్యా సంస్థల్లో చదివే పేద వర్గాల్లో పిల్లలు చాలామంది పేపర్లూ,పాలపేకెట్లు వేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళలో కొందరు జల్సాలకు అలవాటు పడుతున్నారు.

       వీరందరికి అరచేతిలోకి మొబైల్స్ వచ్చేసాయి.దాంతో అశ్లీల చిత్రాలు వీడియోలు అప్పుడప్పుడే వికసిస్తున్న వయసును ఆకర్షిస్తూ రెచ్చగొడుతున్నాయి.మంచి చెప్పే టీచర్లూ, తల్లి దండ్రులమాటలు వారికి విసుగ్గా ఉంటున్నాయి రహస్య స్నేహితుల మాటలే రుచించి వారే తమ శ్రేయోభిలాషులనీ నమ్ముతారు.

       సమస్య తీవ్రతరం అయ్యే సరికి జీవితం విలువ నేర్చుకోని ఆ పిల్లలికి ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం గా కనిపిస్తుంది.అందుకే ఆ వయసు పిల్లలు అందులోని ఆడపిల్లల చుట్టూ బిగుసుకుంటున్న ఈ సందర్భాలను చూసి ఆందోళనతో రాసిన కవిత ఇది.

       విద్యాసంస్థల్లో పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఇలా మోహపరిచే విషయాలను టీచర్లూ, తల్లిదండ్రులూ వారి ప్రవర్తనను ఒక కంట కనిపెడుతూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పిల్లలకు ఎన్ని ఆవరోధాలు వచ్చినా జీవితాన్ని ఎదుర్కోగలిగే సంయమనమూ,జీవితం విలువ తాము చేసే అనాలోచిత నిర్ణయాల వలన తల్లి తండ్రులకు ఎంత మనస్తాపం కలుగు తుందో అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటున్నాను.మీరేమంటారు?

       

మున్నుడి లేఖ

 ప్రియమైన లేఖావరణానికి 

           నమస్తే.

        సుమారు   పది,ఇరవై ఏళ్ళ క్రితం పది దాటిన దగ్గర నుండి పోస్టు మేన్ సంచినిండా నింపుకొని తెచ్చే ఉత్తరాలకబుర్ల కోసం చూపులు వీథిి గుమ్మం దగ్గరే కాపలా కాసేవి.రాను రానూ ఉత్తరాలు రాసే ఓపికలూ తగ్గిపోయాయి.

        ఫోన్ కనెక్షన్లు వచ్చి విశేషాలు ఫోన్లో చెప్పుకోవటం అలవాటైంది.అరచేతిలోని మొబైల్ ఫోన్ వచ్చేక అదికూడా తగ్గిపోయి మాట్లాడే అవసరం కూడా లేకుండా వివిధ మనోభావాలను అనేక రకాల ఎమోజీలతో సందేశాలను పంపించుకుంటూ జనాలు మాట్లాడటం మర్చిపోతున్నారు.

        నిజానికి  అప్పట్లోని ఆత్మీయ స్నేహితులతో బంధువులో భౌతికంగా లేకపోయినా  వారు రాసిన లేఖలు జ్ణాపకాల పేటిక నుండి ఎప్పుడు తీసి చదువుకున్నా మళ్ళీ మళ్ళీ ఆ జ్ణాపకాల లోతుల్లోకి ప్రయాణిస్తునే ఉంటాం.ఇప్పుడు మరేమీ ఆలోచించనీయకుండా  చేతిలోసర్దుకు కూర్చున్న యంత్రాల్ని ఏకార్యము చేతనైనా మార్చు కున్నప్పుడల్లా భద్రపరచుకున్నవీ వెలిసిపోవటమో కరిగి పోవటమో జరుగుతాయి.అయినా ఆ మోహప్రపంచం లో మునుగీతలు కొడుతూనే వున్నాం.

        మళ్ళీ ఇన్నాళ్ళకు నువ్వు ఈ విధంగా సంచి నిండా ---కుమార్తెలకు భద్రతలేని సమాజంలో తమను తాము కాపాడుకోవటానికి జాగ్రత్తలు తెలియజేస్తున్న మాతృమూర్తుల ఆందోళనలనూ, అభిమానాన్ని చూరగొన్న శిష్యులకు జీవన విలువలను బోధించే గురువుల ఆత్మీయతలనూ, కబుర్లు కలబోసుకుంటూ స్నేహసంబంధాల్ని పటిష్టం చేస్తున్న మిత్రబాంధవ్యాల్నీ,కన్నబిడ్డల ప్రేమామృతాల్నీ, తోబుట్టువుల అనురాగాల్నీ మోసుకుంటూ తెచ్చావు.  

            మన మనసు విప్పి గుండెలో గూడు కట్టిన దుఃఖాన్ని చెప్పుకోగలిగేది ఆత్మీయ మితృలదగ్గరే.అందుకే అన్నింటి కన్నా ఎక్కువ గా ఆ మిత్రులు స్త్రీ కావచ్చు,పురుషులు కావచ్చు,అజ్ణాతం లో ఉన్న మిత్రులకి కావచ్చు,ఇద్దరు అజ్ణాత  మిత్రులతో కలిపి అత్యధికంగా   వచ్చిన పదహారు  లేఖలు ఆత్మీయ మిత్రులకే.సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ అన్నారు కవి. అందుకేనేమో మిత్రలేఖలే ఎక్కువ తెచ్చావు.

        నిజమే మనసులోని బాధలన్నీ,భావాలన్నీ చెప్పుకుని సాంత్వన పొందేది అమ్మదగ్గరే కదా. నాన్నతో కలగలిపి పది లేఖల్లో అమ్మ దగ్గరే ఆడపిల్లలపై జరుగుతోన్న దాడులనూ హింసనూ వెళ్ళబోసుకుని అమ్మ ప్రేమ కోసం తహతహలాడారు.

          దగ్గర బంధువులకే కాకుండా దేవతలకీ,కాలానికీ,FB కీ,గురువుకీ లేఖల్ని తెచ్చావు.ఇంకా కాలానికీ, వెళ్ళిపోయిన సంవత్సరం కి వీడ్కోలూ, కొత్తగా వచ్చిన ఏడాదికి స్వాగతలేఖలూ తెచ్చావే నువ్వు భలే దానివి.మాలాంటి ఆడవాళ్ళందరూ చదువుకోవటానికి తొలి అడుగు వేయించిన మొట్టమొదటి ఉపాధ్యాయులు సావిత్రీబాయి పూలే కి కూడా ఉత్తరం తీసుకు వచ్చేవు .నిజమే మాకో గొంతు ఇచ్చినది,బహుజన,దళిత మహిళలకు అక్షరాన్ని అందించినది ఆమేకదా.

          అయినా నువ్వు ఇంతమంది గుండె బరువులను మోసుకుంటూ వచ్చి నీ ఆవరణాన్నంతటినీ దుఃఖం తో నింపీ మరింతగా అందర్నీ ఆలోచనల్లోకి నెట్టేసావు.మనం ఈ తాగుబోతులు నుండి, మదమెక్కిన మృగాళ్ళ నుండి,రంగులవలలనుండి,మీడియానుండి,కుళ్ళిపోతున్న సమాజం నుండి మన ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలి?  అందుకు అక్షరయోధలందరూ కలాల్ని సాన పెట్టి జాగృత పరచవలసిన కర్తవ్యాన్ని నింపిన యాభై అయిదులేఖల్ని నీ సంచి నిండా నింపుకుని మరీ ఈసారి వచ్చేటప్పుడు తీసుకునివచ్చావు.     

          అందర్నీ కూడగట్టి    జ్వలించే అంశాన్ని అందించి లేఖలను  రాయించి  నీ ఆవరణాన్నంత నింపే ఇన్నిన్ని లేఖల్ని మూట కట్టి నా దగ్గరికి పంపించిన  జ్వలితకు నా అభినందనలు   అందజేస్తావు కదూ  

           వచ్చేసారైనా నీ ఆవరణాన్నంతటినీ  కోకిలల కలస్వరాలతో, సీతాకోకచిలుకల రంగుల హరివిల్లుతో,వన్నెవన్నె పూల పరిమళభరిత మలయపవనాలతో పోటీపడుతూ కలకలనవ్వుతూ సాధికారత తో  స్వావలంబన తో నిర్భయంగా తిరగగలిగే ఆడపిల్లల సంపూర్ణ జీవన వాస్తవచిత్రాల్ని  మోసుకొస్తావని ఎదురు చూస్తుంటాను.

                                                 ఇక ఉంటాను.

                                                శీలా సుభద్రా దేవి

18, ఫిబ్రవరి 2021, గురువారం

జీవన విలువలు

         జీవన విలువలు


నీలి నింగి కీ

ఆకుపచ్చ నేలకీ మధ్య--


మబ్బుతెరల్ని తొలగించుకుని 

తారలమధ్య నుండి తొంగిచూసే చందమామకీ

 చెరువుని వీడి బతకలేని కలువకీ మధ్య --


ప్రచండ కిరణాలు సాచే రవిరాజుకీ

అగాధాలుగుండెల్లో పొదువుకున్న సాగరకన్య కీ మధ్య--

ఎప్పుడూ సమాంతరదూరమే

అయితేనేం

ఏనాటినుండో 

కవి సమయాలలో

ఎన్నెన్ని ప్రేమవూసులో!

ఎన్నెన్ని ఊహలవూడల్ని అక్షరాలతో పెనవేసి

కవితా సుందర్ని ఉయ్యాలలూపుతూ

ఉవ్వెత్తున ఎగసే గాలి అలల ఉధృతి లో సైతం

లాహిరి పాటలతో ఊగిసలాడిస్తూ

ఎన్నెన్నో కవితలు!!

రసిక హృదయాల్ని రంజింప చేస్తూ

ఎన్నెన్ని కంఠాలు

గేయాల్ని శృతి చేసుకున్నాయో కదా


ఈనాడు

నేలమీద నిటారుగా నిల్చున్న కవికి

నీలాకాశాన్నీ, పచ్చని నేలనీ చూస్తే

ఆ రెండింటి మధ్యా

అంతస్తుల అహంకారాల కింద నలిగే

పసిహృదయాలు కన్పిస్తాయ్

నిలువునా రూపెత్తే కులం గోడల సందుల్లోంచి

పరువు కత్తులు మెరుపై దూకటమే దర్శనమిస్తాయ్

చల్లందనాలూ,పరిమళసమీరాలూ

 వెదజల్లాల్సిన కన్నపేగుల్లో అసహనపు ప్రళయాగ్నులు

 పసిప్రేమికుల కలల్ని చితి మంటల్లో కాల్చటం చూస్తాయి


ఆడపిల్లల పాలిటి అసిధారావ్రతమౌతూ

శారీరక ప్రేమగా రూపాంతరం చెందినప్రేమ

జీవన విలువలు చిధ్రమౌతోన్న పరిస్థితుల్లో

ఈనాడు ప్రేమ  అంగడి వస్తువైపోయింది

మన పిల్లలకి 

ఈ చితిమంటల ప్రేమని కాదు

జీవితాన్ని ప్రేమించటం ఎలాగో నేర్పాల్సింది

ఇక మీదట అక్షరాన్ని ప్రేమించే కవులే కదా.


untitled-ఇరోంషర్మిలా

   
              మూలం :_ ఇరోం షర్మిలా  
ప్రియమిత్రులారా
నా చేతుల్ని మీకిచ్చేస్తాను
నన్ను ప్రేమతో ఆలింగనం చేసుకోండీ
అంతరంగాన్ని మీముందు తెరవాలని వుంది
ఐతే పరిమళభరితం కాని
ప్లాష్టిక్ చిరునవ్వుల్ని పులుముకొన్న కంఠానికి
భావాల్ని పలికించే పదాలు కరువయ్యాయి
ఈ రాజకీయదుర్ఘంధాన్ని కాల్చేసేందుకు
ఒక విస్ఫోటనాన్ని రగిలించాలని వుంది
కానీ ఒంటరి అడుగుల్ని మునుముందుకు
వేయలేక అలసిపోతున్నాను
బలమైన ఆలోచనల్ని నినదిస్తూ
ధ్రుఢసంకల్పంతో ముందుకే అడుగేస్తూ
శతాధిక పాదముద్రల్ని కలుపుకోంటూ
అద్భుతధీరత్వాన్ని ప్రోది చేసుకొంటూ
తలుపుల్ని తెరుచుకొంటూ సామూహుకంగా
మీరంతా బైటకి వస్తారని,రావాలని నా ఆశ

     --అనుస్రుజన:-శీలా సుభద్రాదేవి
 

నడక దారిలో-2

 నడక దారిలో--2 


"నాన్న మీద కవితలు మీరు రాసిన వేమైనా ఉన్నాయా" అని "నాన్న పదం" సంకలనం కోసం ఘంటశాల నిర్మల గారు అడుగుతే 'లేవు 'అన్నప్పుడు 'ఏదైనా రాయండి' అన్నారు

      ఒక్క జ్ణాపకాన్ని నాకు ఇవ్వని నాన్నగురించి ఏమి రాస్తాను.

నాకు ఊహ తెలిసే సరికే జబ్బు తో ఉన్నారు.అమ్మ వంటి మీద నగలతో సహా అంతా కరిగి పోయింది.మరీమరీ మెదడు మడతలని విప్పగా ఆదివారాలు త్రినాధ స్వామి వ్రతం చేసేవారు అన్నది గుర్తువచ్చింది.వీధివరండాలో వెడల్పు బల్ల మీద కూర్చుని " లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యే" అంటూ గజేంద్ర మోక్షం పద్యాలు చదివిన గుర్తు ఛాయా మాత్రం గా కదిలింది.

    గాలి మార్పు ఉంటే ఆరోగ్యం కుదుట పడుతుందేమో నాన్నగారిని అక్కయ్య ఇంటికి అనకాపల్లి కి తీసుకు వెళ్ళినా లాభం లేక జబ్బు తిరగబెడితే రాత్రికి రాత్రే విజయనగరం వచ్చేసి పెద్ద మామయ్య  ఇంటికి తెచ్చారు.

  చీకటి పడుతున్నవేళ నేను లోపల గదిలో చందమామ కథల్లో రెక్కలు గుర్రం మీద స్వారీ చేస్తూ సప్తసముద్రాలు దాటి కథల కడలిలో మునుగీతలు కొడుతుంటే "'చిన్నది ఏదీ "అంటూ పుస్తకంతో పాటే చెయ్యిపట్టి ఎవరో  నన్ను లాక్కొచ్చి అమ్మ పక్కన కూలేసారు.అంతవరకూ గట్టిగా గురక పెట్టి ఆగిన నాన్నగారి నిశ్చల దేహాన్ని చూస్తున్న నన్ను  అమ్మ ' వెళ్ళు చిన్నా చదువుకో' అని లోపలికి పంపించేసింది.ఇంతే నా జ్ణాపకం.

  ఏడుగురు అన్నదమ్ముల మధ్య పుట్టినదీ అందరిచేతా రాజూ,రాజమ్మా అని పిలిపించుకున్న అమ్మ తీవ్ర ఆర్థిక సంక్షోభం లో జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. నలుగురు పిల్లలతో నిస్సహాయంగా నిలిచింది. అమ్మ ఆ తదనంతరం జీవితం లో ఎదుర్కొన్న వివక్షలూ,అవమానాలూ, ఇబ్బందులూ వీటన్నటి మధ్యలో కూడా నిబ్బరం గా ఉండేది.ప్రభుత్వ ఉద్యోగం లో ఉండగా నాన్న  చనిపోయినా ఫేమిలీ పెన్షన్ అమ్మకి వచ్చే ఏర్పాటుఎవరూచేయలేదు.బహుశా ఆమెకు ఆర్ధిక తోడ్పాటు కలుగుతే తాము ఆమెపై పెత్తనం చెలాయించి అణగదొక్కటానికి కుదరదనే పెన్షన్ రాకుండా చేసారేమో.  

     నాన్నగారి వాటా పొలం మీద కౌలు చేస్తున్న వాళ్ళు ఏడాదికో ఎప్పడో దయాదాక్షిణ్యం గా పంపే  ధాన్యం బస్తాలు ఒక ఎనిమిదో పదో వచ్చేవి, నాలుగైదు కుంచాల పెసరపప్పు  వచ్చేది.ధాన్యం పట్టటానికి మిల్లరు డబ్బు బదులు,చిట్టూ,తౌడూ తీసుకునేవాడు.అమ్మ బియ్యం జల్లించగా వచ్చిన నూకలు ఇచ్చి కూరలవి కొనేది.  ఉంటే తినటం,లేకుంటే పిల్లలకు పెట్టి  పస్తులు ఉండటమే తప్పా  ఎప్పుడూ ఎవరినీ నయాపైసా అడగకుండా,లేదు అనే మాట నోట రాకుండా జీవితం గడిపింది.మమ్మల్నీ అలాగే పెంచింది.పుట్టినరోజున ఇంట్లో ఉన్న బియ్యం తోనే పరమాన్నం వండి పెట్టేది.

     మా పెద్దన్నయ్యకి శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి లో ఉపాధ్యాయ ఉద్యోగం రాగానే అందరం అక్కడికి వెళ్ళిపోయాము.అక్కడా అదే గుట్టుగా సాగే జీవితమే.

      ఏడోతరగతిలోనే నేను రజస్వలనౌతే బట్టలకూ, వేడుకలకు డబ్బు అడిగి  కొడుకు చేత కూడా ఖర్చు పెట్టించటం ఇష్టంలేక  ఎవరికీ తెలియనీయలేదు.ఆ విధంగా సుమారు రెండేళ్ళపాటు దాచింది.అదృష్టమో,దురదృష్టమో నేను బలహీనంగా చిన్నగా ఉండేదాన్ని.నా మైలబట్టలను తానే బహిష్టు అయినట్టు గా ఉతికింది.నావే కాదు తర్వాత తర్వాత కోడళ్ళ పురుళ్ళకి కూడా  వాళ్ళ ముట్టు గుడ్డలు కూడా ఉతికినా కూడా అవాకులు చవాకులు అందుకుని మౌనం వహించిన  ప్రేమమూర్తి.

     పురుడు పోయటానికి కూతురు ఇంటికి వచ్చినందుకు ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు " మా అమ్మ అయితే ఇలా కూతురు ఇంటికి వచ్చి పురుళ్ళు పోయదు" అని వెటకారంగా మాట్లాడినా కూతురు జీవితాన్ని దృష్టి లో పెట్టుకొని  నోరెత్తని సహనమూర్తి.

      రెండో మనవరాలు పుట్టాక నామకానికి పదకొండో రోజు చీర ఉయ్యాల కట్టి పాపాయిని అందులో పడుకో బెట్టి  అక్షింతలు వేయమంటే వేస్తూ" మేము లైన్లం( lions) మాకు ఆడపిల్లలు పుట్టర"ని మీసాలు మెలేసి  అంటున్న ఇంట్లో వాళ్ళని నిరసన చూస్తూ మౌనం వహించి, నెలలోపునే పిల్లలతో సహా నన్ను తీసుకుని విజయనగరం  వచ్చేసింది.దురదృష్ట వశత్తూ అర్భకంగా పుట్టిన పిల్ల డయేరియా తో మూసిన కన్ను మరి తెరవకపోతే ఆడపిల్లని నిరసనగా చూసే ప్రపంచంలో ఉండలేక పోయిందని,ఆ దుర్ఘటన తన ఇంట్లో ఉండగా జరిగినందుకు కన్నుతెరవని పాపాయికి మట్టి దుప్పటి కప్పి నన్ను అక్కున చేర్చుకుని కుంగిపోయింది.

      నా డెలివరీ లో కోసం హాస్పిటల్ లో ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ఆయాలను చూస్తూ ఇంట్లో ఐనా చేసేది ఇదే పని కదా ఈ పని దొరికినా బాగుణ్ణు.ఎవరిమీదా ఆధారపడకుండా బతకొచ్చు'అనేది.మొదటి నుండి అమ్మకి ఆర్థిక స్వావలంబన లేక పోవటం వలనే ఇన్ని అవస్థలు పడింది అనేది నాకు మనసులో నాటుకు పోయింది.స్త్రీ ఎంతో కొంత సంపాదించి గలిగే విద్యార్హతలు పొంది ఉండాలి.ఆర్థిక స్వావలంబన వలన స్త్రీ కి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది అని నా నమ్మకం.అందుకే ఉద్యోగం చేయాలని నేను ఆరాటపడ్డాను.కాని ఉమ్మడి కుటుంబ బాధ్యతలు, పిల్లలూ, రోగాలూ రొష్టులూ మరో పదేళ్ళు కు గానీ ఉద్యోగం చేసే వెసులుబాటు కలగలేదు.టీచర్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు చదువు అశ్రద్ధ చేసే ఆడపిల్లలకు "ఎప్పుడేం అవసరం వచ్చినా చిన్న ఉద్యోగం కావాలన్నా పదోతరగతి పాసవ్వటం ముఖ్యం"అని చెప్తూ ఉండేదాన్ని.

     అమ్మ 75 ఏళ్ళు ఏరోజూ విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూ చేస్తూనే కుప్ప కూలిపోయింది.మూడురోజులు గొట్టంద్వారా ద్రవపదార్థాలు అందుకుని నా ముందే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన అమ్మ నా జ్ణాపకాలలో నిరంతరం  చిరస్థాయిగానే ఉంటుంది .కన్న పిల్లల కోసం కొవ్వొత్తులలా కరిగే ఇటువంటి అమ్మలు ఎంతోమందికి ఉండే ఉండొచ్చు కదా. కానీ కొవ్వొత్తి కరిగిపోయినా అది నింపిన వెలుగు పిల్లలగుండెల్లో నిత్యం కాంతులీనుతూనే ఉండాలి.

 

అనగనగా ఒక చిత్రకారుడు

 " అనగనగా ఒక చిత్రకారుడు" అని కథ మొదలు పెట్టిన అన్వర్ కవిత్వం లాంటి వచనాల పంక్తుల దారెంటే ప్రయాణిస్తూ పాఠకులనీ చెయ్యి పట్టుకుని ఎందరు చిత్రకారులనో ఎన్నికథలనో, ఇంకెన్ని చిత్రాల్నో, మరెన్ని సినిమాల్నో,ఇంకెన్నెన్ని చరిత్రల్నో పరిచయం చేస్తూ లోతుల్లోకి  లాక్కెళ్ళి పోయాడు.

            ఇంతకీ ఇతను చిత్రకారుడా,కథకుడా అనే సందేహం నన్ను వేధించింది.కొంచెం దిగులు కూడా వేసింది.శీలావీని రచయితలు చిత్రకారుడనీ, చిత్రకారులు రచయిత అనీ అంటూ తమకు అడ్డు లేకుండా ఏ కేటగిరీ లోను చేర్చకపోతే శిష్య ప్రశిష్యులు లేని ఆ అమాయకుడు ఏదో తనకోసం తానే,,తనలోకంలోతానే తపోముద్రలో మునిగిన మౌనిలా అయ్యారు.

          పాపం ఈ అన్వర్ కూడా ఈ కేటగిరీ లోకి వచ్చేస్తాడా ఏమిటి,? ఆయనకి అస్మదీయులు ఉన్నారా లేదా అని దిగులు.

             ఇవన్నీ ఈసారి అన్వర్ కలిసి నప్పుడు చెప్పొచ్చులే అనుకున్నాను.కానీ అక్షరం నా నోట్లో నాలిక కిందే దాక్కుని ఉండిపోతుంది.వేళ్ళలోంచే కలం గుండా  ఉబికి వస్తుంది.అందుకే రాయటమే మొదలు పెట్టాను.

               వేటూరి విక్రమ్ మోహన్,బాపూ,చంద్ర,కాళ్ళు,కరుణాకర్,శేఖర్ వంటి తెలుగు చిత్రకారులనేకాక పులక్ బిశ్వాస్,బట్లాగియా విక్టర్,ఆంబ్రూస్,ప్రింటర్,జాన్ క్యూనో లతో చేతులు కలిపించి బొమ్మల మంత్రజాలం లో మననీ తనతోబాటూ మునుగీతలు వేయిస్తాడు.

            ఎమ్ ఎస్ నాయుడు,అజయ్ ప్రసాద్, శ్రీ రమణలతో తన పరిచయం చెప్పి ఊరుకోకుండా ,అమృతాప్రీతం, గుల్జార్,కైఫీ మోహంలో పడేస్తాడు.

         సరే   ఆర్కే, పతంజలి,వేలూరి శివరామ శాస్త్రి నీ నేనూ చదువుకున్నా కదా. కవిత్వం వేరూ జాతి వేరు అంటూ జాషువా నీ, నల్ల కళాకారుడు డాన్ షిర్లేని సాదృశ్యం చేసి చూపాడు. 

గ్రీన్ బుక్ సినిమా కథలోని డాన్ షిర్లేకి తప్పని పరిస్థితుల్లో డ్రైవర్ గా పనిచేసిన టోనీ లిప్ వాలెన్గా గురించి చెబుతూ ఈ సినిమా మన మనసుల్లో లేని కన్నాలని తవ్వి చూపుతుందంటాడు.చరిత్ర చిన్నదీ, మనసు పెద్దదీ,ప్రేమ గొప్పది అని చెప్పి తన కంక్లూజన్ తో మనల్ని గుండె తడుముకునేలా చేస్తాడు.

            అన్వర్ నే కాక మనల్ని ఏడిపించిన ప్రభూతి జోషీ ఇంటర్వ్యూ,కన్నడ రచయిత వసుధేంధ్ర రాసిన ఎర్రచిలుకల్నీ,గౌరీ కృపానందన్ అనువదించిన పెరుమాళ్ మురుగన్ నవల నల్లమేక పునాచ్చీని తీసుకొచ్చి మన కళ్ళల్లో కట్టేస్తాడు.

        " ఆర్టిస్ట్ గా ప్రపంచాన్ని నమ్మించడం సులువు ఆర్టిస్ట్ గా సిసలు క్రాఫ్ట్స్ మేన్ గా నిన్ను నువ్వు ఒప్పించాలను కోవటం కుదరని కార్యం". ఎంతో నిజాయితీ ఉంటే గానీ ఇలా అనలేరు.                     బొమ్మ ఎలాగు వేయాలో డీటైల్డ్ గా చెపుతాడు.

            బతికిఉన్నప్పుడు నవ్వినా నవ్వక పోయినా ప్రపంచానికి వదిలే చివరి స్మైలీ అని పుర్రెని చూస్తే అనిపిస్తుంది అన్నాడంటే ఎంత తాత్విక దృష్టి అనుకుందామా ?

          అన్వరఫీ అక్షరాల పయనం లో ఎన్నెన్ని పాటలు వినిపించాడో !

          చేతిలో డబ్బులు కటాకటిగా ఉన్నా మాజిక్ టచ్ తో తాగుడుకో మరోదానికో అప్పిచ్చువాడూ ఇతడే తిరిగి ఇవ్వని వారికి దండం పెడతాడు.

            బొమ్మల దారిలో అన్వర్ ప్రయాణానికి ముందు అదే దారిలో అలాగే నడిచిన  మా జ్ఞాపకాల్ని ఒకసారి వెతుక్కున్నాను.

            కిటికీ బయట నుండి అద్దానికి అతుక్కు పోయి అన్వర్ బొమ్మల్ని తొంగి చూసే వానచినుకుల్లా అతని అక్షరాల్నో,బొమ్మల్నో చూడాలనుకుంటే  "అనగనగా ఒక చిత్రకారుడు" లోకి మీరూ తొంగి చూడాల్సిందే.