నా కవిత " భద్రం తల్లీ" నేపధ్యం నా విశ్లేషణ
గత కొంతకాలంగా పదో తరగతి,ఇంటర్ ఫలితాలు వెలువడుతున్నాయంటే ఆ మర్నాడు వార్తా పేపర్లలో ఆత్మహత్యల వార్తలు కూడా ఎక్కువగాఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది.
అందుకు కారణం విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
14 -20 ఏళ్ళ కౌమార దశలో పిల్లలపై అనేక విషయాలపట్ల ఆకర్షణలు ఉంటాయి.ఆవేశం ఉంటుంది.పెద్దవాళ్ళం అయిపోయాము మాకు తెలుసు అనే మొండితనం ఉంటుంది.ఈ వయసులో ఆడపిల్లల పట్ల తల్లి కి చాలా జాగరూకత అవసరం.
స్కూలు లో టీచర్లు, ఇంట్లో తల్లి తండ్రులు పిల్లల ఆలోచనలు, ఆసక్తులు గమనించకుండా పందెంకోళ్ళలా రేంకులు వెంట పరిగెత్తిస్తున్నారు.అది గమనించిన కొందరు పిల్లలు వాళ్ళ కోరికలూ, జల్సాలూ ,అవసరాలూ కోసం తల్లి తండ్రులను ఏటీఎం కార్డులు గా ఉపయోగించుకుంటున్నారు.
మరోపక్క ప్రభుత్వవిద్యా సంస్థల్లో చదివే పేద వర్గాల్లో పిల్లలు చాలామంది పేపర్లూ,పాలపేకెట్లు వేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళలో కొందరు జల్సాలకు అలవాటు పడుతున్నారు.
వీరందరికి అరచేతిలోకి మొబైల్స్ వచ్చేసాయి.దాంతో అశ్లీల చిత్రాలు వీడియోలు అప్పుడప్పుడే వికసిస్తున్న వయసును ఆకర్షిస్తూ రెచ్చగొడుతున్నాయి.మంచి చెప్పే టీచర్లూ, తల్లి దండ్రులమాటలు వారికి విసుగ్గా ఉంటున్నాయి రహస్య స్నేహితుల మాటలే రుచించి వారే తమ శ్రేయోభిలాషులనీ నమ్ముతారు.
సమస్య తీవ్రతరం అయ్యే సరికి జీవితం విలువ నేర్చుకోని ఆ పిల్లలికి ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం గా కనిపిస్తుంది.అందుకే ఆ వయసు పిల్లలు అందులోని ఆడపిల్లల చుట్టూ బిగుసుకుంటున్న ఈ సందర్భాలను చూసి ఆందోళనతో రాసిన కవిత ఇది.
విద్యాసంస్థల్లో పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఇలా మోహపరిచే విషయాలను టీచర్లూ, తల్లిదండ్రులూ వారి ప్రవర్తనను ఒక కంట కనిపెడుతూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పిల్లలకు ఎన్ని ఆవరోధాలు వచ్చినా జీవితాన్ని ఎదుర్కోగలిగే సంయమనమూ,జీవితం విలువ తాము చేసే అనాలోచిత నిర్ణయాల వలన తల్లి తండ్రులకు ఎంత మనస్తాపం కలుగు తుందో అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటున్నాను.మీరేమంటారు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి