13, ఆగస్టు 2020, గురువారం

నేపథ్యం

 

నేపథ్యం (కవిత )

గాయం ఎక్కడా ?
చిగురుల పేలికలా ఛిద్రమైన మనసులోనా ?
అతుకులు అతుకులుగా ఉన్న జీవితంలోనా ?

అడుగడుగునా నిలువెల్లా రక్త సిక్త వౌతూ
గాయాల పుట్టవైపోతూ
దేన్నీ గురించి ఈ అన్వేషణ !?

గ్రహాల మధ్య నుండి నడుస్తూ
చుక్కల్ని అనుకూలంగా ముగ్గులోకి కలిపితే
చెదిరిన జీవితం గాడిలో పడుతుందా ?

కనిపించని దైవాన్నో
కలిసిరాని గ్రహాల్నో కారణం చేసి
కుములుతూ కూర్చోటమేనా చేయాల్సింది ?

కాదుగదా
ఈ వస్తవిత నేపథ్యంలో ఆలోచన కళ్ళు తెరిస్తేనే
దుఃఖపు తెర ముక్కలు ముక్కలుగా చీలి
బొట్లు బొట్లుగా రాల్తున్న రక్తం పచ్చి వాసన
కాల్తున్న హృదయం మీద నుండి లేచిన వెచ్చని ఆవిరితో
సుడులు సుడులుగా తిరుగుతూ
శరీరం అంతటా నవ చైతన్యంతో పరుగులు తీస్తుంది 

2, ఆగస్టు 2020, ఆదివారం

ఆ శుభదినం కోసం...

      ఆ శుభదినం కోసం......

పొద్దున్నే
కళ్ళు సూర్యచంద్రులై
కేలండర్ చుట్టూ పరిభ్రమిస్తాయ్
ఈ రోజు ఏ శుభ దినమా అని
మతపరమైన లో
జాతీయమైనవే కాక
మన మేథావుల్ని
కదవ బెట్టిన దేశాల్నుండీ
ఎరువు తెచ్చుకున్న దినాల్నన్నింటినీ
కేలండర్ల నిండా ప్రేమతో అతికించారు కున్నాం
ఇక ఇప్పుడు
ఎన్నెన్ని ప్రత్యేక దినాలలో

నట్టింట్లో ఆత్మీయంగా
ఒక ముద్ద పెట్టని వాళ్ళు సైతం
పోయాక మాత్రం అట్టహాసంగా
నలుగురికీ చాటేందుకు పిండాలు పెట్టినట్లు
ఏడాదికోమాటు
సామాజిక ప్రసారమాధ్యమాలన్నీ
అక్షరప్రేమల్ని వర్షిస్తాయ్
ప్రేమంటే తెలియని పసిమొగ్గలు సైతం
హృదయాల్ని అమ్మానాన్నల పిడికిట్లో దాచేసి
ఎర్రగులాబీల్నీ,ఆఠీను గుర్తుల్నీ
పెంచుకుంటూ మురిసి పోతాయ్

ఒకటి కాదు
రోజుకో రకం ప్రత్యేక దినాలు!
తెల్లారుతూనే
వార్తా మాధ్యమాన్ని వాటినీ
కళ్ళను ఇంతింతచేసి వెతుకుతుంటాను
ఏ రోజైనా ఏ మూలైనా
నో క్రైమ్ డే,నో రేప్ డే,నో సువిసైడ్ డే
అన్న  మాటలేమైనా ఉంటాయేమోనని
నాకు తెలియక అడుగుతున్నాను
ఏ రోజైనా మనిషి దినమో, మానవత్వదినమో
ఉందేమో కాస్తా చూసి చెప్తారా
ఆ రోజైనా మనుషులుగా మారి
ఒకరినొకరం
ఆర్తిగా ఆత్మీయంగా అభినందించుకుందాం.



11, జులై 2020, శనివారం

రంగుల వల - శీలా సుభద్రాదేవి

    ఆయన ఆఫీసు పనిమీద వూరికి వెళ్లారు. పిల్లలు స్కూలుకు వెళ్లారు. సెలవులు చాలా ఉండిపోయాయని, సంవత్సరం ఆఖరుకి వచ్చేస్తోందనీ నాలుగు రోజులు వరుసగా సెలవు పెట్టేశాను. రెండ్రోజులు ఇల్లు సర్దుకోవడంతోనే అయిపోయింది. ఒకరోజు పూర్తిగా రెస్టు తీసుకున్నాను. ఇక ఈరోజు పని ఏమీ కనిపించలేదు. మధ్యాహ్నం ఏమీ తోచలేదు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటమే తప్ప వనజని చూసి చాలా కాలమైంది అని గుర్తు వచ్చింది.

    'అకస్మాత్తుగా వెళ్లి సర్ప్రయిజ్ చేస్తేనో! ఫోన్లో మాట్లాడినా ఎక్కువసేపు కుదరదు కదా. చక్కగా ఎదురెదురుగా కూర్చొని కబుర్లు కలబోసుకోవటంలో ఉండే తృప్తి ఫోన్లో ఏముంటుంది' అనుకున్నాను. 

    వనజ యింటికి వెళ్లి తలుపు తట్టాను.

    విసుక్కుంటూ తలుపు తీసిన వనజ నన్నుచూసి ఆశ్చర్యపోయింది. 

    "ఇదేమిటి ఇలా దారితప్పి వచ్చేవు?" అంది.

    "దారి వెతుక్కుంటూనే వచ్చాను. సరే, ఏమిటీ ఈ అవతారం" అన్నాను ఆమెని పరిశీలిస్తూ.

    ఇల్లు బూజులు దులుపుతోంది కాబోలు మాసిన చీర కొంగు బిగించి, ఉచ్చెళ్లు పైకి లాక్కొని ఉంది. ముఖం అంతా చెమట్లు దిగజారి చెదిరిన వెంట్రుకలు నుదురంతా అతుక్కున్నాయి.

    "నువ్వైతే ఉద్యోగస్తురాలివి. గంజి పెట్టిన ఇస్త్రీ చీర కట్టి బొమ్మలా ఉంటావు. నాకెట్లా కుదురుతుంది" అంది నన్ను పైనుండి కిందవరకూ ఎగాదిగా చూస్తూ. 

    "మరే, నాకు ఇంట్లో వంటాగింటా ఉండవు. అడ్వర్టయిజుమెంట్లో అమ్మాయిలా ఫలానా గంజిపొడి పెట్టిన చీర కట్టుకుని తిరగటమే పని. ఆ కబుర్లకేం గానీ ఇంకా స్నానం, భోజనం కాలేదా" అన్నాను సోఫాలో చతికిలబడుతూ.

    "పండుగలు వస్తున్నాయికదా అని ఇల్లు శుభ్రంచేసే పని పెట్టుకున్నాను. అయిపోయిందిలే. క్షణంలో స్నానం చేసి వస్తాను. కలిసి భోంచేద్దాం" అంది వనజ.

    "నేను భోంచేసే వచ్చాలే. నువ్వు తొందరగా స్నానం చేసి రా. నేను పుస్తకం తిరగేస్తూ కూర్చుంటాను."

    వనజ అప్పటికే గదులు ఊడ్చడం పూర్తిచేసి, రెండు పత్రికలు నా ముందు పడేసి టీవి ఆన్‌చేసి స్నానానికి వెళ్లింది. 

    ఆ పత్రికలు అంతకుముందు చదివేసినవే. టీవీ కాసేపు చూసి విసుగుపుట్టి గదంతా పరిశీలిస్తూ కూర్చున్నాను.

    అంతలోనే వనజ స్నానం పూర్తిచేసి తయారైవచ్చింది. నా ముందు కూర్చోబోతే, "ముందు నువ్వు భోంచేయి. ఇప్పటికే లేటయింది" అన్నాను.

    నాకు ప్లేటులో కారప్పూసా, స్వీటు, ఆపిల్ ముక్కలు పెట్టి తాను భోజనానికి కూర్చుంది వనజ.

    ఓ కన్ను టీవీ మీద పెట్టి భోంచేస్తూ ఉంది. 

    నాకు మాట్లాడటమో, టీవీ చూడటమో అర్థంకాక ఒక్కొక్కటే కారప్పూస నోట్లో వేసుకుంటూ వనజని చూస్తూ కూర్చున్నాను.

    టీవీలో ఏదో డిటర్జెంటు పౌడరు ప్రకటన వస్తోంది. బట్టలు మురికి చేసుకుని వచ్చిన భర్తనీ కొడుకునీ చూసి విసుక్కోకుండా "ఇవి ఉతకటం ఆరేయటం రోజూ చేసే పనే" అని తేలికగా అంటోంది నవ్వుతూ బొమ్మలా మడత నలగని చీరతో ఉన్న ఆ మోడల్ అమ్మాయి. 

    "నేనూ ఆ పౌడరే వాడతాను. ఏమో ఎంత ఉతికినా తెల్లగా రావు" అంది వనజ అటే చూస్తూ.

    ఏమీ మాట్లాడకుండానే ఆమెనే చూస్తూ... నేను నవ్వి వూరుకున్నాను. 

    "స్వీటు టి.వి.లో ప్రకటన చూసి దుర్గా బ్రాండు నెయ్యితోనే చేసాను. ఎలా ఉందో చెప్పవోయ్" అంది నేను స్వీటు తినకపోవటం చూసి.

    సరే అని చిన్న ముక్క తుంచి నోట్లో వేసుకున్నాను. ఏదో అనాలి కదా అన్నట్లు 'చాలా బాగుంది' అన్నాను. వనజ ముఖంలో సంతోషం కనిపించింది.

    వనజ భోజనం పూర్తిచేసి గిన్నెలు సర్దుతూ "బ్రూ కాఫీ కలపనా? ఆ బ్రాండు కాఫీ చాలా బాగుంటుంది. తాగితే వదలవు" ఊరిస్తున్నట్లుగా అంది.

    "ఇప్పుడే ఎందుకులే. కాసేపు అయ్యాక నువ్వు కూడా తాగే టైము అయితే అప్పుడు కలిసి తాగుదాం" అన్నాను నేను కూడా డైనింగ్ టేబుల్ ముందునుండి లేస్తూ.

    "సరే అయితే. ఆ అన్నట్లు ఈ ఫ్రిజ్ కొత్తగా కొన్నాను చూసావా? దీంట్లో ఐస్‌క్యూబ్స్ క్షణాల్లో తయారు చేసుకోవచ్చు. దీంతోబాటు ఇస్త్రీపెట్టే అదే కంపెనీది ఫ్రీ తెలుసా" కళ్లు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది, ఫ్రిజ్ తెరిచి మరీ చూపుతూ. 

    "ఆ మధ్య ఎప్పుడో కొనబోతున్నట్లు ఫోనులో చెప్పినట్లున్నావు కదా" అన్నాను నేను.

    తాను కొన్న వస్తువుల గురించి చెబుతూనే డైనింగ్ టేబుల్ శుభ్రం చేసి ఎలా అయితేనేం మొత్తం మీద వచ్చి డ్రాయింగ్‌రూమ్‌లో నా పక్కన కూర్చుంది వనజ.

    "చాలా కాలమైంది కదూ. మనం ఇలా దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుని ఎంతకాలమైందో. కాలేజీలో చదువుకునే రోజుల్లో తరచూ కలుసుకుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు ఒకే ఊళ్ళో ఉన్నా కాస్సేపు ఫోన్లోనే మాట్లాడుకోవటం అవుతోంది" ఆర్తిగా అన్నాను పక్కనే కూర్చున్న వనజ చేతులు నా చేతుల్లోకి తీసుకుంటూ.

    "నీకు ఉద్యోగం, నాకు ఇంట్లో పనితోనే సరిపోతుంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో ఇంట్లో పిల్లలూ, మగవాళ్ళూ ఉండటం, ఎవరో ఒకరు రావటంతో కలుసుకోవటమే అరుదైపోయింది" అంటూ వనజకూడా తన చేతిలో ఉన నా చేతిమీద మెత్తగా రాస్తూ అకస్మాత్తుగా నా చేయి పరిశీలించి "ఏమిటీ నీ చేయి ఇంత గరుకుగా ఉంది. ఏదీ నీ పాదాలు చూడనీ" అని నా చీర కుచ్చిళ్లు పాదాలమీంచి పైకిలాగి పాదల్ని కూడా పరిశీలించింది.

    గభాలున లేచి అల్మారాలోంచి ఒక క్రీము తీసుకొచ్చి "ఇదిగో ఈ క్రీము నువ్వు కూడా కొనుక్కుని రాస్తూండు. మృదువుగా అయిపోతాయి. ముఖాన్నే కాదు పాదాల్నీ, చేతుల్నీ కూడా రక్షించుకోవాలి" అంది అడ్వర్టయిజ్‌మెంట్‌లా.

    నేను ఫకాలున నవ్వాను.

    "నా మాటమీద నమ్మకం లేదుకదూ. ఇదుగో ఇప్పుడు ఈ నాటకం మధ్యలో వచ్చే ప్రకటన చూడు. నువ్వే నమ్ముతావు" బుంగమూతి పెట్టుకుని నా చెయ్యి విసిరికొట్టి సోఫాలో దూరంగా జరిగి కూర్చుంది.

    వనజ అన్నట్లుగానే అంతలోనే ఆ ప్రకటన టీవీలో వస్తోంది. కాస్సేపటికే వనజ మామూలుగానే తన్మయంగా టీవీ చూస్తోంది.

    "అన్నట్లు నీకు తాగటానికి ఏమీ ఇవ్వలేదుకదూ. ఏం చెయ్యమంటావు. రంగూ, రుచి, వాసనా మూడు గుణాలున్న టీ ఇవ్వనా! ఉదయాన్నే శుభ ప్రారంభాన్ని యిచ్చే కాఫీ కలపనా. నీదే ఛాయిస్" అంది లేచి నిలబడి.

    "నాకేమీ వద్దు. చల్లని నీళ్లు చాలుకానీ, ఇలా వచ్చి కూర్చొని కబుర్లు చెప్పు" అన్నాను విసుగ్గా ముఖం చిట్లించి.

    "ముఖం ఏమిటి అలా ఉంది. తలనొప్పిగా ఉందా? చిటికలో తగ్గించే టాబ్లెట్ ఇవ్వనా. మళ్లీ నాటకం మొదలు కాకముందే కాఫీ చేసి రెండు నిమిషాల్లో తెస్తాను" అంది హడావుడిగా.

    నేనేమీ మాట్లాడలేదు. మౌనం అర్థాంగీకారం అనుకుందేమో, వంటింట్లోకి వెళ్లి అన్నట్లుగానే రెండు నిమిషాల్లో నూడుల్స్ బౌలు, రెండు టీలు తీసుకుని వచ్చింది. 

    అంతలో టీవీలో మొదలైన నాటకానికి కళ్ళు అతికించి కూర్చుంది. నేను మాట్లాడకుండానే అవి పూర్తిచేసి "ఇంక పిల్లలు స్కూలునుండి వచ్చే వేళయింది. వెళ్తాను" అంటూ లేచాను. 

    ఇబ్బందిగానే నా వెనకే గుమ్మం వరకూ సాగనంపింది. నేను గుమ్మం దాటి నాలుగడుగులు వేయగానే తలుపులు మూసుకున్నాయి. 

    నాకు తెలుసు ఈపాటికి వనజ రంగుల పెట్టెలోకి ప్రవేశించే ఉంటుంది! 

1, జులై 2020, బుధవారం

కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో స్త్రీ - పి. సరళాదేవి కథలు
  శీలా సుభద్రాదేవి

యాభయ్యవ దశకం తర్వాత సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన రచయిత్రులు కొందరు అనేక కారణాల వలన కొద్దికాలం మాత్రమే రచనలు చేసి అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు తదనంతర నవలాప్రభంజనంలో కొట్టుకుపోతూ కీర్తీ, సంపదా లభించే ఆకర్షణలతో కథారచనను దూరంపెట్టినవాళ్ళూ ఉన్నారు. అతి తక్కువమంది ఒకటీ అరా నవలలు రాసినా కథారచనకే కట్టుబడినవారూ ఉన్నారు. అటువంటి వారిలో పి. సరళాదేవి ఒకరు. ఇతర ప్రక్రియలైన  కవితలు కొన్ని రాసినా, రెండు నవలికలు రాసినా మూడు కథల పుస్తకాలతో కథారచయిత్రిగానే గుర్తింపబడ్డారు.

1955లో ప్రజాతంత్ర పత్రికలో ‘బావ చూపిన బ్రతుకుబాట’ కథతో కథానగరంలోకి అడుగుపెట్టి, మాలతీచందూర్ ప్రోత్సాహంతో  ప్రమదావనంలో రచనలు చేసారు. డా. పి. శ్రీదేవి స్నేహప్రభావంతో తెలుగు స్వతంత్రలో 1955 నుండి 60 వరకూ విరివిగా కథలు రాసారు. ప్రముఖ పాత్రికేయుడు గోరాశాస్త్రి ముందుమాటతో తాను ఎంపిక చేసుకున్న కథల్ని 1962లో ‘కుంకుమరేఖలు’ పేరున సంపుటీకరించారు. మరికొన్ని కథల్ని ‘సరళాదేవి కథలు’ పేరుతో 1977లో మరొక సంపుటిని స్నేహితురాలు డా. పి. శ్రీదేవికి అంకితంగా తీసుకువచ్చారు. సరళాదేవి మరణానంతరం  ఆమె సోదరి ఆమెకు నివాళిగా, ఇంకా సంపుటీకరింపబడని కథల్ని ‘మాకుగాదులు లేవు’ పేరుతో ప్రచురించారు. కుంకుమరేఖలు సంపుటిలోని కథలు విజయవాడ ఆకాశవాణి ద్వారా ధారావాహికంగా ప్రసారం అయ్యి విశేషాదరణ పొందాయి.

1977లో ‘యువ’ మాసపత్రికలో ‘కొమ్మా-రెమ్మా’ పేరున నవలిక ప్రచురితం కాగా దానితోపాటు ‘చిగురు’ అనే నవలికనీ కలిపి గ్రంథస్థమై వచ్చాయి. ‘తెలుగు సామెతలు-సాంఘిక చిత్రణ’ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని కూడా సరళాదేవి ప్రచురించుకున్నారు.

1956 నుండి 1960 వరకూ స్వాతంత్ర్యానంతరకాలం రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం నుండి కో��

18, జూన్ 2020, గురువారం

నేనే వర్షరాణిని

వర్షరాణీ

నేనే వర్షరాణిని

నీలాకాశం చీరపై చెమ్కీమెరుపులు
నీరెండలో తళుక్కుమనగా
సమయమైందని బద్ధకంగా లేచి
పక్షులమేతకై గింజల్ని విసిరినట్లుగా
గ్రీష్మతాపంతో సొమ్మసిల్లిననేలముఖంపై
మబ్బుపిడికిల్ని విసిరాను
రాలినచినుకులు క్షణంలో ఆవిరై
రెట్తింపుసెగని విరజిమ్మాయి

ఇరుగుపొరుగుపిల్లల్ని ఆటకి పిల్చినట్లు
అన్నిదిశల్నుండి మేఘమిత్రుల్ని కలుపుకుంటూ
నల్లగొడుగునింగి దారిలోకదిలాను
ఒక్కోమువ్వనీకూర్చుకుంటూ అల్లిన
ముత్యాలకొంగును ఉండుండి విసురుగావిదిల్చానేమో
జలజలా వడగళ్లు విరజిమ్మాయి
వర్షగాలిలో తూనీగలై తిరుగుతోన్న
పసిపాపలదోసిళ్లన్నీ ముత్యపుచిప్పలయ్యాయి
వారితో కాసేపు ఆడుకుని
విసుగ్గా ఓసారి ఉరిమిభయపెట్టి
ఇళ్ల్లోకు తరిమాను.

తిరిగిబయల్దేరి
నల్లమబ్బుల దుప్పటిని వాడవాడల్నీ
ఊరూరా కప్పేస్తూ
విద్యుల్లతలకాగడాలతో
మెరుపుకర్రల కోలాటాలతో
ఉండుండి గుండెలదరగొట్టే తీన్మార్ 
పిడుగులదరువులతో
నలుదిక్కులా గర్వరేఖలు ప్రసరిస్తూ
నేనేకదా వర్షరాణినని   
మబ్బుకారుపై ఊరేగేదాన్నే
కానీ
ఏ అర్ధరాత్రో సడిసేయకుండా
నట్టింట్లో అనకొండై బిరబిరా పాకుతూ
బీదగుడిసెల్ని మింగాలనో
అసహాయుల్నూ అనాథల్నీ కాలనాగై కాటేయలనో
ఉత్సాహపడుతూ కాపుకాసిన
క్యుములోనింబస్ మేఘాల్ని ఒఫిసిపట్టి
కొంగున భద్రంగా కట్టేసుకొని
నెర్రెలువారిన పొలాలమీదుగా
ఎండిననదులదారుల్లో
కాల్వలతీగల్ని సుతారంగా మీటుకుంటూ
మేఘమల్హరినై ఒద్దికగా నడిచాను.

12, జూన్ 2020, శుక్రవారం

తెలుగు భాష ఆడవాళ్ళకు ప్రత్యేకం గా ఇచ్చిన వరాలు ఏవి

స్త్రీల నోముల పాటలు, పెండ్లిపాటలూ, బతుకమ్మపాటలూ, జోలపాటలూ, పండుగపాటలూ, వేడుకపాటలూ మొదలగునవి తెలుగుభాష ఆడవాళ్ళకు ఇచ్చిన ప్రత్యేక వరం..ఇది మామనవరాలు 7 వ తరగతి ప్రధమ భాష తెలుగు పరీక్షకోసం చదువుతుంటేవిని తెల్లబోయాను. 7 వ తరగతి పుస్తకం లోని 12 వ పాఠం ‘తెలుగు వెలుగు” లో తెలుగు భాషగొప్పదనాన్ని తెలియజేసేందుకు ఉద్దేశించి పెట్టినది కావచ్చు.ఇది మాత్రమే తెలుగు భాష వల్ల స్త్రీలకు లభించినది అని మన తెలుగు చదివే మన పిల్లలు నేర్చుకొంటున్నారు….
తెలుగుభాషకి చెందిన సాహిత్యం చదివే కదా? మన ఆలోచనలు వికసించాయి.అవి చదివేకదా మనం మన అస్తిత్వం కోసం కల గంటున్నది.అవి చదివేకదా మనం కూడా ఇంత సాహిత్యాన్ని పండిస్తున్నది.మరి పసితనం లోనే ఆలోచనలు కత్తిరించేలా ఆ పాఠాన్ని చేర్చినవాళ్ళు ఆలోచించలేదేమిటీ చెప్మా?
ఇంకా ఘోరం ఏమిటంటే పాప 5వ తరగతి లో వున్నప్పుడు పిసినారి అని ఒక పాఠం వుండేది.అందులో పిసినారి పాయసం తినాలనిపించి చేయించుకొని తీరా బంధువు ఒకడు వస్తే వానికి భోజనం పెట్టాల్సి వస్తుందని చనిపోయినట్లు నటిస్తాడు. అప్పుడు అతని భార్య తన పసుపు కుంకుమలు పోయాయని ఏడుస్తుంది.
ఆ పాఠం లో ప్రశ్న పిసినారి భార్య ఏమని ఏడుస్తుంది? తన పసుపుకుంకుమలు పోయాయని ఏడుస్తుంది అనేది సమాధానం. ఏడ‌వ‌త‌ర‌గ‌తి చదువుతున్న పిల్లలకి పసుపు కుంకుమలు పోవటమంటే అని సందేహం వస్తే ఏమని చెప్పాలి! కుంకుమా పసుపు ధ‌రించ‌డం అందరికి పుట్టుకతో వచ్చే హక్కు. ఇది ఆ వయసు పిల్లలకేకాక ప్రతీ పిల్లల గురించీ ఆలోచించాల్సిన పరిస్థితి వుంది. పిల్లలకి చిన్ననాటీనుండీ మూఢ విశ్వాసాల్ని నింపుతోన్న సిలబస్ని మార్చాల్సిన అవసరం ఎంతో వుంది. అందుకోసం అభ్యుదయ భావాలున్న సాహితీవేత్తలు వుద్యమించాల్సివుందని అనుకుంటున్నాను.

6, జూన్ 2020, శనివారం

ఇస్కూలు కతలు గురించి జొన్నవిత్తుల శ్రీ రామచంద్రమూర్తి గారి సమీక్ష

శీలా శుభద్రాదేవిగారి "ఇస్కూలు కతలు"

ప్రభుత్వోపాధ్యాయులకెదురయ్యే మొట్టమొదటి సమస్య-అదనపు బాధ్యతలు.
పేద పిల్లల కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ మొదలు జనగణన దాకా అన్నింటిలోనూ అయ్యవార్ల పాత్ర ఉండాల్సిందే. ఒక్క మనిషి అన్ని పాత్రలు ఏకకాలంలో ఎలా పోషించగలడనే విషయం ఈ ప్రభుత్వాలకు తెలియదా? మేమేం మనుషులం కాదా? అంటూ ప్రశ్నించడం మొదలుపెడితే అది హక్కుల సాధన వైపుగా నడిపిస్తుంది. ప్రభుత్వాలని బోనులో నిలబెడుతుంది. ఒకవేళ ఆ అయ్యవార్లకే సామాజిక అభివృద్ధిలో తమవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామనే ఎరుక కలిగితే? అది బాధ్యతలని మరింత ప్రభావయుతంగా నడిపేవైపుగా ముందడుగు వేయిస్తుంది. అప్పుడు విద్యార్థి అంటే కేవలం విద్యార్థి మాత్రమే కాదనీ అతని కుటుంబ నేపథ్యం కూడా అతనిలోంచీ విడదీయరాని ప్రధానాంశమనే అవగాహన కలుగుతుంది. అది కలిగాలేగానీ అయ్యవార్లకీ పిల్లకాయలకీ మధ్య ఒకానొక బాంధవ్యం పెనవేసుకుపోతుంది. అప్పుడు వారి పట్ల జాలి కలగదు. వారినా పరిస్థితుల్లోంచీ బయట పడెయ్యడం ఎలా? అనే ఆలోచన కలుగుతుంది. అలాంటి ఆలోచనలు రేకెత్తించే కథల పుస్తకమే,"ఇస్కూలు కతలు"
పిల్లలకీ తల్లిదండ్రులకీ ఎలాంటి అనుబంధం ఉంటుందో అలాంటి సంబంధమే ఉపాధ్యాయులకీ విద్యార్థులకీ మధ్య కూడా ఉండాలి. అది ఉన్నప్పుడు విద్యార్థుల ప్రశ్నలకి సమాధానాలు మాత్రమే కాదు, వారి సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. అలాంటి పరిష్కారాలు కనుగొన్నప్పుడు కలిగే ఆనందాన్ని జీతాలుగానీ, పదోన్నతులుగానీ, హంసతూలికా తల్పాలవంటి సవాలక్ష సుఖాలుగానీ ఇవ్వలేవు. సుఖాల సరిహద్దుల్ని చెరపడానికీ ఆనందపుటంచులు తాకడానికీ తేడా తెలుసుకోవలసిన మొట్టమొదటి బుద్ధిజీవి అయ్యవారే. ఆ తేడా తెలియజేసేవి ఉపాధ్యాయులకు పనిభారాన్ని పెంచే అదనపు బాధ్యతలే. ఆ అదనపు బాధ్యతలు వారికి సమాజంతో నేరుగా"ముఖా-ముఖీ"ని ఏర్పాటు చేస్తాయి. అందుకే ప్రజల సమస్యలు అందరికంటే ఎక్కువగానూ ముందుగానూ అయ్యవార్లకే తెలుస్తాయి. అందుకే ముందు తరాల్ని ఉన్నతీకరించే సాహిత్య సృజనకారుల్లో అధికశాతం ఉపాధ్యాయులే అయివుంటారు. అది అయ్యవార్లకీ అమ్మయ్యలకీ గర్వకారణం. ఒకవేళ సృజనకారులు ఉపాధ్యాయ వృత్తిలో లేకపోయినా వారిలో బోధనా సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఎందుకంటే విద్యాబోధనని మించిన సృజనాత్మక కళ మరొకటి లేదు. ఉపాధ్యాయులకు బోధన-విద్యార్థులకు సాధన. ఈ రెండూ అర్థ పూర్ణాలు. వాటిని పరిపూర్ణంగా చెయ్యడం మార్కులు, ర్యాంకులవల్ల కాని పని. ఈ విషయం దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా నిరూపితం అవుతూనే ఉంది. దాన్ని అందరికీ తెలియజేసే బాధ్యతని తలకెత్తుకున్న అరుదైన ఉపాధ్యాయిని అరుంధతి. ఆవిడకి సంబంధించిన ముప్ఫై కథలున్నాయిందులో.
ఇందులోని కథలన్నీ చిన్నవి. నాలుగు పుటలకి మించవు. కాబట్టీ ఏ కథా చదువరినించీ ఎక్కువ సమయాన్ని తీసుకోదు. వస్తుపరిధిని దాటి ఒక్కవిషయం కూడా ఉండదు. కథకి అవసరంలేని మాట ఒక్కటికూడా కనపడదు. దేనికదే క్లుప్తంగా సూటిగా స్పష్టంగా చెప్పాల్సింది మాత్రమే చెబుతుంది. కనుక చదవడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు. చాలా సరళమైన భాష. సుభద్రాదేవిగారు స్వతహాగా కవయిత్రి కాబట్టీ కథలన్నీ కవితామయంగానూ తరచి చూస్తే తప్ప కనపడని భావాలతోనూ నిండి ఉంటాయేమోనని సందేహించాల్సిన అవసరం లేదు.  కథ చెప్పేటప్పుడు కవయిత్రిలా వర్తించకుండా నిగ్రహం పాటించడం వల్లనే ఇది సాధ్యపడింది. అందుకే అరటిపండు వలిచిపెట్టినంత చులాగ్గా సాగుతుంది పఠనం. ఇందులో కథలన్నీ అయ్యవార్లందరికీ అనుభవంలోకి వచ్చేవే. కనుక ఆయా సందర్భాలెదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో ఎలాటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోవడానికైనా ఉపాధ్యాయులందరూ ఈ కథలు చదవాలి. అందుకే ఈ కథలన్నింటినీ "తెలుగు విద్యార్థి" ధారావాహికంగా ప్రచురించింది. మహారాష్ట్రలోని ఏడవ తరగతి తెలుగు విద్యార్థులకి "ఒకే తాను ముక్కలం"పాఠ్యాంశం.
ఇంక కథల గురించి:
ఇవి "బాధ్యతల్ని గుర్తు చేసే కతలు"అంటూ కథల తూకం వేశారు గంటేడ గౌరునాయుడు. తరవాత "నామాట"మీదుగా వచ్చి ఉపాధ్యాయులకి "అందరం ఒకేతాను ముక్కలం" అని తెలియజెప్పడం ద్వారా అందరి మనసూ గెలుచుకుంటుంది అరుంధతి. ఆ తరువాతే ఆత్మీయంగా ఆరంభమౌతుంది ఆమె పయనం. ఎవరికైనా నడక ఆరంభించగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న..,"ఈ దారి ఎక్కడికి?"
దానికి సమాధానమిచ్చే క్రమంలో కొందరు "పరాన్న భుక్కులు"ఎలా ఉంటారో పరిచయం చేసి, విద్యార్థులతో"నువ్వు నేర్పిన విద్యయే"అనిపిస్తారు. ఒకవేళ ఏదైనా "మూఢనమ్మకం"మీద "ఆరాధన" పెంచుకుంటే ఏం జరుగుతుంది? అది "బాధ్యత"లనుండి తప్పించి "పరిస్థితులకు బానిసలు"గా మార్చి "పనిదొంగలు"గా తీర్చి చివరికి "అవును, ఇది సర్కారు బడి మరి!"అనే నైరాశ్యానికి దారితీస్తుంది. "లేత మనసులపై మలిన ముద్రలు" వేస్తుంది. అలాంటప్పుడు పూలబాలలు పెంచిన మంచిని చూపిస్తూ,"ఆమాత్రం చాలు, మనసు పులకించడానికి"అని బుజ్జగిస్తుంది. అంతలోనే కొందరి "మరుగుజ్జు బుద్ధులు"తమ చుట్టూ ఉన్న "పరిసరాలు-పక్కదారులు" తొక్కించే "పందికొక్కులు"ఎలా ఉంటాయో చూపిస్తుంది. వాటినించీ తప్పించుకోవాలనుకునే"లేతమనసులకు, ధైర్యమే లేపనం"అని చెబుతాయి. ఇంతకీ అసలు "తప్పెవరిది?"అని "చేజారిపోతున్న బాల్యం" దీనంగా చూస్తూ"పేదరికపు అంచున"నిరాశా నిస్పృహలతో కర్తవ్య విమూఢంగా నిలబడిపోతుంది. అలాంటప్పుడు ఎవరైనా"లోగుట్టు"కనిపెట్టే ప్రయత్నం చేస్తే"కదిలిన అధికార పీఠం" స్వామికార్యం-స్వకార్యాలని" ఏకకాలంలో చక్కబెట్టగల "భోక్తలు"ఎక్కడ దొరుకుతారా అని గాలించడం మొదలుపెడుతుంది.
"సినిక్ సెన్స్" ఎక్కువైతే "కక్కూర్తి కూడా జాడ్యమే"అవుతుందని చెబుతుంది అరుంధతి. అంతేకాదు "ఆఫీసు జలగలు" పట్టుకుంటే "బకాసురుడు" తినడానికి ఎముకలు తప్ప ఏమీ మిగలదని వివరిస్తుంది. అయితే"చాణక్య రాజకీయం"విసిరే "మోహవలయాలు" ఎంత ఆకర్షిస్తున్నా లొంగకుండా ఏమాత్రం లౌల్యానికి లోనుకాకుండా తన జీవితంలో "తృప్తి"ని కలిగివుండి సమాజాన్ని సేవించుకోవడమే ఉపాధ్యాయ వృత్తికి పరమార్థమని నిరూపిస్తూ శీలా సుభద్రాదేవి పరిచయంతో ముగిస్తుంది. శ్రద్ధగా చదివిన ఉపాధ్యాయునికి మాత్రం భవిష్యత్కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికా రచనకు తగిన స్ఫూర్తినిస్తుంది. ఏ పుస్తకానికైనా ఇంతకంటే కాగల కార్యం ఏముంటుంది-గంధర్వులు తీర్చడానికి?