5, జులై 2024, శుక్రవారం

రంగు వెలిసిన సిత్రాలు -12

12 వ భాగం నగరమంతా వెలుగు పొదరిల్లు అయ్యింది ఊరూ వాడా రంగులచిత్రమౌతోంది రోడ్లపై తేలుతూ కదిలే వాహనాలు కోలాటాలు కోలాహలాలు గుంపులో చిందు నృత్యాలు అరిగి పోయిన శబ్దపేటికలనుండి ఎగిరే పాటల పావురాలు మళ్ళా చరిత్ర పునరావృతం ఔతుందేమోనన్న స్పృహలేని సంబరాల్లో జనం! భ్రమావరణంలో నాయకులు!! అంతకుముందు పదవుల పీఠాల్ని అలంకరించిందీ వారే కదా నాటి మెరుపులకు అంటుకున్న మరకల్ని కప్పిపుచ్చే గురివిందలూ వారే కదా ఏం ఒరగబెట్టారని ఏ ఒక్క ఓటరైనా ప్రశ్నను సంధిస్తే ఏ కండువాలో ముఖం దాచుకోవాలో మరి! కానీ నల్లనోటు రెపరెపల్తో మందునీళ్ళ మంత్రజలం చెల్లి కలికానికైనా కనిపించని కపటప్రేమను గ్రాఫిక్ పథకాలతో ప్రదర్శిస్తే వెర్రి బాగుల ఓటర్లు మాత్రం క్షణభంగురమైన ఆశల నీటిబుడగల్లో భవిష్యత్తును కలగంటూ రంగులప్రపంచంలో మునుగీతలు కొడ్తుంటారు అదే కదా వారి ధీమా

రంగు వెలిసిన సిత్రాలు -11

11 వ భాగం నోటినిండా బురదని పుక్కిట పట్టి మాటల దుర్గంధాన్ని జనం మీదుగా తుంపర్లు తుంపర్లు గా వెదజల్లుతూ రోడ్డు పక్కనే మురికిగుంటల్లో దొర్లి దొర్లి పొర్లి పొర్లి గుమ్మాల ముందుకొచ్చి ఒళ్ళు దులపరించు కొన్నట్లు కాలుష్య పూరిత చెరువుల్లో ముంచి తీసిన బట్టల్ని రోడ్డెక్కి ఒక్క ఉదుటున దులిపినట్లు బహిరంగస్తలాలన్నీ బహిర్భూములైనట్లు బారికేడ్ల ముళ్ళకంచెల మధ్య జనసమూహాల్ని బంధించి ఊరూరా సేకరించిన దుమ్మునంతటినీ నాలుకచేటల్తో చెరిగి చెరిగి ప్రతిపక్షాలపై ఎత్తి పోస్తుంటే ఊరూవాడా కాలుష్యమౌతున్నాయ్ శివార్లలో మైదానాల్లో ఎగిరెగిరి పడ్తున్న శబ్దాల్ని ఛానళ్ళు పోటీ పడి ఇళ్ళనిండా విరజిమ్ముతున్నాయ్ ఏ తెల్లవారు ఝామునో నిర్వికారంగా నిర్వేదంగా ఎప్పటికీ బాగుపడని బతుకుల్ని చెత్త బుట్టలో మోసుకు తిరిగే మహిళలు యథావిధిగా రోడ్లని ఊడ్చుతూ చెత్తకుండీలు నింపుతూ ఎవరొచ్చినా మనబతుకులు మనవేనని తమ కాంట్రాక్టు ఉద్యోగాలు కుక్కతోక లేనని ఛిద్రమైన ఆశలతో ఎండిపోయిన పెదాల్ని విరుస్తూ కుళ్ళి కంపుకొడ్తున్న తిట్లనీ గల్లీ గల్లీల్లోకీ ప్రవహిస్తూ వచ్చిన దుర్భాషా దుర్గంధాల్నీ ఆనవాలైనా కనబడకుండా నిర్వికార నిరామయముఖాలతో గంపలకెత్తి పోసే దృశ్యాలు రహదారుల నిండా ఎన్నో ఎన్నెన్నో ఎన్ని'కల'లో

రంగు వెలిసిన సిత్రాలు -10

10 వ భాగం పతాకాలన్నీ పక్షులై ఆవరణంతా రెపరెపలాడుతుండగా ఎవరి దేశభక్తి ఎంతో గుండెలమీద చెయ్యేసుకోకుండానే కీర్తించగలిగేదీ ఇప్పుడే ఎదుటివాడి మతోన్మాదాన్నో పక్కవాడి కులగజ్జినో సాధ్యమైనంతగా గోకి ఫొటోలు తీసి జూమ్ చేసి చూపేది ఇప్పుడే తిన్నింటి వాసాల్తో సహా లెక్కలన్నీ తేల్చేసుకునేదీ ఇప్పుడు కాక మరెప్పుడు? వరుస సభలూ సమావేశాల్తో జయధ్వానాలు పిట్టల్లా ఎగురుతూ మైదానాలన్ని తిరునాళ్ళైపోతున్నాయ్ రహదార్లు సైతం వేదికలౌతున్నాయ్ చౌరస్తాలు జాతర్ల కూడళ్ళౌతున్నాయ్ పనుల మీద రోడ్డెక్కిన వారికే గానీ రణోత్సాహంలో ఊగిపోతున్న వారికేం ఇబ్బంది? అత్యవసర ప్రాణాపాయంలో ఉన్నవారికి ప్రాణసంకటం గానీ ఉత్సవవిగ్రహాలకి చెలగాటమేకదా ఓటర్ల మనసులో మెదిలే విచికిత్స చిన్నదైతే కావచ్చు కరివేపాకులా విసిరేసేదైతే కాదు రాజకీయ చదరంగంలో చెక్ పెట్టేది ఎప్పుడైనా చివరికి ఓటర్లే అందుకే మరి రోజురోజుకీ కుంగికృశించిపోతున్న తల్లికి నరాల్లోని పాతరక్తాన్ని తోడి పారేసి దేశభక్తి డయాలసిస్ తో స్వచ్ఛమైన కొత్తరక్తాన్ని నింపుతామనో చర్మంపై తేలిన నరాలనదుల్ని అనుసంధానం చేసి పచ్చని వృక్షచర్మంతో ప్లాస్టిక్ సర్జరీ చేసి నవయవ్వనవతిగా తీర్చుతామనో ఎండి నెర్రెలు విచ్చిన పొట్టకు పంచభక్ష్య పరమాన్నాలందిస్తామనో పంచప్రణాళికల విత్తనాల్ని హారాలుగా వేసుకు తిరుగుతూ ధూపంలా ఎగిరే జనం స్వప్నాల్ని ఆశీర్వాదాలుగా మార్చుకుంటూ కరుణార్ద్ర హృదయులై అపర ప్రేమ స్వరూపులై వీథివీథినా వాడవాడలా పావనం చేస్తూ ఎదురుచూడని స్వాముల దర్శనభాగ్యానికి పులకితులైన జనాన్ని చిరునవ్వుల చిద్విలాసాలతో నమస్కారాల చిరునవ్వులతో కరస్పర్శల చక్కిలిగింతలతో శిరశ్చుంబన ఆశీర్వచనాలతో మరింతగా మోహపరవశుల్ని చేస్తూ రోజురోజుకూ బలుపు పెంచుకుంటూ ఊరూవాడా బాటా పేటా పాదయాత్రలే పాదయాత్రలు!!! -- శీలా సుభద్రాదేవి

రంగు వెలిసిన సిత్రాలు -8,9

దీర్ఘకవిత 8.వ.భాగం సంకల్పితం కావచ్చు అసంకల్పితమైనా కావచ్చు ఏ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందో ఏవేవి కూటములు కట్టి ఉమ్మడి కుంపట్లు రాజేస్తాయో ఏవేవి సొంతంగా చలికాచుకుంటూ ప్రభుత్వ వంటల్ని వండి వార్చాలనుకుంటున్నాయో ఏ ఆలింగనం మేలు కలిగిస్తుందో దేన్ని దగ్గరకు తీస్తే ధృతరాష్ట్ర కౌగిలి అవుతుందో ప్రతిజండాకీ భయమే అతుకులబొంతగా అన్నింటినీ కలిపి కుట్టి జండాగా ఎగరేస్తే ఏ వ్యతిరేకగాలో బలంగా వీస్తే కుట్లను తెంపి ఎన్ని పీలికలు చేస్తుందో ఏమిటో అన్నీ అనుమానాలే చేతులు కలిపి మానవహారాల్ని కడుతున్నా ఏ అంగీ కింద ఏ చురకత్తి దాగుందో దొంగచూపుల సిసికెమేరాల నిత్యపహారాలే! ఇప్పుడిక నాయకమ్మన్యుల ఇళ్ళల్లోని కళ్ళన్నీ వత్తులు వేసుకుని వెలిగే దీపాలౌతుంటాయి వెన్నుపూస లోతుల్లోంచి చలిపాము సర్రున పాకినట్లు జలదరింపులు బయటికి డాంబికాల మాటల్తో ప్రజలపై వరాలజల్లులు కురిపిస్తున్నా ఏమూలో మనసులో తేలుకొండిలా ఓటర్ల మీద అనుమానపు త్రాచు భయం ఉండుండి పడగవిప్పుతూనే ఉంది దుర్భిణీ వేసుకు వెతుకుతున్నా చీకటి మూలాల మాటున గూడుపుఠాణీ అనుమానాలే భజనపరులు చుట్టూ చేరి జయనామ జపాలు చేస్తున్నా ఎక్కడో ఏమూలో తేలుకొండిలా లేస్తున్న భయం భయం!! 9వ.భాగం బలుపో వాపో బయట పడని ఎదుటివాడి కదనోత్సాహం కత్తిలా గుండెల్లో దిగుతూనే ఉంటుంది అనుమాన భూతం ఆవహించిన కళ్ళకు వాళ్ళనీడే వాళ్ళను భయపెడుతోంది చలువ గదిలో కూర్చున్నా నుదుటిమీద చెమటచుక్కలు మొలుస్తుంటాయ్ అయినా తప్పదు మరి పెదాలపైపూత నవ్వులు ఛాలెంజులూ పందేలు మీసాల మెలివేతలూ తొడకొట్టుడు పంతాలు తమతమ గజబలాల ప్రదర్శనలు అశ్వాలతో కవాతులూ చదరంగం బల్లమీదే కాదు ప్రాపు కోరే వందిమాగధ సౌరంభాలతో ఎవరికివారు ఎన్నికల కదనరంగాన్ని కబ్జా చేసే సవాలక్ష ప్రయత్నాలు ఎన్నికల్లో తప్పదు కాక తప్పదు కదా సామాన్యులకు మాత్రం ఎదురుచూసి ఎదురు చూసి కంటిదీపం కొడిగడ్తుంటే పగిలిన స్వప్నాలను చిరుగులకొంగులో మూటకట్టుకోక తప్పటం లేదు ఎంత జాగ్రత్తగా కట్టాలనుకున్నా రాలిపోతున్న స్వప్నశకలాలు గుండెల్ని ఛిద్రం చేస్తున్నా ఏదో చిగురాశ రేపో మాపో పేదల్ని అక్కున చేర్చుకునే దయార్ద్ర మారాజు అందలం ఎక్కుతాడని కళ్ళదీపాల్ని ఆశలతో ఎగదోస్తూ ఇంటినిండా వెలుగులు పరిచి ఆరిపోకుండా నమ్మకాన్ని అడ్డుగా చేర్చి ఏరోజు కారోజు ఛిద్రమౌతున్న కలల్ని కూడగట్టుకుంటూ అవసరమైనప్పుడు జైకొడుతూ భద్రజీవితాల్ని కలగంటూ.....కలగంటూ... మాన్యులు కాని సామాన్యులు!

రంగు వెలిసిన సిత్రాలు -5,6,7

5.వభాగం ఎక్కడ చూసినా గోడలే ! మనిషికీ మనిషికీ మధ్య కులాలకీ మతాలకీ నడుమ ఎక్కడికక్కడ నల్లతుమ్మ చెట్లలా మొలుస్తున్న నిలువెత్తు గోడలు! ఏమానవతావాదో,సమతావాదో అడ్డుగోడల్ని నేలమట్టం చేయబోతే వారినే నిర్దాక్షిణ్యంగా పడగొట్టి వారిపైనే సరికొత్త గోడ మొలిపించి ఆ గోడలపైనే కాచుక్కూచున్న పిల్లులై నలుదిక్కులా చూపులసెర్చి లైట్లు ప్రసరిస్తూ గోడలపైనే పహారా కాస్తూ ఏనాయకుడో ఎరగా విదిలించే పదవికోసం రెప్పవాల్చకుండా పరిశీలిస్తూ అవసరం వస్తేనో అవకాశం చిక్కితేనో పక్కవాడి పై దాడి చేసైనా హస్తగతం చేసుకోవాలని అందుబాటులో ఉన్న వాడిని నిచ్చెన చేసుకుని దూకాల్సిన శుభగఢియ కోసం నిరీక్షిస్తూ.... నిరీక్షిస్తూ... నిరీక్షిస్తూనే కళ్ళపై వాల్తున్న కునికిపాటుని విసిరికొడ్తూ కాలాన్ని కరిగిస్తున్నారు ఛోటా మోటా లీడర్లు • *. *. * 6.వ.భాగం ఈనాడు రాజకీయ అనిశ్చితి అక్కర్లేదు విధాన నిర్ణయాలు వెదజల్లితే చాలు వైఫల్యాల్నిన అంగీకరించటమంటే కండువాకి వేలాడటమే కదా కోరి కోరి మెడపై కత్తి ఎందుకు పెట్టుకుంటారు భ్రమలో నైనా ఆశావాదులు గానే ఉండాలి అందుకే సభలో ధ్వనించే జేజేలనూ శృతిలేకున్నా అపస్వరాలు ధ్వనించినా గుండెల్లో దాచుకుని మురవక తప్పదు పవనాలు ఎటునుంచి వీస్తేనేం శరీరాన్ని చల్లగా తాకుతే చాలు దాడి కట్టిన వందిమాగధుల కోలాహలం చేదు నిజాన్ని మింగనివ్వదు కదా ఇప్పుడు ఎన్నికలంటే ప్రజాభిప్రాయం కాదు కదా గెలుపోటములు నిర్ణయించేది చేతికంటిన తడే ఎంత నోట్లధార కురిపిస్తే అంత బలగం నిజాయితీ ఎప్పుడో మనసు ముడుచుకుని మూడుకోతులతో పాటూ నాల్గో కోతైకూర్చుంది జనాదరణ ఉందనేది నీటిరాతే చెయ్యి తడవకపోతే బాలెట్ బాక్సులు నోరెళ్ళబెట్టాల్సిందే స్థానబలిమి ఉందని విర్రవీగితే కాళ్ళకింద నేల జారుడుబండే ఎంత కుమ్మరిస్తే అంతా దిగుబడి ఎంత వరద పారిస్తే అంతా రాబడి అభ్యర్థుల మేధస్సుతో పనిలేదు వేలిముద్రలగాడైనా పర్లేదు సిగ్గుఎగ్గుల్ని దులిపేసుకుంటే చాలు ఓటర్లనాడి పట్టగల్గితే బాగు • *. * 7 వ భాగం అసమ్మతుల అలకలు తీర్చడం ఒక ఎత్తు పక్కపక్షం వాడిరెక్కలు తెగ్గొట్టి తేగల్గటం మరో ఎత్తు గుర్రం మీద కూర్చుని గడకర్రకు ఎరకట్టినట్లు ఓటర్లను బూత్ ల లోనికి పరిగెత్తించే కుయుక్తులు ఇంకో ఎత్తు ఇదికూడా అంత తేలిగ్గా అయ్యే పని కాదుకదా ప్రజలముందు వెలిగించే ఉపన్యాసమతాబులు ఉత్సాహాన్నిపెంచికాంతిపుంజాలై కురవాలి కదా రేప్పొద్దున గద్దెక్కితే అవే పులకింత పూలవ్వాలి పాదాలకింద నిప్పు కణికలు కాకూడదు కదా వెచ్చించిన దానికి లెక్కాపత్రాలు లేకపోవచ్చు కానీ అందలం ఎక్కాక అధికారం చిక్కాక అంతకు ఎన్నింతలు రాబట్టొచ్చో దానికి మాత్రం ఖచ్చితంగా పద్దుల్ని రచించుకొనే ఉంటారు ప్రస్తుతం జనహృదయాకాశంలో ఆశల గాలిపటాలు ఎంతెత్తు ఎగరెయ్యాలా అని ఎంతమందిని వాగ్ధానాల మాంజాలతో కట్టి బంధించి గలమా అని గొర్రెపాటి తమ బందెలదొడ్లో ఏ పధకాలతో బంధించాలా అని రెప్ప వాలని చీకటి మాటున ఎన్ని మంతనాలో! ఎన్ని వలలో!! • *. *

రంగు వెలిసిన సిత్రాలు -4

రంగువెలసిన చిత్రం(ఓట్ల పండుగ పదనిసలు) 4 వ భాగం కొత్తరంగుల తురాయిని నెత్తిన మొలిపించుకుని వాహనాలన్నీ కొత్తపెళ్ళికొడుకులై కులుకు తున్నాయి వాహనచోదకులూ పదాతి దళాలు జండాధారులై కళ్ళనిండా కాంతులు వెలిగించుకుని రంగులపతాకాలనీడల్లో సేదతీరుతున్నారు అయిదేళ్ళకోసారికాకుండా ప్రతి ఏడాది పండగకోసం కలలు కంటూ ఆలోచనలనిండా ఆశలపందిళ్ళు వేస్తూ ఆలుబిడ్డల కళ్ళల్లో మతాబూలు పూయిస్తున్నారు రోజంతా గొంతులు ఎలుగురాసిపోయేలా రోడ్లనిండా జయజయాధ్వానాల్ని పూలజల్లులుగా కురిపించి సూర్యుడితోపాటు రోడ్లని కొలుస్తున్నారు పగలంతా రాజకీయ ఆవేశాలతో రగిలి రగిలి వేడెక్కిపోయిన గుండెల్ని చల్లబరిచేటందుకై చేతిలో పడిన పైసల్ని మత్తుదుకాణాల్లో కుదువపెట్టి కళ్ళల్లో దీపాల్ని వెలిగించుకుని కాచుకున్న భార్యాబిడ్డలకు ఎప్పటిలాగే జోగుతూవచ్చి మొండిచెయ్యి విసిరేస్తున్నారు ఎన్నికలపండగలో నిరంతరదృశ్యం ఇదే ఇదే! కొందరు భూతదయామయులు తెల్లారేసరికి జొన్న లో నూకలో చేతిసంచిలో నింపుకొని పావురాలకు దాణా పెట్టేందుకు బయలెల్లినట్లు భుజాలకు మేనిఫెస్టోల సంచిని వేలాడేసి వందిమాగధుల సహితులై వీధివీధీ తిరిగి వాగ్ధానాలు దాణాల్ని దారిపొడవునా చల్లుతూ మేతకోసం వెతికే అవసరం లేక ఎగరటం మర్చిపోయి అంతస్తుల కిటికీల సందులోనో ఆలయగోపురాల గూళ్ళల్లోనో తప్ప పచ్చని చెట్లకొమ్మల గుబురుల్లో వెచ్చని గూడు కట్టుకోవటం చాతకాక జోగుతోన్న పావురాలైన జనాల్ని ఇంకా ఇంకా ఎదగడం చేతకాని వాళ్ళని చేసి అవసరంలేని రాయితీలతో మాటలమంత్రజలం చల్లుతున్నారు రోజురోజుకూ బలం పుంజుకుంటూ అనుయాయుల నీరాజనాలతో పరవశులౌతూ ఆత్మస్తుతి,పరనిందలతో నిర్భీతిగా నిర్లజ్జగా రెట్టించిన ఉత్సాహంతో కందిరీగలరొదలా ఆవరణంతా శబ్దకాలుష్యంతో నింపుతున్నారు ఎక్కిన పీఠం కదలకూడదనో ఎక్కాల్సిన సింహాసనం అందుకోడానికో ఏదైతేనేం రెచ్చిపోతున్న పదవీ కాంక్షతో ఊరిస్తున్న ఎన్నికలతో వాతావరణమంతా పొగలాగ కమ్మి ఆకాశమంతా ఎగురుతోన్న వాగ్ధానాలే వాగ్ధానాలు! అవి ఆహ్లాదపరిచే సీతాకోకచిలుకలో కుట్టిచంపే కందిరీగలో అర్ధంకాని అయోమయంలో కూడా జనసమూహం గుండెల్లో కలలేకలలు!! • *. *

1, జులై 2024, సోమవారం

యల్లాప్రగడ సీతాకుమారి అభ్యుదయకథలు

యల్లాప్రగడ సీతాకుమారి అభ్యుదయకథలు ~ దేశంలో వచ్చిన ఉద్యమాలు కావచ్చు, సాహిత్యోద్యమాలు కావచ్చు కారణాలేమైనా కొందరు రచయిత్రులు విస్మృతులుగా మిగిలి పోతారు.అటువంటివారిలో స్త్రీజన సేవకురాలే కాక గుర్తించదగిన రచయిత్రి యల్లాప్రగడ సీతాకుమారి. యల్లాప్రగడ సీతాకుమారి అనగానే స్త్రీ విద్యా, వితంతు వివాహం, మహిళా స్వాతంత్ర్యం మొదలైన వాటిగురించి కృషిచేసిన సామాజిక సంస్కర్తగానో,శాసన సభ్యురాలిగానో గుర్తిస్తారు తప్ప రెండు నాటికలు,కవితా ఖండికలు సంపుటి,నేను- మా బాపు పుస్తకం , గోల్కొండ పత్రికలో సమకాలీన మహిళా సమస్యలపై రాసిన రచనలూ కాక అద్భుతమైన కథలు రాసిన రచయిత్రి అనే విషయం గుర్తురాదు. 1911 న బాపట్లలో జన్మించిన యెల్లాప్రగడ సీతాకుమారి సర్వోదయ కార్యకర్త ఐన వి.ఎల్. నారాయణరావుతో వివాహానంతరం హైదరాబాదు లోనే ఆమె జీవితం తెలంగాణా సాంస్కృతిక ఉద్యమాలతో మమేకమైంది. ఇవికాక 1968లో సీతాకుమారి సంకలనం చేసిన "మందారమాల" అనే వ్యాససంపుటి విశ్వవిద్యాలయ విద్యార్థులకు పఠనీయగ్రంథంగా ఉండేదనే విషయం అసలే తెలియదు. సీతాకుమారి రాసిన ఓ ఎనిమిది కథలు గురించి వివరంగా తెలుసుకుందాం. 1. కులమా?-ప్రేమా? (1-4-1933 ఆంధ్రపత్రిక ) శంపాలతా, మీర్జా ఎమ్మెస్సీ ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. కథంతా శంపాలత పాత్రగా ఉత్తమ పురుష లో సాగుతుంది. జాతీయోద్యమ ప్రభావం వలన కావచ్చు కథలో కులమత ప్రస్తావనకన్నా భారతీయతే ముఖ్యంగా కనిపిస్తుంది. ఒక సందర్భంలో శంపాలత,మీర్జాల మధ్య విగ్రహారాధన గురించిన చర్చలో 'మసీదులో నియమిత సమయంలో నమాజు చేస్తారెందుక'ని శంపా ప్రశ్నిస్తుంది.'పనీపాటా లేనివాళ్ళు మతాల గురించి వెక్కిరిస్తూ కూర్చుంటారు.మంచి ఆదర్శాలు ఏ మతంలో ఉన్నా స్వీకరించాలి' అంటాడు మీర్జా. విభిన్న మతాలకు చెందిన వారైనా ఒకరి మనోభావాలను కించపరచని సంయమనం కథలో స్పష్టీకరించటం ఉంటుంది. బ్రాహ్మణులలో చిన్నప్పుడు వివాహం చేస్తారు కదా నువ్వెందుకు వివాహం చేసుకోక చదువుకుంటున్నావ'న్న మీర్జా ప్రశ్నకు 'పురాణాలలో కూడా స్త్రీలు చదువుకున్నారు.నేను చదువుకున్నంతమాత్రాన నా మతం ఏమీ అయిపోదం'టుంది శంపా.శంపా పాత్రని అభ్యుదయ భావాలతో చిత్రీకరించింది రచయిత్రి టెన్నిస్ గురించిన మీర్జా ప్రశ్నకు పురాణాలలో బంగారు బంతితో ఆడే కందుక ఖేలనం గురించి చెప్పటంలో శంపా పురాణేతిహాసాలు బాగా చదువుకుందని తెలుస్తోంది. శంపా అనేక సందర్భాల్లో మతాంతర,కులాంతర వివాహాల గురించి పురాణం, ఇతిహాసాలలోంచి ఉదాహరణలు చెప్తుంది.శంపా ప్రాచీన సాహిత్యం బాగా చదవటమే కాక అందులోని మంచిని గ్రహించి జీవితానికి అన్వయించుకుంటుందనేది తెలుస్తుంది. శంపాలత తండ్రి అడ్వకేట్,తల్లి గృహిణి ఐనా మంచి చదువరి. మీర్జా తండ్రి ఉస్మాన్ ఝా డాక్టర్.ఇద్దరి తండ్రులు కార్పొరేషన్ సభ్యులు కావటాన పరిచయస్తులు. శంపాలత తండ్రి విదేశాలు తిరిగి వచ్చినవాడు కనుక వారి కుటుంబం చాంధసులు కాదు కానీ మతవిశ్వాసాలపట్ల గౌరవం ఉంది.తల్లికి ఆడవాళ్ళు బ్రహ్మచారిణులుగా ఉండటం ఇష్టం. శంపా వాళ్ళింట్లో మీర్జా భోజనం చేయటం ఆ కాలంలో కూడా శంపా కుటుంబంలో మతవివక్ష లేక పోవటాన్ని సూచిస్తుంది. శంపాలత,మీర్జాలు ఆకర్షితులౌతున్నారని తెలిసి శంపాతండ్రి ఉస్మాన్ ఝా దగ్గరకు వెళ్ళి పిల్లల వివాహ ప్రస్థావన తేవటం శంపాకుటుంబంలోని ఆధునిక భావజాలాన్ని రచయిత్రి వ్యక్తీకరించింది. తండ్రి సంబంధాలు చూసాడని మీర్జా కంగారు పడుతుంటే తండ్రిని వప్పించమని శంపా చెప్పినా. మీర్జా తండ్రికి ఎదురుచెప్పలేని పిరికివాడుగా ఉస్మాన్ ఝా ఒప్పుకోక పోవటంతో తండ్రి కోరికమేరకు మీర్జా వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడనీ,మీర్జా పాత్ర చిత్రణ చదువుతుంటే రచయిత్రి పై శరత్ దేవదాసు ప్రభావం ఉందేమో అనిపించింది. శంపాలత ఇంగ్లాండ్ వెళ్ళి డాక్టర్ ఆఫ్ సైన్స్ పరిశోధన చేసి మూడేళ్ల తర్వాత వచ్చి తల్లిద్వారా మీర్జా భార్య తనభర్త నిరాదరణ భరించలేక ఆత్మహత్య చేసుకుందనీ, మీర్జా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి ఒకరోజు మీర్జా ఇంటికి వెళ్తుంది. జీవకళ లేని మీర్జాని చూసి తల్లడిల్లి అతని ఒడిలో వాలిపోతుంది శంపాలత. ఆమెని చూసి ఉద్వేగంతో మీర్జా కళ్ళుమూస్తాడని సినిమాటిక్ గా ఆ పాత్రని ముగించారు. తల్లి కోరిక ననుసరించి శంపాలత బ్రహ్మచారిణి గా ఉండి తండ్రి ఏర్పాటు చేసిన హిందూముస్లిం లీగ్ పార్టీలో జాతి కుల మత భేదాలు లేని జాతీయోద్యమ స్ఫూర్తి తో హిందూముస్లిం ఐకమత్యానికి పాటుపడుతుంది అంటూ ఆనాటి జాతీయోద్యమ ప్రభావంతో ముగించింది రచయిత్రి. మొత్తంగా కథ చదువుతున్పంతసేపూ ఎనభై ఏళ్ళ క్రితం రాసిన ఈ కథ ఎంతో ఆధునికంగా రాయటమే కాకుండా శంపా పాత్రని ఎంత అభ్యుదయ భావాలతో తీర్చిందో రచయిత్రి యల్లాప్రగడ సీతాకుమారి అని ఆశ్చర్యం కలుగుతుంది. 2. హాస్పిటల్లో( 1-11-1937 గృహలక్ష్మి) హాస్పిటల్లో విజిటర్స్ రావటానికి కేటాయించిన గంట సమయంలో ఒక స్త్రీ మనోవేదనను చిత్రించిన కథ. అది స్త్రీల ఆస్పత్రి.బాలెంతల్ని చూడటానికి విజిటర్స్ రావటంతో కథమొదలౌతుంది.ఒక్క విజిటర్ కూడా తనకోసం లేని దౌర్భాగ్యురాలు. తన జీవితాన్ని దృశ్యాలు దృశ్యాలుగా ఆలోచించుకుంటుంది.చిన్నప్పుడే తల్లి చనిపోవడాన్ని, పన్నెండేళ్ళు ప్రాయంలో ఆమెని ఒక పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేసి,ఆ పిచ్చివాడి యవ్వనవతి ఐన చెల్లెల్ని అరవై ఏళ్ళ తన తండ్రి పెళ్ళిచేసుకోవడం, తర్వాత ఆ పిన్ని మరొకరితో వెళ్ళిపోవడం గుర్తు తెచ్చుకుంటుంది.ఆమె ఆ పిచ్చివాడితో బాధలుపడలేక విడాకులకు ప్రయత్నించి,బయటపడి చదువుకోవడం మరో దృశ్యం.తర్వాత ఆమె చదువుకు సాయంచేసిన వ్యక్తిని ప్రేమించటం, గర్భందాల్చిన తర్వాత అతను పెళ్ళికి భయపడటం మరొక దృశ్యంగా ఉత్తమ పురుష లో తనకథ మననం చేసుకుంటుంది. మళ్ళా ప్రస్థుత కాలానికి వచ్చి ఇప్పుడు పుట్టిన పాపని ఎలా పెంచాలని విచారిస్తుంటే సిస్టర్ వచ్చి ఏడుస్తున్నపాపకి పాలు ఇమ్మని ఆమె ఒడికి పాపని అందిస్తుంది. ఆ పసిపాప సంపెంగ పువ్వులాంటి చిట్టి నోటితో పాలకోసం తడుముకుని అందుకోవటం, ఆమె జీవితంలో అదే ఆనందమయ దివ్య క్షణం అంటూ ఆమె మనోవేదన స్వగతం ముగిస్తుంది .అంతలో విజిటర్స్ వెళ్ళపొమ్మని క్లోజింగ్ బెల్ తో కథ ముగిస్తుంది రచయిత్రి. ఈ కథలో సీతాకుమారి వెల్లడించిన అభిప్రాయాలు అధునాతనంగా ఉంటాయి.పిచ్చివాడికి విడాకులిచ్చి తిరిగి పెళ్ళిచేసుకోవాలనుకోవటాన్ని తండ్రి అప్రతిష్ట గా భావిస్తాడు.కానీ ఆ తండ్రి వృద్దాప్యంలో కన్నెపిల్లని పెళ్ళి చేసుకుంటే సంఘం వెలివేయదా అని ఆ పాత్ర ప్రశ్నిస్తుంది. ఆడముండని డబ్బు ఖర్చుపెట్టి చదివిస్తానా అనే తండ్రి తన కొడుకుని మాత్రం గుంటూరులో ఉంచి నెలనెలా డబ్బు పంపుతాడు,ఆ కొడుకు చదువుకు బదులు సంకటాలుతెచ్చుకున్నాడనీ అవి వదలటానికి రెండెకరాలుతరలిపోయాయని వ్యంగ్యంగా రచయిత్రి చెప్పటంలో ఆనాటి ఆడపిల్లల చదువు పట్ల గల వివక్ష ని వ్యక్తీకరించింది. ఆమె పాత్ర స్వగతం లో - " సంఘదురాచారాలకు సరియైన కష్టం జీవినులు,వ్యర్థజీవినులు ఇంకా ఎంతమంది వున్నారో? ఈ దేశంలో యీ బాల్యవివాహాలు,వృద్ధవివాహాలూ,యీ ఎదురువివాహాలూ యింతలో మనల్ని వదిలిపెట్టేలాలేవు "అని ఒకసారి అనుకుంటుంది. " నాలుగేళ్ల కిందట డైవోర్స్ బిల్లు కావాలనీ,వద్దనీ శాసనసభలో కొట్టుకున్నారు' అని చెప్తూ రచయిత్రి వ్యంగ్యంగా సభలో జరిగే ప్రహసనాల్ని బట్టబయలు చేస్తుంది.సీతాకుమారి నిజామాబాద్ జిల్లా బాన్స్ వాడ నియోజక వర్గం నుంచి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనసభ్యురాలు కావటం వలన స్త్రీసభ్యులు చాలా మంది శాసనసభలో వున్నాకానీ వాళ్ళేమీ చెప్పరు.ఎందుకంటే సౌఖ్యంగా వున్న జీవితాలు గల స్త్రీలు వాళ్ళు. వారేమీ డైవోర్స్ బిల్లు కావాలనో,వద్దనో చర్చ చేయరు.ముందు స్వరాజ్యం వస్తే తర్వాత చూసుకోవచ్చని చర్చని దాట వేస్తారు.అని విమర్శించ గలిగింది. విదేశాల్లో వధూవరులకు డాక్టరు సర్టిఫికెట్ వుంటే గానీ పెళ్ళి చేయరనీ,మనదేశంలో మాత్రం భార్యాభర్తల జీవితాల్ని కర్మ సిద్ధాంతం తోనూ వాళ్ళు రాతలతోనూ,గీతలతోను ముడిపెట్టేస్తారని రచయిత్రి తన మనసులో మాటని పాత్ర స్వగతం లో చెప్పిస్తారు. కథలోని స్త్రీపాత్రదౌర్భాగ్య స్థితికి సమాజంలో స్త్రీలే ఎటువంటి సలహాలు యిస్తారో రచయిత్రి ఎలా వివరిస్తారంటే -- రామా కృష్ణా అనుకుంటూ పడివుండు- ముసలమ్మనీతిబోధ సేవా సంస్థలో చేరి సంఘసేవ చేయు - సంస్కర్త బతికి ఎవర్ని వుద్ధరించను ఎందులోనన్నా పడి చావు- ఒక తల్లి సలహా మా యింట్లో వుండి మాకు వండి పెట్టి నీ కడుపు నింపుకో - రోగిష్టి యిల్లాలు. ఇవి చదువుతుంటే సమాజంలో మానవ స్వభావాలు ఆలోచనలూ ఇప్పటికీ ఇలాగే వున్నాయనే అనిపిస్తుంది. కథా,కథజరిగిన సమయం చిన్నదిగానే వున్నా కథలో చర్చించినవీ,ఆలోచించవలసినవీ అనంతంగా వున్నాయి. హైదరాబాద్ లో సీతాకుమారిగారు స్త్రీల కోసం "ఆంధ్ర సోదరీ సమాజము" స్థాపించారు.చిక్కడపల్లిలో ‘’ప్రమదావనం ‘’లో అనాధలకు, వితంతువులకు, భర్తలు వదిలేసిన భార్యలకు ఆశ్రయం కల్పించి ఆదుకొన్నారు. అంతేకాక నిజాం నిరంకుశ పాలనలో ‘’అక్కి రెడ్డి పల్లి ‘’ గ్రామం లో జరిగిన స్త్రీల అత్యాచారాలపై విచారణ జరిపేసంఘం లో సభ్యురాలయ్యారు .అత్యాచారం జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి స్త్రీలకు అండగా నిలిచారు సీతాకుమారి.బహుశా ఆమె పరిశీలనలోకి సంఘటనే కథగా మలిచి వుంటారు. 3.ఉత్తరాలు (గృహలక్ష్మి 01-04-1938) ఈ కథ చదివిన పాఠకుల హృదయాలను తాకేలా ఉంటుంది. శతాబ్దాల క్రితం నాటి ప్రేమికుల ఉత్తరాలు చదవటం అబ్బురం కదా! ఆనాడే అంత ఆలోచనాత్మకంగా రాసిన ఆ ఉత్తరాలు పాఠకుల ఆలోచనల్ని కూడా రగిలిస్తాయి. ఉత్తమపురుషలలోనే సాగిన ఈ కథలో ప్రకృతి ఆరాధకుడైన ఒకవ్యక్తి వసంతరుతువులో ఒక గుట్టమీద గతశతాబ్దంలో స్నేహితుడి తాతగారు నిర్మించిన మనోహరమైన దివ్యభవనంలో కొన్నిరోజులు గడిపి ఆ ప్రకృతి సౌందర్యంలో మమేకమౌదామని వస్తాడు . ఎన్నో గదులున్న ఆ భవనంలో స్నేహితుడు ఒక్కోసారి ఒక్కో గదిలో అతనికి వసతి ఏర్పాటు చేస్తాడు. ఆ ఏడాది 'ఆన్ట్ రోజు' గదిని యిస్తాడు అతను ఆ గదిలో ప్రవేశించగానే నిలువెత్తు అందమైన ఆన్ట్ రోజ్' -తైలవర్ణచిత్రం చూసి ప్రాచీన సాధ్వీశిరోమణిలను గుర్తుకు తెచ్చుకుంటాడు. ఆరాత్రి నిద్రపట్టక ఉత్తరమైనా రాసుకుందామని గోడలోపల డెస్క్ తెరచి కాగితం, కలం కోసం వెతుక్కుంటాడు. అక్కడ పాడైపోయిన ఈక కలం కనిపిస్తుంది. డెస్క్ మూసేయబోతే లోపలికి బంగారు సూది వంటి తాళం చెవి కనిపిస్తుంది. ఉత్సాహంగా డెస్క్ ని పరిశీలిస్తే ఒక రంధ్రం కనిపించి అందులో చెవి పెట్టగానే రహస్య సొరుగు తెరుచుకుంటుంది. అందులో పసుపుపచ్చ, గులాబీరంగుల ఉత్తరాలకట్టలు విలువైన పట్టుగుడ్డముక్కలో చుట్ట బడి ఉంటాయి. ఆశ్చర్యంగా అందులోని కొన్ని ఉత్తరాలు తీసి చదువుతాడు. ఒక ఉత్తరంలో --నువ్వుకోరినట్లు నీవురాసిన ఉత్తరాల్ని నీకు పంపిస్తున్నాను. నీభయం అవి బయట పడతాయనా సిగ్గుపడుతున్నావా. నేను అతి జాగ్రత్తగా దాచుకుంటాను ఎప్పుడైతే మనం ప్రేమించటానికి ఒప్పుకున్నామో అప్పుడు మధురసంగీతంలా,మలయానిలంలా మృదువుగా తాకే ఆప్రేమని మాటలుగా, వ్రాతలుగా ఒప్పుకోవాలి. నీ భయం నాకు అర్థం అవుతుంది. వాటిని కాల్చి బూడిద చేయాలనే భీరుత్వం తెలుసు.నీ ప్రశాంత జీవనాన్ని ఆశిస్తూ వేదనతో పంపిస్తున్నాను" అని ప్రేమికుడు రాస్తాడు. రెండవ ఉత్తరం --మిత్రమా నీవు నన్ను అర్థం చేసుకోలేదు.నేను నిన్ను ప్రేమించినందుకు విచారించను "అంటూ ఆక్ట్ రోజ్ రాసిన ఉత్తరంలోని వాక్యాలు ఆమె ఆంతర్యాన్ని,చింతనాత్మక వ్యక్తిత్వాన్ని వెల్లడిచేస్తాయి. ప్రతీమనిషికి మరణం అనివార్యం. ఎవరూ నా రహస్యసారుగు కనుక్కోలేరు. నామరణానంతరం కనుక్కున్నా మరణించిన వారి ప్రేమలేఖల్ని పురుషుడు కాల్చి బూడిద చేస్తాడు.అదే భార్య వున్నప్పుడైతే ఆమెని, ఆమె ప్రేమించిన వానికై పగ సాధిస్తారు.అదేపురుష హృదయం . అని ఈసందర్భంలో పురుషుల మానసిక దౌర్బల్యాన్ని వెల్లడించింది రచయిత్రి. "ఏ స్త్రీకి అయినా తనని ఆరాధించే ప్రియులు రాసిన ప్రేమలేఖలు తమ సౌందర్యానికి, ఠీవికీ , చాకచక్యానికీ,ఆకర్షణకీ యోగ్యతా పత్రాలు. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటుంది." అని ఆక్ట్ రోజ్ ముగిస్తుంది. ఆ వుత్తరాలు చదివిన తర్వాత అతనికి ఫొటో లోని ఆక్ట్ రోజ్ ముఖం స్వార్థం,కపటం, ద్వంద్వత్వం గోచరించాయి అని రచయిత్రి ముగించటంలో పురుషులమనసులోని ద్వంద్వ వైఖరినీ, మనస్తత్వాన్ని స్పష్టపరిచింది. 4.కలిసి జీవించుదాం: (యువ 01-07-1963) రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా అరుణాదేవి ఉపన్యాసాన్ని మదన్ బాబు వినటంతో కథ మొదలౌతుంది. అరుణ తండ్రి, మదన్ బాబు తండ్రి సహాధ్యాయులు.కానీ అరుణ తండ్రి జాతీయోద్యమంలో పాల్గొని, సమాజం పట్ల అంకిత భావం కలవాడు.అవేభావాల్ని పుణికి పుచ్చు కొన్న అరుణ వివాహం చేసుకోకుండా సమాజసేవకు అంకితం మౌతుంది. మదన్ తండ్రి వ్యాపారం చేసి ధనం సంపాదిస్తాడు. మదవ్ ధనంతో పాటూ పేరు కూడా పొందటానికి లలిత కళా మందిరాన్ని స్థాపించుతాడు. మదన్ కు మేధావులైన స్త్రీలంటే చిన్న చూపు. అరుణని తన లలిత కళాభవనంకి తీసుకెళ్ళి తనగొప్పతనాన్ని ప్రదర్శించబోతాడు మదన్ లలిత కళా సంఘంలో నృత్యమందిరం,గాన మందిరం,చూసాక చిత్ర కళామందిరానికి వెళ్తారు. అక్కడ సౌందర్య ప్రధానమైనవి కాక సమాజానికి సందేశమిచ్చే చిత్రాలు చూసిన అరుణ అవి వేసిన కృష్ణ భూషణ్ తో ఆత్మీయంగా మాట్లాడుతుంది. తర్వాత కూడా అరుణ మరోసారి కృష్ణభూషణ్ ని కలవటానికి వెళ్ళి, గానమందిరం ఇంచార్జి శచీదేవి గానాన్ని వింటుంది. అంత ప్రతిభ కలిగిన గాయకురాలిని ఉపయోగించుకోవటం వీరికి తెలియదు అనుకుంటుంది మదన్ తన లలిత కళా సంఘం అభివృద్ధికి తనతో చేయికలపమని అరుణని కోరటం, అరుణ "ఈనాటి పరిస్థితుల్లో దేశం మీద ప్రత్యేక బాధ్యతలున్నాయి గదా! " అంటూ ఆ సంఘానికి జాతీయ కళా కేంద్రంగా పేరు మార్చి మదన్ తో కలిసి పనిచేయటానికి అంగీకరిస్తుంది. చివరిలో శచిని 'శంకరా భరణాన్ని కట్టి పెట్టి దేశ భక్తి గీతం పాడమని ' మదన్ అనటంలో కథని ముగిస్తుంది రచయిత్రి. ఇందులో ఆనాటి జాతీయోద్యమానంతర పరిస్థితులు, జాతీయ భావాలు కలవారి ఆలోచనలు స్పష్టమాతాయి. ఏ కళగానీ అది దేశానికి ఉపయోగ కరంగా ఉండాలనే స్ఫూర్తిని రగిలిస్తాయి. చిత్రకళ, సంగీత, నృత్యం, కవిత్వమూ ఈ కళలన్నింటి ద్వారా ప్రజల్లో జాతీయ భావాలను ప్రజ్వలింప జేసి కళ కళ కోసంకాదనీ, దేశం కోసం అనే నినాదాన్ని ఈకథలో రచయిత్రి వ్యక్తీకరించింది. రవివర్మ, బాపిరాజు చిత్రాలలోని భావ కుశలత కృష్ణ భూషణ్ చిత్రాల్లో ఉన్నాయని, అయితే రాజులకోసమూ, జమిందార్ల కోసమూ కాకుండా సజీవమైన గ్రామీణ జీవితాల్ని, పచ్చని గ్రామాల్ని,శ్రమ జీవితపు విలువల్నీ ప్రదర్శించినపుడు ప్రజాజీవితానికి దగ్గరౌతాయనే అభిప్రాయం పాత్రల ద్వారా వెలిబుచ్చటం రచయిత్రికి సమాజం పట్ల, కళల పట్లా గల స్పష్టమైన అంకిత భావం తెలుస్తోంది.సమాజసేవచేసే మహిళల పట్ల,చదువుకున్న మహిళల పట్ల సమాజంలో కొందరు పురుషులమనోభావాలను మదన్ ద్వారా వ్యక్తపరిచారు రచయిత్రి. కథలో సున్నితమైన ప్రేమ భావనలను ధృఢమైన జాతీయభావంతో నడపటం గమనించ వలసిన అంశం. 5.వెన్నెల్లో : ( గృహలక్ష్మి 01-10-1938) అవ్వేళ ఆశ్వయుజ పౌర్ణమి అంటూ మొదలై వెన్నెలలోని ప్రకృతి సౌందర్యాన్ని కథలో అంచెలంచెలుగా వర్ణనాత్మకంగా నడపటంలో రచయిత్రి వర్ణనాత్మక శైలి ఈ కథలో స్పష్టంగా తెలుస్తుంది . వెన్నెలను ఆస్వాదిస్తూ ఉన్న యువజంటలో విద్యావంతురాలైన విజయలక్ష్మి ధనవంతుల గారాబుబిడ్డ. విశ్వనాధం లా చదివి తదనంతరం ఏమి చేయాలని ఆలోచిస్తున్నవాడు. వెన్నెల విహారానంతరం చాలా రాత్రి అయిపోవటంలో తిరుగు ప్రయాణంలో వివాహప్రస్తావన తెస్తాడు విశ్వనాధం. 'తొందరపడి పెళ్ళి చేసుకున్న దంపతులెందరో అభిప్రాయబేధాలతో, అవిశ్వాసాలతో, అంతః కలహాలతో అసహ్యంగా రోజులు గడుపుతున్నారు. పెళ్ళయ్యాక మగవారు భార్యపై నిరాదరణ చూపటం ప్రారంభిస్తారని ఎన్ని కథల్లోనో చదివాం " విజయ అంటూనే కారునడుపుతుంది. విశ్వనాథం తన ప్రేమని విజయ సందేహిస్తున్నందుకు బాధ పడతాడు అంతలో కారుకి ప్రమాదం జరిగి టాపులేని కారులో ప్రయాణిస్తున్న విజయ ఎగిరిపడటంతో చెయ్యి దెబ్బతినటం విశ్వనాధం చిన్నగాయలతో బతికిబయటపడి ఆమెను హాస్పటల్ లో చేర్చుతాడు. మెలకువ వచ్చిన విజయ తనకు సేవచేస్తున్న విశ్వనాధం ఈ పరిస్థితుల్లోనూ ఇప్పటికీ తనకు తోడుగా ఉంటున్నందుకు విశ్వనాధంకి దగ్గరౌతుంది. ఈ కథలో కథాంశం తక్కువే అయినా వెన్నెల సౌందర్యవర్ణనతో మొదలుపెట్టి కారుతో పాటూ చంద్రుడినీ పయనింపచేసి ముగింపు కూడా చంద్రుడు సంతృప్తిగా పడమర వైపు దిగిపోవడంతో ముగించటం రచయిత్రి రసహృదయం తెలుపుతూ మనోజ్ఞమైన ప్రేమకథగా తీర్చింది ' శరన్నవరాత్రి వెన్నెల ఏడాదికొక్కసారి దొరుకుతుంది. కానీ ఇంట్లోనే మురిగి పోయే ఆడవాళ్ళు దీనిని అనుభవించలేరు' అని ఒక సందర్భంలో రచయిత్రి వ్యక్తపరిచినప్పుడు స్త్రీల చాకిరిపట్ల రచయిత్రికి గల వేదన తెలుస్తుంది - 'అసలీ వెన్నెల ముందు ఎలక్ట్రిక్ షాక్ లా బాధ కలిగిస్తుంది సురాపానంలా మత్తెక్కిస్తుంది. చివరికి వీణా గానంలాగ మనసుని కరిగించేస్తుంది' కథంతా వెన్నెల గురించే నడిపిన ఈ కథలో రచయిత్రి రసాస్వాదనలో పాఠకులూ మునిగిపోతారు. 6.పునిస్త్రీపునర్వివాహం :( గృహలక్ష్మి 4-12-1937) ఈ కథ రచయిత్రి ఉత్తమపురుషలో రాసింది . సుధ,మధు సహాధ్యాయులు సుధా డాక్టరు పరీక్షకి చదువుతుంది.సుధకి ఆమెతండ్రి డాక్టరీ చదువుతోన్న విధూశేఖరంకి ఇచ్చి పెళ్ళిచేస్తాడు కట్నం రెండువేలు సమయానికి సమకూరనందున పొలం అమ్మి ఇస్తానని మధుతండ్రి చెప్తాడు. కానీ మధుకి ఆస్తి లేదని తెలిసి పెళ్ళివారు కోపంతో హైదరాబాద్ వెళ్ళిపోతారు. దాంతో పుట్టింట్లో ఉండి పోయిన మధు ఒకబాలికా పాఠశాలలో ఉద్యోగంలో చేరి తల్లితండ్రితో కలిసి ఉంటుంది. సుధా డాక్టరీ పూర్తి చేసి విధూని చేసుకుందని తెలిసి మధు బాధపడుతుంది.కానీ సుధతో తను వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పేసరికి సుధ "నీకు పెళ్ళయ్యిందిగా " అనిప్రశ్నిస్తుంది. మధు అప్పుడు జరిగిన విషయం అంతా తెలియజేస్తుంది . "విధు మంచివాడే. నువ్వు పునర్వివాహం చేసుకునేందుకు విధూ నుండి నీకు అనుమతి పత్రం తెస్తానం"టుంది సుధ . ఒకరోజు ముగ్గురు కలుసుకోవటం విధుశేఖరం నుండి అనుమతి పత్రం తీసుకొని భగీరధని మధువివాహం చేసుకుంటుంది. పత్రికలన్నీ 'పునిస్త్రీ పునర్వివాహాన్ని చేసుకున్న ప్రథమ ఆంధ్రస్త్రీ "అనీ వారిది ఆదర్శ వివాహంగా రాస్తాయి. ఈ కథలో ధనవంతుల ఆడపిల్లలకే చదువు అందుబాటులో ఉంటుంది.కానీ మధ్యతరగతి ఆడపిల్లల వివాహ సమస్య ,కట్నాల వలన కుటుంబాలు ఛిద్రం అయిపోతున్న పరిస్థితిని తెలియ జేస్తుంది రచయిత్రి. పెళ్ళయిన మగవాడికి సమాజంలో మరో పెళ్ళికి అభ్యంతరం లేకపోవటం,పక్షపాతపు సంఘం 'ఫలాని వాళ్ళు అమ్మాయిని మగడు వదిలి పెట్టిపోయాడని వేలెత్తి చూపుతోందనేది కథలో ప్రస్తావించారు. భర్తలచే తిరస్కరింపబడిన అభాగినులు ఆత్మహత్యలకైనా పాల్పడతారు లేదా ఆ భర్త దగ్గరే దాసిలా ఉండాలనుకుంటారనేది కథాక్రమంలో రచయిత్రి వివరించటం ఆనాటి మహిళలపట్ల సమాజానికి గల వివక్ష వ్యక్త మౌతుంది. 7.ఈ రాథేనా (భారతి 01-07-1938) రచయిత అయిన రాజారావు అఖిలాంధ్ర కథక సమ్మేళనానికి కథ రాయటానికి తన యింటి ముందు గ్రౌండులోకూర్చుంటాడు. అతని ముందు ఒక అమ్మాయి దుఃఖిస్తూ నిలబడుతుంది . ఆమెని ప్రశ్నిస్తే తనను ఒక ముసలివాని కిచ్చి పెళ్లి చేస్తున్నారని పారిపోయివచ్చాననీ, కొంతకాలం ఆశ్రయం కోరుతుంది. ఆమెని తీసుకుని కాచిగూడాలో బండెక్కి షాద్ నగర్ తీసుకెళ్ళి ఇల్లుచూసి ఆమెను ఉంచి అవసర మైన వస్తువులు కొని యిస్తాడు . ఇద్దరి మాటా మంతీలలో రాజారావు "తనకి వివాహం కాలేదని,మేనమామ కూతుర్ని చేసుకోడం ఇష్టం లేక చదువు కున్న అమ్మాయికోసం చూస్తున్నాననీ " చెప్తాడు. ఆమె తన పేరు రాధ అని చెప్పి రాజారావుని కూడా సాయంగా ఉండమంటుంది . రెండు మూడు రోజులు కలిసి కబుర్లు కలబోసుకున్నాక రాజారావు వివాహం ప్రసక్తి తీసుకువస్తాడు. తీరా ఆమె తన మేనమామ కూతురు రాధేనని తెలిసి సంభ్రమపడతాడు. ఇది సినీమాటిక్ గా ఉన్నా కథ నడిపిన తీరు, రాధ తన బావమనసును మార్చి,తన వ్యక్తిత్వాన్ని తీర్చుకున్న విధానం, చాలా సహజంగా కథ నడుస్తుంది . 8.ఆ వీణేనా (ఆంధ్రకేసరి 1940) జ్యోతి,ప్రసాదం అన్యోన్యదంపతులు. జ్యోతి వీణానాదంతో పరవశిస్తూ అయిదేళ్ళు గడిచి పోతాయి.అనుకోని పరిస్థితులవల్ల మశూచి సోకి జ్యోతి అంధురాలై పోతుంది. బంధు మిత్రుల ప్రోద్బలంతో జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టి తిరిగి పెళ్ళి చేసుకుంటాడు ప్రసాదం. జ్యోతి తన దురవస్థకు కునారిల్లుతూ అంధురాలైనా తన వీణా, తన పాట తనను వదల లేదని తెలుసు కొని వాటితో బాధని మరుస్తుంది. ఆమె గానము, వీణానాదం ఆకర్షించి అనేకమంది నేర్చుకోవడానికి వస్తారు. తర్వాత ఆమె సంగీతవిద్య ఆకాశవాణి ద్వారా ప్రసారమై రాష్ట్రం అంతటానే కాక దేశం నలుమూలల నుండి ఆమెకు ఆహ్వానాలు వస్తుంటాయి- ఏ అభిరుచి లేని పద్మని పెళ్లిచేసుకున్న ప్రసాదం ఒకరోజు రేడియోలో ఆమె వీణానాదం విని పశ్చాత్తాపం పొందుతాడు. ఇదంతా మామూలు కథే. అయితే సీతాకుమారి ఈ కథాగమనంలో భర్తలచే విడిచివేయబడిన మహిళల గురించి, నిరాధారమైన జీవితం గడపవలసిన పరిస్థితుల గురించి, సమాజంలో అనాకారిగా మారిన స్త్రీలపై చూపే వివక్షని, మానవ మనస్తత్వాల్ని, మగవారి స్వార్థపుటాలోచనల్నీ బట్టబయలు చేసి చూపింది. ఈ కథలోని భాష ఒకింత శిష్టవ్యవహారికంలో రాసింది. మొత్తంగా సీతాకుమారి కథలను తరచి చూస్తే కథానాయికలు విద్యావంతులు, సమాజంపట్ల, మానవ మనస్తత్వాలపట్ల, కుటుంబ జీవనం, పట్ల స్పష్టమైన అభిప్రాయంగల వారిగా అక్షరీకరించారు రచయిత్రి. అంతే కాక కథలన్నీ అభ్యుదయ దృక్పథం కలిగినవిగా ఉండడం స్పష్టమౌతుంది. కథలలో సమకాలీన పరిస్థితులు, సమాజం తీరు తెన్నుల గూర్చిన చర్చలు అర్థవంతంగా ఉంటాయి.ప్రతీకథనీ చక్కని ప్రకృతి వర్ణనలతో ప్రారంభించటం ఒక విశేషం. ధైర్యవంతులు ఆనాటి సమాజానికి ఎంతో అవసరమని తన కథల్లో రచయిత్రి తెలిపారు. కథలన్నీ కూడా స్త్రీ అభ్యుదయాన్ని కాంక్షించేవే. సీతాకుమారి కథలన్నీ పూర్తిగా ప్రామాణిక భాషలో సాగాయి. అధునాతన కథాంశాలతో సుమారు ఎనభై ఏళ్ళ కిందటే చక్కని కథలు రాసిన యల్లాప్రగడ సీతాకుమారి తెలుగు కథారచయిత్రిగా ఎన్నదగినది. అధునాతన, అభ్యుదయ భావాలు,సంస్కరణ దృష్టి కలిగిన రచయిత్రి సీతాకుమారి. డెబ్భై అయిదు సంవత్సరాలు జీవించిన యల్లాప్రగడ సీతాకుమారిగారు 2-1-1986న మరణించారు.