5, జులై 2024, శుక్రవారం
రంగు వెలిసిన సిత్రాలు -4
రంగువెలసిన చిత్రం(ఓట్ల పండుగ పదనిసలు)
4 వ భాగం
కొత్తరంగుల తురాయిని
నెత్తిన మొలిపించుకుని
వాహనాలన్నీ కొత్తపెళ్ళికొడుకులై కులుకు తున్నాయి
వాహనచోదకులూ పదాతి దళాలు
జండాధారులై
కళ్ళనిండా కాంతులు వెలిగించుకుని
రంగులపతాకాలనీడల్లో సేదతీరుతున్నారు
అయిదేళ్ళకోసారికాకుండా
ప్రతి ఏడాది పండగకోసం కలలు కంటూ
ఆలోచనలనిండా ఆశలపందిళ్ళు వేస్తూ
ఆలుబిడ్డల కళ్ళల్లో మతాబూలు పూయిస్తున్నారు
రోజంతా గొంతులు ఎలుగురాసిపోయేలా
రోడ్లనిండా జయజయాధ్వానాల్ని
పూలజల్లులుగా కురిపించి
సూర్యుడితోపాటు రోడ్లని కొలుస్తున్నారు
పగలంతా రాజకీయ ఆవేశాలతో రగిలి రగిలి
వేడెక్కిపోయిన గుండెల్ని చల్లబరిచేటందుకై
చేతిలో పడిన పైసల్ని
మత్తుదుకాణాల్లో కుదువపెట్టి
కళ్ళల్లో దీపాల్ని వెలిగించుకుని కాచుకున్న భార్యాబిడ్డలకు
ఎప్పటిలాగే జోగుతూవచ్చి మొండిచెయ్యి విసిరేస్తున్నారు
ఎన్నికలపండగలో నిరంతరదృశ్యం ఇదే ఇదే!
కొందరు భూతదయామయులు తెల్లారేసరికి
జొన్న లో నూకలో చేతిసంచిలో నింపుకొని పావురాలకు దాణా పెట్టేందుకు బయలెల్లినట్లు భుజాలకు మేనిఫెస్టోల సంచిని వేలాడేసి
వందిమాగధుల సహితులై వీధివీధీ తిరిగి
వాగ్ధానాలు దాణాల్ని దారిపొడవునా చల్లుతూ
మేతకోసం వెతికే అవసరం లేక
ఎగరటం మర్చిపోయి
అంతస్తుల కిటికీల సందులోనో
ఆలయగోపురాల గూళ్ళల్లోనో తప్ప
పచ్చని చెట్లకొమ్మల గుబురుల్లో
వెచ్చని గూడు కట్టుకోవటం చాతకాక
జోగుతోన్న పావురాలైన జనాల్ని
ఇంకా ఇంకా
ఎదగడం చేతకాని వాళ్ళని చేసి
అవసరంలేని రాయితీలతో
మాటలమంత్రజలం చల్లుతున్నారు
రోజురోజుకూ బలం పుంజుకుంటూ
అనుయాయుల నీరాజనాలతో పరవశులౌతూ
ఆత్మస్తుతి,పరనిందలతో నిర్భీతిగా నిర్లజ్జగా
రెట్టించిన ఉత్సాహంతో కందిరీగలరొదలా
ఆవరణంతా శబ్దకాలుష్యంతో నింపుతున్నారు
ఎక్కిన పీఠం కదలకూడదనో
ఎక్కాల్సిన సింహాసనం అందుకోడానికో
ఏదైతేనేం
రెచ్చిపోతున్న పదవీ కాంక్షతో
ఊరిస్తున్న ఎన్నికలతో
వాతావరణమంతా పొగలాగ కమ్మి
ఆకాశమంతా ఎగురుతోన్న వాగ్ధానాలే వాగ్ధానాలు!
అవి ఆహ్లాదపరిచే సీతాకోకచిలుకలో
కుట్టిచంపే కందిరీగలో
అర్ధంకాని అయోమయంలో కూడా
జనసమూహం గుండెల్లో కలలేకలలు!!
• *. *
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి