5, జులై 2024, శుక్రవారం
రంగు వెలిసిన సిత్రాలు -8,9
దీర్ఘకవిత
8.వ.భాగం
సంకల్పితం కావచ్చు
అసంకల్పితమైనా కావచ్చు
ఏ పార్టీ ఎవరి ఓట్లను చీల్చుతుందో
ఏవేవి కూటములు కట్టి
ఉమ్మడి కుంపట్లు రాజేస్తాయో
ఏవేవి సొంతంగా చలికాచుకుంటూ
ప్రభుత్వ వంటల్ని వండి వార్చాలనుకుంటున్నాయో
ఏ ఆలింగనం మేలు కలిగిస్తుందో
దేన్ని దగ్గరకు తీస్తే
ధృతరాష్ట్ర కౌగిలి అవుతుందో
ప్రతిజండాకీ భయమే
అతుకులబొంతగా అన్నింటినీ కలిపి కుట్టి
జండాగా ఎగరేస్తే
ఏ వ్యతిరేకగాలో బలంగా వీస్తే
కుట్లను తెంపి ఎన్ని పీలికలు చేస్తుందో
ఏమిటో అన్నీ అనుమానాలే
చేతులు కలిపి మానవహారాల్ని కడుతున్నా
ఏ అంగీ కింద ఏ చురకత్తి దాగుందో
దొంగచూపుల సిసికెమేరాల నిత్యపహారాలే!
ఇప్పుడిక
నాయకమ్మన్యుల ఇళ్ళల్లోని కళ్ళన్నీ
వత్తులు వేసుకుని వెలిగే దీపాలౌతుంటాయి
వెన్నుపూస లోతుల్లోంచి చలిపాము
సర్రున పాకినట్లు జలదరింపులు
బయటికి డాంబికాల మాటల్తో
ప్రజలపై వరాలజల్లులు కురిపిస్తున్నా
ఏమూలో మనసులో తేలుకొండిలా
ఓటర్ల మీద అనుమానపు త్రాచు
భయం ఉండుండి పడగవిప్పుతూనే ఉంది
దుర్భిణీ వేసుకు వెతుకుతున్నా
చీకటి మూలాల మాటున
గూడుపుఠాణీ అనుమానాలే
భజనపరులు చుట్టూ చేరి
జయనామ జపాలు చేస్తున్నా
ఎక్కడో ఏమూలో
తేలుకొండిలా లేస్తున్న భయం భయం!!
9వ.భాగం
బలుపో వాపో
బయట పడని ఎదుటివాడి కదనోత్సాహం
కత్తిలా గుండెల్లో దిగుతూనే ఉంటుంది
అనుమాన భూతం ఆవహించిన కళ్ళకు
వాళ్ళనీడే వాళ్ళను భయపెడుతోంది
చలువ గదిలో కూర్చున్నా
నుదుటిమీద చెమటచుక్కలు మొలుస్తుంటాయ్
అయినా తప్పదు మరి
పెదాలపైపూత నవ్వులు
ఛాలెంజులూ పందేలు
మీసాల మెలివేతలూ
తొడకొట్టుడు పంతాలు
తమతమ గజబలాల ప్రదర్శనలు
అశ్వాలతో కవాతులూ
చదరంగం బల్లమీదే కాదు
ప్రాపు కోరే వందిమాగధ సౌరంభాలతో
ఎవరికివారు ఎన్నికల కదనరంగాన్ని
కబ్జా చేసే సవాలక్ష ప్రయత్నాలు
ఎన్నికల్లో తప్పదు కాక తప్పదు కదా
సామాన్యులకు మాత్రం
ఎదురుచూసి ఎదురు చూసి
కంటిదీపం కొడిగడ్తుంటే
పగిలిన స్వప్నాలను చిరుగులకొంగులో
మూటకట్టుకోక తప్పటం లేదు
ఎంత జాగ్రత్తగా కట్టాలనుకున్నా
రాలిపోతున్న స్వప్నశకలాలు
గుండెల్ని ఛిద్రం చేస్తున్నా ఏదో చిగురాశ
రేపో మాపో పేదల్ని అక్కున చేర్చుకునే
దయార్ద్ర మారాజు అందలం ఎక్కుతాడని
కళ్ళదీపాల్ని ఆశలతో ఎగదోస్తూ
ఇంటినిండా వెలుగులు పరిచి
ఆరిపోకుండా నమ్మకాన్ని అడ్డుగా చేర్చి
ఏరోజు కారోజు
ఛిద్రమౌతున్న కలల్ని కూడగట్టుకుంటూ
అవసరమైనప్పుడు జైకొడుతూ
భద్రజీవితాల్ని కలగంటూ.....కలగంటూ...
మాన్యులు కాని సామాన్యులు!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి