14, అక్టోబర్ 2026, బుధవారం
నడక దారిలో -70
నడక దారిలో -70
వీర్రాజుగారు కొంచెం తేరుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నా ఆపరేషన్ చేసిన దగ్గర ఇంకా పూర్తిగా పచ్చి తగ్గనందువలన స్నానం చేయటంలేదు.రోజూ రెండుపూటలా ఒళ్ళు తుడుస్తున్నాను.
వాకర్ ఉన్నాసరే తనకి తాను నడవటానికి భయపడుతున్నారు.దానికి తోడు హాస్పిటల్ లో చాలా మందులు రాసారు.పూటపూటకీ అరడజను పైగా మందుబిళ్ళలు మింగి నోరంతా చేదైపోయిందని చికాకు, ఇబ్బంది పడుతుంటే పటికబెల్లంముక్కో,ఎండుఖర్జూరమో చప్పరించమంటూ ఇచ్చేదాన్ని.ఏంటీబయోటిక్స్ ఇంకా వాడుతున్నందున పొట్టలో గాభరాగా ఉందంటే బార్లీనీళ్ళు,కొబ్బరినీళ్ళు,రాగిజావ ,మజ్జిగ వంటివి ఇస్తున్నాము.
బాగానే వున్నారనుకునే సరికి రెండురోజులుగా మోషన్ కావటం లేదని చికాకు పడటం మొదలుపెట్టారు.మందులు ఎక్కువ వేసుకోవటం వలన మలబద్ధకం ఏర్పడినట్లు వుంది.ఆయనకు ఇష్టమైన రీతిలోనే ఆహారం తయారుచేయటం వలన బాగానే తింటున్నారు.జావలూ, బార్లీ నీళ్ళు తాగుతున్నారు.
ఆఖరుకు మూడోరోజు వుదయమే మంచంమీద పడుకొని వుండగా మోషన్అయింది. అపుడు నేను డైపర్ తీసి క్లీన్ చేసి పక్కన కుర్చీలో కూర్చోబెట్టి పక్కబట్టలన్నీ మార్చాను.తర్వాత వాష్ రూమ్ కి వాకర్ తో నడిపించి తీసుకువెళ్ళి వేడినీళ్ళతో శుభ్రంగా స్నానం చేయించినట్లుగానే కడిగి బట్టలు మార్చి రూముకు తీసుకు వచ్చాను.మధ్యాహ్నం మామూలుగానే భోంచేసారు.హాల్లో కాసేపు కూర్చుంటానని అంటే పల్లవీ, నేను తీసుకు వెళ్ళాం.
వరుసగా బాల్య మిత్రులు ఇద్దరు ప్రకాశరావుల తో, సత్యనారాయణతో చాలా సేపు మాట్లాడారు.
'సుభద్రా,పల్లవీ చాలా సేవ చేస్తున్నారు 'అని చెప్తుంటే కోప్పడ్డాను."అవన్నీ ఎందుకు చెప్పటం .ఈ రోజు మీరు తేలికగానే వున్నారు.మరోవారం అవుతే మీకు మీరు నడిచి వెళ్ళగలుగుతారు" అన్నాను.భోజనం తర్వాత మళ్ళా బెడ్ రూముకు వచ్చి రెస్ట్ తీసుకున్నారు.ఏదో మాటలు సందర్భంలో " చిట్టి ( చిన్నమరిది) యూ.ఎస్ నుండి ఈరోజే కదా వస్తానన్నాడు.వచ్చే వుంటారా"అని అడిగారు."ఉదయం వచ్చివుంటారు.జెట్ లాగ్ వుంటుంది కదా బహుశా సాయంత్రం వస్తారు " అన్నాను.
నాలుగింటికి ఎప్పట్లాగే లేచి రాగిజావ తాగి హాల్లో కూచుంటానంటే పల్లవీ,నేనూ సాయంగా వుంటే వాకర్ తో నడుచుకుంటూ వచ్చారు.కాసేపు టీవీ చూసి శంకరంకి ఫోన్ కనెక్ట్ చేయమని అడిగి 'మాట్లాడతాను' అంటే నా ఫోన్ లో కనెక్ట్ చేసి ఇచ్చాను.చాలా సేపు మాట్లాడారు.అప్పుడు కూడా
మా సేవల గురించి చెప్పబోతే ఆపాను.'మరో వారంరోజుల్లో బాగానే నడవగలను ' అని ఆశావాహంగా మాట్లాడారు.కాసేపు అయ్యాక బెడ్రూం
కి వెళ్తానంటే తీసుకు వెళ్ళాము .అయిదున్నర దాటాక హాల్లో కూర్చుంటానని అన్నారు. ఆరు అయినా తర్వాత వెళ్దురుగాని మరికాసేపు విశ్రాంతి గా పడుకోమని అన్నాము.కానీ మొండిగా నేనే వెళ్తానని లేవబోయారు.సరేనని లేపిన తర్వాత పట్టుకోవద్దని అంటున్నా పల్లవి ఒకవైపు,నేను ఒకవైపు వున్నాము .హాల్ వైపుకు నాలుగు అడుగులు వేసేసరికి ఆయనకు ఒళ్ళంతా చెమట్లు పడుతుండటం గమనించి ఆపబోయాను.కానీ మొండిగా మరో నాలుగు అడుగులు వేసి హాల్ లోకి వెళ్ళబోయేసరికి మూత్రవిసర్జన అయిపోయి కుప్ప కూలిపోయారు.ఆషీని కూడా పిలిచి ముగ్గురం కలిసి లేపలేక పక్కింటి సతీష్ ని పిలవమన్నాము.అందరూ సాయం పట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ మీద కాసేపు కూర్చోబెట్టి తిరిగి మంచంమీదకు చేర్చారు.అప్పటికే స్పృహ లేనట్లుగా అయ్యారు. డా.సూర్యప్రకాష్ గారికి పల్లవి ఫోన్ చేసింది.ఆయన అంబులెన్స్ కి ఫోన్ చేసారు.బిల్డింగ్లో వారు కొందరు వచ్చారు.పైన ఒక మెడికో వచ్చింది సిపిఆర్ చేసింది.పల్స్ వీక్ అయిపోతుంది అంది.అంతలో అంబులెన్స్, డాక్టర్ వచ్చి చూసి మాసివ్ హార్ట్ ఎటాక్ అని ప్రాణం లేదని చెప్పి వెళ్ళిపోయారు.నాకు మతిపోయినట్లైంది.ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్న వ్యక్తికి ఏమైంది అర్థం కాలేదు.
ఆషీ నా ఫోన్ తీసుకుని గ్రూప్స్ లో విషయం పెట్టింది.ఒక్కొక్కరే వస్తున్నారు.సూర్యప్రకాష్ ,కామేశ్వరిగారు వచ్చినప్పుడు మాత్రం దుఃఖం ఆపుకోలేకపోయాను." ఏమీ కష్టపడకుండా వెళ్ళిపోయారు.మీరు బాధపడితే మంచిదికాదంటూ' ఓదార్చారు.అప్పుడే చిట్టి,ఉషా వచ్చారు.'ఉదయమే ఫ్లైట్ దిగాము.మధ్యాహ్నం రావాలనుకునికూడా పడుకుంటారేమో సాయంత్రం వెళ్ళొచ్చు అనుకున్నాము.వచ్చుంటే బాగుండేది ప్రాణం వుండగా మాట్లాడేవారమ'ని బాధ పడ్డారు.
అప్పటికే రాత్రి అయిందని ఐస్ బాక్స్ తెప్పించారు.ఇంట్లో పెట్టటానికి అపార్ట్మెంట్ వాళ్ళు అంగీకరించి లేదేమో మరి తెలియదు.కానీ దానిని పైకి తీసుకురావటానికి కుదరలేదని మాపార్కింగ్ లాట్ లో పెట్టి ఇంట్లోనుంచి నానుండి యాభై ఒక్క ఏళ్ళ సాహచర్యం గల వీర్రాజు గారిని తీసుకు వెళ్ళిపోయారు.
రాత్రే భారవీ,కవితావచ్చారు. కళ్యాణ్, అనురాగ్ రాత్రికి బయలుదేరి తెల్లారే సరికి వచ్చారు.
చిట్టీ, ఉషా ఇక్కడే వుండిపోయారు.పొనుగోటి కృష్ణారెడ్డి వచ్చి అంత్యక్రియలు ఎలా చేయాలనుకుంటున్నారని అడిగాడు.
వీర్రాజుగారు మరణించారన్న దగ్గర నుంచి నా మనస్సులో సంఘర్షణ మొదలయ్యింది.అంత్యక్రియలు చేయటానికి కొడుకు లేడు,అల్లుడూ లేడు.మెడికల్ కాలేజీకే ఇవ్వాలనిపించింది.కానీ రాజమండ్రి వదిలి అరవై ఏళ్ళు దాటినా వీర్రాజుగారి మనసెప్పుడూ రాజమండ్రినీ,గోదావరినీ వదిలి రాలేదు. కులాచారం ప్రకారం పాతిపెట్టటమే అయినా దహనం చేసి గోదావరిలో నిమజ్జనం చేయాలనుకున్నాను. అందుకనే సంఘర్షణకు గురి అయ్యాను.
ఆఖరుకు మరిదిచిట్టి అంత్యక్రియలు చేయటానికి
అంగీకరించాడు .
కవులూ,రచయితలూ,ఆర్టిష్టులూ చాలామంది వచ్చారు.జనసాహితి మిత్రులంతా వచ్చారు.శీలావీర్రాజూ అమర్ రహె అంటూ అందరూ నినదిస్తూ తీసుకువెళ్ళారు.దహనంచేసేటప్పుడు కూడా ఆయన కవితలు చదువుతూ నినాదాలు చేసారుట.అనారోగ్యం వలన శారీరకంగా ఎక్కువ
రోజులు బాధపడకుండా బంధువులూ,మిత్రులూ సమక్షంలో మహారాజు లాగే వెళ్ళిపోయారు.
కుందుర్తి కవిత సింగపూర్ నుండి వచ్చింది. ఫ్రీవర్స్ ఫ్రంట్ కుందుర్తి శతజయంతి పురస్కారాలు వీర్రాజు అంకుల్ ఉన్నప్పుడు చేయకుండా నేనే వాయిదా వేసాను అని చాలా దుఃఖించింది.
వీర్రాజుగారిదే కాక నాదీ అదే అభీష్టం కనుక ఆ ప్రకారంగానే పూజలు ఏవీ పెట్టుకోలేదు.ఆ రోజునుండి ప్రతీ ప్రింటెడ్, అంతర్జాల పత్రికలన్నీ వీర్రాజుగారి గురించి అద్భుతమైన ఆత్మీయ నివాళి వ్యాసాలు ప్రచురించటం నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది."మనను ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు.మనంపోతే ఒక చిన్న వార్త మాత్రమే వస్తుందేమో" అని వీర్రాజుగారు అనేవారు.అటువంటిది ఇంత గొప్ప నివాళి అందుకున్నారు.
వరవరరావుగారు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడటమే కాకుండా వ్యాసం రాసారు.
స్వాతి బలరాంగారు ఫోన్ చేసి స్వాతిని ప్రారంభించటంలో వీర్రాజుగారి ముఖ్యపాత్ర గురించే చాలాసేపు మాట్లాడి ఆయన నా గురువు అని వాపోయారు.అంతేకాకుండా యాభై ఏళ్ళక్రితం నాటి ఆర్థికపరిస్థితులలో కూడా తనకు చేదోడువాదోడుగా వీర్రాజుగారు వుండటాన్ని బలరాం గుర్తుచేసుకుని నాకు లక్షన్నర రూపాయలు పంపుతానని అన్నారు.కానీ నేను రిటైర్డ్ ప్రభుత్వ పెన్షన్ అందుకుంటున్నాననీ, పల్లవి సాఫ్ట్వేర్ వుద్యోగం చేసిందనీ మాకు ఆర్థికంగా ఇప్పుడు లోటు ఏమీలేదని గౌరవంగా చెప్పి డబ్బు పంపవద్దని కోరాను. "సరే మీ అడ్రస్ పంపండి పత్రిక పంపుతాను" అన్నారు. స్వాతిలో ప్రచురిస్తోన్న అసభ్యమైన సినీతారల చిత్రాలూ,సరసమైన కథలూ చూసి పత్రిక పంపవద్దని బలరాంగారికి వీర్రాజుగారు అప్పట్లో వుత్తరం రాసారు.ఆ విధంగా సుమారు గత మూడు దశాబ్దాలకు పైగా కాంప్లిమెంటరీ కాపీ స్వాతి పత్రిక మాకు పంపటం ఆగిపోయింది . ఇప్పుడు మళ్ళా పంపసాగారు.
ఇంట్లో తిరుగుతూ,గలగల మాట్లాడకపోయినా ఇల్లంతా చిన్నబోయింది.కళ్యాణ్, అనురాగ్ ,కృష్ణ కుటుంబం,చిట్టీవాళ్ళూ,భారవీవాళ్ళూ, శ్రీదేవి వాళ్ళూ రోజూ వస్తూనే వున్నారు.మూడోరోజు శ్రీదేవి అందరికీ తానే భోజనం వండి తీసుకువచ్చింది.ఆ రోజున అందరూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు.అంతవరకూ దుఃఖం బయటపడకుండా వున్నా ఒక్క సారి ఇల్లు ఖాళీ అయిపోయే సరికి ముగ్గురం ఏడుపు ఆపుకోలేక ఒకరినొకరం హత్తుకుని దుఃఖించాం.
12 వతేదీ ఆదివారం కనుక ఆరోజు తాజ్ హోటల్ లో సంతాప సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని పల్లవి చేత బంధువులు అందరికీ ఫోన్ చేయించాను.మా పెద్దన్నయ్యకి చేస్తే మా వదిన ఫోన్ లో "ఇంట్లో పూజ చేయటం లేదా తక్కువలో అయిపోతుందనా హొటల్ లో చేసేస్తున్నారు " అంది.ఇంట్లో కంటే హొటల్ లో చేస్తే యింకా ఎక్కువౌతుంది అని తెలియదా.ఏమయితేనేం వాళ్ళు రాలేదు సరికదా కనీసం ఫోన్ లోనైనా నన్ను అన్నయ్య పలకరించలేదు. అదే విధంగా పెద్దాడబడుచు భర్తా ,పిల్లలూ కూడా అంతే.వీర్రాజుగారి తరపునా,మా నాన్నగారి తరపునా,పల్లవి అత్తగారి తరపునా దగ్గర బంధువులు కూడా ఎవ్వరూ రాలేదు,ఫోన్ లో కూడా పలకరించలేదు.బహుశా సక్రమంగా దైనందిన కర్మకాండ చేయలేదనేమో.
రెండో రోజు నాళేశ్వరం శంకరం పల్లవిని స్మశానానికి తీసుకువెళ్ళి అతనే ఒక కుండలో అస్థికలు ఏరి వేసి ఇచ్చాడు.అది చూసి పల్లవి కదిలిపోయింది .ఇంటికి వచ్చాక ' ఏ బంధం వుందని శంకరం అంకుల్ ఇంత చేసారు' అని కన్నీళ్ళు పెట్టుకుంది.శ్మశానంవాళ్ళిచ్చిన పేపర్ మున్సిపల్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తేనే డెత్ సర్టిఫికెట్ వస్తుందని వివరాలు కూడా శంకరమే చెప్పారు.
అయిదో రోజు మా మరిది చిట్టి,ఉషా మేము ముగ్గురం,భారవీ కలిసి ఉదయమే రాజమండ్రి బయలుదేరాము.శంకరం తాను కూడా వస్తాననీ రాత్రి డైరెక్టుగా కాలేజీ అయిపోయిన తర్వాత బస్ లో వస్తానన్నాడు.భారవే మినీ వేన్ మాట్లాడాడు.సాయంత్రానికి రాజమండ్రి చేరిపోయాము.హొటల్ లో డ్రైవర్ కి కూడా కలిపి నాలుగు రూములు రవిప్రకాష్ చేత బుక్ చేయించాము.హొటల్ కు రవిప్రకాష్ వచ్చి మాట్లాడాడు.మర్నాడు చేయాల్సిన ఆస్తిక నిమజ్జనం కోసం ఏర్పాటు చేయిస్తానని అన్నాడు.
దేవాంగ సంఘం ఆయన ఒకరు వచ్చి మర్నాడు దేవాంగసంఘంలో సంతాప సభ నిర్వహిస్తున్నామని రమ్మని చెప్పాడు.
అంతేకాకుండా శీలావారివీథిని శీలా వీర్రాజు వీథి అని
మార్చటానికి ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాము అని అన్నాడు.నేనేమీ మాట్లాడలేదు.
ఆ సమయంలో బత్తుల ప్రకాశరావుగారు,గణేష్ రాం గారూ కూడా హైదరాబాద్ లోనే వున్నారు.అందువలన ఇక్కడ ఏపని కోసం వచ్చామో అది పూర్తి చేసుకోవాలనే ఆలోచన లోనే వున్నాను.
ఉదయం చీకటితోనే తయారై గోదావరి ఒడ్డుకు బయలుదేరాము.బస్సులో వస్తానన్న శంకరం ఇంకా చేరక పోయేసరికి ఫోన్ చేసాను.రాజమండ్రికి డైరెక్ట్ బస్ తప్పిపోయిందనీ, విజయవాడ వరకూ వచ్చి మరో బస్ పట్టుకున్నాననీ,తాను తిన్నగా గోదావరి వొడ్డుకు వస్తానన్నాడు.
మేము గోదావరి వొడ్డున పూజ చేయించాల్సిన పంతులు కోసం చూస్తుండగా శంకరం వచ్చి గోదావరినదిలో మునిగి పూజ దగ్గరకు వచ్చాడు.ఈ లోగా పంతులుగారు వచ్చి మరిదిచిట్టి చేత పూజ చేయించారు.
తర్వాత పడవలో పంతులుగారితో బాటు చిట్టీ,భారవీ,శంకరం నది మధ్యకు వెళ్ళి నిమజ్జనం చేసి తిరిగి వొడ్డుకు వచ్చారు.ఒడ్డుకు రాగానే అక్కడ సిమెంట్ బెంచిమీద కూలబడి శంకరం వెక్కివెక్కి ఏడ్చాడు.అది చూసేసరికి ఎప్పటినుంచో అణచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా నాకూ వెళ్ళుకొచ్చేసింది.చిట్టి చేయటంలో ఇంకెవరూ లేరు కనుక అది అతనికి తప్పని బాధ్యత.
ఏ వైపు చుట్టం అని ఈ శంకరంకీ వీర్రాజుగారికీ. ఏనాటి రుణానుబంధం.వుదయం సంగారెడ్డి వుద్యోగానికి వెళ్ళి రాత్రి అష్టకష్టాలు పడి బస్సుల్లో వచ్చి సమయానికి హాజరై తన చేతులారా అస్తికనిమజ్జనం చేసాడు.బహుశా మానస పుత్రుడు అయివుంటుంది అనిపించింది.
అక్కడ నుండి భోజనం చేసి దామెర్ల రామారావు చిత్ర కళా పరిషత్ కు వెళ్ళి వీర్రాజుగారి గ్యాలరీ చూసాము.ప్రారంభోత్సవం నాటి జ్ణాపకాలు మనసులో మెదిలాయి.తర్వాత చుట్టుపట్ల ప్రాంతాలు కొన్ని చూసి గోదావరి హారతి చూసి హొటల్ కు తిరిగి వచ్చేసాము.మర్నాడు వుదయం జాంపేటకు వెళ్ళాము.మారిపోయిన ఇళ్లనీ ,ప్రాంతాన్నీ చూసి చిట్టీ,ఉషా బాల్య జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయారు.ఆనాటి తమ ఇంటినే చిట్టి గుర్తు పట్ట
లేకపోతుంటే అంతకు ముందు వీర్రాజుగారు కూడా
అదేవిధంగా ఆనవాలు పట్టకపోవటాన్ని చెప్పాను.
తర్వాత దేవాంగసంఘంవారు నిర్వహించిన
వీర్రాజుగారి సంతాప సభకు వెళ్ళాము.వాళ్ళంతా వాళ్ళకు తెలియని వీర్రాజుగారి గురించి మాట్లాడారు.దాని తర్వాత తిరుపతిలో దేవాంగ సత్రంలో ఒక గదిని వీర్రాజుగారి పేరిట కట్టించడానికి ఏడున్నర లక్షలు అవుతుందని ఒక కరపత్రం మాకు ఇచ్చి ఇద్దరు ముగ్గురు అందుకు కన్విన్స్ చేయటానికి ఊదరగొట్టేసారు.నాకు చికాకు అనిపించింది.మేము వచ్చిన,వున్న పరిస్థితి ఏమిటి? మా దగ్గర లక్షలు పోగు పోసుకుని వున్నామనుకున్నారా? ఒక వేళ వున్నా ఈ పరిస్థితుల్లో ఆ వత్తిడి ఏమిటి? ఏమీ మాట్లాడకుండా వూరుకున్నాము.హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కట్టాము.ఈ సారి శంకరంకూడా మాతో బాటూ మినీ వేన్ లో వచ్చాడు.
నేను సాహితీకారులకు ఫోన్ చేసి 12 వతేదీన నారాయణగూడ తాజ్ హొటల్ లో శీలావీ శ్రద్ధాంజలి సభ జరుగుతుందని చెప్పాను.
ప్రత్యేకంగా శివారెడ్డి , గోపీ,నగ్నముని ,నిఖిలేశ్వర్, శిఖామణి వంటి దగ్గర మిత్రులకు సభలోమాట్లాడమని కోరాను.
హైదరాబాద్ వచ్చాక పన్నెండో రోజు కార్యక్రమం గురించి ఏర్పాట్లు మొదలు పెట్టాము.జనసాహితి లక్ష్మీ, శ్రీధర్ తాజ్ హొటల్ లో వాళ్ళకు తెలిసిన ఆయన వున్నాడట, ఆరోజుకి వాళ్ళే బుక్ చేసారు.బానర్ చేయించాము.
వీర్రాజుగారి గురించి వచ్చిన వ్యాసాలను సేకరించి దశదినకర్మనాటికి వచ్చేలా ప్రజాసాహితి ప్రత్యేక సంచిక ప్రచురించారు.
దగ్గర బంధువులూ,మా కుటుంబానికి ఆత్మీయులు,మిత్రులూ,సన్నిహితులూ సుమారు రెండువందల మందికి పైగా హాజరయ్యారు. శివారెడ్డి,ఎన్ గోపీ,నగ్నమునీ,నిఖిలేశ్వర్,శిఖామణీ,శంకరం, ప్రసాద మూర్తి,ఎన్.వేణుగోపాల్ వంటి ప్రముఖులచే లక్ష్మి ప్రజా సాహితి వీర్రాజుగారి ప్రత్యేక సంచికను ఆవిష్కరింపచేసింది.అందరూ ఆత్మీయంగా మాట్లాడారు.బత్తుల ప్రకాశరావుగారూ మాట్లాడారు.
ఆషీచేత ముగింపువాక్యాలు చెప్పించారు.
బంధువులకూ, కుటుంబ మిత్రులకూ వీర్రాజు గారి పేరిట చిన్నవెండిగిన్నెలు పంచింది పల్లవి.సాహితీబంధువులకు వీర్రాజుగారి కవిత్వం సెట్, ఇంగ్లీష్ కథలపుస్తకం కవర్లలో పెట్టి అందజేసాము .తదనంతరం భోజనాలు చేసి వీర్రాజుగారికి ఘనంగా సంతాపం సమావేశం శ్రద్ధాంజలితో ముగిసింది.
నడక దారిలో -69
నడక దారిలో -69
వీర్రాజుగారు కరోనా సమయంలో ఇంట్లో వున్న కొడవటిగంటి, గోపీచంద్,మల్లాది, శ్రీపాద మొదలైన పాతతరం వారి పుస్తకాలు విపరీతంగా చదివేవారు.ఈ ఏడాది ఎందుచేతనో పుస్తకాలు చదవటం మానేసారు. మౌనంగా తనలోకంలో తాను ఉండేవారు. పుస్తకాలేవైనా చదవమని, ఏవైనా స్కెచైనా వేయమని అనేదాన్ని. ఒక్కసారిగా పెన్ను, పెన్సిల్ ముట్టకుండా తపోముద్రలో ఉండడం నాకు ఎందుకో చాలా భయం వేసింది.
ఈ సారి కూడా వీర్రాజుగారి పుట్టినరోజుకి మంచి బేకరీ నుండి కేకు తెప్పించటమే కాకుండా పల్లవీ,ఆషీ కలసి ఇంట్లో కేకు తయారుచేసారు.ప్రతీ పుట్టినరోజుకీ తప్పకుండా పొనుగోటి కృష్ణారెడ్డి,నాళేశ్వరం శంకరం వస్తారు.ఈ సారీ అలాగే వచ్చారు.
ఏదో ఒక సందర్భంలో తరుచూ ఎనభై మూడో ఏట చనిపోతానని ఒక కోయదొర చిన్నప్పుడు చెప్పాడని అంటూ వుండేవారు. లేదా సహస్ర చంద్రోదయం తనకు ఎప్పటికి అవుతుందని లెక్కలేయబోయేవారు.
ఆషీని కాలెండర్ తీసుకు రమ్మని చెప్పి ఏడాదికి పౌర్ణమిలు ఎన్ని వున్నాయి లెక్క కట్టేవారు.మీకు జాతకాలు, జోస్యాలు నమ్మకం లేనప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తారు. మనసు పాడుజేసుకోడానికి తప్ప అని చేతిలోని కేలెండర్ లాక్కుని మందలించేదాన్ని. పంతులుగారిని పిలిచి సహస్రచంద్రోదయం చేసుకోటానికి ముహూర్తం పెట్టించమంటారా అని కోప్పడేదాన్ని.
మాటిమాటికీ నీకన్నా నేను పదేళ్ళు పెద్దవాడిని అనీ, తానే ముందు వెళ్ళిపోతాననేట్లు మాట్లాడేవారు. మరణం వయసుని బట్టి రాదు అని వాతావరణాన్ని తేలిక పరచటమే కాకుండా రావూరి భరద్వాజ మొదలుకొని చాలామంది భార్యలమీద కావ్యాలు రాసారు, రాస్తున్నారు. నేనే ముందు పోతే మీరూ నా మీద ఓ కావ్యం రాస్తారా అని సరదాగా అడిగేదాన్ని. “నేను అస్సలు రాయను. అయినా రాస్తేనే నీపైన ప్రేమ ఉన్నట్లా” అని ఆయన తిరిగి అనేసరికి నేను చిన్నబుచ్చుకుని 'అలా ఐతే నేనుకూడా మీమీద రాయను' అని కోపంగా అనేదాన్ని.
పుస్తకాలు చదవమనీ, ఫేస్బుక్ లో ఆర్టిస్టుల చిత్రాలు చూపించీ ఎన్నిరకాలుగా ఆయన మనసు మరల్చాలని చూసినా కుదిరేదికాదు.ఎప్పుడైనా అన్వర్ వేసిన చిత్రాలు సెల్ ఫోన్ లో ఫేస్బుక్ లోంచి చూపించమని అడిగేవారు.నేను నెచ్చెలిలో రాస్తున్న ఆత్మకథ నడకదారిలో చదవమని ఇచ్చేదాన్ని.బాగా రాస్తున్నాననే వారు.
ఈలోగా మా ఆడపడుచు మాలతి సంవత్సరీకాలు వచ్చాయి.ఆమె పోయినపుడు పల్లవీ, నేనూ ఒమిక్రాన్ వైరస్ బారిన పడి వుండటం చేత వెళ్ళలేదు.ఈ సారి వెళ్ళాము.మామరిది వాళ్ళూ యూ.ఎస్ లో వుండటం వలన వాళ్ళు లేరు.కుక్కట్ పల్లి వాళ్ళు కూడా కొందరే వచ్చారు.శిరీష తోడికోడళ్ళు వచ్చారు.అంతే బయట వారిని ఎవరినీ పిలవలేదు.
ఉద్యోగం పనిమీద కొన్ని నెలలకోసం హైదరాబాద్ కి బత్తుల ప్రకాశరావుగారి అబ్బాయి రావటంతో తల్లీ తండ్రీ కూడా వచ్చి వున్నారు.ఒకరోజు ప్రకాశరావు దంపతులు మా యింటికి వచ్చారు.ఆ రోజు మాత్రం వీర్రాజుగారు తన బాల్యమిత్రుడితో బాగానే కబుర్లు చెప్పారు.నాకు వచ్చిన సుశీలానారాయణరెడ్డి పురస్కారం గురించి గొప్పగా చెప్పి సన్మాన పత్రం చూపించారు.వాళ్ళు సాయంత్రం వరకూ వుండి వెళ్ళారు.
మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారాలు మూడేళ్ళవీ పెండింగ్ లో వున్నాయి.కమిటీ వాళ్ళం కరోనా కాలంలో ఎవరమూ కలుసుకోవటం కుదరలేదు.అంతే కాకుండా సుధామగారు చైతన్యపురిలో ఇల్లు అమ్మేసి కోకాపేటలో కొడుకు ఇంటికి దగ్గరలోనే అదే గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ కొనుక్కుని వెళ్ళిపోయారు.అందువలన మాడభూషి కమిటీ అందరం కలిసినట్లు వుంటుందని అందరం బయలు దేరాము.అందరం కలిసి సందడిగానే గడిపాము.సాయంత్రంవరకూ వుండి వెళ్తామని లేచాము.సుధామ దంపతులు కూడా మాకు వీడ్కోలు చెప్పేందుకు సెల్లార్ వరకూ వచ్చారు.ఇక కారు కదలబోతుంటే కారులోంచి వీర్రాజుగారు దిగి సుధామగారిని ప్రేమతో ఆలింగనం
చేసుకుని తిరిగి కారు ఎక్కారు.
కుందుర్తి శతజయంతి పురస్కార గ్రహీతలు అందర్నీ సంప్రదించి వాళ్ళంతా పురస్కారం కొరకు హైదరాబాద్ రావటం కష్టసాధ్యంగా నిర్ణయించి,ఆ సమయానికి కుందుర్తి కవితకు కూడా ఇండియా రావటం కుదరదని మే 21 వతేదీన కుందుర్తి శతజయంతి ప్రతిభా పురస్కారాలు జూమ్ సమావేశంలో నిర్వహించాలని నిర్ణయించారు వీర్రాజుగారు.రాజమండ్రిలో మాకు ఇచ్చిన ముమెంటోలు బాగున్నాయని శతజయంతి పురస్కారాల మెమెంటోలకు కూడా స్వయంగా డిజైన్ వేసి వాట్సాప్ లో రవిప్రకాష్ కు పంపించి చేయించారు .అవి కూడా వచ్చేసాయి.అన్నీ నిర్ణయించుకున్నాడు కుందుర్తి కవిత తనకు యూ ఎస్ నుండి మరిది కుటుంబం వస్తుందని కార్యక్రమం పోస్ట్ పోన్ చేసి జూన్ లో పెట్టుకుందామని అంది.దాంతో వాయిదా పడింది.
వాణిశ్రీ,ఎమ్వీ రామిరెడ్డి దంపతులను తీసుకుని ఒక రోజు అకస్మాత్తుగా వచ్చింది.రామిరెడ్డి కూతురి వివాహా ఆహ్వానపత్రిక ఇవ్వటానికి వచ్చారు.రామిరెడ్డి వియ్యంకుడు ఒంటరి నవల రాసిన సన్నపరెడ్డి వెంకటరెడ్డి అట.
తీరా వాళ్ళు వచ్చేసరికి పల్లవీ,ఆషీ,నేనూ గోరింటాకు చేతులకు పెట్టుకుని వున్నాము.వాళ్ళు వద్దన్నా చేతులు కడుక్కుని గబగబా వచ్చాను.ఈ లోగా వీర్రాజుగారు వాళ్ళతో మాట్లాడుతూ వున్నారు.పెళ్ళికి తప్పక రమ్మని మరీమరీ పిలిచారు.
పెళ్ళికి పరిమి రాలేమని ఇక్కడ రిసెప్షన్ కి వస్తామని చెప్పాము.
ఆరోజు పల్లవీ,ఆషీ పల్లవి స్నేహితురాలి ఇంటికి వెళ్ళారు.సాయంత్రం విజిటర్స్ పార్కింగ్ లో మిల్లెట్సుతో చేసిన స్నాక్స్ ప్రదర్శన వుందనీ,వీలుంటే కొనమని చెప్పారు.సాయంత్రం లిఫ్టులో కాకుండా మెట్లు దిగి వెళ్ళాలని దిగుతుంటే చెప్పుజారి మెట్లమీద కూలబడ్డాను.మళ్ళాలేచి క్రిందికి వెళ్ళి కొనుక్కొని వచ్చాను.ఇంటికి వచ్చి వీర్రాజుగారితో మెట్లమీద జారిపడ్డానని చెప్తే,రెండు నెలలకి ఒకసారైనా పడటం నీకు ఆనవాయితే కదా అని నవ్వారు.నేను స్కూలికి వెళ్తున్న రోజుల్లో తరుచూ వచ్చేటప్పుడు లో షుగర్ అయిపోయి పడిపోయే దాన్ని.రిటైర్ అయ్యాక రెగ్యులర్ వాకింగ్ వలన ఆ సమస్య తగ్గింది.అందుకని ఆయన మాటలకి వుడుక్కున్నాను.అయితే అప్పుడు తెలియలేదు కానీ వెన్నులో చివరికొనకి బాగా దెబ్బతగిలి మర్నాటి నుంచి కూర్చోలేనంతగా నొప్పి ఎక్కువై నొప్పి తగ్గేందుకు మందువేసుకోవల్సి వచ్చింది..
వీర్రాజుగారు ఇటీవల రోజురోజుకూ బరువుతగ్గుతున్నారేమో అనిపించింది.పొట్టకూడా తగ్గింది.ఆయనకు హెర్నియా వుంది.అప్పుడప్పుడు నొప్పి వస్తోంది అంటున్నారు.డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటే ఒప్పుకోవటం లేదు.ఒక రోజు మధ్యాహ్నం నుంచి యూరిన్ కావటం లేదు అన్నారు.ఎండలు కదా మంచినీళ్ళు తక్కువ తాగారేమోనని మంచినీళ్ళు, తర్వాత బార్లీ,మజ్జిగా ఇస్తూనే వున్నాను.కానీ లాభం లేకపోయింది.
రాత్రి వరకూ చూసాము.డా.సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేసి అడిగాను.ఎండలవలన డీ హైడ్రెషన్ అయివుంటుంది.ద్రవపదార్థాలు ప్రతీ అరగంటకీ ఇవ్వమన్నారు.అప్పటికీ కాకపోతే లాబ్ టెక్నీషియన్ ను పంపుతాను అన్నారు.మాటిమాటికీ వాష్ రూమ్ కి వెళ్ళి ప్రయత్నిస్తూనే వున్నారు.
రాత్రికి ఎప్పటిలాగే భోజనం చేసారు.కానీ ఇబ్బంది పడుతూనే వున్నారు.హాస్పటల్ కి వెళ్దామంటే ఒప్పుకోవటం లేదు.
రాత్రి పది దాటిన తర్వాత వీర్రాజుగారు పడుతోన్న బాధ చూడలేక డా.సూర్యప్రకాష్ గారికి ఫోన్ చేసాను.ఆయన కేథడ్రాల్ పెట్టటానికి లాబ్ టెక్నీషియన్ ను పంపించారు.కాని సాధ్యం కాలేదని
డాక్టర్ గారికి ఫోన్ చేసాడు.డాక్టర్ గారు యశోదాకి తీసుకుని వెళ్ళమని చెప్పటమే కాకుండా యశోదాలోని డాక్టర్ కి కూడా ఫోన్ చేసి మాట్లాడారు.ఓలా కారు బుక్ చేసుకుని పల్లవీ, నేనూ వీర్రాజుగారిని తీసుకుని యశోదా హాస్పిటల్ కు వెళ్ళాము.వెళ్ళేటప్పుడు కారులో ఆయన భయం వేసిందేమో నా చేతిని పట్టుకున్నారు.వీర్రాజుగారికి హాస్పిటల్ అంటే మొదటి నుంచి భయమే.
యశోదా హాస్పిటల్ కి వెళ్ళేసరికి పన్నెండు గంటలు దాటింది.అయినా సూర్యప్రకాష్ గారు ఫోన్ చేయటం వలన కావచ్చు వెంటనే హాస్పిటల్ లో చేర్చుకుని డాక్టర్ వచ్చి చూసి ట్రీట్ మెంట్ చేయటం మొదలు పెట్టేడు.నాకు నాలుగు రోజుల క్రితం పడినప్పటి నొప్పి తగ్గలేదు .కూర్చోవటం కష్టంగా వున్నా పెయిన్ కిల్లర్ వేసుకుంటూ తిరుగుతున్నాను.
డా. సూర్యప్రకాష్ గారు ఆరోజు వారి తండ్రి గారి తిథి అయినా కూడా హాస్పిటల్ కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
ఉదయానికి రూమ్ కి పంపించి వివిధ పరీక్షలు చేయాలని అన్నారు.పల్లవి ఇంటికి వంట చేసి నాకు బాక్సు తీసుకు రావటానికి వెళ్ళింది.అప్పుడు ఎకో టెస్ట్,అంజియోగ్రామ్ చేసి రూమ్ కు తీసుకువచ్చారు.యూరిన్ సమస్య తీరటంతో వీర్రాజుగారు అన్ని టెస్టులకు బాగానే సానుకూలంగానే వున్నారు.
సాయంత్రం ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో కలిసి నన్ను ,పల్లవినీ పిలిపించి కౌన్సిలింగ్ అని చెప్పి మాట్లాడటం మొదలెట్టారు.హెర్నియాలో బాగా ఇన్ఫెక్షన్ ఉందనీ దానికి ఆపరేషన్ చేయాలన్నారు. దానికన్నా ముందు ఆయనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయనీ అందుకని ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి స్టంట్స్ వేయాలనీ సర్జరీ చేసినప్పుడు బ్లడ్ థిన్నర్ కొన్నాళ్ళు వాడాల్సి వుంటుందనీ,అందుకని అది ఆపిన తర్వాతే హెర్నియా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పటమే కాకుండా మమ్మల్ని హార్ట్ ఆపరేషన్ కి కన్విన్స్ చేయటానికి ప్రయత్నించారు.అది మాకు అర్థం కాలేదు.హెర్నియా ఇన్ఫెక్షన్ వల్లే యూరిన్ సమస్య వచ్చిందంటున్నారు.ముందు అది క్లియర్ చేయకుండా హార్ట్ ఆపరేషన్ చేయాలనీ దానికి మూడులక్షల పైనే అవుతుందనీ ఇప్పుడు వెంటనే ఒకటిన్నర లక్ష కట్టమన్నారు.హెర్నియాకైతే ఒకటిన్నర లక్ష అవుతుంది, బహుశా సాధ్యమైనంత రోజులనుండి డబ్బు పిండటమే కార్పొరేట్ హాస్పిటల్స్ లక్ష్యం.అబ్బూరి ఛాయాదేవి గారి అయిదు నక్షత్రాల కథ గుర్తువచ్చింది.
మాకు కంగారుగా అయిపోయింది.ఆలోచించి చెప్తామన్నాము.డా.సూర్యప్రకాష్ గారి సలహా మేరకు మేము అసలు సమస్య హెర్నియా కదా ఆ ఆపరేషన్ ముందు చేసి కొంచెం ఆరోగ్యం కుదుట పడ్డాక హార్ట్ ఆపరేషన్ చేయమని అన్నాము.
అంతే కాకుండా అంతకుముందు యశోదాలో పని చేసిన కార్డయాలజిష్టు డా.సూర్యప్రకాష్ గారికి ఫ్రెండ్ ,ఆయన చేత యశోదా డాక్టర్లతో మాట్లాడించారు.దాంతో మర్నాడు హెర్నియా ఆపరేషన్ చేస్తామన్నారు.ముందు డబ్బు కట్టించుకున్నారు.
వెంటనే కళ్యాణ్ కీ,భారవీ వాళ్ళకీ ఫోన్ చేసి చెప్పాను.కళ్యాణ్,అనురాగ్ ఆ రాత్రికే బయలుదేరి బస్ పట్టుకుని ఉదయమే హైదరాబాద్ కు వచ్చేసారు.వాళ్ళని చూసాక నాకు ధైర్యం వచ్చింది.ఆపరేషన్ సమయానికి కవితావాళ్ళూ,భారవీ,శ్రీదేవీ వాళ్ళూ అంతా వచ్చారు.ఆపరేషన్ పూర్తై బయటకు తీసుకువచ్చేవరకూ నాకు గుండె దడదడలాడుతూనేవుంది.కానీ బాగానే బయటకు వచ్చేసరికి వూపిరి పీల్చుకున్నాను.తిన్నగా ఐసీయూలోకి తీసుకువెళ్ళారు.
ఐసీయూలో వుండటం వలన మమ్మల్ని ఉండనీయలేదు.ఐనా రాత్రి ఏమైనా అవసరం వుంటుందేమోనని కళ్యాణ్,భారవీ ఒక్కోరోజు వున్నారు.ప్రతీరోజూ ఉదయం తొమ్మిదింటికల్లా హాస్పిటల్ నుండి యాభై వేలు కట్టమని ఫోను.అది కట్టడానికి వెళ్తేనే హాస్పిటల్ లోపలకి అనుమతి ఇస్తున్నారు.లేకపోతే రోడ్డు మీదే నిరీక్షణ.డబ్బు కట్టిన తర్వాత కూడా విజిటర్స్ సమయంలో వాళ్ళని బతిమాలుకుంటేనే ఒకరిని ఐసీయు లోనికి అనుమతి ఇస్తున్నారు.కళ్యాణ్, అనురాగ్ వచ్చారని చెప్పేసరికి ఆయనకి ధైర్యం వచ్చింది.వీర్రాజుగారు బాగానే కోలుకుంటున్నారు.అయినా హార్ట్ ఆపరేషన్ చేయటానికంటూ ఐసీయులోనే వుంచారు.
ప్రతీరోజూ కౌన్సిలింగ్ అని మమ్మల్ని పిలిచి హార్ట్ ఆపరేషన్ కి కన్విన్స్ చేయటం మాత్రం మానలేదు.మేమూ,కళ్యాణ్ కూడా ఈ హాస్పిటల్ లో ఏమిటిలా జలగల్లా పట్టుకుని వీళ్ళే చంపేసేలా వున్నారని విసుక్కున్నాము.నాలుగురోజులు అయ్యాక కళ్యాణ్ వెళ్ళిపోయాడు.
డా.సూర్యప్రకాష్ గారు " ఎట్టి పరిస్థితుల్లోనూ హార్ట్ ఆపరేషన్ కు ఒప్పుకోకండి.డా.ముఖేష్ కూడా ఈ వయసులో వీర్రాజుగారి గుండె మరో ఆపరేషన్ కి తట్టుకోలేదు.మొండిగా చేయాలనుకుంటే ఆపరేషన్ బెడ్ మీదే ఏమైనా జరగొచ్చు అన్నాడు.ముందు డిస్చార్జ్ చేయించుదాం"అన్నారు.
వారం రోజులకి ఐసీయు పక్కనే వున్న రూమ్
కి షిఫ్ట్ చేసారు.రూమ్ కి వచ్చాక నేను అక్కడే వున్నాను.రూముకు వచ్చాక నా ఫొటో తీయు ఎలా వున్నానో నాకు తెలుస్తుంది అన్నారు.సరేనని ఫోన్ తో ఫోటోతీసి చూపిస్తే బనియన్ తో,చిరుగడ్డంతో చలంలా వున్నాను కదా అంటూ నవ్వారు.ఇంతవరకూ డబ్బు ఎంత కట్టారు అని పదేపదే అడిగారు. కానీ చెప్పలేదు.నడిపించటం అవీచేసాక డిస్చార్జ్ చేసారు.భారవీ,అనురాగ్ సాయం వుండటం వల్ల ఇంటికి జాగ్రత్తగా తీసుకువచ్చారు.హాస్పటల్ కి ఎంతయింది అని అడిగుతున్నామాట మార్చి చెప్పాను.
ఇంటికి వచ్చాక బాల్య మిత్రుడు, ప్రకాశరావు,పొనుగోటి కృష్ణారెడ్డి,నాళేశ్వరం శంకరం మొదలైన వాళ్ళు వచ్చి కలిసారు.సత్యనారాయణ కూడా వస్తానంటే వీర్రాజుగారే ఇంత దూరం రాలేవు,ఫోన్ లో మాట్లాడుతూ వుందాములే అని అన్నారు.పొనుగోటి కృష్ణారెడ్డితో అన్వర్ గురించీ,అతను రాసిన రేఖాయాత్ర పుస్తకం గురించి,అతని బొమ్మల గుర్తించి చాలా ప్రశంసాపూర్వకంగా చాలాసేపు మాట్లాడారు.
పదిరోజుల పైగా ఐసీయూలో వుండటం వలన భోజనం సరీగా లేక బాగా నీరసించిపోయారు.వాష్ రూంకి వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడుతూనే వున్నారు.
ఆయనకు సహాయకుడుగా ఎవరినైనా పెట్టుకోవాలంటే ముగ్గురం ఆడవాళ్ళమే.అందులోనూ ఆషీ వయసులో వున్న పిల్ల.అనవసరంగా ఎవరో ముక్కూ మొహం తెలియని వాడిని పెట్టుకొని సమస్యల్లో చిక్కుకు పోతామేమో అనిపించింది.పోష్టు ఆపరేషన్ కేర్ కోసం కొన్ని వుంటాయని కొందరు సలహా ఇచ్చారు కానీ అవి కూడా హాస్పిటల్ లాగే వుంటాయి కదా . వీర్రాజుగారు మరింత కుంగిపోతారు.ఒక వారం పది రోజులు జాగ్రత్తగా వుండి మందులూ,భోజనం వంటికి పడితే
మళ్ళీ బలం వస్తుంది.ఎటొచ్చీ ఆయన ధైర్యంగా వుండాలి.అనుకున్నాము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)