3, ఆగస్టు 2021, మంగళవారం
భయం భయం
22, జులై 2021, గురువారం
కారా మాస్టారు కు నివాళులు
తెలుగు కథా ప్రస్థానం వయసుఎంతో కొంచెం తక్కువగా కారా మాస్టారు జీవితం అంతే.కథ గుర్తు వస్తే కారా మాస్టారు గుర్తు వస్తారు,ఆయన గుర్తు వస్తే కథానిలయం నిలువెత్తున కళ్ళ ముందుకు వస్తుంది.తెలుగు కథాసాహిత్యం లో విడదీయలేని బంధం అది.
కారా మాస్టారి నవతి సందర్భంగా సావనీర్ కోసం వ్యాసం రాయమని అట్టాడ గారు అడిగినప్పుడు ఎంతోమంది వారి సాహిత్యం గురించి రాసారు ఇంకా నేనేమి రాస్తాను అని వారి కథలు పుస్తకం తీసి చదవటం మొదలెట్టేసరికి పేజీ పేజీకీ నాలో ఉద్వేగం కలిగింది.ఎన్ని జాతీయాలో,ఎన్ని నానుడు లో, ఇంకెన్ని సామెతలో ఉత్తరాంధ్ర మాండలీకం నింపుకుని పరిమళాలు నా మనసు చుట్టేసాయి.ఇక అంతే అవి నోట్ చేసుకుంటూ "సామెతలు,నానుడుల పరిమళం" అనే వ్యాసం రాసాను.
అంతకు ముందు తెలుగు కథలు సరళ గ్రాంథికంలోనే ఎక్కువమంది రాసేవారు.కారా గారూ, రావిశాస్త్రి,బీనాదేవీ ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజలజీవనశైలినీ, సంస్కృతి నీ,కడగండ్లనూ,వారి మనోభావాలను కళ్ళకు కట్టేలా మాండలికసొబగుతో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసారు.
ఇక వారు స్థాపించిన కథానిలయం కథా పరిశోధకులకు కల్పవృక్షం, సాహిత్య గని.నేను శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసినప్పుడు గానీ,తదనంతరం రచయిత్రుల కథలు గురించి వ్యాసాలు రాసినప్పుడు గానీ కథానిలయం ద్వారా ఎందరో కథకులు కథలను చదవ గలిగాను.కథానిలయం వలనే సమగ్రమైన వ్యాసాలు రాయగలిగాను.అందువలన కథా సాహిత్యానికి కారా మాస్టారి కృషి విలువ కట్టలేనిది.
హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మాఇంటికి వచ్చేవారు.తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ మహాసభలలో ప్రత్యేక పురస్కారానికి వచ్చినప్పుడు సభా ప్రాంగణం లో కలిసినప్పుడు అప్పటికే వారికి కొంత మరుపు మొదలైనా నన్ను గుర్తు పట్టి మా అక్కయ్య నీ,అన్నయ్య నీ, వీర్రాజు గారి గురించి అడిగారు.నా వ్యాసాలు పుస్తకం పంపినప్పుడు వారు ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని ఆశీర్వదించారు.
మరొక రెండేళ్ళలో శతవసంతాలు పూర్తి చేసుకోవాల్సిన తరుణం లో వారు వెళ్ళిపోవటం శోచనీయం.ఐతే ఈ కరోనా కష్టకాలంలో ఏమీ బాధ పడకుండా ఈవిధంగా కుమార్తె చేతిలో అనాయాసమరణం ప్రాప్తించినందుకు కొంత ఊరట.
ఏది ఏమైనా ఒక తెలుగుకథా మహా వృక్షం నేలకి ఒరిగింది.ఇది సాహిత్య రంగానికి తీరని లోటు.ఈ రెండు మాటలు చెప్పే అవకాశం నాకు కలిగించిన మనలో మనం అడ్మిన్ లకు ధన్యవాదాలు.
కారా మాష్టారు కి నా బాష్పాంజలులు.
సంకలన సంపాదకులు
సంపాదకత్వం గురించి గంగిశెట్టిగారు అందించిన వ్యాసం సమగ్ర సమాచారాన్ని అవగాహననీ కల్పించేలా ఉంది.ఆ విషయం మీద సభ్యులు కూడా మంచి చర్చను ఆసక్తి కరంగా కొనసాగించుతున్నారు.
పనిలో పనిగా వివిధ సమకాలీన సంచలనాలు మీద పుంఖానుపుంఖాలుగా కథా,కవితా సంపుటాలు వెలువరుస్తున్నారు.ఉదాహరణకు యుద్ధం మీద ఒకరు సంకలనం వేయసంకల్పించి సంపాదకత్వం వహించినవారు యుద్ధం మీద కవితల్ని ఆహ్వానిస్తూ పేపరు ప్రకటన ఇచ్చారు.అంతే అప్పటివరకూ రానివారు కూడా రాసి పంపించేసారు.యుధ్ధంమీద కవితా సంకలనం వేసేసారు సదరు సంపాదకులు.అంతే తప్ప అంతకు ముందు ఎవరైనా పాతతరం నుండీ రాసారేమో ననే వెతుకులాట లేదు.ఎంత సులభం అయిపోయింది కదా సంకలనం సంపాదకత్వం?!.నిజానికి యుద్ధం మీద నేనొక దీర్ఘ కవితే రాసాను.దాని ప్రస్తావన కూడా లేదు.
అదేవిధంగా బియాస్ నదిలో ప్రమాదవశాత్తూ కొట్టుకు పోయిన ఇరవై అయిదు మంది విద్యార్ధుల మీద ఒక సంకలనం వచ్చింది.అందులోనూ నా కవిత రాలేదు.అంటే ప్రకటన కు స్పందించి వచ్చిన కవితల్ని వేసేయటమే తప్ప చిత్తశుద్ధి తో నిజాయితీగా, నిబద్ధతతో సంకలనకర్తలు గా , సంపాదకులుగా పేరు సాధించటం ఎక్కువైపోయింది.
మరికొందరు కథో,కవితతో పాటూ డబ్బు కూడా ఇవ్వమంటున్నారు.అంటే మనమే,కథో,కవితో ఇవ్వటమే కాకుండా మనడబ్బు తోటే సంకలనం వేసి పనిలో పనిగా డబ్బు మిగిల్చి వాళ్ళదో పుస్తకం కూడా ప్రచురించేసుకుంటున్నారు.ఇదీ ఈ నాటి సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్న వ్యాపార కళ.
ఏదైనా అవాంఛనీయం,అక్రమం, అన్యాయం, దుర్మార్గం,ఇలా,ఇలా.....ప్రముఖులమీదా,దినాలమీదా కాదేదీ సంకలనకనర్హం అన్నట్లు ఇటువంటి సంపాదకుల పంట పండిస్తున్నాయి.ఇంతకూ వీరూ సంపాదకులే కదా
గం.లా.నా. గారి వ్యాసం చూడగానే ఉండలేక రాసాను.ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యురాలిని.
విద్యార్థులతో అరకు యాత్ర
నేను పనిచేసిన స్కూల్ ఆర్టీసీ హైస్కూల్.ప్రతీ ఏడాది దసరా సెలవుల్లో ఒక్కో సారి ఒక్కో రాష్ట్రంకు విజ్ఞాన యాత్ర కోసం మాకు రెండు బస్సులు, నలుగురు డ్రైవర్లను ఉచితంగా ఇచ్చేవారు.
ఒకసారి అరకు వెళ్ళాము ఆడపిల్లలకు ఒక బస్సు,మగపిల్లలకు ఒక బస్సు.అరకుపైకి వెళ్ళినప్పుడే ఒక బస్సు కొంచెం ప్రోబ్లం ఉన్నట్లు అనిపించింది.మళ్ళీ కిందకు దిగేముందు డ్రైవర్లు నాకు,మరో టీచర్ కు విషయం చెప్పి చిన్న మగపిల్లలను అందరు టీచర్లను ఒక బస్సులో ఎక్కించి,8,9,10 తరగతుల పిల్లలను కొంత దూరం ఘాట్ రోడ్డు దాటేవరకూ నడిచి రమ్మని చెప్పారు.అందరూ భయపడతారని అందరికీ చెప్పలేదు.అన్నారు.
మేము కూడా చెప్పలేదు.ఖాళీ బాస్ ముందూ,దానివెనుక మా బాస్ వెళ్ళటానికి ప్లాన్.బస్సులు బయలు దేరాక ఒక పది పదిహేను మంది పిల్లలు ఖాళీ బస్ టాప్ ఎక్కి ఛయ్య ఛయ్యా అంటూ డాన్స్ మొదలెట్టారు.బస్సు రొదలో ఆఫీస్ డ్రైవర్ గమనించలేదు .వెనక బస్ లోని ఆడపిల్లలు కూడా డాన్స్ మొదలెట్టారు.ఘాట్ రోడ్డు లో బస్ ఆపటానికి లేదు.మా బస్ లో డ్రైవర్లు భయపడసాగారు.నాకు మరో టీచర్ కూ భయంతో చెమట్లు పట్టేసాయి.
కొంత దూరం అలాగే జాగ్రత్తగా నడిపి సేఫ్ ప్లేస్ చూసి ఆపారు. ఇంకా అప్పుడు టాప్ మీదున్న పిల్లలను కిందకు దింపి బాస్ పాడైన విషయం చెప్పి" మీకు ఏమైనా జరిగితే మీ పేరెంట్స్ కి ఏంచెప్పుకుంటాం" అని మొట్ట మొదటి సారి నేను కోపంతో వాళ్ళని బెత్తం తో బాది బావురుమని నేను కూడా ఏడ్చేసాను.అప్పుడు అందరూ భయంతో దుఃఖంతో గండం తప్పిందని అనుకున్నారు.
మిమ్మల్ని విశాఖ బస్ స్టేషన్ వెయిటింగ్ రూం కి చేర్చి బాస్ రిపైర్ కి తీసుకు వెళ్ళారు.ఈ సంఘటననా నా ఇస్కూలు కథల్లో కూడా రాసాను.
వచన కవితా ప్రక్రియ లోకి అడుగు పెట్టి క్లిష్టమైన సంస్కృత పదబంధాలూ భాషాడంబరాలతో రాస్తేనే కావ్య రూపం పొందుతుందని భావించిన ఆధునిక కవులేకాక సీనియర్ కవులు సైతం నిజాయితీగా నిర్భీతిగా చెప్పిన కుందుర్తి సరళవచనా శైలికి లొంగిపోయారు.
ఇక తిలక్ కవిత్వంలో భావకవుల సౌందర్యకాంక్ష, అభ్యుదయ కవుల సామాజిక కర్తవ్యం రెండూ కలసి నడుస్తాయి. అందుకనే ఆయన కవిత కళాత్మకమే కాదు, కరవాలమంత పదునైనది అనే భావన పాఠకులకు కలుగుతుంది.తిలక్ నిజాయితీగా చెప్పిన
'నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు'
మూడు పంక్తులు ఆయన కవిత్వ తత్వాన్ని తెలిజేసే మూడు సిద్ధాంతాలు.
శ్రీ శ్రీ తొలి రోజుల్లో రాసిన కొన్ని కవితలలో సంస్కృత భాషాడంబరం,సమాసాలూ కనిపించినా "మెట్లు" కవిత సభలో చదవగా విన్న ఒక పిల్లవాడు "ఇంతేనా కవిత్వమంటే నేనూ రాయగలను " అన్నాడని , సామాన్యుడికీ అర్థమయ్యేలా కవిత ఉండాలని శ్రీశ్రీ ఓ సందర్భంలో చెప్పాడు.
నిజానికి ఏ సాహిత్య ప్రక్రియ ఐనా సరే దానికి తగిన భాష అదే సమకూర్చుకుంటుంది.
సామాజిక స్పృహ కవిత్వాన్ని మింగేసిందనటం,సామాజిక స్పృహ ఒక జాడ్యం గా భావించటం అనటం నేను ఒప్పుకోను.
ఇంకా వెన్నెలా,పూవులూ,ఆమనీ,ప్రేమా,ప్రేయసీ అంటూ కవిత్వం రాయటం ప్రపంచంలో జరుగుతోన్న అనేకానేక సందర్భాలూ, సంఘటనలూ,సంక్షోభాలనుండి పలాయనవాదంగా భావించాలి.
కవిత్వం ఎప్పుడూ ఆత్మాశ్రయంగా మొదలైనా నేను నుండి మనం లోకీ మనం నుండి జనంలోకీ మమేకం కావాలి.
పదచిత్రాల్ని ఇబ్బడి ముబ్బడిగా ప్రయోగించితే ఒక్కొక్కసారి వ్యతిరేకార్థం లో కి వచ్చే ప్రమాదం కూడా ఉంది.అందుకని రాసిన వెంటనే మాధ్యమాల్లోనో పత్రికలకో పంపకుండా ఎవరికి వారు తిరిగి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏ సాహితీవేత్త కైనా వారి సాహిత్యమే వారి వ్యక్తిత్వం కావాలి,వారి వ్యక్తిత్వమే వారి జీవితం కావాలని నేను నమ్ముతాను.
14, జులై 2021, బుధవారం
నడక దారిలో--6
నడక దారిలో-6
నడక దారిలో--7
నడక దారిలో--7
1965-66 సంవత్సరాలలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ,మా ఇంట్లోనూ కూడా అనేక మార్పులు,సంఘటనలూ మైలురాళ్ళలా పాతుకున్నాయి.
1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధకాలంలో దేశాన్ని ప్రధాని గా నడిపించారు లాల్ బహదూర్ శాస్త్రి . 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం పూర్తి అయింది. ఒప్పందం జరిగిన తరువాత రాత్రే తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గుండెపోటుతో మరణించినట్లు వార్త. కానీ ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ అది సి.ఐ.ఎ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యే ఆనే కథనాలు విన్నాము.
ఆ సందర్భంగా నెలకొన్న రాజకీయ సమీకరణాల్లో ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఆ రోజు స్కూల్ లో ప్రార్థన సమావేశం లో మొట్టమొదటి మహిళా ప్రధాని గా ఇందిరా గాంధీ గురించి చెప్పారు.తరగతి గదిలో కూడా క్లాసు కి వచ్చిన మాష్టార్లు ఆడపిల్లల కి ప్రత్యేకం గా అభినందించారు.అప్పడు ఆడపిల్లలమంతా మేమే ఆ పదవిని పొందినట్లు పొంగిపోయాము.ఆమె పాలనలో మహిళలకే మైనా ఒనగూడిందా అని ఇప్పుడు ఆలోచిస్తే నేతిబీరకాయలో నెయ్యి చెందమే.
ఇక రాష్ట్రంలో 1966 అక్టోబర్, నవంబర్ నెలల్లో . 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో ప్రజలు ఉద్యమించారు.ఈ ఉద్యమాన్ని అప్పటి నాయకుడు తెన్నేటి విశ్వనాథం ముందుండి నడిపించాడనీ,టి. అమృతరావు, ప్రత్తి శేషయ్య లాంటిే నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారనీ విశాఖ జిల్లా అంతటా ఎన్నెన్నో వార్తలూ,ఎన్నో సంచలనాలు.
గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారనీ జిల్లా అంతటా ఓ విధంగా అట్టుడికి పోయిందని చెప్పొచ్చు.
ఈ సందర్భంలో జరిగిన బందుల్లో( అప్పటికీ విజయనగరం విశాఖ జిల్లా లోనే ఉంది) స్కూలు మూయించటానికి వచ్చిన ఉద్యమకారులతో పాటూ సంఘీభావం గా మేము కూడా మావంతుగా కాసేపు నినాదాలు చేసాము.ఉద్యమంలో భాగంగా 32 మంది ప్రాణాలర్పించి సాధించిన విశాఖ ఉక్కు మాత్రం ఈ నాటి పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు తుప్పు పట్టేలా ఉంది.
నిజానికి నాకు రాజకీయాలు పట్ల ఆసక్తి ఉండేది కాదు.అయినప్పటికీ దేశంలో కానీ , రాష్ట్రంలో కానీ ఏ సంచలనాలు ఉన్నా డైరీ లో రాసుకునే అలవాటు ఉండటం ఆశ్చర్యమే .అసలు సోషల్ స్టడీస్ పుస్తకం చదివినప్పుడల్లా
" ఆ రాణీ ప్రేమ పురాణం/
ఈ ముట్టడి కైన ఖర్చులూ /
తారీఖు లు దస్తావేజులు /
ఇవి కాదోయ్ చరిత్ర సారం,"
అనుకునేదాన్ని.అయినా ఏమాటకామాటే సోషల్ లో చాలా మంచి మార్కులే వచ్చేవి.
ఇక మా ఇంట్లో మా చిన్నన్నయ్య కథలు అప్పటికే ప్రచురితం అవుతున్నా ఆ ఏడాది ఆంధ్రప్రభ దీపావళి కథలపోటీలో బహుమతి వచ్చేసరికి ఆ ఊరులో కథకుడు గా గుర్తింపు వచ్చింది.ఆబహుమతి డబ్బు తో రేడియో కొన్నాడు.ఇంక నాకెంత సంబరమో.ఆ రోజుల్లో సాయంత్రం 5-30 కి లలిత సంగీతం ప్రసారం అయ్యేది.అవి తప్పక వింటూ ఆ పాటలు రాసుకుంటూ నేర్చుకునేదాన్ని.అప్పట్లోనే సంగీతం నేర్చుకోవాలని కోరిక మనసుని తొలిచేసింది.
అన్నయ్య కథలు ప్రచురితం అవుతున్నప్పుడల్లా నాకూ కథలు రాయాలని అనిపించేది.రావిశాస్త్రికి ఏకలవ్య శిష్యుడిగా రాసే అన్నయ్యకథలే కాక,అతను సేకరించే రావిశాస్త్రి,కారా,చాసో,బీనాదేవి పుస్తకాలూ నేను కూడా చదవటం వలన నా ఆలోచనల్లో,నా దృక్పథం లో బాగా మార్పు రావటం నాకే తెలుస్తోంది. మళ్ళా ఇప్పుడిప్పుడే చదువులో కుదురు కున్నాను కదా మళ్ళా ఆగిపోతుందేమోనని భయపడ్డాను.కానీ నాకు తోచిన ఆలోచనల్ని కాగితాల మీద పెట్టి పుస్తకాలు అడుగున దాచేసేదాన్ని.
ఆరోజుల్లోనే జరిగిన చిన్నక్క వివాహం మరో సంచలనం.కోటబొమ్మాళిలో మా స్కూల్లో మాష్టారు వాసుదేవరావు గారు అప్పటి నుండి అక్కని ఇష్టపడ్డారు.విజయనగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ లో 1962 లో సైనిక్ స్కూలు స్థాపించినప్పుడు ఆయనకి అందులో ఉద్యోగం వచ్చింది.మొదటి నుండి ఆయన హార్దికంగా,ఆర్థికంగా అమ్మకి ఆసరాగా ఉన్నారు.పెద్దక్కయ్య తాను మా ఇంట్లో ఉన్నప్పుడే వారి వివాహం నిశ్చయం చేసింది. విశాఖ పట్నం లో రిజిష్టర్ కార్యాలయం లో వివాహం జరిగింది.వాసుదేవరావుగారి తరపున ఆయన సహోద్యోగులు,మా కుటుంబం మాత్రమే హాజరయ్యాము.ఆ వెంటనే చిన్నక్క కోరుకొండ వెళ్ళిపోయింది. వర్ణాంతర వివాహం కావటాన కుటుంబ పెద్ద ఒకరు మావంశవృక్షం రాస్తూ తులసివనం లో గంజాయి మొక్కగా అభివర్ణించారు కానీ తదనంతరం ఆయన కుటుంబంలోనే వర్ణాంతరమేకాదు మతాంతరం, రాష్ట్రాంతరం ,దేశాంతరం వివాహాలు కూడా జరిగాయి.ముఖ్యంగా మా నాన్నగారి తరపు బంధువులు మా చిన్నక్క కుటుంబాన్ని సంపూర్ణంగా,మాకుటుంబాన్ని పాక్షికంగా దూరం పెట్టారు. ఈ సంఘటన వలన కుటుంబ వ్యవస్థపై ముఖ్యంగా మహిళలపై సంప్రదాయాలు,సమాజం వేసే సంకెళ్ళ ప్రభావం గురించి నన్ను ఆలోచింపచేయటం మొదలు పెట్టింది.
నా వ్యక్తిత్వాన్ని సానపెట్టటం మొదలు పెట్టింది అప్పుడే.కోటబొమ్మాళి లో ఉన్నప్పుడూ నేను మాష్టారి చెల్లెలుగా గుర్తింపబడినా నన్ను బాధించలేదు.బహుశా అప్పటికి చిన్నపిల్లనేకావటంవలనకావచ్చు. . ఓ ఇద్దరు ముగ్గురు అన్నయ్య మిత్రులైన స్కూలు మాస్టర్లు మధ్యాహ్నం టిఫిన్ డబ్బాలు తీసుకొని మా ఇంటికి వచ్చి తినేవారు.స్కూలులో నాకు మంచి మార్కులు రావటానికి నేను మాష్టారి చెల్లెల్ని కావటం వల్లే అని కొందరు గుసగుసలు మొదలు పెట్టారు. అది నన్ను చాలా బాధ పెట్టింది.ఇప్పుడు హైస్కూలు చదువు కు వచ్చాను కనుక వయసుతో పాటూ మనసు,ఆలోచన పరిణితి చెందటం నాకే తెలుస్తోంది .SSLC లో ఫైనల్ పరీక్ష పేపర్లు బయట వేల్యుయేషన్ కి ఎక్కడికో పంపుతే ఎవరో దిద్దుతారుకదా అందులోఎలా అయినా నా తెలివితేటల్ని నిరూపించు కోవాలనే పంతం వచ్చింది.
అప్పట్లో SSLC లో మార్కులు హిందీలో కలిపి,హిందీ కలప కుండా అని రెండు విధాలుగా ఫైనల్ లోమార్కులు ఇచ్చేవారు. ఆ విధంగానే పరీక్షల్లో స్కూలు ఫైనల్లో హిందీ కలిపి ఐతే మూడవ స్థానంలో, హిందీ మార్కులు కలప కుండా ఐతే మొదటి స్థానం లో వచ్చాను.
అప్పటి నుండే నన్ను నేను నిరూపించుకోవడానికి,నన్ను నేను నిలబెట్టుకోవడానికి అస్తిత్వ పోరాటానికి బీజం పడింది.