8, జూన్ 2024, శనివారం

అక్షర యోధ

~~ అక్షర యోధ ~~ నిద్రా మెలకువగా కాని స్థితి కలల సాగరంలో విచ్చుకున్న కమలంలా ప్రశ్న నేనెవరిని? నిలువుటద్దంలో అన్ని కోణాల్లో నన్ను నేను పరికించుకున్నాను నేనంటే రెండేసి కాళ్ళూ చేతులూనేనా ముఖాన్నా నిర్విరామ లబ్డబ్ యంత్రాన్నా శ్వాసించే తోలుతిత్తులనేనా ప్రతిజీవికి ఉండే అవయవాలసమూహమేనా నేనంటే అసంతృప్తి నన్ను కుదిపేసింది అప్పుడే అమ్మని అడగాల్సింది కదా X-Y క్రోమోజోముల కలయికేనా అని అసంతృప్తి నన్ను కుదిపేసింది నాలో రూపు దిద్దుకున్న బంగారుకొండవీ అని రెప్పలకింద పొదువుకునేదేమో అమ్మ నేనంటే రూపు దాల్చిన పిండాన్నేనా అసంతృప్తి నన్ను కుదిపేసింది నా కంటిపాపనడిగా నీఅభిరుచులను ఆశయాలతో కలగలిపి నీ కళ్ళల్లో దాచుకున్న పాపనని ఆప్యాయంగా కంటివెలుగైంది నేనంటే అమ్మని మాత్రమేనా అర్థశతాబ్ది నాతో నడిచిన వాడు నేను నీతోడుని నీవు నానీడవి అంటూ అక్కున పొదువుకున్ననాడు ఇంతేనా నీడనేనా నేనంటే ఒకచోట మొలకెత్తి మరోచోట పూలూ కాయలు గా విస్తరించి ఎందరికో బాంధవ్యాన్ని పెంచే ఇల్లాలినేనా నేనంటే బళ్ళో పాఠాన్నయ్యాక విద్యార్థులకూ ప్రశ్న సంధించాను గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః అంటూ చేతులు కట్టుకొని చెప్పినా కంటికొసలనుండి అల్లరి చూపులు చేపపిల్లలై జారుతూనే ఉన్నాయ్ నేనంటే బోధనల టీచర్ నేనా ఆత్మీయ మిత్రుల్నీ పరామర్శించాను సృష్టిలో తీయనిది స్నేహమే కావచ్చు అంతేనా నేనంటే స్నేహాన్నేనా సమాధానం కోసం పువ్వు పువ్వునా తిరిగే తుమ్మెదనయ్యాను నేను నేనేనో కాదో నాలోకి నేను చూసుకున్నాను పిండంగా ఉన్నప్పుడే అభిమన్యుడిలా ఎన్నెన్నో యుద్ధవిద్యల్ని నేర్చుకున్నానేమో అందుకే నేను యోధని పొత్తిళ్ళలో సుతారమల్లెమొగ్గని కాదు అమ్మ గుండెల్లో మరిగిన దుఃఖకణాన్ని కళ్ళు విప్పుతున్నప్పుడే సూర్యుని కిరణాన్ని చేతధరించాను అంధకారాన్ని అఖాతాలకు విసిరేలా వెలుగు బాకుల్ని ఝుళిపిస్తూ సూర్యతేజాన్నయ్యాను అందుకే నేను యోధని నేను సముద్రాన్ని సముద్రపు హోరులో సైతం అలల చీరల్ని చుట్టుకుంటూ కన్నీళ్ళతో పాటూ ప్రాణాల్ని నాగర్భంలో దాచుకోవాలని ఆర్తిగా నా ఆలింగనాన్ని కోరుకున్న దుఃఖితులైన స్త్రీల గాథల్నీ వైనాలు వైనాలు వినిపిస్తూనే ఉన్నాను మనసున్న వాళ్ళు మనిషైనా వాళ్ళూ దుఃఖితులైన స్త్రీల గాథల్నీ ఓసారి చెవి యొగ్గి వినాలి అంతే మునుముందుకు అస్థిత్వాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడల్లా వెనక్కి లాగాలనుకుంటే రెట్టించిన ఉత్సాహాన్ని ప్రోది చేసుకుని ఉరుకులు పరుగులు తీస్తూనే ఉంటాను నేను సముద్రాన్ని నేను వికసించే నవ్వుని కల్లలూ కల్మషాలెరుగని రంగుపూతల మెరుపులు ఎరుగని దాన్ని నేను వికసించే నవ్వుని సురభిళ స్నేహాన్ని వెదజల్లుతూ నవయుగ వైతాళికనై నవయువతరానికి అస్తిత్వాన్ని అద్దుతూ స్వాగత గీతికలు పలుకుతూ ఉత్తేజం కలిగించటానికి అక్షరపరిమళాల స్వాగత గీతికను అవుతుందనే ఉంటాను నేను వికసించే నవ్వుని కల్లలూ కల్మషాలెరుగని రంగుపూతల మెరుపులు ఎరుగని దాన్ని నేను వికసించే నవ్వుని నేను విత్తనాన్ని భూమినుండి తలెత్తుతూనే పత్ర పతాకాన్ని ఎగురవేస్తూ పెరుగుతూ ఎదుగుతూ ఒంటినిండా హరితాన్ని అద్దుకుంటూ స్వచ్ఛమైన శాంతియుత జీవితాన్ని భావి తరానికి అందజేయాలని రేపటి ఆశల్ని పచ్చని చిలుకలుగా మనోవీధుల నిండా ఎగరేస్తూనే ఉంటాను నేను చిన్నారి మొలకను కొత్తకొత్త అంశాలను అంటుకట్టించుకుని వేసవి తాపాన్ని వర్షపు గాలులతో జయించి రేకులురేకులుగా నన్ను నేను విప్పుకుంటూ శాఖలు శాఖలుగా విస్తరించుకుంటూ కొమ్మకొమ్మకూ మొగ్గల కిరీటాలు తొడుక్కుంటూ పూలచీరను ఒళ్ళంతా చుట్టుకుంటాను నేను చిన్నారి మొలకను రేపటి ఆశను విశ్వమంతా పరిమళిస్తుంటాను నేను అక్షరాన్ని కాగితాలపై చల్లిన స్పందనల్ని ఆలోచనలు ఆవాహన చేసుకొని కవితా పక్షులై నాచుట్టూ తిరుగుతూ చెట్టుచెట్టునూ చుట్ట పెడుతూ గుండె తలుపులన్నీ తడుతూ నన్నేగాక ఇంటింటి ఆమెల్నీ పలకరిస్తూ అస్తిత్వ రాగాలాపనల్ని ఎగరేస్తుంటాయి నేను అక్షరాన్ని నేను స్త్రీని చిరు చిరు అడుగులనాడే ఆటలు ఆడుకోవటం చాతకాని జీవితం నాతో జీవితపర్యంతం ఆటాడుకుంటూనేఉంది ఉమ్మనీటి గర్భకుహరంలో పిండాలు ఏక్వేరియంలో ఈదుతున్న చేపపిల్లలై గిలిగింతలు పెట్టినప్పుడైనా దోసిళ్ళతో చిరునవ్వులు ఎగరేసానోలేదో పిడికిటిలో మాత్రం కన్నీటి చెమ్మే నేను స్త్రీని నడక దారిలోని కష్టాల మలుపులని భయంకర అనుభవాల తలుపులు తెరిచి అద్దమై ప్రతిఫలించే జేసే సుదీర్ఘమైన రాత్రి గడిచాక మరింత మెలకువ ప్రోది చేసుకుని పగటితో యోధనై విజయపతాక ఎగరేస్తాను నేను స్త్రీని నేను అక్షరయోధను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి