6, జూన్ 2024, గురువారం

శీలావీ శిల్పరేఖలు లో నా మాట

శిల్పలేఖకులు సహచరులు వీర్రాజుగారికి ప్రేమతో..... వీర్రాజుగారు అక్షరసంపెంగలను రంగులపేపర్లలో పొందికగా అల్లి పంపిన ప్రేమ పరిమళాలు నన్ను ఆవరించటానికన్నా ముందే, చేతిలో చేయేసి నాతో నడకదారిలో అడుగులో అడుగులు కలపక ముందే లేపాక్షిసుందరులతో చూపుల కౌగలింతల్ని పేపర్లనిండా చిత్రించారు. రామప్ప నాగకన్యకలను మెడలో చుట్టుకున్నారు.అజంతా,ఎల్లోరా శిల్పాలను కథనపుష్పాలతో అభిషేకించారు. అయితేనేం వివాహానంతరం కోణార్కశిల్పదంపతులను మాత్రం నా కళ్ళముందుకు ఆహ్వానించారు. తర్వాత్తర్వాత ఎప్పుడైనా ఏదేవాలయాలకైనా వెళ్ళినా వీర్రాజుగారి చూపు ఆ ఆవరణలోనే అక్కడి శిల్పాలను చెక్కుతూ చెక్కుతూ ఆయన్ని ఒక మౌనమునిగా మలిచేస్తూ వుండేది.నేనూ అక్కడే ఆయన్ని చూస్తూ నిశ్చలన శిల్పాన్నైపోయేదాన్ని. వీర్రాజుగారు చేతిలో స్కెచ్ బుక్ ని పట్టుకున్నప్పుడు అనిమేషుడైన శిల్పంలా, డ్రాయింగ్ బోర్డుపైన పేపర్ల నిండా గీసిన రేఖల మధ్య చిక్కుకు పోయినప్పుడు చూపూ,మనసూ, ఆలోచనా ఒకేచోట కేంద్రీకరించిన రుషిలా ,చుట్టూ రంగులు పరుచుకొని వర్ణచిత్రాలు వేస్తున్నప్పుడు రంగులసరస్సులో ఇహాపరాలు మరచి ఈదులాడుతున్న అమాయకపు పసిబాలుడిలా కన్పించేవారు. వీర్రాజుగారికి అక్షరంపైన ఎక్కువ ప్రేమా,రంగులూ,రేఖలపైన ఎక్కువ మోహమా అనేది ఆయన కూడా వివరించలేరు.ఆయనకు రెండూ రెండు కళ్ళు.అందుకే జీవితకాలమంతా వాటిపైనే వెచ్చించారు.వాటి మధ్యే జీవించారు. జర్మనీలో సైతం ప్రదర్శించిన లేపాక్షి శిల్పాల స్కెచ్ లను శిల్పరేఖగా పొందుపరిచి వేసిన పుస్తకాల కాపీలు లేవని తిరిగి, తిరిగి పలుమార్లు ప్రచురించేవారు, ప్రచురించాలనుకునేవారు.లేపాక్షి శిల్పరేఖలే కాకుండా ఆయన వేసిన అజంతా,ఎల్లోరా,రామప్ప, కోణార్క్ శిల్పరేఖల్ని కూడా కలిపి ఒక సంపుటిగా పొందుపరచి శీలా వీర్రాజు గారి స్మృతిగా తీసుకురావటం బాగుంటుంది అని మా కుటుంబం అభిలషించాము. పుస్తకాల్ని ప్రేమించే వీర్రాజుగారికి శిల్పరేఖలన్నింటినీ కూర్చిన మాలగా " శీలావీ శీల్పరేఖలు " పుస్తకం స్మృత్యంజలిగా అందించటం కన్నా గొప్ప నివాళి ఇంకేముంది? పుస్తకాలైనా,ఇల్లైనా,తన ఆవరణాన్నంతటినీ కళాత్మకంగా దిద్దుకోవాలనే కళాదృష్టి కలిగిన వీర్రాజు గారి పుస్తకం కూడా అట్లాగే ఉండాలంటూ చాలా శ్రద్ధగా యీపుస్తకాన్ని అందంగా తీర్చిదిద్ది తీసుకురావటంలో నాకు ఒక బిడ్డలా, కుటుంబ సభ్యుడిలా సహకరించినందుకు ఆత్మీయుడైన అన్వర్ కి ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి