6, జూన్ 2024, గురువారం
నడక దారిలో -41
నడక దారిలో -41
వీర్రాజుగారు క్రమంగా కోలుకొని యథావిధిగా తన కార్యక్రమాలు కొనసాగించసాగారు.ముఖచిత్రాలకోసం ఎవరో ఒకరు రావటం ,లేదా కె.కే.మీనన్ గారుగానీ,రామడుగు రాధాకృష్ణమూర్తిగారు గానీ వచ్చి కబుర్లు చెబుతూ ఉండేవారు.నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూరలు, పప్పు చేసేసేదాన్ని.మధ్యాహ్నం వీర్రాజు గారు తనకోసం కుక్కర్ లో వేడిగా అన్నం వండుకునే వారు.స్నేహితులు వేస్తే వాళ్ళకి కూడా వండి అంతా కలిసి భోంచేసేవారు.
అయితే ఒక్కొక్కప్పుడు నేను అలిసిపోయి ఈసురోమని ఇంటికి వచ్చేసరికి వీర్రాజుగారు చేయి నాడి కొట్టుకోవడం అబ్జర్వ్ చేస్తూ దిగులుగా కూర్చునేవారు.నేను గాభరా పడి ఏమైంది అని అడుగుతే బీపీ పెరిగినట్లుంది అనేవారు.నేను నా నీరసాన్ని విసిరిపారేసి బీపీ చూపించటానికి దగ్గర్లో డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్ళేదాన్ని. తీరా డాక్టరు బీపీ చూస్తే నార్మల్ ఉండేది.నేను కూడా బీజేపి చెక్ చేసుకుంటే 170/90 ఉండేది.అలా చాలా సార్లు జరగటంతో వీర్రాజుగారు ఏడాదికి ఓసారి చూపించుకునే రాజగోపాల్ రాజు దగ్గర నేను కూడా చెకప్ చేయించుకున్నాను.అప్పటినుండీ నలభై అయిదేళ్ళన్నా నిండక ముందునుండే బీపీ మందులు మింగక తప్పలేదు.అంతే కాకుండా తరుచూ ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళు తిరగటం జరిగేది.షుగర్ టెస్ట్ చేయించుకుంటే ఎప్పుడూ వందలోపే ఉండటంతో 'మీ హేండ్ బేగ్ లో చాక్లెట్స్ పెట్టుకోమని,షుగర్స్ తగ్గిపోవటం వలన అలా జరుగుతుంది ' అన్నారుడాక్టర్ .
అప్పట్లోనే డా.పి.భార్గవీరావుగారు వీర్రాజుగారితో ముఖచిత్రం వేయించుకోడానికి వచ్చి పరిచయం అయ్యారు.ఆమె పుట్టుకతో కన్నడిగులు.ఉమెన్స్ కాలేజీలో ఆంగ్లబోధకులు.తర్వాత సిటీకాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు.అడపాదడపా కవితలూ,కథలూ తెలుగులోనే రాసే భార్గవీరావు మంచి అనువాదకురాలు.ఆమె గిరీష్ కర్నాడ్ రాసిన అనేక కన్నడ నాటకాలను తెలుగులోకి అనువదించారు.భార్గవిగారి యిల్లు సంతోష్ నగర్ కావటం వలన మా మధ్య స్నేహమూ పెరిగి రాకపోకలు తరచుగా జరుగుతూ వుండేవి.
ఏవైనా సభలూ సమావేశాలకు వెళ్ళాల్సి వుంటే "నేను కూడా కారు తీసుకుని వస్తాను ,రెడీగా వుండండి "అంటూ తరుచూ మమ్మల్ని తన కారులో తీసుకుని వెళ్ళి తిరిగి ఇంటి దగ్గర దింపే వారు.మీటింగు కి వెళ్ళేటప్పుడు చిక్కడపల్లి సుధా హొటల్ పక్కన కారు ఆపి పూలదండ కొనుక్కునే వారు.ఇప్పటికీ త్యాగరాజ గానసభలోనో, సిటీ సెంట్రల్ లైబ్రరీలోనో సభలో కోసం వెళ్ళినప్పుడు సుధా హొటల్ దగ్గర భార్గవీరావు కళ్ళలో కదలాడుతుంది.దారిపొడుగునా సాహిత్య కబుర్లతో గడిచి పోయేది. భార్గవీరావు మంచి స్నేహశీలి కావటంతో చాలామంది స్నేహితులు వుండేవారు.
87 లో అనుకుంటాను ఒకసారి ఫ్రీవర్స్ ఫ్రంట్ తరపున కవి సమ్మేళనం ఏర్పాటు చేసి ఆ కవితలన్నింటినీ ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణల పేరిట " పెన్గన్" పేరుతో ప్రచురించారు.
అదే విధంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకున్న వారి కవితలే కాకుండా మరికొంతమంది మంచి కవితల్ని ఆంగ్లంలో అనువాదం చేయించి
"Down to the earth " పేరుతో ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణలో పుస్తకం వెలువరించారు.
పల్లవికి ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ లో 13 రేంక్ రావటంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం లోనే ఎమ్మెస్సీ కంప్యూటర్స్ లోనే సీటు వచ్చింది.అయినాసరే సాయంత్రం తిరిగి కంప్యూటర్స్ లోనే అడ్వాన్స్ కోర్సులు నేర్చుకోవటానికి ఆప్టెక్స్ లో చేరింది.నేనుకూడా ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువులో బిజీ అయ్యాను.అయినా అప్పుడప్పుడు మనసులోనో,గొంతులోనో కవితలు కొట్లాడి నప్పుడు రాస్తూనే వున్నాను.
ఏప్రెల్ లో స్పాట్ వేల్యుయేషన్ అడ్డు రావటంతో చదవటం కష్టమయ్యింది. నేను పదోతరగతి క్లాస్ టీచర్ నుంచి కావటం వలన ప్రోగ్రేస్ కార్డులపై నీ లేదు .ఏడో తరగతి కి కూడా కామన్ పరీక్షలు కనుక వాళ్ళపేపర్లూ దిద్దేపని లేదు.ఎనిమిదీ,తొమ్మిది తరగతి పేర్లే దిద్ది ఇవ్వాలి కనుక సంవత్సరాలైంది పనులు నాకు అంతగా ఉండవు.అయినా పదోతరగతి స్పాట్ పూర్తి అయిన తర్వాతే నా పరీక్షలు రావటం కొంత నయమేలే అనుకున్నాను.ప్రిపేర్ కావటానికి కుదిరేది కాదు.అయినా ఈ ఒక్క సంవత్సరం చదివితే పూర్తవుతుంది కదా అని పంతం కొద్ది చదివే దాన్ని.
కానీ ఎమ్మెస్సీపరీక్షలో రియల్ అనాలసిస్ పేపర్ పాస్ కాలేక పోయాను.విశేషమేమిటంటే పల్లవితో బాటూ నేనూ ఆ పరీక్ష రాసి పాసై ఎలా అయితేనేం KS Devi ,MSc ( Maths). అనిపించుకున్నాను.
ఒకరోజు ఎన్.గోపి గారు మాఇంటికి వచ్చి పల్లవిని తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగితే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అంది.దిల్ షుక్ నగర్లో ప్రగతి డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోష్టు ఖాళీ ఉందేమో కొనుక్కో.ఆ కాలేజీ కరస్పాండెంట్ నాకు తెలిసిన వాడే అవసరమైతే నేను చెప్తాను.అన్నారు.పల్లవి మర్నాడు ఆ కాలేజీలో అడుగుతే ఖాళీ ఉందనీ చెప్పి ఇంటర్వ్యూ చేసి,డిమాన్ష్ట్రేషన్ పాఠం కూడా చెప్పమని అడిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు.గోపీగారు చెప్పారో లేదో తెలియదు.కానీ ఉద్యోగం అయితే వచ్చేసింది.
అదే కాలేజీలో శిలాలోలిత,వరవరరావుగారి మరదలు కూడా లెక్చరర్స్ గా పనిచేసేవారు.పల్లవి ఆ ఉద్యోగంలో బిజీ అవుతూనే బిర్లా ఎం.టెక్,ఎంబియే ఎంట్రెన్స్ రాసింది.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పార్ట్ టైమ్ ఎంబియే చేయాలని నిర్ణయించుకుంది.
ఆ వేసవి సెలవుల్లో ఓ వారం రోజులు విజయనగరం వెళ్ళాం.పల్లవి తన మొదటి జీతంతో కొన్న చీర అమ్మమ్మకు ఇచ్చింది.అమ్మ భలే సంతోషపడింది.
అమ్మ చాలా నీరసంగా కనిపించింది.బీపీ ఎక్కువగా ఉంటుందట.రాత్రి నిద్రపట్టడానికి మాత్ర వేస్తున్నారు. కొంచెం వంగి నడుస్తుంది.చేతులు
నొప్పిగా వుండి పీకుతాయో ఏమిటో అమృతాంజనం రుద్దుకుంటుంది.తెల్లవారు జామున లేచి బొగ్గులు కుంపటి అంటించటానికి కూర్చొని చెయ్యి కాపడం పెట్టుకునేది.
"హైదరాబాద్ రాకూడదా" అని అడుగుతే "నేను ఇప్పుడు ఇంకో ఎక్కడికీ రాను" అనేది."నా దగ్గరికి రమ్మన్నా రావటం లేదు" అని చిన్నక్క అంది.
ఎందుకో అమ్మని చూస్తుంటే దుఃఖం వచ్చేది.మా అందరినీ ఎంత కష్టపడి ఎవరినీ అర్థించకుండా పెంచింది.పెద్దన్నయ్య పిల్లల్ని గానీ,కట్టుకున్న ఇల్లుని గానీ కంటితో చూడలేదు.మా ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉన్నప్పటి అనుభవాల వలన ఆడపిల్లల ఇళ్ళకు వెళ్ళి వుండటానికి ఇష్ట పడటం లేదు.
విజయనగరంవచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు "ఇది నా సంపాదనే.నీకు దేనికైనా పనికొస్తుంది ఉంచు "అని బలవంతంగా అమ్మకి చెప్పి తలగడ కింద ఎవరూ చూడకుండా ఓ రెండుమూడు వేలు పెట్టటమే తప్ప ఏం చేయలేని నిస్సహాయతతో కళ్ళనిండా నీళ్ళతో వెళ్ళిపోవటం నాకు ప్రతీసారీ అలవాటే.ఎందుకో ఈసారి అమ్మని చూస్తే మళ్ళీ నేను అమ్మని చూస్తానా అని బెంగ కలిగింది.
స్కూల్ లో కొత్తగా తెలుగు టీచర్ హెచ్చెమ్ అయ్యారు.ఆమెకు ఏమంత పాఠశాలని నడిపించే సామర్థ్యం లేదు.అంతేకాక అథికసంతానం,ఎవరూ సరిఅయిన వాళ్ళు కాదు.ఆమె అసహాయతని తెలిసిన ఉషాటీచర్ ఆమెని రబ్బరు స్టాంపు చేసి తాను చక్రం తిప్పటం మొదలుపెట్టింది.
అప్పుడున్న లెక్కల టీచర్ రిటైర్ అయితే సబ్జెక్టు పరంగా నాకు ప్రమోషన్ వచ్చి తర్వాత నేను హెచ్చెమ్ అవుతాను.అందుకని చాలా తెలివిగా పావులు కలిపి సీనియారిటీ ఆధారంగా తనకు లైన్ క్లియర్ చేసుకోవటం మొదలుపెట్టింది.
అప్పటికే తాత్కాలికంగా ఇద్దరు సార్లు పని చేస్తున్నారు.యాజమాన్యాన్ని వప్పించి టీచర్ల నియామకానికి పత్రికా ప్రకటన వేయించింది.అభ్యర్థులు ₹200/- అప్లికేషన్ కోసం కట్టించి, ఎంట్రెన్స్ పరీక్ష పెట్టారు.నా ప్రమేయం లేకుండానే గణితం,జనరల్ నాలెడ్జ్ పేపర్లు తయారు చేయించారు.తాత్కాలికంగా పనిచేస్తున్న గణితం, డ్రిల్ సార్లు కూడా అప్లై చేసి పరీక్ష రాసారు. వీళ్ళిద్దరే కాకుండా మా పాఠశాల పూర్వ విద్యార్థినీ ఆర్టీసీ ఉద్యోగి కుమార్తె క్రాఫ్ట్ టీచర్ గా పరీక్ష రాసారు.పేపరు నాతో చర్చించి తయారు చేయకపోయినా వేల్యుయేషన్ నన్నూ,నా స్నేహితురాలు ఉమారాణిని చేయమన్నారు.ఒక రెండువందల మంది వరకూ పరీక్ష రాస్తే ముగ్గురికి ఎనభై పైగా వేస్తే మిగతా వారికి ఇరవై శాతం కూడా మార్కులు రాలేదు.దాంతో మాకేగాక ఉద్యోగం కోసం అప్లై చేసినవారందరికీ జరిగిన మోసం అర్థమై స్కూలు మీద దండెత్తాడు, స్కూల్ పేరు,పరువూ పేరుకి ఎక్కడం జరిగింది.
రెడ్డీ పౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వీథిబాలలకు చదువు కొంత చెప్పి వాళ్ళని మా స్కూల్ లో జాయిన్ చేసారు.అందుకు వాళ్ళకీ హెచ్చెమ్ కి ,ఉషాటీచరుకి మధ్య స్నేహ సంబంధాలే కాక ఆర్థిక సంబంధాలు పెరిగాయని తెలిసింది.అప్పటినుండీ స్కూలు పతనం ప్రారంభమైంది.తన మాటలకు వత్తాసు పలికే వాళ్ళని తన అనుయాయులు గా చేసుకుంది.నిజామాబాదునుండి ఓ ఇద్దరు టీచర్లను మా స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించారు.ఇవన్నింటికీ వాళ్ళ దగ్గర బాగా లంచాలు తీసుకున్నారు.
తాను హెచ్చెమ్ కాకుండా నేను పోటీకి వస్తారేమో అనే భయంతో నన్ను వేధింపులకు గురి చేసారు.దాంతో చాలా వత్తిడికి గురయ్యాను.ఇంట్లో ఈ విషయాలు చెప్తే వీర్రాజుగారు " ఎందుకిలా బాధ.ఉద్యోగం మానేసేయ్ . హాయిగా రచనలు చేసుకో " అన్నారు. జీవితంలో ఎన్నో హర్డిల్ రేసులు దాటి అనుకున్నవి సాధించి ఇప్పుడిలా ఓడిపోవడం ఇష్టం లేదు.అందుకే తర్వాత్తర్వాత స్కూల్ విషయాలు ఇంట్లో చెప్పటం మానేసాను.
సంక్రాంతి సెలవులకు చిన్నక్క పిల్లలు కళ్యాణ్,రంజనా వచ్చారు.వాళ్ళతో పల్లవి చార్మీనార్,బజార్లు సరదాగా తిరుగుతోంది.భోగీ రోజు పిండి వంటలు హడావుడిలో ఉన్నాము.విజయనగరం నుండి 'అమ్మకి బాగులేదు హాస్పిటల్ లో జాయిన్ చేసామ'ని చిన్నన్నయ్య నుండి ఫోన్ వచ్చింది.వీర్రాజు గారు అర్జెంటుగా వెళ్ళి టిక్కెట్లు కొని సాయంత్రం అందరం విజయనగరం బయలుదేరాము.
విజయనగరం కొత్తపేట మంటపం దగ్గర హాస్పిటల్లో అమ్మని చేర్చారు.కోమాలోకి వెళ్ళిపోయిన అమ్మకి దగ్గరకు వెళ్ళి " అమ్మా నేను చిన్నాని వచ్చాను" అనిపిలుస్తే " ఊ"అంది.డాక్టర్లు రోజుల్లోనే ఉందనీ, ఆశ వదిలేసుకోవాల్సిందే అన్నారు.
శుభ్రంగా తెల్లచీరలో మల్లెపువ్వులా ఉండి,పగలంతా ఎట్టిపరిస్థితుల్లోనూ పడుకోని ఎరుగని అమ్మని అలా చూస్తుంటే దుఃఖం ముంచుకొచ్చింది.బావగారుపోయిన తర్వాత చిన్నక్కకి ఏ అవసరమైనా అమ్మే అండగా ఉండేది.అందుచేత ఆమె దుఃఖం ఆపుకోలేకపోతోంది.
అమ్మ ఎంత దుఃఖాన్ని మోసిందో,ఎన్ని అవమానాలు మింగిందో "వాణ్ణి నా శవం కూడా ముట్టుకో నివ్వొద్దు "అని మా పెద్దన్నయ్య గురించి అనేది.కాని అతనికి కూడా కబురు చిన్నన్నయ్య అందజేసాడు.
రోజూ పగలంతా నాతో పాటు అక్కలు ఎవరో ఒకరు ఉంటున్నారు.మధ్యలో మా ఆడపడుచు వస్తుంది.రాత్రపూట మగవాళ్ళే ఉంటున్నారు.
సంక్రాంతి పండుగ రోజులు కావటంతో బజారంతా ఖాళీ.మందులుగానీ అవసరమైనవి గానీ కొనటానికి ఇబ్బంది అయ్యింది.సంక్రాంతి రోజు మధ్యాహ్నం మా వదిన వచ్చింది.సుమారు ఇరవై ఏళ్ళ తర్వాత అన్నయ్యనీ,వదిననీ చూసాను.
" ఈ రోజు పెద్ద పండుగ కదా పూజలో మామయ్యగారికి వండినవి మూల పెట్టి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది " అంది.' అత్తకి ఏనాడూ ఓ ముద్దు పెట్టిన పాపాన పోలేదు కానీ ఎప్పుడో పోయిన ఆయనకి పూజలో పెట్టిందట'.అని మనసులో తిట్టుకున్నాను.
సంక్రాంతి మర్నాడే సెలవులైపోయాయని చిన్నన్నయ్య తన పెద్దకొడుకుని కాకినాడ బస్సు ఎక్కించడానికి వెళ్తుంటే "అమ్మ అలా ఉంది కదా ఓ రెండు రోజులు వాడిని ఉంచకపోయావా"అన్నాను."వాడినెందుకులే"అని పంపించేసాడు.బేగ్ తగిలించుకొని వెళ్తున్న నా పెద్ద మేనల్లుడిని చూస్తుంటే జరామరణాలు తెలియని సిద్ధార్థుడిలా కనిపించాడు.
మరో రెండు రోజులకి నేను,చిన్నక్కయ్య అమ్మ దగ్గర ఉన్నాము.కంఠంలోకి పెట్టిన గొట్టం ద్వారా కొంచెం కొంచెం పాలు పట్టి అక్క నేను మాట్లాడుకుంటున్నాము..అకస్మాత్తుగా కొంచెం కదిలి
చిన్నగా మాట్లాడుతున్నట్లు శబ్దం వచ్చింది.గభాలున అమ్మని తడుతూ పలకరించాము.అంతే ఊపిరి ఆగిపోయినట్లైంది.మాకేం చేయాలో తెలియలేదు.అంతలోనే మా పెద్దక్క,మామయ్యా వచ్చేసరికి దుఃఖంపొర్లిపోయింది.
అందరం అక్కడే ఉండటాన చకచకా ఏర్పాట్లు చేసి,మమ్మల్ని ఇంటికి వెళ్ళమని అక్కడికి దగ్గరలోనే శ్మశానానికి తీసుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.నేనూ పెద్దక్కయ్యా ఆటో ఎక్కుతుంటే ఇంటికి వెళ్ళి అమ్మకి చీర తీసుకుని రమ్మని కబురు పెట్టారు. అమ్మ పెట్టెలో ఒక కొత్త చీర ఉంటే అది తీసుకుని అక్కయ్యా నేను
అదే ఆటోలో శ్మశానానికి వెళ్ళి చీర ఇచ్చాము.ఆడవాళ్ళు చనిపోయాకే శ్మశానానికి వెళ్ళాలి తప్ప అలా వెళ్ళకూడదు.కానీ మేము వెళ్ళాము.అనుకోకుండా మేము తీసుకొచ్చిన చీర పల్లవి మొదటి జీతంతో అమ్మమ్మ కోసం కొన్న చీరే అని గుర్తించి అంత విషాదం లోనూ తృప్తి కలిగి చివరిసారిగా అమ్మకు నమస్కరించి వెనుతిరిగాము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి