28, జూన్ 2024, శుక్రవారం
కె.రామలక్ష్మితో నా జ్ణాపకాలు
కె.రామలక్ష్మిగారితో నా జ్ణాపకాలు
1980 ల్లో వాసిరెడ్డి సీతాదేవి గారూ, ఒకప్పుడు పద్మావతి విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న కోలా రాజ్యలక్ష్మి గారూ కలిసి జంటనగరాల్లో రచయిత్రులను కూడగట్టి ఒక్కొక్క నెలా ఒకరి ఇంట్లో కలుసుకొని వస్తున్న సాహిత్యాన్ని గురించి చర్చించేవారు.సీతాదేవిగారివలన నేను అప్పటికి చిరురచయిత్రినే అయినా నన్ను అందులో చేర్చారు.తర్వాత సఖ్యసాహితి అనే సంస్థ గా మార్చారు.సఖ్యసాహితిలో యశోదా రెడ్డి,ఆనందారామం,తురగా జానకీరాణి వంటి ఒకతరం సాహితీ దిగ్గజాలు ఉండేవారు.అప్పట్లోనే రామలక్ష్మిగారిని మొదటిసారి చూసాను.రామలక్ష్మి గారి స్నేహితులు డా.శాంతగారిని,కల్పకంగారి( ఏల్చూరి సీతారాం గారి తల్లి)నీ కూడా కలిసాను.
లేఖిని సాహిత్య సంస్థ ఒకసారి తెలుగు విశ్వవిద్యాలయం తో కలిసి రచయిత్రుల రచనల గురించి సదస్సు నిర్వహించాలనుకున్నప్పుడు నేను రామలక్ష్మి గారి కథలగురించి ప్రసంగిస్తానన్నాను.
ఆసందర్భంగా రామలక్ష్మి గారితో ఆవిడ కథలమీద వ్యాసం రాయాలనుకున్నానని చెప్తే చాలా సంతోషపడి రెండు కథలపుస్తకాలు ఇచ్చారు.నేను రచయిత్రుల కథలగురించి రాయాలనుకున్నది,రాసిన మొట్టమొదటి వ్యాసం
రామలక్ష్మి కథలగురించే.వ్యాసం చూపించితే బాగారాసావోయ్ అని ప్రశంసించారు. ఆ తర్వాత నా ముందుతరం ఇరవైరెండు మంది రచయిత్రుల పై వ్యాసాలు రాసి సంపుటీకరించాను
రామలక్ష్మి గారు స్వతంత్రలో కొంతకాలం సంపాదకత్వం వహించినప్పుడు అదేసమయంలో
తెలుగు స్వతంత్రలో మాపెద్దక్కయ్య పి.సరళాదేవి కూడా ఎక్కువగా రచనలు చేయటం వలన రామలక్ష్మి గారికి నన్ను సరళాదేవి చెల్లెలుగా తెలుసు.
శీలావీర్రాజు భార్యగానూ తెలుసు.
మేము మలకపేటలో ఉన్నప్పుడు మాయింటికి దగ్గరలోనే ఉండేవారు.నేను తరుచూ కలిసేదాన్ని.వాళ్ళింటికింద ఇంట్లో అబాకస్ టీచర్ ఉండేవారు.మా మనవరాలిని అక్కడకి తీసుకు వెళ్ళినప్పుడు క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మిగారి దగ్గర కి వెళ్ళే దాన్ని.ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు.ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో!ఆమె అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు.
నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతు గా చెప్తుంటే బాధకలిగించింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా!
ఒకసారి రామలక్ష్మిగారికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట.ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ " మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్ర గారు అన్నారు.ఒక్క అక్షరం ముక్కా లేదు రామలక్ష్మిగారూ"
అన్నాడు"అని చెప్తూ నవ్వారు.అదివిన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది
కేంద్ర సాహిత్య అకాడమీ కోసం డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని నాకు ఉత్తరం వచ్చినప్పుడు రామలక్ష్మిగారిని కలిసాను.శ్రీదేవి మా పెద్దక్కయ్య కు కుటుంబమిత్రులు.కానీ అక్కయ్యా లేదు కనుక శ్రీదేవి వివరాలు చెప్పగలిగేది రామలక్ష్మి గారే.అదే విషయం ఆమెకు చెప్పి "శ్రీదేవి గురించి మీకు తెలిసిన వివరాలు చెప్తారా" అని అడిగాను.నేను చెప్పేవి నెగెటివ్ గా ఉంటాయి నీకు ఇష్టమేనా అన్నారు.అయితే వద్దులెండి అని వచ్చేసాను.
ఆమెకు పత్రికా రంగంలోనూ,సినిమారంగంలో ను, సామాజిక సేవారంగంలో ను, సాహిత్య రంగంలోనూ, రాజకీయరంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని అనర్గళంగా చెప్పేవారు.ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను,తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు.తనని తానే అందరూ గయ్యాళి నని అంటారని కూడా నవ్వుతూ చెప్పుకుంటారు.నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు.అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు.నిజానికి వారు రచనలు చేసే ఆకాలంలో ఆయారంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ .వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో.
ప్రతీ ఒక్కరి గురించి అందులోనూ సినీ, సాహిత్య రంగంలో లోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను వాళ్ళరెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు.ఆవిడ నెగెటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడ లోని పాజిటివ్ నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం.కదలడానికి కాళ్ళు సహకరించకపోవటంవలన చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం,సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయత్వం గురించి గానీ ,అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలంచరు.ఆ వయసులో కూడా హాస్యంగా,చమత్కారాలతో సానుకూల దృక్పథంతో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంతసేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం.
ఒకసారి జూన్ నాలుగు ఆరుద్ర జన్మదిన సందర్భంగా ఆయన పుస్తకం ఆవిష్కరణ అని నాతో సహా ఒక పదిహేను మంది రచయిత్రులను ఇంటికి పిలిచారు.ఆరుద్రగారి పాటలతో కబుర్లతో సందడిగా గడిపాము.
తర్వాత కూడా మరో రెండుసార్లు ఒకరిద్దరు ఆత్మీయులతో కొన్ని గంటలు గడపటం జరిగింది.
పదేళ్ళ క్రితం మేము ఇల్లు మారటంతో రామలక్ష్మి గారిని కలవటం కుదరలేదు.నా వ్యాససంపుటిని ఆమెకు ఇవ్వటానికి వెళ్ళలేక మా అమ్మాయితో పంపాను.అదిఅందుకున్నాక ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు.తర్వాతైనా వెళ్ళాలను కొని కూడా అశ్రద్ధ చేసాను.
ఇప్పుడు ఈ విధంగా రామలక్ష్మి గారితో నా అనుబంధం తలచు కొని ఆమెకు నివాళి అందించ వలసిరావటం బాధాకరం. ఒకతరంలో తన రచనలతో,తన వాగ్ధోరణితో,ఖచ్చితమైన దృక్పథంతో సాహిత్య కళారంగాలలో సంచలనం కలిగించిన సాహితీ దిగ్గజం తరలిపోయింది.
-- శీలా సుభద్రాదేవి
8106883099
కెవిపి అశోక్ కుమార్ సమీక్ష
నిడదవోలు మాలతి రచనా వైభవం
కవయిత్రిగా,కథకురాలిగా సుప్రసిద్ధురాలైన శీలా సుభద్రాదేవి మంచి విమర్శకురాలు కూడా.విస్మృతికి గురైన రచయిత్రులను,చివరకు స్త్రీవాదులు కూడా పట్టించుకోని అలాంటి వారిని వెతికి పట్టుకుని వారి కథలను-కథన రీతులను విశ్లేషిస్తూ"కథారామంలో పూలతావులు" పేరిట ఒక విమర్శా గ్రంథాన్ని వెలువరించారు.అందులో భాగంగానే ఇప్పుడు నిడదవోలు మాలతి సాహిత్యాన్ని విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు.
నిడదవోలు మాలతి చేపట్టని ప్రక్రియ లేదు.కథలు,వ్యాసాలు,నవలలు,అనువాదాలు, అప్పుడప్పుడు కవితలే కాక మ్యూజింగ్స్,గల్పికల ధోరణిలో రాసినవి కూడా వున్నాయి.ఆమె కుటుంబ వాతావరణం, ఆనాటి సాంఘిక వాతావరణం వారు సాహిత్యరంగంలో ఎదగడానికి ఎలా దోహదం చేశాయో వివరిస్తూ,వారి సమగ్ర రచనల గురించి తెలియజేశారు.
నిడదవోలు మాలతి 1954 నుండి 73 లో అమెరికా వెళ్ళేవరకూ సుమారు రెండు దశాబ్దాల కాలంలో రాసిన కథలు ముప్పయికి పైగా వున్నాయి.మిగతావన్నీ అమెరికా నేపథ్యంలోనే రాసినవి.చాలావరకు కథలలో రెండు జీవితాల మధ్య నలిగిపోతూ స్వదేశాన్ని గుండెల్లో దాచుకుని - అమెరికా జీవితంతో సాదృశ్యాలు,వైరుధ్యాల చింతన కనిపిస్తుంది.మానవ జీవితానికి సంబంధించిన సున్నితమైన కోణాలు,కుటుంబ జీవితంలోని విశ్లేషణాత్మకమైన లోతులు మాలతి రచనల్లోని విశేషణాలు. అలాగే పాత్రల మనోచిత్రణకు,సంఘర్షణకు,సమస్యలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, పరిసరాల చిత్రణకు కూడా అంతే ప్రాధాన్యత నిస్తారని స్పష్టం చేశారు.
తెలుగులోని 150కి పైగా కథలనే కాక అనేకానేక సాహిత్యాంశాలను,సమగ్రమైన వ్యాసాలను అనువదించి తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ దేశాలకు అందుబాటులోకి తెచ్చారు.సంస్థలు,విశ్వ విద్యాలయాలు చేయాల్సిన పనిని ఒకవ్యక్తి పూనుకుని స్థాపించిన "తూలిక" వెబ్ సైట్ ద్వారా అందించడం విశేషమనే చెప్పాలి.తన వ్యాసాలతో పాటు ఇతరులు రాసిన వ్యాసాల్ని కూడా కొన్నింటిని తన తూలికా.నెట్ లో ప్రత్యేకించి పొందుపరచడం మాలతిగారి సౌహార్ద్రతకు నిదర్శనం.
నిడదవోలుమాలతి రాసిన "మార్పు" నవలలో మానవ భావజాలంలో,జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి తెలియజేశారు. ఇందులో మూడుతరాల్ని తీసుకుని క్రమపరిణామాన్ని చెప్పడం ఒకటైతే,రెండవది భిన్న సంస్కృతులలో వచ్చిన మార్పుల్ని చర్చిస్తూనే, మార్పులకు అనుగుణంగా మారని మానవ నైజాన్ని ఎత్తిచూపించారు."చాతక పక్షులు" నవలలో ప్రధానపాత్ర గీత.ఆమె అనుకోకుండా హరిని వివాహం చేసుకుని అమెరికా రావడంతో నవల ప్రారంభమవుతుంది.ఈ నవల కొత్తగా పెళ్ళిచేసుకుని అమెరికాలో అడుగుపెట్టే మామూలు మధ్యతరగతి అమ్మాయిలకు గైడ్ లా పనికొస్తుంది.గీత ప్రతి అనుభవం ఒక పాఠంలా నేర్చుకోవచ్చు.హేలీ సాంగత్యమూ,తపతి అనారోగ్యమూ,తపతి దూరమవ్వడంతో ఒక్కసారిగా గీత ఒంటరి కావడం,తనలోకి తాను చూసుకున్న విధానం.జీవితాన్ని తలపోసుకోవటన్ని మాలతిగారు చిత్రీకరించిన విధానం బాగుంది.
నిడదవోలు మాలతి అనేకమంది తెలుగు రచయితలు,రచయిత్రుల కథలు,నవలలు,యాత్రాచరిత్రలపై అనేక వ్యాసాలు రాశారు.ముఖ్యంగా ఆయా రచనలలోని స్థానికత,సమకాలీనత,భాష,సంస్కృతి వీటన్నింటి గురించి సాధికారికతతో రాయటమే కాకుండా తన అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా,నిర్భయంగా వెల్లడించారు.అలాగే వారు రాసిన వ్యాసాలన్నింటిని నాలుగు సంపుటాలుగా చేసి పీడీఎఫ్ ఫాంలో పొందుపరచి,తన తూలికా వెబ్ సైట్ లో ఆసక్తివున్నవారు చదువుకోవడానికి వీలుగా చేశారు.ఇలా నిడదవోలు మాలతి జీవితాన్ని,వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని,ఆమె సాహిత్యాన్ని విశ్లేషించడంలో శీలా సుభద్రాదేవిగారు చేసిన కృషి,చూపిన ప్రతిభ ప్రశంసనీయం.
కె.పి.అశోక్ కుమార్
(నిడదవోలు మాలతి రచనాసౌరభాలు"శీలా సుభద్రాదేవి.అస్త్ర పబ్లిషర్స్.,సికింద్రాబాద్., వెల 125 రు. పేజీలు 91.సోల్ డిస్త్రిబ్యూటర్స్: అనల్ప బుక్స్)
మీ ఆత్మీయతకు ధన్యవాదాలు మాలతి గారు
బహుభాషా కోవిదుడు - రోణంకి
~~ బహుభాషా నిఘంటువు ఆచార్య రోణంకి ~~
ఒకప్పుడు చారిత్రాత్మక మైన విజయనగరం వీథులలో నెత్తిపైన దొరలటోపీ,ఇన్ షర్టు,కాలికి బూట్లు ధరించి ముంజేతికి చేతికర్ర తగిలించి,మరో చేతిలో ఏ విదేశీ భాషాసాహిత్యగ్రంథమో,.దేశీయ సాహిత్య గ్రంథమో అపురూపంగా గుండెలకు హత్తుకొని శరీరం బక్కచిక్కినట్లున్నా కళ్ళజోడు లోంచి విజ్ణానతేజం పరిసరాలను కాంతివంతంచేసే కళ్ళతో తిరిగే వ్యక్తిని గుర్తుపట్టి భయభక్తులతో తప్పుకొంటూ వెళ్తారే తప్ప ఎదిరించి నిలిచేవారుండరు.
కళాశాలలో ఆంగ్లోపన్యాసం చేసినప్పుడు కవిత్వాన్ని గానం చేస్తూ అభినయిస్తుంటే సాహిత్యం,సంగీతం,నృత్యం ముప్పేటలుగా అల్లుకొని విద్యార్ధులకు ఆంగ్లభాష పట్ల అభిమానం పెల్లుబికేది.పాఠం చెప్తున్నంత సేపు ఆయన పాఠానికి పరవశించే నాగులా ఆయన మెడలోని టై నాట్యం చేస్తుండేది.
ఆయన పాండిత్యానికి మోహితులై ఆనాటి యువతరం ఆయన చుట్టూ తిరిగేవారు.
ఆయనే బహుభాషావేత్త రోణంకి అప్పలస్వామి గారు.నగరం నడిబొడ్డున ఎవరింట్లోనో,తోటలోనో ప్రపంచ కవితాగానం చేస్తుంటే వింటున్న పక్షులు కూడా వంతపాడతాయేమోననిపించేదట.తోటలోని పూలు తన్మయంతో విచ్చుకునేవని ఆచార్యరోణంకి శిష్యులను కలిసి అడుగుతే చెప్తారు.ఆయన శిష్యులు వారిని ఆత్మీయంగా "బాటసారి "అని పిలుచుకునేవారు.
మేధావులు,అభిమానులు, విద్యావేత్త వలతోనూ ఆప్యాయంగా నడిచే బహుభాషా నిఘంటువు గానో,ఆచార్యునిగానో పిలువబడిన రోణంకి అప్పలస్వామి గారు1909 సెప్టెంబర్15 వతేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలిమండలం సమీపాన ఇజ్జవరం గ్రామంలో జన్మించారు.రోణంకి వ్యవసాయ కుటుంబంలో పుట్టారు, తాత పశువుల కాపరి.కానీ తండ్రి రోణంకి నారాయణకి విద్య అబ్బింది. రైల్వే గుమస్తా గా ఉండి కూడా వైద్య గ్రంథాలు చదివారు, స్వయంగా బడి ఏర్పరిచి ప్రభుత్వ గుర్తింపు సంపాదించారు.
తండ్రి ప్రోత్సాహంతో రోణంకి అప్పలస్వామి ఎమ్మే వరకూ చదువుకోవటమే కాకుండా గ్రామఫోన్ ప్లేట్లు పెట్టుకుని జర్మన్,లాటిన్, జపాన్ , స్పానిష్ , గ్రీకు,హీబ్రూ, ఫ్రెంచ్,ఇటాలియన్ వంటి విదేశీ భాషలు నేర్చుకొని అనువాదాలు చేయడంతో సరిపుచ్చుకోక కవిత్వం రాసేటంతటి నైపుణ్యం సాధించిన గొప్ప పండితులు రోణంకి.అదేవిధంగా హిందీ,ఒరియా,కన్నడం,బెంగాలీ వంటి దేశీయ భాషల్లో సైతం అనర్గళంగా ఉపన్యసించేటంతటి నైపుణ్యం సాధించారు.బహుభాషల్లో అంతటి పాండిత్యం సాధించటంతో పాటూ ఆంగ్లభాషలో అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.ఇంతటి పండితుడైనా సరే మాట్లాడేటప్పుడు మాత్రం ఉత్తరాంధ్ర మాండలిక సొబగుతోనే మాట్లాడటం రోణంకి వారికి తన జన్మభూమి,మాతృభాష పట్ల గల అనురక్తి తెలుస్తుంది.
విజయనగరం మహారాజా కళాశాలలో ఆంగ్ల ఆచార్యులు గా పని చేసారు. రోణంకి సాంగత్యం లో ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణబాబువంటి ప్రముఖులు యూరోపియన్ సాహిత్యపు లోతులు తెలుసుకుని స్పూర్తి పొందారు. రోణంకి వారింటికి ఆనాటి ప్రముఖ కవులూ,రచయితలు అందరి రాకపోకలు జరిగేవి.వారందరూ సాహిత్య చర్చలూ, సాహిత్య గోష్టులూ జరిపేవారు.
శ్రీశ్రీ తర్వాత అంతా శూన్యం అని అజంతా, శ్రీశ్రీ ని father of modern poetry అని వేగుంట మోహన ప్రసాద్ అన్నప్పుడు రోణంకి వ్యతిరేకించారు.ఐతే శ్రీశ్రీ అంటే రోణంకి వారికి అపారగౌరవం.అందుకే' "నోటికి పట్టే ఛందస్సులతో శ్రీశ్రీ పరుగులు తీస్తాడు.తన లక్ష్యాన్ని,ప్రత్యక్ష పద్ధతిలోనే వ్యక్తం చేస్తాడం"టారు శ్రీశ్రీ కవిత్వం గురించి రోణంకి.
కవిత్వపు విలువలు ఎక్కడ ఉన్నా పులకించిపోయే హృదయం ఆయనది.అందుకే ఆత్మాశ్రయకవులలో కూడా ఒక విశిష్టత లేకపోలేదంటారు.కృష్ణశాస్త్రి కావచ్చు, నారాయణబాబు కావచ్చు ఉత్తమ కవిత్వం కాలాతీతమైనదిగా భావిస్తారు రోణంకి .
ఆయన అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు.
తొలిరోజుల్లో " SONGS AND LYRICS " పేరిట 1935లో తొలి సంపుటిని వెలువరించారు. అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలూ శ్రీశ్రీ, నారాయణబాబు కవితల్నే కాక నండూరి సుబ్బారావు,విశ్వ సుందరమ్మ,చావలి బంగారమ్మ , చాసో మొదలగు వారి రచనల్ని సైతం ఆంగ్లంలోకి అనువాదం చేసినవి కూడా దేశవిదేశీి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గురజాడ " పూర్ణమ్మ గేయం, తోకచుక్కలు "ఆంగ్లీకరించారు రోణంకి .
మేకియవెల్లీ ఇటాలియన్ భాషలో రాసిన "ప్రిన్స్" గ్రంధాన్ని "రాజనీతి" పేరిట సరళమైన తెలుగులో అనువదించారు.ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తో రోణంకిని సత్కరించి భారతీయ భాషలన్నింటిలోకి అనువదింప జేసింది.
ఆరుద్ర తన తొలి కావ్యం ‘త్వమేవాహం’నూ, మానేపల్లి తన తొలి కవితా సంపుటి " వెలిగించే దీపాలు" నూ రోణంకి వారికి అంకితం చేసారు. నారాయణ బాబు గ్రంథం " రుధిర జ్యోతి" కి ముందుమాట గా రోణంకి రాసిన ప్రస్తావన విమర్శనారంగానికి ఒక కొత్తదారిని చూపిందని చెప్పవచ్చు.
మానేపల్లి, చిత్రభాను, వేగుంట మోహనప్రసాద్,అరుణ కిరణ్ ,రంధి సోమరాజు మొదలగు వారి పుస్తకాలకు రోణంకి రాసిన ముందుమాటలు ప్రశంసా పత్రాలుగా చెప్పవచ్చును.
ఆంధ్రజ్యోతి , ఆంధ్రపత్రిక,భారతి, అభ్యుదయ ,ఆంధ్రప్రదేశ్,కళాకేళి,ప్రజారథం,సృజన తదితర పలు పత్రికల్లో ప్రత్యేక సంచికలు రోణంకి గారు రాసిన అనేక విమర్శనాత్మకమైన సాహిత్య వ్యాసాలు ప్రచురించారు.
ప్రముఖ క్రీడాకారుడు కోడిరామ్మూర్తి పై ఒక పుస్తకాన్ని రాశారు.
,1972-77 లమధ్య ఆచార్య రోణంకిని జాతీయ ఉపన్యాసకులుగా భారతప్రభుత్వం నియమించింది.ఈ హోదాతో దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉండాలని, కేంద్రమే విద్యాబాధ్యత తీసుకోవాలని ప్రచారం చేసారు.
1974-78 మధ్యకాలంలో రోణంకి ఆంధ్రా విశ్వవిద్యాలయం లో గౌరవప్రొఫెసర్ గా UGC చే నియమితులయ్యారు.
చివరి రోజుల్లో " ది నావ్ అండ్ అదర్ పోయెమ్స్ " పేరిట కవితాసంపుటి 1985 లో వెలువడింది.
చివరిరోజుల్లో అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు నాటి ఆంధ్రభూమి దినపత్రిక ' రోణంకి కన్నుమూత ' అని వార్త ప్రచురిస్తే రోణంకి అదిచూసి తన వార్త తానే చూసుకునే అవకాశం దొరికింది అని నవ్వుకున్న ఆశావాది రోణంకి అప్పలస్వామి. 1987 మార్చి 28 న టెక్కలి స్వగృహంలో బహుభాషా కోవిదుడు అయిన ఆచార్య రోణంకి అప్పలస్వామి గారు తుది శ్వాస తీసుకున్నారు.
కళింగాంధ్ర ఆణిముత్యం అని చెప్పదగిన మహోన్నత వ్యక్తి రోణంకి . ఆయన కృషి గుర్తింపుకు రాలేదు. అందుకే చాసో 'ఆంధ్ర దేశం దౌర్భాగ్యం ఈజ్ ఈక్వల్ టు రోణంకి' అన్నారు.
ఏ విధమైన పురస్కారాలు పొందకపోయినా చివరి రోజుల్లో రోణంకి అప్పలస్వామి గారు నివసించిన ప్రదేశమైన టెక్కలి ప్రజలు అక్కడ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రోణంకి గారి విగ్రహం ప్రతిష్టించటమే కాక ఒక వీథికి రోణంకి అప్పలస్వామి వీథిగా నామకరణం చేసి వారిపై తమ గౌరవాన్ని చాటుకున్నారు.
( సెప్టెంబర్ 15 రోణంకి గారి 114వ జయంతి సందర్భంగా)
19, జూన్ 2024, బుధవారం
నడక దారిలో -42
నడక దారిలో -42
జీవితకాలమంతా ఎన్నో ఆటుపోటులు,నిందలూ,అపనిందలూ,అవమానాలు మోసినా చివరిలో ఎంతో కాలం మంచంమీద ఉండి అందరూ విసుగుచేందే పరిస్థితి లేకుండా వెళ్ళిపోయింది అమ్మ అనుకుంటూ తిరిగి హైదరాబాద్ చేరాను
మర్నాడు స్కూలు కి వెళ్తే పదిరోజుల సెలవంతటినీ ఎర్నెడ్ లీవుకింద కట్ చేసారు."అదేమిటి ఇంకా జనవరే కదా క్యాజువల్ లీవ్ గా పరిగణించాలని ఉత్తరం పంపాను కదా "అన్నాను.ఆఫీసు స్టాపుతో లాలూచిపడి ఎవో కథలు చెప్పింది కాబోయే హెచ్చెమ్ అయిన ఉషా టీచర్.తగువు పెట్టుకునే మూడ్ లేక మౌనంగా వూరుకున్నాను.
నేను వూరు నుండి వచ్చిన వారం రోజులకే గంటి వెంకటరమణ కూతురు పెళ్ళి.అందరికీ ఇచ్చి నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు.హడావుడిలో మర్చిపోయిందో ఏమో అనుకున్నాను.పిల్లల చదువులకూ,ఇంకా అనేక ఇతరేతర ఆర్థిక ఆటుపోట్లలో ఆమెను సాయశక్తులా ఆదుకున్న నన్ను ఎందుకు దూరం పెట్టిందో అర్థం కాలేదు.అయినా నేనూ వీర్రాజుగారూ పెళ్ళికి వెళ్ళాం.పిలవని పేరంటానికి వెళ్ళామేమోనని నేను ఇబ్బంది పడ్డాను.ఆ తర్వాత ఇంకేదో సందర్భంలో తెలిసింది.మా అమ్మ పోయినందుకు నన్ను పిలవలేదని.ఎక్కడో వేరే వూరిలో అమ్మ పోయింది.అందరూ నమ్మే ఆచారాలు ప్రకారమే అయినా నాకు పెళ్ళయ్యింది కనుక నా గోత్రం వేరే అవుతుంది కనుక నిజానికి నాకు చావు మైల లేనట్లే కదా.నాకు ఈ విషయాలపట్ల మరింత అసహ్యం వేసింది.నా డబ్బుకు మైల లేదా అనుకున్నాను.అప్పటి నుండి సాంప్రదాయాలనీ ,ఆచారాలనే కొన్ని సామాజిక వర్గాలకు దూరంగా వుండటం మంచిదని తెలిసింది.అంతే కాదు వ్యక్తులు కన్నా డబ్బుకు విలువనిచ్చే వ్యక్తుల దగ్గరా మెలకువగా వుండాలనుకున్నాను.
1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలోకి చొరబడి రాజ్యాంగేతరశక్తిగా కలు ఎదగాలనుకోవటం పార్టీలో ఇతరులకు అసహనం కలిగించటంతో రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో అనివార్యంగా ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది.అంతేకాదు అనారోగ్యసమస్యలు కూడా ఆయన్ని చుట్టుముట్టాయి.
అంతలోనే మళ్ళా విజయనగరం ప్రయాణం వచ్చింది.చిన్నక్క కూతురు రంజనకు పెళ్ళి కుదిరింది.మళ్ళా అందరం వెళ్ళాం.అమ్మ ఉంటుండగానే తెలుస్తూనే అమ్మ ఎంత సంతోషపడి ఉండేదో అని నేనూ,మా చిన్నక్క అనుకున్నాం.సంబంధం వెతకటం,సెటిల్ చేయటం అన్నీ అక్కబావగారు బంకుపల్లె మల్లయ్య శాస్త్రిగారే చూసినట్లు ఉన్నారు.ఈ పెళ్ళిలో అక్క అత్తింటి వారందర్నీ సుమారు ఇరవై ఏళ్ళ తర్వాత కలుసుకోవటం జరిగింది.అక్కకి పెద్ద బాధ్యత తీరిందని మేమంతా అనుకున్నాము.
ఇంకా స్కూల్ లో గణితంలో స్కూల్ అసిస్టెంట్ ఇందిర కుమారి పదవీవిరమణ చేసారు.సబ్జెక్టు ప్రకారం అయితే నాకు ప్రమోషన్ రావాలి.కానీ మాది ఎయిడెడ్ స్కూల్ కావటంతో నాకన్నా సీనియర్ అయిన బయాలజీ టీచర్ కి ప్రమోషన్ చేసారు.అయితే హైస్కూల్ కు లెక్కలూ, ఫిజికల్ సైన్సెస్ నేను చెప్తున్నాను.అంటే పరీక్షలు పరంగా మూడు పేపర్లు ,ముఖ్యమైన ఒకటిన్నర సబ్జెక్టులు చెప్తున్నట్లు.బయాలజీ టీచర్ సగం సబ్జెక్టే చెప్తున్నట్లు.
సెకెండరీ గ్రేడ్ పోష్టులో ఉంటూ అంత శ్రమ పడటం అవసరమనిపించలేదు.అందుకని నేను తొమ్మిది,పది తరగతులకు మాత్రమే రెండూ చెప్తాననీ ఎనిమిది,ఏడూ తరగతులు వేరే టీచర్లకు వేయమని పట్టు పట్టాను.తప్పని పరిస్తితుల్లో మూలుగుతూనే కొత్త హెచ్చెమ్ ఒప్పుకుంది.
రెడ్డీ ఫౌండేషన్ వాళ్ళు బస్తీల్లోనూ, వీథిబాలలనూ సేకరించి ఏడవతరగతీ,పదవతరగతి పరీక్షలకు సిద్ధపరిచే కార్యక్రమాల్లో భాగంగా మా స్కూల్ లో కూడా కోచింగ్ కోసం ఒక తరగతి గది ఏర్పాటు చేసారు వాళ్ళతో కలిసి మా హెచ్చెమ్. మా ఖాళీ పిరియడ్ లలో వాళ్ళకు పాఠాలు చెప్పమని మాకు కూడా చెప్పారు.సామాజిక సేవలో భాగంగా అప్పుడప్పుడు నేనూ,నా స్నేహితురాలు ఉమా చెప్పేవాళ్ళం.
తర్వాత్తర్వాత తెలిసిందేమిటంటే ఫౌండేషన్ వాళ్ళు స్కూల్లో తరగతి గది ఏర్పాటు చేసినందుకే కాక పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకూ రెమ్యునరేషన్లు ఇస్తున్నారని.కానీ అవి మా వరకూ రాలేదు.ఏమయ్యాయో తెలియదు.
పోలీస్ వారు మైత్రీ,దివ్యదిశల ద్వారా వీథిబాలలను తీసుకువచ్చి స్కూల్ లో చేర్చేవారు.అది కాక ఒక ఆమె అనాధాశ్రమం నడుపుతూ ఆ పిల్లల్ని స్కూల్ లో చేర్చింది.ఈ పిల్లలు ఎక్కువ అయిపోవటంతో చదువుమీద శ్రద్ధ ఉన్న పిల్లలు తగ్గిపోవటం వలన ఆ ప్రభావం పదోతరగతి ఫలితాల మీద పడటం మొదలైంది.దాంతో పని వత్తిడి పెరిగింది.అప్పటికీ బాగా చదువుతారనుకునే పిల్లలను కోచింగుకి పంపటానికి ప్రయత్నించాము.
ఒకవైపు హెచ్చెమ్ కక్ష కట్టినట్లుగా ముఖ్యంగా నన్ను,మరొక టీచర్ను పరోక్షంగా ఏదోరకంగా కించపరుస్తూ మాట్లాడటం కొంత చికాకులకు లోనయ్యాను.కానీ అవేవీ ఇంట్లో చెప్పేదాన్ని కాదు.
ఈ లోగా అమ్మ సంవత్సరానికి ఆకులు రమ్మని చిన్నన్నయ్యనుండి ఆహ్వానం.ఈసారి ముందుగానే మెడికల్ లీవ్,స్పెషల్ క్యాజువల్ లీవులు పెట్టాను. జనవరి 17 కి విజయనగరం చేరాము.మర్నాడు అమ్మ సంవత్సరీకం.
ఉదయం తెల్లవారేసరికి రాష్ట్రమే కాకుండా దేశం అంతా దిగ్భ్రాంతి చెందే వార్త.మాజీముఖ్యమంత్రీ, తెలుగు వారి అభిమాన నటుడు ఎన్టీఆర్ మరణించాడు.విజయనగరంలోనే ఉన్న మా అక్కయ్యా వాళ్ళూ, ఇతర బంధువులూ రావటానికి కూడా ఏవిధమైన వాహనాలూ దొరక్క ఇబ్బందులు పడుతూ వచ్చారు.అంతటా ఈ విషయం గురించే చర్చ.రకరకాలుగా అనేకానేక పుకారులూ,ఊహాగానాలూ, నందమూరి కుటుంబమంతా ఏకమయ్యారు.వేడివేడి వార్తలు పేపర్ల నిండా,ఛానెల్స్ నిండా.
అన్ని ఆటంకాలు లోనూ రావాల్సిన ముఖ్యమైన వారందరూ రావటంతో అమ్మసంవతసరీకాలు బాగాజరిగాయి.బైట వాళ్ళందరూ వెళ్ళిపోయాను చిన్నన్నయ్య మా అక్కచెల్లెళ్ళకీ,మా పెద్దవదినకీ తాను కొన్ని చీరలు ఇచ్చాడు.ఇప్పుడు అర్థాంతరంగా చీరలు ఎందుకో అర్థం కాలేదు.ఎందుకో అకస్మాత్తుగా మా పెద్ద వదిన అప్పట్లో అన్నమాట ' రుణం తీరిపోయింది ' గుర్తు వచ్చింది.ఇన్నాళ్ళు అమ్మ వుంది కనుక "ఆమ్మ దగ్గరకు వెళ్తున్నాం " అనుకునేదాన్ని.ఇప్పుడు అమ్మ లేదు.అన్నయ్య ఇంటికి వెళ్తున్నాం అనుకోవాలి కదా.కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి.
ఆ సాయంత్రం బండికే తిరిగి హైదరాబాద్ బయలుదేరాము.
వీర్రాజు గారికి రెండేళ్ళ క్రితం అనుకుంటాను తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం వచ్చింది.మాకు పురస్కారాలు గానీ,పుస్తకాలు అమ్మకం పై వచ్చిన డబ్బు గానీ ఒకచోట చేర్చి దాంతో కళాకృతులు గానీ,తిరిగి మరో పుస్తకం ప్రచురించారు కోవటం గానీ అలవాటు.ఈసారి వీర్రాజు గారు శిల్పారామం లో కార్వింగు చేసిన తలుపులు చూసి ముచ్చట పడ్డారు.దానికోసం ముందుగా టేకు కొని తలుపులు చేయించేసారు.ఒకసారి ఎప్పుడో ఒక కుర్రాడు కాళహస్తిలో ఉడ్ కార్వింగ్ నేర్చుకున్నానని ఏదైనా పని చెప్పమని అడగటం గుర్తువచ్చి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఇంటికి పిలుచుకు వచ్చారు.ఆ తలుపులకి కార్వింగ్ చేయమన్నారు.అతనిపేరు సిద్ధిరాములు ఒక డిజైను వేసుకు వేస్తే దానిని మరింత ఎక్కువగా మార్పులు చేసారు వీర్రాజు గారు.సిద్దిరాములు మా ఇంటి వరండాలోనే కూర్చుని కార్వింగ్ చేసాడు.చివరికి వీర్రాజు గారు కోరుకున్న విధంగా అద్భుతంగా కళాత్మకంగా తయారయ్యే సరికి ఆయన పరమానందంతో సిద్ధిరాములి ప్రతిభకి చెప్పిన దానికన్నా ఎక్కువగానే డబ్బు ఇచ్చారు.
అయితే మళ్ళా దగ్గర్లోనే విజయనగరం వెళ్ళాల్సి వచ్చింది.చిన్నక్క కొడుకు కళ్యాణ్ కి పెళ్ళి అని పిలుపు వచ్చింది.సంబరంగా బయలుదేరాము.రంజనకు బాబు పుట్టాడు.మా అక్కచెల్లెళ్ళకు మొట్టమొదటి మనవడు.అమ్మమ్మనైపోయాను.అదో సంబరం.వీర్రాజు గారు కొత్తగా కెమేరా కొన్నారు.దాంతో బాబుని ఒళ్ళో వేసుకొని అందరం ఫొటోలు తీయించుకున్నాం.సాంప్రదాయంగా జరుగు తోన్న ఆ పెళ్ళి తంతులన్నీ వరుసగా వీర్రాజు గారు ఫొటోలు తీసారు.చిన్నక్క తన కోడలు జయని మాకు పరిచయం చేసారు.సన్నగా,చిన్నగా మంచిరంగుతో పెద్దజడతో చక్కగా వుంది.ఇంతకు ముందు అందరి పెళ్ళిళ్ళలో మేమంతా ఆడపెళ్ళివారం.ఇప్పుడు కళ్యాణ్ పెళ్ళిలో మగపెళ్ళివారంగా జరుగుతోన్న కార్యక్రమాలలో పాల్గొన్నాము.పెళ్ళి సంబరాలు పూర్తై తిరిగి హైదరాబాద్ చేరుకున్నాం.
డా.వరలక్ష్మి జనపతి గారు ఇంగ్లీష్ లో FINESSE AND FANTASY OF TELUGU WOMEN అనే పేరుతో తెలుగు సంస్కృతి , సంప్రదాయాలు, అలవాట్లు, అభిరుచులు వీటన్నింటి మీద ఒక పుస్తకం రాశారు.ఆ పుస్తకంలో కళ్యాణ్ పెళ్ళిఫొటోలనన్నింటినీ చేర్చి చాలా శ్రద్ధగా ఆ పుస్తకాన్ని రూపొందించారు వీర్రాజుగారు.అది మొత్తం తెలుగువారి జీవితం,జీవనవిధానం,కళలూ,పండుగలూ,ఆటలూ,పాటలూ ఇలా సమస్తమైన ముఖ్య సందర్భాలనన్నింటికీ సచిత్రంగా ఒక గొప్ప రికార్డుగా రూపొందించారు వీర్రాజుగారు.డా.జె.వరలక్ష్మిగారు యీ పుస్తకాన్ని వీర్రాజుగారికే అంకితం చేసారు.
వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేసరికి పల్లవికి కూడా చేయాలనే విషయం మనసులోకి వచ్చింది.చదువు పూర్తై ఉద్యోగం కూడా చేస్తోంది.
ఈ లోపున కొంతమందిబంధువులకూ, వీర్రాజు గారి మిత్రులకూ సంబంధాల గురించి ప్రస్తావించటం తో వీర్రాజు గారి మిత్రులు దేవాంగసంఘంలో పల్లవి పేరు నమోదు చేసారు.దాంతో సంబంధాలు రాసాగాయి.కానీ ఒక్కొక్క దానితో ఒక్కొక్క అనుభవం.అఃదరూ మా కున్న ఆస్తిపాస్తులు గురించే ఆరా తీయటం కొంత ఇబ్బంది కలిగింది.వచ్చిన డబ్బంతా పుస్తకాలు ప్లచురణలకూ,కళాకృతులు కొనటానికే అయిపోయింది.
సికింద్రాబాద్,కాప్రా ప్రాంతంలో పద్మశాలి వారు కొంతస్థలంసంఘం తరపున కొని ప్లాట్లు ఆ కులంవారికే కేటాయించాలని అనుకోవటం తెలిసి
నేను ఉద్యోగంలో చేరాక గోపీగారు వీర్రాజు గారిని ఒప్పించి ఆ యూనిట్ లో చేర్చారు.ఆ విధంగా అరుణ పేరు,నా పేరు అందులో నమోదు అయ్యాయి.అతి తక్కువ డబ్బు కట్టించు కానున్నారు.లాటరీ ద్వారా ప్లాట్లు అలాట్ చేసాక మిగతా వాయిదా పద్ధతిని కట్టాలి.అంతా అయ్యాక ఆ స్థలం డిస్ప్యూట్ లో పడింది.అది ఎప్పటికైనా తేలుతుందో లేదో తెలియదు.
మేమున్న ఇల్లు తప్ప మరేమీ లేదు.అంతకుముందు మా స్కూల్ దగ్గర షాపులో వేసిన చిట్టీ పూర్తి అయితే పల్లవికి నెక్లెస్ తీసుకున్నాను.అదేవిధంగా చిన్నచిన్న నగలు కొనటం జరిగింది.
నేవీలో పనిచేసే సంబంధంలో ఆర్నెల్ల సముద్రం మీదే ఉంటాడని,బహుశావ్యసనాలు కూడా ఉండొచ్చని వద్దనుకున్నాం.అమెరికా సంబంధాలు వచ్చినా, కట్నకానుకలపై వారి ఆశకి అంత దూరం ఉన్న ఒక్క పిల్లనీ పంపటం ఇష్టం లేకుండా మౌనం వహించాము.
అప్పటికి నాకు నలభై అయిదు ఏళ్ళు వయసు చిన్నగా కనిపించే దాన్ని.ఒకసారి సంబంధం కోసం వచ్చిన అబ్బాయితల్లి మీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారా అని అడిగింది.వెంటనే నాకు అర్థం కాలేదు.పల్లవి తర్వాత మరొకరు పుడితే ఆస్తి పంపకం గురించే ఆవిడ ఆరా అని తర్వాత కొంత అవగాహన చేసుకున్నాను.ఆ అనుభవం తర్వాత పల్లవి పెళ్ళి గురించి భయం కలిగింది.ఎన్నో కథలు చదువుతాం,రాస్తాం, వింటాం.కానీ మనకి అనుభవంలో ఎదురయ్యే కథలు ఎలా ఉంటాయో కదా.
తాత్విక వేదనామయగాథ -రోజీ
~ తాత్విక వేదనామయగాథ -రోజీ ~
సినీతార జీవితాన్ని రావూరి భరద్వాజ వంటి ఎందరో అక్షరబద్ధం చేశారు.అయితే రంథి సోమరాజు బహుశా కుందుర్తి ప్రభావం వలన కావచ్చును వచన కథా కవితగా మలిచారు.
పల్లెటూరిలో ఆకలి తెలిసిన బుల్లెమ్మ తన యాసా,భాషా,వాసన కలిగిన బుల్లెమ్మ, ఊర్వసో, మార్లిన్ మన్రో కాక పోవచ్చు,కానీ తన వేదనని ఎవరి ముందూ పరవని బుల్లెమ్మ రోజీగా మారే క్రమంలో తనలోంచి తాను అదృశ్యమై పోతున్నానని గ్రహించింది.ఆమె మనసులో రగుల్తోన్న మంటల్ని వెళ్ళడించింది.ఆమె భాష,రూపం కూడా అదృశ్యం కావడమే రంథి సోమరాజు గారి కలం నుండి రోజీ అనే నవకవితగా రూపొందింది .
నిజానికి ఇది చాలా వరకూ అక్కడక్కడా మాత్రా ఛందస్సు పోకడలు పోలి ఉంది. సినీతారల విషాద జీవితం ఎవరు రాసినా ప్రక్రియ ఏదైనా అంతరార్థం ఆవేదనా అంతరప్రవాహంగా సాగినప్పుడు చెమ్మ మనసుకు తగులటం సహజం.పైపైన చదివే వారికు మాత్రం హాట్ హాట్ గానే వుంటుంది.
"ఫ్లవరంత వెయింటుండు' అంటూ రోజీ కవితని ప్రారంభించిన సోమరాజు తన జీవన ప్రస్థానాన్ని ఒక ఆత్మకథగా రోజీయే కవితో చెప్తున్నట్లుగా రాసారు.
"పూర్వాసి బుల్లెమ్మ/ సుక్కల్లె యెలుగూతు వున్నాది " అని చెప్పినా ఆ తళుకులు ఝరీబుటాల్ సినీమెరుపులే తప్ప మరేమీ లేదనేది తెలిసినదే.
" కోట్లాది జనాలు పెదాలు/యీ హొయలు సూసి
కంటి యెలుగుల్లూ సూసి/నా సుట్టూతా భజనాలు
సేత్తూను వున్నారు" అని ప్రజల్ని చూసి జాలిపడ్తుంది.
రా.వి.శాస్త్రిగారు రచనలలో, పాత్రో గారు నాటికలలో,కారామాష్టారు కథలలో ప్రవేశ పెట్టిన శైలిని కవితలలో జొప్పించి,ఉత్తరాంధ్ర ప్రాంతపు మాండలికంలో తొలిసారి కవిత్వం రాసిన ఘనత రంధి సోమరాజుగారికే దక్కింది.
రోజీని ప్రగతి పత్రిక (1975)లో ప్రచురించినప్పుడే చదివి 'మంచుకన్నీటి సోయగంగా అభివర్ణించి రంథి సోమరాజుగారు చావులేని రోజీని సాహిత్యలోకానికి అందించార'ని దాశరథి ప్రశంసించారు.
" ఎలిజి బెత్ టేలర్ని / కాలికొన గోటితో యిసిరేసిన
సౌందర్య వారాసిని"అని మురిసి పోయింది రోజీ.
తనని కౄరంగా సప్రస్ చేసిన ఆకలిని," యింత కూలీ కోసం / రూయిన్ చేయబోయిన నియంతను "
రోజీ మర్చిపోలేక పోయింది.
"ఆకలేసి కేక వెయ్య లేదంటుంది. ఎంత మహిమాన్వితుడికైనా ఆకలి తీరిన మరుక్షణంలోనే విజృంభించేది మాత్రం కామమే. అందుకే
"ఆకలికి ఆకలి తీరినా/ ఆకలిగా మిగిలి పోయె ఆకలేర యవ్వనం " అంటూ మొదట్లో తనయవ్వనానికి, తన ఒంపు సొంపులకు మురిసినా అకలికి కారణం తెలిసిన తాత్వికత ఆమెని ఆవరిస్తుంది.
తనని కామదృష్టితో చూసి దోచుకో ప్రయత్నించిన లైట్ బాయ్, మేకప్ మేన్, కెమేరామెన్ వీళ్ళందర్నీ చూసి జాలి పడుతుంది . తర్వాత్తర్వాత తనని చూసి మురిసిపోయికూడా దరిచేర లేకపోవటానికి తన సౌందర్యం కాదని తన కన్నుల్లో జ్వలించే జిజ్ఞాసా పూరిత తాత్విక జ్ఞానజ్యోతి వాళ్ళని నిలిపేస్తుంది అని నమ్ముతుంది.
"నువ్వు మంత్రించావో గారడీచేసావో
నేనిలా నగ్నంగా నామనసుని నీ ముందు పరిచేస్తున్నానేమిట'ని సందేహిస్తుంది.
పాలగుమ్మి పద్మరాజుని ముందుమాట రాయమని సోమరాజు ఇస్తే "రోజీ చదువుతుంటే అద్వైతానుభూతి తన్నావరించిందనీ, వానలాగ, చీకటిలాగ, నింగినీ నేలనూ ఏకానుభవం చేయగల లక్షణం ఏదో ఈ రోజీ లో ఉంది" అని రాసారు.
"గుడ్డలూ వొల్సీసి / ఒయ్యరి సిట్టిని
మాటలూ సిదిమీసి / సిల్పంగ సేసేసినారో " అని
రోజీ తనని మనసున్న మనిషిగా చూడలేదని వేదన చెందుతుంది ఈ క్రమంలో తనతో క్రీడించిన మనుషుల రొమాన్టిక్ ఆట
'గెలాక్సీ పరిష్వంగాల ఆట' అంటుంది రోజీ
'నేను జ్వాలాశిఖర చలత్ చలిత లీలా కీల
స్నిగ్ధ కిరణ్మయిని'అంటుంది కానీ మనసులో వేదన కవిత అంతటాపరివ్యాప్తం చేస్తుంది.
అందుకే 'శోకంలో పునీతమైన మనసు అనంతాన్ని దర్శిస్తుంది. దాని అలజడే రోజీ' అంటారు యం రామకోటి
బుల్లెమ్మ నుండి రోజీగా పరిణామం చెందే క్రమంలో పల్లె మాండలిక భాషతో కావ్యాన్ని ప్రారంభించిన సోమరాజు తర్వాత్తర్వాత మధ్య మధ్య ఇబ్బడిముబ్బడిగా మణిప్రవాళ భాషగా ఆంగ్లపదాలను గుప్పించి తదనంతరం సంక్లిష్ట సమాసాలతో రాయటం రోజీ జీవనప్రయాణంగా సహజంగానే ఉంది.
ఆంగ్ల పదాలను సాఫ్టీగా, హెవెన్లీగ, రంగూలె స్ప్రేయించి, కారులు స్టార్టించి, స్లోయీగ పొమ్ము అంటూ కొత్త పదాలుగా మార్చారు.
"మీ రోజీ బాగుంది. ముళ్ళు పువ్వులైనట్లు, ఎర్రగులాబి తెల్లగా కన్నీళ్ళు చిలికినట్లు ఉంది. ప్లవరంత వెయిటుతో ప్రారంభమైన కావ్యం ప్రాణదీపంగా ప్రకాశించింది " అని ప్రశంసించారు సినారె.
'ఈ రోజున మహోదథిని నేను' అంటూ తన వేదన అంతా వెళ్లగక్కిన తర్వాత ఎంతో రిలీఫ్ గా అనుభూతి చెందుతుంది. 'ఏ అవార్డులు, నోబుల్ ఫ్రైజులూ ఇవ్వలేని ఆనందం కలిగిందంటుంది. విశాల విశ్వం తనలోనే ఉన్నట్లు భావిస్తుంది. 'ఇంతవరకు నాలో నేను చనిపోయి వారిని నిలువు దోపిడి చేస్తున్నానని 'బాధపడింది. తన ఆస్తినంతటినీ ప్రజల పేరిట అందజేసి ,
"దళితవర్గాల/చీకటి చిదిమి వేయ చలించు. ప్రాణజీవమునై" అని ముగింపుగా రోజీ చిరంజీవిగా ఉంటుందని చెప్తూ కవి రోజీ ఆత్మకథను పూర్తి చేసాడు.
'ఎత్తుగడలో, భావుకతలో సుందరమైన కావ్యం రోజీ.తాత్వికంగా ఇది ఎంతో పరిపుష్టమైన రచన ' ఆర్ ఎస్ సుదర్శనం గారి అభినందన అక్షరాలా నిజం.
కనక్ ప్రవాసీ అన్నట్లు వాడీ,వేడీ,శక్తీ,రక్తీ అన్నీ
రంథి సోమరాజు " రోజీ " నవ కవితలో గుండె రక్తం నుండే వచ్చి వుంటాయి.
14, జూన్ 2024, శుక్రవారం
జీవితమే ఒక వర్ణచిత్రః
~ జీవితమే ఒకవర్ణచిత్రం ~
నేనొక చిత్రం గీయాలి
మనసు కేన్వాస్ ని పరిచాను
చూపుని సూదిలా చెక్కుకున్నాను
తీరా వేయాల్సిన బొమ్మ
తీరుగా రాకముందే
సూది ముల్లు పుటుక్కున విరిగింది
పదేపదే చెక్కుకుంటునే ఉన్నాను
నేనొక చిత్రం గీయాలి
కనీసం పెన్నుతోనైనా వెయ్యాలి
కలం పొందికగా వేళ్ళమధ్య
అందమైన అమ్మాయిలా
అమరికగా కూర్చొని నవ్వింది
విజిల్ వూది పరిగెత్తించాను
గీతలు గీయటం మరచిన వేళ్ళు
కాన్వాస్ నిండా అక్షరాల్ని కుప్పపోసాయి
నేనొక చిత్రం ఎలా అయినా గీయాలి
అల్మారా లోంచి రంగులపొదితీసి
కాలంతీరినవి పక్కన పడేసి
జీవం వున్న రంగుల్ని
మురిపంగా చేతుల్లోకి తీసుకున్నాను
కోరిక తీరబోతోందనుకున్నంతలో
బాటిళ్ళలోని రంగులు చేజారి
కాన్వాస్ మీద ఒలికి పోయాయి
అయ్యో అనుకుంటూ కాన్వాస్ అందుకున్నాను.
ఒక్కసారిగా నా కళ్ళు మెరిసాయి
నా ముందు రంగురంగుల వర్ణశోభితమై
కాన్వాస్ మీద జీవితం వెలుగులు చిమ్ముతోంది
అందం అయినా ఆనందమైనా
ఉండేది చూసే చూపులోనే
రాగమైనా రంగులైనా అనురాగమైనా
పరుచుకోవాల్సిందీ బతుకు కేన్వాస్ మీదే
8, జూన్ 2024, శనివారం
కాస్తంత సిగ్గుని పంచుదామా
కాస్తంత సిగ్గుని పంచుదామా?
అప్పుడెప్పుడో అగ్నిప్రవేశం జరిగిందంటే
ఏదో కట్టుకథలే అని తేలిగ్గా తీసిపారేశాం
మరి ఇప్పుడేంటి
తెల్లారి లేచిన దగ్గరనుండి
కుంపటితో నేస్తం చేస్తూ
అనుమానం రగిల్చిన కొలిమి
ఎప్పుడు అంటుకొంటుందోననే భయంతో
బిక్కుబిక్కుమంటూ
కొంగు మొలనే చెక్కుకుంటున్నాం
అప్పుడెప్పుడో నడివీథిలో
అమ్మకం బేరాలు జరిగాయంటే
కొంగుతో కళ్ళొత్తుకుని దిగులుపడతాం
మరి ఇప్పుడేంటి
రాత్రీ పగలూ అమ్మకపు సరుకులైన వేళ
కొంగు భుజాల చుట్టూ కప్పుకొని
ఒళ్ళంతటినీ చీరలో చుట్టుకొన్న కకూన్లమైపోతుంటాం
అప్పుడెప్పుడో నిండుసభలో
వస్త్రాపహరణం జరిగిందంటే
ఆవేశంవచ్చి ఒళ్ళుమరిగినా
పొద్దున్నే లేచింది మొదలుగా
బస్సుల్లో, బజార్లో, కార్యాలయాల్లో
ఎన్ని కళ్ళో రహస్యంగానో
కళ్ళద్దాల తెరల్లోంచో దొంగతనంగానో
మన దుస్తుల లోలోపలకి
చూపుల్ని చొప్పించి ఎక్స్ రేలు తీస్తుంటే
మనది కాని తప్పుల్ని మోస్తూ ముద్దైపోతునే ఉన్నాం
ఐనా మనం నిజానికి
ఒంటినిండా వస్త్రాలు ధరించామనుకుంటున్నాం
కానీ
ఏనాడైతే చూపుల్తో ఒలిచేసారో
ఆనాటి నుండీ
మనం ఎప్పుడూ వాళ్ళకంటికి దిగంబరులమే
మన అవయవాలెప్పుడో బహిరంగమే
ఇప్పుడు కొత్తగా దాచాల్సింది ఏముంది
ఏ వర్గాన్ని భూస్థాపితం చేయాలనుకున్నా
పరికరంగా మారేది మన జననాంగాలే కదా
ఒలిచిన వాడో తాకిన వాడో
జుట్టు పట్టి ఈడ్చుకొస్తున్నవాడో
ఎవడైతేనేం కిరాతకుడే
వాళ్ళు తల్లి జననాంగం నుంచి
రానివాళ్ళే అయ్యుండాలి
సరే కానీ ఇప్పుడు సిగ్గు పడాల్సింది
నిండుసభలో నోరు కుట్టేసుకున్న వాళ్ళై
విద్వేషచర్యల్ని ఘనకార్యంగా
తెరవెనుకనే దొంగల్లా దాక్కునే ఉండి
పరమానందంగా అరచేతియంత్రంలో కెక్కించి
ప్రపంచమంతా ప్రదర్శించాలనుకున్నవాళ్ళున్నారే
వాళ్ళే తల్లిపాలు తాగని వాళ్ళు
ఇంక చేయాల్సింది
మనం వదిలేసుకున్న సిగ్గునంతట్నీ
కాస్త కాస్తంత వాళ్ళ ముఖాన కొడదాం రండి
( సంతకం వేదిక జూమ్ కవిసమ్మేళనం లో)
అక్షర యోధ
~~ అక్షర యోధ ~~
నిద్రా మెలకువగా కాని స్థితి
కలల సాగరంలో
విచ్చుకున్న కమలంలా ప్రశ్న
నేనెవరిని?
నిలువుటద్దంలో అన్ని కోణాల్లో
నన్ను నేను పరికించుకున్నాను
నేనంటే
రెండేసి కాళ్ళూ చేతులూనేనా
ముఖాన్నా
నిర్విరామ లబ్డబ్ యంత్రాన్నా
శ్వాసించే తోలుతిత్తులనేనా
ప్రతిజీవికి ఉండే అవయవాలసమూహమేనా
నేనంటే
అసంతృప్తి నన్ను కుదిపేసింది
అప్పుడే అమ్మని అడగాల్సింది కదా
X-Y క్రోమోజోముల కలయికేనా అని
అసంతృప్తి నన్ను కుదిపేసింది
నాలో రూపు దిద్దుకున్న బంగారుకొండవీ
అని రెప్పలకింద పొదువుకునేదేమో అమ్మ
నేనంటే
రూపు దాల్చిన పిండాన్నేనా
అసంతృప్తి నన్ను కుదిపేసింది
నా కంటిపాపనడిగా
నీఅభిరుచులను ఆశయాలతో కలగలిపి
నీ కళ్ళల్లో దాచుకున్న పాపనని
ఆప్యాయంగా కంటివెలుగైంది
నేనంటే అమ్మని మాత్రమేనా
అర్థశతాబ్ది నాతో నడిచిన వాడు
నేను నీతోడుని నీవు నానీడవి అంటూ
అక్కున పొదువుకున్ననాడు
ఇంతేనా నీడనేనా నేనంటే
ఒకచోట మొలకెత్తి
మరోచోట పూలూ కాయలు గా విస్తరించి
ఎందరికో బాంధవ్యాన్ని పెంచే ఇల్లాలినేనా
నేనంటే
బళ్ళో పాఠాన్నయ్యాక
విద్యార్థులకూ ప్రశ్న సంధించాను
గురు బ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరః
అంటూ చేతులు కట్టుకొని చెప్పినా
కంటికొసలనుండి అల్లరి చూపులు
చేపపిల్లలై జారుతూనే ఉన్నాయ్
నేనంటే బోధనల టీచర్ నేనా
ఆత్మీయ మిత్రుల్నీ పరామర్శించాను
సృష్టిలో తీయనిది స్నేహమే కావచ్చు
అంతేనా నేనంటే స్నేహాన్నేనా
సమాధానం కోసం
పువ్వు పువ్వునా తిరిగే తుమ్మెదనయ్యాను
నేను
నేనేనో కాదో
నాలోకి నేను చూసుకున్నాను
పిండంగా ఉన్నప్పుడే అభిమన్యుడిలా
ఎన్నెన్నో యుద్ధవిద్యల్ని నేర్చుకున్నానేమో
అందుకే నేను యోధని
పొత్తిళ్ళలో సుతారమల్లెమొగ్గని కాదు
అమ్మ గుండెల్లో మరిగిన దుఃఖకణాన్ని
కళ్ళు విప్పుతున్నప్పుడే
సూర్యుని కిరణాన్ని చేతధరించాను
అంధకారాన్ని అఖాతాలకు విసిరేలా
వెలుగు బాకుల్ని ఝుళిపిస్తూ
సూర్యతేజాన్నయ్యాను
అందుకే నేను యోధని
నేను సముద్రాన్ని
సముద్రపు హోరులో సైతం
అలల చీరల్ని చుట్టుకుంటూ
కన్నీళ్ళతో పాటూ ప్రాణాల్ని
నాగర్భంలో దాచుకోవాలని
ఆర్తిగా నా ఆలింగనాన్ని కోరుకున్న
దుఃఖితులైన స్త్రీల గాథల్నీ
వైనాలు వైనాలు వినిపిస్తూనే ఉన్నాను
మనసున్న వాళ్ళు మనిషైనా వాళ్ళూ
దుఃఖితులైన స్త్రీల గాథల్నీ
ఓసారి చెవి యొగ్గి వినాలి అంతే
మునుముందుకు అస్థిత్వాన్ని
ప్రదర్శించాలనుకున్నప్పుడల్లా
వెనక్కి లాగాలనుకుంటే
రెట్టించిన ఉత్సాహాన్ని ప్రోది చేసుకుని
ఉరుకులు పరుగులు తీస్తూనే ఉంటాను
నేను సముద్రాన్ని
నేను వికసించే నవ్వుని
కల్లలూ కల్మషాలెరుగని
రంగుపూతల మెరుపులు ఎరుగని దాన్ని
నేను వికసించే నవ్వుని
సురభిళ స్నేహాన్ని వెదజల్లుతూ
నవయుగ వైతాళికనై
నవయువతరానికి అస్తిత్వాన్ని అద్దుతూ
స్వాగత గీతికలు పలుకుతూ
ఉత్తేజం కలిగించటానికి
అక్షరపరిమళాల స్వాగత గీతికను
అవుతుందనే ఉంటాను
నేను వికసించే నవ్వుని
కల్లలూ కల్మషాలెరుగని
రంగుపూతల మెరుపులు ఎరుగని దాన్ని
నేను వికసించే నవ్వుని
నేను విత్తనాన్ని
భూమినుండి తలెత్తుతూనే
పత్ర పతాకాన్ని ఎగురవేస్తూ
పెరుగుతూ ఎదుగుతూ
ఒంటినిండా హరితాన్ని అద్దుకుంటూ
స్వచ్ఛమైన శాంతియుత జీవితాన్ని
భావి తరానికి అందజేయాలని
రేపటి ఆశల్ని పచ్చని చిలుకలుగా
మనోవీధుల నిండా ఎగరేస్తూనే ఉంటాను
నేను చిన్నారి మొలకను
కొత్తకొత్త అంశాలను అంటుకట్టించుకుని
వేసవి తాపాన్ని వర్షపు గాలులతో జయించి
రేకులురేకులుగా నన్ను నేను విప్పుకుంటూ
శాఖలు శాఖలుగా విస్తరించుకుంటూ
కొమ్మకొమ్మకూ మొగ్గల కిరీటాలు తొడుక్కుంటూ
పూలచీరను ఒళ్ళంతా చుట్టుకుంటాను
నేను చిన్నారి మొలకను
రేపటి ఆశను విశ్వమంతా పరిమళిస్తుంటాను
నేను అక్షరాన్ని
కాగితాలపై చల్లిన స్పందనల్ని
ఆలోచనలు ఆవాహన చేసుకొని
కవితా పక్షులై నాచుట్టూ తిరుగుతూ
చెట్టుచెట్టునూ చుట్ట పెడుతూ
గుండె తలుపులన్నీ తడుతూ
నన్నేగాక ఇంటింటి ఆమెల్నీ పలకరిస్తూ
అస్తిత్వ రాగాలాపనల్ని ఎగరేస్తుంటాయి
నేను అక్షరాన్ని
నేను స్త్రీని
చిరు చిరు అడుగులనాడే
ఆటలు ఆడుకోవటం చాతకాని జీవితం
నాతో జీవితపర్యంతం ఆటాడుకుంటూనేఉంది
ఉమ్మనీటి గర్భకుహరంలో పిండాలు
ఏక్వేరియంలో ఈదుతున్న చేపపిల్లలై
గిలిగింతలు పెట్టినప్పుడైనా
దోసిళ్ళతో చిరునవ్వులు ఎగరేసానోలేదో
పిడికిటిలో మాత్రం కన్నీటి చెమ్మే
నేను స్త్రీని
నడక దారిలోని కష్టాల మలుపులని
భయంకర అనుభవాల తలుపులు తెరిచి
అద్దమై ప్రతిఫలించే జేసే
సుదీర్ఘమైన రాత్రి గడిచాక
మరింత మెలకువ ప్రోది చేసుకుని
పగటితో యోధనై విజయపతాక ఎగరేస్తాను
నేను స్త్రీని
నేను అక్షరయోధను.
7, జూన్ 2024, శుక్రవారం
మాట్లాడడానికి మనిషి కావాలి
~ మాట్లాడటానికి మనిషి కావాలి ~
యంత్రంలో తలదూర్చి
మూలుగుతూ ముక్కుతూ
అచ్చులు నేర్చుకుంటున్నట్లు
అఆలు ఉఊల పలకరింపుల మనిషికాదు
దారిలోని పూల తావుల్ని మోసుకొచ్చిన
చల్లని మలయసమీరంలా మనసును సేదతీర్చి
మాట్లాడటానికి మనిషి కావాలి
మలమల మాడిపోయే ఇసుక ఎడారి
లోలోన నింపుకుని
హాయిగా కిలకిల వాడే ఆకుపచ్చని ఆకుమడితో ముఖాన్ని అలంకరించుకొన్న మనిషి కాదు
మనసునే పూలమడి చేసుకొంటూ
మాట్లాడటానికి మనిషి కావాలి
కళ్ళలో కల్మషపు జీరలనూ
పెదాలపై ప్లాస్టిక్ చిరునవ్వు పూతలనూ
మనసులోని నలుపు పాకే ముఖాన్ని
అందమైన స్నేహపు తొడుగుకింద దాచుకొని
ఆలింగనం చేసుకొనే మేకతోలు పులికాదు
సెలయేటి స్వచ్ఛతను నింపుకుని
అలసిన హృదయానికి అక్షరాల్ని అలంకరిస్తూ
మాట్లాడటానికి మనిషి కావాలి
నాచుట్టూ నీచుట్టూ
మన ఇంటినిండా ఈ ప్రపంచం నిండా
గిరగిరా గరగరా
తిరుగుతున్న మనిషియంత్రాలు
స్పందన ఎరుగని యంత్రమనుషులు కానేకాదు
ఒక కన్నీటి చెమ్మ కలిగిన నిజమైన మనిషి
మాట్లాడటానికి మనకో మనిషి కావాలి.
నువ్వు వెళ్ళింది ఎక్కడ
~ నువ్వు వెళ్ళింది ఎక్కడ....~
నువ్వు వెళ్ళిపోయావంటున్నారు
కానీ వెళ్ళింది ఎక్కడ
ఆనాడు లేఖలనిండా
అద్దిన మోహపరవశం
హృదయాన్ని నింపిన అక్షరపారిజాతాలు
ఈనాడు ఒంటరితనపు తోడై
పరిమళాల్ని మనసుపై చల్లుతూనే ఉన్నాయ్
నువ్వు వెళ్ళిపోయావంటున్నారు
కానీ వెళ్ళింది ఎక్కడ
ఆనాడు చూపులతో కొలుస్తూ
రంగుల్లో రంగరించి గీచినరేఖలెన్నో
మనోముంగిలినిండా రంగవల్లికలై
గోడలపై కాన్వాసుల నిండా
తీర్చిన చిత్రాల కొలువై
మురిపిస్తూనే ఉన్నాయ్
నువ్వు వెళ్ళిపోయావంటున్నారు
కానీ వెళ్ళింది ఎక్కడ
నా అక్షరాల్ని ఆలింగనం చేసుకుని
అలంకరించిన చీరలఅంచులతో
గజారోహణం చేస్తున్న మహారాణుల్లా
అద్దాలతెరల వెనక ఒద్దికగా కూర్చొని
పుస్తకాలు పలకరిస్తూనే ఉన్నాయి.
నువ్వు వెళ్ళిపోయావంటున్నారు
కానీ వెళ్ళింది ఎక్కడ
ఇంటినిండా నీ ముద్రలు జలతారు చాందినీలై
ఏమూలన చూసినా వెలుగుతూనే ఉన్నై
నేను రాస్తున్న అక్షరాల్లో
తడితడిగా వేళ్ళని తాకుతూనే ఉన్నావు
నువ్వు వెళ్ళిపోయావంటున్నారు
కానీ వెళ్ళింది ఎక్కడ
ఇప్పుడు మరీ నా వెనకెనకేవదలకుండా
నీడై వెంటాడుతునే ఉన్నావు కదా
6, జూన్ 2024, గురువారం
నడక దారిలో -41
నడక దారిలో -41
వీర్రాజుగారు క్రమంగా కోలుకొని యథావిధిగా తన కార్యక్రమాలు కొనసాగించసాగారు.ముఖచిత్రాలకోసం ఎవరో ఒకరు రావటం ,లేదా కె.కే.మీనన్ గారుగానీ,రామడుగు రాధాకృష్ణమూర్తిగారు గానీ వచ్చి కబుర్లు చెబుతూ ఉండేవారు.నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూరలు, పప్పు చేసేసేదాన్ని.మధ్యాహ్నం వీర్రాజు గారు తనకోసం కుక్కర్ లో వేడిగా అన్నం వండుకునే వారు.స్నేహితులు వేస్తే వాళ్ళకి కూడా వండి అంతా కలిసి భోంచేసేవారు.
అయితే ఒక్కొక్కప్పుడు నేను అలిసిపోయి ఈసురోమని ఇంటికి వచ్చేసరికి వీర్రాజుగారు చేయి నాడి కొట్టుకోవడం అబ్జర్వ్ చేస్తూ దిగులుగా కూర్చునేవారు.నేను గాభరా పడి ఏమైంది అని అడుగుతే బీపీ పెరిగినట్లుంది అనేవారు.నేను నా నీరసాన్ని విసిరిపారేసి బీపీ చూపించటానికి దగ్గర్లో డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్ళేదాన్ని. తీరా డాక్టరు బీపీ చూస్తే నార్మల్ ఉండేది.నేను కూడా బీజేపి చెక్ చేసుకుంటే 170/90 ఉండేది.అలా చాలా సార్లు జరగటంతో వీర్రాజుగారు ఏడాదికి ఓసారి చూపించుకునే రాజగోపాల్ రాజు దగ్గర నేను కూడా చెకప్ చేయించుకున్నాను.అప్పటినుండీ నలభై అయిదేళ్ళన్నా నిండక ముందునుండే బీపీ మందులు మింగక తప్పలేదు.అంతే కాకుండా తరుచూ ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళు తిరగటం జరిగేది.షుగర్ టెస్ట్ చేయించుకుంటే ఎప్పుడూ వందలోపే ఉండటంతో 'మీ హేండ్ బేగ్ లో చాక్లెట్స్ పెట్టుకోమని,షుగర్స్ తగ్గిపోవటం వలన అలా జరుగుతుంది ' అన్నారుడాక్టర్ .
అప్పట్లోనే డా.పి.భార్గవీరావుగారు వీర్రాజుగారితో ముఖచిత్రం వేయించుకోడానికి వచ్చి పరిచయం అయ్యారు.ఆమె పుట్టుకతో కన్నడిగులు.ఉమెన్స్ కాలేజీలో ఆంగ్లబోధకులు.తర్వాత సిటీకాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు.అడపాదడపా కవితలూ,కథలూ తెలుగులోనే రాసే భార్గవీరావు మంచి అనువాదకురాలు.ఆమె గిరీష్ కర్నాడ్ రాసిన అనేక కన్నడ నాటకాలను తెలుగులోకి అనువదించారు.భార్గవిగారి యిల్లు సంతోష్ నగర్ కావటం వలన మా మధ్య స్నేహమూ పెరిగి రాకపోకలు తరచుగా జరుగుతూ వుండేవి.
ఏవైనా సభలూ సమావేశాలకు వెళ్ళాల్సి వుంటే "నేను కూడా కారు తీసుకుని వస్తాను ,రెడీగా వుండండి "అంటూ తరుచూ మమ్మల్ని తన కారులో తీసుకుని వెళ్ళి తిరిగి ఇంటి దగ్గర దింపే వారు.మీటింగు కి వెళ్ళేటప్పుడు చిక్కడపల్లి సుధా హొటల్ పక్కన కారు ఆపి పూలదండ కొనుక్కునే వారు.ఇప్పటికీ త్యాగరాజ గానసభలోనో, సిటీ సెంట్రల్ లైబ్రరీలోనో సభలో కోసం వెళ్ళినప్పుడు సుధా హొటల్ దగ్గర భార్గవీరావు కళ్ళలో కదలాడుతుంది.దారిపొడుగునా సాహిత్య కబుర్లతో గడిచి పోయేది. భార్గవీరావు మంచి స్నేహశీలి కావటంతో చాలామంది స్నేహితులు వుండేవారు.
87 లో అనుకుంటాను ఒకసారి ఫ్రీవర్స్ ఫ్రంట్ తరపున కవి సమ్మేళనం ఏర్పాటు చేసి ఆ కవితలన్నింటినీ ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణల పేరిట " పెన్గన్" పేరుతో ప్రచురించారు.
అదే విధంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకున్న వారి కవితలే కాకుండా మరికొంతమంది మంచి కవితల్ని ఆంగ్లంలో అనువాదం చేయించి
"Down to the earth " పేరుతో ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రచురణలో పుస్తకం వెలువరించారు.
పల్లవికి ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ లో 13 రేంక్ రావటంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం లోనే ఎమ్మెస్సీ కంప్యూటర్స్ లోనే సీటు వచ్చింది.అయినాసరే సాయంత్రం తిరిగి కంప్యూటర్స్ లోనే అడ్వాన్స్ కోర్సులు నేర్చుకోవటానికి ఆప్టెక్స్ లో చేరింది.నేనుకూడా ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువులో బిజీ అయ్యాను.అయినా అప్పుడప్పుడు మనసులోనో,గొంతులోనో కవితలు కొట్లాడి నప్పుడు రాస్తూనే వున్నాను.
ఏప్రెల్ లో స్పాట్ వేల్యుయేషన్ అడ్డు రావటంతో చదవటం కష్టమయ్యింది. నేను పదోతరగతి క్లాస్ టీచర్ నుంచి కావటం వలన ప్రోగ్రేస్ కార్డులపై నీ లేదు .ఏడో తరగతి కి కూడా కామన్ పరీక్షలు కనుక వాళ్ళపేపర్లూ దిద్దేపని లేదు.ఎనిమిదీ,తొమ్మిది తరగతి పేర్లే దిద్ది ఇవ్వాలి కనుక సంవత్సరాలైంది పనులు నాకు అంతగా ఉండవు.అయినా పదోతరగతి స్పాట్ పూర్తి అయిన తర్వాతే నా పరీక్షలు రావటం కొంత నయమేలే అనుకున్నాను.ప్రిపేర్ కావటానికి కుదిరేది కాదు.అయినా ఈ ఒక్క సంవత్సరం చదివితే పూర్తవుతుంది కదా అని పంతం కొద్ది చదివే దాన్ని.
కానీ ఎమ్మెస్సీపరీక్షలో రియల్ అనాలసిస్ పేపర్ పాస్ కాలేక పోయాను.విశేషమేమిటంటే పల్లవితో బాటూ నేనూ ఆ పరీక్ష రాసి పాసై ఎలా అయితేనేం KS Devi ,MSc ( Maths). అనిపించుకున్నాను.
ఒకరోజు ఎన్.గోపి గారు మాఇంటికి వచ్చి పల్లవిని తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగితే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అంది.దిల్ షుక్ నగర్లో ప్రగతి డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోష్టు ఖాళీ ఉందేమో కొనుక్కో.ఆ కాలేజీ కరస్పాండెంట్ నాకు తెలిసిన వాడే అవసరమైతే నేను చెప్తాను.అన్నారు.పల్లవి మర్నాడు ఆ కాలేజీలో అడుగుతే ఖాళీ ఉందనీ చెప్పి ఇంటర్వ్యూ చేసి,డిమాన్ష్ట్రేషన్ పాఠం కూడా చెప్పమని అడిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు.గోపీగారు చెప్పారో లేదో తెలియదు.కానీ ఉద్యోగం అయితే వచ్చేసింది.
అదే కాలేజీలో శిలాలోలిత,వరవరరావుగారి మరదలు కూడా లెక్చరర్స్ గా పనిచేసేవారు.పల్లవి ఆ ఉద్యోగంలో బిజీ అవుతూనే బిర్లా ఎం.టెక్,ఎంబియే ఎంట్రెన్స్ రాసింది.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పార్ట్ టైమ్ ఎంబియే చేయాలని నిర్ణయించుకుంది.
ఆ వేసవి సెలవుల్లో ఓ వారం రోజులు విజయనగరం వెళ్ళాం.పల్లవి తన మొదటి జీతంతో కొన్న చీర అమ్మమ్మకు ఇచ్చింది.అమ్మ భలే సంతోషపడింది.
అమ్మ చాలా నీరసంగా కనిపించింది.బీపీ ఎక్కువగా ఉంటుందట.రాత్రి నిద్రపట్టడానికి మాత్ర వేస్తున్నారు. కొంచెం వంగి నడుస్తుంది.చేతులు
నొప్పిగా వుండి పీకుతాయో ఏమిటో అమృతాంజనం రుద్దుకుంటుంది.తెల్లవారు జామున లేచి బొగ్గులు కుంపటి అంటించటానికి కూర్చొని చెయ్యి కాపడం పెట్టుకునేది.
"హైదరాబాద్ రాకూడదా" అని అడుగుతే "నేను ఇప్పుడు ఇంకో ఎక్కడికీ రాను" అనేది."నా దగ్గరికి రమ్మన్నా రావటం లేదు" అని చిన్నక్క అంది.
ఎందుకో అమ్మని చూస్తుంటే దుఃఖం వచ్చేది.మా అందరినీ ఎంత కష్టపడి ఎవరినీ అర్థించకుండా పెంచింది.పెద్దన్నయ్య పిల్లల్ని గానీ,కట్టుకున్న ఇల్లుని గానీ కంటితో చూడలేదు.మా ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉన్నప్పటి అనుభవాల వలన ఆడపిల్లల ఇళ్ళకు వెళ్ళి వుండటానికి ఇష్ట పడటం లేదు.
విజయనగరంవచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు "ఇది నా సంపాదనే.నీకు దేనికైనా పనికొస్తుంది ఉంచు "అని బలవంతంగా అమ్మకి చెప్పి తలగడ కింద ఎవరూ చూడకుండా ఓ రెండుమూడు వేలు పెట్టటమే తప్ప ఏం చేయలేని నిస్సహాయతతో కళ్ళనిండా నీళ్ళతో వెళ్ళిపోవటం నాకు ప్రతీసారీ అలవాటే.ఎందుకో ఈసారి అమ్మని చూస్తే మళ్ళీ నేను అమ్మని చూస్తానా అని బెంగ కలిగింది.
స్కూల్ లో కొత్తగా తెలుగు టీచర్ హెచ్చెమ్ అయ్యారు.ఆమెకు ఏమంత పాఠశాలని నడిపించే సామర్థ్యం లేదు.అంతేకాక అథికసంతానం,ఎవరూ సరిఅయిన వాళ్ళు కాదు.ఆమె అసహాయతని తెలిసిన ఉషాటీచర్ ఆమెని రబ్బరు స్టాంపు చేసి తాను చక్రం తిప్పటం మొదలుపెట్టింది.
అప్పుడున్న లెక్కల టీచర్ రిటైర్ అయితే సబ్జెక్టు పరంగా నాకు ప్రమోషన్ వచ్చి తర్వాత నేను హెచ్చెమ్ అవుతాను.అందుకని చాలా తెలివిగా పావులు కలిపి సీనియారిటీ ఆధారంగా తనకు లైన్ క్లియర్ చేసుకోవటం మొదలుపెట్టింది.
అప్పటికే తాత్కాలికంగా ఇద్దరు సార్లు పని చేస్తున్నారు.యాజమాన్యాన్ని వప్పించి టీచర్ల నియామకానికి పత్రికా ప్రకటన వేయించింది.అభ్యర్థులు ₹200/- అప్లికేషన్ కోసం కట్టించి, ఎంట్రెన్స్ పరీక్ష పెట్టారు.నా ప్రమేయం లేకుండానే గణితం,జనరల్ నాలెడ్జ్ పేపర్లు తయారు చేయించారు.తాత్కాలికంగా పనిచేస్తున్న గణితం, డ్రిల్ సార్లు కూడా అప్లై చేసి పరీక్ష రాసారు. వీళ్ళిద్దరే కాకుండా మా పాఠశాల పూర్వ విద్యార్థినీ ఆర్టీసీ ఉద్యోగి కుమార్తె క్రాఫ్ట్ టీచర్ గా పరీక్ష రాసారు.పేపరు నాతో చర్చించి తయారు చేయకపోయినా వేల్యుయేషన్ నన్నూ,నా స్నేహితురాలు ఉమారాణిని చేయమన్నారు.ఒక రెండువందల మంది వరకూ పరీక్ష రాస్తే ముగ్గురికి ఎనభై పైగా వేస్తే మిగతా వారికి ఇరవై శాతం కూడా మార్కులు రాలేదు.దాంతో మాకేగాక ఉద్యోగం కోసం అప్లై చేసినవారందరికీ జరిగిన మోసం అర్థమై స్కూలు మీద దండెత్తాడు, స్కూల్ పేరు,పరువూ పేరుకి ఎక్కడం జరిగింది.
రెడ్డీ పౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వీథిబాలలకు చదువు కొంత చెప్పి వాళ్ళని మా స్కూల్ లో జాయిన్ చేసారు.అందుకు వాళ్ళకీ హెచ్చెమ్ కి ,ఉషాటీచరుకి మధ్య స్నేహ సంబంధాలే కాక ఆర్థిక సంబంధాలు పెరిగాయని తెలిసింది.అప్పటినుండీ స్కూలు పతనం ప్రారంభమైంది.తన మాటలకు వత్తాసు పలికే వాళ్ళని తన అనుయాయులు గా చేసుకుంది.నిజామాబాదునుండి ఓ ఇద్దరు టీచర్లను మా స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించారు.ఇవన్నింటికీ వాళ్ళ దగ్గర బాగా లంచాలు తీసుకున్నారు.
తాను హెచ్చెమ్ కాకుండా నేను పోటీకి వస్తారేమో అనే భయంతో నన్ను వేధింపులకు గురి చేసారు.దాంతో చాలా వత్తిడికి గురయ్యాను.ఇంట్లో ఈ విషయాలు చెప్తే వీర్రాజుగారు " ఎందుకిలా బాధ.ఉద్యోగం మానేసేయ్ . హాయిగా రచనలు చేసుకో " అన్నారు. జీవితంలో ఎన్నో హర్డిల్ రేసులు దాటి అనుకున్నవి సాధించి ఇప్పుడిలా ఓడిపోవడం ఇష్టం లేదు.అందుకే తర్వాత్తర్వాత స్కూల్ విషయాలు ఇంట్లో చెప్పటం మానేసాను.
సంక్రాంతి సెలవులకు చిన్నక్క పిల్లలు కళ్యాణ్,రంజనా వచ్చారు.వాళ్ళతో పల్లవి చార్మీనార్,బజార్లు సరదాగా తిరుగుతోంది.భోగీ రోజు పిండి వంటలు హడావుడిలో ఉన్నాము.విజయనగరం నుండి 'అమ్మకి బాగులేదు హాస్పిటల్ లో జాయిన్ చేసామ'ని చిన్నన్నయ్య నుండి ఫోన్ వచ్చింది.వీర్రాజు గారు అర్జెంటుగా వెళ్ళి టిక్కెట్లు కొని సాయంత్రం అందరం విజయనగరం బయలుదేరాము.
విజయనగరం కొత్తపేట మంటపం దగ్గర హాస్పిటల్లో అమ్మని చేర్చారు.కోమాలోకి వెళ్ళిపోయిన అమ్మకి దగ్గరకు వెళ్ళి " అమ్మా నేను చిన్నాని వచ్చాను" అనిపిలుస్తే " ఊ"అంది.డాక్టర్లు రోజుల్లోనే ఉందనీ, ఆశ వదిలేసుకోవాల్సిందే అన్నారు.
శుభ్రంగా తెల్లచీరలో మల్లెపువ్వులా ఉండి,పగలంతా ఎట్టిపరిస్థితుల్లోనూ పడుకోని ఎరుగని అమ్మని అలా చూస్తుంటే దుఃఖం ముంచుకొచ్చింది.బావగారుపోయిన తర్వాత చిన్నక్కకి ఏ అవసరమైనా అమ్మే అండగా ఉండేది.అందుచేత ఆమె దుఃఖం ఆపుకోలేకపోతోంది.
అమ్మ ఎంత దుఃఖాన్ని మోసిందో,ఎన్ని అవమానాలు మింగిందో "వాణ్ణి నా శవం కూడా ముట్టుకో నివ్వొద్దు "అని మా పెద్దన్నయ్య గురించి అనేది.కాని అతనికి కూడా కబురు చిన్నన్నయ్య అందజేసాడు.
రోజూ పగలంతా నాతో పాటు అక్కలు ఎవరో ఒకరు ఉంటున్నారు.మధ్యలో మా ఆడపడుచు వస్తుంది.రాత్రపూట మగవాళ్ళే ఉంటున్నారు.
సంక్రాంతి పండుగ రోజులు కావటంతో బజారంతా ఖాళీ.మందులుగానీ అవసరమైనవి గానీ కొనటానికి ఇబ్బంది అయ్యింది.సంక్రాంతి రోజు మధ్యాహ్నం మా వదిన వచ్చింది.సుమారు ఇరవై ఏళ్ళ తర్వాత అన్నయ్యనీ,వదిననీ చూసాను.
" ఈ రోజు పెద్ద పండుగ కదా పూజలో మామయ్యగారికి వండినవి మూల పెట్టి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది " అంది.' అత్తకి ఏనాడూ ఓ ముద్దు పెట్టిన పాపాన పోలేదు కానీ ఎప్పుడో పోయిన ఆయనకి పూజలో పెట్టిందట'.అని మనసులో తిట్టుకున్నాను.
సంక్రాంతి మర్నాడే సెలవులైపోయాయని చిన్నన్నయ్య తన పెద్దకొడుకుని కాకినాడ బస్సు ఎక్కించడానికి వెళ్తుంటే "అమ్మ అలా ఉంది కదా ఓ రెండు రోజులు వాడిని ఉంచకపోయావా"అన్నాను."వాడినెందుకులే"అని పంపించేసాడు.బేగ్ తగిలించుకొని వెళ్తున్న నా పెద్ద మేనల్లుడిని చూస్తుంటే జరామరణాలు తెలియని సిద్ధార్థుడిలా కనిపించాడు.
మరో రెండు రోజులకి నేను,చిన్నక్కయ్య అమ్మ దగ్గర ఉన్నాము.కంఠంలోకి పెట్టిన గొట్టం ద్వారా కొంచెం కొంచెం పాలు పట్టి అక్క నేను మాట్లాడుకుంటున్నాము..అకస్మాత్తుగా కొంచెం కదిలి
చిన్నగా మాట్లాడుతున్నట్లు శబ్దం వచ్చింది.గభాలున అమ్మని తడుతూ పలకరించాము.అంతే ఊపిరి ఆగిపోయినట్లైంది.మాకేం చేయాలో తెలియలేదు.అంతలోనే మా పెద్దక్క,మామయ్యా వచ్చేసరికి దుఃఖంపొర్లిపోయింది.
అందరం అక్కడే ఉండటాన చకచకా ఏర్పాట్లు చేసి,మమ్మల్ని ఇంటికి వెళ్ళమని అక్కడికి దగ్గరలోనే శ్మశానానికి తీసుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.నేనూ పెద్దక్కయ్యా ఆటో ఎక్కుతుంటే ఇంటికి వెళ్ళి అమ్మకి చీర తీసుకుని రమ్మని కబురు పెట్టారు. అమ్మ పెట్టెలో ఒక కొత్త చీర ఉంటే అది తీసుకుని అక్కయ్యా నేను
అదే ఆటోలో శ్మశానానికి వెళ్ళి చీర ఇచ్చాము.ఆడవాళ్ళు చనిపోయాకే శ్మశానానికి వెళ్ళాలి తప్ప అలా వెళ్ళకూడదు.కానీ మేము వెళ్ళాము.అనుకోకుండా మేము తీసుకొచ్చిన చీర పల్లవి మొదటి జీతంతో అమ్మమ్మ కోసం కొన్న చీరే అని గుర్తించి అంత విషాదం లోనూ తృప్తి కలిగి చివరిసారిగా అమ్మకు నమస్కరించి వెనుతిరిగాము.
శీలావీ శిల్పరేఖలు లో నా మాట
శిల్పలేఖకులు సహచరులు వీర్రాజుగారికి ప్రేమతో.....
వీర్రాజుగారు అక్షరసంపెంగలను రంగులపేపర్లలో పొందికగా అల్లి పంపిన ప్రేమ పరిమళాలు నన్ను ఆవరించటానికన్నా ముందే, చేతిలో చేయేసి నాతో నడకదారిలో అడుగులో అడుగులు కలపక ముందే లేపాక్షిసుందరులతో చూపుల కౌగలింతల్ని పేపర్లనిండా చిత్రించారు.
రామప్ప నాగకన్యకలను మెడలో చుట్టుకున్నారు.అజంతా,ఎల్లోరా శిల్పాలను కథనపుష్పాలతో అభిషేకించారు.
అయితేనేం వివాహానంతరం కోణార్కశిల్పదంపతులను మాత్రం నా కళ్ళముందుకు ఆహ్వానించారు.
తర్వాత్తర్వాత ఎప్పుడైనా ఏదేవాలయాలకైనా వెళ్ళినా వీర్రాజుగారి చూపు ఆ ఆవరణలోనే అక్కడి శిల్పాలను చెక్కుతూ చెక్కుతూ ఆయన్ని ఒక మౌనమునిగా మలిచేస్తూ వుండేది.నేనూ అక్కడే ఆయన్ని చూస్తూ నిశ్చలన శిల్పాన్నైపోయేదాన్ని.
వీర్రాజుగారు చేతిలో స్కెచ్ బుక్ ని పట్టుకున్నప్పుడు అనిమేషుడైన శిల్పంలా, డ్రాయింగ్ బోర్డుపైన పేపర్ల నిండా గీసిన రేఖల మధ్య చిక్కుకు పోయినప్పుడు చూపూ,మనసూ, ఆలోచనా ఒకేచోట కేంద్రీకరించిన రుషిలా ,చుట్టూ రంగులు పరుచుకొని వర్ణచిత్రాలు వేస్తున్నప్పుడు రంగులసరస్సులో ఇహాపరాలు మరచి ఈదులాడుతున్న అమాయకపు పసిబాలుడిలా కన్పించేవారు.
వీర్రాజుగారికి అక్షరంపైన ఎక్కువ ప్రేమా,రంగులూ,రేఖలపైన ఎక్కువ మోహమా అనేది ఆయన కూడా వివరించలేరు.ఆయనకు రెండూ రెండు కళ్ళు.అందుకే జీవితకాలమంతా వాటిపైనే వెచ్చించారు.వాటి మధ్యే జీవించారు.
జర్మనీలో సైతం ప్రదర్శించిన లేపాక్షి శిల్పాల స్కెచ్ లను శిల్పరేఖగా పొందుపరిచి వేసిన పుస్తకాల కాపీలు లేవని తిరిగి, తిరిగి పలుమార్లు ప్రచురించేవారు, ప్రచురించాలనుకునేవారు.లేపాక్షి శిల్పరేఖలే కాకుండా ఆయన వేసిన అజంతా,ఎల్లోరా,రామప్ప, కోణార్క్ శిల్పరేఖల్ని కూడా కలిపి
ఒక సంపుటిగా పొందుపరచి శీలా వీర్రాజు గారి స్మృతిగా తీసుకురావటం బాగుంటుంది అని మా కుటుంబం అభిలషించాము. పుస్తకాల్ని ప్రేమించే వీర్రాజుగారికి శిల్పరేఖలన్నింటినీ కూర్చిన మాలగా " శీలావీ శీల్పరేఖలు " పుస్తకం స్మృత్యంజలిగా అందించటం కన్నా గొప్ప నివాళి ఇంకేముంది?
పుస్తకాలైనా,ఇల్లైనా,తన ఆవరణాన్నంతటినీ కళాత్మకంగా దిద్దుకోవాలనే కళాదృష్టి కలిగిన వీర్రాజు గారి పుస్తకం కూడా అట్లాగే ఉండాలంటూ చాలా శ్రద్ధగా యీపుస్తకాన్ని అందంగా తీర్చిదిద్ది తీసుకురావటంలో నాకు ఒక బిడ్డలా, కుటుంబ సభ్యుడిలా సహకరించినందుకు
ఆత్మీయుడైన అన్వర్ కి ధన్యవాదాలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)