26, సెప్టెంబర్ 2023, మంగళవారం
అన్నయ్య ప్రధమ వర్థంతి సందర్భంగా
నా పెద్దన్నయ్య కొడవంటి లీలామోహనరావు బహుభాషా కోవిదుడు రోణంకి అప్పలస్వామిగారి శిష్యుడు.బహుశా అందువలనే కావచ్చు గణితం డిగ్రీలో అంశమే అయినా రోణంకిగారి ప్రభావం వలన ఆంగ్లంలో పట్టా, పరిశోధన చేసి విజయనగరం మహరాజా కాలేజిలో ఇంగ్లీషు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేసి పదవీవిరమణ చేసాడు.
1958 ఆ ప్రాంతంలో భారతిలో వ్యాసాలు,కొన్ని కవితలు రాసినట్లు నాకు ముందుగానే తెలుసు.ఇటీవల కథానిలయంలో వెతుకులాటలో అన్నయ్య రాసిన రెండు కథలు కూడా దొరికి నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను.
ఒక కుటుంబంలో నలుగురు తోబుట్టువులూ కథకులు కావటం ఎవరైనా ఉన్నారా లేదో తెలియదు.నా తోబుట్టువులము నలుగురం కథలు రాసామని నేనెంతో గర్వపడుతున్నాను.
అన్నయ్య నా కవితలు ఒక పాతిక వరకూ ఆంగ్లంలోకి అనువదించాడు.
నేను రాసిన "యుద్ధం ఒక గుండె కోత" కవితను మా పెద్దన్నయ్యకే ఆత్మీయంగా అంకితం చేసాను.ఇది ఆంగ్లం,హిందీ,తమిళం లోనికి అనువదించబడింది.అంతే కాక యుద్ధం ఒక గుండె కోతపై ఎమ్ ఫిల్ పరిశోధన కూడా జరిగింది.
అన్నయ్య అంటే భయం,భక్తితో బాటు నన్ను డిగ్రీ వరకు చదివే అవకాశం కల్పించినందుకు ప్రేమ కూడా ఉంది. మొదటినుంచీ అన్నయ్యతో చనువుగా,చొరవగా తిరిగిన జ్ణాపకాలు తక్కువే.ఎందుకంటే అన్నయ్య చాలా రిజర్వుడుగా దూరంగా ఉండేవాడు.అటువంటి అన్నయ్య భౌతికంగా కూడా దూరమై ఏడాది అయ్యింది.
అన్నయ్య లీలామోహనరావుకి ఈసందర్భంగా నాస్మృతిగా ఈ భావాంజలి.
శ్రీదేవి కవిత్వ చిరునామా (వివిధలో)
~ శ్రీదేవి కవిత్వచిరునామా "మధుకలశమ్"~
ఆలోచన మనిషిని నిలవనీయనప్పుడు వ్యక్తిగత అనుభూతి పరిధిని అధిగమించి విశ్వవ్యాప్తమైన ఆత్మగతానుభూత సమకాలీన సామాజిక అంశాల్ని జోడించి కవిత్వీకరణం చేసి మానవ జీవితాన్ని పరిపూర్ణంగా చూపించటానికి ఉపకరించేది కవిత్వమే.
19 లో శతాబ్దానికి ముందు గేయం,పద్యకవిత్వమే తప్ప మరో సాహిత్య ప్రక్రియ లేదనే చెప్పాలి.
స్వాతంత్రోద్యమ,సంస్కరణోద్యమ ప్రభావం వలన కొన్ని వర్గాల స్త్రీలకు విద్య అందుబాటులోకి రావటంతో చైతన్యవంతమైన స్త్రీలు సాహిత్య రంగం లోకి అడుగు పెట్టి హిందూసుందరి, గృహలక్ష్మి వంటి స్త్రీలపత్రికల్లో పద్యాలు,గేయాల రూపంలో వారి భావాలు వెలువరించారు . అయితే అప్పటి దేశకాల పరిస్థితిలను బట్టి దేశభక్తి, దైవభక్తి పూరిత రచనలు మాత్రమే చేసేవారు.
2001 లో మొల్ల మొదలుకొని అప్పటి కవయిత్రులను వందమంది కవితల్ని నేనూ,డా.పి.భార్గవీరావు కలిసి సంపాదకత్వంలో "ముద్ర " పేరిట సంకలనం చేసాము.దీనికోసమై ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారి ఆధునిక తెలుగు కవయిత్రులను కూడా పరిశీలించటం జరిగింది.
మా పరిశీలనలో 1956 లోనే తెలుగు స్వతంత్ర సంపాదకబాధ్యత వహిస్తున్న డా.పి.శ్రీదేవి కవిత్వం రాసిందనే విషయం మాసంకలనానికి పి.సరళాదేవి అందించిన కవిత్వఖండికల ద్వారా తెలిసింది.
2010 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుండి భారతీయసాహిత్య నిర్మాతలు పేరిట డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని లేఖ రావటంతో డా.పి.శ్రీదేవి సాహిత్యం కొరకు వెతుకులాట మొదలుపెట్టాను.
అంతవరకూ పి.శ్రీదేవి అంటే కాలాతీతవ్యక్తులు నవల, ఒకటి రెండు కథలు మాత్రమే అనుకున్నాను.ఆశ్చర్యకరంగా శ్రీదేవి కథలే కాక తెలుగు స్వతంత్ర లో ధారావాహికగా ప్రచురితం అయిన దీర్ఘకావ్యం,ఒక పదివరకూ కవిత్వఖండికలూ దొరికాయి.
అంతకుముందు కొటికలపూడి సీతమ్మ,జూలూరి తులసమ్మ,చావలి బంగారమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ మొదలైన అనేక మంది కవయిత్రులు కేవలం భక్తి పూరిత రచనలు, దేశభక్తిని ప్రేరేపించే రచనలు మాత్రమే చేసారు.
అరవయ్యో దశకం వచ్చేసరికి ధనం,కీర్తి లభించే నవలా రచన వైపు రచయిత్రులు అందరూ మొగ్గు చూపారు.నాయని కృష్ణకుమారి, యశోదా రెడ్డి వంటివారు కవిసమ్మేళనాలలో జాతీయ పండుగలు, సంక్రాంతి , ఉగాది కవితలే రాసారు.
అప్పట్లోనే సమాజంలోని అనేక సమస్యల్ని ఆధునిక భావజాలంతో స్త్రీ దృష్టి కోణంలో రాసిన మొట్టమొదటి కవయిత్రిగా డా.పి.శ్రీదేవినే చెప్పాల్సిఉంది.
1956 సెప్టెంబర్ 14 తెలుగు స్వతంత్ర లో వైదేహి పేరు తో రాసిన "సౌదామిని" కవితతో పి.శ్రీదేవి కవిత్వం రంగంలోకి అడుగు పెట్టింది.ఇందులో స్త్రీని తటిల్లత పోలికతో మొదలుపెట్టి స్త్రీ పరంగా నడిపించి తటిల్లత మాయం కాగా స్త్రీ మాత్రమే మిగిలిపోవటాన్ని ఒక కథాత్మకంగా కవిత్వీకరించింది.తర్వాత వరుసగా నాలుగు వారాలు శ్రీ పేరుతో కవితలు రాసినా తదనంతరం మాత్రం పి.శ్రీదేవిగానే రచనలు చేసింది. శ్రీదేవి కవిత్వం రాసే నాటికి కవిత్వరంగాన భావకవిత్వోద్యమం ఉధృతంగానే వుంది.అందుకే శ్రీదేవి కవిత్వంలో కూడా అక్కడక్కడ ఈ పోకడలు కన్పిస్తాయి.కొన్నింటిలో మాత్రా ఛందస్సు తో ఊహలలో తేలే ప్రణయం,విరహం నిండిన కవితలు రాసినా,సామాన్యులు నేతల్ని,ఆర్తిని, వెతుకులాటనీ కూడా కవిత్వం లోకి తీసుకు వచ్చింది.
సాహిత్య ప్రజానీకం పట్ల సానుభూతితో "అంటారా!" రాసినా , "ప్రకృతి విలయం" లో ప్రణయిని అయిన యువతి విరహానల బాధని వర్ణించినా శ్రీదేవి సహజసిధ్ధమైన శైలి విన్యాసం వ్యక్తమౌతుంది.కృష్ణశాస్త్రి ప్రభావంతో కావచ్చు వాడిన పూలు,పూల బ్రతుకు కవితల్లో శ్రీదేవి భావప్రకటన ఒక కొత్త దృక్కోణంలో మృదుమధురంగా సంభాషణాత్మకంగా నడుస్తుంది. వైదేహి పేరుతో రాసిన మరో కవిత " కిణాంకస్మృతులు " పేదయువకుని హృదయవేదన సున్నితమైన భావచిత్రాలతో సాగుతుంది." కేవల స్వగతం" లో భగ్నప్రేమిక హృదయార్తిని కవయిత్రి వ్యక్తీకరించింది.
ఈ విధంగా కవితా ఖండికలలో ఆ నాటి కవయిత్రులకు భిన్నంగా విభిన్న కవితాంశాల్ని తీసుకుని తనదైన శైలిలో హృదయినిగా,మనస్వినిగా,స్నేహితగా కవయిత్రి శ్రీదేవి కనిపిస్తుంది.
ప్రత్యేకంగా చెప్పాల్సింది 4-4- 1959 నుండి 6-6--59 వరకూ ఎనిమిది వారాల పాటు ధారావాహికగా తెలుగు స్వతంత్ర లో ప్రచురితం అయిన " మధుకలశమ్ " దీర్ఘకావ్యం.
కుందుర్తి - తెలంగాణా,ఆంవత్ససోమసుందర్-మేఘరంజని 1958 ప్రాంతంలోనే వచ్చినట్లుగా తెలుస్తోంది.కాని కవయిత్రులలో ఆధునిక కవిత్వంలోకి వచ్చినవాళ్ళే అతి తక్కువ కావటమే కాక అప్పట్లో దీర్ఘకావ్యం రాసిన దాఖలా లేదు.
శ్రీదేవి తన నవల కాలాతీతవ్యక్తులలో ఆమెకు ఇష్టమైన గ్రంథం దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల గురించి రెండు సార్లు ప్రస్తావించింది.ఉమర్ ఖయ్యాం రుబాయీల ఆధారంగా రామిరెడ్డి గారు పద్యకావ్యం గా పానశాల రాసారు.
శ్రీదేవి రుబాయీలలోని సారాంశాన్ని, రామిరెడ్డి గారి పద్య సారాన్ని, పానశాల ముందుమాట లోని ఖయ్యాం జీవనవిధానాన్ని ,వివిధాంశాలపట్ల ఖయ్యాం అభిప్రాయాల్నీ పరిగణలోనికి తీసుకొంది.
అనుసృజనే ఐనా స్వేఛ్ఛారీతిలో తనదైన భావనా పటిమను జోడించి ప్రేమతత్వంలో తాత్విక నేపధ్యాన్ని ఒదిగేలా అద్భుతమైన భాషా స్వాధీనత తో పాఠకుల హృదయాలను రసప్లావితంచేసేలా " మధుకలశమ్" పేరిట కావ్యం గా తీర్చింది.
' కట్టుకోడానికి మనము
కనులుమూయుట స్థిరము
బిచ్చగాడైననూ/ పిచ్చివాడైననూ
భక్తి వత్సలఉడైన/ శక్తిమంతుడైన
పుట్టినప్పుడొక్కడే/ గిట్టినప్పుడొక్కడే,--తాత్వికంగా చెప్తుంది.
'ప్రకృతి -నువ్వూ-నేనూ' అనే అధ్యాయంలో ప్రకృతి అందాల్ని పరమళభరిత పూలను వర్ణించేటప్పుడు పాపనవ్వులతోటీ,నిండుచూలాలి సిగ్గుల తోటీ పోలిక చెప్తూ అత్యంత సహజమైన స్త్రీ అనుభూతులను వర్ణించింది.
రుతువర్ణనల్ని క్లుప్తంగా అయినా సఖీసౌందర్యాన్ని తాత్విక దృక్పథం తో కవిత్వీకరించటం గమనించదగ్గ అంశం.
' నీ చకిత వీక్షణలు / నిర్మలత్వం కనిన
ఎందులోనో బాధలే/ తరలిపోవును గాదే'
ప్రణయిని గా --
ఒక వర్షానికే ఉబికి ప్రవహించేది కొండవాగును నేను '
విరహిణిగా--
మట్టిలో చేరునది/మానవులే కాదురా' అంటూ విరాగిగా--
మతము గితమంటూను/హితము చెప్పుదుమనుచు
మతబోధ చేసేవి/ మతిమంతులందరూ
మనుదురా లోకమున/ మట్టిలో కలియకనే'
అంటూ హేతువాదినిగా--
అనేక రూపాల్లో పాఠకులు కవయిత్రి ని మధుకలశమ్ లో దర్శించగలరు.
' ఒకసారైనాను/ రెప్పపాటు ఐనను
చుక్కవలె మెరిసిపోయే/ నిక్కము బతుకదే' అనే వాక్యాలు చదివినప్పుడు కవిత్వంలో తనకొక చెరగని ముద్రని వేసుకొంది.
" పండుటాకున వలెనే
మెలమెల్లగా జారీ
నిండు జీవితమెపుడో"
ఇంత తాత్విక చింతనను వెలిబుచ్చుతూ ,1959 నుండి అద్భుతశైలితో ఆరేళ్ళ సాహిత్య జీవితంలో నవలా,కథలే కాక కవిత్వంలో కూడా తనదైన చిరునామాని ప్రతిష్టించుకుంది శ్రీదేవి.
కాలాతీతవ్యక్తులతో సహృదయపాఠకుల హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి రాసిన కవిత్వాన్ని కూడా వారికి రుచి చూపించాలనీ, లేకపోతే ఆమె కవిత్వం కాలగర్భంలో మాయమౌతుందేమోనని ఆరాటపడ్డాను.
మంచి సాహిత్యం ఎక్కడ దొరికినా హత్తుకునే అనల్ప బలరాం గారు శ్రీదేవి సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు రావాలని సంకల్పించి "మధుకలశమ్" పేరిట శ్రీదేవి కవిత్వాన్ని గ్రంథరూపంలో ప్రచురించారు.
నడక దారిలో --33
నడక దారిలో -- 33
బియ్యిడీ కాలేజీలు ఏవేవి ఉన్నాయో ఇంటికి వచ్చిన కవిమిత్రులను అడిగి తెలుసుకున్నాం.మా ఇంటికి దగ్గరగా ఉన్నది,ఫీజులు తక్కువగా ఉన్నది ఆంధ్రమహిళాసభ బియ్యీడీ కాలేజి అని తెలిసి దానికే అప్లై చేసాను.
నా సబ్జెక్టు గణితం కావటం వలన మొదటి లిస్ట్ లోనే సీటు వచ్చింది.కావలసిన డాక్యుమెంట్స్ పట్టుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాను.డిగ్రీ చదివి పదేళ్ళు అయ్యిందని ఫిజికల్ సైన్స్ చదవగలనో లేదోననే భయంతో తెలుగు ఎమ్మే చేసాను కదా గణితం, తెలుగు మెథడ్స్ గా సీటు ఇమ్మని అడిగాను.కానీ బీయస్సీ లో ఆప్షన్స్ బట్టి గణితం, భౌతిక రసాయన శాస్త్రాలు మెథడ్స్ గా చేయాల్సిందే అన్నారు.మరిక ఏమీ అనలేక ఒప్పుకున్నాను.
ఫీజుకట్టి , డాక్యుమెంట్స్ కాలేజీలో సబ్మిట్ చేసినప్పుడు తప్పనిసరిగా వివాహం అయిన వాళ్ళు అందరూ "నో ప్రెగ్నెన్సీ "అని డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలని ,లేకపోతే మధ్యలో నిండునెలలవల్లా,డెలివరీ వలన చదువు ఒత్తిడి తట్టుకోలేక తరగతులకు హాజరుకాకపోతే కష్టమౌతుంది అన్నారు.కాలేజీ ప్రిన్సిపాల్ చాలా సౌమ్యంగా చిన్నపిల్లలకు చెప్పినట్లుగా చెప్పారు.
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తేవాలి అర్థం కాలేదు.నిజానికి బాబు పుట్టాక కాపర్ టీ వేయించుకున్నాను.దానికి సంబంధించిన పేపర్లు ఏవి కనిపించలేదు.నల్లకుంట మెయిన్ రోడ్ మీదే డా.కేవీ.కృష్ణకుమారి బోర్డు కనబడి అక్కడికి వెళ్ళాను.ఆమె రచయిత్రి అని తెలుసు.నేను పేషెంట్ గా నాపేరు ఎస్.సుభద్రాదేవి అని రాయించాను.నన్ను పరీక్ష చేస్తున్నంత సేపూ,అక్కడ ఉన్నంతసేపూ తన అందాన్ని, రచనల్ని ప్రశంసిస్తూ ఎన్ని ఉత్తరాలు వస్తుంటాయో, ఎలాంటి ఉత్తరాలు వస్తాయో చెప్తూనే ఉందామె.నేను మౌనంగా వింటూ కూర్చున్నాను.చివరికి " నో ప్రెగ్నెన్సీ" అని సర్టిఫికెట్ ఇచ్చింది.బతికించేవు తల్లీ అనుకుంటూ బయటపడ్డాను.
కావలసిన డాక్యుమెంట్స్ కలిపి,ఫీజు కట్టి కాలేజీలో సబ్మిట్ చేసి గుండెలనిండా ఊపిరి పీల్చు కున్నాను.
వీర్రాజు గారు తాను పెట్టిన అయిదేళ్ళ సెలవు పూర్తి కావటంతో వికాస్ అడ్వర్టైజ్మెంట్ ఆఫీస్ బాధ్యత పూర్తిగా స్నేహితునికి అప్పగించి తిరిగి ఆఫీస్ లో చేరిపోయారు.వికాస్ ఆఫీస్ లో ఇంటీరియర్ కోసం నిర్మల్ కళాకారుడి చేత లైఫ్ సైజ్ లో ఒక నెమలిని వీర్రాజు గారు ముచ్చట పడి చేయించారు.అటువంటి నెమలి బొమ్మ ఉండటం చేత ఆఫీస్ నష్టాల్లో నడిచిందనీ దాన్ని అమ్మేయాలనే స్నేహితుడి ఆలోచన తెలిసి వీర్రాజు గారు ఆ నెమలి బొమ్మని నేను తీసుకుంటానని చెప్పి ఇంటికి రిక్షాలో వేయించి తీసుకు వచ్చేసారు.చొచ్చుకుపోయేతనం, వ్యాపార నైపుణ్యం లేనివారికి స్వంతంగా ఆఫీస్ పెట్టి నెగ్గుకురావడం అంత సులభం కాదనే పాఠం నేర్చుకున్నాము మేమిద్దరం.అయితే ఆ అనుభవం వల్ల సంపాదించినది ఏమీ లేకపోయినా ఆ నెమలి బొమ్మ మాత్రం దక్కింది.
ఉదయమే వంటా ,టిఫిన్ తయారుచేసి ముగ్గురికీ బాక్సులు కట్టేసేదాన్ని.పల్లవి ఎనిమిదికే రిక్షాలో వెళ్ళిపోయేది . వీర్రాజు గారు ముఖచిత్రాలు వేయాల్సినవి ఉంటే ఆ పని చేసుకొని తాపీగా వెళ్ళేవారు.నేను తొమ్మిది కల్లా బయల్దేరి ఫీవర్ హాస్పిటల్ దగ్గర బస్సు ఎక్కి కాలేజీకి వెళ్ళే దాన్ని.
క్లాసులో కొత్తగా డిగ్రీ పూర్తిచేసిన ఇంకా యవ్వనం వీడని అమ్మాయిలంతా ఒక గ్రూపుగా ఉండేవారు.నాలాంటి పెళ్ళిళ్ళై ,పిల్లలున్న వాళ్ళం ఒక గ్రూపుగా తిరిగే వాళ్ళం.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రోగ్రాం కోసం కొందరు అమ్మాయిలు పాటలు ప్రాక్టీస్ చేస్తుంటే ఆసక్తి కొద్దీ నేనూ వెళ్ళి కూర్చున్నాను.కొంతమంది మళయాళీ అమ్మాయిలు కేరళ జానపద పాట ప్రాక్టీస్ చేస్తున్నారు.అందులోని బీట్ బాగా నచ్చి అప్రయత్నంగానే గొంతు కలిపాను.నా పక్కనే కూచున్న ఒక మేడం ఆశ్చర్యపోయి " ఎంత తొందరగా రాగాన్ని పట్టుకున్నావు! సంగీతం నేర్చుకున్నావా?" అని అడిగి నన్ను ఒక పాట పాడమన్నారు.
సుమారు పదేళ్ళ తర్వాత గొంతెత్తి లలిత గీతం పాడాను.అక్కడ ఉన్న వాళ్ళంతా అభినందించారు.ఆ తర్వాత ఒక్కొక్కప్పుడు అందరం కూర్చుని పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు నేనూ పాడుతూ ఉండేదాన్ని.అలా కొంచెం కొంచెంగా మానసికంగా కుదుటపడటం మొదలైంది.
మా కాలేజీలో స్పోర్ట్స్ డే సందర్భంగా జరుగుతున్న ఆటల్ని చూస్తూ రన్నింగ్ కామెంటరీని "నువ్వు కవయిత్రివి కనుక కవిత్వంలో చెప్పమ"ని మా మేడం మైక్ అందించారు. అప్పటికే వచ్చిన నా ఆకలినృత్యం సంపుటి కాలేజీలో ఇచ్చాను .దాని ఫలితం.దేవుడా!! అని కనిపించని వాణ్ణి తలచుకొని కాగితం మీద అప్పటికప్పుడు అప్పటికి వెలుగులో ఉన్న క్రీడాకారిణులను గుర్తు తెచ్చుకుని వారితో పోలుస్తూ నాలుగక్షరాల్ని రాసి కాసేపు చదివాను.దాంతో కాలేజీలో కవయిత్రిగా నమోదు ఐపోయాను.
నేను చదువుతున్న రోజుల్లోనే దుర్గాబాయి గారి సహచరులు చింతామణిదేశముఖ్ మరణించడంతో ఆంధ్రమహిళాసభ డిగ్రీ కళాశాల,మా బీయ్యీడికళాశాల కలిసి అదే ఆవరణలో ఉన్న గాంధీ హాల్ లో సంతాపసభ ఏర్పాటు చేసారు.ఆ సందర్భంగా ఆయన మీద కవిత రాసి చదవమన్నారు మా కాలేజీవాళ్ళు.సరేనని దుర్గాబాయి గురించి కొంత రాసి ఆయన గురించి వాళ్ళు నడుపుతోన్న సంస్థల గురించి కలిపి రాసాను.నిజానికి కవిత బాగానే వచ్చింది.కాని నేను దీనిని నా సంపుటాలలో చేర్చలేదు.డిగ్రీకాలేజీలో తెలుగుశాఖ కి పెద్ద అయిన నిడమర్తి నిర్మలాదేవి గారితో అప్పుడే పరిచయం అయ్యింది.ఆమె కూడా కవిత చదివారు.
నిర్మలాదేవి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మీద పరిశోధన చేసినట్లు తెలిసింది.ఆమె కూడా నా గురించి వివరాలు తెలుసుకున్నారు.
పూర్తిగా పాఠాల్లో మనసును లగ్నం చేసి ఏకాగ్రతతో చదువులో మునిగిపోయాను.మిగతా సబ్జెక్టులు పర్వాలేదు కానీ ఫిలాసఫీ,సైకాలజీ కొంచెం కష్టంగా అనిపించింది.అందులోనూ ఇంగ్లీష్ మీద పూర్తిగా పట్టుపోవటంతో మొదట్లో అర్థం చేసుకోవటం కష్టమే అయ్యింది.
ఒకరోజు సైకాలజీ క్లాసులో మెదడు విషయాల్ని ఎలా గ్రహిస్తుంది.ఎక్కడ భద్రపరుచుకొంటుంది.మెదడు గ్రహించలేని పరిస్థితులు,దానివలన వచ్చే బుధ్ధిమాంద్యత మొదలైనవన్నీ సోదాహరణంగా వివరిస్తున్నారు.
అప్పటికి బాబుని కోల్పోయి ఆరునెలలు కూడా కాలేదేమో మనసులోని పచ్చిదనం రేగినట్లు అయ్యింది. ఒక్కసారిగా దుఃఖం పగిలినట్లు కుమి
లి కుమిలి ఏడ్చేసాను.ఆ రోజు ముందు సీట్లు నిండిపోవడంతో చివరి బెంచీలో కూర్చున్నాము లెక్చరర్ గమనించలేదు.కానీ నా పక్కనే కూర్చున్న సహాధ్యాయి కంగారు పడింది.ఓ పది నిమిషాలకు సర్దుకొని తిరిగి పాఠంలో పడ్డాను.
బాబు పోయిన బాధ కొద్దికొద్దిగా మరపులోకి పూర్తిగా వెళ్ళక ముందే వీర్రాజు గారి సహోద్యోగే కాక ఆయన్ని కవిత్వంలోకి నడిపించిన,ఒక సోదరుడిగా ప్రేమించిన కుందుర్తి ఆంజనేయులు గారి షష్టిపూర్తి కోసం వీర్రాజు గారూ,మిత్రులు,సన్నిహితులు అందరూ కలిసి ఒక పుస్తకం కూడా వెలువరించటానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో దసరాలలో అకస్మాత్తుగా చనిపోయారు.అది వీర్రాజు గారిని బాగా కుంగదీసింది.
వీర్రాజు గారు తిరిగి ఉద్యోగంలో చేరటం, నేను కాలేజీకి వెళ్ళి రావటం,మిగతా సమయం పల్లవితో గడపటంతో జీవితం ఒక గాడిని పడింది అనుకున్నాను .
అంతలో మళ్ళా ఒక ఉత్పాతం.రెగ్యలర్ గా వచ్చే నెలసరి పదిరోజులుగా రాలేదని గమనించాను.నేను గర్భనిరోధక సాధనంగా కాపర్ టీ వేయించుకున్నాను. అదొక బెంగ అయ్యింది.కాలేజీలో చేరేటప్పుడు నో ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ ఇచ్చాను.ఇప్పుడిలా జరిగిందేమిటి అని అనుకున్నాను.
వీర్రాజు గారితో చెప్తే "మళ్ళా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు "అన్నారు.సరే అని వెళ్తే పరీక్ష చేసి "ఒక్కోసారి కాపర్ టీ ఉన్నా గర్భం వస్తుంది" అంది ఆమె .టేబ్లెట్లు రాసి "రెండు రోజులపాటు వేసుకో మరో రెండు రోజులకు పీరియడ్స్ వచ్చేస్తాయ"ని చెప్తే అవి కొనుక్కుని రెండురోజులు వాడాను .కానీ పీరియడ్స్ రాలేదు.శని ఆదివారాలు సెలవు దొరికేసరికి శుక్రవారం సాయంత్రం పల్లవిని తీసుకుని అక్కయ్య దగ్గరకు మలకపేట వెళ్ళాను.అక్కయ్యతో విషయం అంతా చెప్తే సైదాబాద్ రోడ్ మీద సాయంపూట ఒక లేడీడాక్టర్ క్లినిక్ తెరుస్తారని ,ఆమెకు మంచి పేరుంది అని చెప్పి తీసుకు వెళ్ళింది.
డాక్టర్ నన్ను పరీక్ష చేసాక, నేను వాడిన మందులు ప్రిస్క్రిప్షన్ ఆమెకు చూపించాను.ఆమె అది చూసి " ఈ మందులు ప్రిస్క్రైబ్ చేసిన ఆవిడ చదువుకున్న డాక్టరేనా?" అని ప్రశ్నించారు.
నేను ఆశ్చర్యపోయి డాక్టరే అని చెప్పి ప్రశ్నార్థకంగా చూసాను.
"ఈ టేబ్లెట్లు బేన్ చేసి రెండు మూడు సంవత్సరాలైంది.ఇవి రాసినందుకు ఆమెపై కంప్లైంట్ ఇవ్వొచ్చు." అన్నారు డాక్టర్.
మళ్ళా నావైపు చూసి అంతకుముందు నెలసరి ఎప్పుడు వచ్చిందో కనుక్కుని "గర్భం ఆరు వారాలు దాటింది.అయితే ఆ టేబ్లెట్లు వాడినందువలన పుట్టే బిడ్డకు శారీరకఅవకరం గానీ,మానసిక మాంద్యం గానీ వచ్చే అవకాశం ఉంది.ఉంచుకుంటావో,అబార్షన్ చేసుకుంటావో ఆలోచించుకో" అన్నారు.
నాకు గుండె పగిలినట్లయ్యింది.మూడున్నర సంవత్సరాలు పడిన అవస్థ కళ్ళముందు గిర్రున తిరిగింది." వద్దొద్దు.అబార్షన్ చేసుకుంటాన"ని అన్నాను.
"సరే నని "విషయం అంతా రాసి అబార్షన్ అవసరం అనేది" రాసిచ్చి ఉస్మానియా హాస్పిటల్ లో తనకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి ఉదయం ఏడున్నర కల్లా వెళ్ళమని చెప్పారు డాక్టర్.
శనివారం ఉదయమే అక్కయ్య,నేను ఉస్మానియా హాస్పిటల్ కి వెళ్ళి రిఫర్ చేసిన డాక్టర్ని కలిసాము.వెంటనే అబార్షన్ చేసారు.తిరిగి అక్కయ్య ఇంటికే వెళ్ళి శని, ఆదివారాలు అక్కడే విశ్రాంతి తీసుకుని ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను.
మర్నాటి నుంచి మళ్ళా యథావిధిగా కాలేజీకి వెళ్ళిపోయాను.
వీర్రాజు గారు కూడా ఆఫీస్ కే కనుక టైం ప్రకారం వెళ్ళిరావటంతో నాకు కొంత వెసులుబాటు కలిగింది.
అయితే సమాచారం పౌరసంబంధాల శాఖలో పనిచేస్తున్నందున, ఆంధ్రప్రదేశ్ పత్రిక చూసే బాధ్యత వలన వీర్రాజు గారికి పని ఒత్తిడి కలిగించే కొత్త మార్పులు జరిగాయి.
అవేమిటంటే 1982లో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటన జరిగింది. నలభై ఏళ్ళు గా సినిమాల్లో తన నటన ద్వారా ప్రజల ప్రశంసలు పొందిన నందమూరి తారక రామారావు మార్చి 29 న తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. 1980-82 లమధ్య కాంగ్రెస్ పార్టీ అంజయ్య,భవనం వెంకట్రామరెడ్డి,కోట్ల విజయభాస్కరరెడ్డి ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది.కాంగ్రెసు అసంతృప్త నాయకుడు నాదెండ్ల భాస్కరరావు వంటివారు ఎన్టీఆర్ తో కలిసారు. పదే పదే ముఖ్యమంత్రుల్ని మార్చి కాంగ్రెసు పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిందని ఆరోపిస్తూ, ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు ప్రజల్లోకి వచ్చారు.ఆంధ్రప్రదేశ్ అంతటా అది సంచలనం కలిగించింది.
కాలేజీలో డిగ్రీ అయిన వెంటనే బియ్యీడీలో చేరిన అమ్మాయి రాగలత ఎందుచేతనో కానీ నాకు చాలా దగ్గర అయ్యింది.ఒక చెల్లెలులా మా కుటుంబంతో కూడా కలిసిపోయింది.టీచింగ్ ప్రాక్టీస్ కూడా ఇద్దరికీ ఒకటే స్కూల్ లో పడటంతో కలిసి వెళ్ళొచ్చేవాళ్ళం.ఒకసారి నన్నూ,పల్లవిని వాళ్ళ వూరు భువనగిరికి తీసుకు వెళ్ళింది.రాగలత చెల్లెళ్ళు కూడా మాతో బాగా కలిసారు.అందరం కలిసి భువనగిరి గుట్టపై వరకూ అందరం ఎక్కాము.ఇప్పటికీ ట్రైన్ లో అటు వెళ్తున్నప్పుడు కనిపించే భువనగిరి గుట్టని చూసినప్పుడు ఆరోజులు గుర్తువస్తూ ఉంటాయి.
1983 జనవరి లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆశ్చర్యకరంగా స్థాపించిన తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం 198 స్థానాలు గెలుచుకొని అధికారానికి వచ్చింది, 60 స్థానాలతో కాంగ్రెసు ప్రతిపక్షంగా నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్‌లో మొట్ట మొదటి సారిగా కాంగ్రెసు ప్రతిపక్షం స్థానానికి చేరింది.
వీర్రాజు గారికి మాత్రం ఈ మార్పు ఉద్యోగరీత్యా సమాజజీవితానికి దూరం చేసింది.
విద్యాసంవత్సరం చివర్లో డిగ్రీ కాలేజీకి,మాకాలేజీకి కలిపి ఏర్పాటు చేసిన పెయింటింగ్, ఫేబ్రిక్ పెయింటింగ్ లలో కూడా బహుమతులు గెలుచుకుని మా కాలేజీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను.హర్డిల్ రేస్ లా సాగే నా చదువు మొత్తం మీద పూర్తి చేసాను.
నా పరీక్షలు పూర్తిఅయ్యి ఊపిరి పీల్చుకునే సరికి పెద్దాడబడుచు అయిదేళ్ళ తర్వాత కుటుంబం తో వచ్చింది.ఈ సారి మేము వేర్వేరు కుటుంబాలు అయ్యాం కనుక అన్నదమ్ముల అందరిళ్ళకి అయిదేసిరోజులు వెళ్ళొచ్చారు.
కానీ మాట వరసకైనా బాబు ప్రసక్తి తీసుకు రాకపోవటం ఆశ్చర్యం కలిగించింది.
ఒక్కొక్కరి మనస్తత్వాలు ఇన్నేళ్లలో బాగా తెలిసాయి కనుక నేను కూడా బాగా రాటుతేలాను.పూర్వంలా అన్నింటికీ మౌనం వహించకుండా నొప్పింపక తానొవ్వక మెలిగాను.అన్నీ సగౌరవంగా చేసి వాళ్ళను సాగనంపాను.
నడక దారిలో--32
నడక దారిలో --32
కొత్త ఇల్లు మాకు విశాలంగానే ఉంది.ముందుగదిని వీర్రాజుగారు ఆఫీసు రూంలా అమర్చుకున్నారు. మూడు గదులు దాటాక పెరటిలో దేశీ గులాబిచెట్టునిండా పూలతో బాగుంది.అయితే పెరటిగోడని ఆనుకొని క్షత్రియ హాస్టల్ ఉండేది.ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గోడ పక్కనే అబ్బాయిల ఆటలు,కేకలు,కబుర్లతో గోలగోల గా ఉండేది.
వీథి గుమ్మం పక్కన కూడా మొక్కలు పెంచుకొనే వీలుంది.
అదే కాంపౌండ్ లో లలితా వాళ్ళ చెల్లెలు భాగ్యలక్ష్మి కుటుంబం ,ఆమెతల్లిదండ్రులతో సహా ఉండటం నాకు కొంత ధైర్యం కలిగించింది.భాగ్యలక్ష్మి భర్త "నిజం" పేరుతో కవిత్వంరాసే జర్నలిస్టు శ్రీరామ్మూర్తి గారు.భాగ్యలక్ష్మి, శ్రీరామ్మూర్తి గార్ల పెళ్ళిమాటలు మేము రాంకోఠీలో ఉన్నప్పుడు మా ఇంట్లోనే జరిగాయి.
మా కాంపౌండ్ పక్కనే ఉన్న ఇంటిలో యువభారతి సభ్యులు బసలింగప్పగారు ఉండేవారు.ఆయనకు పల్లవి వయసు అమ్మాయిలు ఉండటంతో పల్లవి సంతోషంగా ఆడుకునేది.
ఈ ఇంటికి వచ్చాక పల్లవిని తిలక్ నగర్ లోని శ్రీవిద్యా సెకండరీ స్కూల్ లో జాయిన్ చేసాము.అదే స్కూల్లో యువభారతి సభ్యులు మాడభూషి రంగాచార్యులు గారి శ్రీమతి లలితాదేవి ఉపాధ్యాయురాలు.అప్పటినుండీ వారితో మాకు స్నేహం మరింత పెరిగింది.మా ఇంటి ఎదురుగా ఉండే అమ్మాయితో కలిసి పల్లవి స్కూల్ కి వెళ్ళేది.అక్కడకి దగ్గరలో ఎవరో సంగీతం నేర్పిస్తారని తెలిసి పల్లవిని చేర్చాను.
ఎమ్మే రెండో సంవత్సరం పరీక్షలకు కూడా ఫీజుకట్టి కొన్ని పుస్తకాలు తీసుకు వచ్చారు వీర్రాజుగారు.కానీ బాబు ఆరోగ్యం మరీ క్షీణించింది.తరుచూ ఏదో ఒక హడావుడి చేస్తుండటంతో హాస్పిటల్స్ చుట్టూ తిరగటం అవుతోంది.
మెలకువగా ఉన్నప్పుడు చాపమీద బోర్లా పడుకుని బొమ్మలతో ఆడిస్తే బాగానే ఉండేవాడు.ఈ వయసుకి గంతులు వేస్తూ ఆటలు ఆడుతూ, కబుర్లు చెప్పాల్సిన మూడున్నర ఏళ్ళ వాడు బోర్లా మాత్రమే పడి అర్థంలేని కేకలే తప్ప అమ్మా అనే పిలవటం కూడా రాని రబ్బరు బొమ్మ లాంటి వాడిని చూస్తుంటే కడుపు తరుక్కుపోయినట్లు దుఃఖం నన్ను ముంచెత్తేది.వాడిని నిద్రపోయినప్పుడు కాళ్ళమీద పడుకోబెట్టుకున్నంత సేపూ నిద్రపోయేవాడు.మెల్లగా పక్కమీద చేర్చే సరికి ఉలికి పడి ఫిట్స్ వచ్చేసేది.దాంతో రాత్రంతా నేను కొంతసేపు, వీర్రాజు గారు కొంతసేపు కాళ్ళమీద బాబుతో కూర్చునే ఉండాల్సి వచ్చింది.
పల్లవి బడికి,ఆయన ఆఫీస్ కి వెళ్ళాక పగలు కూడా కాళ్ళమీద బాబుని పడుకోబెట్టుకుని పుస్తకాలు చదువుకునేదాన్ని.ఈసారి పరీక్షలు రాయగలనా అనుకున్నాను.
పరీక్షలకు ముందు విశ్వవిద్యాలయం నిర్వహించే కాంట్రాక్ట్ తరగతులకు ఈసారి కూడా హాజరు కాలేకపోయాను.సంస్క్రతం పేపర్లో కాళిదాసురఘువంశం,హితోపదేశం లో విగ్రహము,సంధి భాగాలు పాఠ్యాంశంగా ఉన్నాయి.విశ్వవిద్యాలయం వాళ్ళు రఘువంశం నోట్స్ ఇచ్చారు కానీ సంధి ఇవ్వలేదు.బయటషాపులలో కూడా దొరకలేదు.చిన్ననాటి స్నేహితురాలు లలితకు ఉత్తరం రాసాను.ఆమెకు కూడా దొరకలేదుట.లలిత పనిచేస్తున్న స్కూల్లో సెలవు దొరక నందున ఆమె కూడా విశ్వవిద్యాలయం క్లాసులకు హాజరు కాలేదట.'హాజరైయ్యుంటే నోట్స్ దొరికేది ' అంది.ఇక నాదగ్గర ఉన్నపుస్తకాలే చదువుకున్నాను.
ఎప్పటిలాగే అమ్మని పరీక్షలసమయంలో రమ్మన్నాను.పల్లవికి స్కూలు సెలవులే కనుక బాబుని ఆడించటానికి సహాయంగా ఉంది.
ఈసారి కూడా రెడ్డి కాలేజీలోనే ఎగ్జామ్స్ సెంటరు.లలిత ఎప్పటిలాగే అక్కడ కలిస్తే మాట్లాడుకున్నాం.సంస్క్రత పరీక్ష ముందురోజు హితోపదేశంలో సంధి,విగ్రహముల భాగాలు ఎవరో కొన్ని పేజీలు పంచారు.అవికూడా చదువుకుని పరీక్షలు నిర్విఘ్నంగా రాసాను.పరీక్ష రాసి వచ్చాక అమ్మ మలకపేట పెద్దక్క ఇంటికి వెళ్ళి రెండు రోజులు ఉండి వస్తానంటే వీర్రాజు గారు తీసుకు వెళ్ళి అక్కడ ఇంట్లో దింపి వచ్చారు..
"ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎలా అయితేనేం పట్టుదలతో ఎమ్మే పూర్తి చేసేసావు" అని ఆ రాత్రి ఆయన నన్ను ప్రశంసించారు."ఇకపై తిరిగి సాహిత్యం వైపు దృష్టి పెట్టు" అని హెచ్చరించారు.
ఫలితాలు గురించి ఏమూలో భయం ఉన్నా, ఎమ్మెస్సీ చేయలేకపోయినా ఏదో ఒక పీజీ చేసినందుకు నాకు తృప్తి గా అనిపించింది.
ఇంకా పడుకుందామనుకుంటూనే సరికి బాబు అకస్మాత్తుగా లేచి ఏడవటం మొదలుపెట్టాడు. ముదురుమట్టిరంగులో వాంతులు చేసుకోవటంతో మందులవలన అలా వాంతి చేసుకుంటున్నాడు అనుకున్నాం రాత్రంతా కాసేపు నిద్రపోవటం సడెన్ గా లేచి ఏడవటం ఫిట్స్ రావడం, వాంతి చేసుకోవడంతో ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటూ జాగరణ చేసాం.
ఉదయమే పల్లవిని పక్కనే ఉన్న శ్రీరామ్మూర్తి గారింట్లో అప్పగించి మేము బాబు చికిత్స కోసం సాధారణంగా ఎప్పుడూ తీసుకుని వెళ్ళే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాము.ఆయన చూసి నిలోఫర్ కి తీసుకు వెళ్ళమన్నారు.నిలోఫర్ హాస్పిటల్ కి తీసుకెళ్తే వెంటనే చేర్చుకుని సెలైన్ అమర్చి దానిగుండా మందులు వెళ్ళేలా చేసారు.
ఈ వార్త తెలిసి మా పెద్దమరిది రామకృష్ణా, మల్లేష్ మొదలైనవారు నిలోఫర్ హాస్పిటల్ కి వచ్చారు.ఇంట్లో పల్లవిని చూసుకోవటానికి మా అమ్మను అక్కయ్య ఇంటినుంచి పిలిపించాము.అక్కయ్య హాస్పిటల్ కి మా ఇద్దరికీ భోజనం పంపించేది.
రెండురోజుల పాటు మృత్యువుతో పోరాడి మూడోరోజు మమ్మల్ని తన వైకల్యం చూసి ఇంక కుమిలి పోవద్దనేనేమో ఈ లోకం నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మా చైతన్యబాబు.
ముద్దులు మూటగట్టేలా ఉన్న బాబు ని చూసి నిత్యచైతన్యవంతుడిలా ఉండాలని చైతన్య అని పేరుపెట్టుకున్నాము.ఏ స్పందనా లేని గాజుబొమ్మలా ఉండి మూడున్నర ఏళ్ళ పాటు ఎప్పటికప్పుడు మా మనసుల్లో ఆశని రాజేసుకుంటూ గడిపిన మమ్మల్ని ఇంక సెలవంటూ మా ఒడి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు.
రాత్రీ పగలు నిద్రకాచుకుంటూ గడిపిన నాకు ఒక్కసారిగా ఖాళీ అయిన ఒడిని చూసుకునే సరికి నిర్వేదం ఆవరించింది.
నా పరీక్షలకు ఆటంకపరచకూడదనుకునేనేమో ప్రాణం నిలబెట్టుకుని మరీ వెళ్ళిపోయిన బాబుని గుర్తు తెచ్చుకుంటే దుఃఖం ముంచుకొచ్చింది.
మూడున్నర ఏళ్ళుగా మా యింట అడుగు పెట్టని తోటి కోడళ్ళు మిఠాయిలు పట్టుకొని పరామర్శకి వచ్చేసరికి గుండెల్లో అగ్గి రాజుకుంది దుఃఖం ఆవిరైపోయింది.
విషయం తెలిసి నాబాల్యస్నేహితురాలు కుమారి,వాళ్ళ ఆడబడుచు లక్ష్మి వచ్చారు.నన్ను ఓదారుస్తూ "సుభద్రా నువ్వు బియ్యెడ్ ఎంట్రన్స్ రాయకూడదా? నీ టేలెంట్స్ కి, మనస్తత్వానికి టీచర్ ఉద్యోగం బాగుంటుంది.పిల్లలమధ్య వుంటే నువ్వు మామూలు మనిషి వౌతావు.ఆలోచించు.పల్లవికూడా కొంచెం పెద్దదయ్యింది కనుక ఇబ్బంది ఏమీ ఉండదు"అంది.
కానీ ఇప్పుడు ఎంట్రన్స్ రాయగలనా అని సందేహం వెల్లడిస్తే "ఏమీ పర్వాలేదు సుభద్రా 8,9,10 తరగతుల పుస్తకాలు ఓసారి తిరగెయ్యు సరిపోతుంది." అంది.
నాకు కూడా ఏమైనా చేయాలనిపించింది.ఇలా నాలుగు గోడల మధ్య వుంటే ఏమైపోతానో అనిపించింది.
వీర్రాజు గారు రాగానే ఈ విషయం చెప్పాను.వీర్రాజుగారితో పాటూ వచ్చిన సిధారెడ్డి "నేను రేపు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఎంట్రెన్స్ ఫాం తీసుకు వస్తాన"న్నాడు.
అదే విధంగా సిధారెడ్డి
మర్నాడు ఉదయమే ఫాం తీసుకురావడమే కాదు అదేరోజు సబ్మిషన్ కు ఆఖరురోజని చెప్పి ఫాం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి యూనివర్సిటీ లో సబ్మిట్ చేసారు.
ఇంటికి చుట్టుపక్కల పిల్లల్ని పుస్తకాలు అడిగి చదవటం మొదలెట్టాను.బియస్సీ చేసి పదేళ్ళయ్యింది.కానీ నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు కనుక గణితం , సూత్రాలు వెంటవెంటనే గుర్తు వచ్చాయి.చదువులో పడేసరికి మనసు కొంత కుదుట పడింది.మొత్తంమీద ఎంట్రెన్స్ బాగానే సంతృప్తికరంగానే రాసాను.
ఈలోపు ఎమ్మే రిజల్ట్ వచ్చింది.సెకెండ్ క్లాస్ లో పాసయ్యాను.ఆ పరిస్థితుల్లో పరీక్షకు చదివినా మంచి మార్కులు రావటం సంతోషం కలిగింది.నా పరీక్ష పూర్తయ్యేవరకూ ప్రాణాలుగ్గబెట్టుకున్న బాబు గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ఎంఫిల్ అడ్మిషన్ ప్రకటన చూసి మనసు అటువైపు ఊగింది.వీర్రాజుగారు కూడా "ఒక ప్రయత్నం చేయు.ఇదివస్తే ఎంఫిల్ చెయ్యు.బియ్యీడి సీటు వస్తే అదిచెయ్యు" అన్నారు.వచనకవిత్వంలో కావ్యాలు పేరుతో రెండు పేజీలు నోట్స్ తయారు చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాను.అప్పట్లో ఎంఫిల్, పీహెచ్డీ లకు ఇంటర్వ్యూ తప్ప ఎంట్రన్స్ లేదనుకుంటాను.
మొదటిసారి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కుతుంటే ఉద్వేగం ఆవరించింది.అటువైపు బస్సులోని ఆటోలోనో వెళ్ళినప్పుడల్లా ఎప్పుడన్నా ఆ మెట్లు ఎక్కి రూముల్లో చదువుకొనే అవకాశం వస్తుందా అనుకునేదాన్ని.ఎమ్మే కాంటాక్ట్ క్లాసులకి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది.
డా.కులశేఖరరావుగారూ,డా.నాయని కోటేశ్వరి, బిరుదురాజు రామరాజు గార్లు ఇంటర్వ్యూ చేసారు. అప్పటికే పుస్తకరూపంలోకి వచ్చిన ఆకలినృత్యం కవితాసంపుటి,కథలు, వ్యాసాలు చూసారు.కానీ నాకు సీటు రాలేదు.ఆ ఏడాది రెగ్యులర్ గా ఎమ్మే చదివిన వారికే ఇచ్చారని తెలిసింది.
ఈ లోగా బియ్యిడీ ఎంట్రెన్స్ లో నాకు 56 రేంకు వచ్చినట్లు కార్డు వచ్చింది.మంచిరేంకు వచ్చింది తప్పని సరిగా కాలేజీలో సీటు వస్తుందని మిత్రులు చెప్పారు.
ఒక్కసారి సంతృప్తిగా ఊపిరి తీసుకున్నాను.
23, సెప్టెంబర్ 2023, శనివారం
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
ఇప్పుడే జీ సినిమాలో "ది గ్రేట్ ఇండియన్ కిచెన్" సినీమా చూసాను.చాలా బాగా నచ్చింది.పురుషాధిక్యభావజాలం ,చాంధసభావాలు గల కుటుంబంలో కోడలుగా వచ్చిన విద్యావంతురాలైన ఆధునిక యువతి మానసిక సంఘర్షణ ఈ సినిమా.
సాధారణంగా మన సినిమాలూ, కథలలో ప్రేమలూ డ్యూయెట్ లు,అపార్థాలు,పెద్దవాళ్ళు ఒప్పుకోక పోవటం ఆ తర్వాత అడ్డంకులు తొలగో,లేకపోతే పారిపోయో జరిగిన పెళ్ళితో శుభం కార్డు పడుతుంది.
నిజానికి పెళ్ళి తర్వాతే ముసుగులు తొలగి అసలు కథ ఉంటుంది.
నాకైతే మాత్రం ఆడపిల్లలందరినీ కూర్చోబెట్టి ఈ సినిమా చూపించాలి అనిపించింది.
20, సెప్టెంబర్ 2023, బుధవారం
నత్తగుల్ల జీవులం
నత్తగుల్ల జీవులం"
జీవితం పొడవునా అమృతం కురిపిస్తుందనుకున్న వెన్నెల
ఏ అమావాస్య చీకటిలో కరిగిపోయిందో
చండప్రచండుడే కావచ్చు
కానీ ప్రాణులకి జీవనాధారుడే ఐనా
ఆకాశాన్నీ భూమినీ మండిస్తూ మండిస్తూ
ఏ సముద్రంలో కూలిపోయాడో
ఏ మారుమూల మామిడికొమ్మ చాటునో
దాగుడుమూతలాడుతూ గొంతు విప్పే కోయిల
ఏదూరతీరాలకు ఎగిరిపోయిందో
మనసుచుట్టూ కంచెల్ని విరగ్గొట్టి
పెంచుకున్న మధురపరీమళాలు
ఏ భూమిపొరల్లో వసివాడి కరిగిపొయాయో
మహావృక్షాలుగా ఎదగటానికి
ప్రోదిచేసిన అస్థిత్వమూలాలు
ఎక్కడ తెగ్గొట్టబడ్డాయో
చూపు ప్రసరిస్తున్నంత మేరా
ఊహ విస్తరిస్తున్నంతా ఆవరణా
హృదయం నిండా ప్రేమగా
పొదువుకున్న స్నేహప్రాణవాయువు
ఏ దుఃఖ నదిలో మలిగిపోయిందో
విశాలత్వం నానాటికీ కుంచించుకుంటూ
ముడుచుకు పోతోందా
మనుషుల్లో మానవీయత ఇగిరిపోతోందా
మనిషికీ మనిషికీ మధ్య
నీడకూడా ఎదగనంతగా
ఎండపొడకూడా తాకనంతగా
అపారదర్శక యానకం
దట్టంగా గోడై పేరుకుపోతుందా
అందుకేనేమో
కళ్లనిండుగా కోరుకున్న ప్రకృతివర్ణాల్ని
బుల్లిపెట్టెలో చూస్తూ మురిసిపోతున్నాం
సురభిళాలూ లేవు
సీతాకోకచిలుకలూ లేవు
తేనెపుప్పొడులూ లేవు
తేటిపాటలూ లేవు
విశాలఆవరణాల్లో విస్తరించకుండా
మూలవేరుల్ని కత్తిరించి
పునఃప్రతిష్ట కావించిన
మరుగుజ్జువృక్షాలే మనచుట్టూ
అందుకే మరి
పరిమళభరిత ఫలాలూ లేవు
పలుకుతేనెల చిట్టిచిలకలూ లేవు
అవన్నీ అశరీరవాణిలోనే వినాలి
గుల్లల్లోకి చుట్టుకు దూరే నత్తలమై
సారవంతభూగర్భాల్ని అందుకోలేని వేర్లమై
ముడుచుకుంటూ పిసరంత జాగాల్లోనే
అల్లుకోక తప్పనిపరిస్థితిలో
మిద్దెతోటల్లోకే జారుకుంటూ
అడవుల్ని కలగంటున్నాం
ఇకపై
మనచుట్టూ ఎదిగే వృక్షాలు
ఆముదపు చెట్లేనేమో.
కలుగుల్లో ప్రపంచం
కలుగుల్లో ప్రపంచం
అంతటా
ఘనీభవించిన నిశ్శబ్దం
గునగునా గంతులేస్తూ
ఆవరణంతా కలయతిరిగే
చిట్టిపొట్టి కుందేలు పిల్లలన్నీ
ఏబొరియలో బంధింపబడ్డాయో!
సూర్యుడు కిరణాలరెక్కలుసాచేవేళనుండీ
చీకటి దుప్పటి ముసుగేసుకునే వరకూ
రంగులు విరజిమ్ముతూ ఎగిరే
సీతాకోకచిలుకలన్నీ
తిరిగి ప్యూపాలలోఒదిగి పోయాయేమో!!
పించాన్ని విప్పుకుంటూ వయ్యారంగా
కొమ్మలకారిడార్లలో తిరిగే
తొలియవ్వనపు నెమలికన్నెలు
పింఛాలకొంగుల్ని ముడుచుకొని
ఏ గుబురు నీడల్లో దాక్కున్నాయో!!!
వానాకాలం ను వానచినుకుల్ని
రెక్కలతో ఒడిసిపట్టి
చంఢప్రచండుడిఉష్ణకాసారాల్లో
ఒంపుతున్నట్లు
కిలకిల నవ్వులు రాగాలతో
చిట్టిపలుకుల చిలకపాపలు
ఏ కొమ్మ గూటిలో ముక్కుల్ని కట్టేసుకున్నాయో!!!
అంతస్తుల కొమ్మలనిండా
మిణుగురుపూవుల్ని అద్దినట్లు
నవ్వుల్ని ఒంపుకుంటూ
చెణుకుల్ని విసురుకుంటూ
కలయతిరిగే వయ్యారి ఒప్పులకుప్పలు
ఏ రంగులపెట్టె లో ఒదిగిపోయారో!!!
ఏమో మరి
అంతటా గడ్డకట్టిన నిశ్శబ్దం
చిరుగాలితరగలకే సందడించే
సజీవచైతన్యంతో తలెత్తి నిలిచే
అయిదు నిలువుల మహావృక్షం
మా బిల్డింగు
నేడు ఇప్పుడు
భయంవైరస్సు కమ్ముకున్న వాల్మీకం లో
ఘోరతపస్సుతో స్తంభించిన
మౌనమునిలా వుంది.
ఇలా
ఊరూ వాడా యే కాదు
ప్రపంచమంతా....!!!?
సాకారమైన కల
సాకారమైన కల
కలలకు రెక్కలొచ్చినట్లే
మనసుకు కూడా రెక్కలొస్తే బాగుండు
నన్ను బాధిస్తున్న ఎండుబెరళ్ళ మనుషుల్ని
నిలువెల్లా ముళ్ళుతొడుక్కున్న సమూహాల్ని
ఇన్నాళ్లుగా వెంటాడుతోన్నట్లు
వెనకవెనకే అల్లుకుంటూన్న
చిక్కుసమస్యల దట్టమైన అరణ్యాల్ని దాటి
విశాలాకాసం లో
నా కోసమే పొడిచిన పొద్దులో
మనసురెక్కల్ని ఆరబెట్టుకునేదాన్ని
కలలకు రెక్కలొఛ్చినట్లే
చూపుకి కూడా రెక్కలొస్తే బాగుండు
రాత్రేగినంతకీ ఎగరేసి ఎగరేసి
సొమ్మసిల్లిన కళ్ళనీ
పుస్తకాల్లోని అక్షరాల్ని ఏరుకున్న పిట్టయి
బరువెక్కిన రెప్పల్ని
నిద్రవాలని రాత్రంతా
విసుగుకొంటూ విసురుకొంటూ
అలసిన కంటిపాపని కప్పేందుకు
దుప్పటిలా వాలిపోయే చూపులరెక్కల్ని
మెత్తగా హత్తుకునేదాన్ని
కలలకు రెక్కలొఛ్చి
ఊహకి రెక్కలొస్తే బాగుండు
సీతాకోకచిలుకని చేసి
స్నేహవసంతవనం లో పూచిన పూబాలల్ని
గిలిగింతలతో పలకరిస్తూ
పిల్లగాలిలో రాగాలుతీస్తూ
సెలయేటి పాటకు గొంతుకలుపుతూ
ఉహలరెక్కల్ని రంగురంగుల పూరేకులతో
అందంగా అలంకరించే దాన్ని
అవునవును
కలలకు రెక్కలొఛ్చినట్లే
మాటకి రెక్కలొచ్చినట్లే ఉంది
ఎవ్వరేమనుకుంటారో అని
మనసునొచ్చినా కన్నీళ్ళుచిందినా
గుండెగదిలో దాక్కున్న పిట్టలా
పెదాలతలుపుల్ని బిడాయించుకొని
బైటకి వచ్చేందుకు తడబడుతూ
లోలోపలే కునారిల్లుతూ కూచోకుండా
మాట రెక్కల్ని విదిల్చి
మాటకీమాట గా పదానికి పదమై
నిలువెల్లా పరిపూర్ణ వాక్యమై
కవిత్వమై ప్రవహిస్తూనే ఉంది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)