22, ఏప్రిల్ 2020, బుధవారం

సంబంధ బాంధవ్యాల "సమాలోచన"లే
కొడవంటి కాశీపతిరావు కధలు..

కొడవంటి కాశీపతిరావు ... విజయనగరం కూడా మర్చిపోయిన ఒక గొప్ప కధకుడు.
సూటిగా...స్పస్టంగా...తను చెప్పదలచుకుంది తన కధల్లో చెప్పే ఒక విలక్షణ కధకుడు.
మానవీయ సంబంధాలు, మనుషుల మధ్య అనుబంధాలు ఆయన కధా వస్తువులు.
ఆయన రాసిన ప్రతీ కధా ఒక ఆణిముత్యమే. కధా సాహిత్యానికి వన్నె తెచ్చేవే.క్లుప్తత, గాఢతతో కూడిన కధా శైలి, పదునైన వాక్య నిర్మాణంతో సాగే కాశీపతిరావు గారి కధలు పాఠకుడ్ని  ఇట్టే ఆకట్టుకుంటాయి.  సుమారు వందకు పైగా కధలు రాసారు.1964 నుంచి పాతికేళ్ళపాటు ఆనాటి మాస, వార పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా రచనలు సాగించిన వ్యక్తి. ఉత్తరాంధ్ర యాస, తెలుగు భాషపై పట్టు ఆయన కధల్లో మనకు కనిపిస్తాయి. ఎన్ని కధలు రాసినా, ఎంతో మందిని కధకులుగా తీర్చిదిద్దినా కాశీపతిరావు గారికి తగిన గుర్తింపు రాలేదన్నది వాస్తవం.  విజయనగరం లోనే పుట్టి, ఇక్కడే పెరిగిన కాశీపతిరావు గారు ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. విజయనగరం అలకానంద కాలనీలో వుండేవారు. మాయింటికి రెండు లైన్ల తర్వాతే ఆయన ఇల్లు. ఎప్పుడు ఎదురుపడినా ఈ మధ్య ఏం రాసారు, మీలాంటి కుర్రాల్లు రాయాలి, రాయండి అనే వారు. రాత ఆయనికి ప్రాణం. కధ ఆయన శ్వాస. రాయించడం ఆయన నైజం.

చాసో, రోణంకి అప్పలస్వామి వంటివారితో సాంగత్యం. రావిశాస్త్రి ఏకలవ్య శిష్యరికం..కధా రచన లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొనేందుకు దోహద పడ్డాయి. నమ్మిన సిద్ధంతాన్ని తన కధల్లో కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేవారు. కధలు రాయడంలోనే కాదు, రాయించడానికి కూడా ఎంతో తపన పడిన వ్యక్తి. యువకులు కధలు రాయాలని, వారిని కధకులుగా తీర్చి దిద్దేందుకు "సమాలోచన"అనే ఒక వేదిక ను స్థాపించారు. అప్పట్లో కధలు, కవితలు రాస్తున్న ఓ పదిమంది కుర్రాళ్ళు ను పోగు చేసి ప్రతీ వారం వారందరిని  ఒక దగ్గరకు చేర్చిఆ వారం లో వారు రాసిన రచనలను కూలంకుషంగా చర్చించే వారు. సమాలోచన సమావేశా లకు వెల్లాలంటే ఏదో ఒకటి రాయాలి. అదే కట్టుబాటు. కధో, కవితో రాయాలి. ఆ సమావేశంలో చదవాలి. వాటిపై తోటి వారి అభిప్రాయాలను తెలుసుకొని దాన్ని మరింత పదును పెట్టలి. ఒక కార్యశాల లా వుండేది "సమాలోచన". ఈ విధంగా ఒక రూపు దాల్చిన రచనలను విశాఖ ఆకాశవాణి కి పంపించి ఆకాశవాణి ద్వారా ప్రచారం కల్పించేవారు. వారిచ్చిన పారితోషకంతో ఆ రచనలన్నీ పుస్తక రూపంలో వెలువరించే వారు. ఆ విధంగా వెలుగు చూసిన ఒక పుస్తకం "సమాలోచన" ఒక పదిమంది యువకుల కవితా వేదిక ఆ పుస్తకం. ఈ పుస్తకం లో నా రచన కూ డా  ఒకటుండడంతో  మాష్టారుకు నాకు మధ్య వున్న అవినాభావ సంభంధం మరింత బలపడింది. ఈ వేదికలో అక్షరాలు దిద్దినవారు ఎంతో మంది మంచి కధకులుగా కవులుగా పేరు సంపాదించుకున్నారు. 

కాశీపతిరావు గారి  కధలు  మూడు పుస్తకాలుగా వెలుగు చూసాయి."ముగ్ధ", "వెలుగు తుప్పర్లు" "బొంకులదిబ్బ కధలు" గా మూడు సంపుటాలని ప్రచురించారు. ఇవికాక మాష్టారి సంపాదకత్వంలో మరో మూడు సంపుటాలు కూడా వెలువరించారు. విజయనగరం లో వున్న తొలి తరం కధా రచయితల రచనలు, అప్పటికే లబ్ధ ప్రతిస్టులైన కధకుల రచనలతో కధల వాకిలి, కధల నగరం వంటి మూడు కధా సంకలనాలను ప్రచురించారు.  మాస్టారుకి "ముగ్ద""బొంకులదిబ్బ కధలు"బాగా పేరును తెచ్చాయి. బార్యా, భర్త ల అనుబంధానికి ఒక నిర్వచనాన్నిచ్చిన కధ "చుక్కాని". "నన్నెందుకు పెల్లడతానంటావే సుక్కా: అట్టాంటి ఆసెలెట్టుకోకే. కుంటోడితో కాపురం సెయ్యలేవు. పనీ పాటా సేసుకోలేనోణ్ణీ. కట్టుకునేటి సుకబడతావు?నేనడుక్కోని బతకాలే... అడుక్కోని బతకాలి. ఈ ఎదవ బతుకంతే...."
సుక్క బోరునేడిసింది. "మావా! అట్టాగనమాక మావా: నీ మనసు కావాల గాని కాలూ సెయ్యిలో నేటున్నాది? నివ్వు కుంటోడివయితే నీ మనసు కుంటిదవుద్దా? నాకోసమే నువ్వు కాలు పోగొట్టుకున్నావు, నిన్నిడిసిపెట్టి మరొకణ్ణి మనువాడితే బగమంతుడూరుకోడుమావా... మనువు జరగాల్సింది కట్టెలక్కాదు మావా మనసులకి. మనకెప్పు డో  మనువు అయిపోనాది...సెప్పుమావా...సుక్కానిలాగా దారిసూపించడానికి నాన్నీకొద్దా... సెప్పుమావా...ఒద్దంటే నాను సచ్చిపోతాను మావా.... ఇలా సాగే ఈకధనం  పాఠకుడ్ని కంట తడిపెట్టుస్తింది.గుండెను పిండేస్తుంది..
తను చెప్పదలచుకొన్నది సరళంగా, కధా రూపంలో ఇమడ్చి చెప్పడం అంటే ఇష్టం.  సీరియస్ యితివృత్తాన్ని కూడా హాస్యంగా చెప్పి పాఠకుడ్ని  ఊపిరి బిగ పెట్టుకొని కూర్చోనివ్వకుండా గబాగబా చదివించి అదే లక్ష్యాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం ప్రతీ కధ లోను కనిపిస్తాయి. సాధారణంగా సున్నితమైన హృదయస్పందనల్ని కధలుగా రికార్డ్ చేసి మనకు అందిస్తారు.
కధలలో మాండలికం రాయటం అంతగా లేని రోజుల్లో ఈయన ప్రతీ కధలో మాండలికం కనిపిస్తుంది. ఈయన రచనలపై రావిశాస్త్రి ప్రభావం కనిపిస్తుంది. వ్యంగ్యం తో కూడిన మాండలికం మాష్టారి కధల్లో   మనం చూస్తాం. ఆయన ప్రతీ కధకీ విజయనగరమే వేదిక. ఇక్కటి ఆచార వ్యవహారాలు,  సాంప్రదాయాలు, ఈ ప్రాంత వెనకబాటుతనం, ఇక్కడి మనుషల అనుబంధాలు మాష్టారి కధలకు ముడిసరుకు. విజయనగరాన్ని ఎంతగానో ప్రేమించారు. విజయనగరం అంటే ఆయినికి  గాఢమైన అనురక్తి. విజయనగరం అంటే మోహం. రచయిత గా ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు.  సాహిత్యం లో వస్తున్న వ్యాపార ధోరణిని అసహ్యించుకొనేవారు.
 రచయిత్రి పి.సరళాదేవి, కవియిత్రి శీలా సుభద్రాదేవి వీరి సోదరీమ ణులు.   
కాశీపతిరావు గారి గురించి ఆయన సోదరి శీలా సుభద్రా దేవి ఒక పరిచయం లో ఈవిధంగా రాస్తారు " సాహిత్య రంగంలో పెల్లుబుకుతున్న అనేకానేక వివక్షతలకు నివ్ఫ్వెరపోయి, స్వార్ధ ప్రయోజనాల్ని ఆశించే విధానాల్ని  చూసి అసహ్యంచుకొని తాను సేకరించిన అమూల్యమైన కధకుల సంపుతాల్ని కధానిలయానికి అందజేసి, అస్త్ర సన్యాసం చేసి సాహిత్య సంస్థలకు, సాహిత్య రంగానికి, పత్రికలకు దూరంగా వుండిపోయాడు"
విజయనగరాన్ని శ్వాసిస్తూ వుండే మాష్టారు విజయనగరానికి దూరంగా హైదరాబాద్ లో కుమారుల ఇంట తన 72 వ ఏట 2017  ఏప్రిల్ 19 న తుది శ్వాస విడిచారు.

( నేడు కాశీపతిరావు గారి తృతీయ వర్ధంతి. నివాళిగా) 

Photo Courtesy  : మిత్రుడు జి.ఎస్. చలం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి