10, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఊతకర్ర

క్కసారి..కాదు..కాదు
అనేకానేక సార్లు
ఎన్నింటినో లెక్కలు వేస్తుంటాం
కానీ
దువ్వెనలో మెరిసే  వెండితీగ
ఏనాడూ కళ్ళకు జిగేల్ మనిపించిందిలేదు
గుండెలో గుభేల్ మనిపించిందీలెదు
వేసుకున్న చీకటితెరని చీల్చి
ఏ చంద్రకిరణం నుండి తెలుపును అరువుతెచ్చిందో
ఇప్పుడు నాజడ నిండా మెరుపుతీగలే!
అద్దం చూసుకుంటానా
సముద్రం నాలో నిండిపోయిందో ఏమో
అమావాస్యనాడు పోటుమీదున్నట్లుగా
ముఖం నిండా చేతుల నిండా
అలలు అలలుగాముడతలు!
చిన్నప్పుడు అమ్మ ఎంత కాటుక పెట్టిందో
నేటికీ కళ్ళచుట్టూ పరచుకొన్న
వలయాలు చూపుకి అడ్డం వస్తున్నాయ్
ప్రతీ పుట్టినరోజునాడూ
తర్జని చూపి వయస్సు బెదిరిస్తూనే ఉంటుంది
ఐనా అదేం చేయగలదు?
కళ్ళల్లో స్వప్నాలు
ప్రతీరాత్రీ గుబాళిస్తూనే ఉంటాయ్
మనసు ఛైతన్య జీవస్రవంతై
శరీరమంతటా ప్రవహిస్తూనే ఉంటుంది
ఆలోచనలునాకన్నా ముందే పరుగులు తీస్తూ
కథలవలువలు చుట్టుకుంటూ
కవనరాగాల్ని శృతి చేస్తూ
కాగితాలవేదికల్ని వెతుక్కుంటూనే ఉంటాయ్
ఇంక నాకేం భయం!!
పుస్తకాలబరువులతో ఆత్మవిశ్వాసం సడలి
నడుం వంగిన పిల్లలకి చేతిసాయం చేస్తూ
కళ్ళని విప్పార్చి ఆతృతగా అరచేతియంత్రం లోకి
తలదూర్చి మాటలు మర్చిపోయి
చాట్లను చేసుకుంటున్న యువతరాన్ని
జాలిగా చూస్తూ
ఆధ్యాత్మికతనే వ్యాపకం గా మార్చుకుని
అన్నింటికీ కర్మసిద్ధంతాన్నె ముడిపెట్టి
నలభై ఏళ్ళకే ముసలమ్మలౌతోన్న తరాన్ని
నిరసనగా పరికిస్తూ
కులాసాగా కూనిరాగాల్ని తీస్తూ
ఎంతదూరమైన పరుగులు తీస్తాను
చైతన్యం నా జీవలక్షణం కదా మరి!
అక్షరం నా ఊతకర్ర
మనోబలం నాకలం
అలసట ఎరగని నిరంతర బాటసారిని
వయోభారం నాకు లేదు
అది శరీరానికేకాని మనసుకి కాదుకదా!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి