21, ఏప్రిల్ 2020, మంగళవారం

పునీత
మనం చెయ్యాలనుకోకుండానే
నచ్చని పనులు చేస్తూనే వుంటాం
అలా మాట్లాడకూడదనుకోంటూనే
నచ్హని సంభాషణల్లోకీ దూరిపోతూనే వుంటాం
వివాదాల జోలికి పోవద్దనుకుంటూనే
విష ప్రభంజనాల్లో చిక్కుకు పోతుంటాం
మూడుకోతుల నీతిని వల్లిస్తుంటూనే
చీకట్లోకి నెట్టుకుంటూ నడుస్తాం
మన ప్రమేయం లేకుండానే
అహంకారం లోనో అయోమయం లోనో కూరుకుపోతుంటాం

మనలోని మనం రెక్కలు కట్టుకొని
చూస్తూ చూస్తుండగానే దుమ్ము రేపుకుంటూ
ఎగరటం మొదలేడుతుంది
ఆ విసురుకి సొమ్మసిల్లి లేచేసరికి
మనలోంచి మనం తప్పి పోతాం
పూర్తి మెలకువ వచ్చాక తెలుస్తుంది
మనం కోల్పోయింది ఏమిటో

స్నేహమా!!
నా లోంచి తప్పిపోయిన నన్ను వెతికి పట్టుకొని బంధించి
స్నేహపునీతను చేసి తిరిగి నాలో ప్రతిష్టించవా!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి