22, ఏప్రిల్ 2020, బుధవారం

శీలా వీర్రాజు పరిచయం

*చిత్ర, సాహిత్య కళల సృజనశీలి శీలా వీర్రాజు*
---------------- ------------ ---------- ------

*నేడు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 22 ) సందర్భంగా... శుభాకాంక్షలతో....💐 రాశే మాట*
----------------------------------------------

*చిత్ర, సాహిత్య కళల్లో...* సమానంగా మెప్పించిన సృజనకారులు శీలా వీర్రాజు గారు . నేడు ఆయన పుట్టినరోజు  (22.04.2020). ఈ సందర్భంగా ... శీలా వీర్రాజు గారి సాహిత్య పరాపర్శకు సిద్ధపడింది ' రాశే' కలం. సాహిత్యంలో కథ, కవిత్వం, నవలలను రాసి వినుతికెక్కారాయన. అసలు రెండు దశాబ్దాల కాలం ఏ రచయిత పుస్తకమైనా శీలా వీర్రాజు ముఖచిత్రంతో రావాల్సిందే. అంటే చిత్రకళను, సాహిత్య కళను సవ్యసాచిలా తెలుగు సమాజంపై ప్రయోగించి, మెప్పు పొందిన కళాకారులు శీలా వీర్రాజు గారు. ఏప్రిల్ 22, 1939న రాజమండ్రిలో జన్మించారు. ప్రాథమిక విద్య అక్కడే సాగింది.  తర్వాత రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఎ. వరకూ చదువుకున్నారు. చదువుకునే రోజుల్లోనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి- కథలు, నవలలు, కవిత్వం రాసేవారు. 1961 నుండి సుమారు మూడు సంవత్సరాలు పాటు హైదరాబాదులోని కృష్ణాపత్రికలో చిత్రకారునిగా, రచనాకారునిగా పనిచేశారు. 1963లో సమాచార పౌర సంబంధాల శాఖలో ఉద్యోగంలో చేరారు. దామెర్ల రామారావు, వరద వెంకటరత్నం దగ్గర చిత్రకళను నేర్చుకున్నారు. వీరి రచనలు ఎక్కువగా మధ్యతరగతి జీవితాల చుట్టూ తిరుగుతుంటాయి. కథ రాసినా, కవిత్వం రాసినా, నవల అల్లినా అన్నింటిలోనూ సౌందర్యంతో పాటు, సామాజిక అంశం కూడా మిళితమై ఉంటుంది.
నవలలు - వెలుగురేఖలు, కాంతిపూలు, మైనా, కరుణించని దేవత.
కవిత్వం - కొడగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది, మళ్లీ వెలుగు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, శీలా వీర్రాజు కవిత్వం (6 కవితా సంపుటాల గ్రంథం)
కథలు - వీరి కథలు పలు సంపుటాలుగా వచ్చాయి. సమాధి, మబ్బు, శీలా వీర్రాజు కథలు, బండి చక్రం, రంగుటద్దాలు, పగా మైనస్ ద్వేషం, మనసులోని కుంచె, వాళ్ల మధ్య వంతెన, ఊరు వీడ్కోలు చెప్పింది, శీలా వీర్రాజు కథలు (మరో సంపుటం)... లాంటివి.
ఇతర రచనలు - కలానికి అటు ఇటూ (వ్యాససంపుటి), శిల్పరేఖ
(రేఖాచిత్రాలు), శీలా వీర్రాజు చిత్రకారీయం (వర్ణచిత్రాల ఆల్బమ్) వీటితో పాటు కొన్ని అనువాదాలు కూడా వీర్రాజు చేశారు. చాలా పత్రికల్లో వీరి రచనలు ధారావాహికలుగా వచ్చాయి.
శీలా వీర్రాజు కథలు ఏకబిగిన చదివిస్తాయి. మనసుకు అనుభూతినిస్తాయి. సంస్కారవంతమైన జీవితాన్ని పాఠకులు అలవర్చుకొనేలా చేస్తాయి. వీరి కవిత్వం రమణీయతతో కూడిన భావుకతతో ఉంటుంది. మొత్తంగా వీర్రాజు రచనలు ప్రకృతిని, మనుషుల్ని సమపాళ్ళలో ప్రేమించడం నేర్పిస్తాయి. జీవితాన్ని, తోటి మనుషుల్ని నిస్వార్థంగా ఇష్టపడమని చెప్తాయి.  సమాజానికి తాత్వికమైన అర్థాన్ని అందిస్తాయి శీలా వీర్రాజు రచనలు.
"నిజాయితీ లేనివాళ్లం కవితలో-
          మాట మాటకీ మనమే గుర్తొస్తుంటాం
          ప్రజలు గుర్తురారు, సమూహాలు గుర్తురావు
          మనం వొట్టి స్వార్థపరులం
          మనకు కావల్సింది ప్రజలు కాదు, మనమే
          మన కీర్తి ప్రతిష్టలు, మన సుఖ సంతోషాలు,
          మన హోదాలు 
          ఆ తర్వాతే మనకు ప్రజలు....
         అంతస్సూత్రంగా వీరి రచనల్లో ఇదే కనిపిస్తుంది.శీలా వీర్రాజు వ్యక్తిత్వం సాత్వికం. కోపతాపాలకు అతీతం. కొత్త రచయితలకు ప్రోత్సాహం. ఇతరుల పుస్తకాలను సైతం అందమైన ముఖచిత్రాలతో గుండెలకు చంటిపాపలా హత్తుకునే తత్త్వం. కవుల్ని, రచయితల్ని ప్రోత్సహిస్తారు. చిత్ర కారునిగా కూడా శీలా వీర్రాజుది ప్రత్యేకమైన శైలి. వీరి చిత్రాలు మోడ్రన్ ఆర్టుకు దూరంగా మన గ్రామ సీమల్ని గుర్తుకు తెస్తాయి. ఊళ్లల్లో కనిపించే జీవితాలు, వృత్తులు, పనిపాటలు, పండగలు, శ్రమజీవుల కష్టాలు... ఇలా వీరి బొమ్మలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలుగా ఉంటాయి. ఇప్పటి వరకు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. మనదేశంలోనే కాకుండా పశ్చిమ జర్మనీ గోటింజన్ నగరంలో కూడా వీరి చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. పడుగు పేకల మధ్య జీవితం అని తన స్వీయకథను కవితా రూపంలో రాసుకున్నారు. ఇది ఆయన జీవితమే అయినా అందరి జీవితాల్లా కనిపిస్తుంది.
వీరికి 1967లో కొడగట్టిన సూరీడు కవితా సంపుటానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ వారి మొదటి అవార్డు వచ్చింది. 1969లో మైనా నవల ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవలగా గుర్తించింది. 1991లో వీరి కథల సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ బహుమతి లభించింది. 2014లో బోయి భీమన్న కవితా పురస్కారం శీలా వీర్రాజును వరించింది. ఇలా అటు కథలు, కవిత్వం, నవలలు...  ఇటు చిత్రకళను తనదైన ప్రత్యేకమార్గంలో సృజించిన ప్రతిభ శీలావీర్రాజుగారిది. అందుకే నేటితరం రచయితలకు. కవులకు, చిత్రకళాకారులకు ఓ పుస్తకం లాంటి వారు శీలా వీర్రాజుగారు. ఆయన పుట్టినరోజున ఇలా సాహిత్య పరామర్శను చేసుకునే అవకాశం లభించిన తృప్తితో....ఆయన కలం నించీ... కంచె నించీ... మరెన్నో... సృజనలను స్వాగతిస్తూ.....

*-సన్నశెట్టి రాజశేఖర్, 94404 36703*
(ఎడిటర్, ఉత్తరాంధ్ర )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి