సుమారు ఆరేడు దశాబ్దాల కిందట సాహిత్యరంగంలో ఉన్న వారిలో ముఖ్యంగా రచయిత్రులలో సింహభాగం ఒకే సామాజిక వర్గానికి చెందినవారు అనేది జగమెరిగిన సత్యం. అందుకు వారి కుటుంబాలు కొన్ని తరాలుగా సాంస్కృతికంగా ఎదిగినవారు కావటమే. ఇంట్లోనే అయినా చదువుకునే అవకాశాలు ఉండటం, సారస్వత సాహిత్యాలలో అభిరుచి ఆసక్తీ పెంచుకునే అవకాశాలు, ప్రోత్సాహం ఉండడం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా దానికోసం ఇంటిల్లిపాదీ శ్రామిక జీవనం చేయాల్సిన అవసరం లేకపోవటం ఇవన్నీ కూడా వారికి రచనలు చేసే సౌలభ్యం, సావకాశం కుదిరేలా చేశాయి. ఇతర సామాజిక వర్గాలలో కొన్ని అగ్రకులాలలో మాత్రమే కొందరైనా చదువుకునే వెసులుబాటు కలిగింది. ఆ కారణాల వలనే 60-70 ఏళ్ళ కిందట దళిత, బహుజన కులాల రచయిత్రులు ఒకటీ అరా మాత్రమే ఉన్నారు.
అటువంటి పరిస్థితులలో బ్రాహ్మణేతర కులాల నుండి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టిన ఒకరిద్దరు రచయిత్రులలో తనకంటూ ఒక ముద్రని సాధించుకొని నిలబడిన వారిలో చెప్పుకోదగినవారు వాసిరెడ్డి సీతాదేవి ఒకరు.
అప్పటివరకూ వస్తున్న రచనలలో వస్తుపరంగానే కాక భాషాపరంగానూ, ఒకే సామాజిక వర్గ కుటుంబ జీవనం, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ కావాలని కథలో చొప్పించకపోయినా కూడా – ప్రస్ఫుటంగానే వ్యక్తమయ్యేరీతిలోనే ఉండేవి. సంభాషణలూ, మానవ సంబంధాలూ, కుటుంబ జీవన విధానం, అన్నీ ఒక పద్ధతిలోనే సాహిత్యమంతా పరచుకుంటున్న రోజుల్లో బ్రాహ్మణేతర రచయితలు కూడా అదే ధోరణిలోనే అదే ప్రామాణికమన్నట్లుగా రచనలు చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో సీతాదేవి ఒక కొత్తరీతినీ సమాజంలోని మరో కోణాన్నీ, ఇతరేతర కుటుంబ జీవనాల్నీ పరిచయం చేస్తూ రచనలు చేశారు.
అంతవరకూ ఉన్న ధోరణికి భిన్నంగా ఉన్నందువలన పాఠకలోకం కూడా ఆసక్తి కనబరిచారు. అప్పుడప్పుడే సమాజంలోని అన్ని వర్గాల మహిళలూ పాఠకులుగా మారటం వీరి రచనలలోని భిన్న ధోరణితో మమేకం కావటం వల్ల కావచ్చు సీతాదేవి రచనలు ఆదరణ పొందాయి.
ఆ రోజుల్లో రచయిత్రులలో మూడొంతులకుపైగా కీర్తీ, ధనం అందించే ధారావాహికలే పుంఖానుపుంఖాలుగా రాస్తున్న సందర్భంలో సీతాదేవి నవలలతోబాటు అంతే ఏకాగ్రతతో కథలు కూడా విరివిగా రాసారు. అందుకే నలభై రెండు నవలలే కాక పదకొండు కథల సంపుటాలు- అంటే వందకుపైగా కథలు రాసారు. వీరి కథలు చాలావరకూ దీపావళీ, సంక్రాంతికీ వెలువడే యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక మొదలైన పత్రికల ప్రత్యేక సంచికలలోనే ప్రచురితమవ్వటం కూడ ఒక విశేషం.
ఒక్కగానొక్క పిల్లవాడు గోపాలం పుష్కరాలలో తప్పిపోతే దుఃఖపూరితులైన దంపతులను ‘సానుభూతి’ పేరిట ఇంటికి వచ్చిన వారంతా వైనాలువైనాలుగా తప్పిపోయిన పిల్లల దుస్థితులను గురించి చెప్పేసరికి భయంతో మతిభ్రమణంకు లోనౌతారు ఆ దంపతులు. తీరా పిల్లవాడు తిరిగి క్షేమంగా దొరికినా గుర్తించలేని ఆ తల్లిదండ్రుల పరిస్థితిని ఆద్యంతం ఆర్ర్దతతో కూడిన కథనంతో సాగిన సానుభూతి కథలో మానవ స్వభావాలను తెలియజేస్తుంది సీతాదేవి.
ఎన్నికలలోని లొసుగులూ, స్వార్థ రాజకీయాలను ఎండగడుతూ రాసిన కథ ‘మీ ఓటు నాకే’ (1979) ఇందులోని పాత్రలన్నిటినీ మిసెస్ కైలాసం, మిసెస్ పరాంకుశం, శ్రీమతి ముకుందం, మిసెస్ వైకుంఠం, శ్రీమతి శిఖండి లాంటి మహిళల్ని చెప్పటంలో భర్తల పేర్లతో తప్ప స్వంత వ్యక్తిత్వంలేని మహిళామణుల పట్ల రచయిత్రికి గల వ్యతిరేకత వ్యక్తమౌతుంది.
సర్కారు బస్సుల్లో ఇరుకిరుగ్గా కూర్చోబెట్టి, రైలులో జనతా బోగీలో ప్రయాణం చేయించి, పేదవాడి గుడిసెలలో జీవన దృశ్యాల్ని ఆవిష్కరించి పాఠకుల్ని భద్ర కుటుంబం నుండి బయటకు తెచ్చి బయట ప్రపంచం ఎలా వుంటుందో చూపించే కథలు సీతాదేవివి.
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా భార్య వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా ఆర్థికంగా తోడుపడడానికి సిద్ధపడితే భార్య సంపాదించటం తన భర్తృత్వాన్ని కించపరచటంగా భావించే ఆనాటి సామాజిక సాంప్రదాయాల్ని నిలదీసే కథ 1956లో రాసిన ‘పారిపోయిన మనిషి’ రామసుబ్బమ్మ తాను ఇంట్లోనే ఇడ్లీలు చేసి అమ్ముతానని అంటే ఆమెపై నిప్పులు చెరుగుతాడు శేషయ్య. అయినాసరే ఆమె తన నల్లపూసల గొలుసు 800 రూపాయలకు అమ్మి ఇంట్లో పెట్టిలో దాస్తే అది తీసుకొని శేషయ్య భార్య సంపాదన తినే కన్నా ఆత్మహత్య మేలని ఇల్లు వదిలి కాశీకి పారిపోతాడు అక్కడ అనుకోని పరిస్థితుల్లో మూడేళ్ళు జైలు పాలై తిరిగి పశ్చాత్తాపంతో ఊరికి తిరిగి వచ్చిన శేషయ్య స్టేషను దగ్గర హోటలులో టిఫిన్ తిని డబ్బు చెల్లించకుండా పారిపోబోతే హోటలు వాళ్ళకి పట్టుబడతాడు. తీరా ఆ హోటలు నడుపుతున్నది తన భార్య, కూతురూ, అల్లుడే అని శేషయ్య తెలుసుకుంటాడు. చివర ముగింపులో నాటకీయత ఉన్నా కథని నడిపిన విధానం, శేషయ్యలోని మగతనపు అహంకారాన్ని ఎత్తి చూపటం, ఆడవారి సంపాదన పట్ల ఆ పాత్ర వ్యక్తపరచిన చులకనభావం ఆనాటి సమాజంలో స్త్రీల పట్ల గల చిన్నచూపుని తెలియజేస్తుంది.
‘ఆమె లోకం’ అనే కథలో కూడా బీదరికం వల్ల ఆడవారికి కలిగే అనర్థాలని అక్షరీకరించింది రచయిత్రి.
సీతాదేవి కథలలో కొన్ని ఒకే దృశ్యంలో ఒక పాత్ర యొక్క ఆత్మగత స్వగతంగా కథనంతా చెప్పటం ఉంటుంది. అందులో ఒకటి ‘ఎత్తుకు పైఎత్తు’ గోల్కొండ ఎక్స్ ప్రెస్ లోని బోగీలో ఎక్కిన విశ్వనాథం స్వగతంగా ఒక క్రైం థ్రిల్లర్ కథగా నడుస్తుంది. అదేవిధంగా విజయవాడ వెళ్ళే బస్సులోనే బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం మిన్న అని తెలిపే కథ ఏది సౌందర్యం కథ. ఇది ‘రేఖ’ పాత్ర స్వగతంగా సాగింది. ఇవి రెండూ 1978-79లో రాసినవే.
‘ఆమె’ కథ, ‘మిసెస్ కైలాసం’ కథలు ఒకటి, బస్సులోనూ, రెండవది ట్రైనులోనూ జరుగుతాయి. కానీ రెండూ ఒకే అంశంతో ఒకటే సంభాషణలతో ఉన్న రెండు కథలు కానీ రెండూ విభిన్న కథలుగా రాసి మెప్పించింది రచయిత్రి. అందులో ఒక పాత్ర తాను చాలా గొప్పదాన్ని అనే అహంభావం ప్రదర్శించటం, చివరిలో అదంతా డొల్లతనంగా రూపొందేలా చక్కని చమత్కారాలతో రచయిత్రి రాసింది.
సీతాదేవి కథలు రాసే సమయంలోగానీ, అంతకుముందుగానీ రచయిత్రులు బీద బడుగు శ్రామిక జనుల కథలు ఒకరిద్దరు రచయిత్రులు రాసినా, పాత్రోచితంగా గ్రామ్యభాషలోనే సంభాషణ నెరపినా సంస్కారబద్ధంగానే రాయటం జరిగింది. సీతాదేవి తన కథలో శ్రామిక జన కష్టాలూ, సంఘర్షణలూ, బాధలు, ఆక్రోశాలూ రాసినప్పుడు సహజసిద్ధంగా ఉండేలా సందర్భానికి తగు విధంగా ‘కడుపాత్రపు వెధవ’, ‘దొంగముండా’ వంటి తిట్లు సైతం అలవోకగా ప్రయోగించారు. అందుచేత ఆ పాత్రకు గల కోపాన్నీ, ఆవేశాన్నీ ప్రకటించటంలో సహజత్వం ఉట్టిపడింది. బహుశా అందువలనే కావచ్చు వాసిరెడ్డి సీతాదేవికి అప్పటి రచయిత్రులలో ఫైర్ బ్రాండుగా పేరు రాతలలోనేకాక వ్యక్తిత్వంలో కూడా నిర్భయంగా, నిక్కచ్చిగా ఉన్నదున్నట్లుగా మాట్లాడే స్వభావం ఆమె రచనలలో కూడా వ్యక్తమౌతుంది.
‘అభినవ దుష్యంతుడు (72)’ కథలో శంకరం తన భార్యకు పెళ్ళైన తర్వాత ఎనిమిదవ నెలలోనే కొడుకు పుట్టాడని తెలిసి అనుమానించి భార్య బట్టల అల్మారా వెతుకుతాడు. అది చూసిన భార్య తనని అవమానించడంగా భావించి బిడ్డని అతనికే అప్పగించి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
అరవయ్యో దశకంలో కుటుంబ నియంత్రణ ప్రచార సందర్భంలో రాసినది కావచ్చు. ‘ఇంక ఏం చెప్పాలి?’ కథ. కానీ ప్రచార కథలా నినాద ప్రాయంగా మాత్రం లేనిది. ఒక అతి సంతాన కుటుంబీకుడి జీవనదృశ్యానికి సజీవరూప కల్పనగా ఉంటుంది. దైవభక్తుడైన సంతానరావు దేవుడిచ్చిన దాన్ని ఇచ్చినట్లుగా స్వీకరించాలనే మనస్తత్వం కలవాడు కావటాన పునరుత్పత్తిని ఆపే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని పాత్ర పరిచయంగా మొదట్లోనే చెప్పటం విశేషం. కుటుంబంలోకి అతిథిగా వచ్చిన అరుణ అనుభవంగా కథంతా నడుస్తుంది. ఎక్కడా ‘చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం’ అని చెప్పదు. అతి సంతానంతో ఆర్థికపరమైన ఈతిబాధలు, దాని కోసం పరువు కోసం, అతిథి మర్యాదల కోసం ఆఫీసు డబ్బు వాడుకుని జైలుపాలవ్వటం, మొదట్లో ఒకింత హాస్యస్ఫోరకంగా మొదలై చివరలో ఆర్ద్రంగా ముగుస్తుంది.
1970లో గండిపేట తెగిందన్న పుకారు హైదరాబాదు ప్రజల్ని అతలాకుతలం చేసిన సంఘటన నేపథ్యంలో రాసిన ‘పానీ ఆ రహా హై’ కథ సీతాదేవి కథల్లో చెప్పుకోదగినది. శంకరమఠంలో గంగావతరణం కథని పురాణ శ్రవణంగా చెప్తోన్న శంకరశాస్త్రి, ‘పానీ ఆ రహా హై’ అనే అరుపులతో మనవడిని కూడా మర్చిపోయి జనంతో పాటూ పరుగులు తీస్తూ అతని అంతర్గత ఆలాపనగానే కథ సాగుతుంది. పరుగులు తీస్తూ అనేక సందర్భాల్ని మననం చేసుకుంటూ చివరికి శంకరశాస్త్రి కుప్పకూలిపోతాడు. అతనితో పాటూ చివరికి ఏమౌతుందో అని పాఠకుల్ని కూడా పరుగులు తీయించే పఠనీయత గల కథ ఇది.
1969లో రాసిన ‘తరాలూ-అంతరాలూ’ కథలో నాయనమ్మా మనవరాలు మధ్య నాల్గు తరాల స్త్రీల మారుతున్న జీవన విధానం గురించిన చర్చగా కథనం సాగుతుంది. కథ ఆసాంతం తరాల జీవన సరళిని గురించి చక్కని వివరణాత్మక విశ్లేషణలతో పాఠకులకు చాలా అంశాల్ని విశదపరుస్తుంది.
నవలల్లోనే కాక కథల్లో కూడా అనేకానేక వైవిధ్యభరితమైన కథాంశాల్ని తీసుకొని సీతాదేవి రాసింది. కొన్ని కథలు మానవ స్వభావంలోని మంచి చెడులను చెప్పితే, మరికొన్ని సమాజంలోనూ, కుటుంబ వ్యవస్థలోనూ స్త్రీలను కించపరిచే, అణచివేసే మూఢాచారాల్నీ సంప్రదాయాల్నీ బట్టబయలు చేసింది. రాజకీయాలలోని లొసుగుల్నీ చూపించింది. మానవ మనస్తత్వాన్ని ఛిద్రంచేసే ఆర్థికాంశాలను అక్షరీకరించింది. ఒంటరి స్త్రీలను కూడా ధైర్యంగా జీవితంలో నిలదొక్కుకొని బతికేలా, గౌరవప్రదంగా ఒకరిపై ఆధారపడకుండా నిలిచే పాత్రల్ని సృష్టించింది.
మనస్తత్వ శాస్త్ర నేపథ్యంలో 84లో రాసిన ‘విభ్రమ’ ఎప్పుడో జరిగిన విషయాలను తన కుటుంబ సభ్యులకు అన్వయించుకుంటూ తన నీడకి తానే భయపడుతూ అనేక భ్రమలతో సతమతమై పిచ్చెక్కబోతుందనుకున్న అనూరాధను సరియైన సమయంలో సైకాలజీ చదువుకున్న భర్త అర్థం చేసుకొని సమస్యని చేధించి ఆమెకు సాంత్వన కలిగించిన కథ.
‘సీసా పాతదే’ మధ్య తరగతి మందహాసం అయితే, ‘హసీనా’ కథ భాగ్యనగరంలోని చీకటి కోణాల కథ. చాలా కథల్లో కథానేపథ్యం హైదరాబాదే.
81లో రాసిన ‘గాలికథ’ ఒక దశాబ్దంలో వారపత్రికల్ని ఒక ఊపు ఊపిన ‘బ్లాక్ మేజిక్’ నేపథ్యంలో కాష్మోరాలూ, తాంత్రిక సిద్ధులూ ఆధారంగా నవలల్ని రాసి పాఠకుల్ని మూర్ఖుల్ని చేసిన రచయితల్ని తూర్పారపడుతూ రాసిన కథ. నేరాలు చేసిన వారికన్నా, కల్తీమద్యం వ్యాపారస్తుల కన్నా లేతమనసుల్ని కల్తీ చేసే స్లో పాయిజన్ లాంటి రచనలు మరింత ప్రమాదకరం అని ఈ కథలో ఘంటాపథంగా చాటిచెప్పింది రచయిత్రి.
68లో జయశ్రీలో ప్రచురితమైన ‘తమసోమా జ్యోతిర్గమయా’ కథని సీతాదేవి తనకు నచ్చిన కథగా చెప్పుకుంటారు. ఈ కథ యువ దీపావళి సంచికలో పునఃప్రచురణ అయ్యింది. ఇది చాలా మంచి కథ. ఇందులో గోపాలం, సిద్ధాంతి మధ్య అస్తిత్వం, నాస్తికత్వం మీద, మూఢనమ్మకా లమీద చర్చతోనే మూడొంతులు కథ నడుస్తుంది. గోపాలాన్ని నాస్తికుడుగా మార్చాలని సిద్ధాంతి అనేక శ్లోకాలతో అనేక విషయాలను విశ్లేషిస్తుంటాడు. అతని విశ్లేషణల్ని హేతువాద దృక్పథంతో గోపాలం ఖండిస్తుంటాడు. హైదరాబాదు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ఒంటిమీద పెట్రోలు జల్లుకుని మంటలతో పై నుండి క్రింద నీళ్ళలోకి దూకే ప్రదర్శనని చూడడానికి వెళ్తున్నానని సిద్ధాంతి అంటే కొంత కుతూహలంతోనూ, మరికొంత అంతటి హేయమైన ప్రదర్శనని చూడాలనే సిద్ధాంతి కుతూహలాన్ని చూసి తాను కూడా విమర్శిస్తూనే వెళ్తాడు గోపాలం. అక్కడ ముక్కుపచ్చలారని పదహారేళ్ళ నాగేష్ ఆ ఫీటు చేయబోతున్నాడని తెలిసి గోపాలం ఆ పిల్లాడిని మాటల్లో పెడతాడు. డబ్బు సంపాదించి చదువుకోవాలనుకుంటున్న నాగేష్ కలలు సాకారమవుతాయా అని సిద్ధాంతిని ప్రశ్నిస్తాడు. కలెక్టరు అవుతాడని చాలా ఆయుష్షు ఉందన్న సిద్ధాంతి మాటలు గోపాలానికి నమ్మశక్యం కాదు. గోపాలం భయపడుతున్నట్లుగానే ఆ పిల్లాడు మంటలతో నీళ్ళల్లోకాక జనం మీద పడటం జనం కకావికలవ్వటం గోపాలాన్ని కలచి వేస్తుంది. భారమైన గుండెలతో తిరుగు ముఖం పట్టిన గోపాలం గుడిలోకి అడుగుపెడితే, సిద్ధాంతి తన జ్యోతిష గ్రంథాన్ని మురుగుకాలవలోకి విసిరేయటంతో కథ ముగుస్తుంది. కథ అంతా ఒక ఉద్వేగం, ఒక మీమాంసలతో నిండి ఉంటుంది. ఈ కథ ప్రచురితమైన మరుచటి ఏడాదే నిజంగా ఆ ప్రదర్శన చేసిన మనిషి అదే విధంగా మరణించటం కాకతాళీయమే.
సీతాదేవి మూఢనమ్మకాల మీదా, గ్రహబలాన్ని విశ్వసించటం మీదా, దెయ్యాలూ, భూతాలూ, తాంత్రిక శక్తుల మీదా, అస్తిత్వం మీదా అనేక విధాలుగా తన నిరసనను తెలియజేస్తూ హేతువాద దృక్పథంతో వామపక్ష భావాలతో రాసిన కథలు అనేకం ఉన్నాయి.
అదేవిధంగా ‘నీతోనే ఉంటా’ కథని ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకొని దయ్యమై తనపై ఉన్నాడని నమ్మి భ్రమలో ఉన్న కల్పనను సైకియాట్రిస్టు మంత్రగాడిలా వచ్చి ట్రీట్ మెంట్ చేయటం మూఢనమ్మకాల్ని వ్యతిరేకిస్తూ రాసిన కథే. తనని కాపరానికి రానివ్వని గయ్యాళి అత్తని దారిలో పెట్టేందుకు పోలేరమ్మ పూనినట్లుగా నాటకం వేసి తన కాపరాన్ని చక్కదిద్దుకున్న గంగాభవాని తనకు ఆ యుక్తి వచ్చేలా చేసిన ఆ వూరి గణాచారికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. తనకి దేవత పూనటం నాటకమేనన్న విషయం బైటపడినందుకు గణాచారి కూడా తేలు కుట్టిన దొంగలా గమ్మున ఉండడం కొసమెరుపు. సీతాదేవి మొదటిరోజుల్లో రాసిన కథలోనే భర్త మరణించిన స్త్రీని చీకటి ఉదయాన చెరువుకు తీసుకువెళ్ళి సుమంగళి చిహ్నాలుగా చెప్పబడే బొట్టు, గాజులు, పూలు తీసివేసి వితంతువుగా చేయడాన్ని ఖండిస్తూ రాసారు. ఇది హేయమైన చర్యగా ఒక పాత్ర ద్వారా చెప్పించటం రచయిత్రి దృక్పథాన్ని వెల్లడిస్తుంది.
మధ్య తరగతి మందభాగ్యుల దినచర్య ‘నేలవిడిచిన పాము’. ఇందులో కొన్ని వర్ణనలు అరవైల నాటి సగటు జీవుల బతుకు చిత్రాలు కళ్ళముందు కదుల్తాయి.
‘‘కుళాయి చుట్టూ పాతిక ముప్ఫై ఖాళీ బిందెలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. మానవ విలువల్ని వెక్కిరిస్తున్నట్లు నీళ్ళ ధార నల్లగా బీదవాని శరీరం మీద గుడ్డపీలికలా కారుతుంది. చుట్టూ ఖాళీ బిందెలు ఆకాశం కేసి నోళ్ళు తెరుచుకొని చూస్తున్నాయి’’ వంటి వాక్యాలు స్వల్పమైన మానవ జీవితావసరాలు కూడా మానవుల్ని మానవత్వం నుండి తోసేస్తాయేమో అనిపించే కథలు.
‘‘రేషను షాపు దగ్గర క్యూ లో నుంచున్న వ్యక్తికి తన వెనక పెరుగుతోన్న క్యూ ధనవంతుడి బొజ్జలా ఉందనుకుంటాడు. ఇటువంటి ప్రాసంగికత గల వాక్యాల్తో ఆనాటి బడుగు చిరుద్యోగుల జీవితాలని మనముందుపరుస్తుంది రచయిత్రి.
‘కొండవెనుక కనిపిస్తున్న తూర్పు ఆకాశం అరుణరేఖలు పులుముకొని పులి చంపిన లేడి నెత్తుర్ని ఆత్రంగా తాగిన తోడేలు మూతిలా ఉంది’తో మొదలైన కథాంశాన్ని మనం ఊహించుకోవచ్చు.
వనిత మాసపత్రికలో ‘వాస్తవగాథలు’ శీర్షికన ఆనాటి సమాజంలో జరిగిన సంఘటనల ఆధారంగా కొన్నాళ్ళు కథలు రాసింది సీతాదేవి.
సాహిత్యంలో ప్రధానంగా సృజనాత్మక రచనలు చేసే క్రమంలో రచయితలతో రచయిత్రులు పోటీపడడమే కాకుండా రచనాపరంగా వివక్షకి గురికాకూడదనే దృష్టితో చారిత్రక, సామాజిక, రాజకీయ సమస్యల్ని కథాంశాలుగా స్వీకరిస్తూ సాటిలేని వారిగా తమని తాము నిలబెట్టుకుంటూ సాహితీప్రపంచంలో తనకంటూ ఒక ముద్రని సాధించిన రచయిత్రులలో మొట్టమొదట చెప్పదగినవారు వాసిరెడ్డి సీతాదేవి. 1952లో ‘సాంబయ్య పెళ్ళి’తో కథాప్రపంచంలోకి అడుగుపెట్టి, విభిన్న కథాంశాల్ని స్వీకరించటమేకాక తనదైన శైలిలో కొత్త పుంతలు తొక్కే విధంగా వందకి పైగా కథల్ని సీతాదేవి రాసింది. ఈమెను సాహితీవిమర్శకులు నవలా రచయిత్రిగానే గుర్తించటం ఆశ్చర్యకరమే. ఇన్ని కథల్లో ఏ ఒక్కటి విమర్శకుల దృష్టికి రాకపోవటం మరింత ఆశ్చర్యం.