5, సెప్టెంబర్ 2025, శుక్రవారం
నడక దారిలో -54
నడక దారిలో -54.
నా సమగ్ర కవిత్వం పుస్తకావిష్కరణ జరిగిన తర్వాత వీర్రాజుగారి సప్తతి సందర్భంగా దగ్గరి బంధువులతో,ఓ అయిదారుగురు ఆత్మీయ మిత్రులతో హొటల్లో చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసాము పల్లవీ ,నేనూ.
రోజు రోజుకూ తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది.ఉద్యమ భావావేశం వలన చాలా మంది ఆత్మీయులైన సాహితీ మిత్రులు దూరం అయిపోయారు.తరుచూ కలవటానికి వచ్చేవారు కూడా రావటం మానేసారు.అది వీర్రాజుగారికి తీవ్ర మనస్తాపం కలిగించింది.
"ఎప్పుడో 1961 లో కడుపు చేతపట్టుకొని మనరాజధాని కదా అని వచ్చి శక్తిసామర్థ్యాలు,వయస్సూ అంతా ఈ గడ్డమీదే కరిగించుకున్నాము.నన్ను కన్నవారినీ,మనం కన్న పిల్లాడిని ఈ మట్టిలోనే కలిపాము.ఇప్పుడు ఇక్కడ పరాయి వాళ్ళమైపోయామా" అని తరచూ బాధ పడేవారు.
అదీగాక 2010 సంవత్సరానికి వచ్చేసరికి ముఖచిత్రాలు చిత్రకారులు తో వేయించే పద్ధతి తగ్గిపోయి ఫొటోలు,డిజిటల్ చిత్రాల వైపు సాహితీవేత్తలు ఆకర్షితులు కావటంతో ముఖచిత్రం కోసం వచ్చేవారూ తగ్గిపోయారు.ఇకపై ముఖచిత్రాలు చేయించుకునేవారు లేరు కనుక వీర్రాజుగారికి తైలవర్ణచిత్రాలు వేయాలనే ఆలోచన వచ్చింది.స్వంతంగా కట్టెఫ్రేములు చేయించి కేన్వాసుబట్ట కొని వాటికి బిగించి తయారు చేసుకుని ఒక చిత్రయజ్ఞాన్ని మొదలు పెట్టారు.
ఉదయం ఎనిమిదికే తయారై టిఫిన్ పూర్తి చేసి ఒక పొట్టి స్టూల్ మీద తాను కూర్చొని ముందు ఇంకో కుర్చీ మీద కాన్వాస్ ఫ్రేమ్ అమర్చుకొని చిత్రం వేయటం మొదలుపెట్టేవారు .తైలవర్ణాలు ఆరటానికి సమయం పడుతుంది కనుక ఒకేసారి రెండుమూడు కేన్వాసులపై చిత్రాలు తయారుగా వుంచుకునేవారు.
చుట్టూ రంగులు పరుచుకొని వర్ణచిత్రాలు వేస్తున్నప్పుడు రంగుల సరస్సులో ఇహాపరాలు మరచి ఈదులాడుతున్న అమాయకపు పసిబాలుడిలా కన్పించేవారు.భోజనసమయానికి పిలువగా పిలువగా కలుపుకున్న రంగు ఎండిపోతుంది అని పూర్తి అయ్యాక గానీ లేచేవారు కాదు.భోజనానంతరం ఒక్క అరగంట ఆగి మళ్ళా కాన్వాస్ ముందు కూర్చునేవారు.ఒక్కోసారి తాగటానికి ఇచ్చిన మంచినీళ్ళగ్లాసులోనో,కాఫీకప్పులోనో చిత్ర ధ్యానంలో పొరపాటున కుంచెను ముంచేసే వారు.
కంటిన్యూగా పది పన్నెండు గంటలు లేవకుండా పొట్టి కుర్చీ మీద కూర్చొని కూర్చొని ఆయనకు మోకాళ్ళ నొప్పులు ప్రారంభమయ్యాయి.ఒక్కొక్కప్పుడు ఉదయపు నడక చేస్తున్నా ఇబ్బంది పడేవారు.అలా కంటిన్యూగా చేయకుండా ఒక పూట మాత్రం పెయింటింగ్స్ వేసి మధ్యాహ్నం వేరే పని చేయమని కోపగించేదాన్ని.కానీ చిత్రం పూర్తి చేసేవరకూ ఆయనకి మనసు ఆగేదికాదు. రాజకీయ రంగు పులుముకున్న సాహిత్య మీటింగులకు మాకు ఆహ్వానాలు లేకపోవటంతో సభలకు వెళ్ళటం తగ్గిపోయింది.
మా ఇంటిప్రక్క మసీదు పెద్దగా కట్టేయటమే కాకుండా ఆ చుట్టూ చిన్న చిన్న ఇళ్ళన్నీ మూడు,నాలుగు అంతస్తులుగా పెరిగిపోయాయి.ఆ పై అంతస్తుల్లో ఎక్కువగా నైజీరియన్లు చేరారు.రోజు తెల్లవారుజామున ముఫ్ఫై నలభై మంది టీవీ టవర్ ఆస్మాన్ ఘడ్ నుండి మసీదు వైపు వస్తూ కనబడుతుండేవారు.దాంతో మా బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్ళాలంటే ఇబ్బందికరం అయిపోయింది.రాత్రిపూట అర్థరాత్రి దాటే దాకా మా బిల్డింగ్ ముందు గట్ల మీద కూర్చొని రణగొణధ్వనిగా మాట్లాడుకొంటూ వుండేవారు.రాత్రి పెట్రోలింగ్ చేసే పోలీసులు కోప్పడి ఇళ్ళకి పంపేవారు.రోడ్డువైపుకే మా బెడ్రూం వుండటంతో ఈ గొడవలకి నిద్రపట్టేదికాదు.
నగరంలో ఏ మతఘర్షణ జరిగినా,మాదకద్రవ్యాల కేసులకైనా మూలాలు మా ఏరియా లోనే వుండేవి.అందుకే కాబోలు మా పైన వుండే సింథీవాళ్ళు అపార్ట్మెంట్స్ అమ్ముకొని వెళ్ళిపోయారు.
పల్లవి గచ్చిబౌలి నుండి బస్సులు పట్టుకొని రెండుగంటలు ప్రయాణం చేసి వచ్చేసరికి ఒక్కొక్కసారి తొమ్మిది దాటేది.ఆ ప్రాంతంలో తిరిగే ఆవారాలు అరుగుల మీద కూర్చొని " ఈ ఆంధ్రావాళ్ళు,ఈ ఆడోళ్ళు వచ్చి మన వుద్యోగాలు మనకి కాకుండా చేసారు" అంటూ రాజకీయనాయకుల్లా ఏదో ఒకటి వాగుతూ వుండేవారు. ' నేను ఇక్కడే పుట్టి పెరిగి చదువుకుని వుద్యోగం చేసుకుంటుంటే ఇలా అంటారేమిటని' అసలే అలసి పోయి వచ్చిన పల్లవి చిరాకు పడిపోయేది.
ఇంకా రానురానూ విసుగెత్తి పోయి వేరేచోట ఇల్లు కొనుక్కుని ఈ ప్రాంతం నుంచి వెళ్ళి పోదామని నిర్ణయానికి వచ్చింది.ఆషీ కూడా పెద్దదవుతోంది కనుక మూడు బెడ్ రూముల ఇల్లు చూడాలని నిశ్చయించుకున్నాం.
మొదట్లో ఇండిపెండెంట్ ఇళ్ళకోసమే చూసాం.తన స్నేహితులూ, బంధువులూ దగ్గర్లో వున్నారు కనుక మలక్ పేట,వనస్థలిపురం మధ్య లోనే చూస్తే బాగుంటుందని వీర్రాజుగారు
అభిప్రాయపడ్డారు.కానీ మా ఆర్థిక లిమిటేషన్ కి మించి ధరలు వున్నాయి.పల్లవికి ఆఫీసుకి దగ్గరగా వుండేలా ఇల్లు తీసుకుంటే రానూపోనూ నాలుగు గంటల శ్రమ తగ్గుతుందనే ఆలోచన వున్నా వీర్రాజు గారు ఇటువైపే చూద్దాం అనటంతో తండ్రి మాటల్ని తోసిపుచ్చలేక పోయింది.
డిసెంబరు 9వ తేదీన కేంద్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా హోం శాఖ మంత్రి చిదంబరం స్వయంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన తర్వాత తెలంగాణా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి.
ఆ మర్నాడు తెల్లారిన తరువాత ఆంధ్రలో సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామాలు, ఆందోళనలు మొదలయ్యాయి.అన్ని ముఖ్యమైన కేంద్రరాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు,ముఖ్యమైన విద్యాసంస్థలు, ఐటీ కారిడార్ మొదలైన వన్నీ హైదరాబాద్ లోనే ఉండటం ,ఆంధ్రాకు చెందిన అనేక
మంది తమ పెట్టుబడులను ఇక్కడే పెట్టడం,ఇక్కడే ఇల్లూ వాకిలి పిల్లల చదువులతో స్థిర పడిన వారంతా ఏమీ తోచని స్థితికి వచ్చారు. వీటి వలన హైదరాబాద్ తో సహా తెలంగాణా విడిపోతే మంచి విద్యా సంస్థలుగానీ ప్రభుత్వ రంగ సంస్థలు గాని లేని మిగిలిన ఆంధ్రప్రదేశ్ మనుగడ భయంకరంగా కనిపించింది.
హైదరాబాద్ లో ఆఫీసుల్లో పనిచేసే వుద్యోగులలో చీలిక వచ్చేసింది.
ఆ ఆందోళనల ప్రభావంతో డిసెంబరు 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు చిదంబరం.దాంతో మళ్ళా తెలంగాణ భగ్గుమంది. ప్రాంతీయ వివక్షలు అన్ని రంగాలలో మొదలయ్యాయి. సాహిత్య రంగంలో మరింత స్పష్టంగా కనిపించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా అనేక ధూం ధాం లు నార్వహించటం అందులో భాగంగా కవితా గానాలు ఎక్కడికక్కడ జరిగాయి.
ఎప్పుడో వచ్చి ఇక్కడే స్థిర పడిన మాలాంటి
వాళ్ళం ప్రత్యేక తెలంగాణా వుద్యమానికి సానుకూలంగా వున్నా కూడా శత్రువులుగా పరిగణించడంతో ఆత్మీయులైన సాహితీ మిత్రులకు మాకు మధ్య కనిపించని గోడ వున్నట్లుగా దుఃఖం కలిగేది.మనసువిప్పి ఎవరితో కూడా బాధని పంచుకునే పరిస్థితి మృగ్యం అయిపోయింది.ఈ ప్రభావం నాకన్నా వీర్రాజుగారి మీద ఎక్కువగా వున్నట్లుగా వుంది.సభలూ సమావేశాలకు కూడా ఎప్పుడో తప్ప వెళ్ళటం తగ్గి పోయింది.అదీకాక అన్ని సమావేశం మందిరాల్లోనూ ఉద్యమం సమావేశాలూ,కవితాగానాలూ ఎక్కువగా జరుగుతుండేవి.థూమ్ థామ్ లోనూ,జాగృతి బతుకమ్మ సంబురాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి.
మా కింద అపార్ట్మెంట్ లో యజ్ణప్రభగారు సంగీతం టీచర్.పల్లవికి ఆమే సంగీతం నేర్పించి,ఢిల్లీ గంధర్వమహావిద్యాలయం సర్టిఫికెట్ పరీక్ష కూడా రాయించారు.ఆతర్వాత పల్లవి రేడియోలో బిగ్రేడ్ సెలెక్షన్ పాసై లలిత సంగీతం పాడేది.ఇదంతా పల్లవి పెళ్ళి కాకముందటి విషయం.పల్లవి వివాహా ఏర్పాట్లకు కూడా అప్పుడుచాలా అండదండగా వున్నారు.బ్రహ్మలే అయినా పల్లవిని దత్త పుత్రిక లా ప్రేమించేవారు.పల్లవికి జరిగిన దుర్ఘటన నాకు ఆమె చాలా కలత పడ్డారు.ఒక జ్యోతిష్కుడి దగ్గర మళ్ళీ పెళ్ళి గురించి కూడా కనుక్కుని చాలా ఉత్సాహంగా నాకు చెప్పారు.నాకు వాటిమీద నమ్మకం లేక పోయినా పిల్ల జీవితం చక్కబడి ఒక తీరం చేరుతుందనే మాట సంతోషమే కలిగించింది.అంతగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి యజ్ణప్రభగారు.ఆమె పెద్దన్న రాజమండ్రిలో శ్రీపాద పట్టాభి నాటకరంగంలో వుండేవారు.తమ్మీడు జిత్ మోహన్ మిత్ర నటుడు.ఆ విధంగా ఆమె కుటుంబం సాంస్కృతిక వారసత్వం కలిగిన వాళ్ళు.
అయితే ఆమెకు రానురాను అనారోగ్యపు ఛాయలు పెరిగాయి.మొదట్లో చెప్పటం మర్చిపోతానేమో అన్నట్లు గబగబా మాట్లాడే ఆమె తదనంతరం డిమెన్షియా బారిన పడ్డారు.అది అర్థం కాక వాళ్ళాయన చెడ తిట్టటం,అరవటం,కొట్టటం చేసేవాడు.కిందనుండి వచ్చే ఆ కేకలూ,తిట్లూ,గోల చికాకే కాక ఆమె భర్త మీద కోపం వచ్చేది.గృహహింస కింద అతనిమీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనిపించేది.ఇస్తే అతన్ని అరెష్టు చేస్తారుసరే.కొడుకులిద్దరూ విదేశాల్లో వున్నారు.అటువంటప్పుడు ఆమె గతి ఏమిటి అనిపించింది.ఏ సమస్యకైనా రెండువైపులా ఆలోచించాలని అంటారందుకే.
ఈమె సంగతి ఇలా అయితే మా కుటుంబ మిత్రులు, వీర్రాజు గారి ఆప్తమిత్రుడు రచయిత అయిన వ్యక్తి ఇదే విధంగా డిమెన్షియా రావటానికి తొలి స్టేజిలో వున్నాడు.ఆయన్ని చూసుకోలేక భార్యా పిల్లలు మా ఇంటికి దగ్గరలోనే వృద్ధాశ్రమంలో చేర్చారు.ఆయన తన భార్యాపిల్లలు వృద్ధికి ఎంతగా శ్రమ పడేవారో తొలి నుంచీ కళ్ళారా చూసిన వాళ్ళం.ఆయన తన మనవరాలిని చూసేందుకు చుట్టూ వెతుక్కునే వారు.ఆయన తపన చూస్తే మనసు ద్రవించి పోయేది.అటువంటి భార్యా పిల్లలూ ఎప్పుడో వారానికో,రెండు వారాల్లో వచ్చి చూసేవారు.
కానీ వీర్రాజు గారు రోజు విడిచి రోజు పెయింటింగ్స్ వేయటం పని ఆపేసి స్నేహితునికి ఇష్టమైన వంటకం చేయించి తీసుకుని వెళ్ళేవారు.ఒక్కొక్కప్పుడు నేను కూడా వెళ్ళే దాన్ని.
ఆశ్చర్యం ఏమిటంటే చివరి రోజుల వరకూ ఆయన వీర్రాజు గారిని గుర్తుపట్టేవారు.
ఇంతకీ అతనెవరంటే కె.కె.మీనన్ పేరు గల కథకుడు.తొంభైలలోనే సరోగసీమీద నవల రాసిన వైజ్ఞానిక రచయిత.ముఖ్యంగా ఏజీ ఆఫీస్ లో రంజని పేరుతో సాహిత్య సంస్థకు అధ్యక్షుడుగా వున్న కాలంలో అనేకమంది ప్రముఖ రచయితలను ఆహ్వానించి మంచి కార్యక్రమాలను నిర్వహించి రంజనికి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి.కానీ ఆయన చివరిదశలో పలకరించి సాంత్వన పలికిన వారూ లేరు.తర్వాత కూడా ఆయన విస్తృత రచయితగా మిగిలిపోవడం కన్నా విషాదం ఏముంది?
ఈ ఇద్దరూ వారికే తెలియని జీవితాన్ని పసివారిలా జీవించిన రోజులూ మర్చిపోలేను.వారు భౌతికంగా లేకుండా వెళ్ళిపోయిన నాటి విషాదపు రోజులనూ మరచిపోలేక తలచుకున్నప్పుడల్లా సలుపు పెడుతూనే వుండటంతో ఆ తర్వాత " నిజానికీ అబద్ధానికీ మధ్య" అనే కథ రాసాను.
వృద్ధాప్యం ఒకశాపమా? లేకుంటే డిమెన్షియా వలన శాపమౌతోందా అనే ఆలోచన వెంటాడింది.
నన్నే కాదు వీర్రాజుగారి మనసునీ అతలాకుతలం చేసింది.
- శ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి