9, సెప్టెంబర్ 2025, మంగళవారం
స్నేహపు రంగు విషం
~ స్నేహపు రంగు విషం ~
ఇరవై ఏళ్ల క్రితం
ఒక స్నేహకలయికలో
స్నేహపు పూతతో ఓ పలకరింపు
పలకరింపు కాదది
మానని గాయానికి సలుపరింపు
కళ్ళలో సుళ్ళుతిరిగిన సుడిగుండాలు
పదేళ్ళక్రితం
ఒక వివాహ మంటపంలో
పెళ్ళి సందడి పెదాల నవ్వైనపుడు
స్నేహపునవ్వుతో ఓ పలకరింపు
పలకరింపు కాదది
మానిన పుండుపై కారపు జల్లు
ఐదేళ్ళ క్రితం బజారులో
కబుర్ల పతంగాల్ని ఎగరేస్తున్నప్పుడు
గాలివాటున ఓ పలకరింపు
పలకరింపు కాదది
పుటుక్కున మాంజాని తెంపి
మెడకి చుట్టిన విషపు నవ్వు.
నిన్నగాక మొన్న రాత్రి
కలల్లోనైనా రెప్ప వాల్చబోతే
కాల్ చేసి మరీ
కునుకుతున్న కలల్ని
నిలువునా కాల్చేసింది
ఆమె ఎవరైతేనేం గానీ
స్నేహాపుపూత పూసిన కరుకుముల్లుతో
నా గుండెల్లో మానుతోన్న గాయాన్ని కెలికితే
ఆ కళ్ళల్లో ఎంతమెరుపో
ఆమె ఎవరైతేనేం
మనచుట్టూ అటువంటి ఎంతమందో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి