20, సెప్టెంబర్ 2025, శనివారం

అంత తొందర ఎందుకు రజితా

~ అంత తొందర ఎందుకు రజితా??? ~ ఒక రోజు స్కూల్ నుండి వచ్చి ఇంట్లో అడుగు పెట్టేసరికి " హల్లో" అంటూ హాల్లో కూర్చొని వున్న కుటుంబ స్నేహితురాలు డా.భార్గవీరావు పలకరించారు. నేను పలకరింపుగా నవ్వి ఫ్రెష్ అప్ అయి వస్తానని లోపలికి వెళ్ళి అయిదు నిముషాలలో వచ్చి మాట్లాడటానికి కుర్చీలో కూర్చుంటూ భార్గవి రావు పక్కనే సోఫాలో కూర్చున్న అమ్మాయి వైపు ప్రశ్నార్థకంగా చూసాను. చుడీదార్ వేసుకుని చున్నీని మెడ నుండి కండువాలా ముందుకే వేసుకొని బాయ్ కట్ క్రాప్ తో చిన్నగా మా స్కూల్ లో పదోతరగతి అమ్మాయిలా వుంది. భార్గవి ఆమెని పరిచయం చేసింది."అనిశెట్టి వరంగల్ లో వుంటుంది.కవితాసంపుటికి ముఖచిత్రం వీర్రాజు గారితో వేయించుకోవాలని అనుకుంటుంటే నాకు తెలుసు అని రజితను మీ ఇంటికి తీసుకొని వచ్చాను" అంది. అనిశెట్టి రజిత పేరు పత్రికల్లో అప్పుడప్పుడు చూసినదే.1994 లో "నేనొక నల్లమబ్బునౌతా" మొదటి కవితాసంపుటి కి ముఖచిత్రం కోసం వచ్చి నాకు అలా పరిచయం అయ్యింది. ఆ పుస్తకానికి వేసిన ముఖచిత్రం బాగా వచ్చిందని వీర్రాజుగారు ఆతర్వాత దానినే తైలవర్ణ చిత్రంగా 3×4అడుగుల సైజులో వేసారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో సదస్సుకు హాజరైనప్పుడూ, హైదరాబాద్ లో కొన్ని సభల్లోనూ రజిత ఆ తర్వాత ఎప్పుడు కలిసినా చాలా ఆత్మీయంగా మాట్లాడేది. చిన్నగా ముఖమంతా నవ్వుతో పలకరించే ఈ అమ్మాయి 1969 నుండే వుద్యమస్ఫూర్తి కలిగి వుందని తెలిసి మొదట్లో ఆశ్చర్యపోయాను.ఆత్మీయంగా మెత్తగా మాట్లాడే రజిత అవసరసమయంలో ఎంత దృఢచిత్తంతో వ్యవహరిస్తుందో కాలక్రమేణా తెలుసుకున్నాను.నిజాయితీ,నిబద్ధత కలిగిన రజిత జీవితం, సాహిత్యం,ఉద్యమం ఏవీ వేర్వేరు కాదని అన్నీ తన వూపిరిగానే బతికిన ధీరగానే గుర్తించాను. నేను నా ముందుతరం రచయిత్రుల కథలు గురించి రాసిన వ్యాససంపుటి చూసి దాని గురించి ఆ తరం రచయిత్రుల గురించి ఫోన్ లో చాలా సేపు మాట్లాడటమే కాక తానే అరడజను పుస్తకాలు కొనటం ఆశ్చర్యం కలిగించింది. కుందుర్తి శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారానికి రజితను ఎంపిక చేసినట్లు వీర్రాజుగారు ఫోన్ చేసి చెప్తే చిన్నపిల్లలా సంబరపడింది.ఆ సమయంలో కరోనా కారణాన సమావేశం వాయిదా పడటంతో ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం ఏర్పాటు చేసి కవులను అందులో చేర్చాము.ప్రతిభాపురస్కారానికి ఎంపిక చేసిన ఆరుగురు కవులనూ పరిచయం చేస్తూ నేను సమూహంలో రాసేదాన్ని. అదే విధంగా రజితను గూర్చి కూడా రాసింది చదివి "క్లుప్తంగానే కాక సమగ్రత కూడా వుండేలా నా గురించి ఎంతబాగా రాసారు " అంటూ మురిసిపోయి ఫోన్ చేసిన అల్పసంతోషి రజిత.అంతేకాక నేను రాసిన పరిచయాన్ని అన్ని వాట్సాప్ సమూహాలలో నూ ఎంతో సంతోషంగా షేర్ చేసుకున్న పసిమనసు రజితది. వీర్రాజుగారి మరణానంతరం పలుమార్లు ఫోన్ చేసి సాంత్వనగా మాట్లాడిన స్నేహిత ఆమె. తర్వాత మాయింటికి వచ్చి ఒక సోదరిగా నాకు చీర యిచ్చి " ధైర్యంగా నిలదొక్కుకుని సాహిత్యంలో గడుపుతున్నందుకు ఆత్మీయంగా అభినందించిన ఆత్మీయ బంధువు రజిత. తర్వాత రజిత వీర్రాజుగారి గురించి వ్యాసం రాయటమే కాక వీర్రాజు గారి ప్రథమ వర్థంతి సమావేశానికి స్వయంగా వరంగల్ నుండి శ్రమతీసుకుని వచ్చి నాకు అండగా నిలబడటంతో స్నేహితులు కన్నా ఆత్మీయ బంధువులు ఇటువంటి వారుకాక ఇంకెవరు అనిపించింది. ఆ తర్వాత ప్రరవే సమావేశాల్లో తప్ప తరుచూ కలవకపోయినా మానసికంగా మరింత దగ్గిరైంది.సమాజంలో వితంతువుల స్థితిగతులమీద పుస్తకం వేస్తున్నానని ఫోన్ చేసి నా రచనలను అడిగి తీసుకుంది.ఆ విషయాలమీద ఫోన్లు చేసి చాలాసేపు మాట్లాడేది.అంతేకాకుండా మా అమ్మాయి పల్లవిని ఆ పుస్తకానికి ముఖచిత్రం వేయమని అడిగింది.పల్లవి చాలా చిత్రాలను డిజైన్ చేసి ఇస్తే వాటినన్నింటినీ పుస్తకంలో అక్కడక్కడా వేసి పల్లవిని ప్రోత్సహించింది. ఆగష్టు 10 న వరంగల్ లో సింగరాజు రమాదేవి " ఔను..నాకు నచ్చలేదు" కథలసంపుటి ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించింది. అప్పుడు రజిత నాకు ఫోను చేసి వరంగల్లో కలుద్దాం అంటూ మాట్లాడింది.రజిత ఎప్పుడు ఫోన్ చేసినా చాలాసేపు సాహిత్యం గురించి,తాను చేయదలచిన ప్రాజెక్టుల గురించి,తన ఆరోగ్యం గురించి చాలా సేపు కబుర్లు చెబుతుంది.నేను కూడా అలాగే మాట్లాడతాను. నేను మా అమ్మాయి,మనవరాలితో కలిసి వరంగల్ వెళ్ళాను.సభని ఆద్యంతం ఆసక్తికరంగా ఆహ్లాదభరితంగా ఛలోక్తులతో రజిత అధ్యక్షత బాధ్యతను నిర్వహించింది.అంతేకాదు సభ మధ్యలో తన సంపాదకత్వంలో వితంతువ్యవస్థపై తెచ్చిన పుస్తకాన్ని చూపించి పల్లవిని కూడా సభకు పరిచయం చేయటం మా కుటుంబం పట్ల రజితకు గల గాఢ అనురక్తికి తార్కాణం. సభానంతరం కలిసి భోజనం చేస్తూ కూడా కబుర్లు కొనసాగాయి.అప్పటికే అలసిపోవడం వలన కొంత అనారోగ్యం రజితను వెనక్కి లాగుతోన్నా నవ్వుతూ ఫొటోలు తీయించుకుంటూ సందడి చేస్తూనే వుంది.తాను హైదరాబాద్ వచ్చినపుడు కలుద్దాం అని అంది. మధ్యాహ్నానికి మళ్ళా వర్షసూచనలు మొదలయ్యే సరికి మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం.వర్షాలు తగ్గాక మళ్ళీ వస్తే వరంగల్ చుట్టుపట్ల అన్నీ చూడటానికి కలిసి వెళ్దాం అని మాతో చెప్పిన రజిత మాకు వరంగల్ అంతా చూపించకుండానే తొందరపడి హడావుడిగా ఆత్మీయులను అందరినీ వదిలి అనంత దూరాలకు వెళ్ళిపోయింది. వరంగల్ ముచ్చట్లు చెప్పుకోకుండానే ఉరమని పిడుగులా వార్త .వారం రోజుల వరకూ మామూలు కాలేక పోయాను.ఒక విధమైన వైరాగ్యం నన్ను ఆవహించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి