28, ఏప్రిల్ 2023, శుక్రవారం
నడక దారిలో --29
నడక దారిలో --29
వీర్రాజు గారు ఉద్యోగానికి సెలవు పెట్టి వికాస్ అనే అడ్వర్టైజ్ ఆఫీసు పెట్టినా పెద్దగా సంపాదించినది ఏమీలేదు.ఆర్ట్ వర్క్ అంతా వీర్రాజుగారూ ,బైట తిరిగి వర్క్ సంపాదించడమే కాక ఆర్థిక వ్యవహారాలు స్నేహితుడు రావు చూసుకుంటున్నారు.వర్క్ బాగానే వస్తోంది.వీర్రాజు గారికి డబ్బు అడగటం మొగమాటం కనుక స్నేహితుడు వెళ్ళి కలెక్ట్ చేస్తాడు.'ఢిల్లీనుండి వచ్చేసాం ఇక్కడా ఇబ్బందులు తప్పలేదు' అన్నట్లుగా స్నేహితుని కుటుంబం వాపోతుంటారు. వీర్రాజు గారికి అతన్ని పిలిపించి ఈ ఏజెన్సీ పెట్టటం పొరపాటు చేశానేమోననే అంతర్మధనం మొదలయ్యింది.అంతేగాక డబ్బు గోల్మాల్ అవుతున్నట్లు కొందరు మా ఆత్మీయులైన వారు చెప్పటం, ఆధారాలూ కనిపిస్తుండేసరికి స్నేహితుడిని ఖచ్చితంగా అడగలేక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఒక వైపు ఆఫీసువాళ్ళు సెలవు పెట్టి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం పై మెమోలు పంపసాగారు.అయిదేళ్ళ సెలవు కాలం పూర్తి చేయాలని,లేదా వాలంటరీ పెట్టేయాలనే ఆలోచనలో సతమతం అయ్యారు.
ఎప్పటిలాగే పురిటి సమయానికి అమ్మ వచ్చింది.నాకు నెలలు నిండి మంచి రంగుతో,దట్టమైన ఉంగరాలజుట్టుతో అందాలబాబు జన్మించాడు.పల్లవికూడా ఆడుకోడానికి తమ్ముడు తోడు దొరికాడని మురిసిపోయింది.
ఇంతవరకూ వీరి అన్నదమ్ములు అందరికీ ఆడపిల్లలు కావటంచేత కుటుంబానికి మొదటి మనవడు అని వీర్రాజు గారు ముచ్చట పడ్డారు.చైతన్య అని పేరు పెడదాం అన్నారు.
మా మామయ్యకు డిప్యూటీ డైరెక్టర్ గా బాపట్ల నుండి హైదరాబాద్ కి బదిలీ అయ్యింది.అక్కయ్యకి బాపట్లలో సాహిత్యం, సమావేశాల్లోనే పోలాప్రగడ దంపతులతో స్నేహం ఉండేది. పోలాప్రగడ గారికి మలకపేట బ్రహ్మానందకాలనీలో ఒక అపార్ట్మెంట్ ఉందని అది ప్రస్తుతం ఖాళీగా ఉందనీ,మీరు కావాలంటే అద్దెకు ఉండొచ్చని పోలాప్రగడ దంపతులు చెప్పటంతో సంతోషంగా అందులో అద్దెకి దిగటానికి అక్కయ్య వాళ్ళు నిర్ణయించుకున్నారు.
వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారంటేనే నాకు కొండంత ధైర్యం వచ్చింది..
వేసవి సెలవుల్లో చిన్నక్క పిల్లలిద్దరినీ తీసుకుని హైదరాబాద్ అక్కయ్య ఇంటికి వచ్చేది.వాళ్ళు వస్తే పల్లవికి సంబరం.అప్పుడప్పుడు రిక్షా మాట్లాడుకొని పల్లవిని ,బాబుని తీసుకొని వెళ్ళే దాన్ని.ఇద్దరు అక్కయ్యల పిల్లలతో పల్లవి ఆడుకునేది.
ఒక రోజు పిల్లల్ని తీసుకొని రేడియోలో పిల్లలు కార్యక్రమంలో పాటలు,పద్యాలూ పాడించే వాళ్ళం.
అక్కయ్యా ఇంట్లో నేను ఓ రెండు రోజులు ఉండి పల్లవిని ఓ వారం రోజులు అక్కడే వదిలి వచ్చేసేదాన్ని.
మా యింటికి కూడా చిన్నక్కనీ పిల్లల్ని రమ్మనేదాన్ని.కానీ ఆ పిల్లాడితో చేసుకోలేక పోతున్నావు.ఇక్కడ కలిసాము కదా అని అనేది.
హైదరాబాద్ దూరదర్శన్ సాయంత్రం పూట తెలుగు కార్యక్రమాలు మొదలు పెట్టింది.ఆ క్రమంలో ఆదివారాలు విజయావారి సినీమాలు వేస్తున్నారని తెలిసి పొరుగుఇంట్లో ఉండే లలిత తనతో పల్లవిని అప్పుడప్పుడు పక్క కాంపౌండ్ ఉండే ఎవరింట్లోనో టీవీ ఉంటే తీసుకు వెళ్ళేది.లలితా, ఆంజనేయులు గారు ఇద్దరూ పల్లవిని బాగా చేరదీసేవారు.పల్లవి కూడా లలితత్తా అంటూ ఆమెతో కబుర్లు చెప్పేది.
తర్వాత అక్కయ్యా వాళ్ళుకూడా టీవీ కొన్నారు.దాంతో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు దూరదర్శన్ కార్యక్రమాలు అబ్బురంగా చూసేవాళ్ళం.
అక్కయ్యా వాళ్ళింట్లో కూడా మామూలు గా పూజలు చేయకపోయినా వినాయక చవితికి పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని మామామయ్య పూజ చేయించి కథ చెప్పేవాడు.ఆయన అంటే పిల్లలందరికీ చాలా ప్రేమ.కథలు చెప్పటం,సినిమాలూ , షికార్లు తిప్పటం చేసేవాడు. బాబుకి ఆరునెలలు దాటాయి.బోర్లా పడుతున్నాడు,కొద్దిగా పారాడటానికి ప్రయత్నిస్తున్నాడు.ఒకరోజు సాయంత్రం అకస్మాత్తుగా గుక్క పట్టి ఏడుస్తూ ఏడుస్తూ క్రమక్రమంగా ఒళ్ళంతా నీలి రంగులోకి మారి స్మారకం లేనట్లుగా అయిపోయాడు.నాకు ఏంచేయాలో తోచక ఎత్తుకుని ఏడుస్తూ వాకిట్లోకి వచ్చాను.వాకిట్లో పిల్లలతో ఆడుకుంటున్న పల్లవి కూడా బిక్కమొహం తో దగ్గరకు వచ్చింది.కాంపౌండులోని నాలుగు కుటుంబాలవాళ్ళూ వచ్చి బాబుముఖంమీద నీళ్ళు చల్లి కుదుపుతూ ఉంటే మెల్లమెల్లగా నీలిరంగు నుండి మామూలు అయ్యాడు.పక్కనే ఇంట్లో ఉన్న తోటి కోడలు తన పిల్లల్ని ఇంట్లోకి లాగి తలుపు వేసిందని లలిత తర్వాత చెప్పింది.
ఎవరో దగ్గరలోనే ఉన్న వికాస్ ఆఫీసుకు పరిగెత్తి వీర్రాజుగారిని పిల్చుకు వచ్చారు.అప్పటికి తిరిగి బాబును ఇంట్లోకి తీసుకు వచ్చాను.వీర్రాజు గారు వచ్చి బాబునీ వొళ్ళోకి తీసుకుని కుదుపుతుంటే కళ్ళు తెరిచాడు.అప్పుడు తీరికగా మాతోటికోడలు వచ్చి పలకరించింది.
అప్పటికైతే బాబు నార్మల్ గా అయ్యాడు కానీ అది మొదలు కొని తరుచూ ఏడుపు మొదలెట్టాడంటే గుక్క పెట్టటం,ఒళ్ళు నీలి రంగులోకి మారటం స్పృహ తప్పినట్లుగా కళ్ళు తేలేయటం ఇంచుమించుగా ప్రాణం పోయిందేమో అన్నట్లుగా వేలాడిపోవటం జరుగుతూ ఉండేది.ఇంక మాకు ఇల్లు, హాస్పిటల్,లేదా ఇల్లూ క్లినిక్ లకు తిరగటం ప్రారంభమైంది.నెలలు గడుస్తున్నా బాబు మెడని బలంగా నిలబెట్టలేక పోయేవాడు.కూర్చోలేకపోతున్నాడు.చేతితో ఏదీ పట్టుకోలేక పోతున్నాడు. ఎవరు ఏ డాక్టర్ పేరు చెబితే అక్కడకు తీసుకు వెళ్ళేవాళ్ళం.
చిక్కడపల్లిలో రామయ్య అనే మంచి హోమియోడాక్టర్ ఉన్నాడంటే అక్కడకు వెళ్ళాం.బాలపరమేశ్వరరావు అనే ఆయన పిల్లలడాక్టర్ గా ఫేమస్ అంటే అక్కడకు వెళ్ళాం. ఏ పరీక్షలు చేయమని చెప్తే ఆ పరీక్షలు చేయిస్తున్నాం
మాది మేనరికం కనుక అందువల్ల బాబు అలా ఉన్నాడేమోనని ఎవరో అనటంతో జెనెటిక్ లాబ్ కి వెళ్ళి పరీక్షచేయించాం.ఆ లోపం ఏమీ లేదన్నారు. డాక్టర్ "జెనెటిక్ లోపం ఉంటే పెద్దపాపలో కూడా ఆ ఛాయలు ఉండాలి.కానీ పాప చురుకుగా ఉంది.మీరు గర్భంతో ఉన్నప్పుడు వేసుకున్న మందులు వలన వచ్చిన ఎఫెక్ట్ " అన్నారు.నాకు ఏమీ అర్థం కాలేదు.డాక్టర్ బలానికి రాసిన మందులు తప్ప ఇంకేమీ వేసుకున్న గుర్తు లేదు.
బాబు ఏడవకుండా సమయానికి ఆహారం పెట్టటం,రాత్రి పగలు కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి.నిద్రపోతున్నప్పుడే తొందరగా పని పూర్తిచేసుకుని బాబును చూసుకోవాల్సి వచ్చేది.
ఉమ్మడి కుటుంబం తో పడిన అవస్థలు తప్పాయి అనుకుంటే మళ్ళీ నేను అఖాతంలో పడిపోతున్నాను అనిపించింది.ఇప్పుడిప్పడే మళ్ళీ నా రచనలు,నా చిత్రాల్లో పడుతున్నాను అనుకుంటే మళ్ళీ మళ్ళీ......
ఈ నిస్సహాయ పరిస్థితులలో నన్ను నేను ఎలా నిలబెట్టుకోవాలి నాకు తెలియని అయోమయంలోచిక్కుకుపోయాను.బస్సులోనో,రైల్లోనో బయటకు వెళ్తే బాబు వైపు ఎదుటివాళ్ళ జాలిచూపుల్ని తట్టుకోలేక ఎక్కడికి వెళ్ళటం మానుకున్నాను.ఎప్పడైనా రిక్షా ఎక్కి అక్కయ్య దగ్గరకు మాత్రమే వెళ్ళేదాన్ని.
ఇంకా నాకు ఏమాత్రమైనా ఓదార్పునిచ్చేది పుస్తకాలే.ఏదో ఒక పుస్తకం పట్టుకుని బాబు పక్కనే ఉండేదాన్ని.కవిత ఏమైనా రాయాలనిపించితే రాసేదాన్ని.కానీ ఏ పత్రికలకీ పంపేదాన్ని కాదు.
చిరునవ్వు పెదాలకు తగిలించుకుంటే మనసులోని బాధని దించుకోవచ్చు అనేది తెలియనితనం.కళ్ళుఎప్పుడూ నిండుకుండల్లా ఉండేవి.ఏమూలో కాసింత కొనప్రాణం ఉన్న జీవచ్ఛవంలా ఉండేదాన్ని.
చిన్నప్పుడంతా ఆర్థిక అవకతవకలతో నాలుకని దాచుకొని ఒకరి పంచన బతకాల్సిన పరిస్థితులు దాటి ఎలాగో చదువుకుంటున్నదాన్ని చదువుకోక సాహిత్యంపై మోజుతో ప్రేమమోహంలో చిక్కుకుని గంపెడు కలల్ని మూటకట్టుకుని వచ్చాను.
"నువ్వు చదువుకున్నదానివి.రచయిత్రివి.సామాన్య ఆడదానివిలా అసూయా ద్వేషాలు పెంచుకోకూడదు" అంటే కామోసు అనుకుని ఉమ్మడి కుటుంబం లో నాలుకని దాచుకొని, ఒళ్ళు దాచుకోకుండా నా కుటుంబం అనుకుంటూ చాకిరీ చేసాను. వేరించి కాపురమేకదా ఇంక నా ఆశలు,కలలూ పండించు కోవచ్చు అని నిశ్చింతగా ఊపిరి తీసుకుంటే మళ్ళా ఈ ఉత్పాతం.ఈ జీవితం అంతా దుఃఖమేనా?
ఒక్కొక్కప్పుడు తోబుట్టువుల మీద ఆయనకిగల అలవిమాలిన ప్రేమ వలన నాకు కావలసిన సాంత్వన పొందలేక నాలోకి నేను ముడుచుకు పోయేదాన్ని.
ఏ అర్థరాత్రో దగ్గర చేరినప్పుడు " నిజంగా నన్ను ఇష్టపడే చేసుకున్నారా"అని సందేహం వెలిబుచ్చినప్పుడు "ఎందుకు ఆ సందేహం"అంటూ మరోప్రశ్నకి అవకాశం ఇవ్వనప్పుడు మౌనాన్నే ఆశ్రయించే దాన్ని.
తల్లి చనిపోయాక,ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే ఆడదిక్కులేని సంసారానికి చాకిరీ చేసే ఆడదిక్కు కోసమే వేసిన మోహపు వలలో చిక్కుకున్నానేమో అని ఎప్పుడైనా ఒక సందేహం తేలుకొండిలా మనసులో లేచేది.కానీ తపస్విలా రంగులప్రపంచంలోనో,అక్షరలోకంలోనో తనలోకంలో తాను ఉండి మధ్యలో అనురాగం తో దగ్గరకు వచ్చే ఆయన ముఖంచూసి నా మనసును మందలించేదాన్ని.
నడక దారిలో --28
నడక దారిలో -- 28
వీర్రాజు గారు,తన స్నేహితుడితో కలిసి మొదలుపెట్టిన వికాస్ అడ్వర్టైజింగ్ ఆఫీసు కోసం ఇంటికి దగ్గర్లోనే రూమ్ తీసుకున్నందున మధ్యాహ్నం ఇంటికే భోజనానికి వచ్చేసే వెసులుబాటు కలిగింది.ఆ పనితో బాటు ముఖచిత్రాలపనీ ఉండటం వలన తీరిక మాత్రం కరువయ్యింది.ఆఫీసుకు అయిదేళ్ళు సెలవు పెట్టినందువలన అంతకుముందులాగ నెల మొదటి రోజునే వచ్చే జీతం లేదు.ప్రైవేటుగా చేస్తున్న పని ద్వారా వచ్చిన సొమ్ములో ఆఫీస్ రూము అద్దే మొదలగు వాటిని మినహాయించగా మిగిలినది ఇద్దరు మిత్రులూ చెరిసగం తీసుకునేవారు.
వీర్రాజుగారికి చేసిన పనికి డబ్బు అడగటం మొగమాటం కనుక ఆర్ధిక విషయాలు మిత్రుడు చూసుకునేవారు.
మాకు పొదుపుగా బతకటం అలవాటు కనుక పెద్దగా మాకేమీ ఇబ్బంది అనిపించలేదు.
అప్పట్లోనే తన నిర్మల్ ఆర్ట్ ప్రకటన కోసం వచ్చిన నిర్మల్ ఆర్టిష్టుని వీర్రాజు గారు ఆఫీసురూములో అడ్వర్టైజ్ ఏజెన్సీ గా పెట్టటం వలన ఇంటీరియర్ అందం కోసం సజీవంగా ఉండే నెమలి బొమ్మని తయారు చేయమని దానికి తాను విడిగా డబ్బు ఇస్తానని కోరారు.అదేవిధంగా ఆ నిర్మల్ ఆర్టిష్టు నిజంగా ఏ అడవిలోంచో దారితప్పి వచ్చిందేమో అనిపించేలా అందమైననెమలిని తయారుచేసి ఇచ్చాడు.అది చూసి వీర్రాజు గారు ఎంతగానో మురిసిపోయి నాతో చెప్పారు." మనింట్లో కి కూడా మరోటి చేయించితే బాగుంటుంది.కానీ ఈ చిన్న అద్దె ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటాం" అని నిట్టూర్చారు.
ప్రభుత్వం నుండి వస్తున్న ఒత్తిడి వలన అయిదేళ్ళు సెలవు తర్వాత వికాస్ నుండి బయటకు వచ్చేసి ఆఫీసును మిత్రుడికి అప్పగించారు.ఆ సందర్భంలో నెమలిబొమ్మ ఆఫీసులో ఉండటం వలన అభివృద్ధి చెందలేదని అది తిరిగి అమ్మేస్తానని మిత్రుడు అనేసరికి ఆ నెమలిబొమ్మ ఎగిరొచ్చే మా యింటవాలి ఇప్పటికీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆకర్షిస్తూనే ఉంది.సెలవు పెట్టిన స్వంతంగా మొదలుపెట్టిన వికాస్ కంపెనీ వలన మాకేమీ లాభించలేదు.మనసును ఆహ్లాదపరిచే ఆ నెమలి బొమ్మ తప్ప.
ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆ నిర్మల్ ఆర్టిష్టుకి కళారంగంలో జాతీయ బహుమతి వచ్చిందని తెలిసి వీర్రాజు గారు తనకే వచ్చినంతగా సంతోషపడి పోయారు.ఆ నెమలిని చూసి దాని గురించి అడిగిన వారందరికీ ఆ నెమలిబొమ్మ తయారు చేసిన నిర్మల్ ఆర్టిష్టుకి జాతీయ బహుమతి వచ్చిందని గొప్పగా చెప్పేవారు.
అప్పట్లోనే దేశరాజకీయాలలో పెనుసంచలనం ఏర్పడింది.ముఖ్యంగా ఆధునిక భావాలు ఉన్న సాహితీవేత్తలలోనూ,విరసం పట్ల సానుభూతి ఉన్న కవులలోనూ ఎమర్జెన్సీ చాలా భావసంచలనం కలిగించింది.ఆ నేపధ్యంలోనే నగ్నముని గారు రాసిన కొయ్యగుర్రం సాహితీప్రపంచంలో కూడా చాలా సంచలనం కలిగించింది.
ఇందిరాగాంధీ చేసిన అతి పెద్ద తప్పిదం అయిన ఎమర్జెన్సీ వలన జనం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. ఆ ఏడాది జరిగిన ఆరవ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పొందటమే కాకుండా1977 ఎలక్షన్లలో జనతా పార్టీగా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది భారత స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వంగా మొరార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది.ఎమర్జెన్సీ తొలగింపులో సాహిత్యం తిరిగి ఊపిరి పోసుకుంది.
కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద విపత్తు సంభవించింది. 1977 లో దివిసీమ ఉప్పెన ఆంధ్ర ప్రదేశ్ లో సముద్రతీరంలో విధ్వంసాన్ని సృష్టించిన అతి భయంకరమైన తుఫాను. 1977, నవంబరు 19న ఈ తుఫాను సముద్రతీరాన్ని తాకటంతో ఏర్పడిన విషయంలో అధికారికంగా పద్నాలుగు వేలకు పైగా అని ప్రభుత్వం ప్రకటించినా అనధికారికంగా సుమారు యాభై వేలకు పైగానే ప్రాణాలు కోల్పోయిఉంటారు.
ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయిట. తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయని. గుర్తుపట్టలేని అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చిందని పేపర్లన్నీ రాసాయి.
రాష్ట్రమంతా ఒక దీన స్థితి లోకి వెళ్ళిపోయింది.అప్పుడు దృశ్యమీడియా లేకపోయినా రేడియోలో పదేపదే వచ్చే వార్తా విశేషాలు, వార్తాపత్రికల్లో వచ్చే ఛాయాచిత్రాలు, వార్తలు జనాల్లో కలవరం పెంచాయి.
బాపట్లలో ఒక చర్చిలో తలదాచుకున్న దాదాపు వందమంది ప్రజలు అది కూలడంతో మరణించారని పేపర్లో చదివి అక్కడే ఉన్న పెద్దక్క కుటుంబం గురించి కంగారుపడ్డాము.అప్పట్లో ఫోన్లు లేవు. వాళ్ళనుండి ఉత్తరం వచ్చేవరకూ మనసు మనసులో లేదు.
ఇప్పుడు మా కుటుంబమే కనుక పల్లవి స్కూలుకి వెళ్ళాక నాకు కొంచెం తీరిక చిక్కటంతో మళ్ళా మధ్యాహ్నం పూట పుస్తకాలు చదవటం,రచనలు చేయటం మొదలుపెట్టాను.
చిన్నప్పటినుండి ఎక్కువగా చిన్నన్నయ్య సేకరించిన రావిశాస్త్రి,బీనాదేవి రచనలే కాక తర్వాత కూడా ఆంధ్రజ్యోతి వారపత్రికలలో వచ్చిన పుణ్యభూమి కళ్ళుతెరు,రత్తాలు రాంబాబు మొదలైనవి చదవటం, నాకు ఇష్టమైన రంగనాయకమ్మ రాసిన ధారావాహికలు నా ఆలోచనలు మళ్ళా పదునుగా తయారవుతున్నాయి.
కవిత్వం నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అందులోనూ సమాజాన్ని,రాజ్యాన్ని ప్రశ్నించే వామపక్ష భావజాలం ఉన్న కవిత్వం మరింతగా ఇష్టపడేదాన్ని.
అప్పట్లోనే ఒకసారి మా యింటికి తురగా జానకీరాణి గారు వచ్చారు.తురగా జానకీరాణి గారు మాకు అత్యంత ఆత్మీయులు.వీర్రాజు గారు ఆకాశవాణి లోని ప్రోగ్రాం అధికారి అన్నమాటకు నొచ్చుకొని ఆకాశవాణి మెట్లు ఎక్కనని నిర్ణయించుకున్నారు.చివరివరకూ అదే మాటమీద నిల్చున్నారు.ఆవిషయం తెలిసిన జానకీరాణి గారు "నేను సుభద్ర కి ప్రోగ్రాం లు ఇస్తాను.ఆమె ఇలాంటి ప్రతిజ్ఞలు చేయలేదు కదా"అని సరదాగా అన్నారు.అంతేకాకుండా అప్పటినుండి ఏడాదికి నాలుగు సార్లు ప్రోగ్రాములు ఇచ్చేవారు.అందువల్లనే ఆ సమయంలో చాలా కథలు రాసాను.కవితలు కూడా ఎక్కువగానే రాసాను.ఆకాశవాణి ప్రోగ్రాములకు డబ్బు కూడా రావటంతో నా మొదటి సంపాదనగా నాకు ఆనందం కలిగించింది.
నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నవలరాయాలని తలపెట్టి చాప్టర్లుగా కథని సినాప్సిస్ గా రాసుకొని అప్పుడప్పుడు రాయటం మొదలుపెట్టాను.కానీ వీర్రాజు గారు "కవిత్వం బాగా రాస్తున్నావు దానిమీద దృష్టి పెట్టు కవిత్వసంపుటో,కథలసంపుటో వచ్చాక నవలరాయొచ్చులే" అనేసరికి అది పక్కన పెట్టేసాను.
ఇంతలో పెద్ద ఆడబడుచు భర్త అల్సర్ ట్రీట్మేంటు కోసం కుటుంబ సహితంగా వచ్చి నెలరోజుల పైగానే ఉన్నారు.మళ్ళా నాకు ఊపిరి ఆడని పని మొదలైంది.చిన్నాడబడుచుకి నిండునెలలు కావటంతో రెండవకాన్పుకి ఆమె కూడా వచ్చింది. ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్ళి చూపించటం,పెద్దాడబడుచు భర్తకి ఆమెకీ భోజనం తయారుచేయటం మధ్యలో పల్లవి చంటిపిల్లకావటంతో ఆ పిల్లని పట్టించుకోలేకపోయాను. మళ్ళా నేను పనివత్తిడితో నలిగిపోయాను.ఇంకా పథ్యాలేవో సరీగా చేసి పెట్టలేదనో, పంపలేదనో మూతివిరుపులూ మామూలే. ఏమైతేనేం వాళ్ళందరూ తిరిగి శుభంగా వారివారి ఇళ్ళకు వెళ్ళేక ఊపిరి తీసుకున్నాను. మధ్యతరగతి జీవితాల్లో మామూలు ఖర్చులకు భిన్నంగా ఇటువంటి అనివార్య ఖర్చులు మీదపడేసరికి అంతంతమాత్రంగా దాచుకున్నవి కాస్తా ఆవిరైపోతూ ఉంటాయి.వాటిని కూడదీసుకునేసరికి చాలా కాలమే పడుతుంది.ఇవన్నింటితో మానసికంగా,శారీరకంగా నేను కుంగిపోయినట్లయ్యాను.
ఇంతలో నాకు మళ్ళా నెలతప్పింది.చిన్నాడబడుచు పురిటి కని వచ్చిన అమ్మ వెళ్ళేటప్పుడు " ఈసారి అయినా ఆరోగ్యం బాగా చూసుకో.ఇప్పుడు మీకుటుంబమే కనుక నీకు నచ్చినవి బలమైన ఆహారం తింటూ ఉండు"అంటూ బోలెడు జాగ్రత్తలు చెప్పింది.
ఒకరోజు కుమారీ వాళ్ళు ఆడబడుచు లక్ష్మి ని తీసుకుని వచ్చింది.లక్ష్మి బీయిడీ చదువుతుంది.టీచింగ్ ప్రాక్టీస్ కోసం నాకు చార్టులు వేస్తావా అని అడిగింది.పల్లవి బడికి వెళ్తుండటం వలన పగలు ఖాళీగానే ఉంటున్నానుకదా అని సరే అన్నాను.
లక్ష్మి చార్టులు తీసుకు వచ్చి ఇచ్చేది.తెలుగుపాఠాలు, సాంఘిక శాస్త్రం పాఠాలు కనుక బొమ్మలు ఎక్కువ గానే ఉండేవి.ఇంట్లో రంగులు ఉంటాయి కాబట్టి వర్ణచిత్రాలు వేసేదాన్ని.అవి చూసి లక్ష్మి క్లాస్ మేట్ లు కూడా వచ్చి మాకూ వేస్తారా అని అడిగి డబ్బులు కూడా ఇస్తామన్నారు.ఆ విధంగా నాకు చిరు సంపాదన మొదలైంది.
25, ఏప్రిల్ 2023, మంగళవారం
నడక దారిలో --27
నడక దారిలో -27
నాకు డెలివరీ సమయం దగ్గరపడేసరికి అమ్మని పిలిపించుకున్నాను.డెలివరీకి పుట్టింటికి వెళ్ళకుండా అమ్మనే నాదగ్గరకు పిలుచుకోవటాన్ని ఇంట్లో వాళ్ళంతా "మా అమ్మ అయితే ఇలా ఆడపిల్ల ఇంటికి వచ్చి పురుళ్ళుపోయదు"అని వేళాకోళంగా మాట్లాడేసరికి అమ్మ చాలా బాధ పడింది.
నాకు డెలివరి అయింది.పాపాయి చాలా బలహీనంగా పుట్టింది.అందుచేత అయిదు రోజులు హాస్పటల్లోనే ఉండాల్సి వచ్చింది.ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నా పల్లవికి వీర్రాజు గారే స్నానంపోసి హాస్పిటల్ కి తీసుకువస్తే హాస్పిటల్ బెడ్ మీదే కూర్చుని పాపకి
తలదువ్వి జడలువేసేదాన్ని.అమ్మ నన్ను ,నా పరిస్థితిని చూసి దిగులు పడేది.
డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చాక "మళ్ళీ ఆడపిల్లేనా" అంటూ నిరసన మాటలు విని బాధపడ్డాను.ఆర్థిక పరిస్థితి,చంటి పాప అనారోగ్యం దృష్ట్యా వేడుకచేయకుండా ఇరవైఒకటోరోజున చీరతో ఉయ్యాల కట్టి అక్షతలు వేసాము.ఇంట్లో వాళ్ళెవరూ అక్షతలు వేయటానికి కూడా రాలేదు.ఎవరితోనూ దుఃఖం పంచుకోలేక నాలోకి నేనే కుంగిపోయాను.అసలే ముళ్ళమీదున్నట్లు ఉందేమోఆ పరిస్థితి చూసి నెలలోపునే అమ్మ "ఎక్కువరోజులు నేను ఇక్కడ ఉండలేను.మీరే నాతో రండి" అని నన్ను పిల్లల్నీ తీసుకుని విజయనగరం ప్రయాణం పెట్టింది.
విజయనగరం వచ్చాకైనా నిశ్చింతగా ఉండే పరిస్థితి లేకుండా చంటిపాపకి ఇమ్యూనిటీ లేక డయేరియా పట్టుకుంది.పల్లవికి కూడా తరుచూ జ్వరం వస్తుండేది. పిల్లల అనారోగ్యాలు నన్ను స్థిమితం లేకుండా చేసాయి.
నెలరోజులపాటు చంటిపాపకి ఎన్నిరకాలుగా మందులు మార్చినా తగ్గలేదు.హాస్పటల్లో జాయిన్ చేసాము.అయినా చంటిపాప దక్కలేదు. అనవసరంగా ఇక్కడికితెచ్చానా అని అమ్మ చాలా బాధ పడింది.పాప పోయిన విషయం తెలియగానే వీర్రాజు వచ్చారు.పల్లవికి తరుచూ జ్వరం రావటం మరింత బెంగ కలిగింది.మరి కొన్నాళ్ళు నాకు రెస్టు కోసం విజయనగరంలో ఉండమని అమ్మా వాళ్ళు అనటంతో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.
ఆగష్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొన్నాళ్ళుగా యువతరానికి సాహిత్యాభిరుచి కలిగించటానికి చిన్నన్నయ్య చైతన్య సాహితి అనే సంస్థని నిర్వహించేవాడు. అందులో జగన్నాథశర్మ, దాట్ల నారాయణమూర్తి రాజు, పతంజలి ,ఎమ్.వి.వి. సూర్యనారాయణ మొదలైనవారంతా సభ్యులు. ఆ సంస్థ పేరిట అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవాడు.
చిన్నపాప పోయిన దుఃఖం నుండి నన్ను మరిపించటానికేమో తమ సంస్థ ద్వారా ఆగష్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కవిసమ్మేళనం ఏర్పాటు చేసాననీ నన్ను కూడా పాల్గొనమన్నాడు.
చాసో అధ్వర్యంలో జరిగిన కవిసమ్మేళనంలో మొట్టమొదటి సారిగా అంతకుముందు ఎప్పుడో రాసిన ఆకలినృత్యం కవితను చదివాను. నాకు శారీరక,మానసిక ఒత్తిడులకు గానీ, దుఃఖానికి గానీ ఉపశమనాన్ని ఇచ్చేది సాహిత్యమే నని మరోసారి అప్పడే అనిపించింది.
ఇద్దరు పిల్లలతో విజయనగరం వెళ్ళిన నేను ఒక పాపను పోగొట్టుకుని పల్లవిని మాత్రం తీసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాను. పులిమీద పుట్రలా పల్లవికి మాటిమాటికీ జ్వరం రావటం నాకు బెంగగా అయిపోయింది. మా ఇంట్లో ఉండే బంధువు పెద్దబాబు సహాయంతో పల్లవిని టెస్టులకు తీసుకు వెళ్ళాను.పిల్లలకు వచ్చే టీబీ చాలా తక్కువప్రమాణంలో ఉందని తెలిసింది.మూడునెలలపాటు రోజూ ఇంజక్షన్ ఇప్పించాలని బలమైన ఆహారం ఇవ్వాలని,ప్రమాదం ఏమీ లేదన్నారు డాక్టర్ .
నాకు గుండె గుభేల్ మంది.వీర్రాజు గారికి టీబీ వచ్చి తగ్గింది కదా? దాని సూక్ష్మ అవశేషాలు ఏమూలో ఉండి పిల్లకు వచ్చిందేమో.ఇంతమంది ఉన్న ఈ కుటుంబంలో ఈ పిల్లకి ప్రత్యేకంగా బలవర్థకమైన ఆహారం ఎలా పెట్టాలి?. ఇంట్లో వాళ్ళుఎవరిమట్టుకు వాళ్ళు కొనుక్కున్నవి వాళ్ళవాళ్ళ గదుల్లో దాచుకు తింటున్నారు.పొరపాటునో అలవాటునో పల్లవి ఆడుకుంటూ వాళ్ళగదులవైపు వెళ్ళినా ఆపిల్లచేతులో ఏమీ పెట్టటం లేదు.సరికదా చెయ్యి పట్టుకుని గదిబయటకు పంపేస్తే ఏడ్చుకుంటూ వచ్చేసేది.నేను గుడ్లలో నీళ్ళు కుక్కుకొని మౌనంవహించేదాన్ని.వీర్రాజుగారు మాత్రం ఏపళ్ళో, మిఠాయిలో ఏం తెచ్చినా వంటింట్లో అందరికీ అందుబాటులో పెట్టమనేవారు. ఇంకా పల్లవికి ఎలా పెట్టాలో అర్దం కాలేదు.
పల్లవిని రోజూ స్కూల్ నుంచి వచ్చాక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఇంజక్షన్ వేయించేదాన్ని.ఆ పిల్ల కెవ్వుమంటే నాగుండె కలుక్కుమనేది. నా కళ్ళు చెరువులయ్యేవి.మొత్తంమీద మూడునెలలు కోర్సు పూర్తి అయ్యాక మెల్లిమెల్లిగా ఆరోగ్యం పుంజుకుంది పల్లవి.
రోజులు గడుస్తున్నాయి.మా పెద్దతోటికోడలుకి నెలతప్పటం,నెలలు నిండి పురిటి కి మద్రాసు వెళ్ళింది. పాపపుట్టాక మూడోనెలకి తిరిగి వచ్చింది.
వీర్రాజు గారు ఎప్పటిలాగే సాయంత్రంమీటింగులకు వెళ్ళి ఆలస్యంగా రావటంతో,లేదా ఇంటికే ముఖచిత్రాలు కోసంవచ్చినవాళ్ళనికూర్చోబెట్టి పూర్తిచేసి ఇవ్వటమో చేసేవారు దాంతో రోజూ ఎప్పటిలాగే మా భోజనం తొమ్మిదో పదో అయ్యేది.పాపకి తొందరగా అన్నం తినిపించి కథలో కబుర్లో చెప్పి నిద్రపుచ్చేదాన్ని.
రోజులాగే ఒకరాత్రి భోజనానికి కూర్చుని మంచినీళ్ళు తాగబోతే ఉప్పగా ఉన్నాయి.ఇంకో బిందెలోంచి తీస్తే అవీ అలాగే ఉన్నాయి.బిందె సరిగా కడగలేదేమో అడుగుకి ఉన్నాయి కదా అనుకున్నాను.మర్నాడు ఉదయమే మంచినీళ్ళు వచ్చే సమయానికి బిందెలు శుభ్రంగా తోమిపట్టాను.
అయినా ఆ రాత్రీ నీళ్ళు ఉప్పగానే ఉన్నాయి.నాకు ఎందుకో అర్థం కాలేదు.రోజూ మేమిద్దరం ఆ ఉప్పు నీళ్ళు తాగటం జరుగుతోంది.మా తోటికోడళ్ళతో ఆమాట అంటే మాకు బాగానే ఉన్నాయే అన్నారు.
ఒకరోజు అనుకోకుండా బయటపడింది.మా తోటి కోడలు సాయంత్రం వాళ్ళపాపకి ఉప్పు తో దిష్టి తీసి రెండు బిందెల్లో కలుపుతోంది.ఆలోపునే తోటి కోడళ్ళు ఇద్దరూ గిన్నెల్తో మంచినీళ్ళు తీసుకొని వాళ్ళవాళ్ళ గదులలోకి తీసుకుపోతున్నారు.నేను అది చూసి స్థంభించిపోయాను.ఇది ఏ కథల్లోనో, సినీమాల్లోనో చూస్తే నమ్మేదాన్ని కాదేమో.నిజానికీ ఈ దిష్టిలూ, తీయడాలను నమ్మను.
దిష్టి తీసి ఇంట్లో తాగే నీళ్ళలో కలపటం మొదటి తప్పు, వాళ్ళు మంచినీళ్ళు వాళ్ళ గదిలో పెట్టుకుని మాఇద్దరినీ అవి తాగేలా చేయటం మరో తప్పు.మేము నమ్మకపోయినా వాళ్ళు నమ్ముతారుకదా దోషపూరితమైన ఆనీళ్ళు తాగి మేమేమైనా పర్వాలేదని వాళ్ళ ఉద్దేశ్యమా?నాకు విపరీతమైన కోపం వచ్చింది.ఈ విషయం ఆయనకి చెప్పి మీరు వాళ్ళని "అదేంపని అని" గట్టిగా అడగండి.అన్నాను.ఆయన అడగలేదు సరికదా "నువ్వూ ఒక తప్పేలాతో మనకి నీళ్ళు ముందే తీసి మనగదిలో పెట్టు " అన్నారు కూల్ గా.నాకు మరింత కోపం వచ్చి ఈయనగారితో చెప్పే బదులు నేనే ఆ పని చేస్తే సరి అనుకున్నాను.ఆ విధంగా కొన్నాళ్ళపాటు ఉప్పు కలిపిన నీళ్ళు తాగటం వలనే నేమో నలభైఏళ్ళు నిండకుండానే ఇద్దరికీ హైబీపీ వచ్చేసింది.
వీర్రాజు గారు ఉద్యోగానికి అయిదేళ్ళు సెలవుపెట్టారు. ఢిల్లీ నుండి ఒక బాల్యమిత్రుడి కుటుంబాన్ని హైదరాబాద్ కి పిలిపించి ఆ మిత్రునితో కలిసి "వికాస్" పేరుతో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మొదలు పెట్టారు.దాంతో అందరి మనసుల్లో లుకలుకలు మొదలయ్యాయి.ఆయనకు రెగ్యులర్ గా వచ్చే జీతం పోతే ఆర్థికబాధ్యత తమ మీద పడుతుందని మిగతా వారికి భయం పట్టుకుంది.అన్నయ్యకి సంపాదన లేకపోతే ఇంకా ఇక్కడికి ఇంకేం వస్తాం అని పెద్దాడబడుచు వాపోయింది.
ఈలోగా మరో తోటికోడలుకు అబార్షన్ కావటం దానికి ఇంట్లో పనిచేయాల్సి రావడం కారణంగా ఒకతగువు పెట్టుకొని వెళ్ళిపోయారు.
ఏ తగువూ రాకుండా స్నేహంగా విడిపోతే బాగుండునని ఎంతగా అనుకున్నానో అది జరగలేదు.రెండుమూడు రోజులూ చాలా బాధ పడ్డాము.
అక్కయ్య ఈ విషయం తెలిసి కొన్నిరోజులు విశ్రాంతి కోసం తన దగ్గరకి బాపట్ల రమ్మని రాసింది.ఆ ఉత్తరం వీర్రాజు గారికి చూపించి వెళ్తానన్నాను.అంతే కాకుండా "చిన్నతను ఎలాగూ విడిపోయాడు.ఈ ఇంట్లోనే రెండుభాగాలు చేసి కృష్ణ వాళ్ళకుటుంబాన్ని కూడా విడిగా ఉండమని చెప్పండి.కావాలంటే వాళ్ళకి ప్రతీ నెలా ఎంతోకొంత ఇవ్వాలనుకుంటే ఇవ్వండి.మళ్ళీ తగువులు పడి విడిపోవటం నాకిష్టంలేదు.ఉన్నదాంతో నేను కుటుంబాన్ని సరిదిద్దుకోగలను.నేను వచ్చేలోగా ఈ పని చేయండి"అని ఖచ్చితంగానే చెప్పి పల్లవిని తీసుకుని బాపట్ల వెళ్ళాను.
అక్కయ్య పిల్లలు శ్రీదేవీ,శర్వాణీలతో ఆటలూ,రోజూ పెద్దనాన్న గారితో బాపట్ల సముద్రతీరంలో ఆడుకోవటం వీటితో పల్లవి మళ్ళా చురుకుగా అయ్యింది.నేను అక్కడికి వెళ్ళాక మళ్ళా పుస్తకాలు చదవటం అక్కతో సాహిత్యం గురించి మాట్లాడుకోవటం వీటన్నిటితో నాకు కూడా శారీరకంగా, మానసికంగా విశ్రాంతి లభించి మళ్ళా కళ్ళలోకి జీవకళ వచ్చింది.
అంతకు ముందు మేముండే రెండు చిన్న రూములు ,వంటగదిలో మా మరిది కుటుంబాన్ని విడిగా ఉండమని ఆయన చెప్పారు.పార్టీషన్ చేసిన పెద్దహాలు లోకి మా మంచం, వీర్రాజు గారి డ్రాయింగ్ టేబుల్,బుక్ షెల్ఫ్ మార్చేసి ఒక నెల తర్వాత వీర్రాజు గారు నన్ను తీసుకు వెళ్ళటానికి బాపట్ల వచ్చారు.
నడక దారిలో 26
నడక దారిలో --26
1975 -76 ల్లో దేశంలోనూ ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాలకు ప్రధాని ఇందిరా గాంధీ అధికారికంగా విధించిన ఎమర్జెన్సీ1977 మార్చి 21వరకూ కొనసాగింది.ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని జైలుపాలు చేసి, పత్రికలను సెన్సార్ చేయటం మొదలైంది.పౌరహక్కులకు భంగపరిచేలా ప్రజలకు భావస్వాతంత్రం,వాక్స్వాతంత్రం లేకుండా అయి పోయింది.స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన చీకటికాలాల్లో ఎమర్జెన్సీ ఒకటి.
సాహిత్యంలో డెబ్భైలలో మొదలైన విప్లవోద్యమ ప్రభావంతో రచనలు చేసేవారంతా ఆ సమయంలో అతలాకుతలం అయినా సరే అక్షరాయుధులుగా రచనలు చేస్తూనే ఉన్నారు. అవి చదువుతూ ఎంతోమంది ప్రభావితులౌతూనే ఉన్నారు.
సైన్స్ విద్యార్ధినిగా నాకు మన దేశం 1975లో ఆర్యభట్ట అనే తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిందని మనసులో కాస్తంత సంతోషం కలిగింది.
దేశంలో ఎన్నో సంక్షోభసమయాలు వచ్చినట్లే నేనూ కుటుంబంలో అటువంటి ఎమర్జెన్సీలు ఎదుర్కొన్నాను.
ఆరోజు ఆగష్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవమే కాకుండా వరలక్ష్మీ వ్రతం కూడా.పల్లవికి పెరేడ్ చూపిస్తామని వీర్రాజు గారు,మామరిది కలిసి సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్ కి తీసుకువెళ్ళారు.నేను వాళ్ళు వచ్చేలోపునే ఫ్రైడ్ రైస్,పాయసం చేయాలని హడావుడిగా చేస్తున్నాను.
అంతలో టెలిగ్రాం వచ్చింది.గుండె దడదడలాడుతుండగా విప్పాను.కాని అది నిజమేనా అని నిశ్చలన చిత్రాన్నే అయ్యాను.అంతలో ఆయన రాగానే టెలిగ్రాం చేతిలోపెట్టాను. మా చిన్నక్క భర్త పోయారనే వార్త చదివిన దగ్గర నుంచి దిగులు ముఖంతో ఉన్న నాకు ధైర్యం చెప్పి విజయనగరానికి రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ కోసం వెళ్ళారు.
వాసుదేవరావు గారు ఎన్.సి.సి.చేసిన మనిషి కనుక ఆరోగ్యమైన వ్యక్తి అనే అనుకునేదాన్ని.గత నెలరోజులు క్రితం అనారోగ్యంతో విశాఖ కేజీహెచ్ లో చేరి డిశ్చార్జి అయ్యారని తెలుసు.కానీ ప్రేమించి వర్ణాంతర వివాహంతో ఇరువైపులా బంధువులకు దూరమై తమమట్టుకు తాము బతుకుతున్న చిన్నక్క జీవితం ఇలా కావటం తట్టుకోలేక పోయాను.
మర్నాటికి టికెట్లు దొరికి ఇరవైనాలుగు గంటల ప్రయాణం చేసి విజయనగరం చేరాము. ఇంటికి చేరేటప్పటికి చీకటి పడింది.అమ్మ,పెద్దక్కయ్య కోరుకొండ లోనే ఉన్నారు.మర్నాడు పొద్దునే మేము వెళ్ళాము.
చిన్నక్క మూడురోజులుగా దుఃఖం తోనూ,తలస్నానాలతోనూ ఒళ్ళుతెలియని జ్వరంతో మంచంమీద ఉంది.ఏడేళ్ళకళ్యాణ్, మూడేళ్ళు ఐనా నిండని చెల్లెల్ని అక్కున చేర్చుకుని వాకిట్లో బిక్కమొఖంతో కనబడేసరికి గుండెనీరైంది.
వాసుదేవరావుగారి తాలూకా వాళ్ళంతా అతను వడుగు చేసుకోకుండా వర్ణాంతర వివాహం చేసుకున్నందున మూడురోజుల్లో తఘకు మైలతీరిపోయినట్లే అని అందరూ అక్కని ఒంటరిగా వదిలి ముందురోజే వెళ్ళిపోయారట.
వాసుదేవరావు గారికి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయట.పెద్దన్నయ్య వదిన వచ్చి అంతా అయ్యాక వెళ్ళిపోయారు.పెద్దక్క నేనూ క్వార్టర్ ఖాళీ చేయటానికి చిన్నక్క కు అవసరమైన సామాగ్రిని సర్ది పేకింగులు తయారు చేసాము.
అన్నయ్య పట్టించుకోకపోవటంతో చిన్నన్నయ్య ఇంటికి చిన్నక్కని ఇద్దరు పిల్లల్నీ తీసుకుని అందరం వచ్చేసాము.చిన్నన్నయ్య చిరుద్యోగి.చిన్నక్క బాధ్యత ఎలా ,ఎవరు తీసుకోవాలో అగమ్యగోచరంగా అయిపోయింది.అయితే అదృష్టవశాత్తు వాసుదేవరావు గారి సహ ఉద్యోగులు అండగా నిలబడి నెలలోపునే చిన్నక్కకు అదే కోరుకొండ సైనిక స్కూల్ లో మేట్రిన్ గా ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేసారు.ఆయన మరణానంతరం వచ్చిన డబ్బును అక్కపేరున పిల్లలపేరనా ఎఫ్.డిలు వేయించారు.కాని ఆరునెలలలోపున మెట్రిక్ పాస్ అయితేనే ఆమె ఉద్యోగం పర్మనెంట్ అవుతుందన్నారు.చిన్నప్పుడు చదువుమీద శ్రద్ధ పెట్టని అక్క ఆ తప్పని పరిస్థితిలో చదవవలసిన అవసరం వచ్చింది.ఏదో ఒకలా పరీక్ష గట్టెక్కటంతో పర్మనెంటు అయ్యి ఆమె జీవితం ఒక కొలిక్కి తొందర్లోనే రావటంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం.
చదువు లేకపోవటం వలన అమ్మ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో చిన్నప్పటి నుంచి చూసాను.ఇప్పుడు చిన్నక్కది అదే పరిస్థితి వచ్చినా ఎలాగో ఒడ్డున పడింది.ఆడవాళ్ళకు ఎటువంటి పరిస్థితి సంభవించినా ఆర్థిక స్వావలంబనకు తగిన చదువు ఎంతముఖ్యమో మరోసారి అర్థమైంది.తిరిగి హైదరాబాద్ వచ్చేసినా స్త్రీలజీవితాలపై ప్రభావం కలిగించే ఆర్థిక,సామాజికాంశాల గురించి మాటిమాటికీ గుర్తువచ్చి మనసులో బాధ గింగిరాలు తిరుగుతూనే వుంది.మరోసారి నేను ఎలాగైనా ఉద్యోగం చేస్తే బాగుంటుంది.కానీ ఎలా? పెద్దప్రశ్నార్ధకం నా కళ్ళముందు నిలిచింది.
మా చిన్నాడబడుచుకి నెలతప్పింది.విజయనగరంలో అయినా, హైదరాబాద్ లోనైనా చూసుకోవాల్సినది అమ్మే కదా.ఎందుకంటే నేనూ చిన్నదాన్నే ఆమాత్రం దానికి పురిటికి ఆమెని హైదరాబాద్ కి రమ్మనటంలో అర్థంలేదు.అయితే హైదరాబాద్ లో నన్ను చూసిన డాక్టర్ డెలివరి బాగా చేస్తుందని భావించి కాబోలు ఇక్కడికే పంపించాలనుకున్నారు.
మరుదులు ఇద్దరికీ సంబంధాలు కుదిరాయి.నాలుగురోజుల తేడాలో పెద్ద మరిదికి హైదరాబాద్ లో,చిన్నమరిదికి రాజమండ్రిలో చెయ్యటానికి నిశ్చయమైంది.
"వీళ్ళు పెళ్ళిళ్ళు అయ్యాక కలిసి ఉండటానికి ఇష్టం ఉంటే సరేసరి లేకపోతే వేరుగా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు.తగువులు పడి విడిపోవటం బాగుండదు'అని తమ్ముళ్ళతో చెప్పమని అందులో తప్పేమీ లేదని వీర్రాజు గారితో అన్నాను."ముందే అలా చెప్పటం బాగుండదు"అన్నారాయన.ఏదిజరిగినా బాధపడవలసినది నేనే కదా అనుకుని ఇంకేమి అనలేక మౌనంవహించాను.
ఇంటికి కలర్స్ వేయించడం, హాల్ లా వాడుకునే పెద్దగదికి పార్టిషన్ లు చేయించటం మొదలైన పనులు మొదలుపెట్టాం.
అవన్నీ సరిపోలేదని నాకు నెలతప్పింది.పక్కింటి రంగారావు గారి తల్లిని సాయంతీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం.బాగా నీరసంగా ఉన్నానని మందులు రాసారు.
రెండోనెల దాటాక అకస్మాత్తుగా రక్తస్రావం కావటంతో పక్కింటామెని తీసుకొని హడావుడిగా రిక్షా తీసుకొని వెళ్ళాను.డాక్టర్ ఇంజక్షన్ చేసి రెండు మూడు వారాలైనా పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని పక్కింటి ఆమెకు నాపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ఇంటికి వచ్చాక ఆమె బోలెడు జాగ్రత్తలు చెప్పి రెస్ట్ తీసుకోమని కూరలవి తాను వండి ఇస్తానన్నారు.
ఇంట్లో మామరిది నైట్ షిఫ్ట్ కి వెళ్ళిపోయాడు నేను ఇంట్లో అడుగు పెట్టగానే ఇంకో మరిది బైటికి వెళ్ళాడు.వీర్రాజు గారు మరికాసేపటికి వస్తే ఆమె డాక్టర్ చెప్పిన విషయాలు చెప్పారు.
"అలాగా"అన్నారు ఆయన.
మర్నాడు ఉదయమే టిఫిన్ చేసి తీసుకుని వంటింట్లోకి వచ్చిన పక్కింటామె అక్కడ వంటచేస్తున్న నన్ను చూసి "అదేంటమ్మాయ్ డాక్టర్ పూర్తి రెస్ట్ తీసుకోమంటే పనులు మొదలెట్టేసావ్"ఆప్యాయంగా అన్నారు.
"ఎలా కుదురుతుందండీ.ఇంట్లో పెళ్ళిళ్ళు,పిలుపులు ఉంటే రెస్ట్ ఎట్లా? ఏమైతే అదే ఔతుంది." నాగొంతులో బాధ వణికింది.
"అబ్బాయితో చెప్పమంటావా" అన్నారు ఆమె.నేను తల అడ్డంగా ఊపేసరికి ఏమి అనలేక ఊరుకున్నారు.యథాప్రకారం పెళ్ళిపిలుపులూ,బజారుపనులూ మొదలైన కార్యక్రమాలు జరిగిపోయాయి.ఎవరూ నా ఆరోగ్యం గురించి,డాక్టర్ చెప్పిన బెడ్ రెస్ట్ గురించీ పట్టించుకోలేదు.
పెళ్ళికోసం అని వచ్చిన చిన్నాడబడుచు డెలివరీకోసం ఉండిపోయింది.అమ్మ డెలివరీ సమయానికి వచ్చి దగ్గరుండి కోడలికి హాస్పిటల్లో సాయంగా ఉండి తన కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా జరిపింది.పుట్టినబాబుకు నెలదాటకుండా చిన్నన్నయ్య వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు.
నా తోటి కోడళ్ళు వచ్చాక ఇంట్లో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.ఒక నాలుగు నెలలు ఫస్ట్ కి అందరూ ఇచ్చిన డబ్బుని నెలంతా సరిపడేలా నేనే ఇంటిఆర్థికవ్యవహారాలు చూస్తూ ప్రతీ పైసా డైరీలో నమోదు చేసేదాన్ని.చవకరకం సబ్బులు కొంటున్నాననీ,టూత్ పేస్ట్ కాకుండా పౌడర్ కొంటున్నానని తాము ఖరీదైనవే వాడతామని,ఇటువంటి చాలాకాలం వాడమనీ అంటూ వెటకారాలుచేసారు.అందరూ ఇచ్చిన డబ్బు కాక ఆపైన మా డబ్బే చాలావరకూ ఇంటికి వాడాల్సివచ్చేది.
తర్వాత నెల రెండో ఆమెకి ఇచ్చి నువ్వే ఈనెల చూసుకో అన్నాను.ఆ నెల తర్వాత మూడో ఆమెకి ఇచ్చాను.వాళ్ళకి ఇష్టమైనట్లు అన్నీ కొని పదిహేను రోజులకే డబ్బుకు కటకటలాడి ఇంట్లోకి వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేసరికి గిజగిజలాడారు.తర్వాతి నెల నుండి వాళ్ళు కోరుకున్నవస్తువులు వాళ్ళ డబ్బుతో కొనుక్కుని వాళ్ళు రూములో దాచుకుని వాడుకోవటం మొదలెట్టారు.
వీర్రాజు గారు మీటింగుల వల్లో,లేదా మిత్రులు వచ్చి ముఖచిత్రాలు వేసుకోడానికి రావటం వల్లో రాత్రి పూట భోజనానికి రావటం తరుచూ ఆలస్యం అయ్యేది.అప్పటికి అందరూ భోజనం చేసి ఎవరి గదుల్లో వారు ఉండేవారు చప్పగా చల్లారి ఉన్న అన్నం కూరలు వీర్రాజు గారికి పెట్టి నేను తినే దాన్ని.
ఉదయంపూట ఆయన ఆఫీస్ కు వెళ్ళాలికనుక తొందరగా వంటపని నేను చేసేదాన్ని. పదిగంటలకే వీర్రాజుతో పాటు నేనూ భోంచేసేదాన్ని. మామరుదులు షిఫ్ట్ డ్యూటీలు కనుక మిగతావాళ్ళు టిఫిన్స్ చేసుకొని మాకోసం మిగిల్చింది ఆయనకి మధ్యాహ్నానికి ఆఫీసుకి పేక్ చేసి ,పాపకి తినిపించగా,మిగిలినది నేను కొంచెం ఉంచుకుని తినేదాన్ని.
పాపని మూడో పుట్టినరోజు కాగానే ఈ రెండు మూడునెలలు స్కూల్ అలవాటు కావాలని దగ్గరలోని స్కూల్ లో నర్సరీ లో చేర్చాను.కొన్నాళ్ళు నేనే తీసుకువెళ్ళి తిరిగి తీసుకు వచ్చేదాన్ని.తర్వాత ఒక అవ్వని పెట్టాను. మధ్యాహ్నం నేను వెళ్ళి అన్నంతీసుకెళ్ళి తినిపించి వచ్చేదాన్ని.
ఈ పనులు అన్నీ అయ్యే సరికి నాకు నెలలు నిండసాగాయి.డాక్టరు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా "బరువు అసలు పెరగలేదు.లోపలబిడ్డ కూడా పెరగలేదు.అసలు తిండి తింటున్నావాలేదా" అని డాక్టర్ కోప్పడసాగింది.
అంతలో వీర్రాజు గారి బాల్యమిత్రుడు స్పాట్ వేల్యుయేషన్ డ్యూటీ నెలరోజులు కోసం హైదరాబాద్ కి ముగ్గురు పిల్లలతో సహా మొత్తం కుటుంబంతో వచ్చారు.మేము ఏడుగురం వాళ్ళతో కలిపి పన్నెండు మంది .వాళ్ళ పిల్లలకు పాలు,ఇంతమందికి వంట ,ఇల్లు గడపటం చాలా కష్టమైపోయింది. .పాప పల్లవిని కూడా చూసుకోలేక పోతున్నాను.శారీరకంగా ఆర్థికంగా బాగా నలిగిపోయాను.
ఒక్కొక్కప్పుడు నేను ఏమి ఆశించి పెళ్ళి చేసుకున్నాను?నా జీవితం ఎలామారింది ? ఈ పిల్లల్ని నేను కోరుకున్నట్లు గా పెంచగలనా?నా చుట్టూ ఎన్నోఎన్నెన్నో ప్రశ్నలు. భవిష్యత్తు తలచుకుంటూ నిరాశలో కూరుకుపోయే దాన్ని.
నడక దారిలో --25
నడక దారిలో --25
మార్చి 17న విజయనగరానికి తిరిగి పరీక్ష రాయటానికి వెళ్ళాను.
చిన్నన్నయ్య ఇంటికే వెళ్లాను.అయితే ఎవరో కుర్రాడితో నాకు వదిన తమ ఇంటికి భోజనానికి రమ్మని కబురు పెట్టింది.పెద్దన్నయ్య ఇంటికి ఆరోజు పల్లవిని తీసుకుని వెళ్ళాను." ఇది కూడా నీకు పుట్టిల్లే "అంది వదిన." ఏ ఇల్లైతేనేమిటి వదినా నాకా పట్టింపులేమీ లేవు " అంటుంటే నాకు మాయాబజార్ సినిమా డైలాగ్ గుర్తువచ్చి మనసులోనే నవ్వుకున్నాను.
భోజనాలు అయ్యాక పెద్దవదిన చీర జాకెట్టుపై పళ్ళు పెట్టి నా చేతికి ఇచ్చి " రుణం తీరిపోయింది"అంది.అన్నయ్య ఏమీ మాట్లాడలేదు.నాకు షాక్ తగిలినట్లు అయ్యింది.రక్తసంబంధంలో ఆమాత్రానికే రుణం తీరిపోయేదేనా.మా అక్కాచెల్లెళ్ళు ఎవరమూ పుట్టింటి నుండి ఏమీ ఆశించేవాళ్ళం కాదు.వదిన చేతి వంట తినటం అదే మొదటిసారి. అమ్మ పోయినప్పుడు రెండోసారి.అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి.అతి ప్రయత్నం మీద బయటకు రాకుండా ఆపుకున్నాను.
మర్నాడు జ్యోతి మేడం వాళ్ళింటికి వెళ్ళాను.నన్ను హాల్ లో కూర్చోబెట్టి ఆమె లోపలికి వెళ్ళారు.అంతలోనే వాళ్ళ నాన్నగారు "పాఠం చెప్పించుకోటానికి సుభద్ర వస్తుందన్నావు రాలేదా" అంటూ ముందు గదిలోకి వచ్చారు.నేను గభాలున లేచి నిలబడి నమస్కారం పెట్టాను."ఓ నువ్వేనా సుభద్ర అంటే" అంటూనే తలవూపి లోనికి వెళ్ళిపోయారు.
జ్యోతి గారు వచ్చి" నీగురించి చెప్పానులే ఆయనకి నిన్ను తెలుసు" అంటూ పరీక్షల్లో రావటానికి అవకాశం ఉన్న పాఠాలు వివరించారు.
నాగురించి తెలుసు అంటే ప్రముఖ రచయిత భార్యననా, అప్పుడప్పుడే రచనలు చేస్తున్నాననా,సభా వివాహం చేసుకుని ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టాననా ఎలా తెలుసు అని మనసులో ప్రశ్నలు మొదలయ్యాయి కాని నేనేమీ మాట్లాడలేదు.
ఆమె ద్వారానే పరీక్షలు పోస్ట్ పోన్ అయినట్లు కూడా తెలిసింది.ఎప్పటికి పూర్తవుతాయి తిరిగి ఎప్పటికి వెళ్తానని ఒక వైపు బెంగ, మరోవైపు కాస్త చదివే సమయందొరికిందని ఆశ రెండింటితో మనసులో సందిగ్ధం నెలకొంది.
అక్కడ హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలలో చిత్రలేఖనం ప్రదర్శన కోసం పెయింటింగ్స్ వేయటానికి వీర్రాజు గారి ఆత్మీయ మిత్రుడు మాదేటి రాజాజీ తో బాటు మరో ఇద్దరు ఆర్టిస్టులు మా ఇంట్లోనే దిగారుట.ఇల్లంతా ఆర్ట్ స్కూల్ లా ఉందట.పెద్దపెద్ద నిలువెత్తు పెయింటింగ్స్ అందరూ వేస్తున్నారని వీర్రాజు గారు ఉత్తరంలో రాసారు.వీర్రాజుగారు పండితారాధ్యుల పెయింటింగ్ ప్రదర్శన కోసం,సావనీర్ కోసం పోతనకు సరస్వతి దేవి ప్రత్యక్షమైన సందర్భాన్ని చిత్రంగా వేస్తున్నానని ఉత్తరంలో రాసారు.
ప్రపంచసభల సావనీర్ రూపకల్పన బాధ్యత కూడా ఉండటంతో చాలా బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించింది. ఏప్రిల్ 12వ తేదీ ఉగాది రోజున ప్రారంభమై 18వ తేదీ వరకు వారం రోజులపాటు హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈ మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ ప్రాంగణానికి 'కాకతీయ నగరం' అని పేరు పెట్టారు. ప్రారంభసభకు మా తెలుగు తల్లికి మల్లె పూదండ ప్రార్థనగీతాన్ని పాడేందుకు లండన్ నుండి టంగుటూరి సూర్యకుమారిని ప్రత్యేకంగా పిలిపించారుట.ప్రముఖ సాహితీవేత్తలు, ప్రసిద్ధ కళాకారులు, రాజకీయ ప్రముఖులు, స్వాతంత్ర్య సమరయోధులు, మేధావులు, పండితులు, సినీరంగ ప్రముఖులు, సమాజంలోని అన్ని రంగాలలోని వారు ఈ సభల్లో పాల్గొన్నారుట.
శాతవాహన నగరం'లో 'తరతరాల తెలుగు జాతి' ప్రదర్శన ఏర్పాటయిందిట. రెండున్నర వేల సంవత్సరాల తెలుగుజాతి చరిత్ర దీనిలో ప్రదర్శితమైందనీ 53 తైలవర్ణ చిత్రాలు, 240 తెలుగు వెలుగుల ఛాయా చిత్రాలు, 29 చార్టులు, 40 నాగార్జున కొండ చిత్రాలు, 10 దేశ పటాలు, 6 కుడ్య చిత్రాలు, 8 ప్రాచీన రాజ ముద్రికలు అమరావతి స్తూప ప్రతికృతి మొదలైనవి ఎన్నో ఈ ప్రదర్శనలో అమర్చబడ్డాయనీ వీర్రాజు ఉత్తరంలో చదువుతుంటే కళ్ళముందు అవన్నీ కదులాడాయి.
రోజూ ప్రముఖుల సంగీత,నృత్యకార్యక్రమాలు జరిగాయట.పాస్ ఉన్నా ఆయనకి వెళ్ళటానికి కుదరక తమ్ముళ్ళకు ఇచ్చేసేరుట. వాళ్ళు వెళ్ళారు అని ఉత్తరంలో రాస్తే అయ్యో మంచి కార్యక్రమం చూసే అవకాశం పోయింది.మంచి సమయంలో విజయనగరంలో ఉండిపోయానని బాధకలిగినా పరీక్షలకి పట్టుదలగా చదివాను.
మా కాలేజీలో కాకుండా ఎమ్మార్ కాలేజీలో నాకు సెంటర్ పడింది.నిర్విఘ్నంగా పరీక్షలు రాసాను.
సావనీర్ రూపొందించినందుకూ, పెయింటింగ్ కి రెమ్యునరేషన్ అయిదువేల వరకూ వచ్చిందని బంగారు గాజులు చేయించుకోమని సంబరంగా వీర్రాజు 1200/- పంపించారు.విజయనగరంలోనే చేయించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాను.
చిత్రకళా ప్రదర్శన నలభై అయిదు రోజుల పాటు ఇంకా కొనసాగుతూ ఉండటం వలన చూడటానికి వెళ్ళాను.వివిధ చిత్రకారుల విభిన్న చిత్రాలు ఒక్కొక్కరివీ ఒక్కో రీతి కావటంతో భలే ఆసక్తిగా అనిపించింది.
అప్పట్లోనే మూర్తి అనే ఆయన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో దర్శకనిర్మాణంలో ట్రైనింగ్ అయినవాడు.నశీరుద్దీన్ షా మొదలైన అప్పటి అవార్డు చిత్రాల్లో వేసే చాలామంది అతని సహవిద్యార్ధులట.అతను వచ్చి వీర్రాజు గారిని తన సినిమాలకు కథ,ఆర్ట్ విభాగాల్లో తీసుకుంటానని ఆహ్వానించాడు.కాంటాక్టు పేపర్లో అందుకు పారితోషికంగా అయిదు వేలు ఇస్తున్నట్లు రాసారు.ముందురెండువేలు ఇస్తానన్నాడు.చేతిలో అయిదు రూపాయలు పెట్టి కాంటాక్ట్ పేపర్ మీద సంతకం చేయించుకున్నాడు.నేను వేళాకోళం గా నవ్వేసరికి డబ్బులు వచ్చాక ఇస్తాడులే అని ఆయన నమ్మకంగా అన్నారు.కానీ నమ్మకం వమ్మయిపోయింది.
ప్రత్యూష అనే సినిమా హిందీలో మూర్తి తీసాడు.కానీ డిస్ట్రిబ్యూటర్ దొరక్క విడుదల కాలేదు.అది జరుగుతూ ఉండగానే కొన్ని సన్నివేశాలు, సందర్భాలూ,దృశ్యాలూ,సంఘటనలూ చెప్పి నవల,స్క్రీన్ ప్లే రాయమనీ,అది తెలుగులో సినిమాగా తీస్తానని దగ్గర ఉండి రాయించుకున్నాడు.కానీ తర్వాత అతను ఏమైనాడో తెలియదు.ఆయన రాయమన్న నవల ఎక్సర్సైజ్ నోట్బుక్ లో మిగిలిపోయింది.
తారకా ఆర్గనైజర్స్ అనే సంస్థ - పోరంకి దక్షిణామూర్తి,మంజుశ్రీ, వాసిరెడ్డి సీతాదేవి,దాశరధి రంగాచార్య,అరిపిరాల విశ్వం,ఆనందారామం, శీలా వీర్రాజు, వెంచాశా,పరిమళా సోమేశ్వర్ లు తొమ్మిది మందితో గొలుసు నవల రాయించి ప్రచురించాలనుకుని వాళ్ళు తొమ్మిది మందినీ పిలిచి హొటల్ లో గెట్ టుగెదర్ పెట్టారు.తీరా తర్వాత వాళ్ళేమయ్యారో,నవలసంగతేమో మూలపడింది.
నేను బిఎస్సీ పరీక్ష పాసైనట్లు తెలిసి అక్కయ్య "ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించు.ఆర్థికంగా కుటుంబానికి చేయూత ఉంటుంది."అని ఉత్తరం రాసింది.కానీ పాప ఇంకా చిన్నది.బడికి వెళ్ళే వయస్సు వస్తే ఏమైనా ప్రయత్నం చేయొచ్చు.ఇంట్లో ఉంటేనే తీరిక లేని పనితో తల్లడిల్లుతున్నాను.ఇంకా ఉద్యోగం ఇల్లూ చూసుకోగలనా? మనసు ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడింది.
ఇలా ఏమీ చేయకుండా సమయాన్ని గడిపేయడం నాకు మనసుని కలచివేస్తుంది.నేను ఇలా ఉండిపోకూడదని అనిపిస్తోంది.
ఒకరోజు మిట్టమధ్యాహ్నం పాప ఫ్రాక్ కు డిజైన్ కుడుతూ వాకిట్లో కూర్చున్నాను. ఒక అతను ఏడెనిమిది ఏళ్ళ పాపని తీసుకువచ్చి హార్మొనీ పెట్టిమీద వాయిస్తూ సినీమా పాట అందుకున్నాడు వెంటనే ఆ పాప నాపరాళ్ళు పరిచిన మండే నేలమీద ఒళ్ళు విరుస్తూ,కన్ను కొడ్తూ నృత్యం చేయటం మొదలెట్టింది.నాకు మనసు విలవిల లాడింది.పాట ఆపించి డబ్బులు ఇచ్చి పంపించేసాను.కానీ ఆ దృశ్యం నన్ను వెంటాడసాగింది.నా బాధ అక్షరరూపం దాల్చి ఆకలినృత్యం కవితగా రూపుదాల్చింది.సాయంత్రం వీర్రాజు ఆఫీసునుండి రాగానే నేను రాసిన కవిత చూపాను.ఆయన చాలాబాగా రాసానని మెచ్చుకొని ఆ కవితని ఎక్స్ రే పత్రికకు పంపించారు.ఆ విధంగా నా మొదటి కవిత ప్రచురితం అయ్యింది.చాలా కాలానికి నా పేరుతో ప్రచురితమైన కవితా చూసుకోగానే నాకు ఉత్సాహం వచ్చింది.కవిత్వం బాగా రాయగలుగు తున్నావు.అవేరాయు అని వీర్రాజు గారు అన్నా సరే తరచుగా రాయలేకపోయాను.
అప్పట్లోనే దేవీప్రియ సంపాదకత్వంలో ప్రజాతంత్ర వారపత్రిక వస్తుండేది.అందులో వీర్రాజు గారు 'దేవుడికి ఉత్తరం'శీర్షికన ఒక కార్టూన్ లా వేసే వారు.అది చూసి నేను ఒక్కొక్కసారి సలహా ఇస్తూ ఉండేదాన్ని.
' నువ్వే వెయ్యటానికి ప్రయత్నించు' అని వీర్రాజు గారు ప్రోత్సహించారు.అప్పటినుండి నేను 'దేవుడికి ఉత్తరం ' చిన్ను అనే పాప కేరక్టర్ తో వేయటం మొదలెట్టాను.
ప్రజాతంత్ర లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలకు స్వాతంత్ర్యం ఉందా అనే శీర్షికతో వ్యాసాల పోటీ పెట్టారు.అందులో నాకు రెండవ బహుమతి వచ్చింది.ఆతర్వాత మహిళల పేజీకి రెగ్యులర్ గా రాయమని దేవీప్రియ అడిగారు.సరే అని ఒకనాలుగైదు వారాలు రాసాను.
అప్పుడే నా చిన్నప్పుడు హైస్కూల్ స్నేహితురాలు మేరీ రాజ్యలక్ష్మే దేవీప్రియ భార్య అని తెలిసింది.అప్పట్లో పోలీస్ బారెక్స్ క్వార్టర్స్ లో ఉన్న మేరీ రాజ్యలక్ష్మి మా ఇంటికి వస్తే ఇద్దరం కలిసి స్కూల్ కి వెళ్ళేవాళ్ళం.చాలా స్నేహంగానే ఉండేవాళ్ళం.మరెందువల్లో మా స్నేహం ఇక్కడ బలపడలేదు.నన్ను రమ్మనేది కానీ ఆమె మా ఇంటికి వచ్చేది కాదు.నేను సంసారం బాధ్యతల్లో ఎక్కువగా వెళ్ళలేక పోయేదాన్ని.అదొక కారణం కావచ్చు.
నాలో ఏమీ తోచనితనం నేను ఎలా నా ఆశలన్నీ, అభిరుచుల్నీ ప్రోది చేసుకోవాలో తెలియని తనం నన్ను నిలకడగా ఉండనీయటం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)