28, మార్చి 2023, మంగళవారం
డా.ఎస్.వి.కామేశ్వరి గారి పుస్తకం - మధుమాలతి
~~ సంతాన సాఫల్యాన్ని పరిమళించిన 'మధుమాలతి'~~
డా.సామవేదం వెంకట కామేశ్వరి సుమారు పాతికేళ్ళుగా భర్త డా.వింజమూరి సూర్యప్రకాష్ గారు చేసే సామాజిక సేవారంగంలో చేదోడు వాదోడుగా ఉంటూనే వైద్యరంగంలో జరుగుతోన్న అమాయక పేదవాళ్ళపట్ల జరుగుతోన్న కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని గమనించారు.
స్త్రీలు ఏమైనా సమస్యలతో హాస్పిటల్స్ కు వెళ్తే వాళ్ళకు ఉండే తెల్లకార్డు చాటున అమానుషంగా తొలగిస్తున్న గర్భసంచుల గురించి నేటికీ అలుపెరుగకుండా పోరాడిన సాహసి డా.కామేశ్వరి. శ్రామిక మహిళలకు గర్భసంచి తొలగించటం వలన తగిన విశ్రాంతి తీసుకోకుండానే తిరిగి శ్రమశక్తి చేయటంతో అనేక అనారోగ్యాలకు గురికావడం ఒక్కొక్కప్పుడు ప్రాణాలకే ముప్పు రావటం ఆమెను కదిలించింది.
గర్భధారణను మించిన ప్రయోజనం గర్భసంచి కి ఉందని అది అవసరం తీరాక విసిరి పారేసే అవయవం కాదని నమ్మిన డా.కామేశ్వరి దీనిపై సవివరంగా మొట్టమొదటి పరిశోధనాత్మక గ్రంథంగా "గర్భసంచిని కాపాడుదాం,సమాజాన్ని బలపరుద్దాం" అనే గ్రంథాన్ని వెలువరించారు.
2001లో డా. కామేశ్వరీ, డా.సూర్యప్రకాష్ దంపతులు మొదట గర్భస్రావాల పైన పనిచేయడం మొదలుపెట్టినప్పుడే సంతానలేమి,దానిని బలహీనతగా తీసుకొని జరుగుతోన్న సంతానసాఫల్య వైద్యశాలల వ్యాపారధోరణి గురించి కూడా ఆలోచించటం మొదలుపెట్టారు.
నిత్యజీవితంలో మనం వాడే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చి వేలాది మహిళలకు మాతృత్వపు మధురిమను పంచుతున్న అమృతమూర్తి డా.కామేశ్వరి . స్త్రీల ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఈ రెండు అంశాల గురించి నిస్వార్థంగా కృషి చేస్తున్న డా. సామవేదం వెంకట కామేశ్వరి గారు ‘మొదటి ఇల్లు’ శీర్షిక తో ‘గర్భసంచి’ పట్ల విశేషమైన అవగాహన అందించారు. గర్భసంచే మన తొలి ఇల్లు కాబట్టి ఆ దిశలో ప్రజల్ని చైతన్యం కలిగించారు.
డా.కామేశ్వరి స్వభావం ఎప్పటికప్పుడు స్త్రీల ఆరోగ్యసమస్యల్ని పరిశోధనాత్మక దృక్పధంతో నిరంతరం పరిష్కరించటానికే కాకుండా ఆ సమస్యలపట్ల అవగాహన కల్పించి జాగృతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.అప్పటినుండి తన దగ్గరకు చికిత్సకోసం వచ్చిన మహిళలను కేవలం చికిత్స చేసి పంపేయటం కాకుండా తల్లిలా అక్కున చేర్చుకుని శారీరకంగానే కాక మానసికంగా, కుటుంబపరంగా తగిన సహకారం అందిస్తున్నారు. వారి ఆరోగ్యం సమస్యలనన్నింటినీ నమోదు చేసుకుని ఎక్కువ మందికి అందాలంటే పుస్తకరూపంలో తీసుకు రావటానికి కలంపట్టటం మొదలుపెట్టారు.
ఈసారి ఆమె ఎంచుకున్న అంశం సంతానసాఫల్యం గురించి.ఇటీవల కుప్పలు తెప్పలుగా సంతానసాఫల్యకేంద్రాలు వెలుస్తున్నాయి.కొన్ని కుటుంబాల్లో పెళ్ళైన ఏడాది నుండీ గర్భం రానందుకు కంగారు పడటమే కాకుండా ఇంటాబయటా ప్రశ్నలు ఎదుర్కొంటుంటారు.అటువంటి వారిని ఆ సంతానసాఫల్యకేంద్రాలు ఆకర్షించి మూలకారణాలు అన్వేషించకుండానే చికిత్స మొదలు పెట్టేస్తారు.దానితో తదనంతరం ఆర్థికపరమైన ఇబ్బందులేకాక ఆ చిన్నితల్లులు అనేక అనారోగ్యాలకు పాల్పడటం సంభవిస్తుంది.
సంతానం కానివారిలో 92 శాతం మందికి చిన్నచిన్న ప్రక్రియలతోనే ప్రాధమిక స్థాయి,మధ్యమస్థాయి క్లినిక్ లోనే ఫలితాలు లభిస్తాయి అంటారు కామేశ్వరి.
వీటన్నింటినీ గమనించి కామేశ్వరి గారు తనదైన పధ్దతిలో దంపతులను కూర్చోబెట్టుకుని వారిని మానసికంగా, శారీరకంగా తన వైద్యానికి సానుకూలంగా తయారుచేసి వేలసంఖ్యలో పిల్లలు కలిగేలా చేసారు.తన అనుభవాలూ తన పరిశోధనలనూ,తన పరిశీలనలనూ అన్ని కోణాల్లో క్రోడీకరించి మధుమాలతి అనే పుస్తకాన్ని రాసారు డా.కామేశ్వరి.
స్త్రీ పురుషుల పేర్లు కలిసిన ఒక పువ్వు పేరును శీర్షికగా తీసుకుని,అదే పువ్వుని ముఖచిత్రంగా వేసి ఈ పుస్తకం తేవటం లో డా.కామేశ్వరి గారికి పూలపైనా,సున్నితమైన పూలలాంటి పాపలపైనా గల ప్రేమ వ్యక్తమౌతుంది.
మధుమాలతి పుస్తకం లోని విషయాల్ని సవివరంగా విశదీకరించేందుకు పదకొండు అధ్యాయాలు గా విభజించారు.ప్రతీ అధ్యాయానికీ వివరణాత్మకంగా అందరికీ అర్థమయ్యేలా ఫుట్ నోట్స్ ఇచ్చారు.
ముఖ్యంగా కొన్నిదిగువ, మధ్యతరగతి కుటుంబాలలో సంతానం కలగకపోవటాన్ని దోషంగా పరిగణిస్తారు.కుటుంబంలోవారంతా ఆ స్త్రీని దోషిగా పనికిరాని వస్తువులా చూస్తారు.అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కామేశ్వరి గారు ఆత్మీయంగా అక్కున చేర్చుకుని వారికి తగిన వైద్యం చేసి వారి ఒడిని పసిపాపతో నింపిన సందర్భాలు ఎన్నో.సంతానాభిలాషతో వచ్చిన దంపతులను నాలుగు రకాల కేసులు గా విభజించి తగిన విధంగా అవగాహన కల్పిస్తుంటారు.
గ్రామాలనుండి వచ్చినవారిని,చాలాకాలం తర్వాత గర్భం నిలిచిన వారినీ తమ కేంద్రమైన 'అందరియిల్లు'లో ఆశ్రయం కల్పించి తగిన విశ్రాంతి గా ఉండేలా ఆరోగ్యకర ఆహారం అందజేసినట్లు తెలియజేసారు.
అటువంటి అనేక సంఘటనలను సమయానుకూలంగా ఈ పుస్తకంలో కేస్ స్టడీలుగా పొందుపరిచారు.ఈ విధమైన కేస్ స్టడీలను ప్రతీ చాప్టర్ లోనూ సమయానుకూలంగా పొందుపరచటం కామేశ్వరి గారి రచనావివేకాన్ని తెలియజేస్తుంది. ఒక శాస్త్రగ్రంధం చదవటానికి అందులో ఆసక్తి లేనివారు ఇచ్చగించరు.కానీ ఆ కేస్ స్టడీస్ ను కూడా ఆలోచన కలిగించే విషయాలతో చక్కని రచనాశైలితో సరళమైన భాషలో ఆసక్తి దాయకంగా రాయటం చదువుతుంటే కామేశ్వరిగారు రాసిన ఒక విజ్ణానాత్మకమైన నవల చదివిన అనుభూతి కలుగుతుంది.
మధుమాలతి పుస్తకంలో అవసరమైన చోట్ల చిత్రాలతో వివరించారు
స్త్రీలలో గానీ, పురుషులలో గానీ పునరుత్పత్తి కి అవరోధాలు కలిగిస్తూన్న అంశాల్ని సోదాహరణంగా చెప్పారు."సంతానం కలగని వందమంది లో ముగ్గురికి మాత్రమే సంతానం కలగకుండా చేసే కారణాలను ఐవీఎఫ్ సహాయంతో పరిష్కరించుకోవచ్చు.అంతేకానీ ఏదో వస్తువు కొనుక్కున్నట్లుగా తొందరపాటుతోఐవిఎఫ్ చేయించుకోటానికి వెళ్ళవద్దు" అంటారు కామేశ్వరి .ఐవీఎఫ్ చేయించుకోవటం అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయం గా కాకూడదు . స్త్రీల గర్భంపై, ఆరోగ్యంపై దాడిగా మారుతోన్న పునరుత్పత్తి సమస్యపై డా.కామేశ్వరి గారు రాసిన మధుమాలతి పుస్తకం ఒక సమగ్ర పరిశోధనాత్మక గ్రంథం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది కేవలం వైద్యశాస్త్ర అవగాహనా గ్రంధం గానే చూడకూడదు.ఇందులోని రచనాశైలి,భాష, వాక్యనిర్మాణం ఒక సాహిత్య గ్రంథంగాను పాఠకులను ఆకట్టుకుంటుంది.
గల్లీకొకటిగా పెరిగిపోతున్న సంతానసాఫల్య కేంద్రాలు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడికేంద్రాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో డా. కామేశ్వరి గారు రాసిన మధుమాలతి పుస్తకం దంపతులకు పెద్దబాలశిక్ష లా ఉపయోగపడి ఆరోగ్యవంతులైన బిడ్డల్ని సమాజానికి అందించేందుకు తప్పక ఉపయోగ పడుతుంది.ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కి కూడా అనువాదం అయితే మరింతగా అందరికీ అందుబాటులోకి వస్తుంది.
ఈ పుస్తకం కావాలనుకునే వారు lifehrg@gmail.com,
kameswariv@gmail.com
మెయిల్ చేస్తే ఉచితంగానే అందుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి