28, మార్చి 2023, మంగళవారం
భేటీ పడావో ( పసితల్లి)
బేటీ పడావో!!!( పసితల్లి)
బుజ్జిచెల్లి నిద్రలో ఉంది
పొద్దుటేల అమ్మ
పనికి పోయిన కాడ్నుంచీ
పాలకోసం ఏడ్సేడిసి
సొమ్మసిల్లి నాది
అమ్మెన్నడు వత్తాదో
పక్కింటి లచ్చిమి
పలక పట్టుకొచ్చి పిలిసినాది
బడికి ఎల్పోదాం రమ్మనీ
చెల్లిని నేనెత్తుకోలేననో
జార్చి పడేత్తాననో మరి
అమ్మ నాఈపుకి కట్టిన చెల్లి
నాపాలిట ఉప్పు మూటైనాది
అమ్మెన్నడు వత్తాదో?
అమ్మ లాగే నేను కూడా
వదిలేసి పోతానేమోనని
ముందే చెప్పులేసినాది
అంతకు ముందే బుజ్జి కళ్ళపై
నిదురమ్మ వచ్చి వాలింది
ఆడించటానికి పట్టుకున్న
ఆరెంజ్ బంతి మాత్రం
నా అరచేతిలోనే కూసుంది.
అమ్మెన్నడు వత్తాదో?
బుజ్జిచెల్లి నిద్రలో ఉంది
నేను కదిల్తే కళ్ళు తెరుత్తాదేటో
నేనుకూడా అలసినచూపుల్ని
గుమ్మానికి తగిలించి
గోడకి నడుమానించి
అలాగే ఇంకా...ఇంకా అలాగే
కాసుక్కూచున్నాను.
అమ్మెన్నడు వత్తాదో?
డా.ఎస్.వి.కామేశ్వరి గారి పుస్తకం - మధుమాలతి
~~ సంతాన సాఫల్యాన్ని పరిమళించిన 'మధుమాలతి'~~
డా.సామవేదం వెంకట కామేశ్వరి సుమారు పాతికేళ్ళుగా భర్త డా.వింజమూరి సూర్యప్రకాష్ గారు చేసే సామాజిక సేవారంగంలో చేదోడు వాదోడుగా ఉంటూనే వైద్యరంగంలో జరుగుతోన్న అమాయక పేదవాళ్ళపట్ల జరుగుతోన్న కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీని గమనించారు.
స్త్రీలు ఏమైనా సమస్యలతో హాస్పిటల్స్ కు వెళ్తే వాళ్ళకు ఉండే తెల్లకార్డు చాటున అమానుషంగా తొలగిస్తున్న గర్భసంచుల గురించి నేటికీ అలుపెరుగకుండా పోరాడిన సాహసి డా.కామేశ్వరి. శ్రామిక మహిళలకు గర్భసంచి తొలగించటం వలన తగిన విశ్రాంతి తీసుకోకుండానే తిరిగి శ్రమశక్తి చేయటంతో అనేక అనారోగ్యాలకు గురికావడం ఒక్కొక్కప్పుడు ప్రాణాలకే ముప్పు రావటం ఆమెను కదిలించింది.
గర్భధారణను మించిన ప్రయోజనం గర్భసంచి కి ఉందని అది అవసరం తీరాక విసిరి పారేసే అవయవం కాదని నమ్మిన డా.కామేశ్వరి దీనిపై సవివరంగా మొట్టమొదటి పరిశోధనాత్మక గ్రంథంగా "గర్భసంచిని కాపాడుదాం,సమాజాన్ని బలపరుద్దాం" అనే గ్రంథాన్ని వెలువరించారు.
2001లో డా. కామేశ్వరీ, డా.సూర్యప్రకాష్ దంపతులు మొదట గర్భస్రావాల పైన పనిచేయడం మొదలుపెట్టినప్పుడే సంతానలేమి,దానిని బలహీనతగా తీసుకొని జరుగుతోన్న సంతానసాఫల్య వైద్యశాలల వ్యాపారధోరణి గురించి కూడా ఆలోచించటం మొదలుపెట్టారు.
నిత్యజీవితంలో మనం వాడే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చి వేలాది మహిళలకు మాతృత్వపు మధురిమను పంచుతున్న అమృతమూర్తి డా.కామేశ్వరి . స్త్రీల ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఈ రెండు అంశాల గురించి నిస్వార్థంగా కృషి చేస్తున్న డా. సామవేదం వెంకట కామేశ్వరి గారు ‘మొదటి ఇల్లు’ శీర్షిక తో ‘గర్భసంచి’ పట్ల విశేషమైన అవగాహన అందించారు. గర్భసంచే మన తొలి ఇల్లు కాబట్టి ఆ దిశలో ప్రజల్ని చైతన్యం కలిగించారు.
డా.కామేశ్వరి స్వభావం ఎప్పటికప్పుడు స్త్రీల ఆరోగ్యసమస్యల్ని పరిశోధనాత్మక దృక్పధంతో నిరంతరం పరిష్కరించటానికే కాకుండా ఆ సమస్యలపట్ల అవగాహన కల్పించి జాగృతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.అప్పటినుండి తన దగ్గరకు చికిత్సకోసం వచ్చిన మహిళలను కేవలం చికిత్స చేసి పంపేయటం కాకుండా తల్లిలా అక్కున చేర్చుకుని శారీరకంగానే కాక మానసికంగా, కుటుంబపరంగా తగిన సహకారం అందిస్తున్నారు. వారి ఆరోగ్యం సమస్యలనన్నింటినీ నమోదు చేసుకుని ఎక్కువ మందికి అందాలంటే పుస్తకరూపంలో తీసుకు రావటానికి కలంపట్టటం మొదలుపెట్టారు.
ఈసారి ఆమె ఎంచుకున్న అంశం సంతానసాఫల్యం గురించి.ఇటీవల కుప్పలు తెప్పలుగా సంతానసాఫల్యకేంద్రాలు వెలుస్తున్నాయి.కొన్ని కుటుంబాల్లో పెళ్ళైన ఏడాది నుండీ గర్భం రానందుకు కంగారు పడటమే కాకుండా ఇంటాబయటా ప్రశ్నలు ఎదుర్కొంటుంటారు.అటువంటి వారిని ఆ సంతానసాఫల్యకేంద్రాలు ఆకర్షించి మూలకారణాలు అన్వేషించకుండానే చికిత్స మొదలు పెట్టేస్తారు.దానితో తదనంతరం ఆర్థికపరమైన ఇబ్బందులేకాక ఆ చిన్నితల్లులు అనేక అనారోగ్యాలకు పాల్పడటం సంభవిస్తుంది.
సంతానం కానివారిలో 92 శాతం మందికి చిన్నచిన్న ప్రక్రియలతోనే ప్రాధమిక స్థాయి,మధ్యమస్థాయి క్లినిక్ లోనే ఫలితాలు లభిస్తాయి అంటారు కామేశ్వరి.
వీటన్నింటినీ గమనించి కామేశ్వరి గారు తనదైన పధ్దతిలో దంపతులను కూర్చోబెట్టుకుని వారిని మానసికంగా, శారీరకంగా తన వైద్యానికి సానుకూలంగా తయారుచేసి వేలసంఖ్యలో పిల్లలు కలిగేలా చేసారు.తన అనుభవాలూ తన పరిశోధనలనూ,తన పరిశీలనలనూ అన్ని కోణాల్లో క్రోడీకరించి మధుమాలతి అనే పుస్తకాన్ని రాసారు డా.కామేశ్వరి.
స్త్రీ పురుషుల పేర్లు కలిసిన ఒక పువ్వు పేరును శీర్షికగా తీసుకుని,అదే పువ్వుని ముఖచిత్రంగా వేసి ఈ పుస్తకం తేవటం లో డా.కామేశ్వరి గారికి పూలపైనా,సున్నితమైన పూలలాంటి పాపలపైనా గల ప్రేమ వ్యక్తమౌతుంది.
మధుమాలతి పుస్తకం లోని విషయాల్ని సవివరంగా విశదీకరించేందుకు పదకొండు అధ్యాయాలు గా విభజించారు.ప్రతీ అధ్యాయానికీ వివరణాత్మకంగా అందరికీ అర్థమయ్యేలా ఫుట్ నోట్స్ ఇచ్చారు.
ముఖ్యంగా కొన్నిదిగువ, మధ్యతరగతి కుటుంబాలలో సంతానం కలగకపోవటాన్ని దోషంగా పరిగణిస్తారు.కుటుంబంలోవారంతా ఆ స్త్రీని దోషిగా పనికిరాని వస్తువులా చూస్తారు.అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కామేశ్వరి గారు ఆత్మీయంగా అక్కున చేర్చుకుని వారికి తగిన వైద్యం చేసి వారి ఒడిని పసిపాపతో నింపిన సందర్భాలు ఎన్నో.సంతానాభిలాషతో వచ్చిన దంపతులను నాలుగు రకాల కేసులు గా విభజించి తగిన విధంగా అవగాహన కల్పిస్తుంటారు.
గ్రామాలనుండి వచ్చినవారిని,చాలాకాలం తర్వాత గర్భం నిలిచిన వారినీ తమ కేంద్రమైన 'అందరియిల్లు'లో ఆశ్రయం కల్పించి తగిన విశ్రాంతి గా ఉండేలా ఆరోగ్యకర ఆహారం అందజేసినట్లు తెలియజేసారు.
అటువంటి అనేక సంఘటనలను సమయానుకూలంగా ఈ పుస్తకంలో కేస్ స్టడీలుగా పొందుపరిచారు.ఈ విధమైన కేస్ స్టడీలను ప్రతీ చాప్టర్ లోనూ సమయానుకూలంగా పొందుపరచటం కామేశ్వరి గారి రచనావివేకాన్ని తెలియజేస్తుంది. ఒక శాస్త్రగ్రంధం చదవటానికి అందులో ఆసక్తి లేనివారు ఇచ్చగించరు.కానీ ఆ కేస్ స్టడీస్ ను కూడా ఆలోచన కలిగించే విషయాలతో చక్కని రచనాశైలితో సరళమైన భాషలో ఆసక్తి దాయకంగా రాయటం చదువుతుంటే కామేశ్వరిగారు రాసిన ఒక విజ్ణానాత్మకమైన నవల చదివిన అనుభూతి కలుగుతుంది.
మధుమాలతి పుస్తకంలో అవసరమైన చోట్ల చిత్రాలతో వివరించారు
స్త్రీలలో గానీ, పురుషులలో గానీ పునరుత్పత్తి కి అవరోధాలు కలిగిస్తూన్న అంశాల్ని సోదాహరణంగా చెప్పారు."సంతానం కలగని వందమంది లో ముగ్గురికి మాత్రమే సంతానం కలగకుండా చేసే కారణాలను ఐవీఎఫ్ సహాయంతో పరిష్కరించుకోవచ్చు.అంతేకానీ ఏదో వస్తువు కొనుక్కున్నట్లుగా తొందరపాటుతోఐవిఎఫ్ చేయించుకోటానికి వెళ్ళవద్దు" అంటారు కామేశ్వరి .ఐవీఎఫ్ చేయించుకోవటం అనేది ఒకరి వ్యక్తిగత నిర్ణయం గా కాకూడదు . స్త్రీల గర్భంపై, ఆరోగ్యంపై దాడిగా మారుతోన్న పునరుత్పత్తి సమస్యపై డా.కామేశ్వరి గారు రాసిన మధుమాలతి పుస్తకం ఒక సమగ్ర పరిశోధనాత్మక గ్రంథం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది కేవలం వైద్యశాస్త్ర అవగాహనా గ్రంధం గానే చూడకూడదు.ఇందులోని రచనాశైలి,భాష, వాక్యనిర్మాణం ఒక సాహిత్య గ్రంథంగాను పాఠకులను ఆకట్టుకుంటుంది.
గల్లీకొకటిగా పెరిగిపోతున్న సంతానసాఫల్య కేంద్రాలు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడికేంద్రాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో డా. కామేశ్వరి గారు రాసిన మధుమాలతి పుస్తకం దంపతులకు పెద్దబాలశిక్ష లా ఉపయోగపడి ఆరోగ్యవంతులైన బిడ్డల్ని సమాజానికి అందించేందుకు తప్పక ఉపయోగ పడుతుంది.ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కి కూడా అనువాదం అయితే మరింతగా అందరికీ అందుబాటులోకి వస్తుంది.
ఈ పుస్తకం కావాలనుకునే వారు lifehrg@gmail.com,
kameswariv@gmail.com
మెయిల్ చేస్తే ఉచితంగానే అందుతుంది.
18, మార్చి 2023, శనివారం
బహుళ పత్రిక లో ముఖాముఖి
బహుళ కోసం ముఖాముఖి
మీ గురించి పరిచయ వాక్యాలు…..
నేను విజయనగరంలో1949, డిసెంబర్ 19 న జన్మించాను.రాజరాజేశ్వరమ్మ,కొడవంటి మల్లిఖార్జున స్వామి నా తల్లిదండ్రులు.నాకు ఇద్దరు అక్కలు.ఇద్దరు అన్నలు.BSc డిగ్రీ విజయనగరంలో. తర్వాత MA(తెలుగు),MSc(గణితం),BEd ఉస్మానియా విశ్వవిద్యాలయం లో చేసి RTC High School లో గణితోపాధ్యాయినిగా పనిచేసి ప్రధానోపాధ్యాయురాలిగా పదవీవిరమణ చేసాను.
1.మీ సాహిత్య నేపథ్యం?
నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే మా పెద్దక్కయ్య పి.సరళాదేవి కి వివాహం జరిగింది.అక్క సోవియట్ లాండ్ ప్రచురించే పిల్లలబొమ్మలపుస్తకాలు నాకోసం తేవటం వలన వాటిని చదువుతూ బొమ్మలు వేయటం అలవాటైంది. ఆమె తెలుగు స్వతంత్రలో విరివిగా రచనలు చేసేది.మాలతీచందూర్, పి.శ్రీదేవి, రామలక్ష్మిల సమకాలీనురాలు. డా.శ్రీదేవి అక్కకు మంచి మిత్రురాలు.నేను కుటుంబ పరిస్థితులవలన ఎనిమిదవతరగతితో చదువు మానేసి ఏడాది పాటు అక్క ఇంట్లో ఉన్నప్పుడు బడికి వెళ్ళకపోవటం వలన అక్క ఇంట్లోని గ్రంథాలయం లో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్థం అయినా కాకపోయినా విరివిగా చదివాను.నేను రచయిత్రీగా మారటానికి దోహదం చేసింది అక్క వాళ్ళింట్లో ఉన్న సమయమే అనుకుంటాను.
మా పెద్దన్నయ్య కొడవంటి లీలామోహనరావు భారతిలో వ్యాసాలు రాసేవాడు. నా కవితలు కూడా ఆంగ్లం లోకి అనువదించాడు. మా చిన్నన్నయ్య కొడవంటి కాశీపతిరావు కూడా కథకుడు 1965 నుండీ 85 లవరకు అన్ని పత్రికలలో విస్తృతం గా కథలు రాసాడు. చదువుకోకుండా కథలు రాస్తున్నానని మందలిస్తారని నేను కథలూ కవితలు రాసినా పుస్తకాల అడుగున పడేసేదాన్ని.
1970 లో నా మొదటి కథ ప్రచురితమైంది. వివాహనంతరం డిగ్రీ పూర్తిచేసాక 1972 లో హైదరాబాద్ లో అడుగు పెట్టాను. వీర్రాజు గారితో ముఖచిత్రాలు వేయించుకోటానికి కవులెందరో రావటం, ఇంట్లో ఎక్కువగా కవితాసంపుటాలు ఉండటం ,ఇంట్లో తరుచు కుందుర్తి గారి అధ్వర్యం లో కవితగోస్ఠులు జరగటం తో నాకు కవిత్వరచన పట్ల ఆసక్తి పెరిగింది.
2.మీ సాహిత్యంలో ప్రధానాంశాలు?
నా రచనల్లో అంశం సింహభాగం స్త్రీ జీవితచిత్రణ మే.ఎక్కువగా బీద,బలహీనవర్గాల మహిళలు జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక,రాజకీయ, సామాజిక సమస్యలే ప్రధానంగా ఉంటాయి.ఆర్ధికకారణాలవలనకానీ ,వివక్ష వలన కానీ ఆడపిల్లలు చదువులకు దూరం కావటం తదితర సమస్యలను అక్షరీకరించాను.ఏది రాసినా నేను ఉద్యోగజీవితంలోగానీ,సమాజంలో గానీ పరిసరాల్లో గమనించినవీ,చూసినవీ ,పరిశీలించినవే నాదైన పద్ధతిలో రాస్తాను తప్ప నేలవిడిచి సాముచేయను.
3.మీరు ఏ ఏ ప్రక్రియల్లో రాశారు?
కవిత్వం,కథలు,నవలిక, వ్యాసాలు, మోనోగ్రాఫ్ లు రాసాను.కవిత్వంలో మూడు దీర్ఘకవితలు రాసాను.
4.మీకు ఇష్టమైన ప్రక్రియ ఏది?
చెప్పాలనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పటానికి వీలౌతుంది కనుక కవిత్వరచనే నాకు ఇష్టమైన ప్రక్రియ
5.మీకు ఇష్టమైన రచనలేవి?
&
6.మీకు స్ఫూర్తిదాయకమైన రచనలు?
నాకు బాల్యం నుండీ స్పూర్తి ఇచ్చినవి రంగనాయకమ్మ రచనలు, కొడవటిగంటి కుటుంబరావుకవిత్వంలో శ్రీశ్రీ కవిత్వంలోని పదును,కుందుర్తి కవిత్వం లోని సరళత, లలిత సంగీతం ఇష్టం కనుక కృష్ణశాస్త్రి గేయంలోని లాలిత్యం నాకు ఇష్టమైనవి.
7.మీ రచనలకు ప్రేరణ?
ఈరోజుల్లో మనచుట్టూ ఎన్నో సంక్షోభాలూ సంఘర్షణలు,సందిగ్ధాలూ, వివక్షలూ మననీ,సమాజాన్నీ కల్లోలపరిచే సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో అక్షర రూపం కల్పించేవరకూ వెంటాడుతునే ఉన్నాయి కదా.వాటినన్నింటినీ చాలావరకూ అక్షరబద్ధం చేసాను.
8.మీ కుటుంబ నేపథ్యం?
నాది అందమైన బాల్యం కాదండీ.నా పదో ఏట నాన్నగారు చనిపోగా నలుగురు పిల్లలతో అమ్మ తీవ్ర ఆర్ధిక సంక్షోభం తో బతుకు పోరాటం మొదలు పెట్టింది.నా చదువు అంచెలంచెలుగా కొనసాగింది.
డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మేనత్తకొడుకు కవి ,రచయిత,చిత్రకారుడూ ఐన శీలావీర్రాజుతో దేవి పేరు తో సాహిత్య పరమైన ఆసక్తితో కలం స్నేహం కొన్నాళ్ళు నడిచింది.తర్వాత మా ఇష్టప్రకారం,పెద్దల అంగీకారం తో బహుభాషాకోవిదుడు రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యం లో సభావివాహం జరిగింది.
బియస్సీ పూర్తి చేసుకున్నాక హైదరాబాద్ లో అడుగుపెట్టాను.చిన్నప్పుడు ఎదుర్కొన్న చదువుకు వచ్చిన అవరోధాల వలన నాకు ఉన్నత చదువులు చదవాలనీ,ఉద్యోగం చేసి ఆర్ధికస్వావలంబన సాధించాలనే కోరిక కుటుంబ ఒత్తిళ్ళలో వెంటనే కుదరక పోయిన తర్వాత్తర్వాత ఎమ్మేతెలుగు,ఎమ్మెస్సీ గణితం పట్టాలతోబాటూ బియిడీ చేసి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయిని గా చేరి పాతికేళ్ళ సర్వీసుచేసి ప్రధానోపాధ్యాయినిగా పదవీ విరమణ చేసాను.
నా భర్త శీలా వీర్రాజు కవి,కథకుడు, నవలాకారుడు, చిత్రకారుడు.మా అమ్మాయి పల్లవి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి కొంతకాలంగా పుస్తకాలకు ముఖచిత్రాలు, అప్పుడప్పుడు కవితలు రాస్తుంది.మా మనవరాలు ఆశ్లేష తెలుగు, ఇంగ్లీష్, సాహిత్యం బాగా చదువుతుంది.
9.మీ వృత్తి నేపథ్యం?
నేను ఆర్టీసి ఉన్నత పాఠశాల లో గణితోపాధ్యాయినిగా పనిచేసి ప్రధానోపాధ్యాయురాలిగా పదవీవిరమణ చేసాను.ఆ అనుభవంతోనే ఇస్కూలుకతలు రాసాను.ఇందులో పేదపిల్లలచదువుల అవరోధాలకు నేపథ్యాలు, కారణాలు ,స్కూల్ జరిగే అవకతవకలు,ఎయిడెడ్ పాఠశాలల పట్ల ప్రభుత్వవివక్ష మొదలైనవన్నీ కథలుగారాసాను.ఇవి తెలుగు విద్యార్థి పత్రికలో రెండున్నర సంవత్సరాల పాటు ధారావాహికగా వచ్చాయి.ఇందులోని ఒక కథ మహారాష్ట్ర ప్రభుత్వం ఏడవతరగతికి ద్వితీయభాష తెలుగువాచకం లో పాఠ్యాంశంగా చేర్చింది.
10.కుటుంబము - ఉద్యోగము - సాహిత్యము : వీటిని ఏవిధంగా బ్యాలెన్స్ చేసుకో గలిగారు?
పెళ్ళయ్యాక ఉమ్మడి కుటుంబంలో తీరిక చిక్కినప్పుడే రచనలు చేసేదాన్ని. డిగ్రీ అయిన తర్వాత పదేళ్లకు బియిడీ చేసి ఉద్యోగంలో చేరాను.అప్పటికే రెండు కవితా సంపుటాలు వచ్చాయి.ఇంటిపనుల్లోనూ,ఉద్యోగం బాధ్యతలు లోనూ నా లోలోపల సంఘర్షణలు అక్షరాల్ని అల్లుకోవటం మానలేదు.ఎప్పుడో ,ఏఅర్థరాత్రో పేపరు మీదకు అవి చేరేది.సమయాభావంవల్లే ఎక్కువగా కవితలే రాసాను.
11.మీరు ఎటువంటి వివక్షనైనా ఎదుర్కొన్నారా?
నేను చదువుకునే రోజుల్లో కుల,ప్రాంత వివక్షలు అంతగా లేవేమో అనిపిస్తుంది.రాజకీయనాయకులు తమస్వార్థం కోసం మరింతగా జ్వలింపజేసారు.జండర్ వివక్ష పనివిభజనలో,పెంపకాలలోనే ఉండేవి కదా.ఉద్యోగాలలో సరేసరి.అప్పుడప్పుడు మనసు నొచ్చుకున్నా నన్ను నేను ఎప్పటికప్పుడు చెక్కుకుంటూ ఎదగటానికే ప్రయత్నించాను.
12.మీరచనల గురించి చెప్పండి?
ఆకలినృత్యం (1980)
మోళి(1982)
తెగినపేగు(1986)
ఆవిష్కారం(1986)
ఒప్పులకుప్ప1992)
యుద్ధం ఒక గుండెకోత(2001)
ఏకాంత సమూహాలు(2004)
బతుకుపాటలో అస్తిత్వరాగం (2009)
నా ఆకాశం నాదే (2016)తొమ్మిది కవితా సంపుటాలు
శీలా సుభద్రాదేవి సమగ్రకవిత్వం (1975-2009)
యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కావ్వానికి
1.యుధ్ధం ఏక్ దిల్ కి వ్యధ (హిందీ2018)
2.War,A Heart's ravege(ఆంగ్లానువాదం2001)
3.Ullak kumural(తమిళానువాదం2020)
4. Dance of a Hunger(anthology of poems2021)
1.దేవుడుబండ(1990)
2.రెక్కలచూపు(2007)
3.ఇస్కూలుకతలు(2018)మూడు కథా సంపుటాలు,
4.నీడలచెట్టు నవలిక,
ఇతరములు:
1.నాముందుతరం రచయిత్రుల కథల గురించి రాసిన 25 వ్యాసాల సంపుటి " కథారామం లో పూలతావులు"
2.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ ( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ2015)
3.నిడదవోలు మాలతి రచనా సౌరభాలు (2022)
సంపాదకత్వం:
1.ముద్ర (వనితల కవితల సంకలనం భార్గవీరావుతో సంపాదకత్వం2001)
2.వాళ్ళు పాడిన భూపాలరాగం (డా.పి.శ్రీదేవికథలు2022)
3.యాభై ఏళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు(2022)
4.మధుకలశమ్(డా.పి.శ్రీదేవి కవిత్వం)
13.మీకు నచ్చిన మీ రచనలు?
నిజానికి మనం కన్న పిల్లలలో ఎవరు ఇష్టం అంటే చెప్పటం ఎంతకష్టమో .ఇష్టమైన రచనల్ని చెప్పటం కూడా అంతేకష్టం.
యుధ్ధం ఒక గుండె కోత దీర్ఘ కావ్యం నాకు బాగా నచ్చిన రచన.అమెరికా ఆఫ్ఘన్ యుధ్ధం నేపధ్యం లో మాతృదృక్పధంతో రాసినది.ఇది మూడు భాషల్లో అనువాదమై పుస్తకం రూపంలో వచ్చాయి.దీనిపై MKU లో నాగలక్ష్మి అనే అమ్మాయి MPhil పరిశోధన చేసింది.దీర్ఘకావ్యం రాసిన మొదటి కవయిత్రిగా నన్ను విమర్శకులు పేర్కొన్నారు.
14.రచన వ్యాసాంగంలో ఎదుర్కొన్న సమస్యలు ?
ప్రధానంగా తొలిరోజుల్లో ఉమ్మడి కుటుంబం వల్ల, ఆతర్వాత ఉద్యోగం బాధ్యతలో రచనా వ్యాసంగం కొరకు సమయాన్ని సమకూర్చుకోవడం కష్టమయ్యేది.ఇప్పడు అలవాటైపోయింది.
15. మీరు అందుకున్న గౌరవాలు (పురస్కారాలు)?
పురస్కారాలు:::
1.తెలుగువిశ్వవిద్యాలయంనుండి97 లో సృజనాత్మక సాహిత్యానికి పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్
2. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి1999 లో ఉత్తమరచయిత్రి అవార్డ్
3.కడప కవితా సాహిత్య సాంస్కృతిక సంస్థ నుండి రెక్కల చూపు కథలసంపుటికి 2011 లోగురజాడ అవార్డ్
4.ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం.
5.2018లోఉమ్మడిశెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం.
6.2018లోకవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం
7.2018లో"నా ఆకాశం నాదే" కవితా సంపుటి కి గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి మాతృపురస్కారం
8.2022లో సుశీలానారాయణరెడ్డి పురస్కారం
9.2022 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి మాతృపురస్కారం.
10.లేఖిని సాహిత్యసంస్థ నుండి వచ్చే కవిత్వానికి కుసుమారామారావు పురస్కారం చెప్పుకోవాల్సినవి.
16.ప్రస్తుత సాహిత్యంలో రాజకీయాలు ?
ప్రతీ రంగంలోనూ సహజంగానే రాజకీయాలు ఉంటూనే ఉంటాయి.అవి సాహిత్యంలో ఇంకా గ్రూపులు గ్రూపులు గా విస్తరించాయి.
17.బహుళ పాఠకులకు, రచయితలకు మీ సలహాలు సూచనలు?
కవిత్వం,కథలూ, వ్యాసాలు, సమీక్షలు, ఇంటర్వ్యూ లు ఇలా ఎన్నో శీర్షికలతో చాలారచనల్ని పొందుపరచి బహురచనలతో బహుళంగా ఉంటోంది.పాత, కొత్త రచయిత్రులను కూడగట్టటంవలన విభిన్నమైన అంశాల్ని ఆవిష్కరిస్తున్నారు.అందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
18.రేపటి రచయితలకు, వర్ధమాన రచయితలకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
ఇప్పుడు కొత్తగా రాస్తున్నవారికి గాని,రాయాలనుకున్నవారికి గానీ కొత్తగా చెప్పాల్సింది ఏమీలేదు.ఎందుకంటే వాళ్ళంతా విద్యావంతులు.టెక్నాలజీ తెలిసినవారు కావటాన వివిధ ప్రాంతాల,దేశాలరచనలు చదివే అవకాశం ఉంది.అందువలన దృక్పథం విశాలమౌతుంది.అయితే ముందు వారంతా బాగా సాహిత్యం అధ్యయనం చేయాలి.ఏం రాయాలనుకుంటున్నారో ఒక నిబద్ధతనీ, నిజాయితీనీ అలవరుచుకుని రాస్తే మంచిది. రాసినది అలాగే ప్రచురణకి ఇవ్వకుండా పదేపదే చదువుకుని సవరించుకుంటే సాంద్రమైన రచన వెలువడుతుంది.
5, మార్చి 2023, ఆదివారం
ఆధిపత్యాలపై ధిక్కార స్వరం -కె.రామలక్ష్మి
ఆధిపత్యాలపై ధిక్కార స్వరం
రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి , ఒకప్పుడు పద్మావతి విశ్వవిద్యాలయం వీసీగా ఉన్న కోలా రాజ్యలక్ష్మి 1980లలో కలిసి జంటనగరాల్లో రచయిత్రులను కూడగట్టి ఒక్కొక్క నెలా ఒకరి ఇంట్లో కలుసుకొని వస్తున్న సాహిత్యాన్ని గురించి చర్చించేవారు.సీతాదేవిగారివలన నేను అప్పటికి చిరురచయిత్రినే అయినా నన్ను అందులో సాహిత్య చర్చలకు ఆహ్వానించేవారు.కొంతకాలం
తర్వాత ఆసమావేశాలు సఖ్యసాహితి అనే సంస్థ గా పరిణమించాయి .సఖ్యసాహితిలో యశోదా రెడ్డి,ఆనందారామం,తురగా జానకీరాణి వంటి ఒకతరం సాహితీ దిగ్గజాలు ఉండేవారు.అప్పట్లోనే రామలక్ష్మిగారిని మొదటిసారి చూసాను.రామలక్ష్మి గారి స్నేహితులు డా.శాంతగారిని,కల్పకంగారి(ఏచూరి సీతారాం గారి తల్లి)నీ కూడా కలిసాను.
లేఖిని సాహిత్య సంస్థ ఒకసారి తెలుగు విశ్వవిద్యాలయం తో కలిసి రచయిత్రుల రచనల గురించి సదస్సు నిర్వహించాలనుకున్నప్పుడు నేను రామలక్ష్మి గారి కథలగురించి ప్రసంగిస్తానన్నాను.
ఆసందర్భంగా రామలక్ష్మి గారితో ఆవిడ కథలమీద వ్యాసం రాయాలనుకున్నానని చెప్తే చాలా సంతోషపడి రెండు కథలపుస్తకాలు ఇచ్చారు.నేను రచయిత్రుల కథలగురించి రాయాలనుకున్నది,రాసిన మొట్టమొదటి వ్యాసం
రామలక్ష్మి కథలగురించే.వ్యాసం చూపించితే బాగారాసావోయ్ అని ప్రశంసించారు. ఆ తర్వాత నా ముందుతరం ఇరవైరెండు మంది రచయిత్రుల పై వ్యాసాలు రాసి సంపుటీకరించాను.
1950ల్లో సుప్రసిద్ధ సాహిత్య పత్రిక సంపాదకవర్గంలో రామలక్ష్మి ఉండేవారు. అదేకాలంలో మాపెద్దక్కయ్య పి.సరళాదేవి కథలు ఎక్కువగా ఆ పత్రికలో వెలువడేవి .ఆ కారణంగా రామలక్ష్మి కి నేను సరళాదేవి చెల్లెలుగా తెలుసు.
శీలావీర్రాజు భార్యగానూ తెలుసు.
మేము మలకపేటలో ఉన్నప్పుడు మాయింటికి దగ్గరలోనే ఉండేవారు.నేను తరుచూ కలిసేదాన్ని.వాళ్ళింటికింద ఇంట్లో అబాకస్ టీచర్ ఉండేవారు.మా మనవరాలిని అక్కడకి తీసుకు వెళ్ళినప్పుడు క్లాసు అయ్యేవరకూ రామలక్ష్మిగారి దగ్గర కి వెళ్ళే దాన్ని.ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు.ఒక గంట ఎంత తొందరగా గడచిపోయేదో!ఆమె తన తరం వారి గురించి అనర్గళంగా ఎన్నో విషయాలు చెప్తుంటే సమయం తెలిసేది కాదు.
నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీశ్రీ గురించి తాగుబోతు గా చెప్తుంటే బాధకలిగించింది కాని నిజాల్ని ఒప్పుకోవాలి కదా!
ఒకసారి రామలక్ష్మిగారికి పొట్ట ఆపరేషన్ అయ్యిందట.ఆపరేషన్ చేసిన తర్వాత ఆ డాక్టర్ " మీ పొట్టనిండా అక్షరాలే ఉన్నాయని ఆరుద్ర గారు అన్నారు.ఒక్క అక్షరం ముక్కా లేదు రామలక్ష్మిగారూ"
అన్నాడు"అని చెప్తూ నవ్వారు.అదివిన్నాక ఎప్పుడు తలచుకున్నా నవ్వొస్తూ ఉంటుంది
కేంద్ర సాహిత్య అకాడమీ కోసం డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయమని నాకు ఉత్తరం వచ్చినప్పుడు రామలక్ష్మిగారిని కలిసాను.శ్రీదేవి మా పెద్దక్కయ్య కు కుటుంబమిత్రులు.కానీ అక్కయ్యా లేదు కనుక శ్రీదేవి వివరాలు చెప్పగలిగేది రామలక్ష్మి గారే.అదే విషయం ఆమెకు చెప్పి "శ్రీదేవి గురించి మీకు తెలిసిన వివరాలు చెప్తారా" అని అడిగాను.నేను చెప్పేవి నెగెటివ్ గా ఉంటాయి నీకు ఇష్టమేనా అన్నారు.అయితే వద్దులెండి అని వచ్చేసాను.
ఆమెకు పత్రికా రంగంలోనూ,సినిమారంగంలో ను, సామాజిక సేవారంగంలో ను, సాహిత్య రంగంలోనూ, రాజకీయరంగంలోను ఇలా అనేక అనుభవాలు ఉండటంవలన వాటిల్లోని లొసుగుల్ని అనర్గళంగా చెప్పేవారు.ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చకపోయినా ఆమె తన మనసులో మాటను,తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు.తనని అందరూ గయ్యాళి నని అంటారని కూడా తానే నవ్వుతూ చెప్పుకుంటారు.నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు.అందుచేత కొంతమంది ఆమెకు దూరమయ్యారు.నిజానికి ఆమె రచనావ్యాసంగంలో చురుగ్గా ఉన్న ఆకాలంలో ఆయారంగాలలో పురుషాధిక్యత మరింత ఎక్కువ .వాటిని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ధిక్కార స్వరం ఉండక తప్పదేమో.
ప్రతీ ఒక్కరి గురించి అందులోనూ సినీ, సాహిత్య రంగంలో లోని వారి మంచికన్నా వాళ్ళ ప్రవర్తనలోని దుర్గుణాలను వాళ్ళరెండుముఖాలను వేరు చేసి నిర్భయంగా చూపించేవారు.ఆవిడ నెగెటివ్ గానే మాట్లాడుతున్నట్లు అనిపించినా ఆవిడ లోని పాజిటివ్ నెస్ మనం స్పష్టంగా గుర్తించగలం.కదలడానికి కాళ్ళు సహకరించకపోవటంవలన చాలా కాలంగా వీల్ చైర్ కే పరిమితం అయినా అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చినా సాహిత్యం,సినీరంగం పత్రికలూ వీటి గురించి తప్ప తన శారీరక అసహాయత్వం గురించి గానీ ,అనారోగ్యాల గురించి గానీ ఒక్కసారి తలంచేవారు కాదు.ఆ వయసులో కూడా అంత హాస్యంగా,చమత్కారాలతో సానుకూల దృక్పథంతో మాట్లాడటం వలన ఆమెతో మాట్లాడుతున్నంతసేపూ హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజం.
ఒకసారి జూన్ నాలుగు ఆరుద్ర జన్మదిన సందర్భంగా ఆయన పుస్తకం ఆవిష్కరణ అని నాతో సహా ఒక పదిహేను మంది రచయిత్రులను ఇంటికి పిలిచారు.ఆరుద్రగారి పాటలతో కబుర్లతో సందడిగా గడిపాము.
తర్వాత కూడా మరో రెండుసార్లు ఒకరిద్దరు ఆత్మీయులతో కొన్ని గంటలు గడపటం జరిగింది.
పదేళ్ళ క్రితం మేము ఇల్లు మారటంతో రామలక్ష్మి గారిని కలవటం కుదరలేదు.నా వ్యాససంపుటిని ఆమెకు ఇవ్వటానికి వెళ్ళలేక మా అమ్మాయితో పంపాను.అదిఅందుకున్నాక ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు.తర్వాతైనా వెళ్ళాలను కొని కూడా అశ్రద్ధ చేసాను.
ఇప్పుడు ఈ విధంగా రామలక్ష్మి గారితో నా అనుబంధం తలచు కొని ఆమెకు నివాళి సమర్పించ వలసిరావటం బాధాకరం. ఒకతరంలో తన రచనలతో,తన వాగ్ధోరణితో,ఖచ్చితమైన దృక్పథంతో సాహిత్య కళారంగాలలో సంచలనం కలిగించిన సాహితీ దిగ్గజం తరలిపోయింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)