27, ఫిబ్రవరి 2023, సోమవారం

నడక దారిలో --24

నడక దారిలో - 24 ఒకసారి సారస్వత పరిషత్తు లోని సాహిత్య అకాడమీ సమావేశాలకు హాజరై,ఆ తర్వాత శివరాజు సుబ్బలక్ష్మి గారు దగ్గరలోనే ఉన్న మా యింటికి వచ్చారు.ఆమెవస్తే నా చెయ్యి పట్టుకొని మరి వదలరు.ఆమె నాచెయ్యి పట్టుకుంటే నాకు పురిటిగదిలోకి నేను వెళ్తున్నప్పుడు అమ్మ పట్టుకున్నప్పటి స్పర్శ గుర్తు వస్తుంది.చాలా సేపు ఆమెతో కబుర్లు చెప్పుకున్నాం. ఒకసారి మా చిన్నక్క ఉత్తరం రాస్తూ వదిన వల్ల అమ్మ చాలా ఇబ్బంది పడుతుందనీ,కోరుకొండ వచ్చినప్పుడు బతకాలని లేదని బాధ పడిందనీ తనకు అమ్మని చూస్తే ఆందోళనగా ఉందనీ తన దగ్గర ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టం పడటం లేదనీ రాసింది.అది చదివేసరికి నాకు దుఃఖం ముంచుకు వచ్చింది.చిన్నక్కది కులాంతర వివాహం కనుక అతని తరపువాళ్ళు వచ్చినపుడు ఇబ్బంది అని అమ్మ అవసరం అయినప్పుడే వెళ్తుంది.నేను ఉమ్మడి సంసారంతో ఉండటాన నా దగ్గరా ఉండనంటుంది.ఆ రోజంతా అమ్మని తలచుకుని బాధపడ్డాను. నేను చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి అమ్మని నాదగ్గరే ఉంచుకుని చూసుకోవాలని చిన్నప్పటినుండి అనుకునేదాన్ని. రావిశాస్త్రి,బీనాదేవి సాహిత్యం విపరీతంగా చదివి,రంగనాయకమ్మని అవుపోసన పట్టి నన్ను నేను చెక్కుకుని సమాజంలో మార్పు తెచ్చేలా బతకాలని ఎన్నో ఊహించుకుని తీరా అన్నీ మరచిపోయి ఈ పెళ్ళి చేసుకొని వచ్చేసి అమ్మని మళ్ళీ కష్టాలు ఊబిలోనే ఉంచేసానని నన్ను నేను తిట్టుకున్నాను.డిగ్రీ పూర్తి చేయకుండా అర్థాంతరంగా వదిలేసి నా ఆశల్ని ఛిద్రం చేసుకున్నా ననిపించింది.మళ్ళీ మనసు చదువు మీదకు వెళ్ళింది. నేను ఇలా ఉండిపోకూడదు.మళ్ళా నిద్రపోయిన ఆలోచనలు ఆవులిస్తూ లేచాయి. ఉద్యోగం చేయలేక,రచనలు చేసుకోలేక,పాటలూ పాడుకోలేక,చిత్రాలూ వేయక ఇలా స్తబ్దత తో ఉన్నామా,తిన్నామా,పడుకున్నామా అన్నట్లు బతకటం నాకు నిరాశతో మనసంతా నిండిపోతూ ఉండేది. ఇంట్లో నా మరుదులూ, వాళ్ళు మిత్రులూ,చుట్టుపట్లవాళ్ళూ అందరూ నన్ను వదినా అని పిలుస్తూ ఉండేవారు.వీర్రాజుగారు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు నన్ను పేరుతో పిలవటానికి మొగమాటం పడటం,పాప పుట్టాక మా కాంపౌండులో నార్త్ ఇండియన్ వాళ్ళు ' పల్లవి కా మా'అని పిలవటం,నేను కొన్నాళ్ళకు నా పేరేంటో మర్చిపోతానేమోననిపించేది. మార్చిలో మా చిన్నన్నయ్యకీ,చిన్నాడబడుచుకి మేము చేసుకున్నట్లు గానే కుందుర్తి ఆంజనేయులు గారి అధ్వర్యంలో సభావివాహం హైదరాబాద్ లోనే జరిగింది.ఆమె వెళ్ళిపోయాక ఇంటి బాధ్యత పూర్తి గా నాదే అయ్యింది.మా ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండే అతనికి బదిలీ కావటంతో వెళ్ళిపోయాడు.ఇప్పుడు నాకోసం కొంతైనా సమయం మిగుల్చుకోవాలనుకున్నాను. సాహిత్య అకాడమీ సమావేశాలకు హాజరు అయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఉప్పల లక్ష్మణరావు గారూ,మధురాంతకం రాజారాం గారూ మాయింటికి భోజనానికి వచ్చారు.అంతకు ముందు నేను రాసిన కథ గురించి అభినందిస్తూ ఉత్తరం రాసిన లక్ష్మణరావు గారు మరోసారి కథ గురించి చాలాసేపు మాట్లాడి బాగారాస్తున్నాననీ ఇంకా రాయమని ప్రోత్సహించారు.అది విన్న వీర్రాజు గారు తర్వాత 'నన్ను కథలు రాయటం మానేసావెందుకు' అని మందలించారు. ఏం చెప్పలేక నేను నవ్వి ఊరుకున్నాను. కానీ నేను హైదరాబాద్ వచ్చాక రాసినది ఏదీలేదు అంతకుముందు రాసి పత్రికలకు పంపిన కథలే ఓ నాలుగు వరకూ ప్రచురితం అయ్యాయి.ఎప్పుడన్నా ఒక ఆలోచన వచ్చి ఏ రాత్రిపూటో కాగితాలమీద పెట్టినది పూర్తిచేసే సమయం లేక అసంపూర్తిగా ఉండిపోయాయి.పుస్తకాలు చదవటమూ తగ్గిపోయింది.ఎప్పుడన్నా కొంచెం ఖాళీ దొరుకుతే అల్మారా లోని ఓ కవితా సంపుటి తీసి ఒకటి రెండు కవితలు మాత్రమే చదవటం కుదిరేది. అంతలో పెద్ద ఉత్పాతం వార్నిషుపెయింట్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న మా మరిది కలెక్ట్ అయిన సొమ్ము సక్రమంగా యాజమాన్యానికి చెల్లించటం లేదని పెద్ద గొడవ అయ్యి మా మరిదినిః ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసారు.అంతే కాక కొంతమంది అతను అప్పులు చేసాడని ఇంటిమీదకు వచ్చారు.దాంతో అందరం అతలాకుతలం అయిపోయాము.అనుకోకుండా అంతకు ముందు పత్రికలకు వేసిన చిత్రాలు తాలుకు సొమ్ము, ప్రభుత్వం సంస్థలకు వేసిన సావనీర్లచిత్రాలకు వచ్చిన డబ్బు,బేంకులో కొద్ది కొద్దిగా దాచుకున్నదీ అంతా అప్పులుతీర్చటానికి జమ కట్టేసారు.ఈ సంఘటన నాలో భవిష్యత్తు గురించి చాలా భయం కలిగించింది.ఈ ఊబిలోంచి ఎప్పటికైనా తేరుకోగలమా అనే బెంగ ఏర్పడింది. బలరాం గారు,మా కాంపౌండులోనే అద్దెకు ఉన్న ఆయన మిత్రుడు సర్వే ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నవారు కావటాన చాలా ప్రయత్నం మీద మా మరిదికి అందులో ఉద్యోగం వచ్చేలా చేసారు.హమ్మయ్య ఇకనైనా బుద్దిగా పనిచేసుకుంటే ఒడ్డున పడతాం అనుకున్నాం. చిన్నన్నయ్య వాళ్ళూ అమ్మతో కలిసి విడిగా వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు.పోనీలే అమ్మకి కొంత వెసులుబాటు ఉంటుంది అనుకున్నాను. అంతలోనే మరో బాధకలిగించే ఉత్తరం.చిన్నక్కకి రెండో బాబు పుట్టాడు.కానీ నెల రోజులకే డయేరియాతో హాస్పిటల్లో చేర్చినా కూడా చనిపోయాడని తెలిసింది.తొమ్మిది నెలలు గర్భంలో మోసి పుట్టబోయే వాడిమీద ఎన్నో కలలు కని తీరా ఇలా చిట్లిపోవటం చాలా విషాదం.ఇదేసమయంలో అమ్మ గురించి గుర్తు వచ్చింది.పెద్ధకొడుకని అన్నయ్యను ఎంతో అబ్బురంగా చూసుకొనే ఉంటారు.కానీ ఎందుకో ఏ విషబిందువు అన్నయ్య మనసులో ఎప్పుడు ఎవరు చిలకరించారో ? నాకు ఊహ తెలిసీ అన్నయ్య అమ్మతో ఆదరంగా మాట్లాడగా చూడలేదు.మరి అమ్మమనసులో ఎంత రోదిస్తుందో.తలచుకోగానే కళ్ళు చెమ్మగిల్లాయి. చిన్నాడబడుచు కాపురానికి వెళ్ళిపోవటం,మరిదికి ఉద్యోగం రావటంతో నాకు కొంత వెసులుబాటు కలిగింది.వీర్రాజు ఉదయం పదిగంటలకే భోజనం చేసి వెళ్ళిపోవటం ,చిన్నమరిదికి షిఫ్ట్ లు అందుకని అప్పుడప్పుడు నాకోసం కొంత ఖాళీసమయం దొరికేది.తొందరగా పనిముగించుకొని పుస్తకాలు చదవటం మళ్ళా మొదలెట్టాను.పల్లవికి చిన్న చిన్న పాటల్ని నేర్పించటం చేసేదాన్ని. అక్కయ్య నుండి ఉత్తరం వచ్చింది."డిగ్రీ పూర్తి చేసేయకూడదా? తర్వాత ఏదైనా ఉద్యోగం లో చేరితే ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు ఉంటుంది కదా "అంది.నేను కూడా ఆలోచనల్లో పడ్డాను. ఈలోగా మా ఫిజిక్స్ మేడం జ్యోతి గారి నుండి కూడా ఉత్తరం వచ్చింది.రెండు మూడేళ్ళలో పాత సిలబస్ తీసేస్తారని,పరీక్ష కడితే మంచిదనీ,కావాలంటే తాను కొంత మర్చిపోయిన పాఠాలకి గైడ్ చేస్తాననీ రాసారు.నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.ఒక స్టూడెంట్ పట్ల ఇంత శ్రద్ద చూపి ఉత్తరం రాయటం నిజంగా అబ్బురమే.నేను ఆఖరి సంవత్సరం లో ఉండగా అప్పుడే ఎమ్మెస్సీ పూర్తిచేసి మా కాలేజీకి లెక్చరర్ గా జ్యోతిగారు వచ్చారు.అందువల్ల మాతో స్నేహితురాలు లాగే ఉండేవారు.ఆమె నాన్నగారు ఎమ్మార్ కళాశాల లో ఫిజిక్స్ లెక్చరర్. వీర్రాజు గారు ఆఫీసునుండి రాగానే ఉత్తరం చూపించాను.ఆయనా ఆశ్చర్యపోయారు.మీ అన్నయ్యకి ఉత్తరం రాసి ఫీజు కట్టమని చెప్పు అన్నారు.వెంటనే ఉత్సాహంగా ఉత్తరం రాసాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంది.దాంతో వీర్రాజు గారికి రెండుమూడు నెలల ముందు నుంచే బిజీ అయిపోయింది.సభల సావనీర్ బాధ్యత వీర్రాజు గారిపై పడింది. సభలసందర్భంగా యాభై ముగ్గురు చిత్రకారులచేత తైలవర్ణ చిత్రాలు వేయించి "రెండున్నర వేల సంవత్సరాల తరతరాల తెలుగు జాతి"అంశంతో ప్రదర్శన ఏర్పాటు చేయాలనే నిర్ణయించారు.అందుకని రాజమండ్రి నుండి వీర్రాజు గారి సన్నిహిత మిత్రుడు మాదేటి రాజాజీ,వారి శిష్యులు ఒక ఇద్దర్ని కూడా తైలవర్ణ చిత్రాలు వేయటానికి ఎంపిక చేసారు.ఎగ్రిమెంటు కోసం వచ్చి న రాజాజీ గారి సాయంతో విజయనగరం వెళ్ళటానికి టికెట్లు రిజర్వేషన్ చేయించారు. అప్పుడప్పుడు వీలు చేసుకుని ఫిజిక్స్ పుస్తకం తెరవడం మొదలెట్టాను. కాలేజీ వదిలి పెట్టి మూడేళ్ళు అయిపోయింది. ఏకాగ్రత కుదిరే సరికి పాప దేనికోసమో పేచిపెట్టటమో ఏ పక్కింటివారో,స్నేహితులో రావటమో జరిగేది.మళ్ళా పుస్తకం అవతల పడేసి పనిలో పడాల్సి వచ్చేది.మనసు ఉసూరుమనేది. పరీక్షకి ఓ వారం రోజుల ముందుగా వెళ్తే అక్కడ అమ్మ పాపని చూసుకుంటుంది కనుక చదువుకోవచ్చులే అనుకున్నాను. కానీ అంతకుముందు నేను విజయనగరం వెళ్తే ఆడబడుచు ఉండేది.ఇప్పుడు నేను వెళ్తే ఎలాగో అని ఒక సందిగ్ధం,ఇల్లు పట్టించుకోకుండా చదువుకోసం ఊరుమీద పడింది అని నలుగురూ నాలుగు మాటలు అంటారని ఒకబెంగ.ఇప్పుడు పరీక్ష పాసవ్వకపోతే వచ్చిన నష్టం ఏమిటీ అని గుసగుసలు పోతారేమో అని మనసులో గుబులైంది. కానీ వీర్రాజు గారు మాత్రం" రాజాజీ వాళ్ళూవచ్చి మనం ఇంట్లోనే దిగి పెయింటింగ్స్ వేస్తారట.ఆయిల్ కలర్స్ వాసనలూ అవీ ఘాటుగా ఉంటాయి.పాప చిన్నది కదా ఇబ్బంది అవుతుంది.పరవాలేదు వెళ్ళు వంట సంగతి మేం చూసుకుంటాంలే" అన్నారు. కొన్ని సులభమైన వంటలు ఎలా చేయాలో పేపరు మీద రాసుకున్నారు. ఆయన ఇచ్చిన భరోసాతో ఇంకా పరీక్షలు నాలుగు రోజులు ఉన్నాయనగా మార్చి 17 వతారీఖున రాజాజీగారితో కలిసి బయలుదేరాను.రాజాజీ గారు రాజమండ్రిలో దిగిపోగా నేను విజయనగరం వరకూ వెళ్ళిపోయాను.

23, ఫిబ్రవరి 2023, గురువారం

సంచిక లో శ్రీ కేఎల్వీప్రసాద్ చేసిన ముఖాముఖి

* సుభద్రా దేవి గారూ ..సంచిక అంతర్జాల పత్రిక పక్షాన మీకు స్వాగతం..నమస్కారం . జ:-నమస్కారం ప్రసాద్ గారూ *రచనా వ్యాసంగం పట్ల మీకు దృష్టి ఎప్పుడు,ఎలా మళ్లింది ?దాని నేపద్యం వివరించండి. జ:-మా పెద్దక్క పి.సరళాదేవి తెలుగు స్వతంత్రలో విరివిగా రచనలు చేసేది.మాలతీచందూర్, పి.శ్రీదేవి, రామలక్ష్మిల సమకాలీనురాలు. డా.శ్రీదేవి అక్కకు మంచి మిత్రురాలు.నేను కుటుంబ పరిస్థితులవలన ఎనిమిదవతరగతితో చదువు మానేసి ఏడాది పాటు గోపన్నపాలెం అక్క ఇంట్లో ఉన్నప్పుడు బడికి వెళ్ళకపోవటం వలన అక్క ఇంట్లోని గ్రంథాలయం లో శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి ప్రముఖుల రచనలేకాక అనేక అనువాద గ్రంథాలు కూడా అర్థం అయినా కాకపోయినా విరివిగా చదివాను.నేను రచయిత్రీగా మారటానికి దోహదం చేసింది అక్క వాళ్ళింట్లో ఉన్న సమయమే అనుకుంటాను.ఒకరోజు ఏలురులో ఆంవత్స సోమసుందర్ గారికి జరిగిన సత్కారసమావేశంకి అక్కతో పాటూ వెళ్ళాను.సభానంతరం ఒక సాహితీ మిత్రుడి ఇంటి డాబా పైన వెన్నెల్లో కవితా గోష్ఠి జరిగింది.ప్రముఖకవులకంఠంలో కవిత్వం వినటం నాకు అద్భుతంగా అనిపించింది.అంతవరకూ కథలూ,నవలలూ చదివాను.ఇంటికివెళ్ళాక కవిత్వం పుస్తకాలు అక్కని అడుగుతే శ్రీశ్రీ మహాప్రస్థానం, కృష్ణశాస్త్రి ఊర్వశి,ముద్దుకృష్ణ వైతాళికులు ఇచ్చింది.అందులో నాకు నచ్చినవి ఒక పుస్తకంలో కాపీ చేసుకున్నాను. * మీరు చదువుకునే రోజుల్లొ ,భవిష్యత్తులో మంచి రచయిత్రి కావాలని కోరుకున్నారా ?లేక యాదృశ్చికంగా ఈ నాటిస్థాయికి చేరుకున్నారా ? జ:-అక్క ఇంటినుండి తిరిగి విజయనగరం చేరిన తొమ్మిదవ తరగతి లో చేరాను.మా తెలుగు మాష్టారు ఛందస్సు చెప్తే ఆటవెలది లో మాష్టారు మీద పద్యం రాసి చూపిస్తే ఆయన పొంగిపోయి నువ్వు మంచి కవయిత్రి అవుతావని దీవించారు.మాష్టారు ఒక లిఖిత పత్రికను మొదలు పెడితే అందులో పద్యాలు,కవితలూ రాసేదాన్ని.అందులో ఒకటి "నాబొమ్మే నా చెల్లి" అని పదకొండు ద్విపద పద్యాల్లో రాసాను.బహుశా నా దీర్ఘ కవితా ప్రస్థానానికి అది తొలిమెట్టు కావచ్చు. మా అక్కనీ,అన్నయ్యలనీ రచయితలుగా చూస్తూ ఉండటం వలన మనసులో ఏమూలో రచయిత్రి కావాలనే కోరిక రెక్కవిప్పుకొనే వుంటుంది. * మీ పుట్టినిల్లు ,మెట్టినిల్లు ,సాహిత్య వాతావరణం పుష్కలంగా కలిగి ఉన్న విశయం అందరికి తెలిసి న ,విషయమె !మీరు గొప్ప రచయిత్రిగా ఎదగ డానికి ఎక్కడ వీలయింది ?ఎందు చేత ? జ:-చిన్నప్పుడు అక్క పంపిన బొమ్మలపుస్తకాలూ,అన్నయ్య కొన్న చందమామ,వారపత్రికలూ నేను చాలా చిన్నప్పుడే పఠనాసక్తిని పెంచాయి.అక్కయ్య,అన్నయ్యలకథలు పత్రికల్లో పడినప్పుడు కాలేజీరోజుల్లో నాకూ రాయాలనే కోరిక పెరిగింది.అప్పట్లోనే కొన్ని కథలు రాసాను. వీర్రాజు గారు పరిచయం అయ్యాక పత్రికలకు పంపాను.పెళ్ళికి ముందే 1970 లో మొదటికథ ప్రచురితం అయ్యింది. పంపిన నాలుగైదు కథలు ప్రచురితం అయ్యాయి ఉమ్మడి కుటుంబంలో కథ రాసేంత సమయం సమకూర్చుకోలేక రాయలేక పోయాను.ఆరేడేళ్ళు గడిచాక మళ్ళా రాయటం మొదలుపెట్టాను.తర్వాత మరి వెనక్కి చూడలేదు.రాస్తూనే ఉన్నాను. * మీరు కథలు రాశారు ,కవిత్వం రాశారు ,వ్యాసాలు రాస్తున్నారు .కానీ మీ కలం కవిత్వం వైపు మొగ్గు చూపుతుందని మీ రచనలను గమనిస్తున్న నాబోటి పాఠకులకు అనిపిస్తుంది.ఇది నిజమేనా ?ఎందు చేత ? జ:-పెళ్ళయ్యాక ముఖచిత్రాల కోసం కవులు రావటం, కవితా సంపుటాలు ఎక్కువగా ఉండటంతో కవితలు రాయటానికి మొగ్గుచూపాను.చిన్న స్పందన చాలు కవిత రాయటానికి .కానీ కథరాయాలంటే మంచి అంశం,పాత్రలూ,సంఘటనలూ, సంభాషణలు, ఆకట్టుకునే ముగింపు.ఇవన్నీ ఆలోచించే సావకాశం లేక అరుదుగా కథలు రాసాను. * మీరు " ఇస్కూలు కథలు "అనే కధాసంపుటి వెలువరించారు .ఈ కథలు రాయడానికి మిమ్ము లను ప్రేరేపించిన అంశాలు ఏమిటి ? జ:-మాది ఎయిడెడ్ పాఠశాల కావటం వలన విద్యార్థులందరూ ఆ పరిసరాల్లోని బస్తీలో పిల్లలే.వాళ్ళతో కలిసి మెలిసి ఉండటంలో వాళ్ళకుటుంబనేపధ్యాలు,ఆడపిల్లలచదువులకు కలిగే అవరోధాలూ,వారిపై ప్రభావాలూ, ఉపాధ్యాయులు,ఇతర సిబ్బందుల తీరుతెన్నులు ఇవన్నీ పాఠశాల అభివృద్ధిపై,విద్యపై చూపే ప్రభావాలని కథలుగా రాయాలనుకున్నాను.తెలుగువిద్యార్థి మాసపత్రిక రెండున్నర సంవత్సరాలు నా ఇస్కూలుకతలను ధారావాహికగా ప్రచురించింది.అందులో మొదటి కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ద్వితీయ భాష తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా తీసుకుంది. * దీర్ఘ కవితల ద్వారా మీరు మంచి పేరు సంపాది 0 చారు. అయితే ఈ ప్రక్రియకు భవిశ్యత్తు ఉంటుందంటారా ? ఎందుచేత ? జ:-లఘుకవితలైన హైకూలు, మినీ కవితలు అప్పటి కప్పుడు చమక్మనిపిస్తాయి.కానీ అవి కవితా రంగంలో ఎక్కువకాలం నిలవవని నా అభిప్రాయం.ఒకటిరెండు పేజీల కవితా ఖండికలు ఒక విషయాన్ని,ఒక సందర్భాన్ని గూర్చి పాఠకుల్ని ఆలోచింప చేయగలవు.ఇక మొదటినుంచీ చివరివరకూ ఒక సుదీర్ఘ అంశాన్ని డీవియేట్ కాకుండా దీర్ఘ కవితగా కవిత్వీకరించటంలోనే కవి ప్రతిభ తెలుస్తుంది. *మీరు వీర్రాజు గారి జీవితంలో ప్రవేశించెనాటీకె ఆయన సాహిత్య రంగంలోనే కాక ,చిత్రకారునిగా మంచి పేరు పొందారు .చిత్ర కళలో మీకు అప్పటికె ప్రవేశం ఉన్నప్పటికీ ,ఎందుకో మీరు నిర్లక్ష్యం చేసి నట్టు కనిపిస్తుంది .అలా ఎందుకు జరిగింది ? ఏమైనా ,ప్రత్యేక కారణాలున్నాయా ? జ:- చిన్నప్పటినుంచి బొమ్మలపుస్తకాలలోని చిత్రాలు చూసి వేసేదాన్ని.చిన్నప్పుడు ఢిల్లీ శంకర్స్ వీక్లీ వారి చిత్రలేఖనపోటిలో కూడా పాల్గొన్నాను. తర్వాత వారపత్రికలోని బాపూ బొమ్మల్ని అత్యంత ప్రేమతో వేసేదాన్ని.పెళ్ళయ్యాక వీర్రాజు గారు ప్రోత్సహించారు కానీ ఏకాగ్రతతో దీక్షగా వేయాల్సిన కళ చిత్రలేఖనం.పిల్లలతో ఉమ్మడి సంసారం లో ఎక్కడ కుదురుతుంది? వీర్రాజు గారు తైలవర్ణ చిత్రాలు వేస్తున్నప్పుడు నాకు వేయాలనిపించేది రిటైర్ అయ్యాక వేయాలనుకున్నాను.స్కెచ్ బుక్ కూడా కొనుక్కొని ఒకటి రెండు పెన్సిల్ స్కెచ్ వేసాను.అక్షరాలు రాయటం అలవాటైన వేళ్ళు చిత్రాలవైపు సాగటం లేదు. *ఈ మధ్య అంతర్జాల పత్రికల దే ' హవా' అన్నట్టుగా వుంది.తెలుగు సాహిత్య పురోగతికి ఇవి ఎంత వరకు ఉపయోగ పడుతున్నాయి ?మీ అబిప్రాయం చెప్పండి. జ:- పుస్తకం ప్రచురణ,అమ్మకం కూడా సాహితీవేత్తలకు మోయలేని భారమయ్యింది.వేసిన పుస్తకాల్ని అమ్ముకోవటం కూడా ఒక కళగా మారింది.ప్రింట్ పత్రికలు తగ్గిపోయాయి కనుక సాహిత్య కారులందరూ తమ రచనలకు ఒక వేదిక కావాలి. కనుక అటువైపు చూడటం మొదలు పెట్టారు.టెక్నాలజీ తెలిసినవారు అంతర్జాల పత్రికలు అనుసరిస్తారు. అయితే ఎప్పటిలాగే రకరకాల రచనలు అంతర్జాల పత్రికలలో వస్తున్నాయి.కాలగతిలో ఏవి నిలుస్తాయో కాలమే నిర్ణయించాలి.ప్రతీ వాటికీ వాటి పాఠకులు వారికి ఉంటారు కదా. * వృత్తికి ,ప్రవృత్తికి ,మీరు ఎలా న్యాయం చేయగలిగారు ?ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా వాటిని ఎలా పరిష్కరించుకోగలిగారు ? జ:-వృత్తీ, ప్రవృత్తి రెండూ వేర్వేరు ఛానల్స్.స్కూల్లో,విద్యార్ధుల్లో, వారి నేపధ్యాల్లో బోధనేతర పనుల్లో( సర్వే),జీవితపోరాటాల్లో నేను ఎప్పటికప్పుడు నాకు రచనలకు కావలసిన అంశాల్ని ఏరుకునే దాన్ని.నాకు సమయం కుదిరినప్పుడు ఎక్కువగా కవితలుగా రాసేను.కొన్నింటిని కథలుగా రాసాను.నాకు ఆ రోజుల్లో ప్రధాన సమస్య సమయమే.అందులోను నేను ఎక్కువగా రాసేది రాత్రి పూటే. * కథకు గాని ,కవిత్వానికి గాని ,ఎలాంటి వస్తువుని తీసుకోవడానికి మక్కువ చూపుతారు ?ఎందు చేత ? జ:-చిన్న స్పందన గాని,ముల్లులా గుచ్చుకునే సన్నని బాధగానీ,మనసుని కల్లోలపరచే సమాజంలోని సంక్షోభసందర్భాలు కానీ నన్ను కవిత రాయకుండా ఉండలేని పరిస్థితిని కల్పిస్తాయి.కథరాయాలంటే వస్తువు సంఘటనలనీ,దృశ్యాల్నీ, పాత్రల్ని సమకూర్చుకునేలా ఉండి ఆకట్టుకునే ముగింపు చేయగలిగినప్పుడే రాస్తాను.అందుకే నేను కథలు తక్కువ రాసాను. * శ్రీ శీలావీ -మీరు ,సాహిత్య రంగంలో మంచి పేరు సంపాదించుకున్నారు.సాహిత్య పరంగా మీకు వారసులున్నారా ?వారి గురించి చెప్పండి. జ:- మా అమ్మాయి పల్లవి తెలుగుకన్నా ఆంగ్ల సాహిత్యం ఎక్కువగా చదువుతుంది.సాఫ్ట్ వేర్ ఉద్యోగంతో రాయటానికి ప్రయత్నించలేదు.ఆరేళ్ళక్రితం ఉద్యోగం మానేసి ఎమ్మే ఇంగ్లీష్,జర్మన్ భాష సర్టిఫికేషన్ చేసింది.గత ఏడాదిగా తెలుగు సాహిత్యం చదువుతూ కవితలూ, ఆర్టికల్స్ రాస్తోంది.అనువాదాలు చేయాలనుకుంటుంది.మా మనవరాలు తెలుగు పుస్తకాలకన్నా ఆంగ్ల సాహిత్యం విపరీతంగా చదువుతుంది. తర్వాత ఎప్పుడో సాహిత్యం లోకి వస్తుందేమోనని చిగురాశ. * అనువాద ప్రక్రియ పై మీ అబిప్రాయం ఏమిటి ? అనువాదంకు నోచుకున్న మీ రచనల గురించి వివరించండి. జ:- వీర్రాజు గారి నవల మైనా,నాదీర్ఘకవిత యుధ్ధం ఒక గుండె కోత ఆంగ్ల,హిందీ,తమిళ భాషల్లోకి అనువాదమై గ్రంధరూపంలోకి వచ్చాయి.వీర్రాజు గారి కథా సంపుటి,నా కవితా సంపుటి ఆంగ్లానువాదపుస్తకాలు వెలువడ్డాయి.మా ఇద్దరి రచనలూ కన్నడ,మైధిలీ వంటి ఇతరభాషలలోకీ అనువాదమయ్యాయి.ఇతరభాషలనుండి తెలుగు లోకి వచ్చినంతగా తెలుగు పుస్తకాలు ఇతరభాషల్లోకి వెళ్ళలేదు.అనువాదం కావటం ఒక ఎత్తైతే వాటిని సమర్థవంతంగా ఇతరరాష్ట్ర సాహితీ వేత్తల దృష్టిలో పడేలా ప్రచారం చేసుకోవటం మరో ఎత్తు. అది మాకైతే చాతకాలేదు. * మీరు ప్రకటించిన పుస్తకాల వివరాలు చెప్పండి జ:-ఆకలినృత్యం (1980) మోళి(1982) తెగినపేగు(1986) ఆవిష్కారం(1986) ఒప్పులకుప్ప1992) యుద్ధం ఒక గుండెకోత(2001) ఏకాంత సమూహాలు(2004) బతుకుపాటలో అస్తిత్వరాగం (2009) నా ఆకాశం నాదే (2016)తొమ్మిది కవితా సంపుటాలు ‌ శీలా సుభద్రాదేవి సమగ్రకవిత్వం (1975-2009) యుద్ధం ఒక గుండె కోత దీర్ఘ కావ్వానికి 1.యుధ్ధం ఏక్ దిల్ కి వ్యధ (హిందీ2018) 2.War,A Heart's ravege(ఆంగ్లానువాదం2001) 3.Ullak kumural(తమిళానువాదం2020) 4. Dance of a Hunger(anthology of poems2021) 1.దేవుడుబండ(1990) 2.రెక్కలచూపు(2007) 3.ఇస్కూలుకతలు(2018)మూడు కథా సంపుటాలు, 4.నీడలచెట్టు నవలిక, ఇతరములు: 1.నాముందుతరం రచయిత్రుల కథల గురించి రాసిన 25 వ్యాసాల సంపుటి " కథారామం లో పూలతావులు" 2.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ ( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ2015) 3.నిడదవోలు మాలతి రచనా సౌరభాలు (2022) 4.గీటురాయిపై అక్షర దర్శనం(నారచనలపై వచ్చిన సమీక్షల సంకలనం) సంపాదకత్వం: 1.ముద్ర (వనితల కవితల సంకలనం భార్గవీరావుతో సంపాదకత్వం2001) 2.వాళ్ళు పాడిన భూపాలరాగం (డా.పి.శ్రీదేవికథలు2022) 3.యాభై ఏళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు(2022) 4.మధుకలశమ్(డా.పి.శ్రీదేవి కవిత్వం) *మీరు పొందిన అవార్డులు వగైరా.... జ:-1.లేఖిని సాహిత్యసంస్థ నుండి వచ్చే కవిత్వానికి కుసుమారామారావు పురస్కారం 2.తెలుగువిశ్వవిద్యాలయంనుండి97 లో సృజనాత్మక సాహిత్యానికి పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్ 3. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి1999 లో ఉత్తమరచయిత్రి అవార్డ్ 4.కడప కవితా సాహిత్య సాంస్కృతిక సంస్థ నుండి రెక్కల చూపు కథలసంపుటికి 2011 లోగురజాడ అవార్డ్ 5.ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి దేవులపల్లి రాజహంస కృష్ణశాస్త్రి పురస్కారం. 6.2018లోఉమ్మడిశెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం. 7.2018లోకవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం 8.2018లో"నా ఆకాశం నాదే" కవితా సంపుటి కి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి మాతృపురస్కారం 9.2022లో సుశీలానారాయణరెడ్డి పురస్కారం 10.2022 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి మాతృపురస్కారం.ఇవి చెప్పుకోదగినవి. ఇంత శ్రధ్ధగా నన్ను పరిచయం చేసినందుకు మీకు, సంచిక అంతర్జాల పత్రిక నిర్వాహకులకు ధన్యవాదాలు. *** * శీలా వీర్రాజు గారి రచనలపైగానీ,మీ రచనలపై గానీ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలేమైనా జరిగాయా తెలియజేయగలరు జ:- శీలా వీర్రాజు గారి రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో మూడు MPhil పరిశోధనలూ,ఒక PhDపరిశోధన జరిగాయి. నా మొదటి కవితా సంపుటి ఆకలినృత్యంపై,యుధ్ధం ఒక గుండె కోత పై మధురకామరాజు విశ్వవిద్యాలయం లోనూ,రెండు కవితాసంపుటాలపై ఆంధ్రావిశ్వవిద్యాలయంలోనూ మూడు MPhil పరిశోధనలూ,నా సమగ్రకవిత్వంపై నాగార్జున విశ్వవిద్యాలయం నుండి,ఉస్మానియా విశ్వవిద్యాలయంనండీ ఇద్దరు PhD పరిశోధనలూ చేసారు.

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

తోపుడుబండి- సాదిక్ ఆలీ

తోపుడుబండి.సాధిక్ ఆలీ కల్లూరు.ఖమ్మం జిల్లాలోని చిన్న టౌన్ సాదిక్ ఆలీ పుట్టాడు.నాన్న వలన రామాయణం,మహాభారతం, ఖురాన్.చదివాడు.తర్వాత ఇష్టంగా బైబిల్ చదివి అన్ని మతాల సారాంశం ఒక్కటే అనుకున్నాడు. మామూలుగా పళ్ళనో, పాతబట్టలని, ప్లాస్టీక్ సామాన్లనో అమ్ముతూ కనిపించే నాలుగు చక్రాల బండి నే తోపుడు బండి అంటాం. దానిమీద కవిత్వాన్ని అమ్ముతానంటూ పుస్తకాలని వేసుకొని వీధుల్లో తిరుగుతా అన్న సాదిక్ ఆలీని వెర్రవాడిని చూసినట్లు కొందరు చాటుగా నవ్వుకుంటే ఇంకొందరు మొహమ్మీదే నవ్వారు. తోపుడు బండిలో కవిత్వం పుస్తకాలు వేసుకుని 1000 కిలోమీటర్లూ వంద రోజుల్లో ప్రతీ గ్రామాన్నీ సందర్శిస్తూ వెళ్ళి కాలినడకన ప్రయాణం 40 డిగ్రీల పైనే ఉన్న ఎండ సాధ్యమా...? సాధిక్ అలీ కి తనకి తాను ప్రశ్నించుకోవటం ఇష్టం, ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ వెళ్ళటం అంతకన్నా ఇష్టం. అందుకే 1000 కిలోమీటర్ల యాత్ర సాధ్యమా అన్న ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ బయలేరాడు. మొదట హైదరాబాద్ పుస్తకప్రదర్శన లో తోపుడు బండి నీ, లక్ష్యాలను పరిచయం చేసాడు.తర్వాత పబ్లికేషన్ చేసాడు.ఊరు,ఊరూ తిరిగి పుస్తకాలు అమ్మాడు.ఆ తిరగటం లో మారుమూల గూడెంలో పిల్లలకు అక్షరం తెలియకపోవటం అతన్ని కలచివేసింది. ఒక తపస్సులా తన పనిని మొదలు పెట్టేసాడు. ఎంచుకున్న ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా., ఇల్లందులో డిసెంబర్ 7 ఉదయం 10.30 గంటలకు తోపుడుబండి 'అడవితల్లికి అక్షరతోరణం' యాత్ర ప్రారంభం అయ్యింది. ఒకేరోజు ఒకేచోట నాలుగు వేలకు పైగా స్కూల్ పిల్లలను సమావేశపరిచాడు.ఒక్కొక్కరికి ఒక్కో పుస్తకం ఇచ్చాడు. పిల్లల్లో పుస్తకాల పట్ల ప్రేమను పెంచాడు.మాతృభాషపై మమకారాన్ని నూరిపోసాడు.పిల్లల పుస్తకాలు కొన్ని కొన్నాడు.కొంతమంది ఇచ్చారు.వేలపుస్తకాలు సేకరించి పిల్లలు చేత చదివించాడు. 55 గూడెం లను,పాఠశాలలనూ దత్తత తీసుకున్నాడు. గూడెం లో మొగవాళ్ళూ స్త్రీ లూ పగలంతా పనులకు,బళ్ళో చదివే పిల్లలు బడికీ పోతే మిగిలిన వృధ్ధులూ,గర్భిణీలు, చిన్నపిల్లల కోసం "గుప్పెడుమెతుకులు"పేరున ఎవరైనా విరాళాలు ఇస్తే సరే,లేకుంటే తనే భోజనాలు వండించి పెడతాడు. ఏ మతం లో ఏ పద్దతులని ఆచరించినా మనం ఒకే దేవున్ని ఆరాధిస్తున్నాం అనేది సాదిక్ ఆలీ విశ్వాపం. ''నేను జన్మతహ ముస్లిం నే కానీ భారతీయున్ని కూడా. నాకు దేవుడే ఒక మతం మరే ఇతర మతాలతోనూ నాకు సంబందం లేదు. నేను హిమాలయాలకు వెళ్ళినా, ఆ దారిలో నాలో ఉన్న అహాన్ని చంపుకోవటానికి బిక్షాటన చేసినా, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన తిరిగినా అన్నిటికీ ఒకటే కారణం... నాలో ఉన్న భగవంతున్ని నేను కనుక్కోవాలి."అంటాడు సాదిక్ ఆలీ. భగవంతుడు ఎక్కడో ఉన్నాడో లేదో తెలియదు కానీ ఇటువంటి వారిలోనే ఉండే ఉంటాడేమో కదా?

8, ఫిబ్రవరి 2023, బుధవారం

పంజరాలు

పంజరాలు విచ్చీవిచ్చని చిరువెలుతురు లోంచి చిక్కని మంచుతెరల్లోంచి ఆలోచనలగుర్రాన్ని తోలుకుంటూ రాత్రంతా నిద్రపోకుండా మర్నాడు విచ్చుకోబోయే వెలుగు రేఖల్ని వెతుకుతూ వెతుకుతూ తిరిగాను ఇంతకాలపు నిరీక్షణల వెతుకులాటలో మధుర ఫలపుష్పశోభితంగా చూపాల్సిన హృదయం స్ఫటికంలా గతకాలపు చిత్రాల్నీ విరిగిన కలల చీలికలనూ ప్రతిబింబించింది రెపరెపలాడుతూ కదులుతున్న రెప్పల చప్పుడు ఎక్కడో వినిపించింది మనసు కిటికీ లోనుంచి తలదూర్చి చూపుల్తో వెతుక్కుంటున్నాను అంతటా వేనవేల పక్షులు రంగురంగులవీ దిగులు ముఖాలవీ కూతలు మర్చిపోయినవీ రెక్కలు కత్తిరించబడినవీ తోకలు ఉత్తరించబడినవీ ఎగరలేని అసహాయతతో దిగులు జారుతున్న కళ్ళతో ఇంట్లో వేనవేల పక్షులు సంప్రదాయ పంజరంలో --- అందానికి కొలబద్దలతో శరీరాన్ని రకరకాలుగా చెక్కుకొని కన్నీటి బిందువుల్ని సైతం ముత్యాల్లా అలంకరించుకుని అందాలలోకంలోనే ఆనందాన్ని ప్రదర్శిస్తూ ముక్కుకి ప్లాస్టిక్ చిరునవ్వు వేలాడేసుకుని బయట వేనవేల పక్షులు సౌందర్యపంజరంలో --- ఇంకా ఇంకా చెక్కుకుంటూ అతికించుకుంటూ కత్తిరించుకుంటూ వ్యాపార మోహపంజరాలలో ఇంకా ఇంకా కూరుకుపోతూ వాళ్ళూ మూఢవిశ్వాసాల ఊచల్ని వంచేయాలనే ప్రయత్నంలో మేము

7, ఫిబ్రవరి 2023, మంగళవారం

నడక దారిలో -23

నడక దారిలో --23 అమ్మ వెళ్ళిన తర్వాత పాప పనితో , ఇంట్లో పనితో తీరిక లేకుండా అయ్యింది.దాంతో పూర్తిగా పుస్తకాలకు దూరం అయ్యాను. నా నా లోకం అంతా పాపే ఆక్రమించింది. కానీ బలహీనంగా ఉండటం వలన తరుచూ అనారోగ్యం తో బాధపడేది.ఏ రోజైనా అనారోగ్యం తో ఏడుస్తుంటే విలవిలలాడిపోయేదాన్ని.నవ్వుతుంటే పులకించిపోయేదాన్ని. రాత్రి పూట పాప పక్కనే పడుకుని నాకు వచ్చిన జోలపాటల్ని సన్నగా పాడుకుంటూ నిద్రపుచ్చుతూ ఉండేదాన్ని.నా కంఠం మళ్ళా మంద్రంలో శృతి చేసుకోవటం మొదలెట్టింది. వీర్రాజు గారు చిత్రరచనల్లో మమేకం అయినా,సభలకు వెళ్ళినా,సినీమాలకు వెళ్ళినా పట్టించుకునేదాన్ని కాదు.పాప ధ్యాసలో పడి తనను పట్టించుకోవటం లేదని అప్పుడప్పుడు మూతి ముడుచుకున్నా పాప కేరింతలు వినేసరికి మురిసి పోయేవారు. అందులోనూ పెళ్ళి సమయానికి నాకోసం రాస్తానన్న దీర్ఘ కావ్యం పాప పుట్టేలోపున కూడా పూర్తికాలేదని రాసే పనిలో తలమునకలుగా ఉన్నారు. వీర్రాజుగారు నాకే అంకితం చేయాలనుకుంటూ రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “పుస్తకాన్ని యువభారతి ప్రచురించింది. ఏప్రిల్ నాలుగో తేదీ ఉగాది రోజున జరిగిన ఆ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను. వేదిక మీద ఆయన దీర్ఘ కావ్యం గురించి అందరూ ప్రశంసిస్తుంటే ఆనందంతో పొంగిపోయాను.కానీ ఎందువలనో మరి వీర్రాజు గారు చాలా మందికన్నా ముందే వర్ణనాత్మకమైన అభ్యుదయ దృక్పథంతో రాసిన మళ్ళీ వెలుగు దీర్ఘ కావ్యంకి రావలసినంత గుర్తింపు రాలేదనే అనుకుంటున్నాను. ఆషాఢమాసంలో వదిన పుట్టింటికి వెళ్ళిందని,కడుపుతో ఉన్నప్పుడు గానీ,పాప పుట్టాక గానీ నా చేత్తో తృప్తిగా వండిపెట్టలేకపోయాననీ, ఇప్పుడు వీలుంటే ఒక పదిరోజులు రమ్మనీ అమ్మ ఉత్తరం చిన్నక్క తో రాయించింది. నాకు కూడా వెళ్ళాలని మనసైంది.సరేనని చంటిపాపతో ఒక్కదాన్నీ వెళ్ళలేనని కుమారీ వాళ్ళ ఆడబడుచూ,మామగారూ వైజాగ్ వెళ్తుంటే వారితో కలసి విజయనగరం వెళ్ళాను. ఒకరోజు కోరుకొండకి వెళ్ళివచ్చాను.మరోరోజు రాజీఇంటికి వెళ్ళాను అయితే రాజీ ఇంటికివెళ్ళటం అదే ఆఖరు సారి.ఎందుకంటే రాజీ లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు స్పాట్ వేల్యూయేషన్ కి హైదరాబాద్ వస్తుండేది.ఆసమయంలో ఒకటి రెండుసార్లు మాయింటికి వచ్చేది. ఆమె నాకు 9వ తరగతినుండి డిగ్రీవరకూ క్లాస్మేటే కాక హైద్రాబాద్ వచ్చాక కూడా 1975 వరకూ మంచి స్నేహితురాలు .ప్రేమలో పడితే ఇంట్లో వాళ్ళే ఆమెకు అంక్షలు పెట్టేరు. ఆమె నేటీకి అవివాహితురాలుగా వుండిపోయింది.ఉత్తరాలద్వారా ఆమెను ప్రేమకీ,పెళ్ళి కీ ప్రోత్సహించాననీ, నేనే తనని చెడు ఆలోచనలు నేర్పించాననీ స్త్రీ స్వేచ్ఛని నేర్పుతున్నానని వాళ్ళనాన్న భావించి నానుండి ఆమెకు వుత్తరాలుగానీ,కనీసం గ్రీటింగ్ కార్డ్స్ గానీ వస్తే తీవ్రపరిణామాలు వుంటాయని మా వీర్రాజు గారికి హెచ్చరికగా వుత్తరం రాసాడు.. ఆమె నేటికీ అవివాహితురాలుగానే వుండిపోయింది.ఆంక్షలు పెట్టిన ఆమె తండ్రి చనిపోయినా కూడా నాతో స్నేహాన్ని పునరుద్ధరించలేదు.ఎందుకిలా మధురమైన బాల్యస్నేహాన్ని కత్తిరించేసి దూరం అయ్యావని ,మనం కలిసిమెలిసి కలబోసుకున్న కబుర్లు గుర్తులేదా అని అడగాలని నామనసు నన్ను నిత్యమూ తొలిచేస్తూనే ఉంటుంది. ఆమెపై ఒక కథ,ఒక కవితా కూడా రాశాను. కుమారీకి కూడా బాబు పుట్టాడు.తనని కూడా కలిసాను. అయితే ఉష మాత్రం వివాహం కావటంతో విజయనగరంలో లేదు.ఇలా నాలుగు రోజులు అందర్నీ కలిసినా , కబుర్లు చెప్పుకుంటున్నా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎందుకో పూర్వంలా నా ఇల్లు లా అనిపించలేదు.చుట్టపు చూపుగా వచ్చినట్లే అనిపించింది. పెళ్ళి కాగానే ఆడపిల్ల పుట్టింటికి అతిథి అనేమాట నిజమే అనిపించింది. హైదరాబాద్ వచ్చాక మళ్ళా బిజీ అయిపోయాను.వెచ్చాలు తీసుకునే షాపులో అరువు అమాంతం పెరిగిపోయింది.ఆ షాపులో మొత్తం తీర్చేసి ఇంకెప్పుడు మా పేరిట సరుకులు అరువు ఇస్తే నాకు పూచీ లేదని ఫస్ట్ తేదికి డబ్బు ఇచ్చే తీసుకుంటామని చెప్పాను. చవకలో బట్ట కొని పాపకి రకరకాలుగా ఫ్రాకులు కుట్టి వాటికి ఎంబ్రాయిడరీ చేయటం, ఇంటిపనులు,వచ్చే పోయే అతిథులూ వీటితో నేను సాహిత్యం, డ్రాయింగ్ అన్నీ వదిలేసి అచ్చమైన గృహిణిగా మారిపోయాను. ఇంట్లో ముగ్గురు మొగవాళ్ళు ఉన్నా ఇంటికి సంబంధించిన కూరలో,వెచ్చాలో మరే ఇతరపనో చేయటానికి ఎవరూ కదలరు.'మల్లేష్ వస్తే తీసుకురమ్మని చెప్పు' అనేవారు అందరూ. వీర్రాజుగారు 1962 లో అనారోగ్యంతో ఆరునెలలు హాస్పిటల్ లో ఉన్నప్పుడు తోటి పేషెంట్ మల్లేష్ . ఎక్కడి రుణానుబంధమో అప్పటి నుండీ ఈయనకి మరో తమ్ముడయ్యాడు.ఏ పని చెప్పినా కాదనడు. మనపని మనం చేసుకోకుండా మరొకరిపై ఆధారపడటం నాకు నచ్చేది కాదు.అందుకని అనేక సార్లు నేనే చేసుకునేదాన్ని.పాప పుట్టాక ఒక్కొక్క సారి కష్టం అయ్యేది. ఒకసారి నేను ఏదో పనిలో ఉన్నప్పుడు మా పెద్దమరిది "వదినా మీ అల్లుడు వచ్చాడు "అని కేక వేసాడు. ఇప్పటిలా ఆంటీ, అంకుల్ కాకుండా అప్పట్లో కాంపౌండు లోని పిల్లలు అత్తయ్య, మామయ్య అనే పిలిచేవారు.ఏదో అవసరం కోసం వచ్చారేమోనని వంటింట్లోంచి కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చాను.గుమ్మంలో ముష్టివాడున్నాడు.నాకు పట్టరాని కోపం వచ్చింది.ముష్టివాడిని పొమ్మని,మరిది మీద విరుచుకు పడ్డాను."అవేం మాటలు.ఇస్తే ఏదో ఇచ్చి పంపు.ఆ మాటలు ఏమిటి?" అంటూ. అదే విధంగా మరోరోజు పాపకి స్నానం చేయించి ముస్తాబు చేయిస్తున్న సమయంలో డైరీపాలబాటిల్స్ తీసుకువచ్చిన అబ్బాయి వస్తే బాటిల్స్ తీసుకుంటూ మా ఆడబడుచు ఆ అబ్బాయితో " మా పాపని పెళ్ళి చేసుకుంటావా?" అంది.ఆ అబ్బాయి ముసిముసిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు.దాంతో నాకు పిచ్చి కోపం వచ్చింది."కావాలంటే నీ పిల్లల్ని ఇచ్చి చెయ్.నా పాప గురించి ఇలాంటి మోటు సరసాలు ఆడేటట్లైతే ఊరుకునేది లేదు"అన్నాను. ఆమె ముఖం మాడ్చుకొని "సరదాగా అంటే ఏమైంది"అంది. "ఆరు నెలల పిల్లని పట్టుకుని ఆ మాటలేంటి?నాకు అలాంటి మోటు సరదాలు,సరసాలూ నాకు నచ్చవు.ఇంకెప్పుడూ నా ఎదురుగా అలా మాట్లాడకు" అని వార్నింగ్ ఇచ్చాను. ఇవన్నీ వీర్రాజు కు చెప్పాలనిపించినా ఇష్టం లేక డైరీలోనే నాబాధని ఒలకబోసుకుని దాచుకున్నాను. నవంబర్లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తరపున రచయిత్రుల మహాసభలు జరిగాయి.సభ ప్రారంభం భానుమతి చేసింది.ఆమె మాటతీరు చాలా అహంకారం గా అనిపించింది.ఐతే రచయిత్రి గానే కాకుండా అటు సినిమా రంగంలో కూడా ఒక వెలుగు వెలుగుతోంది.సినీపరిశ్రమలో నెగ్గుకు రావాలంటే అలాంటి డామినేటింగ్ స్వభావం ఉండాల్సిందే.బహుశా అందుకే అలా తనని మలచుకొని ఉండొచ్చేమొ అనిపించింది.తర్వా బాలానందసంఘంచేత తురగా జానకీరాణి గారి నేతృత్వంలో నాటిక వేయించారు.అంతేకాకుండా జానకీరాణి గారు స్వయంగా "భువనేశ్వరా" అనే రవీంద్రగేయంకి గ్రూప్ డాన్స్ చేసారు.ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మగారి అధ్వర్యంలో కవిసమ్మేళనం జరిగింది.కంచుకంఠంతో ఆమె పద్యాలు చదువుతుంటే అంతా నిశ్శబ్దంగా విన్నారు.రెండోరోజు కార్యక్రమం కి నేను వెళ్ళలేకపోయాను.మర్నాడు ముగింపు సమావేశంలో లత పొగరు గా మాట్లాడుతుంటే చిరాకు అనిపించింది.ఆ సభలో ఒక పాఠకురాలు లేచి ప్రశ్నలు సంధించింది.ఆ సభలో కొంత గందరగోళం ఏర్పడింది. సంక్రాంతికి కాంపౌండులో వాళ్ళని పిలిచి పాపకి భోగీపళ్ళు పోసాను.నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలకొలువు పెట్టాలని కోరిక.అందుకని సరదాగా చిన్నగా బొమ్మలకొలువు కూడా పెట్టాను. అనేకానేక కలలూ,కలతలూ,కన్నీళ్ళూ,ఆనందాల కలగలుపు తోనే పాపకి ఏడాది నిండింది.మొదటి పుట్టినరోజు చేయాలని అందరూ నిర్ణయించుకుని చిన్నగా పార్టీ ఇచ్చాము . అప్పుడే పెద్దక్క నుండి ఒక ఉత్తరం వచ్చింది."మరో బిడ్డ కోసం మూడు నాలుగేళ్ళు విరామం తీసుకోకుండా ఎందరు కావాలనుకున్నారో నిర్ణయించుకోండి.ఆ తర్వాత నువ్వు నీ అభిరుచుల పట్లా శ్రద్ధ పెట్టొచ్చు"అని రాసింది. కానీ ఈ పిల్లనే నేను కోరుకున్న విధంగా పెంచగలనా అనే పరిస్థితిలో మరొకరిని ...ఊహూ నాకు ఊహించే ధైర్యం చాలలేదు. ఎన్నో ఆశలతోఎన్నో కలల్తో తొందరపడి ఈబంధంలోకి నాకైనేనే ఇరుక్కున్నాను. అభిరుచులు అన్నింటినీ మర్చిపోయాను. చెమ్మగిల్లిన కళ్ళల్లోంచి మసకబారిన నాఆశలన్నీ కన్నీరుగా తొలగించడంలో ఇంకిపోతూనే ఉన్నాయ్.