~~ రంగు వెలిసిన చిత్రం ~~
అలలుఅలలు గా ముడతలు పడిన దేహమంతా
డెబ్బైఅయిదేళ్ళ వసంతాలలో తడిసి ముద్దై
ఏడు దశాబ్దాల గ్రీష్మాలలో
ఎండి నెర్రెలు విచ్చిన చర్మమూ
ఇదే నేటి మాత చిత్రం!
ఒకనాటి వసంతాల పులకింతల్నో
ఆనాటిహేమంతాలమంచు పలకరింపుల్నో
మదికి తెచ్చుకుంటూ
భారంగా అడుగులో అడుగేసుకుంటూ
అలసిన చూపుల్ని నలుదెసలా ఎగరేస్తూ
ఏమూలనుంచైనా తనచూపందుకునే కంటికొసమో
తనకోసం ఆలోచించే మనసుకోసమో
తన కోసం
తన మాట కోసం
ఒక పలకరింపు కోసం
నిర్విరామ నిరీక్షణలతో
చిట్లిన కలల్ని ఏరుకొని
సొమ్మసిల్లుతున్న రెప్పల్లో నింపుకొని
ఈదేశమంతా తడుముకుంటూ తలుచుకుంటూ
తిరిగి తిరిగి ఎంత తిరిగినా ఎంతచుట్టినా
ఏం మిగిలింది నిర్వేదం నిరుత్సాహం తప్ప
ఒకప్పుడు తన పుట్టినరోజున
బాహ్యదేహాన్ని పులకరింపజేసిన క్షణాలు
అంతటా పండుగ వాతావరణం
రంగుల తోరణాల అలంకరణలు
కీర్తినిచాటే ఉద్విగ్నగీతాలు
ఉప్పొంగే ఉత్సాహ భరిత నృత్యహేలలూ
ఊరంతా ఊగే పూలహారాల సయ్యాటలూ
రెపరెపలాడే పతాకాల మనోహరవిలాసాలూ
గాలినిండా పుష్పవర్షాల సురభిళాలూ
వీధుల నిండా హర్షాతిరేకాల ప్రాంగణాలు
కాని ఇప్పుడంతా మొక్కుబడి సంబరాలేకదా
తూతూమంత్రాల ఉపన్యాసాల హోరులేకదా
ఎవరి గోల వారిదిప్పుడు
కన్నతల్లి నే ఏడాదికో మాటు
తలచుకొనే కాలం కదా ఇది
ఇక ఈ తల్లిఊసు ఎవరిక్కావాలి!?
చేతుల మీద సంకెళ్ళగాట్లు
గుండెల్లో గుచ్చుకున్న కత్తిపోట్లు
ఉండుండి సలుపుతూనే ఉన్నాయ్
స్వేచ్చా పోరాటోద్యమంలో చేదుజ్ణాపకాలు
మరకలుమరకలుగా యింకా నిలిచే ఉన్నాయ్
దేహం శక్తిని పుంజుకొని యింకా తేజోవంతం కానేలేదు
ఎప్పటికప్పుడు మతదాడులతోనో
కులకుంపట్ల కొట్లాటలతోనో
రేగిన గాయాలు బాధిస్తూనేవున్నాయ్
ఉండుండి రక్తం మరిగి చెమటై ఇగిరిపోతూనే వుంది
నిలువునా కొల్లగొట్టిన సాంస్కృతిక చైతన్యం
నివురుగప్పిన నిస్తేజమైపోతూనేవుంది
తల్లిని మరచిపోతున్న పిల్లల్ని చూసి
కుమిలి కుమిలి నలిగి నలిగి
డెబ్బైఅయిదేళ్ళ శరీరం వడలిపోతూనే వుంది
దుఃఖం దేహమంతా అల్లుకు పోతూ
ఇంటిదొంగల దాడితో మరింత కృశించి పోతూనే వుంది
చూస్తూ చూస్తుండగానే కళ్ళముందే
వర్తమాన సామాజిక చిత్రపటం
యింకా యింకా మరింత గా మసకబారిపోతుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి