24, అక్టోబర్ 2022, సోమవారం

నడక దారిలో --20

 నడక దారిలో --20


          ఎలాగైతేనేం మళ్ళా విజయనగరం చేరాను.కనుచీకటి పడుతుండటం వలన సన్నజాజులు పందిరంతా విరబూసి స్వాగతించాయి."నాలుగునెలలుగా మామయ్య పిల్లలు వచ్చి మొగ్గలు కోసుకెళ్ళేవారు "అందిఅమ్మ.స్నానం చేసి వచ్చి మొగ్గలు ఒడినింపుకొని మాలకడుతుంటే వీర్రాజు గుర్తు వచ్చి పెదాలమీద కూడా సన్నజాజి విరిసింది . ముందుగా ఉత్తరం రాయటం వలన ఉషా మర్నాడు ఉదయమే కాలేజీకి వెళ్ళటానికి ఇంటికి వచ్చింది.

         కాలేజీ లో అడుగు పెడుతుంటే మనసంతా ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మిత్రులు అందరూ నా చుట్టూ చేరి విశేషాలు అడిగారు."సన్నబడ్డావు కానీ మంచి రంగు వచ్చావు సుభద్రా" అంటూ అందరూ ఆటపట్టించారు.

       ఫిజిక్స్ క్లాస్ కి వచ్చిన ప్రిన్సిపాల్ సీతాకుమారి గారు “ నువ్వు చదువు మానేసావేమో అనుకున్నాను “అన్నారు ప్రేమగా కళ్ళల్లోకి చూపులు కలుపుతూ.

       నన్ను ఎంతో ఎంతగానో ఇష్టపడే మేథ్స్ లెక్చరర్ ఉమాకుమారిగారు నన్ను చూసి” ఓహ్.

 మొత్తంమీద వచ్చేసావా?” అని ఆత్మీయంగా నవ్వారు.

    కాలేజీ చదువు కోసం సంసారబంధాన్ని వదిలించుకుని వచ్చాను.కానీ ఈ ఏడాదంతా కాలేజీ సరీగా జరగానే లేదు.

          ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బధ్ధమేనని

1971 అక్టోబరులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అన్యాయమని, తమ రాష్ట్ర రాజధానిలోనే తాము రెండవ తరగతి పౌరులుగా మారామనే ఆవేదనతో ఆంధ్రా ప్రాంతంలో అంతకుముందు కేవలం విశ్వవిద్యాలయాల పరిధిలోనే సాగిన జైఆంధ్రా ఉద్యమం ఇప్పుడు ప్రతీ కాలేజీ దగ్గరా జరిగినట్లే మాకాలేజీ దగ్గరకి కూడా విద్యార్థులు వచ్చి నినాదాలు ఇవ్వటం,వారితో మేము కూడా గొంతుకలపటం జరిగింది.ఒక్కొక్కప్పుడు వారం రోజులు పైగానే క్లాసులు జరిగేవి కావు.

      ఈ ఏడాది అక్టోబర్ జ్యోతి సంచికలో నా రెండో కథ ' దీపశిఖ' ప్రచురితం అయ్యింది.మరోసారి మా కాలేజీ లో గొప్పగా చెప్పుకున్నారు.మా తెలుగు లెక్చరర్ ప్రత్యేకంగా నన్ను అభినందించారు.

      మొదటి పండుగ అని దీపావళికి వీర్రాజు గారు రెండురోజుల కోసం విజయనగరం వచ్చారు.ఉన్నది రెండురోజులు కోసమే అయితేనేం ఆ రెండు రోజులూ మరపురాని విధంగా కథలూ,కబుర్లూ సినీమాలతోనూ గడిపాము.డాబామీద చిరుచలిగాలితో కలిసి జాజులు మమ్మల్ని పరిమళభరితం చేస్తుంటే,నాఒళ్ళో తలపెట్టుకుని నేను పాడే లలిత గీతాలు వీర్రాజు వింటూంటే ఈ క్షణం శాశ్వతమైతే బాగుండుననిపించేది.

     అంతలోనే హైదరాబాద్ లోస్వంత ఇంటిలోనే పరాయివాడిలా నాకు దూరంగా ఉండటం గుర్తు వచ్చి భలే కోపం వచ్చేది.

       ఆంధ్ర,తెలంగాణా ఉద్యమం గురించి కొంత ఆందోళన చెందేవాళ్ళం. ఎవరు కలుసుకున్నా ముఖ్యసంభాషణగా చోటుచేసుకునేది ఈ విషయమే.

      ఎలక్షన్ ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ విభజన ఆధారపడుతుంది అని ప్రజలు భావించారు.1971 సాధారణ ఎన్నికల్లో, ప్రజలను ఇందిరా గాంధీ ఇచ్చిన 'గరీబీ హఠావో!' అన్న నినాదం ఉత్తేజపరిచటంతో ఆ ఎన్నికల్లో ఆమెకు భారీ ఆధిక్యత లభించింది.ఏకారణం వల్లనైతేమి ఉద్యమం తాత్కాలికంగా చల్లబడి విభజన విషయం వెనుకబడింది.

     డిసెంబర్ 13 రాత్రి శ్రీనగర్ అమృతసర్ ప్రాంతంలో పాకిస్థాన్ బాంబు దాడి జరిగింది.ఆ రాత్రి 12 గంటలకు ఆకాశవాణి లో ఇందిరా గాంధీ ప్రజలతో మాట్లాడారు.యుధ్ధం తీవ్రం అయ్యింది.మర్నాడు విశాఖజిల్లా కలెక్టర్ ఆకాశవాణిలో బాంబింగ్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేసారు.విశాఖలో నౌకాశ్రయం, నౌకా నిర్మాణ కేంద్రం ఉండటంవలన ఎప్పుడు యుధ్ధం జరిగినా ఆ ప్రాంతం అప్రమత్తం అవుతూఉండేది.

      అయితే 13 రోజులు మాత్రమే నడిచిన ఈ యుద్ధాన్ని చరిత్రలోని అతి తక్కువ కాలం జరిగిన యుద్ధాలలో ఒకటిగా అందరూ చెప్పుకునేవారు.1971 డిసెంబరు 16న లొంగుబాటు అనంతరం, తూర్పు పాకిస్తాన్, స్వతంత్ర బంగ్లాదేశ్‌గా విడిపోయింది.

      అప్పట్లోనే అన్నయ్యకు రాజమండ్రి కాలేజీకి బదిలీ కావటంతో బంధువుల ఇంట్లో ఉన్నాడు.వీర్రాజుకి రాజమండ్రి లోని వాళ్ళ ఇంట్లో ఖాళీఉందేమో కనుక్కోమని ఉత్తరం రాయమంటే రాసాను.కానీ మళ్ళా ప్రయత్నం మీద కొన్నాళ్ళకే తిరిగి విజయనగరం కాలేజీకి బదిలీ అయింది.

        జనవరి సంక్రాంతి సెలవులకు చిన్నన్నయ్య,నేను హైదరాబాద్ బయలుదేరాము.అతను ఓ నాలుగు రోజులు ఉండి తిరిగి విజయనగరం వెళ్ళిపోయాడు.

         నేను కాపురానికి వచ్చేలోగా కుట్టు మిషను కొనమని వీర్రాజు గారిని కోరటంతో విద్యామిషన్ కొని ఉంచారు.నేను చిరుగు పట్టని పాతచీరలు,దుప్పట్లతో కిటికీలకు,వంటగదికీ హాలుకు మధ్యగల ద్వారానికి కర్టెన్లు కుట్టాను. తలగడలకు గలేబులు కుట్టాను. నాకూ,మా ఆడబడుచుకూ పండుగకి లేస్ బోర్డర్ వేసి చీరల్ని డిజైన్ చేసాను.సెలవులుగడచిపోయినా తిరిగి నా ప్రయాణం సంగతి తెలియలేదు.ఇంట్లో ఎవ్వరికీ నేను చదువు కొనసాగించటం అంతగా ఇష్టంలేదు కానీ వాళ్ళ అన్నయ్య మాటల్ని కాదనలేక మాత్రమే మౌనం వహించారనేది తెలుస్తోంది.వీర్రాజు కూడా ఆ విషయం ఎత్తటం లేదు.మాటిమాటికీ గుర్తు చేయడం ఇష్టం లేక నేనూ మౌనం వహించాను.

       నేను పండగ వెళ్ళాక రిపబ్లిక్ దినోత్సవం తర్వాత వరకూ ఉండాల్సి వచ్చింది.నాతో ఉత్తరాల్లో "జనవరి లో జరిగే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి మనిద్దరం వెళ్ళి సరదాగా తిరుగుదాం " అని కబుర్లు చెప్పిన వీర్రాజు గారు తీరా నేను వచ్చాక ఎప్పుడు ఎగ్జిబిషన్ వెళ్ళాలన్నా ఇంటిల్లిపాదినీ ఎప్పటిలాగే బయలుదేరదీసేవారు.

       చిన్న మరిదికి ఒక్కోసారి నైట్ షిఫ్ట్ లు ఉంటాయి.పెద్దమరిది టూర్లు కన్నా వెళ్తాడు.లేదా ఇంట్లో ఉంటాడు.ఎప్పుడూ లేనిది మా ఆడబడుచు "కృష్ణ తాగి వస్తాడు నాకు ఒక్కదాన్నీ పడుకోవటానికి భయం" అనటం మొదలెట్టింది."చెల్లెలివి నీకే భయం అంటే తర్వాత మరి నేనూ ఒక్కదాన్నే ఉండాలి కదా " అన్నాను కానీ తప్పని సరి కావటంతో నేను ఆమె పక్కనే ఒక్కొక్కసారి పడుకోవాల్సివచ్చేది.

     ఇక్కడ ఉన్నా నా మనసంతా కాలేజీ మీదే ఉండేది.మాటిమాటికీ కాలేజీ డుమ్మాలు కొట్టటంతో ఈ ఏడాది పాసవుతానన్న ఆశపోయింది.

      రత్నం వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోయారు.ఒకరోజు వాళ్ళింటికి నేనూ , ఆడబడుచు వెళ్ళాము.రత్నంతో " వదిన మళ్ళా వెళ్ళిపోతే ఒక్కదాన్ని అయిపోతాను"అంది మా ఆడబడుచు.మరొక్క మూడు నెలల్లో నా చదువు అయిపోతుంది.కదా.అంతవరకూ ఓపిక పట్టలేదా అని మనసులోనే అనుకున్నాను.

      నేను తిరిగి విజయనగరం వెళ్ళాలనుకునేసరికి చిన్నాడబడుచు అదే పాట మొదలెట్టేసరికి ఆమెని తీసుకునే బయలుదేరాను. ఓ వారం రోజులైనా తర్వాత మాపెద్దాడబడుచు ఏదో పనిమీద విజయనగరం వస్తే వాళ్ళతో కలిసి భువనేశ్వర్ వెళ్ళింది.

          ఈ లోపునే నేను కాలేజీకి వెళ్ళాక అమ్మకూ,చిన్నన్నయ్య కూ నా మీద చాలా ఫిర్యాదులు చేసింది.నా మనస్తత్వం తెలిసినవారు కావటాన వాళ్ళు నాతోనే చెప్పేసారు.

"మీ చిన్నన్నయ్య హైదరాబాద్ లో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే బాగుండు" అని ఒకసారి తను నాతో అన్నప్పుడు " ప్రస్తుతం ఇక్కడ ముల్కీ గొడవ ఎక్కువ గా ఉంది కనుక ఇక్కడ ఉద్యోగం సంపాదించటం కష్టమేమో" అన్నాను.

ఆ మాటల్నే" మా వదినకు మీరు హైదరాబాద్ లో ఉద్యోగానికి రావటం ఇష్టం లేదు" అని చిన్నన్నయ్య తో చెప్పిందట.నిజానికి వాళ్ళు హైదరాబాద్ కి వస్తే నాకే లాభం కదా అని నవ్వుకున్నాను.

       "పెళ్ళి అయ్యేలోపున సత్యవతిని మొండితనం ,మంకుపట్టు తగ్గేలా కొంచెం మార్చు" అన్నాడు చిన్నన్నయ్య.ఇన్నాళ్ళ మొండితనాన్ని ఏడాది లో మార్చటం అంతసులువా? ఆ మార్చేదేదో పెళ్ళైయ్యాక నువ్వే మార్చుకో బాబూ అనుకున్నాను.

      ఫిబ్రవరి లో మా మొదటి వివాహ వార్షికోత్సవానికి వీర్రాజు విజయనగరం వచ్చారు.పెళ్ళికి పూలజడ వేసుకోలేదుగానీ ఉషా వాళ్ళమ్మ బలవంతంగా నన్ను ఒప్పించి మల్లెపూలజడ వేసారు.ఎప్పుడూ మా పందిరి సన్నజాజులమాలని జడకి చుట్టుకోవటం నాకు అలవాటే కానీ ఇలా ప్రత్యేకంగా వేసిన మల్లె పూలజడ నాకు ఇబ్బందికరంగానే కాక కాస్త సిగ్గుగా అనిపించింది.వీర్రాజు కూడా నవ్వుతూ" ఇప్పుడు నిజంగా కొత్త పెళ్ళికూతురులా ఉన్నావు.నీ బొమ్మ వేస్తాను అలానే ఉండు" అంటూ స్కెచ్ బుక్ తీసి వేసారు.

      ఈ ఏడాది M R కాలేజీ శతవార్షికోత్సవాలు ప్రారంభించారు.ఆ సందర్భంలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు.అందులో మా మహిళా కాలేజీ తరపున రామన్ ఎఫెక్ట్ నేపధ్యంలో రంగులగురించి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కి తెలుగు లో నన్నూ, ఇంగ్లీష్ లో ఉషని వివరించటానికి ఎంపిక చేసారు.ఒకరోజు అన్నయ్యా వాళ్ళూ కూడా చూడటానికి వచ్చీ నన్ను వివరించమన్నారు.రెండురోజులుగా చెప్పి చెప్పి బొంగురు పోయిన గొంతుకతో వివరించటం చూసి అన్నయ్య నవ్వి స్టెప్సిల్ బిళ్ళలు తీసుకువచ్చి ఇచ్చాడు.అది నాకు ఎంతో సంతోషం కలిగించింది.

        మరోసంతోషకరమైన విషయం మా కాలేజీ మాగజైన్లో ప్రచురితమైన నా రచనను ఎంపిక చేసుకొని శతవార్షికోత్సవ సావనీర్ లో పునః ప్రచురణకి తీసుకున్నారని తెలిసి ఎంతగా పొంగిపోయానో!! అయితే పరీక్షలు కాగానే హైదరాబాద్ వెళ్ళిపోవటం తో ఆ కాపీ నాకు అందనేలేదు.

      శతవార్షికోత్సవాల సందర్భంగా సంగీతం, సాహిత్యం, నృత్యం కి చెందిన కార్యక్రమాలు వారంరోజుల పాటు జరిగాయి.బాలమురళీకృష్ణ,టి.ఆర్ మహాలింగం ఫ్లూట్ కచేరీలకు అక్కయ్యతో కలిసి వెళ్ళాను.

     నేను మరింత ఆసక్తి గా హాజరైంది ఆరుద్ర, కృష్ణశాస్త్రి పాల్గొన్న సాహిత్య కార్యక్రమం.అప్పటికే కృష్ణశాస్త్రికి గొంతు మూగపోయింది.ఆయన ఉపన్యాసాన్ని నాయని కృష్ణకుమారిగారు చదివి వినిపించారు.అప్పుడు వాళ్ళచేత ఆటోగ్రాఫ్ చేయించుకోవడానికి పుస్తకం లేక చేతిలో నోట్బుక్ ఉంటే అందులోనే చేయించుకున్నాను.ఆ తర్వాత నాయని కృష్ణకుమారి గారితో అనేక సమ్మేళనాలలో పాల్గొనడమే కాక , ముఖచిత్రాలకు ఆమెరావటం వలన కావచ్చు ,స్నేహంపెరిగి అనేకసార్లు రాకపోకలతో మేము దగ్గరయ్యాము.

         ఎమ్మార్ కాలేజీ శతవార్షికోత్సవాలు పూర్తికాగానే మాకాలేజీ వార్షికోత్సవం జరిగింది.నా సహాధ్యాయి సత్యవతి అనే అమ్మాయి నెమలినృత్యం అద్భుతంగా చేసింది.ఆ అమ్మాయి తర్వాత సత్యప్రియ పేరుతో సినీతారగా చాలా తెలుగు,తమిళ సినీమాలలో నటించింది.

       ఇలా అనేక కారణాలతో క్లాసులు సరీగా జరగకపోవడంతో ప్రైవేటు కాసులు ప్రతీ ఆదివారం పెట్టేవారు.అమ్మకి ఏమీ సాయం చేయటానికి కుదరకపోవటంతో అమ్మకూడా అలసిపోయి అప్పుడప్పుడు విసుక్కునేసరికి నాకు చదువుకోసం ఇక్కడ ఉంటున్నందుకు చిన్నబుచ్చుకునేదాన్ని,మళ్ళా అమ్మపరిస్థితి అర్థం చేసుకుని సరిపుచ్చుకునేదాన్ని. 

      మొత్తంమీద పరీక్షలు ఏదోలా పూర్తి చేసాను.ప్రాక్టికల్స్ మేనెల మొదటివారంలో ఉన్నాయి.వీర్రాజుముందే వచ్చేసారు.నా ప్రాక్టికల్ పరీక్షలు అయ్యేలోపున ఒకసారి శ్రీకాకుళం లోని బాల్యమిత్రుని ఇంటికీ, అక్కడినుంచి బరంపురం లో ఉప్పల లక్ష్మణరావు గారి అధ్యక్షతన జరిగే వికాసం అనే సాహిత్య సంస్థ సమావేశాలకు వెళ్ళి వచ్చారు.

       నా పరీక్షలు అయ్యాక మేమిద్దరం విజయనగరం నుంచి హైదరాబాద్ బయలుదేరాము.ఇకపై విజయనగరం వస్తే నేను ఇక్కడ అతిథినే కదా అనుకుంటూ కదులుతున్న రైలు నుండి దూరమౌతోన్న ఊరికి వీడ్కోలు చెప్తూ కళ్ళనీళ్ళతో పరికించాను.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి