~ యువభారతి తో నా అనుబంధం~~
స్వాతి ప్రారంభసంచికలో గౌరవసంపాదకునిగా శీలా వీర్రాజు గారి పేరు చూసి అభిమానిగా ఆయన రచనలగురించి నేను ఉత్తరం రాస్తే నాకు వారి కవితా సంపుటాలతో పాటు యువభారతి ప్రచురణ అయిన పంచవటి అనే అయిదుగురు కథకుల సంకలనాన్ని పంపించారు.అదే యువభారతితో పరోక్షంగా నామొదటిపరిచయం.
తర్వాత "చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది" అనే యువభారతి ఆశయం నన్ను ఆకర్షించింది.
మంచి ఆశయంతో ధ్యేయంతో 1963లో విజయదశమి అక్టోబరు 27 నాడు ఇరివెంటి కృష్ణమూర్తిగారు దీనిని స్థాపించి అధ్యక్షుడిగా యువభారతి ఆవిర్భవించిందనే విషయాన్ని వివాహానంతరం ఆయన ద్వారా విన్నాను.
యువతరంలో సమాజహితం , సాహిత్య అభ్యుదయం పెంపొందింప చేయటానికి ప్రతీనెలా మొదటి ఆదివారం కృషిచేస్తుండేదని వీర్రాజు గారు చెప్తూఉండేవారు.సాహిత్యంపట్ల,ఆసక్తీ,పఠనాభిలాషని పెంపొందించే విధంగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించటమే కాకుండా ముఖ్యంగా తెలుగు భాషా విద్యార్థులకు సౌమనస్యం, సౌజన్యం , ఉన్నత భావాలను, నిర్మాణాత్మకమైన రీతిలో వ్యక్తిత్వాన్ని రూపొందించుకునేలా ప్రోత్సహిస్తుండేదనేది విని మరింత పులకించాను.
వీర్రాజు గారు ఉత్తరాల్లో ఎప్పటికప్పుడు యువభారతి కి వేయాల్సిన ముఖచిత్రాల గురించి చెప్తుండేవారు
వేసవి సెలవులకు హైదరాబాద్ వచ్చినరోజుల్లో నాకు చాలా సంతోషం కలిగించేదీ ఎదురుచూసేది ఆదివారం సాయంత్రం.ఎందుకంటే ఆదివారం రోజు ఆంధ్ర సారస్వత పరిషత్తులో యువభారతి నిర్వహించే కావ్యలహరి ఉపన్యాస పరంపర ఉంటుండేది. ఎప్పుడూ సాహిత్యసభలకు వెళ్ళలేదేమో నాకు ఉత్సాహంగా ఉండేది. కావ్యలహరి పేరిట మనుచరిత్ర ,పారిజాతాపహరణము ,వసుచరిత్రము ,విజయవిలాస కావ్యాలపై ఉపన్యాస పరంపరగా ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారితో ఉపన్యాసాలను యువభారతి సారథులు ఇరివెంటి కృష్ణమూర్తి గారు,వంగపల్లి విశ్వనాధం గారూ నిర్వహించేవారు.
ప్రాచీన సాహిత్యం మీదే ఉపన్యాసాలు ఉన్నా గంభీరస్వరంతో ఆయన పద్యాలు చదువుతూ వివరించటం అద్భుతంగా అనిపించేది.మొదట్లో పరిషత్తు హాలులోనే జరిగే సభలకు తర్వాత్తర్వాత అశేషంగా జనం వచ్చి వరండాలోను బయటా నిండిపోవటమేకాక ముందు ఖాళీ ప్రదేశం లోనూ నిలబడి వినేవారు.దాంతో పరిషత్తు వెనుక ఓపెన్ వేదిక పై ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు.
ఉపన్యాసాలు సరేకానీ వాలంటీర్లుగా ఆ సమావేశం ఆవరణంతా గలగలా సందడిగా ఉత్సాహంగా ఎగిరే సీతాకోక చిలుకల్లా తిరిగే యువతీయువకులను చూస్తుంటే నాకు నా కాలేజీ గుర్తువచ్చి గుబులుఅయ్యేది.వాళ్ళంతా కూడా సుమారుగా నా వయసు వాళ్ళు కావటం వలన వాళ్లలో నన్ను చూసుకుని మళ్ళా అలా తిరగ్గలనా అనిపించేది.చెవులు ఉపన్యాసం వింటున్నా ,నా చూపులు వారి వెనకెనకే తిరిగేవి.
తర్వాత్తర్వాత ఆ యువభారతీయులైన
సుధామ,నాగినేని భాస్కర్రావు,కె.బి.లక్ష్మి, కామేశ్వరరావు,రత్నమాల మొదలైన వారంతా మాకు కుటుంబమిత్రులు అయ్యారు.
యువభారతి ప్రచురణలు వందకి పైగానే ముఖచిత్రాలు వీర్రాజే వేసారు.మాపరిచయం అనంతరం మొదలుపెట్టిన వచన
కావ్యం వివాహం తర్వాత పూర్తి చేసారు.అదే వీర్రాజుగారు రాసిన తొలి దీర్ఘ కావ్యం” మళ్ళీవెలుగు “నాకే అంకితం చేసారు. యువభారతి ప్రచురించిన మళ్ళీ వెలుగు కావ్యం ఉగాది రోజున జరిగింది. ఈ పుస్తకావిష్కరణ సభ కి 1973 లో మూడునెలల పసిపాప పల్లవిని తీసుకొని హాజరయ్యాను.మాదంపతులకు యువభారతి సంస్థతో చిరకాల అనుబంధం నేటికీ కొనసాగుతూనే ఉంది.
1980 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య ద్వారా నేను తెలుగు ఎమ్మే చేసినప్పుడు యువభారతి ప్రచురణలే నన్ను ఆదుకున్నాయి.ఎందుకంటే అప్పట్లో మూడేళ్ళ మానసిక వికలాంగుడైన బాబుతో అంతర్ముఖీనమై ఒత్తిడికి గురైన స్థితిలో నేను బయటకు వెళ్ళలేక వీర్రాజు గారు ఇచ్చిన యువభారతి పుస్తకాలు, ఆరుద్ర సమగ్ర సాహిత్యం మాత్రమే చదివి రెండవ తరగతిలో ఉత్తీర్ణత సాధించానంటే యువభారతి ప్రచురణలు తెలుగు సాహిత్యానికి ఎంతటి సమగ్రమైన గ్రంథాలు అందించాయో అర్థమౌతుంది..
వీర్రాజు గారు యువభారతి ముఖచిత్రాలు వేస్తున్నప్పుడు ఎంతో తపోనిష్టతో వేయటం నేను చూసాను. అందులోనూ కావ్యాలహరికి శిల్పవిన్యాసంలా అర్థవలయాకృతిలో వేసిన ముఖచిత్రం మర్చిపోలేనిది.అది నాకెంతో నచ్చిన ముఖచిత్రం.సాహితీవేత్తలకూ,సావనీర్లకూ,ప్రభుత్వసంస్థలకూ చాలానే వేసినా యువభారతి అనే ఒకేఒక సాహిత్యసంస్థకు వందకి పైగా ముఖచిత్రాలు వేయటం అన్నది ఒక రికార్డుగా చెప్పుకోదగినది.
అటువంటి యువభారతి సంస్థ ఈనాడు షష్ట్యబ్ది ఉత్సవం చేసుకొంటున్న సందర్భంలో ఈసంస్థతో విడదీయరాని బంధం గల శీలా వీర్రాజు గారి స్థానంలో నేను ఈ నాలుగు మాటలు రాస్తున్నందుకు ఒక కంట కన్నీటితో,మరోకంట ఆనందంతో హృదయపూర్వక అభినందనలు
తెలియజేస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి