7, సెప్టెంబర్ 2022, బుధవారం

నడక దారిలో -18

 నడక దారిలో –18

  1971లో ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ నుండి వెళ్ళిపోవాలని డిమాండ్ వలన NGO బందు మొదలైందనీ,అది చాలా తీవ్రంగా జరుగుతుండటం వలన ఎప్పటి వరకూ సాగుతుందో తెలియదనీ,పరీక్షలు అయిపోయినట్లైతే వస్తాననీ, వివాహం తర్వాత వచ్చిన తన తొలి పుట్టినరోజు కలిసి జరుపుకోవాలని ఉందని రాసారు వీర్రాజు. అలాగే పరీక్షలు పూర్తి అయ్యాయని తెలిసి రెక్కలు కట్టుకునిి విజయనగరం ఏప్రిల్ 21 సాయంత్రానికి వచ్చేసారు.

       అనుకోకుండా ప్రాక్టికల్ పరీక్షలు పోష్ట్ ఫోన్ కావటంతో శ్రీకాకుళం లో పనిచేస్తున్న బాల్యమిత్రుడి దగ్గరకు వెళ్దామని బయల్దేరదీసారు.చిన్నన్నయ్యకి ఎలక్షన్ డ్యూటీ పడింది.మేమిద్దరమే వెళ్ళాము.ఆరాత్రి ఆ మిత్రుడు వెళ్ళనివ్వక వెళ్లకపోవడం తో రాత్రికి ఆగి ఉదయం విజయనగరం వచ్చేసాము. 

      ఆ వెంటనే మా పెద్ద ఆడబడుచు వాళ్ళు ఉన్న భువనేశ్వర్ కి వెళ్ళాము.ఎండలకో ఎక్కడో భోజనం పడకపోవటం వలనో వీర్రాజు కి కొద్దిగా అనారోగ్యం కలిగే సరికి తల్లడిల్లి పోయాను.ఆ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోగానే కోలుకున్నారు.

         భువనేశ్వర్ లో 8-12 శతాబ్దాలమధ్య నిర్మించబడి అద్భుతమైన శిల్పాలతో అలరారే ఆలయాలు ఉండటంవలన దాన్ని టెంపుల్ సిటీ అని కూడా అంటారుట .ఆ ప్రాంతంలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ్ ఆలయం, లింగరాజు టెంపుల్,రాజారాణీ టెంపుల్, ఖండగిరీ,దేవగిరీ గుహలూ, ధవళగిరి మొదలైన విహార ప్రదేశాలన్నీ చెట్టాపట్టాలేసుకుని ప్రేమ పక్షుల్లా విహరించాం.శిల్పాల స్కెచ్ వేస్తుండగా ఒక బెంగాలీ బాబు చూసి heavens gift అని వీర్రాజును పొగిడేసరికి ఏకాగ్రతతో వేస్తున్న ఆయన్ని చూసి నేను పొంగిపోయాను. ఏ శిల్పం చాటునో నా చెంపలపై కూడా చటుక్కున కొత్త స్కెచ్ వచ్చి చేరేది.

    కొత్త దంపతులకు గిలిగింతలు పెట్టే కోణార్క్ శిల్ప సౌందర్యం చూస్తుంటే తాపీ ధర్మారావు గారు రాసిన “దేవాలయాలలో బూతు బొమ్మలు ఎందుకు?” అనే పుస్తకం గుర్తు వచ్చింది. విజయనగరానికి దగ్గర్లో ఉన్న విశాఖలో సముద్రాన్ని కూడా అంతవరకూ చూడనేలేదేమో పూరీలో అనంతజలరాశిని చూసి అబ్బుర పడ్డాను.పాలనురుగుల అలలు సముద్రగర్భంనుండి తీసుకు వచ్చిన గవ్వల్ని, నున్నని రాళ్ళని ఆత్మీయంగా అందుకుని మురిసిపోయాను.ధవళగిరి స్తూపం చుట్టూ బుధ్ధుని కథలోని ముఖ్యఘట్టాలని చూసి ధ్యానాంతరంగంతో మౌనిని అయ్యాను. వారంరోజులపాటూ తిరిగి తిరిగి ఆనందాలనూ,పరిమళభరిత అనుభవాలూ మూటగట్టుకుని విజయనగరం వచ్చేసాము.

       వచ్చిన నాలుగు రోజుల తర్వాత ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేసుకుని హైదరాబాద్ కి ఇద్దరం బయల్దేరాం.అమ్మ తీపి ఆవకాయ, మిఠాయిలు తయారు చేసి ఇచ్చింది.నేను పత్రికల్లో కట్ చేసి కుట్టించిన రంగనాయకమ్మ,ద్వివేదుల విశాలాక్షి లాంటి రచయిత్రుల సీరియల్సే కాక, మాలతీ చందూర్ రాసిన వంటలూ పిండివంటలు పుస్తకం కొనుక్కొని తీసుకు వెళ్ళటానికి సర్దుకున్నాను.

          అప్పట్లో హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం విజయనగరం నుంచి హైదరాబాద్ కు ఇరవై నాలుగు గంటలు పట్టేది.హైదరాబాద్ లో సాయంత్రం ఎక్కుతే విజయనగరంకి మర్నాడు సాయంత్రం చేరుతుంది.. విజయనగరంలో ఉదయం ఎక్కితే హైదరాబాద్ కి మర్నాడు ఉదయంచేరుతుంది.స్టేషన్ కు కుమారీ,తన చెల్లెలూ వచ్చారు.నేను వెళ్ళిపోతున్నానని వాళ్లు ఏడుస్తుంటే నాకు కూడా నా వాళ్ళందర్నీ విడిచివెళ్తున్నందుకు దుఃఖం ముంచుకొచ్చింది.ఇది ప్రతీ ఆడపిల్ల కూ అనుభవైకవేద్యమే కదా  

       ఇద్దరమే ఇరవైనాలుగు గంటలపాటూ చేసిన ప్రయాణం కూడా ఒక కొత్త అనుభవమే.

      మేము ఇల్లు చేరేసరికి వీర్రాజు గారి బాల్యమిత్రుడు, భార్య,రెండేళ్ళకొడుకుతో ఢిల్లీ నుండి వచ్చిఉన్నారు. హైమ నావయసుదే కావటాన నాకు కుమారీతో ఉన్న స్నేహం లాగే ఆమెతో కంఫర్టుగా అనిపించింది.ఆ కుటుంబం తో హైదరాబాద్ లోని విహార ప్రదేశాలు మళ్ళా తిరిగాము.

     హైదరాబాద్ రామకోటిలో ఉన్న మా ఇంట్లో పేద్ద వంటగది.దానికి మూడింతలు పెద్దదైన మరోగది ఉంటుంది .ఆ పెద్దగా ఉన్నగదిని శిల్పాలచిత్రాలు ఉన్న పెద్దకర్టెన్ తో పార్టిషన్ చేసారు.ఆ పార్టిషన్ కి ఒకవైపు ఒకపుస్తకాలషేల్ప్, వీర్రాజు గారు చిత్రాలు వేసుకోవడానికి వీలుగా టేబుల్, కుర్చీఉంటుంది, టేబుల్ మీద వాజ్ లో రకరకాల బ్రెష్ లు,కలాలు, టేబుల్ మీద రంగులూ ఉంటాయి.మరోపక్క ఇటీవలే కొన్న వైర్ అల్లిక సోఫా సెట్ ఉంటుంది.

     పార్టిషన్ రెండో భాగం లో కొత్తగా కొన్న డబుల్ కాట్ పైన ఓపక్క వీణ పెట్టగా మిగిలిన స్థలంలో చిన్న ఆడబడుచు పడుకుంటుంది.ఇద్దరు మరుదులు, బేంక్ లో పనిచేస్తూన్న బంధువుల అబ్బాయి కింద బొంతలు వేసుకు పడుకునే వారు.మా ఆడబడుచు నా వయసుదే కానీ మిగతావాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కావటాన, కొత్తదనం వల్ల చనువుగా మాట్లాడటం తిరగటం చేయ లేకపోయేదాన్ని.

   వీర్రాజు గారు ఒక్కోసారి సినిమాకో హొటల్ కో వెళ్దామంటూ ప్రోగ్రాం వేసి ఇంట్లో వాళ్ళందరినీ బయల్దేరదీసేవారు.వాళ్ళైనా "మీరిద్దరూ వెళ్ళండి" అని అనేవారు కాదు.అన్నగారితో మాట్లాడటం తక్కువ.ఎదురు మాట్లాడటమూ తక్కువే.ఆ రోజుల్లో కుటుంబం లో మొదటి సంతానం కి సుప్రీం పవర్లు ఉండేవనుకుంటాను.ఇక అందరం సంతాపసభకి వెళ్ళినట్లు ఒకరితో ఒకరం మాట్లాడకుండా నిశ్శబ్దంగా సినీమా చూసుకొనో, బుధ్ధిగా హొటల్లో తినో ఇంటికి వచ్చేసే వాళ్ళం. దాంతో నాకు ఆయనతో సినిమా చూడాలనే ఆసక్తి , ఉత్సాహం ఎగిరిపోయింది.అందుచేత మేమిద్దరమే వెళ్ళి చూసిన సినిమాలే లేవు.

అటువంటప్పుడు చాలా కోపం వచ్చేది.హొటల్ లో సర్వర్ లా ఆర్డర్ ఇస్తే తెచ్చినట్లుగానో అవమానంచేసినట్లుగానో బాధ పడేదాన్ని.ఆ తర్వాత ఆయనతో తగువు పెట్టుకోవాలనుకున్నాను.పెళ్ళయిన కొత్తలోనే మా మధ్య తగువు రావటం ఇష్టం లేక బయటపడలేకా మనసు కలచి వేసింది.తర్వాత్తర్వాత నా అభ్యంతరాన్ని అర్థం చేసుకుని పిలిచి చెప్పటమో,లోపలకి వచ్చి చెప్పటమో అలవాటైంది.

          ఆ మధ్య వీర్రాజు గారి రచనలమీద వచ్చిన వ్యాసాల్ని సంకలనం చేసినప్పుడు కొందరు ఆత్మీయ కవుల్ని కూడా వ్యాసం రాసి ఇమ్మని కోరితే సాహిత్యం మీద కాకుండా స్నేహం మీదే రాసీ నాచేతి టీ చాలాసార్లు తాగిన విషయాన్ని కూడా ఉటంకించటం విశేషం.

          వచ్చినవాళ్ళు వెళ్ళేసరికి తొమ్మిదో పదో అయ్యేది.ఇక అప్పుడు చప్పగా చల్లారిపోయిన వంటకాల్ని ఇద్దరం భోంచేసేవాళ్ళం.

ఆతర్వాత అందరూ నిద్రపోయేవరకూ మళ్ళా ఆయన చిత్రాలు వేసుకుంటూ కూర్చునేవారు. నేను పంపు స్టౌ మీద వండే అలవాటు లేని వంటపనీ, ఇంటిపనులు చేసి అలసటకు కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా నిద్రని తోలుకుంటూ రెప్పలు ఎత్తిపట్టుకుని సోఫాలో ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చునే దాన్ని.ఒక్కొక్కప్పుడు అదేసమయంలో బాపూ బొమ్మలు చూసి వేస్తూఉండేదాన్ని‌.

    పెళ్ళి అయ్యాక వచ్చినప్పుడు స్వాతి ఆఫీసు లో మా పడక ఉండేది.వీర్రాజుగారు ప్రభుత్వఉద్యోగి కనుక పత్రిక సంపాదకుడిగా పేరు ఉండరాదని అభ్యంతరం రావటంతో స్వాతి నుండి బయటకు వచ్చేసారు. అందువలన స్వాతి ఆఫీసు తాళం అడగటం బాగోదు కదా.అదీగాక ఇక్కడ ఖాళీ చేసి స్వాతి ఆఫీసును విజయవాడ కి మార్చేందుకు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.       

       అందుకని అందరూ నిద్రపోయేవరకూ గడిపి అప్పుడు నవారు మంచాన్ని వంటింట్లోకి తీసుకువెళ్ళి వాల్చి పక్క సర్దుకుని దానిమీద వాలేసరికి ముందుగా నిద్రే శరీరాన్ని ఆక్రమించేది.నిద్ర తీరకుండానే తెల్లవారుజాము నాలుగు గంటలు అయ్యేసరికి మంచినీళ్ళు వస్తున్నాయనే సూచనగా గొట్టంలోని గాలివల్ల కొళాయి ఈల వేసేసరికి ఒక్క గెంతుతో మంచం దిగి నేను ముఖం కడుక్కుని మంచినీళ్ళను పట్టేందుకు, ఆయన బొమ్మలు వేసుకునేందుకు పరుగు పెట్టేవాళ్ళం.

     అప్పట్లోనే బసు చటర్జీ తీసిన జయాబాధురీ నటించిన " పియా కా ఘర్" సినిమా విడుదల అయితే ఇంట్లో అందరం కలిసే చూసాం. ఆ డైరెక్టర్ మా ఇంట్లో మా సంసారాన్ని తొంగిచూసే ఆ సినిమా తీసాడేమో అనిపించింది.

            పేజీలకు పేజీలు ఉత్తరాల్లో ఒలికించిన కబుర్లన్నీ పావురాలే ఎగరేసుకు పోయాయా? మొగమాటాలతో,భయాలతో మేము మాటలను కలబోసుకోకుండానే, మనసులను పంచుకోకుండానే మా దాంపత్యం ఇలానే దేహభాషతో మాత్రమే కలకాలం నడుస్తుందా? ఈ వ్యక్తి నా మనసులోకి రాకుండా బయటే నిలబడిపోతారా? నాలో ఏమూలో ‌ఒకసంశయం,ఒక అసంతృప్తి మొలకెత్తింది.దానిని వృక్షంగా ఎదగకుండా అభిమానంతో కత్తిరించేసాను.    

    మే30 నుండి ప్రారంభమైన అఖిలభారత రచయితల సభలు కొంత ఊరట కలిగించాయి‌ ఆ సభల్లోనే వాసిరెడ్డి సీతాదేవి,ఆనందారామం,డి.కామేశ్వరీ ,రామలక్ష్మీ మొదలైన రచయిత్రులను పరిచయం చేసారు.ఆ తర్వాత్తర్వాత వారితోనే వేదికలు పంచుకునేలా నేను రచయిత్రి గా ఎదిగాను.

            అప్పుడప్పుడు ఇంటిమీద,అమ్మ మీద దిగులు అనిపించేది.వేెసవిలో నా పొడుగాటి జడకి చుట్టూ మాలచుట్టుకునేటన్ని పూలను ఇచ్చే సన్నజాజి పందిరి ఎంత చిన్నబోయిందో అని తలంచుకొనే దాన్ని.

         రాజధాని నగరంలో కిటికీలోంచి తొంగిచూసే అవకాశం లేక చందమామ నాకోసం అక్కడ డాబా మీద వెతుక్కొని నేను కనిపించక పోవటం తో కురిసే వెన్నెల్ని పొదువుకొని మేఘాలదుప్పట్లో ముఖం దాచుకున్నాడేమో.నేను పాడుకునే లలిత గీతాలు గొంతులో కొట్టుకు లాడేవి.

      హైదరాబాద్ వచ్చి నెల కావస్తుంది.నా చదువు సంగతి ఏమీ తెలియటం లేదు.కాలేజీలు తెరిచారోలేదో నా స్నేహితురాలు కూడా ఉత్తరం రాయలేదు.నేనైనా ఉత్తరం రాయాలి.

     వీర్రాజు ఉదయమే లేచి స్నాన పానాదులు చేసి ఆఫీస్ కి బందు కనుక వేయాల్సిన ముఖచిత్రాలకు బొమ్మలు వేసుకుంటూకూర్చునేవారు. అంతలో మిత్రులు వస్తేనో, స్వాతి పత్రిక పని ఉంటే బయటకు వెళ్ళేవారు.తిరిగి వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఒకరో ఇద్దరో సాహితీ మిత్రులు ముఖచిత్రాలు వేయించుకునేందుకు కలిసి వచ్చేవారు.వాళ్ళు పని పూర్తి చేసుకుని వెళ్ళేలోపల ఓ రెండు సార్లయినా టీ ఇవ్వమని గోడకో లేకపోతే అటువైపు వచ్చిన మరుదులకో చెప్పేవారు.ప్రేమపూర్వకంగా దేవీ అనో లేదా సుభా అనో పిలవకపోయినా సుభద్రా అని పిలవడానికి కూడా అందరి ముందు ఆయనకి మొగమాటమే.నేను టీ తీసుకొని ఇవ్వటానికి వెళ్తే వచ్చిన వాళ్ళని నాకు పరిచయంచేయటం గానీ లేదా నాకు

వాళ్ళని పరిచయం చేయటం గానీ చేసేవారు కాదు.
అటువంటప్పుడు చాలా కోపం వచ్చేది.హొటల్ లో సర్వర్ లా ఆర్డర్ ఇస్తే తెచ్చినట్లుగానో అవమానంచేసినట్లుగానో బాధ పడేదాన్ని.ఆ తర్వాత ఆయనతో తగువు పెట్టుకోవాలనుకున్నాను.పెళ్ళయిన కొత్తలోనే మా మధ్య తగువు రావటం ఇష్టం లేక బయటపడలేకా మనసు కలచి వేసింది.తర్వాత్తర్వాత నా అభ్యంతరాన్ని అర్థం చేసుకుని పిలిచి చెప్పటమో,లోపలకి వచ్చి చెప్పటమో అలవాటైంది.
          ఆ మధ్య వీర్రాజు గారి రచనలమీద వచ్చిన వ్యాసాల్ని సంకలనం చేసినప్పుడు కొందరు ఆత్మీయ కవుల్ని కూడా వ్యాసం రాసి ఇమ్మని కోరితే సాహిత్యం మీద కాకుండా స్నేహం మీదే రాసీ నాచేతి టీ చాలాసార్లు తాగిన విషయాన్ని కూడా ఉటంకించటం విశేషం.
          వచ్చినవాళ్ళు వెళ్ళేసరికి తొమ్మిదో పదో అయ్యేది.ఇక అప్పుడు చప్పగా చల్లారిపోయిన వంటకాల్ని ఇద్దరం భోంచేసేవాళ్ళం.
ఆతర్వాత అందరూ నిద్రపోయేవరకూ మళ్ళా ఆయన చిత్రాలు వేసుకుంటూ కూర్చునేవారు. నేను పంపు స్టౌ మీద వండే అలవాటు లేని వంటపనీ, ఇంటిపనులు చేసి అలసటకు కళ్ళు మూతలు పడుతుంటే బలవంతంగా నిద్రని తోలుకుంటూ రెప్పలు ఎత్తిపట్టుకుని సోఫాలో ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూర్చునే దాన్ని.ఒక్కొక్కప్పుడు అదేసమయంలో బాపూ బొమ్మలు చూసి వేస్తూఉండేదాన్ని‌.
    పెళ్ళి అయ్యాక వచ్చినప్పుడు స్వాతి ఆఫీసు లో మా పడక ఉండేది.వీర్రాజుగారు ప్రభుత్వఉద్యోగి కనుక పత్రిక సంపాదకుడిగా పేరు ఉండరాదని అభ్యంతరం రావటంతో స్వాతి నుండి బయటకు వచ్చేసారు. అందువలన స్వాతి ఆఫీసు తాళం అడగటం బాగోదు కదా.అదీగాక ఇక్కడ ఖాళీ చేసి స్వాతి ఆఫీసును విజయవాడ కి మార్చేందుకు ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.       
       అందుకని అందరూ నిద్రపోయేవరకూ గడిపి అప్పుడు నవారు మంచాన్ని వంటింట్లోకి తీసుకువెళ్ళి వాల్చి పక్క సర్దుకుని దానిమీద వాలేసరికి ముందుగా నిద్రే శరీరాన్ని ఆక్రమించేది.నిద్ర తీరకుండానే తెల్లవారుజాము నాలుగు గంటలు అయ్యేసరికి  మంచినీళ్ళు వస్తున్నాయనే సూచనగా  గొట్టంలోని గాలివల్ల కొళాయి  ఈల వేసేసరికి ఒక్క గెంతుతో మంచం దిగి నేను ముఖం కడుక్కుని మంచినీళ్ళను పట్టేందుకు, ఆయన బొమ్మలు వేసుకునేందుకు పరుగు పెట్టేవాళ్ళం.
     అప్పట్లోనే బసు చటర్జీ తీసిన జయాబాధురీ నటించిన   " పియా కా ఘర్" సినిమా విడుదల అయితే ఇంట్లో అందరం కలిసే చూసాం. ఆ డైరెక్టర్ మా ఇంట్లో మా సంసారాన్ని తొంగిచూసే ఆ సినిమా తీసాడేమో అనిపించింది.
            పేజీలకు పేజీలు ఉత్తరాల్లో ఒలికించిన కబుర్లన్నీ  పావురాలే ఎగరేసుకు పోయాయా? మొగమాటాలతో,భయాలతో మేము మాటలను కలబోసుకోకుండానే, మనసులను పంచుకోకుండానే మా దాంపత్యం ఇలానే   దేహభాషతో మాత్రమే కలకాలం  నడుస్తుందా? ఈ వ్యక్తి నా మనసులోకి రాకుండా బయటే నిలబడిపోతారా? నాలో ఏమూలో ‌ఒకసంశయం,ఒక అసంతృప్తి మొలకెత్తింది.దానిని వృక్షంగా ఎదగకుండా  అభిమానంతో కత్తిరించేసాను.    
    మే30 నుండి ప్రారంభమైన అఖిలభారత రచయితల సభలు కొంత ఊరట కలిగించాయి‌ ఆ సభల్లోనే    వాసిరెడ్డి సీతాదేవి,ఆనందారామం,డి.కామేశ్వరీ  ,రామలక్ష్మీ మొదలైన రచయిత్రులను పరిచయం చేసారు.ఆ తర్వాత్తర్వాత వారితోనే వేదికలు పంచుకునేలా నేను రచయిత్రి గా ఎదిగాను.
            అప్పుడప్పుడు ఇంటిమీద,అమ్మ మీద దిగులు అనిపించేది.వేెసవిలో నా పొడుగాటి జడకి చుట్టూ మాలచుట్టుకునేటన్ని పూలను ఇచ్చే సన్నజాజి పందిరి ఎంత చిన్నబోయిందో అని తలంచుకొనే దాన్ని.

         రాజధాని నగరంలో కిటికీలోంచి  తొంగిచూసే అవకాశం లేక చందమామ నాకోసం అక్కడ   డాబా మీద వెతుక్కొని నేను కనిపించక పోవటం తో  కురిసే వెన్నెల్ని పొదువుకొని మేఘాలదుప్పట్లో ముఖం దాచుకున్నాడేమో.నేను  పాడుకునే లలిత గీతాలు గొంతులో కొట్టుకు లాడేవి.

      హైదరాబాద్ వచ్చి నెల కావస్తుంది.నా చదువు సంగతి ఏమీ తెలియటం లేదు.కాలేజీలు తెరిచారోలేదో నా స్నేహితురాలు కూడా ఉత్తరం రాయలేదు.నేనైనా ఉత్తరం రాయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి