13, ఫిబ్రవరి 2022, ఆదివారం

అతడు-ఆమె -- ఉప్పల లక్ష్మణరావు

 నాకు నచ్చిన రచన ఉప్పల లక్ష్మణరావు గారు రాసిన  నవల "అతడు-ఆమె"

          ఈ నవల 70 లలో ఒకసారి చదివాను.మళ్ళా ఒక రెండు మూడునెలలక్రితం మళ్ళీ చదివాను.ఆప్పుడే ఫేస్బుక్ లో పెట్టడానికి రాసాను. లక్ష్మణరావు గారు బరంపురం లో వికాసం అనే సాహిత్య సంస్థ ద్వారా జరుపు సమావేశాలకు మా చిన్నన్నయ్య, వీర్రాజు గారు తరుచూ వెళ్ళేవారు.
తెలుగు సాహిత్యం లో తప్పక చదవాల్సిన ముఖ్యమైన పది నవలల్లో లక్ష్మణరావుగారు రాసిన "అతడు -ఆమె" ఒకటి.
         మూడు భాగాలుగా ఉండే ఈ నవల భారతస్వాతంత్ర్య పోరాటాన్ని చిత్రీకరించే చారిత్రక నవల. ఈ నవలను ఇద్దరు వ్యక్తుల మధ్య డైరీలో నడిచినట్లుగా రాసారు రచయిత
        మొదటిభాగం లోని కథ శాస్త్రీ ,శాంతం ల మధ్య జరుగుతుంది.
       శాస్త్రి విదేశంలో బారిష్టరు చదివి చెన్నపట్నంలో లా ప్రాక్టీసు పెట్టిన లాయరు. శాంతం ఆధునిక భావాలున్న మహిళ. శాస్త్రి పాతకాలం మనిషి. చాలా విషయాల్లో వారిద్దరి అభిప్రాయాలు కలవవు. డబ్బే అన్నిటికన్నా ప్రధానమైనది, దాని కోసం విలువలు, ఆదర్శాలూ పక్కన పెట్టొచ్చూ అన్నది అతని వాదన. మనం సంపాదించే డబ్బును ఇతరులకు ఖర్చు పెట్టడంతో వచ్చే తృప్తి తెలుసుకోమంటుంది ఆమె.  ఈ పాత్రలు తమ మధ్య జరిగిన సంఘటనలను డైరీగా రాసుకుంటారు.ఒకే సంఘటనకు ఇద్దరు స్పందించే తీరు ద్వారా పాత్ర చిత్రణ జరుగుతుంది ఈ నవలలో ఈ ప్రక్రియ ఒక ప్రయోగమనే చెప్పుకోవాలి.
  శాంతం మనస్ఫూర్తిగా స్వాతంత్ర్యోద్యమంలోకి దిగితే, శాస్త్రి పేరు ప్రతిష్ఠల కోసం రాజకీయాల్లోకి రావటానికి ఉద్యమంలో కొస్తాడు. ప్రతి విషయాన్నీ డబ్బు రూపంగానే చూసే అతని మనస్తత్తత్వం నచ్చని శాంతం అతనిని వదిలి ఇద్దరి కూతుళ్ళతో కాశ్మీరం వెళ్ళి తిరిగి అతన్ని చేరడంతో వారిద్దరి కథ ముగుస్తుంది.
      అతడు ఆమె రెండవ భాగం శుభ, జనార్ధనరావుల కథ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొదలవుతుంది. శాంతానికి కూతురు పుట్టిన సమయంలో ఒకరోజు ఒక పదహారేళ్ళ పిల్ల శాంతం ఇంటికి వచ్చి అన్నం పెట్టమంటుంది. ఆమె తెలంగాణావాసి అని, ఆమె తల్లిదండ్రులు 100 రూపాయల కోసం తమిళనాడు వాళ్ళకి అమ్మేయగా, వాళ్ళు ఈమెని వేశ్యగా అమ్మబోతుండగా ఆమె తప్పించుకువచ్చానని చెప్పడంతో ఆమెను చేరదీస్తుంది శాంతం. ఆ అమ్మాయే శుభ. శాంతం ఆమెని తన కూతురు లక్ష్మితో సమానంగా పెంచుతుంది. జనార్ధనరావు శుభ స్నేహితుడు. అతను ఆర్మీలో ఇంజినీరుగా పనిచేస్తుంటాడు. వీరిద్దరూ తమ మనసులోని ఇష్టాన్ని బయటపెట్టలేకపోతారు. చివరకి ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేయడంతో కథ ముగుస్తుంది. కథ నడుస్తున్నంత సేపూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశ ప్రజల పరిస్థితుల్ని వర్ణిస్తూనే ఉంటారు రచయిత.
        తరువాత మూడవ భాగం కథ శాంతం-శాస్త్రిల కూతురైన  కమ్యూనిస్టు భావనలు కల లక్ష్మిది,ఆమె స్నేహితుడు, సహాధ్యాయి ఐన భాస్కరరావుది. వీరిద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ చూపించరు రచయిత. నిజానికి లక్ష్మికి పెళ్ళి, పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అంటే వ్యతిరేక భావాలు ఉండటమే కారణం. ఇద్దరూ ఇంజినీర్లే. భాస్కరం ఒకసారి చిన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను బలవంతంగాస్వాధీనపరచుకుంటాడు. ఈ విషయం లక్ష్మికి ఉత్తరం రాసి పశ్చాత్తాపపడతాడు. అలా పితృస్వామిక మనస్తత్వం నుంచి లక్ష్మి ద్వారా బయట పడతాడు. స్వతంత్రం వచ్చినా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రాకపోవడంతో లక్ష్మి ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడంతో మొత్తం నవల ముగుస్తుంది. నవల  ఆసాంతం స్వాతంత్రోద్యమం ,విదేశీ వస్త్రాలను, భూస్వాములు,జమిందార్ లు, రైతులు మధ్య సంఘర్షణను,కార్మికచట్టం,గోవా విమోచనోద్యమం,ఆంధ్రసమాజ తీరుతెన్నులూ అన్నింటినీ సమయానుకూలంగా చిత్రిస్తారు రచయిత.
           ముగ్గురు ఆడవాళ్ళు, మూడు మనస్తత్త్వాలు, మూడు రకాల అభ్యుదయ భావాలను రచయిత ఈ నవలలో చిత్రిస్తారు. వారి భావాలకు రకరకాలుగా స్పందించే మగవాళ్ళు, వారి మనస్తత్వాలూ కూడా ఈ నవల్లో గమనించ వలసిన విషయాలు.
        పాత్ర చిత్రణ అంతా సహజంగా కాల్పనిక సాహిత్యంలో ఉండేలా ఆయా పాత్రల భావోద్వేగాలకనుగుణంగానే కథ నడుస్తుంటుంది. కానీ ఈ నవలలో ప్రత్యేకత ఆ పాత్రలు తాము రాసుకునే డైరీ ద్వారా తమని తాము తీర్చిదిద్దుకుంటుంటాయి. పాత్రలు రాసేది డైరీ కనుక ఎదుటి వారిని ప్రశంసించడానికో, విమర్శించడానికో అన్నట్టుగా కాక నిజాయితీగా మనసులో భావాలను డైరీలో వ్యక్తీకరిస్తుంటాయి. ఈ నవలలోని పాత్రలు సామాజిక స్పృహ కలిగినవి. తమ చుట్టూ సమాజంలో జరిగే విషయాలకు స్పందిస్తూ ఉండటంతో కథ సజీవంగా నడుస్తుంటుంది.  
         ఉప్పల లక్ష్మణరావు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా నమ్మి తదనుగుణమైన కృషి సాగించిన రచయిత. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో రష్యన్ సాహిత్యాన్ని అనువదించారు. రష్యన్-తెలుగు నిఘంటువు తయారుచేశారు. వీరు స్విట్జర్లాండ్ కు చెందిన మహిళ మెల్లీని వివాహం చేసుకున్నారు. రష్యా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాకా బరంపురంలో "వికాసం" అనే సాహిత్యసంస్థతో అనుబంధాన్ని కొనసాగిస్తూ 1985లో మరణించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి