13, ఫిబ్రవరి 2022, ఆదివారం

నడక దారిలో--13

 నడక దారిలో--13


      మళ్లీ యథావిధిగా ఏ ఆటంకాలూ లేకుండా కాలేజీలో బీయస్సీలో చేరాను.నాతో పీయూసీ చదివిన ఎమ్పీసీ వాళ్ళెవరూ కనిపించలేదు.చదువు ఆపేసారేమో మరి.ఈ సారి కూడా నా సహాధ్యాయులు ఎనిమిది ముందే.అయితే వీళ్ళందరూ మహారాజా మల్టీ పర్పస్ స్కూల్ లో పన్నెండో తరగతి చదివి వచ్చినవాళ్ళు.వారిలో ఉషాకుమారి మా ఇంటివైపు కొత్తపేటలో ఉండేది.అందుచేత నాకు చాలా సన్నిహితురాలైంది.ఉషా కూడా కుటుంబపరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నదే. మేమిద్దరం మంచి స్నేహితులం కావటానికి అదీ ఒకకారణమే
      రోజూ నేను పుత్సల వీథినుండీ,ఉషా కొత్తపేట నుండి బయలుదేరి పాతబస్టాండు దగ్గర కలుసుకొని కాలేజీ కి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం.దారి పొడవునా ఎన్నెన్నో కబుర్లు కలబోసుకునేవాళ్ళం.
      రెక్కలు విదిలించుకుని ఎగిరే రంగులసీతాకోకచిలుకలా కలలూ,ఊహలూ ఎగరాల్సిన వయసులోని ఉన్న మామధ్య దొర్లే కబుర్లలో రంగుల కలలు గురించి కాదు జీవితంలోని కారుమబ్బులు గురించి, కన్నీటివ్యథల్నీ తలబోసుకునేవాళ్ళం.
      అంతకుముందు మనసు విప్పి నా ఆలోచనలు ఎవరితోనైనా  పంచుకునే అవకాశాలు లేక నాలోనే నివురు కప్పినట్లుగా ఉండిపోయాయి.
      ఒకరోజు కాలేజీలో హాస్టల్ అమ్మాయి వచ్చి "సుభద్రా నీకు ఉత్తరం వచ్చింది.ఆఫీసు రూంలో ఉంది తీసుకో " అంది.కాలేజీకి నాకు ఉత్తరం రావటమేంటని ఆశ్చర్యం తో వెళ్ళి తీసుకున్నాను.నిజమే నాకే ఆ ఉత్తరం.కాలేజీ వాళ్ళు విప్పి చదివి మరీ ఇచ్చారు.
      కోటబొమ్మాళిలో నా సహాధ్యాయి రాసాడు.చిన్నక్క వాళ్ళు కోటబొమ్మాళి లోని అత్తగారింటికి వెళ్ళినప్పుడు కలిసాడట.నేను కాలేజీ లో చదువుతున్నారని తెలిసి రాస్తున్నానని అందులో రాసాడు.ఒకసారి తరగతిలో పిల్లలంతా అల్లరి చేస్తూన్నారని మాష్టారు అందరిని బెత్తంతో కొడుతుంటే అతను అల్లరి చేయలేదని చెప్పి మాష్టారుచేతి బెత్తం దెబ్బలు తప్పించానని రాసాడు.నాతోబాటూఆ ఉత్తరాన్ని చదివిన నామిత్రులూ, నేనూ సినీమాకథ  చెప్తున్నాడని నవ్వు కున్నాం.తర్వాత అది చింపి పడేసాను.
         మరో పదిరోజులకు మరోఉత్తరం.ఈసారి అతని ఫొటో కూడా పంపి నా ఫోటో పంపమని రాసాడు.దాంతో నాకు ఒళ్ళు మండి అతని ఫొటో కవర్లో పెట్టి ఏ ఆడపిల్ల ఇలా ఎవరడిగితే వాడికి ఫొటోలు పంపదు అని రాసి తిప్పి పంపేసాను.
         తర్వాత కొన్ని రోజులకు కాలేజీ విడిచి పెట్టాక ఇంటికి వెళ్తున్నప్పుడు కాలేజీ ముందు నన్ను ఎలా గుర్తు పట్టాడో కలిసి పలకరించాడు.అతని ఫ్రెండు MRకాలేజీలో చదువుతున్నాడని,అతను కూడా మాసహాధ్యాయేనని తనతో ఉన్న అబ్బాయిని పరిచయం చేసాడు.మాఅన్నయ్యల గురించి అడిగాడు. ముక్తసరిగా అడిగినదానికి చెప్పి ఉషాతో కలిసి వెళ్ళిపోయాను.
         మరోసారి కలిసినప్పుడు "పెళ్ళి గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు.నేను ఇంతవరకూ పెళ్ళి గురించి ఆలోచించలేదు."ముందు చదువు పూర్తి చేసి నా కాళ్ల మీద నేను నిలబడాలి.తర్వాతే ఆలోచించాలి.నేను కట్నం తీసుకునే వాళ్ళని చేసుకోను."అని చెప్పి 'నన్ను ఇలా మాటిమాటికీ కలవద్దు' అని చెప్పి వెళ్ళి పోయాను.ఇంకెప్పుడూ కాలేజీకి రాలేదు.కానీ జనవరి ఫస్ట్ కి గ్రీటింగ్ కార్డ్ పంపేవాడు.తర్వాత అతను మా వివాహానికి, అనంతరం ఇంటికి రావటమే కాదు ఇప్పటికీ మంచి స్నేహితుడు గా ఉన్నాడు.
         కాలేజీలో చదువు ఒత్తిడి వల్ల సంగీతకళాశాలకు కూడా వెళ్ళటం మానేసాను.సాహిత్యం మాత్రం చదవటం, ఆలోచనలు పేపర్లమీద పెట్టటం మాత్రం మానలేదు.
         అప్పట్లోనే మాచిన్నన్నయ్య సంస్కృత కళాశాలలో చదువుతున్న సాహిత్యాభిరుచి గల కుర్రాళ్ళు జగన్నాథశర్మా,దాట్ల నారాయణమూర్తి రాజు,వివిఎస్ సూర్యనారాయణ మొదలైన వారితో కలసి సాహిత్యసమావేశాలూ ఏర్పాటుచేసి కథకులుగా ఉత్సాహపరిచేవాడు.బరంపురంలో ఉప్పల లక్ష్మణరావు గారి ఆధ్వర్యం లో నడిచే వికాసం నిర్వహించే సాహిత్య సమావేశాలు కు వెళ్ళేవాడు.విజయనగరంలో ప్రముఖ కథకుడు చాసో తో చర్చలు సాగించేవారు.నేనుమాత్రం ఇంట్లోనే పుస్తకాల్ని ఆవపోసనపడ్తూనే ఉండేదాన్ని.
         కుమారి వాళ్ళ అన్నయ్య,మరో మిత్రుడు కలిసి ఇంటింటి గ్రంథాలయం కోసం తెప్పించిన పుస్తకాల్లో శీలా వీర్రాజు గారి నవల కాంతి పూలు తెచ్చుకొని ఒకసారి చదివాను.పుస్తకాలు చదివాక వాటిగురించి చర్చించేందుకు నా స్నేహితులకు సాహిత్యాభిరుచి ఉన్నవాళ్ళెవ్వరూ లేనందున  నాకు నేనే ఒక పేపర్లో నా అభిప్రాయం రాసుకునే దాన్ని.
         ఆ వేసవి సెలవుల్లో కుమారి వాళ్ళ అన్నయ్య కి అన్నవరంలో వడుగును చేయాలనుకుని వెళ్ళేటప్పుడు నన్ను కూడా రమ్మన్నారు.అమ్మ కూడా వెళ్ళటానికి ఒప్పుకుంది.మొదటిసారి ఇంట్లో వాళ్ళతో కాకుండా నా ప్రయాణం అది.అన్నవరంలో వాళ్ళ ఫంక్షన్ అయ్యాక నన్ను వాళ్ళు బాపట్ల కు వెళ్ళే బస్ ఎక్కించారు.పెద్దక్కయ్య వాళ్ళూ అప్పుడు బాపట్లలో ఉండేవారు.బస్టాపుకు వచ్చి నన్ను ఇంటికి తీసుకు వెళ్ళారు.
         పగలంతా పిల్లలిద్దరితో ఆటలతో సరిపోయేది.మధ్యాహ్నం పిల్లలు పడుకున్నాక కొత్త పుస్తకాలు ఏవైనా వచ్చాయేమోనని అల్మారాలో వెతికాను.కొన్ని శరత్ నవలల అనువాదాలు, శీలా వీర్రాజు కథలు కనిపించాయి.రెండురోజుల్లో అవి చదివేసాను.శరత్ నవలల్లో సంభాషణ లాగే శీలా వీర్రాజు కథల్లోని సంభాషణలు కూడా భావుకత్వం తో నిండిఉన్నాయి.బహుశా శరత్ ప్రభావం ఎక్కువే మో అనుకున్నాను.చిన్నప్పటిలా కాకుండా పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం గురించి నచ్చినవో,నచ్చనివో నా అభిప్రాయం రాసుకోవటం అలవాటైందని చెప్పాను కదా అదే విధంగా రాసుకున్నాను.
         ఒకరోజు సాయంత్రం నన్ను తన స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్ళింది అక్కయ్య.'మా చెల్లాయి వచ్చిందండీ' అని నన్ను చూపించింది ఆమెకు.ఆమె రోడ్డు మీద వాళ్ళని చూసినట్లు ఓ చూపు విసిరి,తెలుగు, సంస్కృతాలలో తనకు గల పాండిత్య ప్రతిభ గురించి అనర్గళంగా మాట్లాడుతూ అన్నింటితో నవల రాయబోతున్నట్లు చెప్పారామె.అక్కయ్య ,నేనూ మౌన శ్రోతలం అయ్యాము.
         ఇంటికి వస్తున్నప్పుడు 'ఆమె నవలలు రాస్తారా' అని అడిగాను ‌ఆ రోజుల్లో వచ్చే అన్ని పత్రికలూ చదువుతాను కదా ఒకటీ నాకు గుర్తు రాకపోవటం ఆ రచనలు ఎలా ఉండి ఉంటాయో అర్థమయ్యింది.
         అక్కయ్య ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు "ఇరవై ఏళ్ళు నిండుతున్నాయి.పెళ్ళి గురించి ఆలోచించు.నీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పు " అంది.
         నేను ఏమీ మాట్లాడకుండా తల ఊపి మౌనం వహించాను.నా మనసు మాత్రం 'నా చదువు నా చదువు' అంటూ లోలోన గొణిగింది.
        వారం పదిరోజులు అయ్యాక విజయనగరం తిరిగి వచ్చేసాను.యథాప్రకారం చదువులో పడ్డాను.
        అప్పుడప్పుడే తెలంగాణా ఉద్యమం ఊపందుకుందని వార్తల్లో విన్నాము.కాలేజీలో అది కొంత సంచలనం కలిగించింది.ఉపాధి లేక పల్లెలనుండి పట్టణాలకు వస్తున్నట్లే పట్టణాల్లో డిగ్రీ చదువు పూర్తి చేసుకుని రాజధాని బాట పట్టేవారు ఎక్కువే.ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలూ, మంచి విద్యాసంస్థలన్నీ అక్కడే ఉన్నాయి. చదువుకున్న వారికి తగిన ఉద్యోగాలు ఇచ్చే ఆఫీసులు ఇంకే నగరాల్లోనూ లేవు.మన రాజధాని అనుకుంటూ ఇళ్ళూ,పొలాలూ అమ్ముకొని హైదరాబాద్ కు వలస పోయేవారు ఎక్కువగానే ఉండేవారు.ఇప్పుడు  చదువులూ , ఉపాధికోసం విదేశాలకు వలసపోతున్నట్లే అనాది నుండి ఎక్కడ ఉపాధి దొరుకుతే అక్కడికి  పోవటం అతిమామూలే కదా.
        రోజూ వార్తలు రేడియోలో వినో,వార్తాపత్రికల్లో చదివో దిగులు పడిపోతూ ఉండే వాళ్ళం.'ప్రత్యేక తెలంగాణా వచ్చేస్తే  అప్పుడు మనకి రాజధాని ఏదవుతుంది చెప్మా?' అని కాలేజీ లో చర్చించుకునే వాళ్ళం. తమాషా ఏమిటంటే ఇప్పటికీ ఆ చర్చా తెగలేదూ,యాభై ఏళ్ళైనా ఆప్రశ్నకి సమాధానం దొరకలేదు!!!
         
        
        
        
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి