25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నడక దారిలో--12

 నడక దారిలో--12


           నేను పీయూసి చదువుతున్న రోజుల్లోనే ఒక రోజు అకస్మాత్తుగా మా చిన్నక్కని హాస్పిటల్ లో చేర్పించినట్లు కబురు వచ్చి అమ్మ కంగారుపడి హడావుడి గా వెళ్ళింది.అందరం ఏమైందో నని గాభరా పడ్డాం.తీరా అమ్మ బొజ్జలో హాయిగా బజ్జోకుండా తొందరపడి రెండునెలలు ముందుగానే ప్రపంచాన్ని చూసేయాలని బుజ్జిబాబు బయటకు వచ్చేసాడని తెలిసింది.ఐతే మరికొంత కాలం డాక్టర్లు పర్యవేక్షణలోనే ఉంచి డిశ్చార్జి చేసాక కోరుకొండ సైనిక స్కూల్ లోని వాళ్ళింటికి తీసుకు వెళ్ళిపోయారు.అమ్మ కొన్నిరోజులు అక్కడకి వెళ్ళవలసి వచ్చింది.కోరుకొండలోని స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం,ఫార్మ్ లో పండిన కూరగాయలు, పండ్లు, అక్కడి డైరీ పాలూ వీటన్నింటి వలన తొందరగానే బాబు ఆరోగ్యాన్ని పుంజుకొన్నాడు.

           నాకు కాలేజీ లేకపోవటాన అప్పుడప్పుడు నేను అక్కకి సాయంగా వెళ్ళేదాన్ని.అక్కడికి వెళ్ళినప్పుడు అక్కమిత్రుల ఇంటికి తీసుకు వెళ్తే వాళ్ళ కుట్టు మిషను పై బాబుకి చిన్న చిన్న జుబ్బాలు చిన్న బొంతలు వంటివి కుట్టేదాన్ని.

           మా ఇంట్లో రెండు గదుల్లో అన్నయ్యలు చదువుకోవటమో రాసుకోవటమో చేసుకుంటుండగా, వరండాలో అమ్మ ఏదో పనిచేసుకుంటూ ఉండేది.అమ్మకి సాయం చేయాల్సినవి చేసి తర్వాత నేను డాబా మీదగానీ డాబామెట్లమీద గానీ కూర్చుని పుస్తకాలు చదువుకుంటూనో, బొమ్మలు వేసుకుంటూనో,లేదా రాగాలు తీస్తూనో ఉండే దాన్ని. అందువల్ల మాఇంట్లో అందరూ ఎవరి అరల్లో వాళ్ళు ఉండటంవలన ఎప్పుడూ నిశ్శబ్దం మౌనంగా తపస్సు చేస్తున్నట్లుగా ఉండేది.ఎప్పుడైనా చిన్నక్క వచ్చినప్పుడు మాత్రం బుజ్జిబాబు కేరింతలతో ఇల్లంతా చిలుకలు వాలిన చెట్టై నాకెంతో సంబరంగా ఉండేది.        

     నాకు దొరికిన విరామసమయంలో ఇష్టమైన మరో అభిరుచి బొమ్మలు వేయటం .చిన్నన్నయ్యని ఇండియన్ ఇంక్ కొనమని అడిగి చిన్నప్పటి నుంచి నాకు ఖాళీ సమయం దొరికితే స్నేహితుల పుట్టినరోజులకో పండుగలకు ఇవ్వటానికో గ్రీటింగ్ కార్డులు తయారుచేసి ఉంచేదాన్ని.

         నాకు పత్రికలలో సీరియల్స్ కి బాపు వేసిన చిత్రాలు చూసి వేయటం చాలా ఇష్టంగా ఉండేది.అలా వేసినవి పోయినవి పోగా కొన్ని మాత్రం ఇప్పటికీ మిగిలాయి.

          అన్నయ్య లైబ్రరీ నుండి పుస్తకాలు తీసుకువచ్చేవాడు.అన్నయ్య గది శుభ్రం చేయటానికి వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకుని చదివి అన్నయ్య వచ్చే సమయానికి యథాస్థానంలో పెట్టేసే దాన్ని.ఒకసారి అలా తీసుకు వచ్చిన జయదేవుని గీతగోవిందం టీకా తాత్పర్య సహితము గా ఉన్నది చదివాను. అందులోని అష్టపదులన్నీ ఒక పుస్తకం లో రాసుకున్నాను.అవి చదివినప్పుడు అష్టపదులన్నీ శృంగార భావనతోనే ఉంటాయి కదా అటువంటప్పుడు వాటిని భక్తి పాటలుగా ఎలా పరిగణిస్తారు అని అనుకున్నాను.

     అందులోని ఒక అష్టపదిలో నాయిక ప్రియుని కొరకు ముస్తాబై ఎదురుచూస్తూ అతడు ఎంతకు రాకపోవటంతో దుఃఖోద్వేగంతో అలంకరించుకున్న ఆభరణాలన్నీ తీసి విసిరికొడుతుందనీ,అప్పుడు ప్రియుడు వచ్చి ఒక్కొక్క ఆభరణాన్నీ తిరిగి అలంకరించటాన్నీ ఒక్కో చరణంలో జయదేవుడు వర్ణించాడు.అది నాకు చాలా నచ్చి అష్టపది లోని ఎనిమిది చరణాలకూ ఎనిమిది చిత్రాలు వేసాను.అప్పటివరకూ బాపూ చిత్రాలు చూసి వేసినా ఇవి మాత్రం స్వంతంగానే వేసేంతగా ఆ అష్టపది నామనసులో అంతగాఢంగానూ రూపు కట్టింది.కానీ అందులో కొన్ని చిత్రాలు ఎందువల్లనో అసంపూర్తిగా వదిలేసాను.ఈ లోపున పరీక్ష పాసవటం తిరిగి కాలేజీ లో చేరటం ఒకకారణం అయ్యుండొచ్చు.ఇంతకీ ఆ అష్టపది ఏమిటో మాత్రం ఇప్పటికీ అసలు గుర్తు రావటం లేదు.

                    బాపూ బొమ్మలే కాక కొన్ని వడ్డాది పాపయ్య చిత్రాలు కూడా వేసాను. బాపూ చిత్రాలు కేవలం రేఖా చిత్రాలు గా వేసేందుకు వీలుగా ఉంటాయి.కానీ వపా చిత్రాలు రంగులమేళవింపుతోనే అందగిస్తాయి.రేఖాచిత్రం గా వేసి ఆపితే బాగుండవు.అందుకే వడ్డాది పాపయ్య చిత్రాలు తక్కువగా వేసాను.

               తర్వాత్తర్వాత చిత్రాలు వేసే తీరిక లేకపోయింది.వివాహానంతరం వీర్రాజు గారు వేస్తుంటే ఉత్సాహం వచ్చేది కానీ తీరికగా కూచుని వేసేంత వెసులుబాటు నాకు ఉమ్మడి సంసారంలో కలగలేదు.

                  నా బాల్య స్నేహితురాలు కుమారీ ఆడబడుచు బియీడీ చదువు తున్నప్పుడు మాయింటికి వచ్చి "నువ్వు బొమ్మలు బాగా వేస్తావని వదిన చెప్పింది.నాకు చార్టులు వేయవా" అని అడిగింది.సరే అని వప్పుకుని తీరిక చేసుకుని వేసాను.ఆమెకు వేసిన చార్టులు చూసి బియీడీ ట్రైనింగు అవుతున్న విద్యా ర్థినులు మరికొంత మంది వచ్చి డబ్బులు ఇస్తాం వేసిపెట్టమని బతిమాలారు.

                       ఇంటి పనులయ్యాక తీరిక చేసుకుని ఆ ఏడాదేకాక రెండేళ్ళపాటూ చాలా మందికి చార్టులే కాక వాళ్ళు చెప్పే పాఠాలికి మోడల్స్ కూడా చేసి నా చేతి ఖర్చు కి కాసిన్ని డబ్బులు సంపాదించాను.అదే నా మొదటి సంపాదన.తర్వాత కుటుంబ బాధ్యతలు,పిల్లలు అనారోగ్యం ,చికాకులు తో అదీ ఆగిపోయింది.

                  ఇంక పేపర్లమీద మానేసి ఎప్పుడైనా చీరల మీదో,పాప ఫ్రాకులమీదో ఫేబ్రిక్ డిజైన్లు కి పరిమితమైపోయింది నా చిత్రలేఖనం.

                   నా బాల్య మిత్రులు ఎవరైనా ఫోన్ చేస్తే మొదటిగా అడిగే. ప్రశ్న " చిన్నప్పుడు చిత్రాలు వేసేదానివి.ఇప్పడూ వేస్తున్నావా"అనే.ఇటీవల ఒక బాల్య మిత్రుడు తన దగ్గర ఎప్పుడో నేను వేసిన గ్రీటింగ్ కార్డులు వాట్సప్ లో షేర్ చేసేడు సుమారు నలభై ఏళ్ళకు పైగా భద్రంగా అతను దాచినందుకు ఎంత ఆశ్చర్యం వేసిందో.            

               చిత్రలేఖనం వంటి కళలను జీవితాంతం కొనసాగించటం మహిళలకు కష్టమే.అందుకు తగిన ప్రోత్సాహం,సమయం ,వాతావరణం అన్నీ అనుకూలించాలికదా.            

               అందుకేనేమో మన తెలుగుపత్రికల్లో కథలకి చిత్రాలు వేసేవాళ్ళల్లో మహిళలు లేరు.ఒక్క రాగతిపండరి మాత్రం కార్టూనిస్ట్ గా పత్రికల్లో కనిపించేది. టీచర్ గా పనిచేసే రోజులలో పిల్లలచేత పాఠశాలకు సంబంధించిన చార్టులు వేయించటం అప్పుడప్పుడు నేను వేయటం తప్ప మనషుల చిత్రాలు వేయనేలేదు.ఉద్యోగ విరమణ తర్వాతమళ్ళా మొదలెట్టాలని స్కెచ్ పుస్తకం కొనుక్కొన్నాను.కానీ ఒక మూడు పెన్సిల్ చిత్రాలతో అదీ ఆగిపోయింది.

                 నా విరామసమయంలోనే నా స్నేహితురాలు కుమారీ వాళ్ళఅన్నయ్య, అతని మిత్రుడు కలిసి ఎమెస్కో ఇంటింటి గ్రంథాలయం స్కీం లో చేరి బోలెడు పుస్తకాలు తెప్పించారు.అది తెలిసిన తర్వాత ఇంక నాకు పండగే.నేను అప్పుడప్పుడు ఏ వారానికో వెళ్ళి ఒక అరడజను పుస్తకాలు తెచ్చుకొని చదివి తిరిగి ఇచ్చేదాన్ని. అప్పుడప్పుడు నా ఆలోచనల్ని కథలరూపంలో రాయటం కూడా మొదలు పెట్టాను.కానీ అన్నయ్యలు చూసి ఇవి రాస్తూ చదువు పాడుచేసుకుంటున్నానని కోప్పడతారని క్లాసు పుస్తకాలు కింద దాచేసేదాన్ని.    

                బళ్ళో చదువుతున్నప్పుడు లిఖిత పత్రిక కోసం పద్యాలు రాసినా మళ్ళా వాటి జోలికి పోలేదు.కథలూ,నవలలూ తప్ప కవిత్వం మాత్రం ఇంట్లో లేకపోవటాన చదవలేదు. అప్పటికే చిన్నన్నయ్య విరివిగా కథలు రాసేవాడు.అతను రావిశాస్త్రికి ఏకలవ్యశిష్యుడు.రావిశాస్త్రీ,బీనాదేవి, కాళీపట్నం రామారావు,చాసో కథల పుస్తకాలు కొంటూ ఉండేవాడు.అవి చదువుతుండటం,అన్నయ్య కూడా రాసే కథలూ అదే విధమైన అభ్యుదయ దృక్పథం కనుక అటువంటి సాహిత్యమే ఎక్కువగా చదవటం అలవాటైంది.                                                                                                

                 చిన్నన్నయ్య తన స్నేహబృందం తలా ఒక పత్రికకొని అందరికీ సర్క్యులేట్ చేసే ఏర్పాటు చేసాడు.అందువల్ల తెలుగు వారమాసపత్రికలన్నీ చదివేదాన్ని.పత్రికలలో అన్ని సీరియల్స్ చదువుతున్నా,రంగనాయకమ్మ సీరియల్స్ ఎక్కువగా ఇష్ట పడేదాన్ని.ఇతర వచన సాహిత్యం లోని సరళమైన వాక్యనిర్మాణం, శైలీ,కథన శిల్పం నచ్చినా వామపక్ష దృక్పథంతో వచ్చే రచనల్ని చదవటమే నాకు నచ్చేది. నా ఆలోచనా విధానం లో అలా క్రమంగా వస్తున్న మార్పు నాకు తెలుస్తూనే ఉంది. ఒక మామయ్య కమ్యూనిస్టులతో తిరిగేవాడనీ,స్వాతంత్రానంతరం వారిమీద నిషేధం ఉండేదనీ,అప్పుడు ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడని కథలుగా చిన్నప్పుడు విన్నాను.మామామయ్యలు ఒకరిద్దరూ, అన్నయ్యలు,మా పెద్దక్కా వాళ్ళూ పూజలవీ చేయగా చూసిన గుర్తు లేదు.మా అమ్మ మాత్రమే దేవుడి దగ్గర దీపం పెట్టేది.అందుచేతనో,మరెందుకో ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేది కాదు.నాకు లలిత సంగీతం ఇష్టం కనుక భక్తి పాటలు కూడా పాడేదాన్ని.లలిత కళలన్నీ దైవంతోనూ, ఆధ్యాత్మిక చింతన తోనూ ముడిపడే ఉంటాయి కదా? అన్నట్లు మా కాలేజీ మాగజైన్ కి నేను కృష్ణుడు,రాథల ప్రణయగాధని అనేక లలిత గీతాలతో కదంబంగా అల్లి సంగీత రూపకంలా రాసాను.ఎందుకంటే రావు బాలసరస్వతి పాటల్లో అనేకం కృష్ణుడి గీతాలే కదా? ఆమె పాటలంటే నాకు ప్రాణం అప్పుడూ ఇప్పుడూ కూడా.      

ఇదీ ఆ ఏడాదంతా నా రాతలూ, గీతాలు,                

 

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

నడక దారిలో--13

 నడక దారిలో--13


      మళ్లీ యథావిధిగా ఏ ఆటంకాలూ లేకుండా కాలేజీలో బీయస్సీలో చేరాను.నాతో పీయూసీ చదివిన ఎమ్పీసీ వాళ్ళెవరూ కనిపించలేదు.చదువు ఆపేసారేమో మరి.ఈ సారి కూడా నా సహాధ్యాయులు ఎనిమిది ముందే.అయితే వీళ్ళందరూ మహారాజా మల్టీ పర్పస్ స్కూల్ లో పన్నెండో తరగతి చదివి వచ్చినవాళ్ళు.వారిలో ఉషాకుమారి మా ఇంటివైపు కొత్తపేటలో ఉండేది.అందుచేత నాకు చాలా సన్నిహితురాలైంది.ఉషా కూడా కుటుంబపరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నదే. మేమిద్దరం మంచి స్నేహితులం కావటానికి అదీ ఒకకారణమే
      రోజూ నేను పుత్సల వీథినుండీ,ఉషా కొత్తపేట నుండి బయలుదేరి పాతబస్టాండు దగ్గర కలుసుకొని కాలేజీ కి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళం.దారి పొడవునా ఎన్నెన్నో కబుర్లు కలబోసుకునేవాళ్ళం.
      రెక్కలు విదిలించుకుని ఎగిరే రంగులసీతాకోకచిలుకలా కలలూ,ఊహలూ ఎగరాల్సిన వయసులోని ఉన్న మామధ్య దొర్లే కబుర్లలో రంగుల కలలు గురించి కాదు జీవితంలోని కారుమబ్బులు గురించి, కన్నీటివ్యథల్నీ తలబోసుకునేవాళ్ళం.
      అంతకుముందు మనసు విప్పి నా ఆలోచనలు ఎవరితోనైనా  పంచుకునే అవకాశాలు లేక నాలోనే నివురు కప్పినట్లుగా ఉండిపోయాయి.
      ఒకరోజు కాలేజీలో హాస్టల్ అమ్మాయి వచ్చి "సుభద్రా నీకు ఉత్తరం వచ్చింది.ఆఫీసు రూంలో ఉంది తీసుకో " అంది.కాలేజీకి నాకు ఉత్తరం రావటమేంటని ఆశ్చర్యం తో వెళ్ళి తీసుకున్నాను.నిజమే నాకే ఆ ఉత్తరం.కాలేజీ వాళ్ళు విప్పి చదివి మరీ ఇచ్చారు.
      కోటబొమ్మాళిలో నా సహాధ్యాయి రాసాడు.చిన్నక్క వాళ్ళు కోటబొమ్మాళి లోని అత్తగారింటికి వెళ్ళినప్పుడు కలిసాడట.నేను కాలేజీ లో చదువుతున్నారని తెలిసి రాస్తున్నానని అందులో రాసాడు.ఒకసారి తరగతిలో పిల్లలంతా అల్లరి చేస్తూన్నారని మాష్టారు అందరిని బెత్తంతో కొడుతుంటే అతను అల్లరి చేయలేదని చెప్పి మాష్టారుచేతి బెత్తం దెబ్బలు తప్పించానని రాసాడు.నాతోబాటూఆ ఉత్తరాన్ని చదివిన నామిత్రులూ, నేనూ సినీమాకథ  చెప్తున్నాడని నవ్వు కున్నాం.తర్వాత అది చింపి పడేసాను.
         మరో పదిరోజులకు మరోఉత్తరం.ఈసారి అతని ఫొటో కూడా పంపి నా ఫోటో పంపమని రాసాడు.దాంతో నాకు ఒళ్ళు మండి అతని ఫొటో కవర్లో పెట్టి ఏ ఆడపిల్ల ఇలా ఎవరడిగితే వాడికి ఫొటోలు పంపదు అని రాసి తిప్పి పంపేసాను.
         తర్వాత కొన్ని రోజులకు కాలేజీ విడిచి పెట్టాక ఇంటికి వెళ్తున్నప్పుడు కాలేజీ ముందు నన్ను ఎలా గుర్తు పట్టాడో కలిసి పలకరించాడు.అతని ఫ్రెండు MRకాలేజీలో చదువుతున్నాడని,అతను కూడా మాసహాధ్యాయేనని తనతో ఉన్న అబ్బాయిని పరిచయం చేసాడు.మాఅన్నయ్యల గురించి అడిగాడు. ముక్తసరిగా అడిగినదానికి చెప్పి ఉషాతో కలిసి వెళ్ళిపోయాను.
         మరోసారి కలిసినప్పుడు "పెళ్ళి గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు.నేను ఇంతవరకూ పెళ్ళి గురించి ఆలోచించలేదు."ముందు చదువు పూర్తి చేసి నా కాళ్ల మీద నేను నిలబడాలి.తర్వాతే ఆలోచించాలి.నేను కట్నం తీసుకునే వాళ్ళని చేసుకోను."అని చెప్పి 'నన్ను ఇలా మాటిమాటికీ కలవద్దు' అని చెప్పి వెళ్ళి పోయాను.ఇంకెప్పుడూ కాలేజీకి రాలేదు.కానీ జనవరి ఫస్ట్ కి గ్రీటింగ్ కార్డ్ పంపేవాడు.తర్వాత అతను మా వివాహానికి, అనంతరం ఇంటికి రావటమే కాదు ఇప్పటికీ మంచి స్నేహితుడు గా ఉన్నాడు.
         కాలేజీలో చదువు ఒత్తిడి వల్ల సంగీతకళాశాలకు కూడా వెళ్ళటం మానేసాను.సాహిత్యం మాత్రం చదవటం, ఆలోచనలు పేపర్లమీద పెట్టటం మాత్రం మానలేదు.
         అప్పట్లోనే మాచిన్నన్నయ్య సంస్కృత కళాశాలలో చదువుతున్న సాహిత్యాభిరుచి గల కుర్రాళ్ళు జగన్నాథశర్మా,దాట్ల నారాయణమూర్తి రాజు,వివిఎస్ సూర్యనారాయణ మొదలైన వారితో కలసి సాహిత్యసమావేశాలూ ఏర్పాటుచేసి కథకులుగా ఉత్సాహపరిచేవాడు.బరంపురంలో ఉప్పల లక్ష్మణరావు గారి ఆధ్వర్యం లో నడిచే వికాసం నిర్వహించే సాహిత్య సమావేశాలు కు వెళ్ళేవాడు.విజయనగరంలో ప్రముఖ కథకుడు చాసో తో చర్చలు సాగించేవారు.నేనుమాత్రం ఇంట్లోనే పుస్తకాల్ని ఆవపోసనపడ్తూనే ఉండేదాన్ని.
         కుమారి వాళ్ళ అన్నయ్య,మరో మిత్రుడు కలిసి ఇంటింటి గ్రంథాలయం కోసం తెప్పించిన పుస్తకాల్లో శీలా వీర్రాజు గారి నవల కాంతి పూలు తెచ్చుకొని ఒకసారి చదివాను.పుస్తకాలు చదివాక వాటిగురించి చర్చించేందుకు నా స్నేహితులకు సాహిత్యాభిరుచి ఉన్నవాళ్ళెవ్వరూ లేనందున  నాకు నేనే ఒక పేపర్లో నా అభిప్రాయం రాసుకునే దాన్ని.
         ఆ వేసవి సెలవుల్లో కుమారి వాళ్ళ అన్నయ్య కి అన్నవరంలో వడుగును చేయాలనుకుని వెళ్ళేటప్పుడు నన్ను కూడా రమ్మన్నారు.అమ్మ కూడా వెళ్ళటానికి ఒప్పుకుంది.మొదటిసారి ఇంట్లో వాళ్ళతో కాకుండా నా ప్రయాణం అది.అన్నవరంలో వాళ్ళ ఫంక్షన్ అయ్యాక నన్ను వాళ్ళు బాపట్ల కు వెళ్ళే బస్ ఎక్కించారు.పెద్దక్కయ్య వాళ్ళూ అప్పుడు బాపట్లలో ఉండేవారు.బస్టాపుకు వచ్చి నన్ను ఇంటికి తీసుకు వెళ్ళారు.
         పగలంతా పిల్లలిద్దరితో ఆటలతో సరిపోయేది.మధ్యాహ్నం పిల్లలు పడుకున్నాక కొత్త పుస్తకాలు ఏవైనా వచ్చాయేమోనని అల్మారాలో వెతికాను.కొన్ని శరత్ నవలల అనువాదాలు, శీలా వీర్రాజు కథలు కనిపించాయి.రెండురోజుల్లో అవి చదివేసాను.శరత్ నవలల్లో సంభాషణ లాగే శీలా వీర్రాజు కథల్లోని సంభాషణలు కూడా భావుకత్వం తో నిండిఉన్నాయి.బహుశా శరత్ ప్రభావం ఎక్కువే మో అనుకున్నాను.చిన్నప్పటిలా కాకుండా పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకం గురించి నచ్చినవో,నచ్చనివో నా అభిప్రాయం రాసుకోవటం అలవాటైందని చెప్పాను కదా అదే విధంగా రాసుకున్నాను.
         ఒకరోజు సాయంత్రం నన్ను తన స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్ళింది అక్కయ్య.'మా చెల్లాయి వచ్చిందండీ' అని నన్ను చూపించింది ఆమెకు.ఆమె రోడ్డు మీద వాళ్ళని చూసినట్లు ఓ చూపు విసిరి,తెలుగు, సంస్కృతాలలో తనకు గల పాండిత్య ప్రతిభ గురించి అనర్గళంగా మాట్లాడుతూ అన్నింటితో నవల రాయబోతున్నట్లు చెప్పారామె.అక్కయ్య ,నేనూ మౌన శ్రోతలం అయ్యాము.
         ఇంటికి వస్తున్నప్పుడు 'ఆమె నవలలు రాస్తారా' అని అడిగాను ‌ఆ రోజుల్లో వచ్చే అన్ని పత్రికలూ చదువుతాను కదా ఒకటీ నాకు గుర్తు రాకపోవటం ఆ రచనలు ఎలా ఉండి ఉంటాయో అర్థమయ్యింది.
         అక్కయ్య ఒకరోజు భోజనం చేస్తున్నప్పుడు "ఇరవై ఏళ్ళు నిండుతున్నాయి.పెళ్ళి గురించి ఆలోచించు.నీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పు " అంది.
         నేను ఏమీ మాట్లాడకుండా తల ఊపి మౌనం వహించాను.నా మనసు మాత్రం 'నా చదువు నా చదువు' అంటూ లోలోన గొణిగింది.
        వారం పదిరోజులు అయ్యాక విజయనగరం తిరిగి వచ్చేసాను.యథాప్రకారం చదువులో పడ్డాను.
        అప్పుడప్పుడే తెలంగాణా ఉద్యమం ఊపందుకుందని వార్తల్లో విన్నాము.కాలేజీలో అది కొంత సంచలనం కలిగించింది.ఉపాధి లేక పల్లెలనుండి పట్టణాలకు వస్తున్నట్లే పట్టణాల్లో డిగ్రీ చదువు పూర్తి చేసుకుని రాజధాని బాట పట్టేవారు ఎక్కువే.ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలూ, మంచి విద్యాసంస్థలన్నీ అక్కడే ఉన్నాయి. చదువుకున్న వారికి తగిన ఉద్యోగాలు ఇచ్చే ఆఫీసులు ఇంకే నగరాల్లోనూ లేవు.మన రాజధాని అనుకుంటూ ఇళ్ళూ,పొలాలూ అమ్ముకొని హైదరాబాద్ కు వలస పోయేవారు ఎక్కువగానే ఉండేవారు.ఇప్పుడు  చదువులూ , ఉపాధికోసం విదేశాలకు వలసపోతున్నట్లే అనాది నుండి ఎక్కడ ఉపాధి దొరుకుతే అక్కడికి  పోవటం అతిమామూలే కదా.
        రోజూ వార్తలు రేడియోలో వినో,వార్తాపత్రికల్లో చదివో దిగులు పడిపోతూ ఉండే వాళ్ళం.'ప్రత్యేక తెలంగాణా వచ్చేస్తే  అప్పుడు మనకి రాజధాని ఏదవుతుంది చెప్మా?' అని కాలేజీ లో చర్చించుకునే వాళ్ళం. తమాషా ఏమిటంటే ఇప్పటికీ ఆ చర్చా తెగలేదూ,యాభై ఏళ్ళైనా ఆప్రశ్నకి సమాధానం దొరకలేదు!!!
         
        
        
        
  

అతడు-ఆమె -- ఉప్పల లక్ష్మణరావు

 నాకు నచ్చిన రచన ఉప్పల లక్ష్మణరావు గారు రాసిన  నవల "అతడు-ఆమె"

          ఈ నవల 70 లలో ఒకసారి చదివాను.మళ్ళా ఒక రెండు మూడునెలలక్రితం మళ్ళీ చదివాను.ఆప్పుడే ఫేస్బుక్ లో పెట్టడానికి రాసాను. లక్ష్మణరావు గారు బరంపురం లో వికాసం అనే సాహిత్య సంస్థ ద్వారా జరుపు సమావేశాలకు మా చిన్నన్నయ్య, వీర్రాజు గారు తరుచూ వెళ్ళేవారు.
తెలుగు సాహిత్యం లో తప్పక చదవాల్సిన ముఖ్యమైన పది నవలల్లో లక్ష్మణరావుగారు రాసిన "అతడు -ఆమె" ఒకటి.
         మూడు భాగాలుగా ఉండే ఈ నవల భారతస్వాతంత్ర్య పోరాటాన్ని చిత్రీకరించే చారిత్రక నవల. ఈ నవలను ఇద్దరు వ్యక్తుల మధ్య డైరీలో నడిచినట్లుగా రాసారు రచయిత
        మొదటిభాగం లోని కథ శాస్త్రీ ,శాంతం ల మధ్య జరుగుతుంది.
       శాస్త్రి విదేశంలో బారిష్టరు చదివి చెన్నపట్నంలో లా ప్రాక్టీసు పెట్టిన లాయరు. శాంతం ఆధునిక భావాలున్న మహిళ. శాస్త్రి పాతకాలం మనిషి. చాలా విషయాల్లో వారిద్దరి అభిప్రాయాలు కలవవు. డబ్బే అన్నిటికన్నా ప్రధానమైనది, దాని కోసం విలువలు, ఆదర్శాలూ పక్కన పెట్టొచ్చూ అన్నది అతని వాదన. మనం సంపాదించే డబ్బును ఇతరులకు ఖర్చు పెట్టడంతో వచ్చే తృప్తి తెలుసుకోమంటుంది ఆమె.  ఈ పాత్రలు తమ మధ్య జరిగిన సంఘటనలను డైరీగా రాసుకుంటారు.ఒకే సంఘటనకు ఇద్దరు స్పందించే తీరు ద్వారా పాత్ర చిత్రణ జరుగుతుంది ఈ నవలలో ఈ ప్రక్రియ ఒక ప్రయోగమనే చెప్పుకోవాలి.
  శాంతం మనస్ఫూర్తిగా స్వాతంత్ర్యోద్యమంలోకి దిగితే, శాస్త్రి పేరు ప్రతిష్ఠల కోసం రాజకీయాల్లోకి రావటానికి ఉద్యమంలో కొస్తాడు. ప్రతి విషయాన్నీ డబ్బు రూపంగానే చూసే అతని మనస్తత్తత్వం నచ్చని శాంతం అతనిని వదిలి ఇద్దరి కూతుళ్ళతో కాశ్మీరం వెళ్ళి తిరిగి అతన్ని చేరడంతో వారిద్దరి కథ ముగుస్తుంది.
      అతడు ఆమె రెండవ భాగం శుభ, జనార్ధనరావుల కథ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొదలవుతుంది. శాంతానికి కూతురు పుట్టిన సమయంలో ఒకరోజు ఒక పదహారేళ్ళ పిల్ల శాంతం ఇంటికి వచ్చి అన్నం పెట్టమంటుంది. ఆమె తెలంగాణావాసి అని, ఆమె తల్లిదండ్రులు 100 రూపాయల కోసం తమిళనాడు వాళ్ళకి అమ్మేయగా, వాళ్ళు ఈమెని వేశ్యగా అమ్మబోతుండగా ఆమె తప్పించుకువచ్చానని చెప్పడంతో ఆమెను చేరదీస్తుంది శాంతం. ఆ అమ్మాయే శుభ. శాంతం ఆమెని తన కూతురు లక్ష్మితో సమానంగా పెంచుతుంది. జనార్ధనరావు శుభ స్నేహితుడు. అతను ఆర్మీలో ఇంజినీరుగా పనిచేస్తుంటాడు. వీరిద్దరూ తమ మనసులోని ఇష్టాన్ని బయటపెట్టలేకపోతారు. చివరకి ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేయడంతో కథ ముగుస్తుంది. కథ నడుస్తున్నంత సేపూ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశ ప్రజల పరిస్థితుల్ని వర్ణిస్తూనే ఉంటారు రచయిత.
        తరువాత మూడవ భాగం కథ శాంతం-శాస్త్రిల కూతురైన  కమ్యూనిస్టు భావనలు కల లక్ష్మిది,ఆమె స్నేహితుడు, సహాధ్యాయి ఐన భాస్కరరావుది. వీరిద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ చూపించరు రచయిత. నిజానికి లక్ష్మికి పెళ్ళి, పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ అంటే వ్యతిరేక భావాలు ఉండటమే కారణం. ఇద్దరూ ఇంజినీర్లే. భాస్కరం ఒకసారి చిన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను బలవంతంగాస్వాధీనపరచుకుంటాడు. ఈ విషయం లక్ష్మికి ఉత్తరం రాసి పశ్చాత్తాపపడతాడు. అలా పితృస్వామిక మనస్తత్వం నుంచి లక్ష్మి ద్వారా బయట పడతాడు. స్వతంత్రం వచ్చినా ప్రభుత్వ విధానాల్లో మార్పులు రాకపోవడంతో లక్ష్మి ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడంతో మొత్తం నవల ముగుస్తుంది. నవల  ఆసాంతం స్వాతంత్రోద్యమం ,విదేశీ వస్త్రాలను, భూస్వాములు,జమిందార్ లు, రైతులు మధ్య సంఘర్షణను,కార్మికచట్టం,గోవా విమోచనోద్యమం,ఆంధ్రసమాజ తీరుతెన్నులూ అన్నింటినీ సమయానుకూలంగా చిత్రిస్తారు రచయిత.
           ముగ్గురు ఆడవాళ్ళు, మూడు మనస్తత్త్వాలు, మూడు రకాల అభ్యుదయ భావాలను రచయిత ఈ నవలలో చిత్రిస్తారు. వారి భావాలకు రకరకాలుగా స్పందించే మగవాళ్ళు, వారి మనస్తత్వాలూ కూడా ఈ నవల్లో గమనించ వలసిన విషయాలు.
        పాత్ర చిత్రణ అంతా సహజంగా కాల్పనిక సాహిత్యంలో ఉండేలా ఆయా పాత్రల భావోద్వేగాలకనుగుణంగానే కథ నడుస్తుంటుంది. కానీ ఈ నవలలో ప్రత్యేకత ఆ పాత్రలు తాము రాసుకునే డైరీ ద్వారా తమని తాము తీర్చిదిద్దుకుంటుంటాయి. పాత్రలు రాసేది డైరీ కనుక ఎదుటి వారిని ప్రశంసించడానికో, విమర్శించడానికో అన్నట్టుగా కాక నిజాయితీగా మనసులో భావాలను డైరీలో వ్యక్తీకరిస్తుంటాయి. ఈ నవలలోని పాత్రలు సామాజిక స్పృహ కలిగినవి. తమ చుట్టూ సమాజంలో జరిగే విషయాలకు స్పందిస్తూ ఉండటంతో కథ సజీవంగా నడుస్తుంటుంది.  
         ఉప్పల లక్ష్మణరావు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా నమ్మి తదనుగుణమైన కృషి సాగించిన రచయిత. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో రష్యన్ సాహిత్యాన్ని అనువదించారు. రష్యన్-తెలుగు నిఘంటువు తయారుచేశారు. వీరు స్విట్జర్లాండ్ కు చెందిన మహిళ మెల్లీని వివాహం చేసుకున్నారు. రష్యా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాకా బరంపురంలో "వికాసం" అనే సాహిత్యసంస్థతో అనుబంధాన్ని కొనసాగిస్తూ 1985లో మరణించారు.

7, ఫిబ్రవరి 2022, సోమవారం

శీలా సుభద్రా దేవి --బయోడాటా

 శీలా సుభద్రా దేవి---బయోడాటా

                         
జననం:: విజయనగరంలో డిసెంబర్19,1949
విద్య:.   ఎమ్.ఎ.( తెలుగు)ఎమ్.ఎస్సీ(గణితం)బి ఇడీ
ఉద్యోగం: ఆర్టీసీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయిని, ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ.

ప్రచురించిన పుస్తకాలు::-
కవితా సంపుటాలు:
     1.ఆకలినృత్యం( 1980,
     2. మోళీ (1984)
     3.తెగినపేగు(1992) 
     4.ఆవిష్కారం(1994)
      5.ఒప్పులకుప్ప( 1999)
      6.యుధ్ధం ఒక గుండెకోత (2001)
      7.ఏకాంతసమూహాలు( 2004)
       8. బతుకు బాటలో అస్తిత్వరాగం(2009)
        9.నా ఆకాశం నాదే(2016)
        10. శీలా సుభద్రాదేవి కవిత్వం(2009)
        11 .war,A Heart' Ravege( 2003)
           యుధ్ధం ఒక గుండెకోత దీర్ఘ కవితకు ఆంగ్లానువాదం
        12.Yuddh A Dil ki vyadha (2017)
          యుధ్ధం ఒక గుండెకోత దీర్ఘకవితకు హిందీ అనువాదం.     
         13. Ullak kumural (2021)
         యుద్ధం ఒక గుండెకోతకు తమిళ అనువాదం    
      
    కథాసంపుటాలు:
           1.దేవుడిబండ(1990)
            2.రెక్కలచూపు(2008)
             3.ఇస్కూలు కథలు(2018)   
వ్యాస సంపుటి::
               1.కథారామంలో పూలతావులు(రచయిత్రుల కథలపై వ్యాసాలు.           ఇతరములు.    :
             1. గీటురాయి పై అక్షర దర్శనం(2017)
                 ( రచయిత్రి రచనలపై సమీక్షావ్యాసాలు)
              2.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ (2018)
                  ( కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ.)
              3. ముద్ర _ వందమంది కవయిత్రుల సంకలనానికి 
                   సహసంపాదకత్వం.(2001)
              4. నీడల చెట్టు నవలిక.(2016)
    పురస్కారాలు:::
   
           1.తెలుగువిశ్వవిద్యాలయంనుండి97 లో సృజనాత్మక సాహిత్యాని కి                        పట్టాభిరామిరెడ్డి ఎండొమెంట్ అవార్డ్
            2. శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  నుండే 99 లో                 ఉత్తమరచయిత్రి అవార్డ్
            3.కడప సాంస్కృతిక సంస్థ నుండి 2011 లోగురజాడ అవార్డ్
            4.ఆవంత్స సోమసుందర్ గారి నుండి 2011 లో దీర్ఘకవిత్వానికి       రాజహంస కృష్ణశాస్త్రి  పురస్కారం.
             5.ఉమ్మిడిసెట్టి రాధేయ త్రిదశాబ్ది ప్రతిభా పురస్కారం.2018
              6.కవిత్వానికి అమృతలత అపురూప పురస్కారం 2018
              7.నా ఆకాశం నాదే కవితా సంపుటి కి గంగిశెట్టి లక్ష్మినారాయణ గారి        మాతృపురస్కారం 2018