8, డిసెంబర్ 2015, మంగళవారం

  పగలు ప్రతీకారాలు చేసే  మాతృ హృదయ గుండె కోత
యుద్ధం ఒక గుండె కోత --4వ చాప్టర్  

దిక్కుల్ని నలువైపులా పాతుకొని
యుద్ధానికి కర్మబద్ధులై పోయి
మానవత్వాన్ని సమరరంగం లొ నిలువెల్లా పాతిపెట్టాక
ప్రాణాలు ఏ దిక్కులొ దీపమై కొడిగట్టాయో?

అంతః  కరణలో ఆధిక్యభావాన్ని నింపుకొని
పశుత్వపుమారువేషం లో
ప్రపంచస్వేచ్ఛని తూట్లుతుట్లుగా కుమ్మి
అమాయకం గా శాంతివాక్యాల చొంగ కారుస్తూ
ఎంత తిరిగితే మాత్రం ఏముంది?

గంగిగోవు తొడుగుని వంటినిండా కప్పుకొని
అందర్నీ మందలోకి కలుపు కోవాలని
ఎంత ప్రయత్నిస్తే మాత్రం ఏముంది?

పగలూ ప్రతీకారాలూ ఎప్పుడూ విధ్వంస కారకాలే
సామరస్యభావం తో సమస్యల్ని పరిష్కరించకపోతే
పెంచుకుంటున్నకొద్దీ రగులుతూనే వుంటాయి
దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు

ఇక
మలిగిపోతున్న చివరిప్రాణం
రాస్తున్న మరణశాసనం లో
ఆఖరిసంతకం క్లష్టర్ బాంబు దైనా కావచ్చు
అణుక్షిపణిదైనా కావచ్చు
విర్రవీగే అహం భావం మూలాల్ని కదిలించి
ఆమూలాగ్రం వణికించగలిగే జీవాయుధానిదైనా కావచ్చు
 ఇంక ఆ తర్వాత
పశ్చాత్తా పం తొ వంచుకోటానికి శిరస్సులూ వుండవు
సిగ్గుతొ తల దాచుకోటానికి ముడుకు లూ వుండవు
దహన శేషాలైన బూడిద కుప్పలు తప్ప

ఆనాడైనా-
మనస్ఫూర్తిగా
చిన్ననాడు గోరుముద్దలతోబాటూ
శిఖరాగ్రాలకు దారులు వేసిన అమ్మని పిలిచి చూడు
ఒకనాడు చీదరించుకున్నవని మర్చిపోయి
నీ పిలుపు కి కదలి
సమాధుల్లోంచి వచ్చి సే ద తీరుస్తుంది   

30, నవంబర్ 2015, సోమవారం

     సెప్టెంబర్ 11 దుర్ఘటన   ఎంతమంది తల్లులకు నైట్ మేర్ గా మారిందొ చూద్దాం 

 యుద్ధం  ఒక గుండె కోత--3వ చాప్టర్

అర్ధరాత్రి వుండుండి  వులిక్కి పడ్తాం 
నిద్రలొ కూలిపోతున్న కలలపంటల్ని
ఆర్తితో వెతుక్కుంటాం
తల్లడిల్లుతున్న  పసివాళ్ళప్రాణాల్ని
నిద్రలోనే కొంగులు పట్టి ఆపుకోవాలనుకుంటాం 
మృత్యువు తీసుకెళ్ళి పోతున్న ప్రాణాల్నుండి
ప్రశ్నలు జారిపడ్తున్నాయి
ఒక్కో ప్రశ్నా ఒక్కో కత్తి కోత
నిజానికి మనం మతాల్ని
తొమ్మిది నెలలూ కడుపులో మోయం కదా!
తల్లులారా!  మీరన్నా చెప్పండి
మీరెవరైనా మీ గర్భం లో మతాన్ని దాచుకున్నారా
మనఒడి లోకి చేరాకే కదా
వాళ్ళు రాముళ్ళో,రహీం లో
బుష్ లో ,లాడీన్ లో
గాంధీలో .గాడ్సెలో అవుతున్నారు
మన గర్భం లోనే కదా
తల్లిథెరీస్సా కళ్ళు విప్పింది
మన గర్భం లోంచే కదా
కుష్టురోగులకు సెవలు చేస్తున్న బాబా ఆంటే జన్మించాడు
మనకి తెలియకుండా
రాక్షసులెప్పుడు వూపిరి పోసుకున్నరో
గర్భస్థశిశువులకైనా,పుట్టాకైనా
ఇక నుండి మనం అనామికలు గానే పెంచుదాం
పెరిగాక వారి  పేరు వాళ్ళే సంపదించుకుంటారు
వాళ్ళ భవిష్యత్ వాళ్ళే నిర్మించుకుంటారు
ఎక్కడో సున్నితమైన కదలిక
పూరేకు మీద పడిన మంచుబిందువు
అసహాయం గా చిట్లిపోయిన సవ్వడి
దాక్కోవాలని ప్రయత్నించిన కన్నీటి బిందువు
ఆవిరి అయిపోతున్న శబ్దం
అలసి పోయిన తల్లి గర్భం లో
మెత్తని మృత్యు కత్తి పేగు తెంచిన చప్పుడు
కూలిపోతున్న బహుళ అంతస్తుల సౌధల క్రింద
నలిగి పోతున్న ఆక్రందన
ఎక్కడో వృద్ధుల వడలిన కన్రెప్పల అడుగున
కన్నీరు ఇగిరి పోయిన ఎడారి మైదానలు
పంచభుజి కోణం లొ గుచ్చుకున్న
కొత్త పెళ్ళి కొడుకు గుండె
సప్తసముద్రాల అవతల
రంగుల కలల్లొ తేలిపోతున్న అమ్మాయి
ముచ్హటగా పెళ్ళికి వేయించుకున్న మెరుపు గాజుల మధ్య
చివరిసారిగ కొట్టుకున్న అలజడి
విచ్చుకున్న క్లష్తర్ నేత్రం విరజిమ్మిన నిప్పురవ్వలు
జనానాలో నిద్రిస్తున్న తల్లి గుండెని కాల్చిన వాసన
శరణార్ధ శిబిరాలలోని అనాథ బాలల్ని
ఆవరిస్తున్న పెనుచలి
రాత్రి తాగిన తల్లి పాల నురుగు
వెక్కివెక్కి నిద్రలోనే కనుమూసిన పసిపాప పెదాలపై
రక్తపు డాగు తో మమేకం అయిన ప్రకంపనం
ప్రార్ధనలో మునిగి పొవాలని
మూసిన కన్రెప్పల కింద దూరిన మృత్యువు
రెపటి తొలి వెలుగు చూడనీకుండానే
మందిరలముందె శిలువలకు వేలాడాదీసి
ఆర్పేసిన హృదయ దీపాలు
భవంతులు కృర మృగాలు  దాగిన కొండగుహలై
జనావరణాలు నిర్జీవ సముద్రాలై
వూపిర్లు విషసర్పాల బుసలై
ప్రాణాలు భయం కలుగులోదాగిన మూషికాలైన భయానక ఆలోచనలు
అంతరంగాన్ని మెలిపెడుతుంటే
కంఠానికి గుచ్చుకున్న సూదిమొన చేస్తున్న గాయం బాథ!
సమర శంఖం లోంచి
చుక్క చుక్కై ఒక్కొక్క చినుకై
రాలుతోన్న రక్త బిందువులు
సహస్రాబ్ధికై కొన్న కొత్త చీర మీద
మాయని అసహజ చిత్రాల్ని లిఖిస్తున్నాయి .
 

yuddham oka gunDe kOta

    యుద్ధం ఒక గుండె కోత -2వ చాప్టర్

 
తాకట్టు గా మారి ఇనప్పెట్టి లో చేరిన ఇంటిని
విడిపించటానికి డబ్బు పంపుతానని బాసలు చేసి
ఇకమీదట మన జీవితాలు పూలతేరు మీదే నని
రాత్రి చెవిలో ఒలికించిన తేనె సోనలు
ఏ మేఘాల అంచుల్లో ఒదిగిపోయాయొ

ఆఘమేఘాల మీద ఒడిలో చేరటానికి వస్తున్నానంటూ
క్షణాల్లో హృదయాల్తో వూసులాదు తానని
గుసగుసగా చేసిన వాగ్దానాలు
ఏ గాలి తెరల్లో చితికి పోయాయో

మృత్యువు వెనకనే తరుము తుంటే
ప్రాణాల్ని గుప్పిట్లో బంధించే లోపునే
కాళ్ళు లిఫ్టులౌ తూ జరిపోతా యి
మెట్లు స్కేటర్లై కదిలి పోతూనేవుంటాయి

భయం వెనకే తల్లి పిలుపు వెంటాడు తుంది
తండ్రి చేసిన అప్పులు తరుము తాయి
నిస్సహాయత్వం మైకం లా కమ్మేస్తుంది
ఒకే ఒక్క క్షణం
మృత్యువుకి దొరికి పోతారు
ఎటువెళ్ళాలొ తోచని  పరి స్థితి
విజయగర్వం తో మృత్యువు పోగై 
వూపిర్ని బంధించటానికి పైకి వురుకుతుంది
ఒకే ఒక్క దారి ముందున్న కిటికి !
ముందు వెనుకలు చూసే ఆలోచన మూసుకు పోతుంది
అంతే
ఇక అటువైపే పరుగు
అది ఏ అంతస్తో గుర్తు రాదు
కళ్ళకి కనిపించేది
భ్రాన్తిలా మైమరపింప  జేస్తుంది
ఆ క్షణం లో
అమ్మ ఒడిలోకి దుముకుతుననంత  ఆర్తి తో
ఒకే ఒక్క గంతు
తల కిన్డులగా మృత్యుకుహరమ్ లోకి
సాగిపోతూ సోలిపోతూ ....!
ఒకే ఒక్క క్షణం అమ్మ గుర్తుకొస్తుంది
నేలని తాకుతున్న తలలో ఆశలు చిట్లుతాయి
అనంత దూరమ్ లోని అమ్మ పొట్టలో
అప్పుడే రక్తం తో పాటూ
ప్రవహిస్తూ వస్తున్నా సూది మొన
చురుక్కు మనిపిస్తుంది

సవాలు కాల్తున్న వాసనలో
ఏ దేశపు ఆచూకీ తెలియదు
ప్రవహిస్తున్న  ఆ రక్తధారలలోకి ఏ బిందువూ 
వర్ణవిభేధాల్ని విక్షేపమ్ చేసి చూపదు
కుళ్ళి పోతున్న శవాల్ని ఆక్రమిస్తున్న  క్రిములు
ఏ వూఓ ఏ దేసమో చిరునామాల్ని తెలుసుకొని
రంగూ రుచీ వాసనల్ని ఆ స్వాదించవు 

ఏనాడో గతించిపోయిన కణాల్ని
మనలోకి మనమే ఆవాహన చేసుకొంటున్నాము
రూపురేఖలు తీర్చిదిద్దుతున్నామ్
ఒక  గొప్ప ఆవిష్కారం చేస్తున్నామని గర్వపడుతున్నాం
ప్రపంచాన్ని జురాసిక్ పార్క్ చేసుకుంటున్నాం
ఈనాడు  భూగోళాన్నిశాసిస్తున్నవి
పురాతనశిధిలాల   నుండి బయటకు వస్తున్నా
నరభాక్షకాలైన భయంకర డై నొసార్లే

వాటిని మనమే కదా
దీర్ఘ  నిద్ర   నుండి మేల్కొలుపుతున్నామ్
స్వయంకృతాపరాదానికి
ప్రపంచమంతా జరిమానా కట్టాల్సిందే
మృత్యువు కారుమబ్బుల్లా
మనజీవితాలపైన పరచుకొంటుంటే
ఇన్ని రోజులుగా సమకుర్చుకుంటున్న
శ్రమఫలితాన్ని దోచేస్తుంటే
నిర్జన ఎడారి లో దిక్కులేనివారమౌ తున్నాము
మనకోసం మనకో తోడు ని
తక్షణం వెతుక్కోవలసిందే
 
 
   


 
 

25, నవంబర్ 2015, బుధవారం

yuddham oka gunde kOta



యుద్ధం ఒక గుండె కోత --1 వ చాప్టర్

బాధ
సన్నటి సూది ములుకై
రక్తం లో ప్రవేశించింది
నరాల్ని కుట్టుకుంటూ రక్తం  తో బాటు గా
శరీరమంత టా ప్రవహించటం మొదలైంది
శరీరం   లో ఎక్కడో ఒక చోట
ఉండుండి  ప్రవాహమార్గం లో
సున్నితమైన నరాల గోడల్ని తాకుతూ
స్పందనల్ని మీటుతూ
చురుకు చురుకు మనిపిస్తూనే  వుంది
హహాకారాల్ని ఆహ్లాదం గా పరిగణీంచలేం  కదా
ఆక్రందల్ని ఆనందం గా ఆస్వాదించలేమ్  కదా
చాటున మాటేసి పంజా విసిరినా
పంజా దెబ్బ పడేది అమాయకులమీదే
గాయం అయ్యేది తల్లి గర్భం పైనే

ఆకాశం పిడుగై వర్షించినా
పక్షులకు ఆశ్రయమైన ఏ మహావృక్షమో
కాలి  బూడిద కావలసిందే కదా       
అనాధ పక్షులు కకావికలై పోవలసిందే కదా
పెనుబాంబులు  గా రూపాంతరం చెందిన
లోహవిహంగాలు పెఠెలు మంటే
ఎక్కడో ఏమూలో
ఒక తల్లిపేగు ఖణేల్ మంటుంది
ఏ పరిస్థితులు ఆకాశం నిండా
యుద్ధమేఘమై అలముకొన్నా
దుఃఖం భూగోళం అంతా వర్షిస్తుంది
వేలు ఎవరిదైతేనేం
కన్నుమాత్రం మనందరిదీని
కాలుస్తున్నది మనిల్లు కాదని
మూడంకే వేసి ముడుచుకు పడుకున్నా
మంట సెగ మనచుట్టురా ఆవరించక మానదు
చేతులు మొదలంటా  కాలేవరకూ
బాధని సహించాల్సిందేనా?
ఎవరికీ వాళ్ళమే ఆకుల్ని వెతుక్కొంటూ
మంటల్ని చల్లార్చుకోవల్సిందేనా?
చేతిగాయాల్నైతే  చూపగల్గుతాం
కడుపులో జ్వలిస్తున్న దుఃఖపు మంటని
ఎలా చల్లార్చుకోగలం?
కనిపించకుండా రక్తంలో ప్రవహిస్తూ
నిలువెల్లా గాయాల్ని చేస్తున్న
ములుకుల్ని ఎలాతొలిగించుకోగలం ?  

25, అక్టోబర్ 2015, ఆదివారం

శీలా సుభద్రాదేవి ‘రెక్కల చూపు’ (పుస్తక సమీక్ష)-వనజ తాతినేని

ఇటీవల “రెక్కల చూపు ” కథల సంపుటి చదవడం జరిగింది . అందులో అన్ని కథలు బాగున్నాయి సాదా సీదా వచనంతో ఆసక్తిగా పఠకులని అక్షరాల వెంట పరుగులు తీయించగల రచయిత్రి శీలా సుభద్ర గారు , ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురించిన మరియు పోటీలలో బహుమతి పొందిన కథలే !

IMG_0423మన చూపుకి అందినంతవరకు కొంత స్పష్టంగానూ మరి కొంత అస్పష్టంగానూ చూస్తూ ఉంటాం . రెక్కల చూపు .. ఈ పదం వినగానే ఏదో అర్ధం అయి కానీ భావన . చూపులకి రెక్కలు వస్తే .. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి ఏది చూడాలనుకుంటే అది చూసి రావచ్చు . అలా చూపులకి రెక్కలు లేవు కాబట్టే మనకి నిరీక్షణ. కొన్ని కథలని వివరంగానూ కొన్ని కథలని సూచనా ప్రాయంగాను పరిచయం చేస్తున్నాను .

ముఖ్యంగా మార్పు వెనుక మనిషి కథ చదివి మన జీవితాల్లో వస్తున్న మార్పుకి అనుగుణంగా మనం కూడా సర్దుకుపోవాల్సి ఉందని ఈ కథ చెపుతుంది. చక్కటి కథ . శ్రీ లక్ష్మి గారి కొడుకు రాజుకోడలు రమణీ విదేశాలలో ఉంటాడు. ఆమెకి కొడుకు కూతురు పింకీని ప్రేమగా హత్తుకోవాలని చిట్టి పొట్టి కబుర్లు చెప్పుకోవాలని ఆరాటం . రాజు నాలుగైదేళ్ళ తర్వాత మాతృదేశం వచ్చి ఇక్కడ వాతావరణంలో ఇమడలేక మంచి నీళ్ళు కూడా కొనుక్కుని తాగుతూ నాలుగురోజులైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు తల్లి ఇచ్చిన స్వీట్స్ జంతికలు కూడా లగేజ్ ఎక్కువైందని వదిలేసి వెళ్ళిపోతాడు . పుట్టినప్పటి నుండి ఇక్కడ పెరిగిన వాడే కదా ! అంతలోనే విదేశాల అలవాటుతో ఇక్కడ ఉండలేనని వెళ్ళాడు అని శ్రీ లక్ష్మి తలచుకుని బాధపడుతుంది . కొన్నాళ్ళకి ఆమె పుట్టి పెరిగిన ఊరు కొనసీమకి భర్త తో సహా వెళుతుంది. నగర జీవనానికి అలవాటైన వాళ్ళు అక్కడ బురదతో నిండిన నేలలో నడుస్తూ చిరాకు పడుతూ కరంటు లేక దోమకాటు ని భరిస్తూ వారం రోజులు ఉందామని వెళ్ళిన వాళ్ళు ఒక్క రోజుకే తిరిగి ప్రయాణ మవుతూ మార్పు వెనుక మనిషి పరిగెత్తాల్సిందే అనుకుంటారు . సౌకర్యానికి అలవాటు పడిన మనుషులు వేరొక చోట జీ వనానికి అలవాటైన మనషులు కొన్నేళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతిధులై ఆ వాతావరణంలో ఇమడలేక ఇబ్బంది పడుతూ సొంత గూటికి చేరుకోవాలనుకోవడం మార్పు వెనుక మనిషి పరుగులు తీయడం తప్పదని ఈ కథ చెప్పింది .

కంచె కథ .. ఈ కాలానికి అవసరమైన కథ. తల్లి బిడ్డని అన్ని వేళలా కంచె అయి కాపాడుకోవాలని చెప్పిన కథ . చిన్నప్పుడే ఇంటి ప్రక్కతనిని ప్రేమించి పెళ్లి చేసుకుని బస్తీ కి వచ్చేసిన నాగమణి వాళ్ళమ్మ నోరుగల మనిషి . ముగ్గురు పిల్లలని స్కూల్లో జేర్పించి పైసా ఫీజ్ కూడా కట్టకుండా సంవత్సరాలు గడిపేస్తూ ఉంటుంది . దయతలచి పరీక్ష ఫీజ్ కూడా ఎవరో ఒకరు కట్టేస్తూ ఉంటారు . ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెని వదిలేసి వేరొక స్త్రీ తో ఉంటూ కుటుంబాన్ని గాలికి ఒదిలేసినా నాలుగిల్లల్లో పని చేసుకుంటా పిల్లలని పెంచుకునే ఒంటరి తల్లి ఆమె . నాగ మణి ఎనిమదవ తరగతి చదువుతూ ఉండాగానే అబ్బాయిలతో స్నేహం చేస్తూ వాళ్ళతోపాటు స్కూల్ టెర్రస్ మీద టీచర్లకి దొరికిపోతుంది . తల్లిని పిలిపించి బిడ్డని జాగ్రత్తగా పెంచుకోమని చెపుతారు టీచర్లు . ఆ మాట విన్న నాగమణి తల్లి ఆవేశంతో ఆ పిల్లని కొట్టబోతుంది. మర్నాటి నుండి తనే స్వయంగా స్కూల్ దగ్గర ఒదిలిపెట్టి మళ్ళీ స్కూల్ వదిలే సమయానికి వచ్చి వెంట తీసుకుని పోతూ .. బిడ్డ ఏ ప్రేమ ఆకర్షణ వలలో చిక్కకుండా ఏ తోడేళ్ళ బారిన పడకుండా కాపాడుకుంటుంది. రచయి త్రి ఈ కథని బాగా వ్రాసారు . కథ మన కళ్ళ ముందు దృశ్య రూపంలో కదిలిపోతుంది.

ఇంకో కథ గోవు మాలచ్చిమి. సరోగ్రసీ మదర్ గా అవతారమెత్తిన పేద మహిళ కథ నవ మోసాలు మోసి తనది కాని తన బిడ్డని అమ్ముకునే తల్లి యొక్క మనోభావాలని సున్నితంగా సృశించిన ఈ కథలో వెంకటలక్ష్మి నారాయణ భార్యాభర్తలు ఉన్న అరెకరం పోలమమ్మి గల్ఫ్ దారిన పట్టిన నారాయణ వెళ్ళిన కొన్నాళ్ళకే చావు తప్పి కన్ను లోట్ట బోయి నట్లు గోడకి కొట్టిన బంతిలా తిరిగి వచ్చేస్తాడు. చేసిన అప్పులు , చేయడానికి పనిలేకపోవడం ,ఆటో అద్దెకి తీసుకుని నడపడం ద్వారా వచ్చే డబ్బు ఆ ఆటో అద్దెకి సరిపోవడంతో పిల్లలు కూడా పస్తులున్దాల్సి రావడంతో దగ్గర బంధువు మల్లేష్ చెప్పిన మాటలు విని భార్య గర్భం ని కూడా తొమ్మిది నెలలు పాటు అద్దె కి ఇచ్చే పని కి ఒప్పిస్తాడు . తొమ్మిది నెలలు మోసి పండంటి బిడ్డని కనీ డబ్బిచ్చిన వారి చేతిలో పెడుతుంది ..దానితొ వారి ఆర్ధిక బాధలు తీరిపోతాయి . వెంకట లక్ష్మికి ఉపాధి దొరుకుతుంది . కానీ డబ్బాశ తో మరొక మారు ఆమెని బిడ్డని కనీ ఇమ్మనడానికి భర్త సమాయతం చేస్తుంటే … ఆమె ముందుకు కదలక కాళ్ళు దిమ్మ కట్టి పోయినట్లు అక్కడే పాతే సినట్లు నిలబడుతుంది కట్టు కొయ్యకి కట్టేసిన ఆవు దాని చుట్టూ బాధగా తిరుగుతూ ఉంటుంది . ప్రతి ప్రసవం మనిషికి పునర్జన్మ లాంటిది పుట్టబోతున్న బిడ్డపై ప్రేమతో తల్లి వాంతులని వికారాలని భరిస్తూ తొమ్మిది నెలలు మోసి పురిటినొప్పులు భరించి బిడ్డని కంటుంది . ఎవరో డబ్బు విదిల్చేసి పేగు బంధాన్ని తెంచేసి ఆ బిడ్డని లాక్కేలుతుంటే ఏమీ కానిదానిలా చూస్తూ ఉండటం మాత్రు హృదయం భరిచడం ఎంత కష్టమో స్త్రీకి మాత్రమే తెలుసు . అందుకే కట్టు కొయ్య చుట్టూ తిరిగే గోవు మాలచ్చిమి తో వెంకట లక్ష్మిని పోల్చి మూగ వేదనని మన కళ్ళకి చూపించారు .

ఈ కథల సంపుటిలో టైటిల్ కథ రెక్కల చూపు . చాలా దుఃఖ పెడ్తుంది కథ . సావిత్రి భర్త యాదగిరి రిక్షా త్రొక్కుతూ ఉంటాడు. సావిత్రికి మేనమావ అవుతాడు . ఇంకో సంతానం లేని సావిత్రి తల్లి కూడా వారి దగ్గరే ఉండేది ఒక రోజు సినిమాకని వెళ్లి జరిగిన యాక్సిడెంట్ లో సావిత్రి భర్త కూతురు చంద్రకళ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోతారు . దెబ్బలు తగిలి కొన్నాళ్ళు మంచం లో ఉండి సావిత్రి తల్లి చనిపోతుంది . చంద్రకళ కాకుండా సావిత్రికి ఇంకో ఇద్దరు కొడుకులు ఉంటారు . వేంకటేశు ,శ్రీనివాసు . సావిత్రి బీడిలు చుట్టుకుంటూ వచ్చే ఆదాయంతో ఇండ్లలో పని చేస్తూనూ పిల్లలిద్దరిని పోషిచుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఉంటుంది వారికి స్కాలర్ షిప్ కూడా రావడంతో ఇబ్బందేమీ లేకుండానే జరిగిపోతుంది . వేంకటేశు తెలివికలవాడు పదవతరగతి వరకు చదువుకుని సిమెంట్ ప్యాక్టరీలో పనికి వెళ్ళే వాడు . కొన్నాళ్ళ తర్వాత పనికి వెళ్ళడం మానేసి ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉండేవాడు . అప్పుడప్పుడు కొన్ని రోజులపాటు ఇంటికి రాకుండా కూడా ఉండేవాడు . ఒకసారి అలా వెళ్ళినవేంకటేశు ఇక ఇంటికి తిరిగి రాదు . అందరూ సినిమాల పిచ్చితో ఏ బొంబాయి కో వెళ్ళాడని అనుకుంటారు కొన్నాళ్ళకి ఒక ఉత్తరం వస్తుంది . అది చదువుకుని తల్లి సావిత్రి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది . ఆ ఉత్తరాన్ని చిన్న కొడుకుకి తెలియకుండా చూరులో దాసీ ఎవరు లేనప్పుడు కొడుకు వ్రాసిన ఉత్తరం తీసి చదువుకుంటూ ఉంటుంది . ప్రతి రోజు కొడుకు వస్తాడనిఎదురు చూస్తూ ఉంటుంది , ఆ ఉత్తరం కూడా వానకి తడిసి అక్షరాలూ మసక బారినా అలాగే ప్లాసిక్ కాగితంలో చుట్టి దాచుకుంటుంది . శ్రీనివాస్ పదవ తరగతి పాసై ఆ ఊర్లోనే కరంట్ పనికి వెళుతూ ఉంటాడు . మధ్యలో ఆతను కూడా ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాడు , తల్లి ఆ పుస్తకాలు చదవడం చూసి తొట్రు పడతాడు . పరీక్షలు అయినాక పుస్తకాలు చదవడం ఏమిటంటే జగ్గన్న ఇచ్చాడని చెపుతాడు జగ్గన్న అంటే వేంకటేశు దోస్త్ కదా ! ఏం చెప్పిండు అని అడుగుతుంది . తొందరలోనే అన్న వస్తాడని చెప్పాడని చెపుతాడు. కానీ వెంకటేసుకి బదులు అర్ధరాత్రి వేళ పోలీసులు వస్తారు . భయంతో తలుపు కాదు కదా కిటికీ తలుపు కూడా తీయనివ్వదు సావిత్రి . తెల్లవార్లు భయంతో వణికిపోతూ సూర్యోదయంకి తలుపులు తీస్తారు . ఇంటి వెనుకప్రక్క ఒక గొనె సంచీని చూస్తారు అందులో రక్త సిక్తమైన వెంకటేష్ బట్టలు పెన్ , డైరీ ఇవి కనబడతాయి . జరిగింది అర్ధమై సావిత్రి కూలబడిపోతుంది . ఆమె చూపు చివర వేంకటేశు శ్రీనివాసు లాంటి ఎందఱో కనబడతారు . ఈ కథ చదివాక మరే కథ చదవలేము. దుఃఖంతో హృదయం భారమవుతుంది. పేద కుటుంబాల లోని పిల్లలు ఎంతో కొంత చదువుకుని కుటుంబానికి ఆధారం కాకుండా విప్లవ సాహిత్యం చదివి పోరు బాట పట్టి అకాల మరణం పాలవుతున్న తీరుని ఎంతో హృద్యంగా, నర్మ గర్భంగా చెప్పారీ కథలో.

విద్యల వ్యాపారాన్ని విద్యని కొనుకునే వారి గురించి ఆలోచింపజేసే విధంగా చెప్పిన కథ అంగడి . స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళ యినా పేదవారికి చదువు అందని ద్రాక్ష ఎందుకవుతుందో చెప్పే కథ . వెనుకబడిన కులాలు తరగతుల వారికి పాఠశాలలో ఉచిత విద్య లభిస్తుందని చెప్పేదెవరు ? వారికి తెలిసేది ఎలా అని దిగులు పడతారు . పేదవాడి రిజర్వేషన్స్ మీద పడి ఏడిచే అగ్ర కులాలవారికి సరైన్న మార్కులు రాకపోయినా ఇంజినీరింగ్ సీట్ కొనుక్కోగల స్తోమత ప్రవల్లిక లాంటి కుటుంబీకులకి ఉంటుంది కానీ చంద్రిక లాంటి పిల్లలు బాగా చదువుతున్నా కాలేజీ మెట్లు ఎక్కే పరిస్థితులు లేని వారి ఆర్ధిక స్థితిగతులు ఎప్పటి మారవు చదువు అంగటి సరుకే అని చక్కగా చెప్పారు రచయిత్రి.

వందేమాతరం పాట సరిగా పాడకపోతే గాంధీ తాతకి కోపం వస్తుంది కదు నాన్నా ! అప్పుడేమో ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేయలేక ఓడిపోతే మనం మళ్ళీ వాళ్ళ క్రిందే పని చేయాల్సి వస్తుంది . అందుకే పాట చక్కగా పాడాలని మాస్టారు అన్నారు అవునా నాన్నా ! అని అమాయకంగా ప్రశ్నించినప్పుడు తన మాటలకి మురిసి పోయి గుండెలకి హత్తుకుని తన బుగ్గల మీద ప్రేమగా ముద్దెట్టుకున్నాడు తండ్రి . ఆనాడు అమాయకంగా అడిగిన మాటలు ఇప్పుడు గుర్తొచ్చిన పరమేశానికి చేతికి తడిగా తగిలింది చెంప . ఇలా ముగుస్తుంది కథ . స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశకాలు దాటాయో లేదో మళ్ళీ మనం విదేశీ వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకుపోతున్నాం. మల్టీ నేషనల్ మార్కెట్ ట్రెండ్ మన చిన్న వ్యాపారస్తులని ఎలా నామ రూపాలు లేకుండా చేస్తున్నతీరుని ఆలోచింపజేస్తూ వ్రాసిన కథ ఆరోహణంలో అవరోహణం. అందరూ తప్పక చదవాల్సిన కథ .
ఈ రెక్కల చూపు సంకలనంలో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి . వస్తువు దృష్ట్యా అన్నీ మంచి కథలే ! ఏ కథకి ఆ కథ బావుంటుంది . కొన్ని సహానుభూతినీ కల్గిస్తే కొన్ని కథలు ఆలోచింపజేస్తాయి . సుభద్ర గారి చూపు చాలా విశాలమైంది . కనుకనే ఇప్పటి సామాజిక అంశాలన్నింటిని కథలుగా మలిచారు . చాలా కథలు ఆమె అనుభవంలో నుండి వచ్చినవిగా కూడా తోస్తుంది . సుభద్ర గారి రచనలలో స్త్రీల జీవితాల్లో తిష్ట వేసి ఉన్న వేదనని దానికి కారణమైన పురుష అహంకారాన్ని సున్నితంగా విమర్శిస్తూ సాగే ఒక స్త్రీ గొంతుక ఉంది . ఈ సంపుటిలో కథలన్నీ కూడా స్త్రీల జీవితాలలో ఉండే అసహాయత, అంతులేని వేదన కల్గి ఉన్నాయి . కానీ విశేషం ఏమిటంటే స్త్రీలు దుఖాన్నీ మోస్తూనే అవసరమైనప్పుడు ఆత్మ విశ్వాసంతో దైర్యంగా బ్రతికి తీరాలనే తపన కల్గి ఉంటాయి .

చిరుజల్లు కథలో భార్యకి పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకున్న భర్త బిడ్డని వద్దనుకున్న ప్రయత్నంలో ఆమె శాశ్వతంగా తల్లి కాలేని పరిస్థితి కల్గినప్పడు శారీరక అనారోగ్యంతో పాటు మానసిక అనారోగ్యం కల్గి నాలుగు గోడలకి పరిమితమయ్యి భర్త నిర్ణయాన్ని కాదనగల్గే దైర్యం ఎందుకు లేకపోయిందో అని తనని ప్రశ్నించుకునే పాత్ర రజని , పెళ్ళికి ముందు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఎన్నో విషయాలు చెపుతూ చర్చలలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉండే లైబ్రేరియన్ జయంతి పెళ్లి తర్వాత భర్త పిల్లలు నాలుగు గోడల మధ్య పరిమితమై మేల్ ఇగో ని సంతృప్తి పరచలేక పుస్తకాలని చదవడమనే ఇష్టాన్ని కొనసాగించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన స్త్రీ కథ , ఆడపిల్ల సంపాదనతో కుటుంబ అవసరాలని తీర్చుకుంటూ ఆమెకి పెళ్లి మాట తలపెట్టకుండా కుటుంబం కోసం అరగదీసే తల్లిదంద్రులున్నప్పుడు తనకేం కావాలో ఆలస్యంగా నయినా తెలుసుకునే మహాలక్ష్మి ఊరేళ్ళాలికథలో .కుటుంబాలని బట్టీ కాకుండా సంస్కారం,మంచితనంతో మనుషులని అంచనా వేస్తూ సుమతి స్నేహానికి విలువనిచ్చే రంజనీ పాత్ర ఉన్న కథ “నివురు” పిడికెడంత ప్రేమకోసం ఆలంబన కోసం పెళ్ళైన వాడు అని తెలిసి కూడా తన హృదయంలో చోటిచ్చి జీవితంలో భాగమైనా తనకి తన పిల్లలకి కేమికాని పురుషుడుకి ఎంత మాత్రం చోటివ్వకూదనుకునే సావిత్రి కథ “మూసిన తలుపులు” ఆడవాళ్ళకి చదువులెందుకు ఉద్యోగాలెందుకు అని స్వార్ధంగా ఆలోచించడం మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి ఉంటుందని తెలిపే కథ “మాయేంద్రజాలం ” కథ వీటన్నింటిలోనూ స్త్రీల గొంతుకే వినిపిస్తుంది . అలాగే మనుషుల్లో మానవత్వం ఇంకా ఉండే అన్నదానికి గుర్తుగా రోడ్డు ప్రక్కన పడి ముసలమ్మ పట్ల ముగ్గురు యువకులు చూపిన శ్రద్ద దయ “పరిమళించిన మొగ్గలు” కథ పేదవాళ్ళకి కడుపు నిండా తిండే కాదు తలదాచుకోవాడానికి చిన్న గుడిసె కూడా లేకుండా సంపన్నుల ఇళ్ళమధ్య నుండి వారిని తరిమేస్తే అకాల మరణం పాలైన బుడ్డీమా కథ “చితికినకల” నట్టింట్లో తిష్ట వేసిన టీవి ప్రభావంలో కొట్టుకొని పోతూ మనుషుల మధ్య మాటా మంచి లేకుండా ఇల్లాళ్ళు వ్యాపార ప్రకటనలకి అనుగుణంగా కొనుగోలుకి అలవాటు పడి ఇల్లు గుల్ల చేసుకునే వైనం చెప్పిన కథ “రంగుల వల” కథ అన్నీ మన చుట్టూ ఉన్న జీవితాల్లోని కథలే.

మనిషికి హితం కల్గించేదే సాహిత్యం అంటారు . అలాంటి సాహిత్య ప్రయోజనమే ఈ కథలలో అంతర్లీనంగా ఉంది . ఆమె కథలని సమీక్షించే వయసు అనుభవం కూడా నాకు లేదు . కథలు చదివిన తర్వాత నాకు కల్గిన స్పందనకి ఈ అక్షర రూపం . కొండని అద్దంలో చూపించే ప్రయత్నం మాత్రమే ఇది . అందరూ తప్పకుండా చదవాల్సిన కథలు ఇవి అని మాత్రం చెప్పగలను

-వనజా తాతినేని 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక

9, అక్టోబర్ 2015, శుక్రవారం

menOpasijam

    క్రిందటి నెల అంటె 27 వతేదీ న విజయవాడ ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక కవితా సంధర్భం సమావేశాల్లొ రజని కవిత విని 90 లలోనే మెనోపాస్ పై కవిత వచ్చుంటే బాగుండేదీ అని ఆమె అదే ఆ విషయం పై రాసిన మొదటి కవిత గా చెప్పినప్పుడు నేను చాలా కాలం క్రితమే అదే అంశం  పై రాసానని నా తర్వాత ఎన్.అరుణ ,హిమజ కూడా రాసారని తెలియజేసాను 
ఆ కవిత నేను1999 లో రాసాను .బహుసా భూమికలో అనుకుంటాను ప్రచురితమైంది.
    మెనోపాసిజం
పదాలన్నింటినీ డబ్బాలో వేసి కలగలిపి
తోచిన పదాన్నో తీసినపదాన్నో 
పేర్చి కూర్చిన సర్రియలిష్టు కవితలా
ఆలోచనలన్ని చిందరవందరై
చిక్కుముళ్ళై పోతుంటాయి
కళ్ళూ ముక్కూ చెవులూ అన్నీ ముద్దగా మెదడై పోయి
మెదడు జారి గుండె స్థానం లోకి వచ్చేసి
ముక్కలు ముక్కలైన గుండె కళ్ళుచెవులూ గా మారిపోయి
తయారైన ఆధునిక చిత్రం లా అయి పోతుంది ఒళ్ళు
పెదాలు రెండూ అంటుకు పోయి
నాలుకని ఎప్పుడో మర్చిపోయి
దుఃఖం తో బాటుగా మింగేసినట్లు
ఒక్క మాటన్నా శబ్దించదు
చాపకింద నీరులా మనకి తెలియకుండానే
శరీర మార్పులకు గురిచేస్తున్న హార్మోన్లలా
చీటికీ మాటికీ కళ్ళు తడి ఐపోతూనే వుంటాయి
వుండుండి ఒళ్ళంతా మండే నిప్పుల కొలిమౌతుంది
వూపిరితో తిత్తి కొడుతున్నట్లు
బుసబుసా కోపంకళ్ళల్లోకి నాలుకలు చాపుకుంటూ దూకుతుంది
మహావిస్ఫోటనానికి సిద్ధంగా
పెను ఒత్తిడికి గురై అతలాకుతలమౌతోన్న మనసుని
ఆర్తిగా సున్నితం గా దోసిట్లోకి తీసుకొని
ఈ కలగాపులగాన్ని జీర్ణించుకొని
నేనున్నానంటూ చేయందిస్తె
బాటలోని ముళ్ళన్నీ తొలగిస్తుంటే
చడీచప్పుడూ లేకుండా నిశ్శబ్దం గా దాన్ని దాటిపోగలం
అలా కానప్పుడు
మన జీవితాల్ని ప్రభంజనం లా ముంచేయకముందే
మనకి మనమే
ఆత్మవిశ్వాసం తో ఎదురీదైనా
గట్టు మీదకి చేరుకోవాలి 
 ( 20-2-1999)    
 

20, ఆగస్టు 2015, గురువారం

     1980-90 ల లో ఆంధ్రప్రదేష్ లో దూబగుంట రోశమ్మ పేరు వార్తాపత్రికలలో ముఖ్య అంశం  గా వుండేది. ఎందుకంటే బడుగు బలహీన  వర్గాల లోని సారా బాధిత స్త్రీలని కూడగట్టి నడుం బిగించి సారావ్యతిరేక వుద్యమాన్ని ముందుకు నడిపించి ఆనాటి ప్రభుత్వమూలాల్ని కదిలించిన విషయం మరచిపోలేము. ఈనాడు ఆమె ఎలాంటి దుస్థితిలో వుందో తెలియదు.
  ఆరోజుల్లో ఆమే నడిపించిన వుద్యమం ప్రేరణగా నేను 1993 లొ రాసిన కవిత ఇది .ఇప్పుడు కూడా ప్రభుత్వ ఖజానా నింపేందుకు పేద ప్రజల జీవితాల్ని మత్తులోకి నెట్టి వారిభార్యపిల్లల బతుకుల్ని బుగ్గిపాలు చేయాలని కంకణం కట్టుకుంటున్న నేపధ్యం లో మళ్ళా మరో దుబగుంట రోశమ్మలు గా మారి  చౌకమద్య నిషేదం కోసం వుద్యమంతో ముందుకు  రావాల్సి వుంది.
   ఈ  సందర్భం లో నా కవిత మరో సారి మీ ముందు పెడుతున్నాను.
    విస్ఫోటనం
ఆ చేతులు -
అక్షరాలు దిద్దింది మొదలు పరీక్షల్ని ఎదుర్కొని
పట్టాలు అందుకొన్నవి కావు
జీవితం లో అడుగడుగున కాళ్ళకు అడ్డం పడే
ముళ్ళకంపల్ని తొలగించుకొంటూ కందిన చేతులవి
కాగితాల మిద అక్షరాలు చల్లి
కవిత్వం పండించినవి కావు
అనుభవాలదారం తో కూర్చిన
పాటల పేటీకల్ని మోసుకొంటూ కలగలిసిన చేతులవి
ఒకప్పుడు కొంగు నోట్లో కుక్కుకుంటూ కన్నీళ్ళతో తడిసినవే
ఇప్పుడు నడుముకు కొంగు చెక్కుకొని బిగుసుకున్న చేతులవి
వడ్లు దంచి ,పిడకలు కొట్టి గట్టిపడినవి కనుకే
ఆత్మవిశ్వాసం  పండించుకొన్న పిడికిళ్ళై
భూమి లోపలి పొరల్లొ సైతం భయ ప్రకంపనలు కలిగించాయి
లక్షలాది చేతుల్ని కూడగట్టుకొని
సారాసీసాల్ని పగల గొట్టి విస్ఫోటనం సృష్టించాయి కనుకె
పిడుగులు పడినా చలించని
అధికార పీఠాన్ని సైతం
గజగజ వణికించాయి           

19, ఏప్రిల్ 2015, ఆదివారం


‘’నా ఆకాశం నాదే ‘’
ఆకాశం లో సగం స్త్రీ మూర్తిదే .అందుకని ‘’నా ఆకాశం నాదే ‘’అనే హక్కు అమెకున్నది .ఈ హక్కుల పత్రమే శ్రీమతి శీలా సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’కవితాసంపుటి . సుభాద్రాదేవిగారి కవిత్వం పై  స్పందించిన సుప్రసిద్ధ రచయిత్రి విశ్లేషకురాలు డా .కాత్యాయనీ విద్మహే ‘’నా కృషి కురుతే కావ్యం ‘’ అనే భావాన్ని ఎక్కించుకొని కొత్తజన్మ ఎత్తని వాళ్ళు హేతువాదిగా ,సమతా వాదిగా కాలేరు .సుభద్రా దేవిగారిది కులమతాలకు అతీతమైన భావన .బాల్యం కోల్పోయినవారిని ,బతుకును క్రీడగానో ,కలగానో మార్చుకొన్న వాళ్ళను ,ఆర్ధిక దౌర్భాగ్యాలకు విలవిల లాడే మధ్య తరగతి వాళ్ళ ఆరాట ,పోరాటాలకు దిగిన వాళ్ళను గురించి రాశారు ‘’అన్నమాటలు ఇక వేరెవరూ అదనంగా చెప్పాల్సిన అవసరం లేదనిపించేవే .కనుక నా పని చాలా తేలికయినది .ఈ సంపుటిలో 34 కవితలు వివిధ శీర్షికలతో ఉన్నాయి ఇవి వివిధ పత్రికలో ముద్రణ పొందినవే ..అన్నీ అర్ధ వంతమైనవే నని పిస్తాయి చదువుతూ పోతుంటే .ఒక విహంగ వీక్షణం వేద్దాం .
తల్లి ‘’తులసి కోట దగ్గరే కొడి గట్టిన దీపమయ్యింది ‘’ఇక ఇంటి బాధ్యతా ఈమెదే .కొత్తబిచ్చగాడు పొద్దేరగడన్న సామెతగా ఆశాకిరణాలతో అంతా అలంకరించింది .’’ముళ్ళకు తాకిన పాద ముద్రల్ని అద్ది ‘’ అరుణారుణ రంగ వల్లికలతో’’ముంగిలి అలంకరిం చింది .మరి ‘’ఆశే కదా జీవితానికి పునాది !’’అని వేదాంతమూ వచ్చింది .’’రూపాంతరాలు చెందుతున్న మహిళల వెతల్ని విసిరిపారేయటానికి  ‘’పూనుకొని కొత్తతరాన్ని స్వాగతి౦చ టానికి సిద్ధమైంది .’’ఇక తూర్పువాకిలి తెరవటమే తరువాయి ‘’గా మిగిలింది అంటారు ‘’కొత్త పొద్దు ‘’అనే మొదటికవితలో .
naa aakasham nade 2 001 naa akasham nade -1 001

మగాళ్ళు ‘’మృగాళ్ళు ‘’గా చెలామణి అవుతూ విర్రవీగి వీధుల్లో తిరుగుతుంటే ‘’తల్లినీ సోదరినీ కూడా గుర్తించని కామం పొగమంచు ‘’ప్రపంచ దేశాల మీదుగా కప్పేసి౦దన్నారు .ఈ మృగాలు గ్రామాలు దాటి నగర ప్రవేశం చేస్తుంటే సుభద్రా దేవిగారికి ‘’యుగాంతం వచ్చినట్లే ‘’అనిపించింది ఇది సహజం .మాదక ద్రవ్యాలు ,కాలుష్యాలు ,సోదరిభావనే లేని కర్కోటక కీచకులు పెట్రేగి పోతున్నప్పుడు యుగాంతం వచ్చిందనే అనుకోవాలి .’’అనేకానేక బందురూపాలన్నీ కలగలసిపోయి –ఒకే ఒక్క మగాడిగా మాత్రమే తనను తానూ మలచుకోన్నప్పుడు ‘’ఆడది అనేది సుఖానికే కాని దేనికీ కాదనే భావం ప్రబలమై గర్భం లోనే చిదిమేస్తున్న వికృత పోకడలు పెరిగిపోయినప్పుడు ,రేపటి కాలం లో ‘’అద్దెకి కూడా గర్భం దొరకని కార్యేషు దాసుల ‘’గూర్చి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అన్నారు .ఇవన్నీ యుగా౦తా నికి సూచనలే అని తెలియ జెప్పారు .యుగా౦తా నికి గ్రహగతులు తప్పనక్కర లేదు  ,భూకంపాలు రానక్కరలేదు .’’రేపు కాకపొతే మరో రోజు పునరుత్పత్తి ఆగిపోతే –‘’అదే యుగాంతం కాదా ?అని ప్రశ్నించారు .నిజమే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది .దీనికి మనమందరం సమాధానం ఆలోచించాలి .బాధ్యతా వహించాలి .మౌలిక ప్రశ్న ఇదే ఇప్పుడు .
‘’ రేపటి తోలి వేకువ కోసం  నవ చైతన్యం తో ఆహ్వాన గీతికల్ని ‘’ఆలపించి స్వాగతి౦చటానికి పూనుకొంటే ‘’నిద్ర అమ్మైతన ఒడిలోకి –పొదుగు కొని తననీ తన ఆలోచనలను జోకోడుతుందోనని  ఒక ‘’ఉదయం కోసం ‘’ ఎదురు చూసే భావ చిత్రం గీశారు .’’స్పందన జీవ లక్షణం ‘’అని తెలియ జేస్తూ ‘’కనబడని రాతి గుండెని శరీరం లో దాచి –రాతి ముఖానికి మొసలి తొడుగు తగిలించి –జనాల మధ్య తిరిగి కార్చే కన్నీళ్లు ‘’ఉత్త ఉప్పు  నీళ్ళే కాని తన కోసం చెమర్చేవి కావు ‘’ అని హెచ్చరిస్తారు .’’నీకు నువ్వే ఆసరావై –మరొకరి చేతికి కర్రవై బతుకు, బతికించు –‘’అని సలహా చెప్పి రాతి మొకాన్ని మాత్రం తగిలించుకొని కనపడవద్దన్నారు .క్రికెట్ ఆటల్లో మజా అనుభవిస్తూ ,ఉద్రేకం తో నరాలు తె౦పు కొంటూ ఊగిపోతూ  డబ్బూ సమయం వ్యర్ధం చేసుకొనే వ్యసన పరులకు కూడా గాఢ హెచ్చరిక జారీచేసి ‘’గెలుపోటములు ముందే నిర్ణయమై పోయి –ఎవరు గెలిచినా ఎవరు ఓడినా –లాభ పడేది వాళ్ళే ‘’అంటే మాచ్ ఫిక్సింగ్ మాన్స్ ఫీల్డ్ లే బెట్టింగ్ అప్పారావు లే  అన్న నవీన క్రికెట్ సత్యాన్ని తెలియ జెప్పారు .ఇవన్నీ ‘’మెత్తటి ఉరి తాళ్ళు ‘’అని సార్ధక నామధేయం తగిలించారు .’’మాచ్ ఫిక్సిం గ్  రాజకీయ క్రీడలో –వెర్రిబాగుల  ప్రేక్షకులమై పొతే –మన మెడలకు కూడా క౦డువాలే ఉరి తాళ్లై మెత్తగా బిగుసుకొంటాయ్’’కనుక తస్మాత్ జాగ్రత్త –జాగ్రతోం జాగ్రత  . ‘’కవిత పేపరు మీద వాలితెకాని –నిద్రా దేవి రెప్పల పాన్పు పై విశ్రమించదు’’అని ‘’ఆలోచనకీ అక్షరానికి మధ్య’’ సంబంధం తెలుపుతూ ‘’అక్షరాలు మూటకడితేకాని అంతరాత్మ శాంతించదు’’అన్న ‘’కవి సత్యాన్ని’’ చెప్పారు .రాచకీయ నాయకమ్మన్యుల ప్రలోభాలకు వాగ్దానాలకు మెరమెచ్చులకు లొంగిపోయి చేతనున్న ఆయుధాన్ని విసిరిపారేసే ‘’నిరాయుదులం కాము ‘’అంటూ ‘’గోటి తోనో ఓటు తోనో ‘’వారి వాగ్దానాల బుడగల్ని ‘’టుప్’’మనిపించే సమర్ధులం అని  వార్నింగ్ ఇచ్చారు .
తనకు ఏ భావననైనా ప్రకటించుకొనే సావకాశం లేదట .లోపల సముద్రాలు గర్జిస్తాయి .అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి .లావా ఎగసి పడుతూనే ఉంటుంది .కాని వీటిని తెలుసుకోవాలంటే  గుండె  మీద వాలి వినాలి లేకపోతె అక్షరీకరించుకోవాలి .అంతేకాని మొగానికి ఆ భావాలను అతికి౦చు కోలేదట .అందుకే ‘’వేదనో నిర్వేదమో అంటూ చిక్కని ‘’మోనాలిసా చిరునవ్వు’’ లోని చిదంబర రహస్యాన్ని నేను ‘’అని చాలా భావ గర్భితం గా చెప్పారు .
‘’పుస్తకం శీర్షిక కవితాశీర్శికయే ‘’నాఆకాశం నాదే ‘’లో తన ధోరణిలో తనను నడవనిమ్మని ,ఏ దృష్టి కోణాన్ని ఏ రంగటద్దాలని తగిలించవద్దని ఏ ఛట్రం లోనూ బంధించవద్దని  వేడుకొంటారు సుభద్రాదేవి .’’రాత్రి పొడువునా సాహితీ బయళ్ళలో స్వేచ్చావిహారం చేయాలను ‘’కొంటారు .’’నాచేతనైనట్లు నాకోసం నేను –అచ్చంగా నాది అనుకొనే స్వంత గడ్డపై ‘’విహరిస్తుంటే తన వెనక పరుగేమిటి? అని నిలదీస్తారు .’’చెమ్మగిల్లిన గింజల్ని ఏరుకోన్నట్లు –పదాల్నియేరు కోవటమే ‘’తానూ చేస్తున్నాని నిజాయితీగా ప్రకటించారు .బక్క రైతు వేదన ,అహంకార బలదర్పాలకు బలి అయిన మూగ జీవి వేదన, స్వార్ధపు పెనుకోరల్లో చిక్కి విలవిల లాడే అభాగ్యునికి ఊరట తన కవితా వస్తువులని ‘’ఈ దృశ్యాల్ని సాహిత్యం లో అల్లుకొనే గూటి పక్షిని ‘’అనీ అంటారు .గూటి పక్క ఆకుపచ్చని కొమ్మపై కూర్చుని తానూ ఆలోచల్ని ఆలాపిస్తుంటే ‘’ఏ పంజరం లోనో బంధించి –ఏ చూరుకో వేలాడ దీయాలని ‘’చూడవద్దంటారు. తన స్వేచ్చ తనకు కావాలనిదానికి హద్దులు పెట్టవద్దని ‘’ కరాఖండీగా చెప్పిన తెగువ సుభద్రా దేవిగారిది .ఏ ఇజం ముద్ర తనకు తగిలించవద్దని కోరిన మనస్తత్వం ఆమెది  .తనకు అందరూకావాలి అందరికీ తానుకావాలనే విశాల హృదయ .
‘’కాలుష్య సంస్కృతిని ఎలాకాల్చాలో –అక్షరాల్లోనైనా అస్తిత్వ పోరాటాల్లోనైనా  ‘’కలిసి నడుద్దాం అంటూ ‘’కాసింత కలం అందివ్వండి ‘’అని సాయం కోరారు. అక్షర జీవుల్ని ఆసరాగా నిలవమని ప్రబోధమే అది .’’ఒక వర్షం లో మూడు దృశ్యాలు ‘’చూశారు సుభద్రా దేవి .ఏసీ రూమ్ లో బతుకు కోసం ఆడే అమ్మాయి శరీరాన్ని తలపోస్తూ ‘’రాక్ సంగీతం లో వంపులు తిరుగుతోందట వర్షాధార .అద్దాల్లోంచి చూస్తె త్రీడీ ఫోటోగ్రాఫ్ గా మనసుకు ఆహ్లాదమిస్తోంది . రెండో సీన్ లో చెట్టు నీడలోనో  చూరుకిందో గడిపే అమ్మాయి –‘’వర్ష ధార చుర కత్తి అయి చల్లగా శరీరాన్ని కోస్తోంది –బతుకు బట్ట చాటున గుండె కుంపటి రగిల్చి –కళ్ళ దీపాలని వెలిగించుకొంటూ ‘’ జీవన యానాన్ని ఆపకుండా ‘’జొన్న పొత్తుల చిటపటలతో చలిని తరిమి కొడుతోంది ‘’ఒక ముసలిది .ఉరమబోయిన మేఘం ‘’కళ్ళనిండా మెరుపుతో –ఓ నిమిషం విస్తుబోతూ ఆగిపోయింది .’’శ్రీశ్రీ భిక్షు వర్షీయసి మనకిక్కడ జ్ఞాపక మోస్తుంది .
మూడో దృశ్యం –నట్టిళ్ళలోకి కాలనాగై జరజరా పాకి అర్ధ రాత్రి ఆక్రమి౦చుకోటానికి  వస్తున్న వర్షపునీరు కూడా ‘’అతలాకుతలం అవుతున్న కుటుంబాల్ని చూసి కంట తడిపెట్టుకొన్న ఇళ్ళు సైతం  జలజలా నీటిని కురిపిస్తున్నాయి .ఈ మూడు దృశ్యాలను వైవిధ్యం తో కళ్ళకు కట్టించి రూపకాలంకారానికి పట్టం కట్టి కనువిందు మనసుకు విందు కవిత్వపు పసందు కూర్చారు .తన ప్రతిభా వ్యుత్పత్తులు బహుమతులు తెచ్చిపెట్టాయి .ఇవి వ్యక్తిగతం కాకుండా తన సామాజిక వర్గానికే చేసిన మతలబు ఏమిటో అర్ధం కాలేదట సుభద్రా దేవిగారికి .అందుకే శీర్షిక ‘’!’’అయింది వింతగా విశేషంగా .వార్ధక్యానికి కూడా వార్నింగ్ ఇచ్చారు –‘’నిస్త్రాణగా సొమ్మసిల్లిన శరీరానికి సైతం –ఉత్తేజాన్ని డయాలిసిస్ చేసినట్లు –మనసూ శరీరమూ ఉరకల లెత్తుతున్నాయ’’ట .అందుకే అక్షరాలతో ఆడుకొనే ,సాహిత్యం తో సరాగాలు పాడుకొనే తమ జోలికి వార్ధ్యక్యాన్ని  రావద్దన్నారు .తమవద్ద దాని పప్పులేమీ ఉడకవని తెలిపారు .
‘’అస్తిత్వం కోసం ఆరాటపడటం మంచిదే –‘’కాని దానినే పైకి ఎక్కే మెట్లుగా మార్చుకోవద్దని మంచి సలహా చెప్పారు .ఆ సోపానం ఎక్కి ‘’అడ్డ దార్లు తోక్కితేనే తంటా’’అనీ హెచ్చరించారు. లోకం పోకడ గమనించి చేసిన హెక్చరికేఇది .’’పరిమళ ప్రస్తారం ‘’కవితలో సుభద్రా దేవి ‘’ఆడ దాన్నో ఈడ దాన్నో మాత్రమె కాదు –సాహిత్య సుగంధాన్ని దోసిట్లో తీసుకొని –హృదయాలకు హత్తుకొనే అన్ని ప్రాంతాల దాన్నీ ‘’అని తాను  అందరకు చెందిన దానినని చాటి చెప్పుకొన్నారు ‘’ఈ నేల మీదికి పాకే భూ గంధాన్ని –పరిమళించే కవితా పుష్పాన్ని –శిలగా కాదు –శబ్దించే శిలాక్షరాన్ని –(శీలా క్షరం ?)ఎప్పటికీ అలానే ఉంటాను ‘’అని వాగ్దానమూ చేశారు .తన ప్రయాణం ఎటో అనే సందేహం లో ఊగిపోయారు ‘’ప్రయాణం ‘’కవితలో. తాను  వెతుకుతున్నది తనలోని తాత్విక చి౦తననా లేక చింతనకు దూరమౌతున్న తాత్వికతనా?అని మధన పడ్డారు .ఇది పక్వ దశకు సూచనగా మనం బావించాలి .సాహిత్య యానం లో మరిన్ని మైలు రాళ్ళను ప్రతిస్టించు కోవాలని ఆకాంక్ష ఉంది ఆమెగారికి .అందుకోసం రెండవ బాల్యం లాగా ‘’మళ్ళీ మొదలుపెట్టాల్సిందే‘’అని చెప్పి ‘’నిరంతర నిర్విరామ చైతన్య శీలత్వం కలిగిన వాడే మనిషి ‘’అని గొప్ప నిర్వచనం చేశారు .
‘’ చీడ పీడలు పట్టిన సమాజం చెట్టుని –ధర్మాగ్రహం తో సమూలంగా పెకలించేందుకు ‘’నాలుగు చేతులూకలిసి గునపం గా మారాల్సి౦దేనంటారు .చిరుకదలిక కోసం పాళీకి మరింత పదును పెట్టాల్సిందే –కలిసి నడవాల్సిందే ‘’అంటారు ‘’ధర్మాగ్రహం ‘’లో .’’మాట’’ఎన్నిరూపాలు చెందుతుందో చెబుతూ ‘’సమస్యల చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు ముడులు విప్పి బయట పడేస్తుంది మాట .జీవిత నౌక తుఫానులో చిక్కుకోన్నప్పుడు తెరచాపై వాలుకు తీసుకొని వెడుతుంది .దుఖం తో తడిసి ముద్ద అయినప్పుడు చల్లని హృదయమై సేద తీరుస్తుంది .బాధల ఎర్రటి ఎండకు గొడుగై నీడనిస్తుంది .మనుషుల మధ్య వంతెనై కలుపుతుంది.అల్లు కున్న స్నేహలతకు విచ్చుకొన్న పరిమళ మవుతుంది .మనసుని మైమరపించే వెన్నెల సోన అవుతు౦ది .మాట.ఒక్కో సారి గుండెల్ని ముక్కలు చేసే తప్పుడు మాట అవుతుంది .హృదయాన్ని మధించే కవ్వమవుతుంది .పచ్చని బతుకుల్ని బుగ్గి చేస్తుంది. కనుక మాటను జాగ్రత్తగా వాడాలి .
‘’పరాయీకరణ ‘’ను గురించి బాధ పడుతూ ‘’నేనెక్కడో తప్పిపోయాను ‘’అని చెంప దెబ్బ కొడతారు .’’నాలోంచి నేను తప్పి పోతూనే ఉన్నాను .శూన్యం ఆవరించింది దాన్ని. నింపే ప్రయత్నం లో ‘’నాలోకి నేను నా ప్రయత్నం లేకుండానే చొచ్చుకు పోతున్నాను ‘’అని కలవర పడ్డారు .చివరికి ‘’ఈ కొత్త మేనుతో –నేను మనిషిని కాకుండా పోతున్నానా ?’’అని ఆవేదన వ్యక్తం చేస్తారు .ఆమె ఆరాటం మన౦దరిఆరటమే.మనమనసుని ఆమె అక్షరాల్లో ఆవిష్కరించారు అంతే .    ఈ రెండు సంపుటులలోని కవిత్వం ఒకే నాణానికి బొమ్మా బొరుసూ తప్ప వేరేమీకాదు అంతటి సన్నిహిత్వమున్నకవితలు .సుభద్రా దేవిగారి పరిపక్వ కవిత్వానికి ప్రతిదీ ఉదాహరణగానే చెప్పచ్చు .అద్భుత భావనకు అవసరమైన పదాల కూర్పు నేర్పు గా కనిపిస్తుంది .విషయం సూటిగా గుండెలోకి చొచ్చుకు పోతుంది .పదబంధాలూ ,పద చిత్రాలూ ఆకర్షణీయంగా ఉంటాయి .ఏదీ కృత్రిమంగా ఉండదు .సహజ సౌందర్యమే కనిపిస్తుంది  సుభద్రా దేవిగారికి కావాల్సింది వనితకు అభద్రతా భావం తొలగి సుభద్రత కలిగించటం .అబలకాదు సబల అని నిరూపించుకోవటం .స్త్రీ అస్తిత్వాన్ని కాపాడుకోవటం .వాళ్ళ అస్తిత్వానికే పెద్ద పీట వేశారు .ఆడపిల్లల జీవితాలతో ఏ దశలోనూ ఆడుకోవద్దని ,ఏ దశలోనూ అడ్డుకోవద్దని మగజాతికి  హెచ్చరిక ఉంది .వ్యామోహాల వెంట పడి ‘’మబ్బు లోని నీళ్ళు చూసి ముంత వలక బోసుకో వద్దు ‘’అన్న ముందు చూపూ ఉంది .మహిళ అన్నిరంగాలలో తన సామర్ధ్యాన్ని నిరూపించుకోవాలి స్వయం వ్యక్తిత్వం తో భాసించాలి .ఎవరి దయా దాక్షిణ్యాలపై సానుభూతి పై  జీవించ రాదు .పరిస్తితిని తన చేతికి చిక్కించుకొని నిలబడి వాలుప్రవాహమైనా ఎదురు ప్రవాహమైనా ధైర్యం తో సాగాలి .పరిస్థితులకు బానిస కారాదు .రెండు సంపుటాలలోనూ స్త్రీయే కధా వస్తువు ఎక్కువ కవితలలో . మొదటిదైన ‘’అస్తిత్వ రాగం ‘’చూస్తె నాకు మాత్రం ఆధునిక భారతం లో ‘’స్త్రీ పర్వం ‘’అని పించింది . రెండవదైన ‘’నా ఆకాశం ‘’లో సుభాద్రాదేవిగారు ఒక తల్లిగా సోదరిగా హితైషిగా, సమాజ శ్రేయస్సుకోరే మానవీయ మూర్తిగా దర్శన మిస్తారు .ఈ రెండూ కలిస్తే శీలా సుభద్రా దేవి గారి ఆంతర్యమే ఆవిష్కరింప బడిందని అర్ధమవుతుంది .ఆమె కున్న సౌజన్యం, సహనం  ,సంయమనం కవితలలో వ్యక్తమవటం గొప్ప విషయం .
వీర్రాజు గారి కవిత్వం లోను ,సుభద్రా దేవిగారి కవిత్వం లోను ‘’కోటబుల్ కోట్స్ ‘’కోసం వెతుక్కోనక్కర లేదు .అంతేకాదు ఇద్దరి పుస్తకాలకు ఎవరి ము౦దు మాటలూ ,పరిచయాలు ఉండవు .అదొక ప్రత్యేకత కూడా .నిజంగా వారికీ ఆ అవసరమూ లేదు అని చదివితే మనకు తెలిసి పోయే విషయం .చదవాలి అనుభవించాలి .ఆనుభూతిని అందరితో పంచుకోవాలి అంతే .
ఈరెండు పుస్తకాలను నాకు అందజేసినందుకు శ్రీమతి  సుభద్రా దేవి గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ  వాటిని పరిచయం చేసే అదృష్టం సాహితీ బంధువులకు కలిగించినందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-4-15-ఉయ్యూరు

 

  నాకు శ్రీమతి సుభద్రాదేవి గారి రచనలమీద మీ విశ్లేష ణా త్మ క
వ్యాసాలు ఏంతో ఉత్తెజపరచినై.
శ్రీమతి శీలా సుభాద్రాదేవిగారికి నా గౌరకపూర్వకమైన ధన్యవాదాలు , నా
తరఫున, నా శ్రీమతి సత్యవతి తరఫున ,తెలియజేయ ప్రార్ధన .
నా భావ , భాషా సంబంధించిన తప్పులకు మన్నిo చ ప్రార్ధన.–ఇట్లు, మీ
విధేయుడు, మైనేని గోపాలకృష్ణ

  1.  

 

9, ఫిబ్రవరి 2015, సోమవారం

punitha

      పునీత
మనం చెయ్యాలనుకోకుండానే
నచ్చని పనులు చేస్తూనే వుంటాం
అలా మాట్లాడకూడదనుకోంటూనే
నచ్హని సంభాషణల్లోకీ దూరిపోతూనే వుంటాం
వివాదాల జోలికి పోవద్దనుకుంటూనే
విష ప్రభంజనాల్లో చిక్కుకు పోతుంటాం
మూడుకోతుల నీతిని వల్లిస్తుంటూనే
చీకట్లోకి నెట్టుకుంటూ నడుస్తాం
మన ప్రమేయం లేకుండానే
అహంకారం లోనో అయోమయం లోనో కూరుకుపోతుంటాం

మనలోని మనం రెక్కలు కట్టుకొని
చూస్తూ చూస్తుండగానే దుమ్ము రేపుకుంటూ
ఎగరటం మొదలేడుతుంది
ఆ విసురుకి సొమ్మసిల్లి లేచేసరికి
మనలోంచి మనం తప్పి పోతాం
పూర్తి మెలకువ వచ్చాక తెలుస్తుంది
మనం కోల్పోయింది ఏమిటో

స్నేహమా!!
నా లోంచి తప్పిపోయిన నన్ను వెతికి పట్టుకొని బంధించి
స్నేహపునీతను చేసి తిరిగి నాలో ప్రతిష్టించవా!!