8, డిసెంబర్ 2015, మంగళవారం

  పగలు ప్రతీకారాలు చేసే  మాతృ హృదయ గుండె కోత
యుద్ధం ఒక గుండె కోత --4వ చాప్టర్  

దిక్కుల్ని నలువైపులా పాతుకొని
యుద్ధానికి కర్మబద్ధులై పోయి
మానవత్వాన్ని సమరరంగం లొ నిలువెల్లా పాతిపెట్టాక
ప్రాణాలు ఏ దిక్కులొ దీపమై కొడిగట్టాయో?

అంతః  కరణలో ఆధిక్యభావాన్ని నింపుకొని
పశుత్వపుమారువేషం లో
ప్రపంచస్వేచ్ఛని తూట్లుతుట్లుగా కుమ్మి
అమాయకం గా శాంతివాక్యాల చొంగ కారుస్తూ
ఎంత తిరిగితే మాత్రం ఏముంది?

గంగిగోవు తొడుగుని వంటినిండా కప్పుకొని
అందర్నీ మందలోకి కలుపు కోవాలని
ఎంత ప్రయత్నిస్తే మాత్రం ఏముంది?

పగలూ ప్రతీకారాలూ ఎప్పుడూ విధ్వంస కారకాలే
సామరస్యభావం తో సమస్యల్ని పరిష్కరించకపోతే
పెంచుకుంటున్నకొద్దీ రగులుతూనే వుంటాయి
దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు

ఇక
మలిగిపోతున్న చివరిప్రాణం
రాస్తున్న మరణశాసనం లో
ఆఖరిసంతకం క్లష్టర్ బాంబు దైనా కావచ్చు
అణుక్షిపణిదైనా కావచ్చు
విర్రవీగే అహం భావం మూలాల్ని కదిలించి
ఆమూలాగ్రం వణికించగలిగే జీవాయుధానిదైనా కావచ్చు
 ఇంక ఆ తర్వాత
పశ్చాత్తా పం తొ వంచుకోటానికి శిరస్సులూ వుండవు
సిగ్గుతొ తల దాచుకోటానికి ముడుకు లూ వుండవు
దహన శేషాలైన బూడిద కుప్పలు తప్ప

ఆనాడైనా-
మనస్ఫూర్తిగా
చిన్ననాడు గోరుముద్దలతోబాటూ
శిఖరాగ్రాలకు దారులు వేసిన అమ్మని పిలిచి చూడు
ఒకనాడు చీదరించుకున్నవని మర్చిపోయి
నీ పిలుపు కి కదలి
సమాధుల్లోంచి వచ్చి సే ద తీరుస్తుంది   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి