యుద్ధం ఒక గుండె కోత --1 వ చాప్టర్
బాధ
సన్నటి సూది ములుకై
రక్తం లో ప్రవేశించింది
నరాల్ని కుట్టుకుంటూ రక్తం తో బాటు గా
శరీరమంత టా ప్రవహించటం మొదలైంది
శరీరం లో ఎక్కడో ఒక చోట
ఉండుండి ప్రవాహమార్గం లో
సున్నితమైన నరాల గోడల్ని తాకుతూ
స్పందనల్ని మీటుతూ
చురుకు చురుకు మనిపిస్తూనే వుంది
హహాకారాల్ని ఆహ్లాదం గా పరిగణీంచలేం కదా
ఆక్రందల్ని ఆనందం గా ఆస్వాదించలేమ్ కదా
చాటున మాటేసి పంజా విసిరినా
పంజా దెబ్బ పడేది అమాయకులమీదే
గాయం అయ్యేది తల్లి గర్భం పైనే
ఆకాశం పిడుగై వర్షించినా
పక్షులకు ఆశ్రయమైన ఏ మహావృక్షమో
కాలి బూడిద కావలసిందే కదా
అనాధ పక్షులు కకావికలై పోవలసిందే కదా
పెనుబాంబులు గా రూపాంతరం చెందిన
లోహవిహంగాలు పెఠెలు మంటే
ఎక్కడో ఏమూలో
ఒక తల్లిపేగు ఖణేల్ మంటుంది
ఏ పరిస్థితులు ఆకాశం నిండా
యుద్ధమేఘమై అలముకొన్నా
దుఃఖం భూగోళం అంతా వర్షిస్తుంది
వేలు ఎవరిదైతేనేం
కన్నుమాత్రం మనందరిదీని
కాలుస్తున్నది మనిల్లు కాదని
మూడంకే వేసి ముడుచుకు పడుకున్నా
మంట సెగ మనచుట్టురా ఆవరించక మానదు
చేతులు మొదలంటా కాలేవరకూ
బాధని సహించాల్సిందేనా?
ఎవరికీ వాళ్ళమే ఆకుల్ని వెతుక్కొంటూ
మంటల్ని చల్లార్చుకోవల్సిందేనా?
చేతిగాయాల్నైతే చూపగల్గుతాం
కడుపులో జ్వలిస్తున్న దుఃఖపు మంటని
ఎలా చల్లార్చుకోగలం?
కనిపించకుండా రక్తంలో ప్రవహిస్తూ
నిలువెల్లా గాయాల్ని చేస్తున్న
ములుకుల్ని ఎలాతొలిగించుకోగలం ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి