25, మార్చి 2026, బుధవారం

కాలాతీతవ్యక్తులు ఎందుకు చదవాలంటే...~

~ కాలాతీతవ్యక్తులు ఎందుకు చదవాలంటే...~ శ్రీదేవి కాలాతీతవ్యక్తులు ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక కొత్త విషయం పాఠకులకు అందుతుంది. రమారమి డెభ్భై ఏళ్ళ నాటి ఈ నవల ఈ విధంగా మూడుతరాల పాఠకులకు ఎందుకు చేరువౌతుంది? ఏమిటి దీని ప్రత్యేకత? ఇందులోని పాత్రలూ,వారి మనస్తత్వాలూ సజీవమే.డెభ్భైఏళ్ళ క్రిందటా అటువంటి వారు జీవించారు .యాభైఏళ్ళ క్రితం సమాజంలోనూ వున్నారు, పాతికేళ్ళ నాడూ చూసాము.ఈనాడు మన మధ్యనే మనతోనే వున్నారు.బహుశా అందుకే ఈ నవల ఏదో ఒకనాటి సమాజానికి చెందినది మాత్రమే అని చెప్పటానికి వీల్లేదు. శ్రీదేవి రచించిన నవల 'కాలాతీత వ్యక్తులు' మొత్తం చదివిన తర్వాత పాఠకులకు అనేక ఆలోచనలూ, సందేహాలూ వస్తాయి. ముఖ్యంగా ఈ నవలలోని ప్రతీ పాత్రకీ మరో పాత్రతో గల సంబంధం ప్రత్యేకంగా ఆర్థికాంశాలమీదే ఆధారపడి ఉంటుంది. అది ప్రధానమైన విషయం. ఇందిరకు ప్రకాశంతో, కృష్ణమూర్తితో ఉన్న స్నేహమైనా,కళ్యాణికి ప్రకాశంతో, కృష్ణమూర్తి తో,డా.చక్రవర్తితో స్నేహమైనా ,ఇందిర తండ్రికి తన మందూ వగైరాల కోసం ప్రకాశం, కృష్ణమూర్తి తోనే కాక ప్రకాశం మేనమామ శేషావతారాన్నీ మాటలతో బురిడీ కొట్టటం మొదలైనవన్నీ ఆర్థిక ప్రాతిపదికగా జరిగినవే. భూస్వామ్య వ్యవస్థ నుండి ప్రారంభమై పెట్టుబడిదారీ వ్యవస్థ వరకూ ఆయా చారిత్రక, భౌగోళిక దశలలోని మార్పులను, వాటి ఫలితంగా సామాజిక సంబంధాలూ, మానవ సంబంధాల మధ్య జరిగే సంఘర్షణలనూ సంక్షోభాలనూ అంతర్లీనంగా ప్రదర్శించే నేర్పు ఆసాంతం ఈ నవలకు ప్రధానంగా వాతావరణ భూమిక అయింది. స్వాతంత్రం వచ్చిన తొలి రోజులు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం దేశంలో ఏర్పడిన ఆర్థిక ఛిద్రంవలన తొంభై శాతంకి పైగానే కుటుంబాలు మధ్యతరగతికి దిగువనే ఉండే పరిస్థితి ఏర్పడింది. కష్టపడితేగాని నోట్లోకి ఒకముద్ద వెళ్ళని స్థితి. ఆనాటి రాజకీయ, సామాజిక నేపధ్యంలో అప్పుడప్పుడే విద్యావంతులూ,చిరుద్యోగినులుగా ఎదుగుతోన్న ఆడపిల్లలలో ద్వైదీ భావమనస్తత్వాలు ఏవిధంగా సందిగ్ధతలోకి నెట్టివేస్తున్నాయి.ఇలా ఎన్నో పరిస్థితులు రూపాంతరం చెంది ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుతుంటే వాటికి ఎదురు నిలవటానికి యువతులు తమ ఆత్మవిశ్వాసాన్ని ఎలా కూడగట్టుకోవాలో అర్థం అవుతుంది. ఈ నవల అంతా చెప్పను. ఇందులోని మూడు ప్రధాన స్త్రీ పాత్రలు, వారిని ప్రభావితం చేస్తున్న మూడు పురుష పాత్రలు గురించి మాత్రమే పరిచయం చేస్తాను.నవలలో సమయానుకూలంగా ,ఆయా సందర్భాలలో వచ్చే మరికొన్ని పాత్రలు కూడా వున్నాయి. ఇందులో ఇందిరని తల్చుకుంటే భయం కలుగుతుంది, మరోసారి ధైర్యమూ కలుగుతుంది. ఆ పాత్రని అర్థం చేసుకోవాలంటే గుండె దిటవు కావాలి. అరవై ఏళ్ళ క్రిందట సృష్టింపబడిన ఇందిర పాత్రని ఆ విధంగా తీర్చిదిద్దటానికి శ్రీదేవి చాలా ధైర్యాన్ని కూడగట్టుకునే ఉండాలి. ఎందుకంటే ఇందిర ఒక వ్యక్తికాదు, ఒక పాత్రకాదు, ఒక వ్యవస్థ. కొన్ని కఠిన పరిస్థితులలో జీవితాన్ని కొనసాగించాలంటే ఇందిరలా ప్రవర్తించక తప్పదు అనే వాస్తవాన్ని, జీవనసత్యాన్ని నిర్భయంగా చాటిన రచయిత్రి, తన అభిప్రాయాల్ని బలంగా బలపరుస్తూనే ఆ పాత్ర చిత్రణలో ఎంతో శ్రద్ధ తీసుకుంది రచయిత్రి. "రెక్కలున్నాయనుకొని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా అవి తడిసిపోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది. మనిద్దరి పరుగులాటలూ ఒకటే. " కృష్ణమూర్తితో ఇందిర అంటుంది మరో సందర్భంలో ఇందిర మనసులో మాటగా - "త్యాగానికైనా ఒక హద్దుంటుంది. ఎవరికీ పనికిరాని త్యాగాలు చేయటం బుద్ధిహీనం. నాన్నను ఒదిలెయ్య బోవటంలేదు. నాఉద్యోగం, నా స్వతంత్రం అన్నీ అలాగే ఉంటాయి. భావదాస్యం, ఆర్థికదాస్యం రెండూ మనిషిని కుంగదీస్తాయి.” అని స్పష్టంగా చెప్పిస్తుంది రచయిత్రి. స్వతంత్ర వ్యక్తిత్వం గల స్త్రీ కుటుంబ జీవితంలో ఏమి కోరుకుంటుందో నిర్భయంగా ఏమాత్రం తొణుకు బెణుకు లేకుండా చెప్పటంలో ఇందిర చైతన్య స్ఫూర్తి తేటతెల్లమౌతుంది. "ప్రతి మనిషికీ సమస్యలుంటాయి. సమస్యలు లేనిది చచ్చిపోయినవాళ్ళకి మాత్రమే. నీ జీవిత కాలంలో నిండుగా బతుకు. నిర్భయంగా బతుకు. రోజుకి పదిసార్లు చావకు. ఇంకొకళ్ళని చంపకు. నీకు తారసిల్లిన మనుషుల్లో అణగిమణిగి ఎక్కడైనా లోలోపల కొంచెం మానవత్వం ఉంటే దాన్ని బయటకి తీయటానికి ప్రయత్నించి దాన్ని బైటకి రానియ్యి. మానవత్వం ఉండడం సిగ్గుపడవలసిన నేరం ఏమీ కాదు." అంటూ వివిధ సందర్భాలలో ఇందిరచేతనే చెప్పించారు రచయిత్రి. కూర్చుని తినే వ్యసనపరుడైన తండ్రికీ, ఇందిరకీ ఆమె తెచ్చే జీతం డబ్బులు సరిపోవు.యవ్వనంలోని తన ఆశల్ని,కలల్నీ పండించుకొనే అవకాశాలు లేని ఇందిర తన అరకొర జీవితానికి కారణమైన లేమిమీద పగ, కసి వ్యక్తపరచలేక ఒక సాధారణ స్త్రీలా కాకుండా చిత్రాతిచిత్రమైన వ్యక్తిలా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం, ఆవేశం, పగ, దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ ఎక్కడనుండో వచ్చిపడినవి కాదు.బాల్యంనుండీ ఎదుర్కొన్న అనేకానేక అనుభవాల కారణంగా జీవితం ప్రసాదించినవే. నవలలో ఇందిరని ఒకచోట సర్కస్ ట్రెపీజ్ మీద ఫీట్లు చేసే అమ్మాయిగా చూపిస్తూ ఆమెలోని బలహీనతలు, లోపాలు తుడిచి పెట్టేసి చివరికివచ్చేసరికి క్రమక్రమంగా పెంపొందిన ఇందిర వ్యక్తిత్వం, మానసిక పరిణత అబ్బురపరిచేలా నవలంతటా ఆమె పాత్రని చిత్రించిన తీరు శ్రీదేవిలోని రచనా పరిణతకి, భావసాంద్రతకీ అద్దం పడుతుంది. కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో ఎత్తుపల్లాలు, ఎదురు దెబ్బలు, అవమానాలే కాక, వాటిని అధిగమించటానికి జీవితంపై పగ, కసితో వ్యక్తిత్వాన్ని చెక్కుకొంటున్నప్పుడు క్రమంగా సానపడుతూ వెన్నెముకగల స్త్రీగా ఎదిగిన క్రమాన్ని ఇందిర పాత్ర చిత్రణలో స్పష్టంగా చూపుతుంది.ఇందిర కొన్నిసార్లు జీవితం అంటే లక్ష్యం లేనట్లు మాట్లాడుతుంది.మరికొన్నిసార్లు తాత్విక చింతనతో మాట్లాడుతుంది.ఏదిమాట్లాడినా అర్థవంతంగానే మాట్లాడుతుంది.ఆ మాటలన్నీ రచయిత్రి శ్రీదేవివే.నవల రాసే నాటికి ముప్పై ఏళ్ళ లోపునే వయసు వున్న శ్రీదేవి ఇంత పరిణతతో జీవితసారాన్ని అవుపోసన పట్టినట్లుగా రాయటం అబ్బురమే. కళ్యాణి అనేకానేక నవలల్లో లాగానే ఒక మంచి కథానాయికగానే కనిపిస్తుంది. ఇందిర పాత్రకు సమాంతరంగా కళ్యాణి పాత్రను నవల అంతటా శ్రీదేవి ఒకేరకంగా నడిపించింది. ఇందిరలా చొరవలేదు, మాటలతో ఆకట్టుకొనే మనస్తత్వం కాదు. పురుషులతో మాట్లాడేటప్పుడు ఆనాటి పరిస్థితుల కనుగుణంగా బిడియపడుతూనే మాట్లాడుతుంది. స్నేహితుల వద్దకూడాతన అవసరాలు బయటపడకుండా గోప్యంగా నడుచుకుంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులతో రాజీ పడుతుంది. ఎటువంటి సందర్భంలోనూ తనలోని రాగద్వేషాలు కాని, తన అభిప్రాయాల్ని కానీ వెల్లడించకుండా తనలో తానే మధనపడుతుంది.కళ్యాణిని ఆర్థిక అవసరాలు తెలీనీకుండా పెంచిన తండ్రి మరణించాక ప్రకాశం పట్ల ఆకర్షితురాలైనా, వసుంధర ఆశ్రయం, తనకి గార్డియన్గా ఉన్న మునసబు మరణించడం, ఆ సందర్భంలో ఆదుకొన్న డా॥ చక్రవర్తి స్నేహం పొందడం అన్నీ నాటకీయంగా జరుగుతాయి. అనుకోని పరిస్థితులలో మానసికంగా దగ్గరైన డాక్టరు చక్రవర్తి దగ్గర తన మనసును బయట పెట్టడంతో అది వారిరువురి వివాహానికి దారితీసింది. ఈ నవలలో కథానాయిక ఇందిరా,కళ్యాణా అనే వాదవివాదాలు అనవసరం.ఆనాడేకాదు ఈనాటికీ వస్తోన్న అనేకానేక రచనల్లోని కథానాయికలు కళ్యాణికి సాదృశ్యంగానే ఉంటారు.మనసమాజంలో రాజీపడుతూ బతికేసే సగటు మహిళలు ఎప్పుడూ వుంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కాళ్ళుచాపుకొని ఏడుస్తూ కూర్చుని ఒకరిమీద ఒరిగి పోకుండా నిలదొక్కుకొని ఇందిరలా నిలిచేవారు ఈనాడు స్త్రీవాద వుద్యమం వూపందుకొన్నాక ఎక్కువమందే వుండి వుంటారు. మరో స్త్రీ పాత్ర వసుంధర కళ్యాణికి సహాధ్యాయి మానవత్వం మూర్తీభవించిన మంచి మనిషి.కళ్యాణి కష్టాలకు కరిగిపోయి ఆశ్రయం యిచ్చి తానుకూడా ఈ వలయంలో చిక్కుకు పోతుంది.ఆమె కుటుంబ సభ్యులు అంతా ఆమెని పువ్వుల్లో పెట్టి పెంచారు.ఆమెకు ఏకష్టాలు తెలియవు.అందువలనే వసుంధరను ఆమె కుటుంబ సభ్యులు మందలించటం రచయిత్రి సహజంగా రాసింది. కళ్యాణి వలన కృష్ణమూర్తి,చక్రవర్తుల పట్ల స్నేహం,ఆకర్షణ ఏర్పడినా సహృదయంతో అర్థం చేసుకొని తాను తప్పుకొని వారి వివాహాలకు తిరుపతి వెళ్తుంది వసుంధర.అవసరమైన సంఘటనలను కల్పించి శ్రీదేవి మలుపులతో నవలకు ముగింపు పలకటంలో చాకచక్యం చూపింది. ఎంబిబిఎస్ చదువుతున్న ప్రకాశం ఎవరో ఒకరి అధికారం క్రింద బతకటానికి అలవాటు పడిన సామాన్యుడుగా చిత్రించింది రచయిత్రి.స్వంత అభిప్రాయాలూ, స్వంత ఆలోచనలు లేని చంచలస్వభావుడు.ఆర్థిక అవసరాలు ఎంతటి పిరికితనాన్నీ,లొంగిపోయే మనస్తత్వాన్ని ప్రకాశంలో ఏ విధంగా కలిగించాయో ప్రతీ సందర్భంలోనూ రచయిత్రి నేర్పుగా చిత్రించింది.చదివిస్తున్న మామయ్య ఇనుప పిడికిలిని తప్పించుకునే నేర్పు లేక ప్రకాశం లొంగిపోయి మామయ్య ఇష్టప్రకారం వివాహం చేసుకుంటాడు. ప్రకాశం లాంటి యువకులు బ్రతుకు బాధలను ఎదుర్కోలేక అడుగడుగునా రాజీపడి అణిగిమణిగి ఎలా బతుకుతారో ఈ నవలలో అత్యద్భుతంగా చిత్రించారు శ్రీదేవి. కృష్ణమూర్తి పాత్రని ఆర్థిక ఇబ్బందులులేని విలాసపురుషుడిగా,నైతికవిలువలు లేని వాడిగా ఏవగింపు కలిగించేలా నవలలో ప్రవేశపెడుతుంది.కానీ రానురాను ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా ఇందిర కోరుకున్న పెద్ద ఛాతిగల వ్యక్తిగా తీర్చిదిద్దింది రచయిత్రి. కృష్ణమూర్తి ఆదర్శాలు వల్లించడు.పగా కార్పణ్యం లేనివాడు.స్నేహాన్ని ప్రేమించి అవసరాలకు అండగా నిలుస్తాడు.జీవితాన్ని అర్థం చేసుకుని ఎదుగుతాడు అనేలా క్రమక్రమంగా అవసరమైన మేరకు సన్నివేశ కల్పన చేస్తుంది రచయిత్రి. 'ప్రపంచంలోని అందరి ఉగాదులూ మనవే' అనుకునే సార్వజనీన దృక్పథం కలవాడిగా చివరకు కృష్ణమూర్తి పాఠకులకు గోచరిస్తాడు. "దేశంలో ఉన్న దరిద్రం సగం మనుషుల మనసులలో ఉంది. ఇవ్వడానికి చేతిలో దమ్మిడీ లేకపోవచ్చు. కాని మనస్సు ఇవ్వటానికేం ఖర్మ? కాని ఇవ్వరు. నాలుక పీక్కున్నా ఇవ్వరు. ఇవ్వడంలో హాయి ఉందిరా అంటే అర్ధం చేసుకోరు"అంటాడు కృష్ణమూర్తి.కృష్ణమూర్తి అమృత హృదయుడు. మంచిగా తప్ప మరొకలా ఉండలేడు అనేలా రచయిత్రి ఈ పాత్రను నిర్థారించారు. కుటుంబ సమస్యలు, భార్య మరణం వంటి జీవిత సమస్యలతో బాధపడుతున్న డా|| చక్రవర్తీ, ఆర్థిక కారణాలే కాక, మానసికంగా, భౌతికంగా కూడా ఒంటరి అయి ఆలంబనకోసం పరితపిస్తున్న కళ్యాణీ ఒక్కటి కావటంలో పెద్ద ప్రత్యేకత ఏమీలేదు. అటువంటి అనేక సన్నివేశాలు చాలా నవలల్లో చదివే వున్నాం. అవసరమైనప్పుడు లోకాన్ని ధిక్కరించైనా, తనకేం కావాలో దాన్ని సాధించుకున్న ఆధునిక యువతి ఇందిర, కాలానికి అతీతంగా ఆమె నడుచుకున్నట్లనిపించినా నవతరం స్త్రీలో ఆ విధమైన మానసిక స్థైర్యం ఉండాలనేదే శ్రీదేవి ఉద్దేశం. అన్యాయం జరిగినప్పుడు కుంగిపోయి, ఆత్మహత్యకు తలపడటం ఏనాడూ స్త్రీ చేయవలసిన పని కానేకాదని ఇందిర పాత్ర ద్వారా రచయిత్రి శ్రీదేవి ఈ నవలలో ప్రధానంగా చెప్పారు ఇందులోని ప్రతీ పాత్ర ప్రవర్తనకూ ఆ పాత్ర కుటుంబ నేపధ్యం,పెరిగిన విధానమే మూలకారణంగా రచయిత్రి నిరూపిస్తూనే యీ రచన చేసింది.ఆ నిరూపణల్లో రచయిత్రి ఎక్కడా తడబడలేదు.అది గమనించవలసిన విషయం.బహుశా శ్రీదేవి వృత్తిపరంగా వైద్యురాలు కావటం వలన రోగానికి మూలం కనుగొన్న విధంగానే తాను సృజించిన పాత్రల మూలాలను పాఠకులకు కూడా అవగాహన కల్పిస్తూనే కథనం చేసిందని స్పష్టమోతుంది. అందుకే ఒక ఇంటర్వ్యూలో " 'కాలాతీత వ్యక్తులు' అప్పటికే కాదు. ఇప్పటికి ఎప్పటికీ నిలిచిపోయే నవల, ఎంత కఠిన మైన విషయాన్నయినా, మరెంతో జుగుప్సాకరమైన సంఘటమైనా అతి నైపుణ్యంతో రాయగలిగే నేర్పు శ్రీదేవిలో వుంది. ఒక ఇందిర, కళ్యాణి, వసుంధర, ఒక చక్రవర్తి, కృష్ణమూర్తి, ప్రకాశం... ఎప్పుడూ మన మధ్యే వుంటారు."అన్నారు .శ్రీదేవికి ఆత్మీయురాలైన పి.సరళాదేవి. శ్రీదేవి స్వభావరీత్యా మృదుభాషిణి, స్నేహశీలి. వ్యక్తిగాను, రచయిత్రిగానూ స్వతంత్ర ప్రవృత్తి గలది. అందుకే ఈమె సృజించిన పాత్రలుకూడా స్వతంత్ర ప్రవృత్తి కలిగివుండి ఎటువంటి క్లిష్టసందర్భాలలోనైనా సంయమనం కోల్పోక తమ వ్యక్తిత్వం నిలుపుకుంటాయి. తనకి గల స్నేహస్వభావంవలనే ఆమె రచనలలోకూడా స్నేహానికి పెద్దపీట వేసింది. 'కాలాతీతవ్యక్తులు' నవలలో తెలుగునాట రాజకీయ, ఆర్థిక, సామాజిక,కౌటుంబిక పరిస్థితులన్నింటినీ నవలా నేపధ్యంలో స్పష్టీకరించటం వలన పాఠకులకు కాల పరిణామక్రమం చక్కగా అవగాహన అవుతుంది. సాధారణంగా నవలల్లో ఇతర పుస్తకాల ప్రస్థావన ఉండటం అరుదు.కానీ ఈ నవలలో అనేక పుస్తకాలు గురించి అక్కడక్కడా ప్రస్థావించటం వలన రచయిత్రి మంచి చదువరి అనే విషయం తెలుస్తుంది. రచయిత్రి అనేక సందర్భాలలో స్త్రీవాద దృక్పథాన్నే కాక సంపూర్ణ మానవులుగా బతకాల్సిన విధానాన్ని కూడా పాత్రల సంభాషణల ద్వారా నవలలో ప్రకటించింది.సరిగ్గా అందుకోసమనైనా కాలాతీతవ్యక్తులు నవల చదవాలి.

నడక దారిలో -61

నడక దారిలో-61 విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి అంకురార్పణ పెద్ద ఎత్తున రంగరంగవైభవంగా జరిగింది.ఈ నిర్మాణానికి కొన్ని వేల ఎకరాల పంటపండే భూములను గవర్నమెంట్ సేకరించింది.అది కొంత వివాదాస్పదంగా మారినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు సంతోషం ప్రకటించారు.రాజధానిలేని రాష్ట్రం అభివృద్ది చెందాలంటే విద్య, వ్యాపారరంగాలు పెరగాలి.పన్నులు రావాలంటే పెట్టుబడులు పెట్టే పెద్ద సంస్థలను ఆకర్షించ గలగాలి.చూడాలి అవన్నీ ఎంతవరకూ సాకారమౌతాయో.వీర్రాజుగారూ,నేనూ ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని చాలా ఆసక్తిగానే గమనించాం. ప్రత్యేక హోదా డిమాండ్తో టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది.రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని అమరావతిలో పరిపాలన కార్యకలాపాలు మొదలయ్యాయి.ఇక్కడ స్థిరపడిన ఆంధ్రప్రాంత వుద్యోగులు విజయవాడకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.ఆ దృశ్యం చాలా ఉద్వేగంగా కనిపించింది . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ రాజధాని కావటాన ఇక్కడే కార్యాలయాలన్నీ వుండటాన ఉద్యోగులు ఇక్కడే ఇల్లు కొనుక్కుని పిల్లల చదువులతో స్థిరపడిన వాళ్ళు.చిరకాలంగా స్నేహ సంబంధాలు కలిగిన వాళ్ళని విడిచి వెళ్ళటం బాధాకరమే. వెళ్ళిన వారిలో అల్లూరి గౌరిలక్ష్మి కూడా వుంది.వుద్యోగ రీత్యా విజయవాడ వెళ్ళి పోవటంతో కలవటం తగ్గిపోయింది. రాజమండ్రి,యానాం,విశాఖ, విజయవాడలలో వీర్రాజుగారి చిత్ర ప్రదర్శనల అనంతరం పెయింటింగ్స్ అన్నీ భద్రంగా ఇంటికి చేరాయి.ఆ సందర్భంలో ఒకసారి ఇంటికి వచ్చిన పొనుగోటి కృష్ణారెడ్డిగారు వారి స్వగ్రామం అయిన కావలిలో కూడా ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని ఆలోచించారు.అక్కడి వారితో సంప్రదించి పెయింటింగ్స్ నుంచి భద్రంగా తీసుకు వెళ్ళే ఏర్పాటు చేసారు.కృష్ణారెడ్డిగారితో పాటూ వీర్రాజుగారు కావలికి వెళ్ళారు.కావలిలో కూడా రెండు రోజుల పాటు జరిగిన చిత్ర ప్రదర్శనకు మంచి స్పందన వచ్చిందని వీర్రాజుగారు చాలా సంతోషపడ్డారు. సాధారణంగా పోటీలకు నా పుస్తకాలు పంపను.కానీ ఈసారి గంగిశెట్టి గారు ప్రకటించిన పోటీకి నా కవితా సంపుటిని పంపాను. గంగిశెట్టి లక్ష్మీనారాయణగారి మాతృమూర్తి జింకా రుక్మిణమ్మ పురస్కారానికి " నా ఆకాశం నాదే " ఎంపిక అయ్యిందని ఫోన్ చేసి తెలియజేసారు.చాలా సంతోషం కలిగింది. పురస్కార సభలో ముగ్గురు పూర్వ వైస్ ఛాన్సలర్ లు అయిన ప్రొ.గంగిశెట్టి లక్ష్మీనారాయణ ప్రొ. కొలకలూరి ఇనాక్ , ప్రొ.అనుమాండ్ల భూమయ్య గార్ల చేతులమీదుగా పురస్కారం అందుకోవటం చాలా ఆనందం కలిగించింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ లో ఉన్న తెలుగు సాహితీవేత్తలు ఎప్పటి నుండో నిర్వహించే సిరికోన వాట్సాప్ సమూహంలో నన్ను చేర్చారు.అందులో చాలామంది సంస్కృతాంధ్ర పండితులు కావటాన ఎక్కువగా వాటికి చెందిన రచనలే ఉంటున్నా కొందరు నా లాంటి వారు రాసే ఆధునిక కవిత్వాన్ని కూడా ఆదరించేవారు. అనుకోకుండా లేఖిని అధ్యక్షురాలైన వాసా ప్రభావతి గారు పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీర్రాజుగారూ,నేనూ వెళ్ళి చూసి వచ్చాము.నాకు తెలిసి గొప్ప విల్ పవర్ ఉన్న రచయిత్రులలో ప్రభావతిగారు ఒకరు.అటువంటి పరిస్థితుల్లో సైతం ఆమె రాలేకపోయినా లేఖిని కార్యక్రమాలు కొనసాగేలా ఫోన్లు ద్వారానే చేసేవారు. నా ముందుతరం రచయిత్రుల కథలు గురించి వ్యాసాలు రాయటంలో భలే ఆనందం పొందుతున్నాను.పదిహేను మంది రచయిత్రుల గురించి రాస్తే ఇంక చాలనుకున్నాను కానీ విస్తృతంగా కథలు రాసినవారు వున్నారు. చాలా మంది అనేక కథలు రాసినవాళ్ళు దొరికే సరికి ఉత్సాహంగా కొనసాగించాను.కథానిలయం నుండి ఒక్కరివే వందలకథలు డౌన్లోడ్ చేసుకుని చదివి రాయటం, తర్వాత మరొకరివీ ఇలా చాలా సమయం పట్టటంతో నా కవిత్వం,కథలు రాసేందుకు సమయం తక్కువ అయ్యింది.కానీ కనీసం పాతికరచయిత్రుల కథలు గురించి అయినా రాయాలనే పట్టుదలతో కొనసాగిస్తున్నాను. మృణాళిని ఐ డ్రీమ్స్ ఛానల్ లో అక్షరయాత్ర పేరిట వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేయటానికి వచ్చారు.ఆమె మొత్తం రచనలు చదివి చాలా సమగ్రంగా ఇంటర్వ్యూ చేసింది.అదే ఆమె ప్రత్యేకత అనుకుంటాను.అలా వచ్చినప్పుడే మిమ్మల్ని కూడా దగ్గర్లోనే వచ్చి చేస్తాను అని నా రచనల్ని అన్నింటినీ తీసుకుని వెళ్ళింది. చెన్నై నుండి రాజేశ్వరీ కోదండం అనే ఆమె ఫోన్ చేసి వీర్రాజుగారి మైనా నవలను తమిళంలోకి అనువాదం చేయాలనుకుంటున్నానని ఫోన్ చేసింది.మైనా నవలని కెబి గోపాలంగారు ఇంగ్లీష్ లోకి అనువదించారు కానీ పుస్తకంగా వేయలేదు.ఆవిడే ఫోన్ చేసి చేస్తానంటోంది కదా అని అంగీకారం తెలియజేసారు.రాజేశ్వరీ కోథండం తాను అనువాదం చేయడమే కాక తానే పూనుకొని మా దగ్గర ప్రచురణ ఖర్చు తీసుకుని పుస్తకంగా కూడా ప్రచురించింది.ఆ తర్వాత నా యుద్ధం ఒక గుండె కోత కూడా ఆమె తమిళంలోకి అనువాదం చేసి అదే రకంగా ప్రచురణ ఖర్చు తీసుకుని "ఉళ్ళక్ కుమురల్" పేరుతో పుస్తకంగా వేసారు. ఈలోగా అనల్ప బలరాం వీర్రాజుగారి సమగ్ర సంపుటి వేస్తానని అన్నారు.వీర్రాజుగారు అప్పటికే తన ఎనభయ్యో పుట్టినరోజు నాటికి కథలన్నీ కలిపి వేయాలనే ప్రయత్నంలో వున్నారు. మనం వేసే కన్నా పబ్లిషర్ వేస్తే అమ్మకాలు అవుతాయి.ఇంట్లో పుస్తకాలు పేరుకుపోవు.అందుకని అనల్పబుక్ హౌస్ వారికి అంగీకారం తెలియజేసారు. పొనుగోటి కృష్ణారెడ్డిగారు వారి వూరు కావలిలో వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శన ఏర్పాటు చేస్తానని చెప్పారు.పెయింటింగ్స్ కావలికి చెందిన వారి కారులో పంపించారు.వీర్రాజుగారూ, కృష్ణారెడ్డి గారూ ట్రైనులో బయలుదేరి వెళ్ళారు.కావలిలో ప్రదర్శన చాలా బాగా జరిగిందనీ, చాలా మంది చూడటానికి వచ్చారనీ వీర్రాజుగారు తిరిగి వచ్చాక సంబరంగా చెప్పారు. ఐ డ్రీమ్స్ ద్వారా వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేసిన ఆరేడు నెలలకే మృణాళిని నన్ను ఇంటర్వ్యూ చేయటానికి వచ్చింది.మొత్తం నా పుస్తకాలన్నీ చదివి చేసిన సమగ్రమైన ఇంటర్వ్యూ ఇదే అని చెప్పొచ్చు.ఈ ఇంటర్వ్యూలకు చాలామంది నుండి చక్కటి స్పందన వచ్చింది. ఆషీ అన్ని క్వాంపిటేటివ్ పరీక్షలకూ ప్రిపేర్ కావటంతో పరీక్షలకు తీసుకు వెళ్ళటానికి పల్లవి బిజీ అయిపోయింది.బిల్డింగ్ లో ఆషీతోటి పిల్లలు రిజల్ట్ రాకముందే కాలేజీల ఎంపిక కోసం తిరుగు తున్నారని తెలిసి మేము కూడా కొన్ని కాలేజీలకు వెళ్ళి చూడాలనుకున్నాము.ఆ వరుసలో శంకరపల్లిలో ఆడపిల్లలదే మంచి ఇంజనీరింగ్ కాలేజీ వుందని తెలిసి వెళ్ళాము.వాళ్ళకి అమెరికన్ సిటిజన్ కీ,ఎన్ ఆర్.ఐ కీ తేడా తెలియదనిపించింది. ఆప్లై చేయటం దగ్గర నుండి ఫీజు కట్టటం వరకూ అమెరికాలో వుండేవారే డాలర్ల రూపంలో కట్టాలన్నారు.తల్లి ,పిల్లా ఇండియాలోనే వుంటే అక్కడినుండి అప్లై చేయటం ఏమిటో అర్థం కాలేదు.పేరుకే ప్రవేశపరీక్షలు కానీ అంతా డబ్బు డిమాండే ప్రధానం అని తెలిసింది.పాతిక లక్షలు ముందు కట్టాలంట.ప్రతీఏడాదీ అయిదు లక్షలు కట్టాలన్నారు.విద్య కొనుక్కోలేక ఒక నమస్కారం పెట్టి వచ్చేసాము.అలా రెండుమూడు కాలేజీలు తిరిగి పది,పదిహేను లక్షలంటూ బేరాలదోపిడీ చూసి భయం వేసింది. ప్రవేశపరీక్ష రిజల్ట్ వచ్చాక ఇక్కడ గీతంయూనివర్సిటీలో వచ్చినా అంత దూరం పంపటానికి నచ్చక వద్దనుకున్నాము.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటన చూసి అయిదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీకి అప్లై చేసింది.అయితే విదేశీ విద్యార్థులు ఎంట్రెన్స్ రాయనక్కరలేదనీ,టోఫెల్ పరీక్ష క్వాలిఫై కావాలని సమాధానం వచ్చింది.వెంటనే టోఫెల్ కు అప్లై చేసి పరీక్ష రాసింది.కానీ రిజల్ట్ సబ్మిట్ చేసే నాటికి సెంట్రల్ యూనివర్సిటీ టైమ్ దాటిపోయింది.ఈ ఏడాది మానేసి వచ్చే ఏడాది అప్లై చేద్దామని ఆషీ నిర్ణయించుకుంది.అంతవరకూ ఖాళీగా వుండటం ఎందుకని కోర్సెరా లో ఆస్ట్రో ఫిజిక్స్ సర్టిఫికెట్ కోర్సు లో చేరింది. అప్పట్లో తెలంగాణా ఉద్యమం వలన కావచ్చు, కుందుర్తి సత్యమూర్తి ఆకస్మిక మరణం వలన కావచ్చు ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతుల ప్రదానం మందగించింది. " ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు ఇప్పటికే నలభై నాలుగు అయ్యాయి.తరువాయి ఆరు బహుమతులు మనమే ఇచ్చేసి యాభై పూర్తిచేసి ఆపేస్తే ఎట్లా వుంటుంది " అని ఒకదశలో వీర్రాజుగారూ నేనూ ఆలోచించాం. కానీ సత్యమూర్తి భార్య కుందుర్తి శాంత " ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు యాభై పూర్తి చేసేవరకూ తానే ఇస్తానని ముందుకు రావటంతో కొనసాగింది.అయితే రెండేళ్ళ కొకసారి రెండేళ్ళవీ రెండేసి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. ఆ విధంగా 14,15 సంవత్సరాల బహుమతులు సత్యమూర్తి ఉన్నప్పుడే నిర్ణయించిన ప్రకారం తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్ గారికి,ప్రసాదమూర్తికి ప్రకటించి 2015 లోనూ,16,17 సంవత్సరాల ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు డా.భవానీదేవికీ,బాల సుధాకర్ మౌళికీ 2017లోనూ ప్రదానం చేయటం జరిగింది.18,19 లకు కూడా చాలా కవితా సంపుటాలు చదివి సిరికి స్వామినాయుడికీ,ఇబ్రహిమ్ నిర్గుణ్ కీ ఫోన్ చేసి వీర్రాజు గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతికి ఎంపిక చేసినట్లు గా చెప్పి అంగీకారం పంపమన్నారు.వాళ్ళనుండి అంగీకారం ఉత్తరం వచ్చాక సభ ఎప్పుడన్నది నిర్ఢయించుకొని పేపర్ ప్రకటనకు ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2 న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో కృషి చేసినవారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు పేరిట పురస్కారాలను అందించారు.ఆ క్రమంలో మా ఆత్మీయులైన ఆశారాజు,నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు మొదలైనవారంతా ప్రభుత్వ పురస్కారంగా లక్షానూటపదహార్లు అందుకోవటం మాకూ సంతోషం కలిగింది. కానీ ప్రభుత్వం నుండి పొందే పురస్కారాలు అక్షరాలకు ఆనకట్ట వేసే అవకాశం వుండొచ్చు. ఒకరోజు అమృతలతగారు ఫోన్ చేసి కవిత్వానికి అపురూప పురస్కారం నాకు ఇవ్వాలనుకున్నట్లు తెలియజేసారు.సుమారు పది పన్నెండు మంది మహిళలకు ప్రతి ఏడాదీ అందజేసే అమృతలతగారి అపురూప అవార్డులు నిజంగా అపురూపమైనవే.మా దంపతులు ఇద్దరికీ చాలా ఆనందం కలిగింది.నాకు సంబంధించిన ముఖ్య వివరాలూ,ఫొటోలు పంపమన్నారు. అమృతలతగారి అవార్డుల సంబరంలో అతిథులను ఆహ్వానించటం దగ్గర నుండి చివరివరకూ ఆద్యంతం సమయనిబద్ధతమ పాటిస్తూ ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా వైభవోపేతంగా కొనసాగుతుంది‌.అంతేకాదు సభలోని వారిని కూడా అంచెలంచెలుగా వేదిక మీదకు గౌరవపురస్సరంగా ఆహ్వానిస్తారు.మరోవిశేషం అప్పటికప్పుడు సర్ప్రైజింగ్ గా వచ్చిన సభికులకూ బహుమతులు ఇస్తారు.అందుకే రచయిత్రులు అందరూ అమృతలత అపురూప పురస్కారాల సభని ఒకపండుగగా భావిస్తారు.ఈ సారి ముఖ్య అతిథులుగా జలంధరా చంద్రమోహన్,ఎస్.పి.శైలజా వచ్చారు.నాకు పురస్కారం ఇచ్చేటప్పుడు వీర్రాజుగారిని కూడా వేదిక పైకి ఆహ్వానించి ఇద్దరికీ కలిపి సత్కారం చేసారు‌.సభకి మామరిదీచిట్టీ, తోటి కోడలు ఉషా కూడా సభకి వచ్చిఆ సంబరం చూసి ఆశ్చర్య పోయారు. ఆతర్వాత ఎప్పటి నుంచో వాయిదా పడుతోన్న వీర్రాజుగారి కేటరాక్ట్ ఆపరేషనుకు నేత్రాలయ కంటి హాస్పిటల్ లో చూపించాము.ఈయనకి హాస్పిటల్ అంటే చాలు బీపీ పెరిగి పోతుంది.అందుకనే వాయిదాలు వేస్తూనే వున్నారు.ఇటీవల వారాల కృష్ణమూర్తిగారు వారి భార్యకీ,తనకీ నేత్రాలయలోనే కాటరాక్టు కోసమై సంప్రదించి అక్కడే చేయించుకున్నానని చెప్పటమే కాక వారికి ఆపరేషను చేసిన డాక్టర్ పేరుకూడా చెప్పారు.అప్పుడు వీర్రాజుగారు కూడా చేయించుకోవడానికి సమ్మతించారు. ఉదయమే ఏడున్నరకి ఇద్దరం వెళ్ళాము.ఫార్మాలిటీలు అన్నీ పూర్తి చేసాక ఆపరేషనుకోసం లోనికి తీసుకు వెళ్ళారు.పూర్తిఅయ్యాక బయటకు వచ్చేవరకూ నాకు గుండె దడదడ లాడుతూనే వుంది. బీపీ పెరిగి హడావుడి చేస్తారేమోనని భయపడ్డాను.కానీ బయటకు వచ్చాక వీర్రాజుగారు కూడా రిలీఫ్ గానే వున్నారు.నేనుకూడా గుండె నిండా వూపిరి పీల్చి వదిలాను. టైమ్ ప్రకారం కంట్లో చుక్కల మందు వేసే పని వలన కొంచెం బిజీ అయ్యాను.నెలరోజులు అయ్యాక రెండో కన్ను కూడా చేయించుకోవడానికి సిద్ధపడ్డారు.బహుశా ఇది కష్టమైనది కాదనే ధైర్యం వచ్చిందేమో.రెండో కన్ను కూడా చేయించుకు వచ్చేసాము. అయితే మర్నాడు చూపించుకోటానికి వెళ్ళాల్సి వుంది.టిఫిన్ తిని బయలు దేరుదామనుకునేసరికి వీర్రాజుగారికి వెక్కిళ్లు మొదలయ్యాయి.ఏంచేసినా తగ్గలేదు.కాసేపటికి తగ్గుతాయిలే అనుకుని రివ్యూ కోసం నేత్రాలయకు బయలుదేరాము.కన్ను బాగానే వుందని చెప్పి కళ్ళద్దాలకూ నాలుగు వారాలకు రమ్మన్నారు.తిరిగి ఇంటికి వచ్చాము.మధ్యాహ్నం అవుతోన్నా వెక్కిళ్లు తగ్గటం లేదు.అప్పుడే పొనుగోటి కృష్ణారెడ్డిగారు ఆయన్ని పరామర్శించడానికని వచ్చారు.అప్పటికీ వెక్కిళ్లు తగ్గకపోతే సరికి కృష్ణారెడ్డిగారితో చెప్తే ఓమినీహాస్పటల్ కి తీసుకు వెళ్దామన్నారు.పల్లవి వాళ్ళతో వెళ్ళింది.ఏవేవో టెస్టులు చేసి ఊపిరితిత్తుల్లో నెమ్ము పేరుకుపోయింది అది తీయాలని అన్నారు.రేపు చేయించుకోవడానికి వస్తామని వీర్రాజుగారు అంటే తీసుకుని వచ్చేసారు.ఈ లోపున వెక్కిళ్లు ఎప్పుడో తగ్గి పోయాయి.వీర్రాజుగారు మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళననేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలో అత్యధిక సీట్లు పొందిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ ఐదు సంవత్సరాల కాలపరిమితి దాటకుండానే తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందుగానే ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించింది.ఇతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పడినా ఎన్నికలలో టీఆర్ఎస్‌ దూకుడుని అడ్డుకోలేక పోయాయి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడంతో రాష్ట,కేంద్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాంతో 2019 చివరలో జరిగిన ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజల మధ్యకి వాళ్ళనాన్నలాగే యాత్రలు చేసి ప్రస్తుత ప్రభుత్వాన్ని బూచిగా ప్రజలు కళ్ళముందు చూపటంతో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం మారిపోయింది. వచ్చిన వెంటనే అమరావతి కాకుండా మూడు చోట్ల రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసారు. అమరావతి రాజధానికి వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు అంతా గగ్గోలుపెట్టి అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే ఉద్యమం ప్రారంభమైంది. - శీలా సుభద్రాదేవి

నడక దారిలో -60

నడక దారిలో -60 రాజమండ్రిలో వీర్రాజు గారి పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టడానికి మాదేటి రవిప్రకాష్ వీర్రాజు గారిని సంప్రదించాడు.వీర్రాజుగారు చాలా సంతోషంగా అంగీకరించారు.రవిప్రకాష్, రవికాంత్ పెయింటింగ్స్ అన్నీ భద్రంగా పేక్ చేసి రాజమండ్రికి తీసుకెళ్ళారు.ప్రదర్శన తేదీ నాటికి మేమిద్దరం రాజమండ్రికి చేరాము.మాకు హొటల్ లో రూమ్ బుక్ చేసి వుంచారు.రాజమండ్రి టౌన్ హాల్ లో చిత్రప్రదర్శన ఏర్పాటు చేసారు.మేము దిగిన హొటల్ కు టౌన్ హాల్ చాలా దగ్గరగానే వుంది. చిత్ర ప్రదర్శన రాజమండ్రి కమీషనర్ ప్రారంభించారు.ఆ రోజంతా అక్కడే వున్నాం.ఎండ్లూరి సుధాకర్,పుట్ల హేమలతా వచ్చారు.కొందరు చిత్రకారులూ, రచయితలూ కూడా కలిసారు.వీర్రాజుగారి బాల్యమిత్రుడు ప్రకాశరావు గారు కూడా మాతోనే వున్నారు. మర్నాడు టౌన్ హాల్ లోనే వుండి అక్కడకు వచ్చిన వారితో కలిసాము. మూడో రోజు టౌన్ హాల్ లో ప్రదర్శన దగ్గర ఉండటానికి తెలిసిన వారికి అప్పగించి ఒక ప్రదేశానికి చూడటానికి వెళ్ళాము.పోలీస్ డిపార్టమెంట్ లో పనిచేసే ఆయన ఉద్యోగం మానేసి వచ్చిన సొమ్ముతో ఒక ఎత్తైన గుట్టమీద అతిపెద్ద బుద్ధవిగ్రహం ప్రతిష్టించే ఏర్పాట్లు చేస్తున్నాడనీ,ఆ ప్రదేశం చుట్టూ ప్రతిష్టించడానికి బౌద్ధగాథల అమరావతీ తరహా శిల్పపానల్స్ తయారౌతున్నాయనీ తెలిసి అక్కడకు వెళ్ళాము.ఆ ప్రదేశాన్ని ఆయన ఒక బౌద్ధ ధ్యానకేంద్రంగా మార్చుతున్నాడు.అక్కడ కొంతసేపు గడిపి తర్వాత రెండు మూడు దేవాలయాలేవో చూసి గోదావరి గట్టున కొంతసేపు కూర్చున్నాము.మిత్రులు ఇద్దరూ బాల్యజ్ణాపకాల్ని కలబోసుకున్నారు. ఆ సాయంత్రం దేవాంగ సంఘం వాళ్ళు వీర్రాజుగారికి సత్కారం చేస్తామని ఆహ్వానించారు.మాకు ఈ కులపరమైన సత్కారాలు నచ్చవు.కానీ వీర్రాజుగారి మిత్రుడి కారణంగా వెళ్ళక తప్పలేదు.ఆ సందర్భంగా వాళ్ళు ప్లాస్టిక్ ఫైబర్ తో చేసిన సరస్వతి విగ్రహం ఇచ్చారు.అది మాత్రం మాకు భలే నచ్చింది.అక్కడనుండి తిరుగు ప్రయాణానికి స్టేషన్ కి వచ్చాం. విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి పుస్తకం ఆవిష్కరణ వుందనీ జానకీ బాల మనం వెళ్దామంది.గౌరిలక్ష్మి తన కథల పుస్తకం ఆవిష్కరణ పుస్తకప్రదర్శనలో కృష్ణాజిల్లా రచయితల స్టాల్ లో వుందని రమ్మని ఆహ్వానించింది. .జానకీబాల వెళ్దాం రమ్మని కోరటంతో ఇద్దరం ఇంటర్ సిటీ ట్రైన్లో విజయవాడకి బయలుదేరాం.పల్లవి నన్ను ఉదయమే స్టేషన్ కు తీసుకు వెళ్ళింది.అప్పటికి జానకీ బాల వచ్చేసింది. ఇక ట్రైన్ బయలుదేరిన దగ్గర నుండి మా మధ్య ఎప్పటి మాదిరే ఎన్నెన్నో కబుర్లు.విజయవాడలో వనజా తాతినేని మమ్మల్ని పికప్ చేసుకుని వాళ్ళింటికి తీసుకు వెళ్ళింది.ఆ సాయంత్రం పుస్తక ప్రదర్శనకు వెళ్ళాము.గౌరిలక్ష్మి రాసిన పుస్తకం ఆవిష్కరణ అయిన తర్వాత గుత్తికొండ సుబ్బారావుగారు, పూర్ణచంద్ గారూ, కొలకలూరి ఇనాక్ గారు, ఎమెస్కో లక్ష్మికలిసారు. శ్రీకాంతశర్మగారి " ఇంటిపేరు ఇంద్రగంటి" పుస్తకావిష్కరణ మొదలయ్యే వరకూ కబుర్లు చెప్పుకుని ఆ సభావేదిక దగ్గరకు వెళ్ళాము.సభానంతరం శర్మగారితో బాటూ జానకీ బాల వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయింది.నేను వనజతో వాళ్ళింటికి వెళ్ళాను. దారిలో ఆ ముందు రోజు పుస్తకం ప్రదర్శన లో పాల్గొనటానికి వచ్చిన స్కైబాబ,షాజహానాలను అడ్డగించి తెలంగాణా ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్ళని దుర్భాషలాడుతూ రాసిన కవితలు రాసినవారు మళ్ళా ఇక్కడకు ఎందుకు వస్తున్నారని కొందరు ఆందోళన చేసారనీ దాంతో అక్కడ గందరగోళం ఏర్పడినట్లు ,అయితే ఆ గొడవ చేసిన వాళ్ళు నిజానికి సాహితీవేత్తలు కాదని రాజకీయ కార్యకర్తలని చెప్పింది వనజ. రాష్ట్రాలు విడిపోయినా ఇరుప్రాంతాల జనాలలోనూ కొంత ద్వేష భావాలు రగులుతూనే వున్నాయి.అందుకు ప్రధాన కారణం మాత్రం స్వార్థ పూరిత రాజకీయాలే. శిఖామణిగారు తన పుట్టిన రోజున యానాంలో కవితోత్సవం నిర్వహించి శివారెడ్డిగారికి పురస్కారం ఇస్తున్నానని వీర్రాజుగారికి ఫోన్ చేసారు.ఆసందర్భంగా వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాననీ.రాజమండ్రిలో వున్న పెయింటింగ్స్ యానాం తీసుకు వెళ్తున్నానని చెప్పారు. దానికి ఇద్దరూ రావాలని కోరుతూ,ఆ సందర్భంలో సుభద్రాదేవిగారిని కూడా కవిత చదవమని చెప్పమని ఫోన్లో చెప్పారు శిఖామణి.ఆ విషయం వీర్రాజుగారు నాకు చెప్పారు.వీర్రాజుగారి చిత్ర ప్రదర్శన యానాంలో ఏర్పాటు చేయటం సంతోషం కలిగించింది.ఆ సందర్భంగా అయినా యానాం ప్రయాణం కూడా సంతోషకరమే.కానీ శిఖామణిగారు వీర్రాజుగారి ద్వారా నన్ను కవి సమ్మేళనంలో పాల్గొనమని చెప్పించడం నాకు నచ్చలేదు.శిఖామణిగారికి ఈ విషయం తెలిసే అనుకుంటా కవి సంధ్యలో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు దీనిగురించి ప్రత్యేకం ఒక ప్రశ్న వేసారు.నిజానికి శిఖామణి కవిత్వం నాకెంతో ఇష్టం.తర్వాత్తర్వాత శిఖామణిగారు మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు అయ్యారు. అది అలా వుంటే వీర్రాజుగారికి ఫోన్ చేసి నన్ను కవి సమ్మేళనంలో పాల్గొనమనే సందర్భాలు నేను చాలానే ఎదుర్కొన్నాను.ఇటువంటిదే ఒకసారి హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో ఒక ప్రముఖ సంస్థ కవి సమ్మేళనం ఏర్పాటు చేసి నాకు ఫోన్ చేసి చెప్పకుండా వీర్రాజుగారితో "సుభద్రాదేవిగారిని ఫలానా రోజు కవిసమ్మేళనంలో కవిత చదవటానికి రమ్మని చెప్పండి.వెయ్యి రూపాయలు కూడా ఇస్తున్నాం" అని నిర్వాహకులు చెప్పారు.అలా కాకుండా "ఫోన్ సుభద్రాదేవికి ఇవ్వండి.కవిసమ్మేళనానికి ఆహ్వానించాలి"అని చెప్పినాకు పర్సనల్ గా చెప్పటం మర్యాద కదా.ఇతర కవయిత్రుల భర్తలకు ఫోన్ చేసి మీ ఆవిడని సభకి పంపండి అని అనగలరా? నాకు భలే కోపం వచ్చి ఆ రోజు వెళ్ళలేదు. సరే అయితే ఇప్పుడు యానాంలో వీర్రాజు గారి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.వయసు రీత్యా వీర్రాజుగారికి సాయంగా వెళ్ళక తప్పదు.అందుకని యానాం బయలుదేరాం.కాకినాడలో దిగిన తర్వాత రిసీవ్ చేసుకొని కార్లలో యానాం తీసుకు వెళ్ళారు.మాతోపాటూ, శివారెడ్డి, శ్రీకాంతశర్మగారూ,ఇతర కవి మిత్రులు కూడా వున్నారు.పగలంతా బహుమతి ప్రదానం,కవిసమ్మేళనం జరిగింది.ఆ రాత్రి మేమిద్దరం తప్ప కొందరు కవయిత్రులతో సహా ఇతరులందరితో సభానంతర సమావేశం జరిగింది. మర్నాడు ఉదయమే తయారై నేనూ,రేణుకా అయోలా బయట అలా నడుచుకుంటూ గోదావరి ఒడ్డువరకూ వెళ్ళి వచ్చాము. మిగతా వాళ్ళంతా ఇంకా యానాంలో తనివి తీరక అక్కడే వున్నారు ‌.వీర్రాజుగారూ,నేను తిరుగు ప్రయాణానికి బయలుదేరిపోయాము. ఆ తర్వాత సుంకర చలపతిరావుగారితో సంప్రదించి రవిప్రకాష్ విశాఖ చిత్రకళా పరిషత్ లో కూడా పెయింటింగ్స్ ప్రదర్శనను రెండు రోజులు ఏర్పాటు చేసారు.కానీ మేము వెళ్ళటానికి కుదరలేదు. ఉమ్మడిసెట్టి పురస్కారాలు ఈ ఏడాదితో ముఫ్ఫై అవుతాయనీ,ఆ సందర్భంగా ఇంతవరకూ పురస్కారాలు అందుకున్న వారందరినీ ఆహ్వానించి రోజంతా సభలు నిర్వహించటమే కాక ఒక పది మంది సీనియర్ కవులకు ప్రతిభా పురస్కారాలు అందించాలని తలపెట్టానని రాధేయగారు ఫోన్ చేసి తెలియజేసారు.నాకు చాలా సంతోషం కలిగింది. 1994 లో వచ్చిన "తెగిన పేగు" కవితా సంపుటిని ఉమ్మడి సెట్టి పురస్కారం పరిశీలనకు పంపాను. నాకు పురస్కారం రాలేదు.కానీ నాగభైరవ కోటేశ్వరరావుగారు నా కవితా సంపుటిని ప్రశంసిస్తూ నాకు వుత్తరం రాసారు.నేను ఆయనకు పుస్తకం పంపలేదు కదా అని ఆశ్చర్యపోయాను.తర్వాత బహుశా ఉమ్మడిసెట్టి పురస్కారాల న్యాయనిర్ణేతగా ఉండివుంటారనుకున్నాను.అప్పుడు తప్పిపోయిన పురస్కారం ఈనాడు ప్రతిభా పురస్కారంగా అందుకుంటున్నానని ఆనందించాను. ఆ సభలకోసం కొండేపూడి నిర్మలతో కలిసి అనంతపురం బయలుదేరాను. అక్కడ మా ఇద్దరినీ శశికళ రిసీవ్ చేసుకొని వాళ్ళింట్లోనే ఆతిధ్యం ఇచ్చి మమ్మల్ని సభల అనంతరం తిరిగి ఆ సాయంత్రం ట్రైనుకి అందించేవరకూ మా వెన్నంటే వుంది. "ఇంతవరకూ ముఫ్ఫై పురస్కారాలు ఇచ్చాము.అనేక కారణాలవలన ఇంక ఆపాలని భావిస్తున్నాను" అని రాధేయగారు సభలో మాట్లాడుతూ అన్నారు.కానీ రాధేయగారి శ్రీమతి సత్యాదేవి ఒకింత భావోద్వేగంతో కన్నీళ్ళతో " ఉమ్మడిసెట్టి పురస్కారాలు ఆగవు.ఎప్పటికీ కొనసాగుతాయి" అని ప్రకటించారు.అప్పటికే కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో వున్నారు.ఆమె మాటలకి సభికులంతా ఉద్విగ్నతతోనే హర్షధ్వానాలు చేసారు.కానీ దురదృష్టం ఏమిటంటే తర్వాత కొంతకాలానికే రాధేయగారిని ఒంటరిని చేసి ఆమె మరణించారు. ప్రజా సాహితి దివి కుమార్ గారు జనసాహితితో కలిసి విజయవాడలో వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని భావించారు.ఈమని శివనాగిరెడ్డిగారు విజయవాడ లోని మధుమాలక్ష్మి కన్వెన్షన్ లో ప్రదర్శనకు సహకరించారు. యూ.ఎస్ లో వున్న ప్రముఖ నైరూప్య చిత్రకారులు ఎస్వీ రామారావుగారు వూర్లోనే వున్నారని ఆయనతో ప్రదర్శన ఉదయం పదిన్నరకు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. . ఆరోజు వుదయం ఆరుగంటలకు మాకు ఎప్పుడూ వచ్చే డ్రైవర్ని విజయవాడ వెళ్ళాలని రమ్మన్నాము.తీరా అతనికి అర్జంట్ గా వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని వేరే డ్రైవర్ని పంపించాడు.దాంతో బయలుదేరటమే ఆలస్యం అయ్యింది. తీరా ఎనిమిది దాటింది కదాఅని దారిలోనే టిఫిన్ కూడా పూర్తిచేసుకొని బయలుదేరి తర్వాత పెట్రోల్ బంక్ కు వెళ్ళాము. పెట్రోల్ నింపాలని చెప్తే పొరపాటున డ్రైవర్ డీజిల్ నింపుతూ అప్పుడు తన పొరపాటును అబ్జర్వ్ చేసాడు.పెట్రోల్ టేంక్ లో డీజిల్ నింపకూడదట.అక్కడకు దూరంలో వున్న కారుమెకానిక్ షాపుకు డ్రైవర్,బంక్ అతనూ వెళ్ళి మెకానిక్ ని తీసుకు వచ్చి ట్యూబ్ ద్వారా డీజిల్ తీసివేసి కారు టాంక్ శుభ్రం చేసి తిరిగి పెట్రోల్ నింపి బయలు దేరేసరికే పదిన్నర అయ్యింది.మేము దివి కుమార్ గారికి ఫోన్ చేసి ఇదంతా చెప్పి చిత్ర ప్రదర్శన ప్రారంభించేయమని చెప్పాము. ఆ. డ్రైవర్ దారి కూడా సరీగా తెలియదేమో మేము విజయవాడ చేరేసరికే రెండు కావస్తుంటే దివి కుమార్ గారు హొటలు రూమ్ కే తీసుకువెళ్ళారు.అక్కడ భోజనం చేసి మధుమాలక్ష్మి కన్వెన్షన్ కు వెళ్ళాము.అక్కడ ఎస్వీ రామారావుగారితో సహా అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. వీర్రాజుగారి పెయింటింగ్సేకాక మా ఇద్దరి పుస్తకాలు కూడా ప్రదర్శనకు పేర్చారు.పెయింటింగ్స్ చాలా బాగా స్టాండులకు అమర్చారు.అవి చూసి మాకు చాలా సంతోషం కలిగింది.సాయంత్రం వరకూ వుండి హోటల్ కు వెళ్ళిపోయాము.మర్నాడు ఉదయం తయారై తొమ్మిదింటికల్లా మధుమాలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ కు వెళ్ళాము.ఆరోజు చాలా మంది మిత్రులు వచ్చారు.వనజాతాతినేని,అల్లూరి గౌరి లక్ష్మీ,చలసాని వసుమతికాక కుందుం ప్రకాశరావు మొదలైన వీర్రాజుగారి మిత్రులు కూడా వచ్చారు.జనసాహితి తరుపున సాయంత్రం ఆరుగంటలకు ఒక సభా సమావేశం ఏర్పాటు చేసారు.వీర్రాజుగారి చిత్రాలు గురించి కొందరు చిత్రకారులు ప్రసంగించారు.కొందరు ప్రముఖులు డెలిగేట్స్ గా మధుమాలక్ష్మి కన్వెన్షన్ కు వస్తున్నారని ,ఏవో కార్యక్రమాలు వున్నాయని అందుకని తర్వాత మరో మూడురోజులు చిత్ర ప్రదర్శన కొనసాగిస్తామని మధుమాలక్ష్మి నిర్వాహకులైన ఈమని శివనాగిరెడ్డిగారు అన్నారు.అంతేకాక ఒక లక్షన్నరకు అయిదు పెయింటింగ్స్ కొంటానని ,ఒక పెయింటింగ్ మాధుమాలక్ష్మికి బహుమతిగా కూడా ఇవ్వమని కోరారు.చిత్రప్రదర్శన చాలా సంతోషం కలిగించటం వలన ఒక పెయింటింగ్ శివనాగిరెడ్డిగారికి బహుమతిగా ఇచ్చేసారు.వీర్రాజుగారు కానీ అమ్మటానికి మాత్రం ఇష్టపడలేదు. మర్నాడు వసుమతిగారింటికి వెళ్ళాము. వసుమతిగారు ఎప్పటినుంచో కోరుతున్నందున ఒక చిత్రాన్ని బహుమానంగా ఆమెకు ఇచ్చారు వీర్రాజుగారు.తర్వాత మేము ప్రజాసాహితి ఆఫీసుకి వెళ్ళి రవిబాబుగారిని కలిసి,దగ్గరలోని హొటల్ లో భోజనం చేసి హైదరాబాద్ తిరిగి బయలుదేరాము. విజయవాడలో జరిగే కృష్ణారచయిత్రుల మహాసభలో ఒక చిరుసత్కారం చేస్తామని ఫోన్ చేసి ఆహ్వానించారు డా.జివి.పూర్ణచంద్ గారు. అంతేకాక మహిళలకు చెందిన వ్యాసం ఏదైనా రాసి ఇవ్వమని కోరారు.పేదవర్గాల ఆడపిల్లలు చదువులకు కలిగే అవరోధాలు మీద స్టాటిస్టిక్స్ ఆధారాలతో వ్యాసం రాసి పంపించాను.అదే సందర్భంలో జానకీ బాలకు ఒక పురస్కారం కూడా వుండటం వలన ఇద్దరం కలిసి కారులో విజయవాడ బయలుదేరాం.మా ఇద్దరికి ఒకే హొటల్ లో వసతి కల్పించారు. ఒక సమావేశంలో మండలి బుద్ధప్రసాద్ గారి చేతి మీదుగా కొన్ని పుస్తకావిష్కరణలు కూడా జరిగాయి.ఆ సందర్భంలో నా " ఇస్కూలు కతలు" పుస్తకంకూడా బుద్ధప్రసాద్ గారు ఆవిష్కరించారు.ఆయన వీర్రాజుగారి గురించి నాతో ప్రస్తావించారు. నన్ను సన్మానించినపుడు నా గురించి నాలుగు మాటలు కె.బి.లక్ష్మి మాట్లాడింది. నేను నా కార్యక్రమం అయ్యాక సభికులలో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి చిత్తూరులో కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నానంటూ తనను పరిచయం చేసుకుని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా వున్న నా కథ " మార్పు వెనుక మనిషి" చెప్తుంటాననీ వాళ్ళకు చూపించటానికంటూ నా గురించి వివరాలడిగి నాతో సెల్ఫీ దిగింది.అది నాకు ఎంతో ఆనందం కలిగించింది. ఒకసారి లేఖిని ద్వారా ఏర్పాటు చేసిన కవిసమ్మేళనానికి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణగారిని ముఖ్య అతిథిగా పిలిచారు వాసా ప్రభావతిగారు. కవిసమ్మేళన సంధానకర్తగా నేనే వున్నాను.ఆ సభలో గంగిశెట్టిగారు వారి మాతృమూర్తి పేరిట కవితా సంపుటాలకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాననీ, కవితా సంపుటాలు పంపమని ప్రకటన సభాముఖంగా చేసారు.సాధారణంగా నేను పోటీలకు పంపను.కానీ పంపక పోవటం వలన ఎన్నో మంచి బహుమతుల్ని పోగొట్టుకుంటున్నానని చెప్పి పోటీకి అప్పట్లోనే వచ్చిన నా ఆకాశం నాదే సంపుటిని కూడా పంపించాను.

నడక దారిలో,-59

నడక దారిలో -59 ఒకసారి రామలక్ష్మి గారికి ఇచ్చినపుడు అనుకుంటా అమృతలతగారు నిర్వహించే అపురూప పురస్కారాల సభకు హాజరు అయ్యాను. వారి పేరు వచ్చే పాటనే నేపధ్యంలో వేస్తూ అతిథులను ఆహ్వానించటం గమ్మత్తుగా అనిపించింది.రెండుమూడు గంటల సభనీ ఆహ్లాద భరితంగా టీమ్ వర్క్ తో,నిబద్ధతతో, చక్కని క్రమశిక్షణతో చివరకు సభకు హాజరైన సభికుల్ని కూడా పాల్గొనేలా చేస్తూ రంగరంగ వైభవంగా సాగిన విధానం అబ్బుర పరిచింది.అంతే కాకుండా పురస్కారం పొందిన వారిపై పరిచయ వ్యాసాలతో కూర్చ అందంగా ముద్రించిన అభినందనసంచికను ఆవిష్కరించి వచ్చిన వారందరికీ అందజేసారు. అంతకు ముందు ఎన్నోసార్లు అమృతలతగారి ఆహ్వానం అందుకున్నా కూడా 'నాకు కూడా పురస్కారం ఇవ్వండి' అనే ఉద్దేశంతో ఆమె చుట్టూ తిరిగినట్లౌతుందేమోనన్న మొగమాటంతో ఎప్పుడూ వాళ్ళ సభలకు హాజరు కాలేదు. ఇంత ఆహ్లాద వాతావరణంలో జరిగిన ఈ సభ నన్ను ఆకట్టుకుంది.ఇంకెప్పుడు మిస్ కాకూడదు అనిపించింది. మాది గేటెడ్ కమ్యూనిటీ కావటం వలన అక్కడ ఎవరింట్లో పెళ్ళిళ్ళూ, పుట్టినరోజులూ వంటివి ఏవి వచ్చినా అందరూ కలిసి ముస్తాబులై సంబరంగా జరుపుకుంటారు .మా ఫ్లోరులోనే అంతకుముందు అద్దెకు ఇచ్చిన ఇంటిని ఇంటి ఓనర్ ఖాళీ చేయించి ఆ ఇంట్లోనే కొడుకు పెళ్ళి చేయాలనుకుంటున్నారని తెలిసింది. మా ఫ్లోరంతా సందడి నెలకొంది.పెళ్ళికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకూ కొన్నింటికి నేను,పెళ్ళికి పల్లవి,ఆషీ వెళ్ళారు.పెళ్ళి హడావుడి తగ్గిన తర్వాత బంధువులంతా ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు.అంతవరకు ఆ ఇంటామె గురించి తెలియలేదు.ఆ యింటి ఆమె డా.సుశీలమ్మగారనీ, గుంటూరు డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ గా ఉద్యోగానంతరం పదవీవిరమణ చేసారని తెలిసింది.మా బిల్డింగ్ లో జరిగే కార్యక్రమాలలో కలుస్తున్నా చొచ్చుకు పోయే స్వభావం నాకు లేనందున అంతకన్నా పరిచయం పెరగలేదు. బిల్డింగ్ లో జరిగే గణేష్ వుత్సవాలలో,ఇతరేతర సంబరాల్లో కలిసినప్పుడు పలకరించుకునే వాళ్ళం. ఉద్యోగరీత్యా వూపిరి సలపని పనులతో, పుట్టిన దగ్గర్నుంచి అదే వూర్లో వుండటంతో బిజీగా గడిచిన జీవితం ఆమెది.తర్వాత వున్న వూరు వదిలి రావటం ఒకవంక ,స్నేహితులకూ, పిల్లలకూ దూరంగా వుండటం మరోవంకా,తెలియని పరిసరాలూ,మనుషులూ ఇంకొక వంకా సుశీల గారికి చెరువులో నుండి బయటపడిన చేపలా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.ఒక్కసారిగా ఒంటరిగా అయిపోయింది.దాంతో డిప్రెషన్ లోనైనట్లుగా డల్ గా అయిపోయారు. ఆమెకు కూడా మేము రచయితలమని తెలిసి ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడారు.అప్పుడు పూర్తిగా మా గురించి తెలిసింది.మా గురించి చెప్పి ఆమెకు తెలిసిన సాహిత్య మిత్రులను కూడా మా గురించి వాకబు చేసారు.సుశీలగారి సహాధ్యాయి అయిన కవి, విమర్శకుడు పాపినేని శివశంకర్ గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు గ్రహీత కావటం వలన వీర్రాజు గారికి బాగా తెలిసిన వాడే.కడియాల రామ్మోహన్ రాయ్ గారికి మా కుటుంబం పట్ల చాలా గౌరవాభిమానాలు వున్నవారు.అందులోను నా కవిత్వం అంటే ఆయనకు ఇష్టం కూడా వుంది.ఏవో సభల్లో నా కవిత గురించి ప్రస్తావించానని ఫోన్ కూడా చేసి చెప్పేవారు.ఆయన సుశీల గారికి గురువుగారు.ఇలా మా ఇద్దరికీ అభిమానులు అయిన వాళ్ళు ఉండటం వలన కావచ్చు మాకు స్నేహం సులభంగా ఏర్పడింది. అప్పటి నుండి తరుచూ ఆమె మా ఇంటికి వచ్చే వారు.నేను అప్పుడప్పుడు వెళ్ళే దాన్ని.మా మధ్య సాహిత్యం గురించి ఎన్నెన్నో కబుర్లు దొర్లేవి. ఒకసారి ఆమెచేసిన విశ్వనాథ కిన్నెరసాని పై చేసిన ఎమ్ఫిల్, ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యం పై చేసిన పీహెచ్డీ పరిశోధనా ఆమె చూపించారు.అవి చూసి "మీకు పెన్షన్ బాగానే వస్తుంది కదా మీ పరిశోధనల్ని పుస్తకంగా వేసుకోవచ్చు కదా" అని వీర్రాజు గారు అన్నారు.అది సుశీలగారిపై మంత్రంలా పని చేసింది. వీర్రాజుగారినే తన పుస్తకానికి ముఖచిత్రం వేయమని కోరారు.ఈ మధ్య చాలాకాలంగా ముఖచిత్రాలు వేయటం మానేసారు.కాని ఆమె కోరిక కాదనలేక అందులోనూ సలహా యిచ్చింది తానే కనుక చాలా రోజులకు ముఖచిత్రం వేయటానికి కూర్చున్నారు. ఆమె డల్ గావుంటూ బిల్డింగ్ లో కార్యక్రమాలకి కూడా పాలుపంచుకోకుండా ఇంటికే పరిమితం కావటంతో నాతో పాటు నేను వెళ్ళే సాహిత్య కార్యక్రమాలకు రమ్మని పిలిచే దాన్ని.ఆవిధంగా ఆమెకు జంట నగరాల్లోని రచయితలూ,రచయిత్రులూ, కవులు పరిచయం అయ్యారు. మీకు విమర్శ పట్ల మక్కువ కనుక కథలూ కవితలూ కాకపోయినా విమర్శ వ్యాసాలు రాస్తూ వుండొచ్చు కదా.మీకూ కాలక్షేపం, మనసుకు ప్రశాంతత కలుగుతుంది అనేదాన్ని.ఆమెకు అంతకుముందునుండీ సాహిత్య రచన అలవాటు వున్నా నిస్పృహలో వుండటంతో రాయటం తగ్గిపోయింది. పుస్తకాలు ప్రచురణకు నిర్ణయించుకోవడంతో ప్రూఫుల దిద్దుబాటు పనులతో తిరిగి సుశీల గారు డిప్రెషన్ మూడ్ నుండి బయటపడ్డారు. నాకు కూడా సాహిత్యం గురించి మాట్లాడుకోవడానికి ఒక స్నేహితురాలు దొరికింది. కాత్యాయనీ విద్మహే ఫోన్ చేసి పెనుగొండ లో ప్రరవే సభలకు నాకు నచ్చిన నారచన గురించి మాట్లాడటానికి రమ్మని ఆహ్వానించారు.ఇంద్రగంటి జానకీ బాలను కూడా ఆహ్వానించామని చెప్పారు.జానకీబాలా,నేనూ ప్రరవే నిర్వహించే సమావేశాలు ఎక్కడ జరిగినా జంటకవుల్లా కలిసి వెళ్ళటం ఒక ఆనవాయితీ అయిపోయింది.ఇద్దరం ఇక్కడ ట్రైను ఎక్కిన దగ్గర్నుంచి తిరిగి వచ్చేవరకూ ఎన్ని ముచ్చట్లు చెప్పుకునేవారమో .సినీమాలూ,పాటలూ, సాహిత్యం,పత్రికలూ ఇలా ఎన్నో కబుర్లు.మా ప్రపంచమే వేరుగా వుండేది.మా గురించి తెలుసు కనుక ప్రరవే వాళ్ళు మా ఇద్దరికీ ఒకే చోట వసతి కల్పించేవారు. పెనుగొండలో మొదటి రోజు రెండవ సదస్సులో ఒకే వేదికపై ఇద్దరం పాల్గొన్నాం . నాకు నచ్చిన నా రచన కార్యక్రమంలో ఇద్దరం పాల్గొన్నాం .నేను "నాకు నచ్చిన నా రచన - యుద్ధం ఒక గుండె కోత "గురించి ప్రసంగించాను. ఆ రోజు సదస్సులు అయ్యాక అందరం మసకచీకటిలోనే దగ్గరలో వున్న ఒక ఆలయానికి వెళ్ళాం.ఆలయం అంతా గాజుతో కట్టినదానిలాగా దీపకాంతి పడేసరికి రంగులీనుతూ వుంది.నా దగ్గర వున్న చిన్న ఫోన్ తోనే ఫొటోలు తీసాను.అక్కడనుండి తిరిగి వచ్చి భోజనాలు చేసి మాకు ఇచ్చిన హాస్టల్ కి బయట కూర్చొని అందరం పన్నెండు గంటల వరకూ పాటలు పాడుకున్నాము .ఒకరిద్దరు వీథినాటకం వేసారు. పన్నెండు దాటాక నేనూ,జానకీ బాలా మా రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాం . మర్నాడు ఉదయం సెషన్ అయ్యాక అందరం బస్ లో పోలవరం ముంపు ప్రాంతాలను చూడటానికి ,అక్కడి ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళాం.పోలవరం ముంపుప్రజలకు ప్రభుత్వం అందించిన సహాయాలు, రాయితీలు గురించి కొందరు చెప్తున్నారు.కొందరు బాధితులు దిగులు నిండిన కళ్ళతో అలాగే వున్నారు.చాలా మందితో మాట్లాడాము.నాకు అర్థమైనదేమిటంటే అక్కడ కూడా ప్రభుత్వానికి, బాధితులకూ మధ్య బాధితులనుండే కొందరు దళారీలుగా మారి తమ జీవితాల్ని బాగు చేసుకుంటున్నారు.కొందరు బాధితులు అలాగే వుండిపోయారు.కొందరు అన్ని సౌకర్యాలతో పెద్దఇళ్ళను కట్టుకుని సుఖవంతంగా వున్నారు. నాకు గల ఆసక్తి వలన అక్కడ కనిపించిన ఒక స్కూల్ కి వెళ్ళాను.బయట బోర్డు మీద ప్రభుత్వ ఉన్నత పాఠశాల అని వుంది.లోపల ఒకే మాష్టారు, చిన్నచిన్న పిల్లలూ వున్నారు.ఆయన్ని అదే విషయం అడుగుతే బోర్డు తప్పుగా రాసారు అన్నాడు కొంచెం నాపై విసుగు ప్రదర్శిస్తూ.కొన్ని బడులు సంగతి తెలిసిన దాన్ని కదా నవ్వుకున్నాను. బహుశా ప్రభుత్వం నుండి హైస్కూల్ రాయితీలు పొందుతూ నడుస్తున్న ప్రాధమిక స్కూల్ అన్నమాట.ఆ మారుమూలకి సూపర్ విజన్ కి ఎవరూ రాకుండా చూసుకుంటారనుకుంటాను.మనం కట్టే పన్నుల్లో ఎంత శాతం ఇలా దుర్వినియోగం అవుతుందో కదా. దారిలో కొందరు పిల్లలతో కూడా మాట్లాడాను.టాటా బైబై చెప్పి బయలుదేరుతున్నప్పుడు. ఒక చిన్న పిల్లాడు " మేడం మీరు మావూరిని,మమ్మల్ని దత్తత తీసుకుంటున్నారా" అన్నాడు.బహుశా అప్పుడే వచ్చిన శ్రీమంతుడు సినీమా ప్రభావం కావచ్చు.ఆ పిల్లాడి మాటలో, గొంతులో భవిష్యత్తు గురించి తొంగి చూసిన ఆశ నాలో చాలా కాలం వెంటాడింది.ఈ సందర్భాన్ని నేను " రేపటి ప్రతిధ్వని " అనే కథగా రాసాను.అది గోదావరి పత్రికలో ప్రచురితమైంది. అక్కడినుండి నేనూ జానకీ బాల తణుకు వెళ్ళే బస్ ఎక్కాము.తణుకు జానకీ బాల చిన్ననాటి వూరు.అక్కడ ఆమెని ఎన్నాళ్ళ నుండో రమ్మని ఆహ్వానిస్తున్న తెలిసిన మిత్రుని ఇంటికి వెళ్ళాము. ఆ మిత్రుడు నన్ను వూరూ,పేరూ కనుక్కున్నాక "మీదే గోత్రం" అని ప్రశ్నించాడు.నేను కొంచెం ఇబ్బంది పడ్డాను.నేను బ్రాహ్మలంకాదని చెప్పాను.అవునా అన్నాడు.తర్వాత జానకీ బాల స్నానం చేసి రావటంతో సంభాషణ మరోవైపు మరలింది.అతను కూడా రచయితే కానీ అతని సాహిత్య ధోరణి వేరు.పుస్తకాలు కూడా ఇచ్చాడు. స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యాక భోజనాలకు కూర్చున్నాం. నేను వాళ్ళపిన్నిలా వున్నానంటూ అతనిభార్య నాకు ప్రేమగా కొసరి కొసరి వడ్డించింది.కానీ నాకే అతని ప్రశ్న గుర్తు వచ్చి ఇబ్బందిగా అనిపించింది. వారి ఎదురింట్లో మాకు పడకలు ఏర్పాటు చేసారు. పక్క మీద పడుకుని మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు జానకీబాలకి ఈ విషయం చెప్పాను."అయ్యో అవునా సారీ సుభద్రగారూ అలా జరుగుతుందని అనుకుంటే ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం పెట్టే దాన్ని కాదు "అని చాలా బాధ పడ్డారు. మర్నాడు ఉదయమే తయారై అలా ఎక్కడైనా కూర్చొని కబుర్లు చెప్పుకుందామని వూర్లోకి బయలుదేరాం.కానీ ఎక్కడా మాకు అనువైన స్థలం దొరకలేదు.కాసేపు అక్కడేదో గుడి కనిపిస్తే అక్కడ కాసేపు కూర్చున్నాం.కానీ ఆ రోజు గుడిలో ఏదో ప్రత్యేక పూజలు ఉన్నట్టున్నాయి.ఒకటే జనం.అక్కడ నుండి తిరిగి వాళ్ళింటికి వెళ్ళి లగేజీ తీసుకుని జానకీ బాల చిన్ననాటి స్నేహితురాలి ఇంటికి వెళ్ళాం.వాళ్ళు ఆరోజుల్లో జమిందారీ కుటుంబమట.జానకీబాల తల్లిగారు వాళ్ళింట్లో అమ్మాయిలకు సంగీతం నేర్పేవారట.వాళ్ళు మా ఇద్దరినీ చాలా ప్రేమగా ఆహ్వానించారు.ఎప్పుడెప్పటి కబుర్లో వాళ్ళు చెప్పుకుంటుంటే వింటూ కూర్చున్నాను.తిరిగి ఆ సాయంత్రం మమ్మల్ని ట్రైనుకు ఎక్కించారు.ట్రైనులో మా కబుర్లు కొనసాగాయి. క్షేమంగా ఇద్దరం ఇంటికి తిరిగి చేరుకున్నాం. ఒకరోజు అమృతలతగారు ఫోన్ చేసి నిజామాబాద్ లోని వాళ్ళ నిర్వహణలో వున్న విజయా హైస్కూల్ టేలెంట్ షో కి గౌరవఅతిథిగా రమ్మని కోరారు. స్కూల్ లో జరిగే కార్యక్రమాలు పట్ల గల ఆసక్తితో సరే అన్నాను.మా ఆషీని కూడా తీసుకు వెళ్ళాలనుకున్నాను.ఉదయమే ఏడుగంటలకు కారు తీసుకుని అమృతలతగారి మేనకోడలు వచ్చింది.అయితే దారిలో సినీతార సంగీతని పికప్ చేసుకోవాల్సి వచ్చింది.ఆమె చాలా ఆలస్యం చేయటంతో మేము చాలా సేపు రోడ్డు మీదే వెయిట్ చేయాల్సి వచ్చింది.నాకు రాజకీయనాయకులు,సినీతారలతో పొత్తులు నచ్చవు‌.అందుచేత ఆమెతో పెద్దగా కలవలేక పోయాను.నిజామాబాద్ చేరేసరికి ఒంటిగంట దాటింది.స్కూల్లోనే భోజనం ఏర్పాటు చేసారు.నాన్ వెజ్ పదార్థాలు ఎక్కువగా పెట్టారు.నేను తిననని తెలిసి అమృతలతగారు ఇబ్బంది పడ్డారు.పరవాలేదని చెప్పి పప్పు, పెరుగులతో కానిచ్చాను.నేను తినలేదని అమృతగారు కూడా నాన్ వెజ్ తినలేదు. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తయారై కార్యక్రమానికి వెళ్ళాము. విద్యార్థులు చేసే అద్భుతనృత్యాలతో కార్యక్రమం ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.అమృతలత అపురూప అవార్డులు సభ ఎంత హృద్యంగా జరుగుతుందో అలాగే ఇక్కడకూడా అమృతలతగారి డిసిప్లిన్, అభిరుచీ, పాఠశాల సిబ్బంది టీమ్ వర్క్ ప్రతీది అద్భుతంగా వ్యక్తమయ్యాయి.ఆ రాత్రి వాళ్ళింట్లోనే బస.మర్నాడు ఉదయం టిఫిన్ ల తర్వాత అపురూప దేవాలయానికి తీసుకు వెళ్ళారు.ఇంకా కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి.ఎందుకు నిర్మించారనే విషయాన్ని అమృతగారు వివరించారు. ఆ రోజు ఆర్మూర్ స్కూల్ లో కార్యక్రమం వుంది.ఉండమని అన్నారు కానీ తిరుగు ప్రయాణానికి బయలుదేరి పోయాము. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి సారథ్యంలో ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ ఏర్పాటైంది . కేవీ రమణాచారి, అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, దేశపతి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సభ్యులు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో 2017, డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేయాలనే సంకల్పంతో నిర్వహించారు. ఈ సమావేశాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తో ముగింపు చేసారు. ఈ సభల్లో రెండు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖులను సత్కరించారు.బహుశా సిథారెడ్డిగారు తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ కావటం వల్ల కావచ్చు ఈ వీర్రాజుగారిని కూడా గౌరవంగా సత్కరించారు. ఒకరోజు వుదయమే కళ్యాణ్ నుండి ఫోన్ వాళ్ళమ్మ అంటే మా చిన్నక్క చనిపోయిందనే వార్త.రంజనా కొడుకుఅనురాగ్ కు నాన్నమ్మ మీద చేరిక, ప్రేమ ఎక్కువ.ఇక్కడ ఎంబీయే చదువుతున్నాడు.అందుకని అతను లేకుండా కార్యక్రమం చెయ్యటం కష్టమని,అతన్ని తీసుకుని ఫ్లైట్ లో రమ్మని కళ్యాణ్ చెప్పాడు.వెంటనే మా ఇద్దరికీ పల్లవి ఫ్లైట్ బుక్ చేసింది.ఈ లోగా అనురాగ్ హాస్టల్ నుండి వచ్చాడు.గుమ్మంలో అడుగు పెడుతూనే ఏడుపు మొదలెట్టాడు.అనురాగ్ దుఃఖాన్ని ఆపటం కష్టమైంది. చిన్నక్కతో నాకు మానసిక బంధం ఎక్కువే.ఏ కష్టమొచ్చినా,దుఃఖమొచ్చినా ఒకరితో ఒకరం పంచుకునేది మేమిద్దరమే.నాకున్న ఒకే ఒక్క రక్తసంబంధం ఆమెనే.పెద్దన్నయ్య ఉన్నాడు గానీ లేనట్టే.అంతబంధం వున్నా నా కంటి నుండి నీళ్ళు రాక పొందటం నాకే ఆశ్చర్యం అనిపించింది.బహుశా ఎన్నో మరణాలు చూడటం వల్ల కొంతకాలానికి దుఃఖానికి అతీతులం అవుతామేమో. నేనూ, అనురాగ్ ఇద్దరం ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి ,వైజాగ్ చేరేసరికి పన్నెండు దాటింది.అక్కడ మిమ్మల్ని పికప్ చేసుకుని కోరుకొండ చేరేసరికి మరో గంటన్నర.అంతవరకూ అనురాగ్ ని మామూలు స్థితికి తీసుకు రావటానికి నేను ఎంతగా కబుర్లు చెబుతున్నా మౌనమునిలా వుండిపోయాడు.అక్కడకు వెళ్ళాక ఎలా పట్టుకోగలుగుతామో అని సందేహించాను. ఎట్టకేలకు ఇల్లు చేరాము.నిశ్తలంగా వున్న అక్కని చూస్తూ ఉంటే ఆమె జీవితమంతా కళ్ళముందు మెదిలింది. నాన్నగారు పోయిన అనంతరం ఆర్థిక ఇబ్బందులూ, కోటబొమ్మాళి వెళ్ళడం,అక్కడ మా మాష్టారుని ఇష్టపడటం,మేమంతా పెద్దక్క ఇంటికి చేరటం,తదనంతరం పరిస్థితులు కొంతవరకూ చక్కబడి,మాష్టారి పట్టుదలతోనూ, పెద్దక్క పూనుకోవటంతోనూ మాష్టారుతో చిన్నక్కకు వర్ణాంతర వివాహం జరగటం బంధువులంతా వాళ్ళిద్దరితోపాటూ మమ్మల్నందరిని దూరం పెట్టడం గుర్తు వచ్చింది.ఆ రోజుల్లోనే పట్టుదలగా వర్ణాంతరం చేసుకొని వారి ప్రేమను సఫలం చేసుకొని పెట్టమని ఆరేడు సంవత్సరాలు కూడా తిరగకుండానే,అక్కనీ,ఇద్దరు పసిపిల్లలనీ వదిలి హార్ట్ ఎటాక్ తో బావగారు పోయారు.ఆ పరిస్థితుల్లో బావగారు ఉద్యోగం చేసిన కోరుకొండ సైనిక్ స్కూల్ లోనే ఉద్యోగంలో చేరి ఒంటరి పోరాటంతో ఇద్దరు పిల్లలను వృద్ధిలోకి తెచ్చింది.జీవితంతో పోరాటం చేసి చిన్నక్క కొడుకూ,అనుకూలవతి ఐన కోడలుజయ ప్రేమలో సేద తీరింది.ఆమెకున్న బెంగంతా కూతురు జీవితం గురించే.నీళ్ళునిండిన కళ్ళతో ఆమెని చూడలేకపోయాను. సైనిక్ స్కూల్ లో ఉద్యోగం చేయటం వలనా,వార్డెన్ గా అంకితభావంతో పనిచేయటం వలనా,సుమారు యాభై ఏళ్ళ పాటు అక్కడే కేంపస్ లో ఉండటం వలన అందరి ప్రేమాభిమానాలు చూరగొంది.అందుకే స్టాఫ్ తో సహా అందరూ కదలి వచ్చి సైనిక లాంఛనాలుతో గాలిలోకి తుపాకులు పేల్చి గౌరవవందనంతో ఆమెకి వీడ్కోలు పలికారు.నిజానికి అందరి అభిమానాన్ని పొందటం కన్నా జీవితంలో అంతకన్నా ఏమి కావాలి. రంజన దుఃఖంతో దిగులు పడిపోయింది.ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకుని ఓదార్చాను. తల్లి భరోసాతో ధైర్యంగా గడుపుతున్న రంజనను తల్లిలా దగ్గరకు తీసుకుంది జయ. మూడురోజులు వుండి నేను తిరిగి వచ్చేసాను.దశదిన కర్మలకు పిల్లలకీ ఆషీ వెళ్ళారు. గడిచిపోయిన బంధాలు తలపోసుకుంటూ నేను .... - శీలా సుభద్రాదేవి