23, అక్టోబర్ 2025, గురువారం

ఛాయా రాజ్ నవల" కారువాకి"

పూర్వ కళింగుల జీవన అద్భుతం "కారువాకి" నవల "ఛాయరాజ్ విశిష్ట కవిత్వవ్యక్తిత్వానికి అద్దంపట్టే రచన 'కారువాకి' నవల. పూర్వ కళింగుల మహత్తర జీవన ప్రస్థానం మనకు అద్భుతంగా సాక్షాత్కారమై అనుభూతి కావడమే కారువాకి నవల సాధించిన విజయానికి సాక్ష్యం. కావ్య ఇతివృత్తం ఒక చారిత్రక వాస్తవం . "అంటారు బి.సూర్యసాగర్ గారు కారువాకి ముందు మాటలో. ఒకచారిత్రక నవలని పరిచయం చేయడం కష్ట సాధ్యమైన పని. ఎందుకంటే కథాకాలం నాటి చరిత్రలతో మమేకమౌతే గాని ఆ నవలని ఆస్వా దించలేము. ఛాయారాజ్ గారి కళింగ యుద్ధకాలం నాటి పూర్వ కళింగుల జీవన అద్భుతాన్ని ఒక ప్రవాహసదృశంగా చిత్రించిన " కారువాకి " నవలని చదివిన తర్వాత దాని గురించి కొంతైనా చెప్పాలనిపించింది. నవల ఆసాంతం కవితాత్మకంగా సాగుతుంది. అనేక చోట్ల గొప్పప్రకృతి వర్ణనలు పాఠకులను ఆకట్టుకుంటాయి . క్రీపూ నాటి శిలాశాసనాల నుండి సేకరించిన సమాచారాన్ని, స్కంద పురాణం,మత్స్యపురాణం మొదలైన ఐతిహాసిక గ్రంధాల నుండే సేకరించిన ఉపకథలతో, ఉటంకింపులతో ఈ నవల సాగుతుంది వంశధార, నాగావళి,జంఝూవతీ నదులు ,సరయూ, తమసా, గోమతీ ఇలా అనేక నదుల పరివాహక ప్రదేశముల గురించి నదుల నడకలతో గలగల జల జలా ప్రవాహసదృశంగా నవల ఆసాంతం నడుస్తుంది. మహాభారతం లోని భీష్మపర్వం ఆధారంగా కురుక్షేత్రంలో కళింగులు అర్జునునితో, కృష్ణునితో పోరాడి క్షత్రియులయ్యారనే ఉటంకింపును తెల్పారు. జాతక కథల నుండి ,మహావంశము నుండి ఉపోద్ఘాతము, కళింగ బోధి, ఎఫ్.కొరోవ్కిన్ ' ప్రాచీన ప్రపంచ చరిత్ర'నుండి,రాహుల్ సాంకృత్యాయన్ రచనలే కాక రామాయణం సందర్భాలను ఆయా గ్రంధాలనుండి అవసరమైనంత మేరకు రచయిత ప్రస్థావన చేసారు. ప్రధానంగా 'కారువాకి' నవలలో ఇతివృత్తం పూర్వకళింగుల జీవితచిత్రణ. సూర్యసాగర్ గారు నవలకు ముందుమాటలో అనేక విషయాలు ప్రస్తావించారు."గురజాడ 'కళింగదేశ చరిత్ర'ను రాయటానికి సంకల్పించగా దాన్ని ప్రచురించబోతున్నట్లు కొమర్రాజు లక్ష్మణరావు ప్రకటించారనీ ,అయితే గ్రాంధికభాషలో రాయాలనే కొమర్రాజు షరతుని గురజాడ నిరాకరించి, కళింగ చరిత్ర రాయటమే విరమించుకున్నారనీ తెలియజేసారు. తర్వాత రాళ్ళబండి సుబ్బారావు రచించిన 'కళింగదేశ చరిత్ర' మూలాధారంగా 'కారువాకి' నవలను రాసినట్లు ఛాయరాజ్ చెప్పుకున్నారు. కళింగ దేశ చరిత్ర ఆధారంగా కళింగ (కలిగంగ) ప్రజలలో ఎన్ని రకాల జాతులున్నాయి, వారి జీవన విధానం ఏమిటి అది నవలకు అవసరమైనంత వరకూ ఛాయారాజ్ గ్రహించి నవలలో పొందుపరచారు. కళింగులు అనేది సార్వజనీనంగా వూహించుకుంటాం. కానీ అందులోనే అనేక గిరిజనజాతులే కాక కోమట్లు , బ్రాహ్మలు కూడా వుంటారనేది తెలిసింది . బహుశా వివిధవృత్తులను అనుసరించి విభిన్నజాతులుగా గుర్తించే వారేమో. అనార్యజాతిగా పరిగణించబడిన కళింగ ప్రజలు ఆర్యులపై తిరుగుబాటులు చేసి, ఆర్యసంస్కృతిని వ్యతిరేకించి, ఆదిమవాసుల జీవనవిధానాన్ని, సంస్కృతిని అనుసరించే స్వతంత్ర ప్రజలుగా రచయిత కధనం చేసేటప్పుడు పలుమార్లు అక్షరీకరిస్తారు. హిమాలయాల పుట్టుకంత ప్రాచీనచరిత్ర గల ప్రజలనీ, భూమిమీదేకాక జల సంపదలతో పెనవేసుకున్న వారైన కళింగ ప్రజలు అమిత సాహసికులనీ పాఠకులకు తెలుస్తుంది కళింగ స్త్రీలు(కారువాకులు) కూడా ధైర్యసాహసులు. పురుషులతో సమానంగా ప్రతీ పనిలోనూ, పోరాటాలలోను యుద్ధాలలోను పాల్గొంటారు. స్త్రీలపై దుర్మార్గాలను సహించరు .స్వాతంత్య్రప్రియులైన కళింగులు అధికారాన్ని కోరుకోరు . అధిపత్యాన్ని అంగీకరించక పోవటమేకాక రక్తతర్పణలు చేయడానికైనా సిద్ధపడతారంటారు రచయిత . క్రీపూ268 నాటికి అశోకుడు విజయకాంక్షతో. సోదరులను అడ్డుతొలగించుకొని కారునలుపుతోనున్న స్వచ్ఛమైన కళిగంగానది నీళ్ళలో కాళ్ళు కడుక్కుంటూ "కారువాకి" అనే మత్య్సకన్యని చూసి ఆమె సౌందర్యానికి విస్మయుడై ఆమెని ఎత్తుకుని వెళ్తాడు. మొదట అతనిని ప్రతిఘటించినా తుదకు అతని సౌందర్యానికి ,ప్రేమకి లొంగిపోతుంది ఆ నదీకన్య.. అనటంలో కారువాకి ప్రసక్తి వచ్చినప్పుడలా నవలలో నదిప్రవాహ సౌందర్యంతో రచయిత పోల్చుతూ రాయటం వలన నవల ఆ సాంతం పాఠకులకు ప్రవాహ అలల గలగలలు వినిపిస్తుంది. నిజానికి పచ్చని ప్రకృతి,నదీప్రవాహం మీదుగా వీచే స్వచ్ఛమైన మందపవనాలూ,అలల గలగలలూ నవల చదువుతున్నంతసేపూ పాఠకుల హృదయాన్ని తాకుతూనే వుంటాయి.కళింగయుద్ధ దండయాత్ర నుండి నవలలో కళింగుల ఆత్మవిశ్వాసం,పోరాటపటిమ ,ఆ నాటి యుద్ధ తంత్రాలు ఆశ్చర్యం గొలుపుతాయి. బ్రాహ్మణుడి వద్ద విద్యనభ్యసించి, గ్రంధాలను అధ్యయనం చేసిన కారువాకి ప్రేమతత్త్వం మాత్రం అశోకునితో అనుబంధం వల్లనే తెలుసుకోగలిగింది. ప్రకృతికి, సమాజానికి మనిషి అవసరమెందుకో అశోకుడు చెప్పినప్పుడే అర్థమైంది. అటువంటి అశోకుడు సామ్రాజ్య కాంక్షతో సోదరులను చంపటంగానీ,కళింగులపై దండయాత్రలు గానీ ఎందుకు చేస్తున్నాడో మాత్రం ఆమెకు అర్థం కాలేదు. కారువాకి రాణివాసం నుండి బయలుదేరి రాజభవనాల్ని చూస్తుంది. చక్రవర్తి ఖజానాని ఇతర గిడ్డంగులనూ దర్శిస్తుంది. రాజ్యసంబంధిత విషయాలను రక్షణసిబ్బంది నడిగి తెలుసుకుంటుంది .కళింగులపై దండ యాత్ర గురించిన సమాచారం తెలుసుకుంటున్న సమయంలో అశోకుడు వస్తాడు. "నాపై ప్రేమ బహుజన ప్రయోజనకారి కావాలి కదా ఈ దండయాత్రలు ఏమిట"ని ప్రశ్నిస్తుంది చక్రవర్తి సామ్రాజ్యా కాంక్షకు, కళింగుల స్వేచ్ఛకు వైరుధ్యం వుందని తెలుసుకున్న కారువాకి తన శరీరానికి ఆలోచనలకూ మధ్య సంఘర్షణలో నలిగి పోయి అశోకుని సామ్రాజ్యకాంక్షని కళింగులు తుదముట్టించగలరా అనే ఆవేదనతో అశోకుని వక్షస్థలం పై సొమ్మసిల్లి పోతుంది. " కళింగ దేశానికి ఉత్తరాన మహానది, లేక వైతరణి, దక్షిణమున నాగావళి, తూర్పున సముద్రం, పశ్చిమాన తూర్పుకనుమలు ఎల్లలుగా ఉంటాయి. కళింగదేశం పశ్చిమం నుండి తూర్పునకు ఏటవాలు గా వుండటం వలన సువర్ణరేఖ, వైతరణి, బ్రాహ్మణీ, తెలివాహ, మహానది, ఋషికుల్య, వంశధార, నాగావళి నదులు తూర్పు సముద్రం వైపు ప్రవహిస్తాయి " అన్నది చదివాక ఆనాడు ఆ ప్రాంతం ఇన్ని నదీప్రవాహాలతో ఎంత సస్య శ్యామలంగా వుండేదో అనిపించింది. అదికూడా నవలలో చెప్పారు రచయిత. ధాన్యము, మెట్టపంటలు, పత్తి పంటలు ,తీయని పండ్లు ,సన్న నూలు ఎగుమతి చేసేవారని రచయిత చెప్తూ ఈజిప్టు, గ్రీసు, రోము దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉండేవనేది పాఠకులకు అబ్బురం కలిగిస్తుంది.. ఇక కళింగ యుద్ధసన్నాహం చూద్దాం,-- కళింగ దేశానికి గల సైనిక బలాన్ని, యుద్ధానికి తగు సమయాన్ని శీతాకాలం అనుకూలమని అశోకుడు నిర్ణయించుకున్నాడు. మౌర్యసైన్యాలన్నీ దండయాత్రలో నలువైపుల నుండి కళింగ వైపునడిపించి మోహరిస్తున్నాయి. వాటిని ప్రతి ఘటించేందుకు ప్రజా సమూహలు దూసుకు వెళ్తుంటాయి. " రంకెలు వేసి సైన్యాన్ని కొమ్ములతో కుమ్మేందుకు ఎద్దులకు కళింగ ప్రజలు తర్ఫీదు ఇస్తారు. బొంగులతో పిచికారు యంత్రాలు తయారు చేస్తున్నారు, కారంతో నింపిన కర్ర గొట్టాలను, దురద గొండ నుసిని మూటలు కడుతూ ఆయుధాలుగా తయారు చేస్తున్నారు కళింగ మహిళలు .. రెల్లుదూది పింజలను కళ్ళలోనికే కొట్టే ఈటల్ని బాల కాళింగులు. " అంటూ ప్రజాసమూహాలు యుద్ధానికి సన్నద్ధమయే తీరును రచయిత వివరిస్తారు. కళింగ దేశం దిశగా యుద్ధసన్నద్ధమై సామ్రాజ్య కాంక్షతో తరలివెళ్తున్న అశోకుడు మార్గమధ్యంలో ఒక బౌద్ధ భిక్షువుని సందర్శిస్తాడు. భిక్షువుకి ప్రణమిల్లి తిరిగి లేచి అశ్వాన్ని అధిరోహించి, ముఖాన్ని తాకుతున్న సూర్యకిరణాల్ని తుడుచుకుంటూ, సైన్యం వెంటరాగా, తూర్పుదిక్కుగా బయలుదేరుతాడు అశోక చక్రవర్తి. కళింగ ప్రజలు ఆత్మాహుతి కైనా సిద్ధపడుతున్నారుకానీ యుద్ధభూమిని వదలకపోవటం చక్రవర్తికి విస్తుగొలుపుతుంది.మౌర్యసైన్యాలపై కళింగులకంత ద్వేషమెందుకో చక్రవర్తికి అర్థం కాలేదు.తన సైన్యం చేసే అకృత్యాలు గమనించినప్పుడే కదా అటువంటివి అర్థమయ్యేది. కళింగదేశం నేలంతా నెత్తురు బురదగా మారిపోయింది. కళింగ, మౌర్యసైనికుల నెత్తురులతో కళింగ దేశమంతా రక్తపుమరకలతో నిండిపోయింది . కళింగ తీర ఇసుకదిబ్బలలో తుపాను రేగి కళింగతీర ప్రజల కళేబరాలను భూమిలో కప్పివేసింది. కళింగ శరీరనాడులను గాలి శ్రుతిచేసి విప్లవగీతాలాలపించింది. తుళ్ళిన నెత్తురుతో తడిసిన కళింగ ఆకాశం లో మేఘం తాటికాయలంత ఎర్రనిచినుకులను కురిసి మెరిసి నేలపై రక్తాన్ని ముద్దాడింది. కళింగ రక్తం ఎదుట తలదించుకుని, కళింగ దేశానికి చక్రవర్తిగా ప్రకటించబడి, అశోకుడు అన్యమనస్కుడై నయనాలను బలంగా మూసుకున్నాడు. సూర్యుడు మధ్యభారత కళింగనేలనే అస్తమిస్తున్నట్టు భావించాడు అశోకుడు.చీకట్లు కమ్ముతున్నాయి,మూర్చిల్లిన అశోకుడి శరీరాన్ని శ్వేతాశ్వం జాగ్రత్తగా మోసుకుపోతోంది.-- రచయిత ఈ విధంగా కళింగయుద్ధ విధ్వంసాన్ని వర్ణించటం ఎలా వుందంటే -- సూర్య సాగర్ అన్నట్లుగా " విశాల ప్రదేశంలో జరిగిన కళింగయుద్ధ బీభత్సాన్ని పరిమిత పేజీల ఆవరణలో దృశ్యమానం చేశాడు ఛాయరాజ్. వెండితెరపై కూడా యిమడలేని దృశ్యాలను అక్షరాలలో బంధించాడు." అనేది నవల చదువుతున్నంతసేపూ పాఠకులు కూడా అనుభూతి చెందుతారు. నవల ముగింపులో "ప్రజలే నిజవీరులు. ప్రజలే నిర్మాతలు. ప్రజలు ఎన్నడూ దుర్మార్గులు కారు. వ్యవస్థలలోని ప్రజల పక్షం, వారి శ్రమపక్షంగా రచయిత చూడాలి. 'కళింగుల' పాత్రను అలా చూసాను నేను. "అని ఛాయరాజ్ గొప్ప ఆశావహ దృక్పధాన్ని వ్యక్తం చేశాడు. ఛాయా రాజ్ యుద్ధంతో కేవలం కథాంశాన్ని ముగించి వూరుకోలేదు.తర్వాత వారసులు ఎంతకాలం పరిపాలించారో తదితరవిషయాలన్నీ వెల్లడించారు. చివరగా "ఈ నవల రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి భావం ప్రధానమైపోయి భాష ముద్దకట్టుకు పోయింది.ఒక సామాజిక చరిత్రను రాయటానికి భాషతో చిత్రలేఖనం చేయవలసి వచ్చింది" అని ఆయన చెప్పుకున్నమాట అక్షరాలా నిజం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి