23, అక్టోబర్ 2025, గురువారం

వెలిసి పోయిన మహాకావ్యం -2

~ వెలిసిపోయిన మహాకావ్యం ~ పొద్దున్నే నిదురను రెప్పలతో విసిరికొట్టి కళ్ళకు భూపాలరాగాన్ని హత్తుకొని నీకు మేల్కొలుపు పాడేది ఎవరనీ వంటింట్లో కచ్చేరీని "కాఫీ" రాగంతో ప్రారంభించి చిరునవ్వు మేళవింపుతో కప్పు అందించేది ఆమెనే డాబా పైన నిలుచుని నీదైన సమయాన్ని యోగాసనాల్తో కరిగించుకుంటూ దూరాన కొండల్ని చూస్తుంటే నీతోడి జీవితం నల్లేరుపై నడకేనని నున్నటి రాజమార్గం మీద జీవితాన్ని కలల్నికంటూ నీ చేయి అందుకున్నదెవరనీ తలచేవా ఆ పైన విశాలాకాశంలో మబ్బులతో పోటీ పడుతోన్న ఆశల్నీ,ఆకాంక్షల్నీ అలంకరించిన అందమైన గాలిపటాలేనాడైనా నువ్వు ఎగరేసిన చూపుల కొసకు చిక్కుకుని ఆమె గుండెవూసుల్ని గుసగుసలుగా చెప్పలేదా నదీ పాయవెంబడి ఏనాడైనా నడిచావా ఒద్దికగా నడిచే సెలయేరు బండరాయి తగిలి చెంగున గెంతినప్పుడు నెచ్చెలి కాలిమువ్వ నీ గుండెలో గిలిగింతలతో సన్నగా శబ్దించలేదా సముద్రతీరంలో విహరించినప్పుడు బడబానలాన్ని దాచుకుని లోలోన జ్వలిస్తూనే నిగూఢమైన నిర్మలమైన గాంభీర్యంతో అలల చిరునవ్వుల్ని విరజిమ్మే సముద్రం నీ నట్టింటే నడయాడుతోందని ఏనాడైనా గుర్తించావా నీ ఇంటినిండా వెన్నెల కళ్ళాపి చల్లి పూలగంధాలతో రంగవల్లులు దిద్దిననాడు గానీ నీ దేహార్తిని చల్లార్చి నీ వంశాన్ని తీర్చి చాకిరీతో కొవ్వొత్తై కరిగి పోయిననాడు గానీ నీ జీవితావరణం అంతటా నిండి వున్నది కాస్తా అకస్మాత్తుగా అదృశ్యమైనప్పుడు గానీ ఆమె విలువ గుర్తింపు లోనికి రాదు ఇంక అప్పుడు ఎంతగా కుళ్ళి కుళ్ళి ఏడ్చి అక్షరంగా ప్రవహిస్తే మాత్రం ఏం లాభం ఆమె జీవించి వున్నప్పుడే నీవు లేని చోటేదీ లేదని హత్తుకొని వుంటే జీవితం అందమైన మహాకావ్యమయ్యేది కాదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి